top of page

సగటు మనిషి


కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి.

'Sagatu manishi' New Telugu Story(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


"అమ్మాయి సీమంతం కూడా పెళ్లి చేసినంత ఘనంగా చేస్తారని మాకు తెలుసన్నయ్యగారూ..

ఎప్పుడు, ఎలా చేద్దామో మాట్లాడుకుని

ఆ డేట్ ఖరారు చేయడానికే మిమ్మల్ని పిలిపించాను." అంది మోహనమ్మ.


రాఘవయ్య గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్టయింది.

పెళ్లికి పదహారు లక్షల అప్పు చేసాడు.

మొత్తం ముఫై లక్షలు ఖర్చుపెట్టి పెళ్లి చేసాడు.

అదే ఇంకా తీరలేదు. మళ్లీ ఇదోటా?


సీమంతానికి రెండు లక్షలు పట్టుకోవాలి?

మరి పురుటి ఖర్చు, బారసాల, కానుకలు దేవుడా!

మధ్యతరగతి మనుషుల్లో కూడా ఈ గ్రాండ్ నెస్ అనే బీజం పడటం ఎన్ని అనర్ధాలకు దారితీస్తుందో.పెళ్లి కుదిరిందనే ఆనందంలో

ముందూ వెనకా చూసుకోలేదు.


ఆ తర్వాత వచ్చే ఖర్చుల్ని తట్టుకునే శక్తి సామర్ధ్యాలను

సమకూర్చుకోవాలని ధ్యాస తనకప్పుడు రాలేదు.


"ఏమంటారు అన్నయ్యగారూ!"

మోహనమ్మ పిలుపుకు సర్దుకుంటూ


"సరేనమ్మా అలాగే చేద్దాం.మాఇంట్లో తొమ్మిదోనెల సూడిదలిచ్చే ఆనవాయితీ ఉంది. ఇచ్చి ఏకంగా పిల్లని పురిటికి తీసుకువెళతాం.అంతే కదటే. ఏవంటావ్?"

అన్నాడు భార్య సుమిత్ర వంక చూస్తూ.


"అవును అంతే వదినగారు" అంది సుమిత్ర.


హమ్మయ్య అప్పటిలోగా డబ్బు సమకూర్చుకోవచ్చని ఊపిరి పీల్చుకున్నాడు రాఘవయ్య.


"మా పెద్ద కోడలికి ఏడో నెలలో ఇచ్చాము.

అదే ఆనవాయితీ చిన్నకోడలి విషయంలోనూ పాటించాలి. మీరివ్వకుండా మేం ఇవ్వకూడదు. మీరూ మేమూ కలిసి ఏడో నెలలో ఇచ్చేద్దాం. ఏమంటారు."

మహా మాటకారి తనంగా చెప్పేసింది మోహనమ్మ.


నీళ్లు నవిలాడు రాఘవయ్య.

అన్నిటికీ కావాల్సింది డబ్బే.

నెలకి ముఫై వేల జీతగాడు. అప్పుచేసిమరీ

పెళ్లి అట్టహాసంగా చేసాడు.

మిగిలినవి ఘనంగా కావాలని వాళ్ళు కోరుకోవడంలో వింతేముంది.

కానీ ఘనానికి అంతేముంటుంది.

నాకు అప్పులున్నాయ్ అని చెప్పలేని నిస్సహాయతలో అవుననలేక కాదనలేక సతమతమయ్యాడు.


"నాన్నా, సీమంతానికి పట్టుచీర పదివేలు పెట్టి కొనండి. కనకాంబరం రంగుకి ఆకుపచ్చ బోర్డర్ చీర నాకు చాలా బాగుంటుంది. కదమ్మా.

నువ్వు షాపుకి వెళ్లి మంచిది ఎంచి కొనమ్మా" అంది కూతురు లక్ష్మి.


"అవునమ్మా బాగుంటుంది.కొంటాను" అని తలాడించింది సుమిత్ర.

భార్యవంక చూసాడు రాఘవయ్య.


ఒప్పుకోక తప్పుతుందా అన్నట్టుగా కళ్ళతోనే సైగచేసింది సుమిత్ర.


"అమ్మా! మా అత్తగారి చీర కూడా పదివేలు పెట్టి మంచిది కొనమ్మా.

వచ్చినవాళ్ళకి రిటన్ గిఫ్ట్స్ కూడా కొని ప్యాక్ చేయించండి.

మనింట్లో అందరికీ చోటు సరిపోదుకదా. ఏదన్నా ఫంక్షన్ హాల్ బుక్ చేయండి" చెప్పుకు పోతున్న కూతురువంక బుక్కైపోయాను బాబోయ్ అన్నట్టు చూసాడు రాఘవయ్య.


"అన్నట్టు మావాళ్ళు ఓ పాతికమంది వస్తారు అన్నయ్యగారూ. ఫంక్షన్ హాల్లో నాలుగు రూములు కూడా బుక్ చేసి ఉంచండి. వాళ్ళు కాస్త విశ్రాంతి తీసుకుంటారు" అంది మోహనమ్మ.


"వాళ్ళకి అన్నీ తెలుసులేవే. ప్రతిదీ పూసగుచ్చినట్టు చెబుతావ్. మీ ప్రకారం మీరు ఏర్పాట్లు చేయండి బావగారూ.

పెళ్లిలో మీ మర్యాదల్ని రుచిచూసినవాళ్ళం. మీకు మేం చెప్పాలా"అన్నాడు లక్ష్మి మావగారు చలపతి.


అన్నిటికీ తలాడించి ఇంటికి వచ్చారు రాఘవయ్య దంపతులు.


అలసటగా కుర్చీలో కూలబడ్డాడు రాఘవయ్య.

పైన గిర్రున తిరుగుతున్న ఫ్యాన్ లో సుడిగుండాలు కనపడ్డాయి అతనికి.

కాళ్ళకింద పెద్ద అగ్నిపర్వతం బద్ధలైనట్టు భయపడ్డాడు.


అప్పుడే అతని స్నేహితుడు త్రిమూర్తులు వచ్చాడు.


"ఏవిరా మొహం అట్లావుంది. ఏవైంది." అన్నాడు కుర్చీలో కూర్చుంటూ.


"కాఫీ తీసుకోండి అన్నయ్యగారూ. శాంతా చంటివాడూ కులాసాగా ఉన్నారా? ఇందాకే వియ్యాలవారింటినుంచి వచ్చాము.

అదే అమ్మాయి సీమంతం గురించి మాట్లాడ్డానికని వెళ్లాం. వాళ్ళు ఏడో నెల్లో చెయ్యమన్నారు.మొన్ననే పెళ్లి ,అప్పుడే సీమంతం ఖర్చు. అదే మీ మిత్రుడి బెంగ" చెప్పింది సుమిత్ర.


"మా అమ్మాయి సీమంతానికి పట్టుమని పదివేలు కూడా ఖర్చుపెట్టలేదు నేను. అంతకు మించి పెట్టొద్దని మా అల్లుడు స్ట్రిక్ట్ గా చెప్పేసాడు.

ఆ ఇచ్చేదేదో మనవడికి ఇచ్చుకోండి వృధా ఖర్చు ఎందుకు అన్నాడు" చెప్పాడు త్రిమూర్తులు."తెలుసులేరా. అందుకే నేనూ అలాగే చేద్దామనుకున్నాను. కానీ అమ్మాయి పట్టుచీరలు పదివేలు పెట్టి కొనమంది.ఫంక్షన్ హాలుట. భోజనాలు రిటర్న్ గిప్ట్ లట.

పెళ్లి ఘనంగా చేయడం తప్పైపోయిందిరా.

తాహతు మర్చిపోవడం నా తప్పే. తర్వాత వచ్చే ఖర్చులు కూడా ఆ హోదాలోనే జరిపించాలని వాళ్ళు కోరుకోవడం సహజమే కానీ సగటు ప్రయివేటు ఉద్యోగిని. అంతడబ్బు ఎక్కడ్నించి తీసుకురాను. చిన్నదాని పెళ్లి ఎలా చెయ్యను " రాఘవులు

బిక్కమొహం చూసి త్రిమూర్తులు జాలిపడ్డాడు.


"సర్లేరా. అన్నిటికీ దిగులు పడకు. నేనో యాభైవేలు సర్దుతాను. మిగిలినవి ఎక్కడన్నా ప్రయత్నించు . ఎక్కువగా ఆలోచించకుండా ఈ కార్యాన్ని గట్టెక్కించు" అన్నాడు త్రిమూర్తులు.


యాభైవేలు ఏ మూలకని. ఇది ఇక్కడితో ఆగుతుందా?

ఎన్నో సందేహాలతో రాఘవులుకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు.


మర్నాడు లక్ష్మి అత్తగారు మోహనమ్మ ఫోన్ చేసింది.


"అన్నయ్యగారూ ఓ చిన్నమాట.

మరేంలేదు, మావారి పిన్నీవాళ్ళ బావగారి కూతురు, దాని పిల్ల ఇద్దరూ లక్ష్మి సీమంతానికని అమెరికా నుంచి వస్తున్నారు.

మీ లక్ష్మికి ఆడపడుచు వరస కాబట్టి ఏదో సరదాగా మీకు తోచింది పెట్టండి.


ఆ పిల్లకి కూడా కాస్త తక్కువలో ఓ పట్టుచీర తీయండి. అది పెళ్లికి ఎటూ రాలేదు పాపం. దాని కూతురికి ఓ బుల్లి గౌను. ముందుగా చెబితే ఆ ఏర్పాట్లలో ఉంటారని మీ చెవిలో వేశాను. అన్నీ మీకు తెలుసనుకోండి. ఏ లోటు రానీయరనే నమ్మకం నాకుంది.


వచ్చినవాళ్ళకి బోర్ కొట్టకుండా ఏదైనా ఈవెంట్ ఏర్పాటుచేస్తే బాగుంటుంది.


ఒక పక్క వాళ్ళు వినోద కార్యక్రమాలతో అలరిస్తుంటే మరోపక్క పెద్దవాళ్ళం మన పద్ధతిలో మనం సీమంతం కార్యక్రమం పూర్తిచేద్దాం.


మనం ఇలా అన్నీ చర్చించుకుని చేసుకుంటే ఏలోటూ రాదు. ఏవంటారు?"

గొప్ప ఐడియా ఇచ్చినందుకు కాసేపు ఆవిడ్ని ఆవిడే పొగుడుకుని ఫోన్ పెట్టేసింది.


అంతా అయిపోయింది. మొత్తం కూరుకుపోయాను. ఇక తప్పించుకునే వీల్లేకుండా పోయింది.


నావల్ల కాదు, నేనిదంతా చేయలేనంటే కూతురి కాపురంలో ఎంతోకొంత నష్టం జరుగుతుంది.

ఇప్పుడేంచేయాలని రాఘవయ్య తలపట్టుకు కూర్చున్నాడు.


"ఏవండీ, పనిలోపని నేను కూడా ఓ పట్టుచీర కొనుక్కుంటాను. పెళ్లికి కూడా నాకే కోతపెట్టారు. ఈసారి ఊరుకునేది లేదు. ఏదో వేడిలో వేడి ఖర్చులో ఖర్చు చిన్నదానిక్కూడా పట్టు చీర కొనేద్దాం. దానిపెళ్లి చూపులకి పనికొస్తుంది "


అంది సుమిత్ర రాఘవయ్య కి భోజనం కంచం పెట్టి వడ్డించబోతూ

"చాలు. ఇక పెట్టకు.ఆకల్లేదు" అని లేచి అక్కడ్నించి వెళ్ళిపోయాడు.


రాఘవయ్య ఒళ్ళు వేడెక్కినట్టై, కళ్ళు తిరిగాయి.

మంచం మీద వాలాడు.

నీరసంతో ప్రాణం పీక్కుపోయినట్టుగా అనిపించింది.

నెలరోజులు లంకణాలు పడ్డట్టు ఒంట్లో ఒక్క అవయవంకూడా సహకరించట్లేదు.


తాహతుకు మించి చేసిన కూతురి పెళ్లి తన పాలిట మృత్యుఘంటికలు మోగిస్తోంది.ఏవో శబ్దాలు అస్పష్టంగా వినబడుతున్నాయి.


మధ్యలో మాటలు అరుపులు కేకలు ఏడుపులు. అంతా అయోమయంగా ఉంది.

చెయ్యలేనివాడు ఎందుకు తలూపినట్టు. చేతకాదని ముందే చెప్పొచ్చుగా.

నాకు అత్తారింట్లో అవమానం జరిగిందినాన్నా. అంతా నీవల్లే. అది కూతురి గొంతు.


ఏవీ చెయ్యలేనివాడికిచ్చి పెళ్లిచేసి నా గొంతు కోశాడు మానాన్న. అవి భార్య దెప్పిపొడుపు మాటలు.

నా పెళ్లెలా చేస్తాడో నాన్న. చిన్నకూతురి సందేహాలు.

అన్నిటికీ పరిష్కారం డబ్బు.

ప్రయివేటు ఉద్యోగం మానేస్తే పెన్షన్ కూడా రాదు.


అంతా పిల్లలకే పెట్టి చివరకి తనేమైపోతాడు.తప్పంతా దనదగ్గరేవుంది. ముఫై వేల జీతగాడు ఎలా పెళ్లిచేయాలో అలాగే చెయ్యాలి. విపరీత పోకడలకు పోయి వాతపెట్టుకుంది తను.


ఆ త్రిమూర్తుల్ని చూడరాదా. తక్కువ ఖర్చుతో కూతురి పెళ్లి, సీమంతం చేసేసాడు . అలాచేస్తేమాత్రం వేడుక రాదా.

ఎచ్చులకు పోవడం తనకు అలవాటైనప్పుడు అవతలివాళ్ళు మాత్రం ఎందుకు తగ్గుతారు.


ఇలా లాభంలేదు. వియ్యాలవారింటికి వెళ్లి నావల్ల కాదని చెప్పేస్తాను. నాకంత తాహతు లేదని దాపరికం లేకుండా చెప్పేస్తాను.


కలవరిస్తున్న భర్తని కంగారుగా కుదుపుతూ లేపింది సుభద్ర.

కళ్ళు తెరవకుండానే


"నీకిప్పుడేం కొనను. నీ గొంతెమ్మ కోరికల్ని కొన్నాళ్ళు వాయిదా వెయ్యి.ముందు నేను అప్పుల్లోంచి బయట పడాలి. అందాకా పొదుపుగా ఉంటాను. ఎవరేమనుకున్నా నాకేం ఫర్వాలేదు."


మనో వ్యాకులత కలవరింతలకు దారితీసింది.ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని క్షీణింపజేసింది.

ఒళ్ళంతా కట్టెలా బిగుసుకుపోయింది.


"బావగారూ! ఇలా చూడండి. మమ్మల్ని చూడండి"

"అన్నయ్యగారూ, నేనండీ మోహనమ్మని.

కళ్ళు తెరిచి చూడండి."

"నేనొచ్చాను నాన్నా, లే నాన్నా"

"మావయ్యగారూ! ఇప్పుడెలా ఉంది.ఇటు చూడండి. నేను మీ అల్లుడ్ని.నాతో మాట్లాడండి"


ఇంతమంది మాటలు చెవుల్లో వినిపిస్తున్నా రాఘవయ్యలో చలనం రాకపోయేసరికి

డాక్టర్ని తీసుకొచ్చాడు అల్లుడు.


డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ కి కాసేపటికి కళ్ళుతెరిచాడు రాఘవయ్య.


అందరివంకా చూశాడు. అందరూ తనవాళ్లే. వాళ్ళని సంతోషపెట్టాల్సిన బాధ్యత తనదే. కానీ తను ఎవరికీ న్యాయం చెయ్యలేకపోతున్నాడు. తనమీద చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి.


దేనికి ఎంతెంత వెయిట్ ఇవ్వాలో అంతే ఇచ్చి సరిసమానంగా తూకం వేసి చూసుకోవాల్సిన తనే లోపభూయిష్టంగా ఉంటే ఇక ఎవరు సరిదిద్దగలరు?

పాత్ర ఎరిగి నీరు పోయాలి.

రేపటి అవసరాల్ని గుర్తెరిగి

ఖర్చు చేయాలి.


సీమంతం చెయ్యటం ఇష్టంలేక ఇలా మంచం పట్టినట్టు నాటకం ఆడుతున్నాడని అనుకోరుకదా! చాతకానివాడని ముద్ర వేరుకదా!

ఆలోచిస్తూ అందరివంకా తేరిపార చూసాడు."బావగారూ బాగున్నారా. ఒక్కసారిగా ఎందుకిలా అయిపోయారు?


ముందుకు వెళ్లటమేగానీ వెనక్కి తిరిగి రావడం తెలియని అభిమన్యుడిలా మూర్ఛిల్లారే?

అమ్మాయి సీమంతం ఖర్చు తలుచుకుని ఇంతలా డీలా పడిపోతే ఎలా?" వియ్యంకుడు కనిపెట్టేశాడని కాస్త ఇబ్బందిగా కదిలి


"అదేం లేదు బావగారూ. ఆఫీస్ పనివత్తిడి వల్ల అలా అయ్యింది. అంతే. నేను బాగానే వున్నాను "అన్నాడు రాఘవయ్య లేచి కూర్చుంటూ.


"అంతేనా ఇంకేమైందో అని భయపడ్డాను అన్నయ్యగారూ. హమ్మయ్య. ఇక లేచారు కాబట్టి ఒక చిన్నమాట.


సీమంతానికి ఫంక్షన్ హాల్ లో ఫ్లవర్ డెకరేషన్ ఎలాగూ చేస్తారు కాబట్టి వీడియో అతన్ని పిలిపించండి.

వెజ్ నాన్ వెజ్ వంటలు కూడా వేరువేరుగా పెట్టించండి. పిల్లకి చలివిడి ఎటూ పెడతారు కాబట్టి మరికాస్త ఎక్కువ చేయించండి.

ఏం లేదు మా పినమావగారు వాళ్ళూరికి పట్టికెళతారుట.ఇక రైల్వేస్టేషన్ నుంచి మంటపానికి వచ్చేవాళ్లకోసం రెండు కార్లు మాట్లాడండి.

వచ్చినవాళ్ళు ఊరు చూడ్డానికి వెళ్లేందుకు కూడా వీలుగా ఉంటుంది. ఇకపోతే...."


ఎవరుపోతే? నేనేగా?

ఈవిడపేరు మోహనమ్మ కాదు, గొంతెమ్మ అయ్యుంటుంది అందుకే ఇన్నికోరికలు కోరుతోంది అనుకుంటూ


"అమ్మా చెల్లెమ్మగారూ! నాకు మీరడిగినవన్నీ చెయ్యాలనే ఉంది.

కానీ నా బడ్జెట్ పరిమితి దాటిపోయింది.

తొమ్మిదోనెలలో అమ్మాయికి చలివిడి, చీర ఒళ్ళోపెట్టి పురిటికి పుట్టింటికి తీసుకొస్తాం.

అంతకు మించి నేనేమీ చెయ్యలేనండీ.


మీరందరూ నన్ను క్షమించాలి" అంటూ రెండుచేతులూ ఎత్తి దణ్ణం పెట్టాడు రాఘవయ్య.


అందరూ మౌనంగా నిలబడ్డారు.

ఎవరూ ఏమీ మాట్లాడట్లేదని కంగారుపడుతూ అందరి మోహల్లోకీ భయంగా చూసాడు రాఘవయ్య.


అందరూ ఒక్కసారిగా ఘొల్లుమని నవ్వేశారు.

రాఘవయ్య అయోమయంగా చూసాడు.


"మావయ్యగారూ మీలో ఈమార్పు కోసమే మీ సహనం త్రాసులో ఇన్ని బరువులు ఉంచాం.

పెళ్లిలో మీరు చేసిన అనవసరపు ఖర్చు, ఆర్భాటాల గురించి మేం ఇంట్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం.


మీ శక్తికి మించి అన్నీ చేస్తున్నారు. ఇంత అనవసరపు ఖర్చు ఎందుకండీ అని మా నాన్నగారు మీతో అన్నప్పుడు

మీరేమన్నారో గుర్తుందా?


'ఈ రాఘవులు కూతురి పెళ్లి ఊళ్ళో కొన్నేళ్ళపాటు గుర్తుండిపోవాలి. అంత వైభవంగా చేస్తాను' అన్నారు.


ఊళ్ళోవాళ్ళ దృష్టిలో గొప్ప అనిపించుకోవాలని మీ తలను తాకట్టు పెట్టుకున్నారని మీ అమ్మాయి లక్ష్మి మీగురించి బాధపడని రోజులేదు.

అందుకే మేమంతా ఆలోచించి మీ మీద ఇంత భారం మోపితేగానీ మీలో మార్పు రాదనుకున్నాం.


అంతేతప్ప మిమ్మల్ని లూటీ చెయ్యాలనే ఉద్దేశ్యం మాలో ఎవరికీ లేదు. " అల్లుడి మాటలకు రాఘవయ్యకు ప్రాణం లేచొచ్చినట్టైంది.


"నిజం చెప్పావు అల్లుడూ.ఎంత ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఆపాలో వచ్చే సంపాదన బట్టి నిర్ణయించుకునివుంటే నాకీరోజు ఈ పరిస్థితి వచ్చుoడేది కాదు.

మీ అందరికీ చాలా కృతజ్ఞతలు.


చెల్లెమ్మగారూ, మీకు రెండువేలలో చీర కొని పెడతాను, దాన్నే మీరు పదివేలు అనుకుని ఈసారికి సర్దుకోoడి మరి" అన్నాడు.


"ఇంకా నయం. చీర ఫోటో చూపించి దాంతో సరిపెట్టుకోమనలేదు. సంతోషం." అంది మోహనమ్మ.

ఆమాటకి రాఘవయ్యతో సహా అందరూ పగలబడి నవ్వారు.

---------శుభం--------

గొర్తి వాణిశ్రీనివాస్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసంమాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం : గొర్తి వాణిశ్రీనివాస్(గృహిణి)

నా పేరు గొర్తివాణి

మావారు గొర్తి శ్రీనివాస్

మాది విశాఖపట్నం

నాకు ఇద్దరు పిల్లలు

కుమార్తె శ్రీలలిత ఇంగ్లండ్ లో మాస్టర్స్ చేస్తోంది

అబ్బాయి ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

రచనల మీద ఎంతో మక్కువతో

కవితలు, కథలు రాస్తున్నాను.

విశాలాక్షి, సాహితీకిరణం, సాహో,సహరి,విశాఖ సంస్కృతి,సంచిక,

ప్రస్థానం, కథా మంజరి, హస్యానందం, నెచ్చెలి, ధర్మశాస్త్రం, ఈనాడు,షార్ వాణి తెలుగుతల్లి కెనడా, భిలాయి వాణి, రంజని కుందుర్తి  వంటి  ప్రముఖ   సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి అందుకోవడం ఒకెత్తైతే మన తెలుగు కథలు. కామ్ వారి వారం వారం కథల పోటీలలో బహుమతులు అందుకోవడంతోపాటు

ఉత్తమ రచయిత్రిగా ఎంపిక కాబడి రవీంద్రభారతి వేదికగా పురస్కారం దక్కడం నా రచనా ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచింది.


మానవ సంబంధాల నేపథ్యంలో మరిన్ని మంచి రచనలు చేసి సామాజిక విలువలు చాటాలని నా ఈ చిన్ని ప్రయత్నం. మీ అందరి ఆశీర్వాదాలను కోరుకుంటూ

గొర్తివాణిశ్రీనివాస్

విశాఖపట్నం

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.45 views0 comments

Comments


bottom of page