top of page
Original.png

సాధన సౌరభం

#SadhanaSourabham, #సాధనసౌరభం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

ముగ్గురు పెద్దలు ఇంట్లో వాదనలో. వక్షణం చూపిస్తున్న వ్యక్తి, తీవ్ర భావోద్వేగాలతో ఉన్న యువకుడు. పట్టాలు, కాగితాలు టేబుల్ మీద.

Sadhana Sourabham - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 27/11/2025

సాధన సౌరభం - తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


''అయ్యా!... పరంధామయ్యగారు నమస్కారం!...'' చేతులు జోడించాడు ప్రైమరీ స్కూలు ఉపాధ్యాయులు నరశింహయ్యగారు.


చేతిలోని దినపత్రికను క్రిందికి దించి పరంధామయ్యగారు నరశింహయ్య మాస్టారుగారిని చూచి, కుర్చీ నుంచి లేచి... ''నమస్కారం సార్‌!... రండి.'' చిరునవ్వుతో ఆహ్వానించారు. నరశింహయ్యగారు వరండాలో ప్రవేశించారు. 


''కూర్చోండి మాస్టారు!...''


నరశింహయ్యగారు కుర్చీలో కూర్చున్నారు.


''ఏమిటి సార్‌ విషయం. ఉదయాన్నే వచ్చారు?...'' కుర్చీలో కూర్చుంటూ పరంధామయ్యగారు అడిగారు.


''వాహ్వాళికి వెళుతూ, మిమ్మల్ని వరండాలో చూచి లోనికి వచ్చాను. మీతో మీ అబ్బాయి కృష్ణ విషయంలో ఒక మాట చెప్పాలి!...''


''చెప్పండి సార్‌!...''


''మీరు కృష్ణను డాక్టర్‌ చదివించులనుకొంటున్నారు. వాడికి ఆటల మీద వున్న శ్రద్ధ చదువు మీద లేదు. మొక్కలో వంగనిది మానై వంగుతుందా నరశింహయ్యగారూ!...''

పరంధామయ్యగారు కొన్ని క్షణాలు శూన్యంలోకి చూస్తూ వుండిపోయారు.


'అవును, కృష్ణకు తల్లి గారాబం అధికం. వాడు ఇప్పటి నుంచి బాగా చదివి మంచి మార్కులు సాధిస్తే కదా పెద్దయ్యాక డాక్టర్‌ కాగలడు!...' అనుకొన్నాడు పరంధామయ్య.


''సార్‌!... మీరు నాకు మంచి మిత్రులు. మా వాడికి గురువులు. నా మీద వున్న గౌరవంతో మీరు వాడిని గురించి చెప్పారు. నేను వాడు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొనేలా చూస్తాను. యథార్థాన్ని తెలియజేసినందుకు మీకు నా ధన్యవాదములు సార్‌!...'' ఎంతో వందనంగా చెప్పాడు పరంధామయ్య.


''పరంధామయ్యగారూ నేను వచ్చిన పని అయిపోయింది. వెళ్ళి వస్తాను.''


నరశింహయ్యగారు కుర్చీ నుంచి లేచి వీధి వైపుకు నడిచారు.

ఆ రోజు ఆదివారం. కృష్ణ ఇంకా నిద్ర లేవలేదు. సమయం ఉదయం ఏడు గంటలు.

''రాధా!... భార్యను పిలిచాడు పరంధామయ్య. వంట ఇంట్లో వున్న రాధ పరుగున వరండాలోకి వచ్చింది.


''ఏమండీ!... అంత గట్టిగా అరిచారు. నాకేం చెవుడా!...''


పరంధామయ్య నవ్వాడు.

''ఎందుకా నవ్వు?...''


''నీ ముద్దుల కృష్ణుడు నిద్రలేచాడా!...''


''లేదు. ఈ రోజు ఆదివారం కదా!... కాస్త ఆలస్యంగా లేస్తాడు.'' నిర్లక్ష్యంగా జవాబు చెప్పింది రాధ.


పరంధామయ్య భార్య చేతిని పట్టుకొని తన ప్రక్కన వున్న కుర్చీలో కూర్చోబెట్టాడు. నరశింహయ్య మాస్టారు కృష్ణను గురించి చెప్పిన మాటలు చెప్పాడు.


కొడుకును గురించి విన్న మాటల వలన రాధమ్మగారి ముఖంలో రంగులు మారాయి.


''చూడు రాధా!... కృష్ణ అంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. వాడిని నేను డాక్టర్‌గా చూడాలనేది నా ఆశయం, కల. నా కల కల్ల కాకూడదు. వాడిని క్రమశిక్షణతో పెంచడం నీ బాధ్యత. వాడు బాగా చదవాలి. మంచి మార్కులు సాధించాలి. పెద్ద అయ్యి డాక్టర్‌ కావాలి. కనుక వాడి తత్వాన్ని నీవు మార్చాలి. ఉదయం ఆరు గంటలకల్లా లేవాలి. కాలకృత్యాదులు తీర్చుకొని స్కూలు వెళ్ళేంతవరకూ చదవాలి.


రాత్రి ఎనిమిది గంటల వరకూ ఆటలాడడం మానాలి. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకూ చదవాలి. భోంచేసి శయనించాలి. వాడి భవిష్యత్తు నా కల సఫలం కావడం అనేది నీ చేతుల్లో వుంది. నీవు రేపటి నుంచి వాడి దినచర్య నేను చెప్పినట్లుగా మార్చాలి. అర్థం అయిందా అర్ధాంగీ!...'' చిరునవ్వు నవ్వాడు పరంధామయ్య.


కృష్ణ విషయంలో తన భర్త చెప్పిన మాటలన్నీ సత్యాలే అని రాధ గ్రహించింది.

''అలాగేనండీ!...'' అంది విచారంగా.


మరుదినం నుంచీ కృష్ణ విషయంలో తన తత్వాన్ని మార్చుకుంది.

***

కృష్ణ వయస్సు తొమ్మిది సంవత్సరాలు. ఐదవ తరగతి చదువుతున్నాడు. తల్లి మాటలను సాంతం విన్నాడు. చివరగా ఆ తల్లి చెప్పిన మాటలను పదే పదే తలుచుకొన్నాడు. 'నాన్నా!... నేను మీ నాన్న నీ మేలు కోరేవారం. మేము ఏం చెప్పినా చేసినా అది నీ మంచికే. నిన్ను డాక్టర్‌గా చూడాలన్నది మీ నాన్నగారి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నీవు నెరవేర్చాలి. అంటే, కష్టపడి చదవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. బెస్ట్‌ స్టూడెంట్‌వనిపించుకోవాలి. నాన్న కోర్కెను తీర్చాలి.'' ఎంతో అనునయంగా చెప్పింది ఆ తల్లి.


కృష్ణలో పరివర్తన కలిగింది. తల్లి మాటలను పాటించాడు. ఆరు నెలల పరీక్షలలో అన్నింటిలో అతనిదే ఫస్టు మార్కు. టీచర్లు అభినందించారు.


పరంధామయ్య రాధమ్మలకు ఎంతో సంతోషం. కృష్ణకు చదువు పిచ్చి పట్టుకొంది. అతని మనస్సున తాను బాగా చదివి డాక్టర్‌ కావాలనే నిర్ణయం రిజిష్టర్‌ అయింది. వేమన శతకంలోని... అనగనగ రాగ మతిశయిల్లుచు నుండు... తినగ తినగ వేము తియ్యగనుండు... నాల్గవ తరగతిలో తాను చదివిన వేమన శతకపు ఆ పద్యం గుర్తు చేసుకొని తన లక్ష్యసాధనకు కష్టపడి చదవడం కొనసాగించాడు కృష్ణ.


కృష్ణలో కలిగిన మార్పుకు పరంధామయ్య దంపతులకు, నరశింహయ్య మాస్టారుకు పరమానందం...


అదే కదా 'సాధన సౌరభం!!!...


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page