top of page

 సాహితీ మహాయజ్ఞ రథసారథి

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #సాహితీమహాయజ్ఞరథసారథి, #SahithiMahayajnaRathaSarathi, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Sahithi Mahayajna Ratha Sarathi - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 10/08/2025

సాహితీ మహాయజ్ఞ రథసారథి - తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్


 

అతని పేరు.. సీతారాం. అతని వృత్తి ప్రవృత్తి సాహితీ యజ్ఞం. 


పరమపదసోపానపటం లో నూరవస్థానం చేరుకోవాలి అనేది అతని గోల్. అది అందరికీ ఉండే ఆలోచనే. 


అందుకోసం సీతారాం ప్రయత్నం మొదలుపెట్టాడు. ఒక శుభముహూర్తాన ఆ పటంలోని నిచ్చెన మెట్లు ఎక్కడం ప్రారంభించాడు సీతారాం.. అలా అలా పదిమెట్లు చాలా సునాయసంగా ఎక్కగలిగాడు. 


అదిగో అప్పుడే అతని మనసు పరిపరి విధాలుగా పిచ్చిగంతులు వేసింది. 


'"ఏమో.. నిచ్చెన జారి పోతుందేమో? ఎవరైనా లాగేస్తున్నారు ఏమో''.. అని అతడికి మొట్ట మొదటగా చిన్న సహజ అనుమానం వచ్చింది.. కొన్ని మెట్లు ఎక్కాక. 


అది పెనుభూతమై కూర్చుంది. నిచ్చెన పదిలంగా ఉందో లేదో అని తను ప్రయత్నం మొదలు పెట్టిన మొదటి జీరో స్థానాన్ని వెనక్కి తిరిగి చూశాడు.. అంతే.. నిజంగానే నిచ్చెన జారిపోయి ఆ జీరో స్థానంలో పడ్డాడు.. సీతారాం!


ఈ సారి సీతారాం అలాంటి అనుమానపు ఆలోచనలు పెట్టుకోకుండా.. మళ్ళీ ప్రయత్నం మొదలెట్టాడు నిచ్చెన ఎక్కాడు.. ఎక్కాడు.. సునాయాసంగా 20 మెట్లు ఎక్కే సాడు. అక్కడ 19 వ మెట్టు మీద తనకు బాగా ఇష్ట మైన.. నాలుగు కేజీల.. మడత కాజాల పొట్లం ఉన్నట్లు.. దాన్ని తీసుకోకుండా దాటుకుని వెళ్లి పోయినట్టు అనిపించింది.. ఆశగా ఆబగా మళ్ళీ వెనక్కి తిరిగాడు.. నిచ్చెన జారి పోయింది. అరటిపండు తొక్క మీద కాలు వేసినట్లు బుర్రనజారి మళ్లీ జీరో లో పడ్డాడు. 


''నా పిచ్చి ఊహ.. గోల్డ్ గని లాంటి గోల్ సాధించాలంటే ఇలాటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు'.. అని మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టాడు.. సీతారాం.. 


ఈసారి పిచ్చి భయాలు.. పిచ్చి ఆశలు వదిలి వెను తిరిగి చూడకూడదని కచ్చితంగా నిశ్చయించుకున్నాడు.. అలా అలా మళ్లీ జీరో నుండి మొదలు పెట్టి ఏకంగా 50 మెట్లు చాలా సునాయాసంగా ఎక్కేశాడు. 


అర్థ సెంచరీ కొట్టేసిన ఆనందంలో ఆ 50 వ ప్రతిష్ఠాత్మ కమైన మెట్టుమీద ఆనందంతో చిందునాట్యం కట్టాడు.. అంతా బాగానే ఉంది. పై 100వ స్థానం నుండి ఎవరో తిరిగి వస్తూ క్రిందకి వెళ్ళిపోతూ దారిలో ఉన్న తనతో మాట్లాడా లని ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. 


ఆ అపరిచిత వ్యక్తి పెదాలు కదులుతున్నాయి. 

''హలో పైకి వెళుతున్నారా మీరు.. అక్కడ ఏం లేదండి అంతా వేస్ట్.. పదిమంది కోసం ఏదో మంచి పని చేద్దాం అనుకుంటున్నారు మీరు.. దానివల్ల మీకు ఏం వచ్చి పడుతుంది. డబ్బు సంపాదన లేకుండా చేసే ఈ సేవ కాస్త గుర్తింపు ఇస్తుందేమో కాని ధనాన్ని సంపాదించి పెట్టదు కదా.. ఈ ప్రపంచంలో డబ్బు లేనిదే మనం దమ్మిడికి పనికిరాము కదా.. ఇదంతా వేస్టoడి..'' అని అతను తనతో అంటున్నట్టు అనిపించింది సీతారాం కు. 


అయితే ఈసారి గత అనుభవాల దృష్ట్యా సీతారాం పప్పు దాకలో కాలు వేయలేదు. ఆ కనిపించే వ్యక్తి నిజం వ్యక్తి కాదని ఆ మాటలన్నీ తన మానసిక సంఘర్షణ అని గ్రహించి.. 


''ఇప్పుడు నేను చేస్తున్న పని వల్ల నాకు ఆత్మతృప్తి ఉంది. అదే నాకు కావలసింది.. అదే ఆరోగ్యాన్నిస్తుంది.. ఆరోగ్యంగా ఉంటే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు..'' అని తన మనసులో నిగ్రహించుకుని.. వేరే ఆలోచన లేకుండా ఏకాగ్ర తతో వడివడిగా చాలా చాలా మెట్లు ఎక్కి 90 వ మెట్టు దగ్గర వరకు వచ్చేసాడు.. సీతారాం. 


అదిగదిగో.. అక్కడే కనిపించాడు నారదుడు రూపంలో ఉన్న వ్యక్తి.. 


''ఏమయ్యా సీతారాం.. 90 మెట్లెక్కేసావు. వంద మెట్లు ఎక్కి నప్పటికీ ఈ పరమపద సోపానపటం లో అక్కడ నీకు కావలసింది ఉండదు.. నాకు తెలుసు కనుక నీకు చెప్తున్నాను.. సరే, నా అనుభవంతో చిన్న ఐడియా ఇస్తాను వింటే విను లేకపోతే లేదు. ''


అంటూ.. ఇలా చెప్పడం మొదలెట్టాడు ఆ నారదమహర్షి లాంటి వ్యక్తి. 


''నువ్వు ఈ 90 మెట్టు మీద ఉన్నావు కదా ఇప్పుడు శభాష్ చాలా బాగా చేరుకున్నావు. నువ్వు ఈ 90 వ మెట్టు మీదే నిలబడి ఇలా పక్కదారి గా అలా ఆగ్నేయమూలగా తలను ఇలా వంచి చూడు.. ఏం కనిపిస్తుంది?''


''పెద్ద మూట''


''అది మూట కాదయ్యా బాబు.. అందులో లక్ష కోట్లు విలువైన వైడూర్యాలు వజ్రాలు ఉన్నాయి.. ఒక్కసారిగా ఆ మూట అందుకుని నీ పనిచూసుకో.. ఎందుకంటే నువ్వు ఆ పైకి వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి అది ఉండకపోవచ్చు కదా.. ఊ ఊ స్పీడ్ స్పీడ్.. ''


అంటూ అతను కంగారు పెట్టి ఒక్క తోపు తోసి నట్టు అనిపించింది.. సీతారాం కు. 


అంతే ఫినిష్.. చూస్తే మొదటిజీరో స్థానంలో బెందడి లో పడినట్టు అయిపోయింది సీతారాం పని. 


ఎవ్వరూ అతనికి చేయి అందించడం లేదు. పైకి పైకి లేప డానికి.. ముందుకు రావడం లేదు. గతం లో తను చెయ్యి అందించిన వాళ్లు కూడా ముఖం పక్కకు తిప్పుకొని.. ఆ బెందడి అంటించుకోవడం దేనికని వెళ్ళిపోతున్నారు. 


అదిగో అప్పుడే మొట్టమొదటగా జీవితం అంటే ఏమిటో అర్థమైంది సీతారాం కు.. గతంలో తను చేసిన వ్యాపారం లో తనను నమ్మించి మోసం చేసినవాళ్లు.. పరిశ్రమలలో తను ప్రయత్నం చేస్తున్నప్పుడు తనను ఘోరంగా చీట్ చేసిన వాళ్ళు.. తను తివాచీ మీద నడుస్తుంటే.. వెనక నుండి పుటుక్కున లాగేసిన వాళ్లు.. అలా అలా స్మృతి పథంలో గుర్తు వచ్చారు దెబ్బకు సీతారాం కు. 


దిమ్మతిరిగినట్లయ్యింది.. తల విదిలించుకుని నరాలన్నీ శక్తిని కూడా తీసుకొని.. మనసుకు మనోధైర్యాన్ని తనకు తానుగానే పెంచుకుని గతంలో పరమపద సోపానపటంలో వందవ స్థానం ఆక్రమించ గలిగిన మహామహుల స్ఫూర్తి జీవితాలు గుర్తుకు తెచ్చుకుని.. ఆ బెందడి లోనుండి పైకి లేవ గలిగాడు.. 


ఇప్పుడు సీతారాం జీవితం లో ఇంటర్మిషన్!


సీతారాం తన రూమ్ లో కూర్చున్నాడు.. ఇప్పుడు అతను మామూలు సీతారాం.. దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. 


ఎంత మాయా ప్రపంచం ఇది.. కాస్త మంచి పని చేద్దాం అన్నా ఎన్ని అడ్డంకులు?? ఇప్పటికైనా మించిపోయింది లేదు జీవితంలో ఇలాంటి దెబ్బలు అనుభవాన్ని నేర్పు తాయి. అవే మనకు విజయాన్ని అందిస్తాయి.. అలా.. 

సీతారాం తన రూమ్ లో ఆలోచిస్తూ నేలమీదకు తదేకంగా చూడసాగాడు


ఒక చీమ తనకన్నా పది రెట్ల పెద్దదైన పంచదార పలుకు.. గెంటుకుంటూ వెళుతుంది తన గమ్య స్థానాని కి.. ఆ పంచదార పలుకు జారి పడి పోతుంది దూరంగా.. ఆ చీమ మళ్లీ ప్రయత్నిస్తుంది. ఆ పలుకు మళ్లీ పడిపోతుంది.. ఇలా అలా అలా జరుగుతూనే ఉంది.. చీమ మాత్రం విసుగు విరామం లేకుండా మొక్కవోని దీక్షతో తన ప్రయత్నం చేస్తూనే ఉంది.. అలా చాలాసేపు.. అలా ప్రయత్నించిన ఆ చీమ.. చివరికి విజయం సాధించింది. తను అనుకున్న చోటికి తన వాళ్ల కోసం ఆ అతి పెద్ద పంచదార పలుకును మోసుకు వెళ్ళగలిగింది.


ఆ దృశ్యం తదేకంగా చూసిన సీతారాం లో.. ఉత్సాహం ఉబికింది.. కర్తవ్యం బోధపడింది.. విజయం కళ్ళముందు కదలాడింది.. ఒక్క ఉదుటున పైకి లేచి.. ఒక శుభ ముహూర్తాన జీరో నుండి మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టాడు.. పరమపదసోపానం పటంలో నిచ్చెన ఎక్కడానికి.. డక్కా మొక్కీలు తిన్న సీతారాం ఈసారి దీక్షా కంకణ బద్ధుడై.. ఏకాగ్రతతో విజయం సాధించేశాడు. 


పరమపద సోపానపటం లో వందవ స్థానం పూర్తిగా ఆక్రమించ గలిగాడు. 


జై సీతారాం.. అతని అభిమానులంతా సంబరాలు చేసు కున్నారు. 


ఆ రోజు సీతారాం జన్మదినం.. 


చాలా సందడిగా ఉంది ఆ ఇల్లు.. 


అప్పుడు ఒక గొప్ప విచిత్రం జరిగింది


ఒక పెద్ద వయసు ఆవిడ నడుస్తూ లోపలకు వచ్చింది. లక్ష్మీ కళ తో ఉట్టిపడుతుంది ఆవిడ ముఖం!!


''సీతారాం.. నాయనా.. నువ్వు చేస్తున్న ఈ తెలుగు సాహితీ మహాయజ్ఞం.. నాకు ఆనందం కలిగి నేను నిన్ను నీ పుట్టినరోజు పూట దీవించడానికి వచ్చాను. చాలా దూరం నుండి వచ్చాను.. ఏమాత్రం స్వార్థ బుద్ధి లేకుండా నీ లాంటి ఒకరిద్దరు మాత్రమే ఇలాప్రయత్నించడం వల్లే.. నేను ఇంకా ఇలా తిరగగలుగుతున్నాను''.. అంది ఆవిడ. 


'' సరే.. అలా ఎందుకు ముసుగు పెట్టుకుని ఉన్నావు తల్లి.. ''.. అడిగాడు సీతారాం. 


''తెలుగుదేశాల్లో కొందరు స్వార్థ చింతనతో చేస్తున్న తెలుగు సాహిత్య సేవ కార్యక్రమాలు వల్ల, నేను తలెత్తు కుని తిరగలేక పోతున్నానయ్యా.. అందుకే ఈ ముసుగు.. కానీ మీ ఇంటి దగ్గర మాత్రం దర్జాగా ముసుగు తీసి తిరగ గలను. ''


''సరే ఇంతకీ మీరు.. ఎవరమ్మా? ''.. ఆతృతగా అడిగాడు సీతారాం. 


''చెప్తాను కానీ.. అలా చూడు నాయనా''


''అదేమిటమ్మా.. పరమపద సోపానపటం లో వంద మెట్లు కదా ఉంటాయి.. అవి నేను ఎక్కాను. కానీ ఇప్పుడు ఇంకా చాలా మెట్లు కనిపిస్తున్నాయి ఏమిటి.. ?'' విచిత్రం గా అడిగాడు సీతారాం. 


''ఆ రహస్యం చెప్దామనే కదా నేను ఇప్పుడు వచ్చింది.. నీలాంటి నిస్వార్థపరులకే ఆ మెట్లు అన్నీ కనిపిస్తాయి రా.. అంటే.. నువ్వు నీ విజయయాత్రని ఆపకుండా ఇంకా దిగ్విజయంగా కొన సాగించమని, మెట్టు మెట్టు అధిరోహించమని, నిస్వార్థ సాహితీ యజ్ఞం చేస్తూ నువ్వు మాత్రమే అధిరోహించగలవని, నీకు చెప్పడానికే వచ్చాను. అలా చేస్తానని నా చేతిలో చెయ్యి వేసి చెప్పు. చెయ్యి వేసావు కదా నాయనా సంతోషం. ఆ.. ఆ.. ఇది చాలు.. 


ఇప్పుడు.. నేను ఎవర్ని అని కదా అని అనుమానం.. 


నువ్వు నా ముద్దుల బిడ్డడివి.. నాకు బంగారం లాంటి కొడుకువి అన్నమాట.. ఈరోజు నిన్ను నీ తల్లి ఎలాగూ దీవిస్తుంది కదా.. అలాగే నిన్ను మనసారా దీవించడానికి వచ్చిన మరో పెద్దతల్లిని అనుకోవయ్య.. అయినా నా కళ్ళలోకి అలా చూడు. నేను నీకు ఎవరో తెలుస్తుంది. '' అంది ఆ పెద్దావిడ. 


అలాగే చేశాడు సీతారాం. 


అలా ఏకాగ్రతగా ఆమె కళ్ళలోకి చూస్తుండగానే ఆ తల్లిని అలా ప్రేమగా అభిమానంగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తుండ గానే ఆమె నెమ్మదిగా అదృశ్యమైపోయింది. 


అయితే తనను దీవించిన ఆమె ఎవరో సీతారాం మాత్రం.. గ్రహించగలిగాడు. 


ఆమె భరతమాత కూతురు.. '' తెలుగు తల్లి'' అని.. అర్థం చేసుకోగలిగాడు.


ఆ అమ్మ దర్శనంతో తన జన్మధన్యమైందని ఆనంద పార వశ్యం పొందాడు. 


ఇప్పటిలాగే ఎప్పుడూ నిస్వార్థ సాహితీయజ్ఞం చేస్తూనే ఉండాలని.. అమ్మ పేరు నిలబెట్టాలని మనసులో నిశ్చ యించుకున్నాడు సీతారాం. 


****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree



ree


ree

రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 






Comments


bottom of page