top of page

రాషీ


'Rashee' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'రాషీ' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


పుల్లారావు ఒక ప్రభుత్వోద్యోగి, కుపితుడు, అతడు రాషీ కూడా. అది అందరికి తెలిసిన విషయమే.


కార్యాలయములో అందరి కాన్నా ముందుగా వచ్చి రాత్రి దాకా పని చేస్తుంటాడు. ఒక్కనాడు కూడా సెలవు పెట్టి ఎరుగడు. సెలవులొస్తె అందరికి సంతోషమైతె పుల్లారావుకు బాధ కలిగిస్తుంది.


అధికార్ల దృష్టిలో మంచి పనిమంతుడని పేరు. బయట రాషీ అని, పుణ్య జనుడు, మందాక్ష హీనుడు, వేణీవేధని అని ముద్దుగా పిలుస్తుంటారు. అవేవీ పట్టించుకోకుండా నంగనాచిలా మెలుగుతుంటాడు.


రాషీ అంటె లంచగొండి అని, పుణ్యజనుడు అంటె రాక్షసుడని, మందాక్షహీనుడంటె సిగ్గులేనివాడని, వేణీవేధని అంటె జలగ అని అర్థాలు తెలియవతనికి. సర్వకాల సర్వావస్థలందు భృకుటి ముడిచే ఉంటాడు.

లంచము తీసుకోనిదే పని చేయ కూడదని నేమకమతనిది.

లంచము ఇచ్చినవారు నేరుగా తిట్టకుండా "వసుదేవాపత్కాల పూజిత పుత్ర రత్నమా" అనో "గిరిజా సుత వాహన వైరి వైరి వరాలపుత్రా" అనో తిట్టుకుంటారు.


ఎంత సంపాదించినా అతడు దృఢముష్టే.

భార్య వారిజ, కూతురు వాసంతి కొడుకు అష్టమూర్తి ఇతని కుటుంబము. మరియు ముసలి తల్లి.


ఎవ్వరికి ఏ వ్యయము అవసర మొచ్చినా మనిషి తహతహలాడు చుంటడు. తన తిండి మాత్రము తాను పనిచేసినందుకు తీసుకున్న లంచము తోడు హోటల్ వ్యయము వారితో పెట్టించుక సుష్టుగా భోంచేస్తాడు.


తల్లి తీర్థయాత్రలకు తీసుక పొమ్మంటె తీరిక లేదని, భార్య తల్లిగారింటికి పోతాను అంటె వద్దని, పిల్లలు సెలవులలో వినోద యాత్రకనగానే కసిరించుడూ పుల్లారావు మనస్తత్వము, డబ్బులు వ్యయమని బాధ.


పుల్లారావు ఏ పనైన ఎంత పేదవారైన లంచము ఈయనిది పని కాదంటాడు. అధికార్లను వలలో వేసుకోవడములో దిట్ట.

అవినీతి నిరోధక శాఖలో ఫిర్యాదు చేసినా వెరువడు.


అందరికి స్థాన చలనము జరిగినా పుల్లారావు మాత్రము ఊరిలో బొడ్రాయి లా తన స్థానము వదులకుండా ఎదోలాగ నిర్వహించుకుంటూ వస్తాడు.


తనను కని పెంచి పెద్దజేసిన తల్లికి పావలా ఖర్చు పెట్టడానికి మనస్కరించని మహానుభావుడు పుల్లారావు.

వయసు పెరిగిన తల్లే తనకు జంఝాటముగా భావించి ఆమెను వృద్ధాశ్రమములో పడవేసి వస్తాడు. ఈ లోకములో దయగలవారు చాలా మంది ఉన్నారు ఏ తల్లో తండ్రో దయ తలచి పండ్లో ఫలమో ఇచ్చి వాటికి తోడు పావలో పరకో ఇచ్చి పోతారని నమ్మే నికృష్టుడు పుల్లారావు. భార్యా పిల్లలు వారించినా వినక ఆ పని చేశాడు. అందరు అనుకుంటరు వీనికి ధనపిశాచి పట్టింది కాబోలు అని.


ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి లోనైతె ప్రభుత్వ ఆస్పత్రిలో చేరుస్తాడేకాని డబ్బు ఖర్చు పెట్టి ప్రభుత్వేతర ఆస్పత్రిలో వ్యయానికి వెనుకంజ వేస్తాడు. ఇంత జేసినా తల్లి తన పేగు బంధము తెంచుకోలేక కొడుకును ఒకసారి వచ్చి పొమ్మని ఫోన్ చేయిస్తుంటాది. పోతే తల్లి ఏమి అడుగుతుందో అను అనుమానము వెంటాడి ఆరు నెలల కొక సారికూడా చూడడానికి పోడు. ఉండబట్టలేక భార్యా పిల్లలే అప్పుడప్పుడు చూసి వస్తుంటారు.


ఒకనాడు ఇంట్లో దొంగలు పడి పుల్లారావును బంధించి అరువకుండా నోటికి గుడ్డ కట్టి దాచుకున్న సొమ్మంతా దోచుకోని పోతారు.


పక్క గదిలో పడుకున్న అతని భార్యకు పిల్లలకు ఈ సంగతి తెలియదు. తెల్లవారి వచ్చి చూసేవరకు పుల్లారావు పరిస్థితి చూసి నోట్లో గుడ్డలు విప్పి కట్లు ఊడ దీస్తారు.


జరిగిన సంగతి పోలీస్ స్టేషన్ లో నివేదించలేని పరిస్థితి. దొంగకు తేలు కుట్టినట్ట్లుగా తనదగ్గర అంత సొమ్ము పోయిందని చెప్పలేడు. చుట్టుపక్కల వారు పుల్లారావుకు తగిన శాస్తి జరిగిందనుకునేవారే కాని సానుభూతి కనపరచే వారు ఎవరూ లేరు.

ఇన్ని రోజులు తాను అవినీతికి పాల్బడి. తల్లికి గాని భార్యా పిల్లలకు గానీ పైసా ఖర్చు పెట్టకుండా ప్రోగు జేసిన సొమ్మంతా పాయె గదా అని విలపించుతాడు. ఒక పరివర్తన కలిగిన వాడిలా లంచాలు తీసుకోవడము మానేస్తాడు పుల్లారావు. పొదుపంటే తెలిసిన వాడు కనుక పుల్లారావు తన నెల వేతనముతో కుటుంబము గడుపుతుంటాడు.


వృద్ధాశ్రమములో ఉన్న తల్లిని ఇంటికి తీసుకవచ్చి ఆమె రెండుకాళ్ళమీద పడి ఏడ్చుచూ క్షమించమంటాడు.


“నాయనా! నాది ఎప్పుడూ క్షమించే, భరించే గుణమే. నా కష్టాలు మీరు భరించినా మీ కష్టాలకు కుములుడు మినహా నేను అశక్తురాలను. నేను సదా మీ క్షేమానికే పరితపిస్తుంటాను. సంతానముపై ద్వేషమనేది ఏ తల్లీ రక్తములో ఉండదు. అది గుర్తించుకుంటె చాలు” అంటుంది తల్లి.


“నేను కోరుకునేదల్లా ఒకటే. నీవు అవినీతికి తలొగ్గగుండా నీతిమంతుడవై నీ భార్యా పిల్లల కష్టపెట్టకుంటే అదే పదివేలు” అని వెన్ను తట్టుతుంది పుల్లారావు తల్లి.


“ఒకసారి ఈ భూమిని గురించి ఆలోచించు, ఎంత ఓపిక ఉన్నదొ.. అందుకే భూమాత అంటారు లోకులు. భూమాతలా తల్లిగూడా అంతే అని తలువు” అని హితబోధ చేస్తుంది పుల్లారావుకు తల్లి.


తల్లి మాటే వేద మంత్రములా భావించి సద్బుద్ధి తో మెలుగసాగాడు పుల్లారావు.


సమాప్తం

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


25 views0 comments

Comments


bottom of page