top of page

రేడియో కొన్నాము


'Radio Konnaamu' New Telugu Story

Written By Lakshmi Madan

రచన: లక్ష్మి మదన్
(కథా పఠనం: లక్ష్మి మదన్)ఆ రోజుల్లో వినోదానికి రేడియోలు ఎక్కువగా ముఖ్యపాత్ర పోషించాయి. కొన్ని ఊళ్ళలో చిన్న చిన్న సినిమా హాళ్లు ఉండేవి. చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ వచ్చి ఆహాలులో సినిమాలు చూసేవాళ్ళు.. కానీ అందరికీ వీలు అయ్యే విషయం కాదు కదా! రేడియో అయితే ఇంటింటా ఉండేది కాబట్టి అందరికీ ఉపయోగపడేది.

అయితే మా ఇంట్లో రేడియో ఉండేది కాదు. చుట్టుపక్కల అందరిళ్ళల్లో పాటలు వస్తుంటే మాకు రేడియో కావాలని ఎంతో ఆశగా ఉండేది... కానీ మా బాపు ఎందుకో రేడియో కొనడానికి సుముఖంగా లేడు....

కొన్నాళ్లు గడిచాక మా ఇంటికి ఒక కోమట్ల ముసలమ్మ వచ్చేది. ఆమెను ఇంట్లో వాళ్ళు సరిగా చూసేవాళ్ళు కారట. అందుకని ఎవరో చెప్పారట మా ఇంటికి వెళ్ళమని.. అప్పటి నుండి రోజు పొద్దున మా ఇంటికి వచ్చి రాత్రి వరకు కూర్చొని వెళ్ళిపోయేది. ఉన్నంతలో అమ్మ ఆమెకు భోజనం పెట్టేది .


"అమ్మా! మీ బ్రాహ్మణుల సొమ్ము తింటున్నా నేను" అని బాధపడింది ..


అయితే అమ్మ చెప్పింది.. “అట్లా అనుకోవద్దు. మాకు ఉన్నంతలో నీకు పెడుతున్నాము. తృప్తిగా భోజనం చేయి" అని చెప్పింది..


ఆమె ఎంతో సంతోషంగా రోజు భోజనం చేసేది. కొన్ని నెలలు గడిచిన తర్వాత ఒకరోజు ఒక 100 రూపాయలు తీసుకుని వచ్చి మా అన్నయ్య చేతిలో పెట్టి నమస్కారం చేసింది..


"అయ్యో ఎందుకమ్మా ఈ పైసలు మాకిస్తున్నావ్ ?” అని అందరము అడిగాం..


కానీ ఆమె కళ్ళ నీళ్లు పెట్టుకొని “మా ఇంటి వాళ్లే నన్ను చూడలేదు.. మీరు ఇన్ని రోజులు నుండి నన్ను చూస్తున్నారు.. నాకు ఉన్నంతలో మీకు ఇస్తున్నా. నన్ను బాధ పెట్టకుండా తీసుకోండి" అని బ్రతిమిలాడింది. ఇంక చేసేది లేక ఆ డబ్బులు తీసుకున్నాము. అయితే ఆ రోజుల్లో 100 రూపాయలు చాలా గొప్ప విషయం.


"అమ్మో! వంద రూపాయలా"😨😊 అని అనుకున్నాము.


‘వీటితో ఏం చేయాలి’ అని ఆలోచించుకున్నాము. తర్జనభర్జనలు చేసిన పిమ్మట ‘మనకు రేడియో లేదు కదా.. రేడియో కొనుక్కుందా’మని అనుకున్నాము. అనుకున్నదే తడవుగా మా అందరి గల్లా సొరుగుల నుండి డబ్బులు తీసాము. అన్నీ కలిపి దాదాపు 180 రూపాయలు అయ్యాయి... వాటిని తీసుకొని మా ఇంటికి ఎదురుగా ఉన్న మా బంధువుల మనిషికి ఇచ్చాము . అతని పేరు విశ్వన్న...


"మాకు మంచి రేడియో తెచ్చి పెట్టు విశ్వన్నా..." అని అడిగాము..


"ఏం కంపెనీ రేడియో తేవాలి " అని అడిగిండు...


" ఏదైనా సరే ఈ డబ్బులకు వచ్చేది తీసుకొని రా "అని చెప్పాము.


ఒక వారం తర్వాత ఆయన పట్నం వెళ్ళినప్పుడు ఒక రేడియో కొనుక్కొని తెచ్చాడు. ఫిలిప్స్ అనుకుంటా.. ఇంక మా సంతోషానికి అవధులు లేవు.

‘మా ఇంట్లో రేడియో ఉంది.. మా ఇంట్లో రేడియో ఉంది💃🏽💃🏽’ అని మురిసిపోతూనే ఉన్నాము.


ఎదురుగా ఒక కొయ్య కొట్టి ఆ కొయ్యకు ఈ రేడియో తగిలించాము.. దాని చుట్టుపక్కలే కూర్చొని అన్ని కార్యక్రమాలను వినేవాళ్ళం ...పొద్దున వచ్చే సుప్రభాతం నుండి మధ్యాహ్నం వచ్చే చేనుచెలుక, వివిధ భారతి పాటలు, నాటికలు, నాటకాలు, హరికథలు, శనివారం ఆదివారం వచ్చే బాల వినోదం, బాలానందం.. ఇవి ఏవి వదలకుండా వినేవాళ్ళం.


ఇక ముఖ్యంగా మా నాయనమ్మకు రేడియో భలే నచ్చేది. రేడియో పక్కన ఉన్న గడప దగ్గర కూర్చొని అన్ని వినేది. ఎప్పుడైనా మేము రేడియో పెట్టడం ఆలస్యం చేస్తే...


"రేడియో పెట్టుకోరా పాటలు వస్తాయేమో?” అనేది..


"నీకు వినాలని ఉంటే చెప్పు ముసలి. మా పేరు పెట్టి ఎందుకు అడుగుతావు" అని ఎగతాళి చేసేవాళ్లం....


అన్ని పాటలు చక్కగా వినేది "బంజేస్తాము" అంటే


" ఆ రేడియోలో చెప్పేటోళ్లు మనం వినకుంటే ఏమనుకుంటారు? అట్లా బంద్ చేస్తే మర్యాద అయితదా.. ఈ కాలం పిల్లలకు ఏం తెలవదు. నేను కూర్చొని అన్ని అయిపోయేదాకా వింటలే. మీకు పని ఉంటే😡 చేసుకోండి " అనేది..


"అయ్యో పిచ్చి నాయనమ్మ! అక్కడ ఎవ్వరూ ఉండరే 😂మనం ఇష్టం ఉంటే వినొచ్చు లేకుంటే బంద్ చేయొచ్చు” అంటే వినేది కాదు. సరే ఆమె సంతోషం మేమెందుకు కాదనాలి అని రేడియో పెట్టి మా పనుల్లో మేము ఉండేవాళ్ళం....


"సీతాలు సింగారం మా లచ్చి బంగారం" అనే పాట వస్తే నన్ను చూసి మురిసిపోయేది మా నాయనమ్మ. "మాలచ్చి బంగారమే"😄 అంటూ...


వారానికి ఒకసారి వచ్చే సంక్షిప్త శబ్ద చిత్రాన్ని ఇంటిల్లిపాది కూర్చుని వినేవాళ్ళం. ముఖ్యంగా ఆదివారం వచ్చే నాటకాలు అయితే ఎంతో బాగుండేది. చూసిన దానికన్నా ఎక్కువ భావన కల్పించేవి. నాకైతే శారద శ్రీనివాసన్ గారి గొంతు అంటే చాలా ఇష్టం. ఆమె నవ్వు తెరలు తెరలుగా వినిపించేవి. డైలాగుల ఉచ్చారణలో స్పష్టత ఉండేది. ఏది ఏమైనా రేడియో ఉన్న కాలం చాలా బాగుండేది. ఇంకా వార్తలు "ఆకాశవాణి.. వార్తలు చదువుతున్నది టంగుటూరి ప్రకాశం.. ఓలేటి పార్వతీశం.. అద్దంకిమన్నార్.. కందుకూరి సూర్య నారాయణ.." ఇలా కొంతమంది పేర్లు నాకు గుర్తున్నాయి. వివిధ భారతిలో వ్యాఖ్యాత శ్రీ ఉమాపతి బాలాంజనేయ శర్మగారు..అద్భుతమైన గాత్రం..చక్కని వ్యాఖ్యానం..వారు దగ్గర బంధువు కూడా.


ఇప్పటికీ ఆనాడు రేడియోలో విన్న పాటలు కంఠస్థంగానే ఉన్నాయి. జానపద గేయాలు కానీ భక్తి పాటలు కానీ ఏది విన్నా మరచిపోని గుర్తులుగా మిగిలిపోయాయి... చిన్నతనంలో విన్నపాటలన్నీ ఘంటసాల గారి, సుశీలమ్మ గారి పాటలు. ఆ తర్వాత బాల సుబ్రహ్మణ్యం గారి పాటలు.. నాకు ఇప్పటికీ సుశీలమ్మ గారి పాటలంటే చాలా ఇష్టం. అద్భుతమైన గాత్రం..


రేడియో, ప్రజల జీవితాలలో ముఖ్య భూమిక ను పోషించింది. ఎన్నికలు జరిగినా, క్రికెట్ మ్యాచ్ వచ్చినా, రేడియో చుట్టూ కూర్చొని వినే రోజులన్నీ గుర్తున్నాయి.. క్రికెట్ మ్యాచ్ వస్తే మాత్రం రేడియో బాపు దగ్గరే ఉండేది.


వేసవికాలంలో అయితే ఆరు బయట కూర్చొని రేడియో పెట్టుకుని పాత పాటలు వినడం బాగా గుర్తుంది.


అయితే మాకు రేడియో లేని కాలంలో మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో ఉండేది. వాళ్ళు సెలవులకు వచ్చినప్పుడు రేడియో తీసుకుని వచ్చేవారు. మాకు ఎంతో గొప్పగా అనిపించేది. అసలు ఒక్క క్షణం కూడా బయటకు పోకుండా ఆ రేడియోలో వచ్చే ప్రోగ్రాంలు అన్ని వినేవాళ్ళం. మొత్తం మీద మేము మాత్రం రేడియో కొనడంలో చాలా వెనుకబడ్డామని చెప్పాలి. ఆమె ఎవరో పుణ్యమూర్తి వల్ల మేము కొనగలిగాము.

🙏🙏🙏

లక్ష్మి మదన్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Podcast Link


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం ; పేరు లక్ష్మి

కలం పేరు : లక్ష్మీ మదన్

హైదరాబాద్ లో ఉంటాను.

500 కి పైగా కవితలు, 300 కి పైగా పద్యాలు, పాటలు, కథలు రాసాను.


42 views0 comments

Opmerkingen


bottom of page