top of page

పుట్టిల్లు


'Puttillu' written by Maddali Nirmala

రచన: మద్దాళి నిర్మల

" సుమతీ" వరండాలోనుండి వచ్చిన పిలుపుకి "వస్తున్నా మామయ్య" అంటూ వచ్చింది సుమతి.

"ఏమ్మా! మీ అత్తయ్యేం చేస్తోంది. "

"దొడ్లో తులసికోట దగ్గర పూజ చేస్తున్నారు"

"ఏం! మావాడింకా లేవలేదా? "

"లేచారు మామయ్యా! బాత్రూమ్ లో ఉన్నారు. "

"సరే. మీరు కాఫీ తాగేటప్పుడు నాకు కూడా ఓ అరకప్పు పట్టుకురామ్మా"

"అలాగే మామయ్యా" లోపలికి వెళ్లింది సుమతి.

అది అరకప్పు కాదనీ పూర్తి కప్పేననీ ఆమెకు తెలుసు. ఇది వాళ్లిద్దరికీ అలవాటే. అన్నిసార్లు కాఫీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని సీతారామయ్య గారి ధర్మపత్ని కాంతమ్మ గారి గాఢ నమ్మకం. నిద్ర లేచి ముఖం కడగటం ఆలస్యం కాఫీ పడాలి ఆయనకి. ఆ తర్వాత మెల్లిగా ఎనిమిది గంటల ప్రాంతంలో ఓ మాంఛి స్ట్రాంగ్ కాఫీ తాగుతూ పుస్తకమో పేపరో తిరగెయ్యటం ఆయనకిష్టమైన వ్యాపకం అనండి అలవాటనండి. సరిగ్గా ఆ సమయంలోనే కొడుకు కోడలు కాఫీ తాగుతారు. ఫలహారం ఆలస్యం అయినా ఫర్వాలేదు కానీ, ఈ రెండో కాఫీ పడకపోతే ఆయనకు తోచదు.

"మామయ్యా కాఫీ !" సుమతి కాఫీ తెచ్చిచ్చింది.

కోడలి వైపు ఆప్యాయంగా చూసి కాఫీ కప్పుని అంతే ఆదరంగా ఆహ్వానించాడు.


సుమతి చాలా మంచి పిల్ల. అలాటి అమ్మాయి కోడలిగా రావటం తమ అదృష్టం. కోడలిని తలుచుకోగానే కొడుకు అవినాష్ గుర్తుకొచ్చాడు. వాడు మాత్రం బంగారం కాదూ. తనకు ఇద్దరూ కొడుకులే. ఓ ఆడపిల్ల ఉంటే బాగుంటుందని అప్పుడప్పుడూ అనిపించినా , కొడుకులిద్దరూ మంచి వాళ్లు, బుద్ధిమంతులూ అవటంతో ఆ ఆలోచనను పక్కకు తప్పించేశారు. ఏమాటకామాట ఇద్దరూ చదువులో కూడా ముందే ఉండేవారు. పెద్దవాడు ఆకాష్ ఇంజనీరింగ్ పూర్తయి ఎమ్.టెక్. చేసి ఢిల్లీ లో ఓ పెద్ద కంపెనీలో మరింత పెద్ద హోదాలో ఉన్నాడు. కోడలు కూడా ఉద్యోగస్థురాలు. దూరపు బంధువుల అమ్మాయే. వాళ్లకో అబ్బాయి. ఇద్దరూ హాయిగా అక్కడే ఉద్యోగం చేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఇద్దరికీ కుదరినపుడు సెలవు పెట్టి వచ్చి ఓ పదిరోజులు గడిపేసి వెడుతుంటారు. తాముకూడా ఈ ఎనిమిదేళ్లలో ఓ రెండు మూడు సార్లు వెళ్లారేమో. తనుకూడా హైస్కూల్ హెడ్ మాష్టరుగా బాధ్యతాయుమైన ఉద్యోగంలో ఉండటం వలన ఎక్కువగా సెలవు పెట్టి ఎక్కడికీ వెళ్లే అవకాశం ఉండేది కాదు. వేసవిసెలవుల్లో మాత్రం కాస్తంత అవకాశం ఉండేది. అదైనా ప్రభుత్వం వారు దయ తలచి అదనపు బాధ్యతలు అప్పగించకుండా ఉంటే.

ఇక చిన్నవాడు అవినాష్. అవినాష్ ని తలుచుకోగానే ఆయన పెదవులమీద నవ్వు , ముఖంలో ఓ విధమైన గర్వం అప్రయత్నంగానే వెల్లివిరిశాయి. మళ్లీ తన ఆలోచనల్లోకి వెళ్లి పోయాడాయన.

పెద్దవాడి ఇంజనీరింగ్ పూర్తయే సమయానికి చిన్నవాడి ఇంటర్మీడియట్ పూర్తయింది. అన్నలాగే వాడుకూడా ఇంజనీరింగ్ చదివి ఓ మంచి ఉద్యోగంలో స్థిరపడతాడని అనుకుంటున్నాడు తను. కానీ వాడి ఆలోచనలు వేరు.


"అదేవిఁట్రా! అందరూ ఇంజనీరింగో మెడిసినో చదవడానికి ఇష్టపడుతుంటే నువ్వు మామూలు డిగ్రీ చదువుతానంటావు. నీలాటి తెలివిగల వాడికి కాకపోతే ఇంకెవరికి వస్తుంది చదువు? నువ్వెంత వరకు చదువుకుంటానంటే అంతవరకు చదివిస్తాను. నా రిటైర్మెంట్ దగ్గరకొచ్చిందని భయపడకు".


"అదికాదు నాన్నా! అన్నయ్య రేపోమాపో ఉద్యోగం వచ్చి దూరంగా వెళ్లిపోతాడు. నేనుకూడ అలాగే మీకు దూరంగా ఉండవలసి వస్తే పెద్దవాళ్లు మీరిద్దరూ ఒంటరిగా ఎలా ఉంటారు? వాడెలాగూ మంచి ఉద్యోగం వస్తే ఇక్కడ ఉండే ప్రసక్తి ఉండదు. అదీగాక అందరూ ఇంజనీర్లు డాక్టర్లు అయి వారి వరకు వారే బాగుపడితే దేశానికి అవసరమైన మంచి యువతరాన్ని ,శాస్త్రవేత్తలనీ , న్యాయవాదులనీ అంతెందుకు డాక్టర్లనీ ఇంజనీర్లనీ తయారు చేసే ఉపాధ్యాయులు ఎక్కడనుండి వస్తారు నాన్నా"


" అవునురా! మారోజులు వేరు. తొందరగా ఉద్యోగంలో స్థిరపడాలంటే ఉపాధ్యాయ పదవి ఒకటే అందుబాటులో ఉండేది. తల్లిదండ్రులకి అండగా ఉండాలంటే అదొక్కటే ఆధారం. మీ తరానికి ఎన్నో సదుపాయాలొచ్చాయి. ఏదో నాకంటూ ఉద్యోగం ఉంది. రిటైరైనా పెన్షను వస్తుంది. ఊళ్ళో ఉన్న నాలుగెకరాల పొలంమీద వచ్చే ఆదాయం ఉండనే ఉంది. ఇక ఇంటద్దె పని లేదు. నాకింకా ఉద్యోగం నాలుగేళ్లుంది. ఈలోపు నీ చదువైపోతుంది. ఇబ్బందేం ఉండదు. అదీగాక నీకు ఫిజిక్స్ లోని లెక్కల్లోనూ మంచి పట్టు ఉంది. తప్పకుండా ఇంజనీరింగ్ లో సీటొస్తుంది. "


"అదే నాన్నా! ఇప్పటి చదువుల్లో నాణ్యత ఉండటం లేదు. బట్టీపట్టించి మార్కుల కోసం చదివిస్తున్నారు. ఏ విషయాన్నైనా కూలంకషంగా చదివితే గానీ తృప్తి లేదు నాకు. మూలాల్లోకి వెళ్లి సకారణంగా విషయాన్ని బోధిస్తే ఆ విషయాన్ని విద్యార్ధులు ఎప్పటికీ మరిచిపోరు. కేవలం పాఠం చెప్పటం ఒకటే కాదుగా . విషయం పూర్తిగా అర్థమవ్వాలి గదా. మీరు అనుభవమున్న ఉపాధ్యాయులు. మీకు నేను చెప్పాలా? అందుకే నేను ఉపాధ్యాయుడినై దేశానికి అవసరమైన శాస్త్రవేత్తలను, సాంకేతిక నిపుణులను మంచిపౌరులను తయారు చెయ్యాలని నా ఆశ. అది అందరి దృష్టిలో పేరాశ కావచ్చు. కానీ నా వంతు ప్రయత్నం నేను చెయ్యాలనుకుంటున్నాను. మీ విద్యార్థులెందరో ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్లంతా మిమ్మల్ని గౌరవిస్తుంటే మీకెంత గర్వంగా ఉంటుంది? ఆ ఆనందమే నేను కోరుకుంటున్నాను. మనం పెంచిన మొక్కలు పెద్ద పెద్ద చెట్లుగా మారి కాపుకాసి ఫలిస్తే కలిగే ఆనందం ముందు ఎన్ని లక్షలు సంపాదించినా దొరుకుతుందా? మీరే నా ఆదర్శం నాన్నా"


మంచి ఆలోచనలతో ఉన్న కొడుకును అభినందించాలో లేక అందరిలాగా పెద్ద ఉద్యోగాలు, సంపాదన లేకుండా మామూలు ఉపాధ్యాయుడిగా మిగిలిపోతాడని ఓ సగటు తండ్రిగా బాధపడాలో తెలియని పరిస్థితిలో ఊగులాడాడు తను ఆరోజు. అనుకున్నట్లుగానే సైన్సులో డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి పి. హెచ్.డి. కూడా చేశాడు. ఓ ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరరుగా పనిచేస్తున్నాడు.

వాడి పెళ్లికూడా తమాషాగా జరిగింది. ఉద్యోగస్తుడైన వెంటనే పెళ్లి కూడా చేస్తే బావుంటుందని తనూ కాంతం అనుకున్నారు. ఇప్పుడంతా సాంకేతికంగా ఉన్న వివాహ పరిచయ వేదికల ద్వారా సంబంధాలు కుదుర్చుకుంటున్నారు. మనం కూడా అలా చూద్దాం అంటే "ఎందుకు నాన్నా! అందులో అన్ని ప్రాంతాల వాళ్లూ ఉంటారు. విదేశాల్లో ఉన్న వాళ్లు కూడా ఉంటారు. తీరా అన్నీ నచ్చాక వాళ్లిక్కడికి రామంటే పరిస్థితి మళ్లీ మొదటికొస్తుంది. మనఊళ్లోనే పెళ్లి సంబంధాలు చూసే స్థానిక సంస్థలు బోలెడున్నాయి. అక్కడికెడితే కనీసం కొంతమందైనా స్థానికంగా ఉన్నవాళ్లుంటారు. అలాగైతే మనకు ఇబ్బంది ఉండదు" అన్నాడు.

ఓరినీ! వీడింత దూరం ఆలోచించాడా! అని తామిద్దరూ బుగ్గన వేలేసుకోవలసి వచ్చింది. అలాగే ఓ స్థానిక సంస్థలో నమోదు చేసుకున్న సుమతి సంబంధం అన్ని విధాలా అనుకూలమనిపించింది. ఆ అమ్మాయికి తండ్రి లేడు. తల్లీ అన్నా ఉన్నారు. అన్నకి పెళ్లయింది. అతగాడు పూనాలో ఏదో మంచి కంపెనీలోనే పనిచేస్తున్నాడు. సుమతి ఎం.ఏ. పూర్తి చేసి దగ్గరలో ఉన్న స్కూలులో టీచరుగా పని చేస్తోంది. తల్లీ తనే హైదరాబాదులో ఉంటారు. పెళ్లిచూపులకు వెళ్లి సుమతిని ప్రత్యక్షంగా చూశాక తమకు ఎంతో నచ్చింది. కనుముక్కుతీరుతో పొందిగ్గా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇంకా ముఖ్యమైన సంగతేమిటంటే సుమతి ఎవరో కాదు. తనతోపాటు ఒకప్పుడు కలిసి పనిచేసిన వీరభద్రయ్య గారి కూతురు. ఇంకా ఏంకావాలి. వెంటనే పెళ్లయిపోయింది.

అప్పుడే నాలుగేళ్లయింది సుమతి ఈ ఇంటికొచ్చి.తమ ఇంటికి దూరమని తను చేసే ఉద్యోగం వదిలేసింది. కొన్నాళ్లు ఇక్కడికి దగ్గర స్కూల్లో పని చేసింది. బి.యిడి. చేద్దామనుకంటూ ఆ ఉద్యోగం కూడా వదిలేసింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోంది. తను కూడ రిటైర్ అయి నాలుగేళ్లయింది. వీళ్లిద్దరి వలన ఇంట్లో సందడి కాలక్షేపం. దాంతో తనకు తోచకపోవటం అన్న సమస్య రాలేదు. సాయంత్రంపూట అలా నడుచుకుంటూ తమ ఇంటి దగ్గరే ఉన్న పార్కులో తమలాటి వాళ్లతో కాలక్షేపం. అప్పుడప్పుడూ కాంతం తనతో కలుస్తుంది. ఎందరికో దక్కని అదృష్టం తనకి దక్కినందుకు లోపల్లోపల సంతోషంతో పాటు కాస్తంత గర్వం కూడా అనిపిస్తుంది.

*****

సాయంత్రం కాలేజి నుండి వచ్చాక బట్టలు సర్దుకుంటున్నాడు అవినాష్. ఎక్కడా ఏ శుభకార్యాలూ లేవు. ఇప్పుడు సెలవులూ లేవు. వీడెక్కడికి ప్రయాణం అవుతున్నాడబ్బా? అని ఆలోచిస్తున్నాడు సీతారామయ్య గారు.


ఆయన సందేహం తీర్చటానికన్నట్లుగానే తండ్రికెదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అవినాష్.


"రేపు పొద్దున ఢిల్లీ వెడుతున్నాను నాన్నా. అక్కడ ఓ సెమినారు కి హాజరవ్వాలి. ఎల్లుండి, అవతల ఎల్లుండి అక్కడే ఉండాలి. కార్యక్రమం పూర్తి కాగానే వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. "


"మరి అన్నయ్య దగ్గరకెళ్లవూ? "


" వీలుంటే ముందురోజు వెడతాను. ఎందుకంటే అక్కడ మా బస,తిండి ఏర్పాట్లు అన్నీ నిర్వాహకులే చూసుకుంటున్నారు. పైగా సెమినార్ జరిగే చోటునుండి అన్నయ్య వాళ్ల ఇల్లు దూరం. అక్కడికి వెడితే సమయానికి తిరిగి సెమినారుకు చేరుకోలేనేమో. వాడితో ఇంతకు ముందే మాట్లాడాను. వీలుంటే వాడే వచ్చి కలుస్తానన్నాడు. చూద్దాం. "


"సరే. " ఇంకేం మాట్లాడలేదాయన.


కాలేజీ తరపున ఇలా అప్పుడప్పుడూ వేరే ఊళ్లకి వెళ్లి సమావేశాల్లో పాల్గొనటం అతనికి అలవాటే.


*****


ఢిల్లీ క్షేమముగా చేరానని ఫోన్ చేశాడు. సమావేశాలు కూడా విజయవంతంగా పూర్తయ్యాయి. ఈరోజు అవినాష్ తిరిగొచ్చే రోజు. ఏవిఁటో అతను లేనిది నాలుగు రోజులే అయినా అందరికీ వెలితిగానే ఉంది. కాంతమ్మగారికీ, సీతారామయ్య గారికీ ఒకరకమైతే సుమతికి ఇంకా ఎక్కువ. ఆ అమ్మాయి ముఖంలో దిగులు పసికట్టలేక పోలేదు వాళ్లిద్దరూ. అందులోనూ పిల్లలు ఇంకా పుట్టకపోవటంతో వాళ్లిద్దరూ ఒకరికొకరుగా ఉంటారేమో, సుమతికి వేరే ధ్యాస లేదు.

"హలో! " సుమతి ఫోన్ లో మాట్లాడుతోంది. అవతలివైపు అవినాష్ అని అర్థమవుతూనే ఉంది.


"సరే. సరే. ఏమిటి. ఫోన్ మామయ్యగారికి ఇమ్మంటారా? ఇదిగో ఇస్తున్నాను. మామయ్యా! మీ అబ్బాయి" అంటూనే ఫోన్ చేతికిచ్చింది.


ఇక వాళ్లిద్దరు మాటల్లో పడ్డారు.


"ఏవిఁటీ! ఎంతసేపు నాన్నతోనేనా మాట్లాడేది? అమ్మ గుర్తుకు రాలేదా? " కాంతమ్మగారు వంటింట్లో నుండి వరండాలోకి వచ్చింది. ఆవిడతోకూడా మాట్లాడాడు అవినాష్.


తెల్లారింది. ఎప్పుడెపుడు కొడుకు వస్తాడా అని తల్లీ తండ్రీ, ఇంకా రాలేదేమిటా అని సుమతీ వాకింట్లో నుండి ఇంట్లోకి ఇంట్లో నుండి వాకిట్లోకి నుండి తిరుగుతూనే ఉన్నారు ఏదో వంకతో.

ఇంతలో సీతారామయ్య గారి ఫోన్ మోగింది. అవినాష్ ఫోన్.


"హలో! అవినాష్ గారి నాన్నగారా? నిమ్స్ హాస్పిటల్ నుండి మాట్లాడుతున్నామండీ. మీ అబ్బాయికి ఆక్సిడెంట్ అయింది. ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. నేనిక్కడ హాస్పిటల్ ఇన్ చార్జ్ నండి. మీ అబ్బాయి గారి ఫోన్ లో నాన్న అని ఉన్న నంబరు చూసి మీకు చేశాను. వెంటనే బయలుదేరి రండి. "


"ఏమిటి? ఏక్సిడెంటా? ఎలా ఉన్నాడు. ప్రమాదం ఏమీ లేదు కదా? " ఆత్రంగా అడిగాడు ఆయన.


" మీరు వెంటనే బయలుదేరండి"


సుమతీ, కాంతమ్మగారు మాటలేకుండా అయిపోయారు. హాస్పిటల్ కి వెళ్లేసరికి విషయం అర్థమైంది. పరిస్థితి చాలా కష్టంగా ఉంది. తలకు దెబ్బ తగలటంతో నమ్మకం తక్కువే అన్నారు.


అవినాష్ టాక్సీ మాట్లాడుకొని విమానాశ్రయంనుండి వస్తుంటే అవతలివైపు వెళ్లే కారు డివైడరును ఢీకొట్టి పల్టీకొట్టి అవినాష్ కారుకి ఢీ కొట్టింది. ఆ దెబ్బకి టాక్సీ తలకిందులై ప్రమాదం జరిగింది. రెండు కార్లలో ప్రయాణించే వాళ్ళందరికీ బాగా దెబ్బలు తగిలాయి. ఎదుటి కారు డ్రైవర్ ప్రమాదస్థలంలోనే చనిపోయాడు. మిగతావాళ్ల పరిస్థితి కూడా నమ్మకం చెప్పేటట్లు లేదు. చివరికి చెయ్యని తప్పుకి అవినాష్ జీవితం బలైపోయింది. విషయం తెలుస్తూనే అసలే బలహీనంగా ఉన్న కాంతమ్మగారి గుండె ఇక కొట్టుకోవడం మానేసింది. తట్టుకోలేని ఆ తల్లి కొడుకుతో పాటు వెళ్లిపోయింది.


ఇంట్లో అలుముకున్న విషాదం ఎవరూ తీర్చలేనిది. కొడుకునీ, జీవిత భాగస్వామినీ పోగొట్టుకుని ఏంచెయ్యాలో తెలియని స్థితిలో ఆయన, ప్రాణాధికంగా ప్రేమించే భర్తా, అన్నిటా తల్లిని మరపించే అత్తగారూ ఇద్దరూ ఒకేసారి పోవటంతో సుమతికి ఏం జరిగిందో అర్థం కావటం లేదు. అవినాష్ తన ఎదురుగా నిర్జీవంగా పడి ఉన్నాడంటే తట్టుకోలేకపోతోంది. ముందురోజు అందరితో మాట్లాడిన మనిషి ఈ క్షణములో అచేతనంగా పడి ఉన్నాడు.


ఏది ఎలా ఉన్నా వచ్చే వాళ్లందరూ వచ్చారు. ఢిల్లీ నుండి ఆకాష్, భార్యా కొడుకు. పూనానుండి సుమతి అన్నా వదిన, ఇంకా కాంతమ్మ గారి బంధువులూ, సీతరామయ్యగారి చుట్టాలూ ఊళ్ళో ఉన్న పరిచయస్తులూ, ఒకరేమిటి? తెలిసిన వాళ్లందరూ వచ్చారు. ఎందరు వస్తేనేమిటి? వాళ్లు లేని వెలితి ఎవరు పూడుస్తారు? మనిషి బతికి ఉన్నంతసేపే శరీరానికి విలువ. ఆ తర్వాత ఎంత త్వరగా సాగనంపుదామా అన్నట్లు తర్వాత కార్యక్రమాలు వెంట వెంటనే ఎవరి ప్రమేయం ఉన్నా లేకపోయినా జరిగిపోతాయి.

చనిపోయిన కొడుక్కు తండ్రీ, తల్లికి పెద్ద కొడుకూ యధావిధిగా ఉత్తరక్రియలు జరుపుతున్నారు. మనసు మనసులో లేని సీతరామయ్యగారు యాంత్రికంగా విధులు నిర్వహిస్తున్నారు. కొడుకు చేతిమీదుగా వెళ్లిపోవలసిన తాను తన కొడుక్కి కర్మకాండలు చెయ్యటం ఎంత దురదృష్టం .

తన పరిస్థితే ఇలా ఉంటే పాపం సుమతి ఏమైపోతుందో. చిన్నపిల్ల. కనీసం వెళ్లి ధైర్యం చెపుదామన్నా ఆమె లోపలి గదిలో ఉంటుంది. ఆమె చుట్టూ ఆడవాళ్లంతా చేరి ఉన్నారు. ఆమె బయటికి రాలేదు. తాను వాళ్లని తోసుకుని లోపలికి వెళ్లే అవకాశమూ లేదు. హఠాత్తుగా వచ్చిన కష్టానికి దుఃఖాన్ని దిగమింగి కర్మకాండలు చేయటంతో శరీరం నిస్సత్తువుగా మారి ఏమాత్రం సహకరించటం లేదు. ఎలా ఉందో పిచ్చి పిల్ల.

అందుకే ముందురోజే చెప్పేశాడు బంధుగణానికి. పదోరోజు కార్యక్రమం అంటూ ఆ పిల్లని ఇబ్బంది పెట్టవద్దు, తను ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. మీరెవ్వరూ కల్పించుకోవద్దు, ఎటువంటి తంతులు చెయవద్దంటూ.

అసలైనా పాతకాలంలో పెట్టిన ఆచారాలు ఇప్పుడెవరూ పాటించనప్పుడు ఇది మాత్రం ఎందుకు చెయ్యాలి. ఆ రోజుల్లో వితంతువులు శిరోముండనం చేయించుకుని తెల్లచీరలు, పంచలు కట్టుకునే వారు. అదీ చిన్నప్పుడు తన అమ్మమ్మల కాలంలో. తన తల్లి సమయానికి రంగు చీరలు కట్టుకోవటం, మామూలుగా జుట్టు ముడి వేసుకునే వారు. బొట్టు మాత్రం పెట్టుకునే వారు కాదు. ఆ తర్వాత ఇప్పుడు ఎవరూ అవేవీ పాటించటం లేదు. నిజానికి అవేవీ పాటించటనవసరం లేదు. ఎవరైనా బొట్టు పూలూ విసర్జిస్తున్నారంటే అది వారు స్వచ్ఛందంగా వారి ఇష్ట ప్రకారం చేస్తున్నారు. అసలే బాధలో ఉన్న వారిని ఆచారం పేరుతో ఇంకా బాధ పెట్టటం అన్యాయం.

కాలం ఎవరి కోసం ఆగదు. పదిరోజులు కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇక ఇప్పుడు మొదలైనది అసలు చర్చ. కార్యక్రమాలు పూర్తయిన తర్వాత చుట్టాలు ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. మిగిలేది సీతారామయ్య గారి పెద్దకొడుకు ఆకాష్ కుటుంబం. అలాగే సుమతి అన్నా వదిన. సుమతి పెళ్ళైన ఏడాదికే తన కర్తవ్యం అయిపోయినట్లుగా తల్లి కూడా పోయింది. ఆవిడ ఉండి ఉంటే కనీసం కొన్నాళ్లైనా వీళ్లని కని పెట్టుకుని ఉండేది. కష్టంలో ఉన్న వీళ్లకి తోడు మరి ఎవరుంటారు?

సుమతి అన్న కూడా ఏదో పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. నాలుగు రోజుల్లో కంపెనీ పనిమీద అమెరికా వెళ్ల వలసి ఉంది. తిరిగొచ్చేసరికి నెలపైన పడుతుంది. సుమతి వదిన కూడ ఉద్యోగస్థురాలే. ఆమెకు సెలవు పెట్టే అవకాశం లేదు. ఇక సుమతికి తోడుండే వాళ్లు లేరు.


పోనీ అన్నా వాళ్లు తమతో తీసుకు వెళ్లాలంటే అన్న దేశంలో ఉండటం లేదు. వదిన ఇంట్లో ఉండే అవకాశం లేదు. పుట్టింటి వాళ్లు తీసుకు వెడితేగానీ సుమతిని ఏ బంధువులు అంటే మేనమామలూ, పినతల్లులూ బాబాయి వంటి వాళ్లు వాళ్ల ఇళ్లకి తీసుకెళ్ల కూడదని ఓ నిబంధన. చిన్న వయసులో భర్తని పోగొట్టుకున్న ఆమెకు అండగా నిలబడేందుకు సుమతి దగ్గర ఉండటానికి ఎవరి పనులు వాళ్లవి. ఇక్కడే ఉండే అవకాశం ఎవరికీ లేదు.


ఇక సీతారామయ్య గారి పరిస్థితి. ఆయన వరకు ఆయన్ని తీసుకెళ్లటానికి ఆయన పెద్దకొడుకు సిద్ధంగానే ఉన్నాడు. అదికూడా రేపో మర్నాడు అయితేనే. ఆ తర్వాత అతనికీ భార్యకీ సెలవులు లేవు. సుమతిని కూడా తీసుకెళ్లాలంటే ముందు వాళ్లపుట్టింటి వాళ్లు తీసుకెళ్లాలనే నిబంధన అడ్డు. ఇదో పెద్ద చర్చాకార్యక్రమం అయింది.


ఇంతలో సుమతి పిన్ని కూతురు కల్పించుకుని "పోనీ అన్నయ్య లేకపోయినా వదిన ఊళ్లోనే ఉంటుంది కదా? సాయంత్రానికి ఆఫీసు నుండి వచ్చేస్తుంది కదా! ఇప్పుడే మీతోపాటు తీసుకున్న వెళ్లండి" అన్నది.

"ఇప్పటికిప్పుడు అంటే రిజర్వేషన్ కష్టం కదా. రిజర్వేషన్ లేకుండా ఎలా తీసుకు వెళ్లటం "


నిజానికి సుమతి అన్న వాళ్లు ఈ పరిస్థితి ఊహించలేదు. వాళ్లు తమవరకే రిజర్వేషను చేయించుకున్నారు. రిజర్వేషను ఒక సమస్య అయితే ఆమెని తీసుకు వెళ్లి నెలరోజులపైన ఉంచుకోవాలనే ఆలోచన వాళ్లకి అసలు రాలేదు. అన్న అమెరికా నుండి తిరిగొచ్చాక నిదానంగా తీసుకెళ్లి నాలుగురోజులు ఉంచుకొని పంపాలనే ఆలోచన తప్ప, తమ ఇంటి ఆడపిల్లకి కష్టం వచ్చినపుడు ఆదుకోవాలనే ఆలోచన అసలు రాలేదు. తల్లి ఉంటే ఎలా ఉండేదో పరిస్థితి. మనసుంటే మార్గం ఉండకపోదు అన్న ఆలోచన ఎవరికీ రాలేదు.

ఇంతలోకి ఇంకొక శ్రేయోభిలాషి ఇంకొక వాదు లేవతీసింది. " అయినా పదమూడోరోజు గుడిలో నిద్ర చేసి వస్తేనే పుట్టింటి వాళ్లైనా తీసుకెళ్లాలి. నిద్ర చెయ్యకుండా వాళ్లు మాత్రం ఎలా తీసుకెడతారు? " అంటూ.

"అవునవును. ఇదొకటుందికదా. నిజమే. గుళ్ళో నిద్ర చెయ్యకపోతే ఎలా? "

ఇంకెవరో వంత పాడారు.


"అవునమ్మా సుమతీ! రేపు రాత్రికి నిద్ర చేసిరా. నెలలోపు పుట్టింటి వాళ్లు తీసుకెడతారు. మరి ఆ ఏర్పాట్లేవో చెయ్యండి. " ఇంకెవరో సలహా ఇస్తున్నారు.


నిద్ర చెయ్యమంటున్నారు సరే. ఆమెకు తోడు ఎవరు వెడతారు.

మామూలు వాళ్లు పనికి రారు. వాళ్లు కూడా వితంతువులే అయి ఉండాలి. అక్కరలేని వాళ్లంతా చర్చలు మొదలు పెట్టారు.

సుమతికి ఇంకా ఎందుకు బతికున్నానా అనిపించింది. ఇంతకు ముందుకు ఇప్పటికీ తనలో వచ్చిన తేడా ఏమిటి? అన్నిటికన్నా విలువైన తన జీవిత భాగస్వామిని పోగొట్టుకుంది. కష్టంలో ఉన్న తనగురించి, తన జీవితం గురించి నిర్ణయాలు చెయ్యటానికి వీళ్లెవరు? తన ఆత్మీయులా?తనని పోషిస్తున్నారా? అంత దుఃఖంలోనూ ఆవేశం తన్నుకొచ్చింది. కానీ మౌనంగా రోదిస్తోంది. తల్లి చనిపోతే తండ్రి సవతి తండ్రితో సమానమంటారు. ఇప్పుడు భర్తపోతే, తల్లి లేకపోయే సరికి తోబుట్టువు కి కూడా తనువపరాయిదైపోయిందా? నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే మనసు రాలేదా తన అన్నకి? ఓలాటి వైరాగ్యం ఆవహించింది సుమతిని. అత్తగారు లాగా భర్తతోపాటు ఎందుకు చనిపోలేదా అని మొదటిసారిగా అనిపించింది ఆమెకు. నిజానికి అవినాష్ పోగానే తను కూడా చనిపోవాలనే ఆలోచన చేసింది. కానీ తన చుట్టు పక్కల ఎవరో ఒకరు ఉండటంతో ఆ పని చెయ్యలేక పోయింది. ఇప్పుడు మాత్రం ఏం. అంతా ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. అప్పుడు చావు తనచేతిలో ఉంటుంది. ఒక్క క్షణం చాలు వెళ్లిపోవటానికి. ఈ బాధలు, సమస్యలు లేకుండా పోతాయి.

పక్క గదిలో కూర్చున్న సీతారామయ్య గారికిి ఈ చర్చ అంతా వినబడుతోంది. నిజమే. భార్యను కోల్పోయి తను, భర్తను కోల్పోయి సుమతీ ఇద్దరూ ఒకే స్థితిలో ఉన్నారు. కానీ తనను తీసుకు వెళ్లటానికి తనకొడుకు సందేహించటం లేదు. కానీ భర్త చనిపోయిన సుమతిని తన ఇంటికి తీసుకు వెళ్లటానికి మాత్రం అభ్యంతరం. ఎందుకంటే అది ఆమె పుట్టింటి వారి బాధ్యత.


అంటే తమ ఇంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని తమ కుటుంబంలోకి వచ్చిన ఆమె ఇంకా పరాయిదేనా? ఆమె తమ ఇంటి మనిషి కాదా? ఎప్పటికీ అంతేనా?


అందులోనూ ఆడమనిషికొక నిబంధనా, మగవాడికొక నిబంధనానా? భార్య చనిపోయిన తను ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఏమైనా చెయ్యచ్చు. వీలుంటే ఆరు నెలలు తిరక్కుండా మళ్లీ పెళ్లి కూడా చేసుకోవచ్చు. కానీ వయసులో ఉన్నపిల్ల, భర్తను పోగొట్టుకుని దీనావస్థలో ఉంటే, పుట్టింటి వాళ్లు తీసుకెళ్లకపోతే, గుడిలో నిద్ర చెయ్యకపోతే ఆమె ఎక్కడికీ వెళ్లకూడదా? ఏ పని చెయ్యకూడదా? ఇదెక్కడి న్యాయం? అసలు పుట్టింటి వాళ్లు ఎందుకు తీసికెళ్లాలి? ఆ నిబంధన, ఆచారం ఎందుకు పెట్టారు? ఇదివరకు రోజుల్లో ఒకసారి ఆడపిల్లకి పెళ్లి చేసి పంపిస్తే చావైనా బతుకైనా అత్తింట్లోనే అనేవాళ్లు. అందుచేత ఖర్మకాలి భర్త చనిపోతే ఆమెకి అన్యాయం జరగకుండా ఆమెకు అండగా పుట్టింటి వారున్నారని హెచ్చరికగానూ, ఇటువంటి విచారకరమైన పరిసరాలనుండి మార్పు కోసం పుట్టింటివారు తీసుకెళ్లి కొంతకాలం అక్కడ ఉంచుకునే వారు. వాళ్లు తీసుకెళ్లే వరకు ఆమె అత్తింట్లోనే ఉండేది.


ఇక గుడిలో నిద్ర చెయ్యటం అనేది కొందరు పెట్టుకున్న ప్రత్యామ్నాయం. పుట్టింటి తరపున ఎవరూ లేకపోతే

( పెద్దవయసులో భర్త చనిపోయి అప్పటికే పుట్టింటివారు గతించి ఉంటే) అటువంటి పరిస్థితుల్లో దేవుడే తల్లి తండ్రి అనే భావనతో ఎవరినో తోడు తీసుకుని గుడిలో నిద్ర చేసే వాళ్లు. ఈ మధ్య కాలంలో మూఢనమ్మకాలు ముదిరి గుడిలో నిద్ర అనేది తప్పనిసరిగా పాటిస్తున్నారు. తన చిన్నప్పుడు ఇంత పిచ్చనమ్మకాలు లేవు. వెంటనే కుదరకపోయినా సంవత్సరంలోపు పుట్టింటి వాళ్లు తీసుకెళ్లి ఆదరించి పంపేవారు. రానురాను ఈ ఆచారాలు మనుష్యుల మనసును గాయపరిచే విధంగా తయారయ్యాయి. పాపం. పిచ్చి పిల్ల. సుమతి మనసెంత చెదిరి పోయిందో. ఆమెతో తను ఇప్పటివరకు సరిగా మాట్లాడే అవకాశమే రాలేదు. సుమతి ఎవరు? తమ ఇంటి ఆడపిల్ల. తనకొడుకుని నమ్మి వాడి చెయ్యి పట్టుకుని పదికాలాల పాటు కాపురం చెయ్యటానికి వచ్చింది. దురదృష్టవశాత్తూ తన బిడ్డ ఆమెకు అన్యాయం చేసి వెళ్లిపోయాడు. అంత మాత్రం చేత ఆమె తనకుటుంబంలోని మనిషి కాదూ? ఆమె బాధ్యత తనమీద లేదూ? పుట్టింటిని మరిపించవలసిన బాధ్యత అత్తింటి వారికి ఉండదా? అసలు ఎవరూ లేకపోతే ఆమెకు బతికే హక్కు లేదా?

ఇంక ఆగలేకపోయాడాయన. లేచి సుమతి కూర్చున్న గదిలోకి వచ్చాడు. ఆయనను చూసి అందరూ పక్కకు తప్పుకున్నారు. మామగారిని చూడగానే భోరుమంది సుమతి. కట్టలు తెంచుకున్న గోదారిలా దుఃఖం పెల్లుబికింది.

" అమ్మా!సుమతీ! నువ్వేం దిగులు పడకు. మనమిద్దరం ఒకే స్థితిలో ఉన్నాం. నాకులేని నిబంధనలు నీకెందుకమ్మా? నేనెక్కడికీ వెళ్లి నిద్ర చెయ్యకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం వెళ్లాలా? అక్కరలేదు . నీకు పుట్టిల్లు ఎక్కడో లేదమ్మా. నా ఇంటి కోడలిగా వచ్చిన నువ్వు నా కూతురి లాటి దానివి కాదా? నాకు కూతురుండి, ఆమె ఈ స్థితిలో ఉంటే ఏం చేసేవాడిని. నా కొడుకు లేడు. కానీ నువ్వున్నావు. నువ్విప్పుడు నా కూతురివమ్మా. ఇదే నీ పుట్టిల్లు. వేరే పుట్టిల్లు అక్కరలేదు. నువ్వెక్కడికీ వెళ్లనక్కరలేదు . నాకు నువ్వు. నీకు నేను. ఎవరేమంటారో చూస్తాను. నిన్ను నా కడుపులో పెట్టుకుని నా కూతురికేం చెయ్యాలో అన్నీ నీకు చేస్తాను. జీవి తాంతం కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఎవ్వరూ ఏ సలహాలూ ఇవ్వనక్కర లేదు. ఈ రోజునుండి కొడుకైనా కూతురైనా నువ్వేనమ్మా. "

ఆమె తలమీద చెయ్యివేసి ఒకచేత్తో కళ్లు తుడుస్తూ " ఈరోజునుండి నేను నాన్నలాటి వాడిని కాదమ్మా. నాన్ననే. " అన్నాడు.

నీళ్లతోనిండిన కళ్లు మసక బారగా మామగారిలో తండ్రిని చూస్తూండి పోయింది సుమతి.

*******


గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి.


రచయిత్రి పరిచయం :నా పేరు మద్దాళి నిర్మల. నేను ఆదాయపుపన్ను శాఖలో పనిచేసి 2011 డిశంబరులో ఆదాయపు పన్ను( ఇన్ కం టాక్స్) అధికారిగా పదవీ విరమణ చేశాను. సాహిత్యం పట్ల గల అభిరుచి, అభిమానంతో నాలో కలిగిన భావాలను ఆలోచనలను అక్షరరూపంలో నలుగురితో పంచుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు, వ్యాసాలు, కవితలు రాసినా, నా ప్రధాన రచనా ప్రక్రియ కథలు మాత్రమే. ఇప్పటి వరకు దాదాపు నలభై కథలు వ్రాశాను. పత్రికలలో కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి.

ప్రచురింపబడిన కథలలో కొన్ని కథలతో "క్షమయా ధరిత్రీ" అనే నా తొలి కథాసంపుటి 2012 లో విడుదలైనది. శ్రీకాకుళం కథానిలయం లోనూ, కినిగె. కామ్ లోనూ కథా సంపుటి దొరుకుతుంది. మంచి ఆలోచనలు వచ్చినపుడు కథలు వ్రాస్తుంటాను. రాసి కన్న వాసి ముఖ్యమని నమ్ముతాను.


459 views8 comments
bottom of page