top of page
Writer's pictureSriram Bhattaram

రాతి గోడలు



'Rathi Godalu' - New Telugu Story Written By Sriram Bhattaram

Published In manatelugukathalu.com on 10/09/2024

'రాతి గోడలు' తెలుగు కథ

రచన: శ్రీరామ్ భట్టారం


ఆదివారం వారపత్రిక చివరి పేజీ లో పజిల్ పూరించడంలో లీనమయిన భాస్కర్ రావు కి ఉన్నట్టుండి తన పక్క టేబుల్ లో ఏదో గొడవైనట్టు అనిపిస్తే అటు తిరిగి చూసాడు. దివాకర్ - సూర్యప్రతాప్ ల మధ్య ఏదో వాదులాట. ఆదిత్య, రవికాంత్ లు కూడా ఉన్నారు. వారి ముందు బల్ల మీదున్న ఖాళీ టీ గ్లాసుల మీద ఈగల ముసురుడు మొదలైంది. 


సూర్యప్రతాప్ కోపంతో దాదాపుగా అరుస్తున్నాడు. అతని పక్కన కూర్చున్న ఆదిత్య ఆపకపోతే, దివాకర్ మీద పది కొట్టేలాగున్నాడు. మరో నిమిషం పాటు దివాకర్ మీద తిట్లదండకం కురిపించి విసురుగా లేచెళ్లిపోయాడు. రెండు నిమిషాల తరువాత దివాకర్, రవికాంత్ లు కూడా వెళ్లిపోవడంతో ఆదిత్య వచ్చి భాస్కర్రావుని పలకరించాడు. 


"పెద్ద తలకాయనొప్పి అయిపోతోంది మాస్టారు ఈ లారీ నాయళ్ల తో రోజూ. ఆ సూరి గాడికి బి. పి. పెరిగి దివాకర్ గాడి పీక్కొరికేసేలా ఉన్నాడు ఎప్పుడో, " మెయిన్ ఎడిషన్ అందుకుంటూ అన్నాడు ఆదిత్య. 


ఎండతీవ్రతకి తోడు ఎలక్షన్ సెగలు..

రాష్ట్రం లో వడదెబ్బకు ముగ్గురి మృతి..

గోధుమపై కనీస మద్దతు ధర పెంపు పై రాజధాని లో కొనసాగుతున్న రైతు సంఘాల ఆందోళన.. 


హెడ్లైన్స్ చదివి ఫ్రంట్ పేజీ తిరగేసాడు ఆదిత్య. లోపల కూడా గొప్ప వార్తలేమి లేనట్టు తల విదిలించి, లోకల్ ఎడిషన్ తెరిచాడు. 

 

అరిగిపోయిన పెన్సిల్ ని వేళ్ళ మధ్య ఆడిస్తూ అడిగాడు భాస్కర్రావు, "మళ్లీ ఆ గొడవేనా?" 


 "ఆ అదే గొడవ.."


నాలుగు రోజుల క్రితం ఇలాగే సూర్యప్రతాప్- దివాకర్ల మధ్య పెద్ద తగువైనప్పుడు, భాస్కర్ కి ఆదిత్య ద్వారా గొడవకు కారణం తెలిసింది. "ఆ సూరి గాడి అక్క- నీలవేణి- ఊర్లో స్థలం అమ్మకానికి పెట్టిందట. దివాకర్ కు తెలిసిన ఒక రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ ఇంటరెస్ట్ చూపిస్తున్నాడు. ఈ వారం సైట్ చూడ్డానికొస్తా అన్నాడట. ఆ అమ్మాయి నీలవేణి కూడా కొంచెం తొందరగా ఈ వ్యవహారం తేల్చాలని చూస్తోంది.


 వాళ్లమ్మకి కంటి చూపు బాగా మందగించింది. ఆపరేషన్ చేయిస్తే కానీ మళ్లీ మగ్గం పని చేయలేదు. ఈ అమ్మాయికి వచ్చే అంగన్వాడీ జీతం తో ఇంటి ఖర్చులు గడవడమే కష్టంగా ఉంది. ఆ స్థలం పెద్దావిడకి పుట్టింటి నించి వచ్చింది. ఈ సూరి గాడికి దాని మీద ఎప్పట్నుంచో కన్ను. నిజానికి ఆవిడ దాన్ని కూతురికి రాయాలనుకుంది. పెళ్ళైన ఏడు నెల్లకే, ఆ అమ్మాయి మొగుణ్ణి వదిలేసి వచ్చింది- వాడు అనుమానం తో పెట్టే హింస తట్టుకోలేక. పై పెచ్చు వాడికి ఇదివరకే ఇంకొకత్తితో సంబంధం ఉందట. అది నచ్చని వాడి అమ్మ- అయ్య బలవంతం మీద నీలవేణి తో పెళ్లి చేసారు. ఈ పిల్లకి ఆ విషయం పెళ్లైన వారానికి తెలిసింది. పెళ్లయింది కాబట్టి మొగుడు మారతాడేమో అని ఆశ పెట్టుకుంది గాని, ఆ యోగమూ రాసిలేదాయె. ఉల్టా పెళ్లాన్నే అనుమానించడం మొదలెట్టాడు. " 


"మరి దివాకర్ తో గొడవేంటి?" అడిగాడు భాస్కర్ రావు. 


"దివాకర్, సూర్యప్రతాప్ ఒకే ట్రాన్స్పోర్ట్ కంపెనీ లో లారీ డ్రైవర్లుగా చేసేవాళ్లు. ఎక్కువుగా ఒకే లారీ లో వెళ్లేవాళ్లు. ఆంధ్ర-తమిళ్నాడు కోస్టల్ రూట్. అలా దివాకర్, సూర్య వాళ్లింట్లో పరిచయం. ఎలాగో నీలవేణి కి దగ్గరయ్యాడు. సూరిగాడికి కూడా దివాకర్ నీలవేణిని చేసుకుంటే ఏం అభ్యంతరం లేదు. కానీ వాళ్లమ్మ పేరు మీద ఉన్న భూమిని అమ్మడానికి దివాకర్ తల్లి-కూతళ్లకి సాయం చేస్తా అనడంతో వీడికి కాలింది. 


దివాకర్ కమిషన్ కోసం తనకు తెలిసిన బయ్యర్లకు అమ్మిస్తున్నాడు అని సూరిగాడి గట్టి నమ్మకం. ఆ తల్లి-కూతుళ్లే తన సహాయం అడిగారని దివాకర్ వాదన. దానికి కొంత కారణం లేకపోలేదు. సూరిగాడు ఇదివరకు ఇంట్లో నించి పెద్ద మొత్తం తీసుకెళ్లి సిటీ లో హార్డ్-వేర్ బిజినెస్ పెట్టి తగలేసాడు. తర్వాత వాడి కన్ను వాళ్లమ్మ పేరిట ఉన్న భూమి మీద పడింది. 


ఆమెకేమో అది కూతురికి ఇవ్వాలనుంది. దివాకర్ గాడు అమ్మకం లో వెనక నుంచి కమిషన్ కొట్టేసి, ఆ తర్వాత నీలవేణి తో పెళ్లికి మొహం చాటేస్తాడని సూరిగాడి అనుమానం. నీలవేణికి దివాకర్ మీద నమ్మకం ఉంది. నమ్మకం సంగతి పక్కనపెడితే వాళ్లమ్మ కి కంటాపరేషన్ చేయించడం ముఖ్యం ఆమెకు. మిగిలిన డబ్బు తో ఏదైనా చిన్న దుకాణం కొని కిరాయికి ఇవ్వొచ్చని ప్లాను. "


"సూర్యప్రతాప్ అనుమానం కూడా సహాజమేగా!?"


"దివాకర్ సంగతి పెద్దగా తెలీదు కానీ, నేను చూసినంతలో సూరిగాడు మాత్రం అంత నమ్మకస్తుడు కాదు. నీలవేణి కి కూడా తమ్ముణ్ణి నమ్ముకుంటే ఏం లాభం లేదని బాగా అర్ధమైంది. "


 వేడికి వీపంతా చమట పట్టేసి, చొక్కా ఒంటికి అతుక్కుపోతోంది. ఈ చిరాకు మర్చిపోడానికి భాస్కర్రావు తిరిగి తన పదపూరణం లో లీనమయ్యాడు. ఆ రోజు పజిల్ కూడా వాతావరణం లాగే క్లిష్టంగా తోచింది. ఎదురుగా కూర్చున్నఆదిత్య అంతకంటే కష్టపడుతూ లోకల్ ఎడిషన్ లో ఏదో వార్తలో దీర్ఘంగా మునిగిపోయాడు. 


మరీ నిరక్షరాసుడు కాదు గాని, వేగంగా ఐతే చదవలేడు. ప్రతి అక్షరం కూడుకుంటూ మెల్లగా చదువుతాడు. మూడు పేరాలున్న ఆ న్యూస్-ప్రింట్ ని ఏకాగ్రతతో చదువుతున్నాడు. వృత్తి రీత్యా ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ అయిన భాస్కర్రావు ఆ టైంలో సగం పైగా పజిల్ పూర్తి చేసేసాడు. 


ఇంతలో ఒక పాత పేపర్ లో పావుకిలో పకోడీ పట్టుకొచ్చి టేబుల్ మధ్యలో పెడుతూ, ఆదిత్య పక్క కుర్చీలో కూర్చున్నాడు రవికాంత్. కష్టపడి న్యూస్- ఆర్టికల్ చదవడం పూర్తి చేసిన ఆదిత్య పేపర్ పక్కన పడేస్తూ ఒక పకోడీ అందుకుంటూ, రవికాంత్ తో అన్నాడు, "ఆ కృష్ణవేణి కి మహిళా కోటాలో కార్పొరేటర్ టికెట్ ఇచ్చిందట పార్టీ ఈసారి" తను కష్టపడి చదివిన వార్త సారాంశం చెప్పాడు. 


"విన్నాను. ఇందాక మా తమ్ముడితో ఫోన్ మాట్లాడినప్పుడు చెప్పాడు, " రవికాంత్ సీలింగ్ వైపు చూస్తూ చెప్పాడు. అతని తల చుట్టూ నాలుగు ఈగలు ముసురుతున్నాయి. పకోడీ వాసనకి ఇంకా జోరుగా రెక్కలాడిస్తున్నాయి. ఒక చేత్తో ఈగలు తోలుతూ, రెండో చేత్తో పకోడీ ముక్క అందుకున్నాడు. బీడీలు ఎక్కువగా కాల్చడం వల్ల రంగు మారిపోయిన పళ్లు ఇకిలించాడు, "ఈవిడ కార్పొరేటర్ ఐతే నియోజకవర్గం అంతా గంజాయి పరిమళం కమ్ముకోవాల్సిందే. " 


 "చాలా బతకనేర్చిందిలే దొరసాని," చేతులు సాగదీసి, కాస్త వొళ్లు విరిచాడు ఆదిత్య. భాస్కర్ వైపు చూస్తూ అన్నాడు, “మొగుడు ఇదివరకు ఒకసారి కార్పొరేటర్ గా చేసి, టర్మ్ లో ఉండగానే కాన్సర్ తో పోయాడు. మొగుడికి నియోజకవర్గం లో ఉన్న అంతో ఇంతో పేరును అనుగుణంగా మలుచుకుంటూ, పార్టీ లో ముఖ్యమైన లొసుగుల్ని పట్టుకొని, చిన్నసైజ్ పలుకుబడి సంపాదించింది. అయితే పలుకుబడి నిలబడాలంటే నిరంతరం ఖర్చు చేయాలి. ఇదివరకున్న రియల్-ఎస్టేట్ ఆదాయం తో పాటు, మరిది సాయంతో ఓ మూడెకరాల మూలభూమి లో గంజాయి వనం వేసి, పక్క రాష్ట్రం నించి గుట్టుగా మా లాంటి కౌలు రైతులు ఆరుగురిని దింపింది. పంట చూసుకోవడం తో పాటు, కోత తర్వాత పైరాష్ట్రాలకు తరలించడం అంతా మా పనే. ” 


"వేరుశెనగ, పత్తి పంటలు అప్పులు మిగిలిస్తే, ఈ మత్తు పంట ఆదాయమార్గం అయికూర్చుంది," నిట్టూర్చాడు రవికాంత్. 


టేబుల్ మీద పకోడీ ఖాళీ అయింది. చెవిదగ్గర రొద పెడుతున్న ఈగ ను తరుముతూ మళ్లీ పెన్సిల్ అందుకొని, పజిల్ పూరణకు ఉపక్రమించాడు భాస్కర్రావు. దాదాపు గా అయిపోవచ్చింది. 


అడ్డం 24 - ప్రయాగరాజ్ లో మూడు నదులు కలిసే సంఘం (3 )!


త్రి-వే-ణి 


సమాధానం రాయబోతున్న భాస్కర్రావు ఒక్కసారిగా ఆగిపోయాడు. అరిగిపోయిన పెన్సిల్ వేళ్ల మధ్యలోంచి నీరసంగా జారిపోయింది. ఆ పేరు తలచుకోగానే ఒక ముఖం కళ్లముందు కదిలింది. చేదు జ్ఞాపకాలు ఒక్కసారిగా వెల్లువెత్తాయి- చేదు కాదు, విషం అనాలి వాటిని. తన గతంలో అందమైన జ్ఞాపకాలని తుడిచేసి, వాటి స్థానంలో శాశ్వతంగా తిష్టవేసుకున్న గరళం. ఒకటి తర్వాత ఒకటి ఆమెకి సంబంధించిన సంఘటనలు మనసును పొడవసాగాయి. 


అతను లెక్చరర్ గా పనిచేస్తున్న కాలేజీ లో ఆమె అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో చేసేది. పదమూడేళ్ల క్రితం ఇంటి నించి లేచిపోయి మైసూరులో పెళ్లి చేసుకున్నారు భాస్కర్- త్రివేణిలు. ఆమె కులం భాస్కర్ తండ్రి కి, అతని జీతం త్రివేణి తండ్రి కి సయించలేదు మరి. 


ఎవరో అనామక తత్త్వవేత్త చెప్పినట్టు రెండు చెట్టు కొమ్మలు చిగురించిన దశలో మొలకలుగా అతుక్కొని ఉంటాయి; కానీ కాల క్రమంలో ఎదిగేకొద్దీ మెలికలు తిరుగుతూ, దూరం జరుగుతూ, ఒకదాన్నొకటి ఎప్పటికీ తిరిగి అందుకోలేని దిశగా వెళ్లిపోతాయి. ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా, మానవ సంబంధాలు సైతం దాదాపుగా కాలక్రమంలో తీసి పారేయలేని ఒక దూరాన్ని వాటి మధ్యలో నింపుకుంటాయి. అట్టే పసిగట్టలేని ఒక శూన్యం అది. 


ఆ శూన్యాన్ని తట్టుకొని నిలబడగలిగే వాళ్లు అతికొద్ది మంది అయితే, దాన్ని చూసి చూడకుండా వదిలేస్తూ, కాలంతో సర్దుకుపోతూ సాగిపోయేవాళ్లు ఎక్కువమంది. రెండూ చేతకాని మనిషి వాస్తవాన్ని జీర్ణించుకోలేక క్రోధానికో, మనస్తాపానికో గురై క్షణికావేశం లో తన అహం చూపించిన దిక్కుగా సరిదిద్దుకోలేని ఒక తప్పటడుగు వేస్తాడు. భాస్కర్- త్రివేణి లు కూడా అటువంటి అతి దురదృష్టవంతుల కోవకి చెందినవారే. 


సరిగ్గా నియంత్రించకపోతే చిన్న, చిన్న మనస్పర్థలు కూడా ఒకదాన్నొకటి పెనవేసుకుంటూ చెరువు పై గుర్రపుడెక్క పరుచుకున్నట్టు మనిషి బుద్ధిని ఆక్రమించేస్తాయి. లేనిపోని అపార్ధాలు ఆమె మనసుని బలహీనపరిచి, తప్పు దోవ పట్టిస్తే, అతికోపానికి గురై, వివేకం కోల్పోయాడు సరిదిద్దాల్సిన భర్త. ఆరోజు వాదులాట ముదిరి, తారాస్థాయికి చేరింది. భాస్కర్ కి ఇప్పటికీ సరిగ్గా గుర్తులేదు- ఏ క్షణంలో తన ఉద్రేకానికి అతను పూర్తి బానిసగా మారాడో! ఆమె అన్న ఏ మాట అతణ్ణి సహనం యొక్క అంచు నుంచి నెట్టి, ఉద్రేకం అనే అగాథంలోకి తోసిందో! తేరుకొని చూసేసరికి చాలా ఆలస్యం అయిపొయింది. 


గెస్ట్ లెక్చర్ పని మీద జైపూర్ ట్రిప్ కి వెళ్లినప్పుడు ఆమె కోసం బహుమతిగా తెచ్చిన బ్రాస్ ఫ్లవర్-వేజ్- ఇప్పుడు రక్తం మడుగు లో నిర్జీవంగా పడివున్న ఆమె పక్కన, అతని ఆవేశాన్ని వెక్కిరిస్తున్నట్టుగా దొర్లుతోంది. జీవం విడిచిన ఆమె కళ్లు ఇప్పుడు అంతులేని శూన్యాన్ని తమలో నింపుకున్నాయి. ఆ చూపు అతన్ని సవాల్ చేస్తున్నట్టు అనిపించింది- చేతనయితే చచ్చేలోగా ఈ క్షణాన్ని మర్చిపో చూద్దాం అన్నట్టు!!! 


   ***


"మాస్టారూ!" దివాకర్ గొంతు వినబడ్డంతో ఒక్కసారిగా జ్ఞాపకాల అలల్లోంచి, పైకి తేలాడు భాస్కర్రావు. ఆదిత్య, రవికాంత్ లు ఎప్పుడు లేచెళ్లిపోయారో అతను గమనించలేదు. డైనింగ్ హాల్ గా పిలవబడే ఆ పెద్ద రేకుల షెడ్డు ఎంట్రన్స్ లో నిలబడి ఉన్నాడు దివాకర్. 


"ఏంది మాస్టారూ! ఇంకా ఇక్కడే కూర్చున్నారు! అటెండన్స్ టైం అయింది. "


ఎనిమిది నెలల క్రితం తమిళనాడు సరిహద్దు ప్రాంతం అరంబాక్కం మీదుగా ఆంధ్ర లోకి ఎంటర్ అయిన మూడు అక్రమ ఇసుక రవాణా లారీలు సీజ్ అయ్యాయి. డ్రైవర్లు, హెల్పర్లు కలిపి మొత్తం పదకొండు మంది పేర్లు ఛార్జ్- షీట్ లో నమోదయ్యాయి. వాటిలో రెండు పేర్లు దివాకర్, సూర్యప్రతాప్. 


నగరం అంచున నిలబడి ఉన్న సబ్-జైల్ గ్రౌండ్ లో ఎనిమిది వరుసల్లో నిలబడి ఉన్నారు 136 మంది ఖైదీలు. సాయంత్రం ఐదున్నరకు ఎవరి సెల్ లోకి వారిని పంపేముందు జైలర్ తీసుకునే ఈ అటెండన్స్ ఒక నిత్యక్రతువు. ఆ మైదానం పైన చాలా ఎత్తులో ఓ అర డజన్ గద్దలు వలయాల్లో తిరుగుతున్నాయి. 


ఏడు నెలల క్రితం గంజాయి సాగుకేసు లో పట్టుబడ్డ ఆదిత్య, రవికాంత్ లు రెండో వరుసలో నిలబడి ఉన్నారు. నెల క్రితం రావాల్సింది బెయిలు. కొన్ని సాంకేతిక లోపాల వల్ల స్టే పడింది. రివైజ్డ్ పిటిషన్ దాఖలు చేసాడు కృష్ణవేణి ఏర్పాటు చేసిన లాయరు. కోర్టు కి వేసవి సెలవులు అవ్వడంతో మరో రెండు వారాలు కారాగారంలో కాలం వెల్లబుచ్చాలి. ఇంట్లోవాళ్ల ఖర్చులకు కృష్ణవేణి పుణ్యమాని కొంత మొత్తం అప్పుడప్పుడు అందుతోంది. ఆ ఏర్పాటు సవ్యంగా ఉండాలంటే దొరసాని పేరు బయటకు పొక్కకూడదు; 


ఎందుకంటే న్యాయవ్యవస్థ దగ్గర వలలు తక్కువ, గాలాలు ఎక్కువ. చిన్న చేపలు చిక్కినంత సులభంగా పెద్ద చేపలు పడవు. పైపెచ్చు చిన్నచేపలు అటు గాలానికి చిక్కకుండా, ఇటు పెద్ద చేపల నోట్లో పడకుండా మెసులుకోవాలి. 


నడివేసవి అవ్వడం వల్ల మరో గంటగ్గాని సూర్యుడు ఆకాశం దిగడు. ఇరవై నిమిషాల తర్వాత అటెండన్స్ క్రతువు పూర్తయ్యి ఖైదీలందరూ ఎవరి గదుల్లోకి వారు చేరారు. 


'ప్రిసన్ బ్లాక్' గా పిలవబడే ఆ రాతి కట్టడం లోపల ఏరియా చాలా వరకు బయట ఎండతో సంబంధం లేకుండా, ఎప్పుడూ చీకటి పులుముకొని ఉంటుంది. అందువల్ల సీలింగ్ కు ఏర్పాటు చేసిన వరుస విద్యుద్దీపాలు రోజంతా వెలుగుతుంటాయి. వాటిలో కొన్ని అవసాన దశలో ఉన్నట్టున్నాయి. కష్టంగా మిణుకుమంటున్నాయి. మరోగంట తర్వాత అవి కూడా ఆర్పేయబడి, ప్రాంగణమంతా చిమ్మ చీకటి ఆవరించింది. 

****

శ్రీరామ్ భట్టారం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నా పేరు శ్రీరామ్ భట్టారం... హైదరాబాద్ స్వస్థలం. వృత్తి రీత్యా ప్రైవేట్ కంపెనీ లో HR గా చేస్తున్నాను. ఆంధ్రజ్యోతి లో ఇది వరకు 'కాకులమూక' అనే ఒక కథ ప్రచురితమైనది. 

ప్రపంచం లోని వైవిధ్య కథలతో పాటు తెలుగు లోని వినూత్న రచనలు చదవడం అలవాటు.

136 views0 comments

תגובות


bottom of page