రంగువల్లుల అభిలాష
- Gadwala Somanna
- 7 days ago
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #RangavallulaAbhilasha, #రంగువల్లులఅభిలాష, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 107
Rangavallula Abhilasha - Somanna Gari Kavithalu Part 107 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 11/08/2025
రంగువల్లుల అభిలాష - సోమన్న గారి కవితలు పార్ట్ 107 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
రంగువల్లుల అభిలాష
----------------------------------------
ఇంటి ముందు ముగ్గులు
తలపించును తారలు
రువ్వునోయి సొగసులు
గెలుచునోయి మనసులు
పెడతారోయ్ పడుచులు
రకరకాల ముగ్గులు
వారికెంతో ఇష్టము
ఇంటికవే శ్రేష్టము
పుడమి తల్లి ఒడిలో
ఆమె ప్రేమ బడిలో
ఆడుకునే పిల్లలు
అందమైన ముగ్గులు
కలసిమెలసి ముగ్గులై
అందరు ఉండాలని
వాటికుంది అభిలాష
నవ్వుతూ బ్రతకాలని

అమ్మ సూక్తి ముక్తావళి
------------------------
పుడమిలోన పూవులై
చందమామ నగవులై
బ్రతకాలి జగతిలోన
నడవాలి ప్రగతిలోన
ఉదయంచే భానుడై
విహరించే పక్కియై
నలుగురికి మేలుచేస్తూ
ఇలను ముందడుగు వేస్తూ
కదులుతూ మేఘాలై
కురుస్తూ వర్షాలై
ఉపయోగమవ్వాలి
ఆదర్శం చూపాలి
అందరికి సహకరిస్తూ
అనురాగం పంచుతూ
ఆనందంగా ఉండాలి
అన్యోన్యత చాటుతూ

ప్రేమ పంచే పిల్లలం
---------------------------------------
అక్షరాల తోటలో
విజ్ఞానపు బాటలో
మాకెంతో ఇష్టము
మమకారపు కోటలో
గురుదేవుల సన్నిధిలో
బ్రతుకున ఉన్నత స్థితిలో
బడిలోనే ఎదుగుతాం
వినయంతో ఒదుగుతాం
కలసిమెలసి జీవిస్తాం
చెలిమితోడ మెలుగుతాం
సమైక్యత చాటుతూ
దేశకీర్తి పెంచుతాం
మేము మేటి పిల్లలం
చదువులమ్మ బిడ్డలం
అపకారమే చేయని
ప్రేమ పంచే జీవులం

వేకువ చుక్క కావాలి
--------------------------------------
పొడవాలి చుక్కలా
ఎదగాలి మొక్కలా
అనుదిన జీవితాన
అద్భుత సమాజాన
విరియాలి పూవులా
కురియాలి చినుకులా
ఉండాలి అండగా
నలుగురికి కొండలా
మ్రోగాలి మువ్వలా
ఎగరాలి గువ్వలా
స్వేచ్ఛగా సాగుతూ
నవ్వులే రువ్వుతూ
అందరికి స్ఫూర్తిగా
బ్రతుకులో గొప్పగా
వేకువ చుక్క రీతి
తేవాలి ఘన ఖ్యాతి

కన్నవారి హితవు
--------------------------------------
కష్టమైన సమయాన
నిబ్బరమే ఉండాలి
సూర్యునిలా హృదయాన
వెలుగులు విరజిమ్మాలి
ఒడిదుడుకులు జీవితాన
గుండె దిటువు కావాలి
ఈ సభ్య సమాజాన
గెలుపు బాట నడవాలి
దేవుడిచ్చిన వదనాన
చిరునవ్వులు వెలగాలి
అందరున్న సదనాన
ఆనందం పొంగాలి
ఆ విశాల గగనాన
వేగు చుక్కయి పొడవాలి
పదిమంది మనసులోన
పదిలంగా నిలవాలి
-గద్వాల సోమన్న
Comments