top of page
Original.png

సైనికుడా వందనం

దేశభక్తి కథ, తెలుగు కథ, భారత సైన్యం, అమర జవాన్, తండ్రి ప్రేమ, రంజిత్‌సింగ్, రోషిణి, విక్రమ్‌సింగ్, మానవత్వం, సైనిక గౌరవం, భావోద్వేగ కథ, ప్రేరణాత్మక కథ, తెలుగు వెబ్ కథ, patriotic Telugu story

Sainikuda Vandanam - Telugu Inspirational Family Story | Madhupatra Sailaja Uppaluri

సైనికుడా వందనం - తెలుగు ప్రేరణాత్మక కుటుంబ కథ| మధుపత్ర శైలజ ఉప్పలూరి  

Published in manatelugukathalu.com on 08/06/2026


దేశం కోసం ప్రాణత్యాగం చేసిన తన కుమారుడి జ్ఞాపకాన్ని హృదయంలో మోస్తూ, ప్రతి సంవత్సరం అతని పుట్టినరోజున ఒక యువకుడికి భోజనం పెట్టే రంజిత్‌సింగ్ జీవితం ఈ కథ. దేశభక్తి, మానవత్వం, సైనికుల పట్ల గౌరవం, తండ్రి ప్రేమ కలిసిన ఈ హృద్యమైన కథ పాఠకుల మనసులను కదిలిస్తుంది. ఒక చిన్న ధాబాలో ప్రారంభమైన ఆతిథ్యం ఎలా జీవితాన్ని మార్చిందో చెప్పే భావోద్వేగ గాథ ఇది.


“తాతా! ఇక ఎవరూ వచ్చేలా లేరు. మనం అన్నం తినేద్దామా? నాకు ఇంకా హోంవర్క్స్ చేసుకునే పని కూడా ఉంది” అంది రోషిణి.


“మా బుజ్జితల్లికి ఆకలేస్తోందా? పద, నువ్వు తినేసి నీ హోంవర్క్స్ పూర్తి చేసుకుని పడుకుందువు గాని. ఈలోపు నేను ఇంకా ఎవరైనా భోజనానికి వస్తారేమో చూసి, ఓ అరగంట తర్వాత తింటాలే” అంటూ మనవరాలిని లోపలికి పంపించి ఆలోచనలలో కూరుకుపోయాడు రంజిత్‌సింగ్.


ఈరోజు తన ఒక్కగానొక్క కొడుకు విక్రమ్‌సింగ్ జన్మదినం. వాడు చనిపోయి దాదాపుగా నాలుగేళ్లు అవుతున్నా, వాడి రూపం ఇంకా తన కళ్ళముందు సజీవంగా కదలాడుతూనే ఉంది. లేకలేక పుట్టిన తన కన్నయ్య పుట్టినరోజు తనకెంతో ప్రియమైన రోజు. అందుకే ఈ పుట్టినరోజునాడు వాడి వయస్సున్న ఏ యువకుడైనా తన ధాబాకి వచ్చి, అతనికి భోజనం పెట్టి, తన విక్రమ్‌కి ఇష్టమైన జిలేబి తినిపించి పంపించేదాకా తాను భోజనం చేయకూడదనే నియమం పెట్టుకున్నాడు. కొడుకు చనిపోయిన దగ్గర నుండి ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాడు రంజిత్‌సింగ్.


రంజిత్‌సింగ్ పఠానుకోట నుండి కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కి వెళ్ళే హైవే పక్కగా ఓ ధాబా పెట్టుకుని, వచ్చేపోయే ప్రయాణీకులకు ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అల్పాహారం, భోజన సదుపాయాలను తానే స్వయంగా వండి పెడుతున్నాడు. ఉదయం ధాబాకి వచ్చిన దగ్గర నుండి రాత్రి ధాబాను మూసేవరకూ ఎప్పుడూ ఖాళీగా ఉండడు. అతని భార్య విక్రమ్‌కి అయిదేళ్ళ వయస్సులో జబ్బుపడి మంచమెక్కింది మొదలు, తానే ఇంటిలో వంట చేయడం మొదలుపెట్టాడు. అందుకే రంజిత్‌సింగ్‌కి వంటావార్పు ‘వెన్నతో పెట్టిన విద్య’ అయ్యింది.


భారత సైన్యంలో పనిచేస్తూ దేశమాతకు సేవ చేయాలన్న తనకున్న కోరికను, పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలు మీద పడటంతో తాను చంపుకోవాల్సి వచ్చింది. సైనికుడు కావాలన్న తన తపనను కొడుకు ద్వారా తీర్చుకోవాలనే, వాడికి చిన్నతనం నుండి దేశ నాయకుల చరిత్రలు, వీరగాథలు చెబుతూ, భారత సైన్యంలో చేరేలా తానే ప్రేరేపించి, అందుకు కావలసిన ప్రోత్సాహాన్ని అందించాడు.


స్వతహాగా తెలివితేటలున్న విక్రమ్ 20 సంవత్సరాలకే చదువు పూర్తి చేసుకుని, సైనిక నియామక పరీక్షలను వ్రాసి ఉత్తీర్ణుడై, భారత సైన్యంలో సైనికునిగా ఉద్యోగం సంపాదించుకున్నాడు. కొడుకు సైన్యంలో చేరిన రోజున భరతమాత పాదల ముందు చిన్న పుష్పాన్ని తన వంతుగా సమర్పించినట్లుగా సంతోషపడ్డాడు రంజిత్‌సింగ్.


రంజిత్‌సింగ్ తన దూరపు బంధువుల అమ్మాయినే కోడలిగా తెచ్చుకున్నాడు. విక్రమ్‌కి పెళ్ళి జరిగిన సంవత్సరానికే తల్లి చనిపోయింది. ఆ దంపతులకు రోషిణి పుట్టింది. రోషిణి ప్రాథమిక పాఠశాల నుండి హైస్కూలు చదువుకు వచ్చేవరకు ఆ కుటుంబం ఏ ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా కాలం గడిపింది.


రోషిణి ఏడవ తరగతిలో ఉండగా వచ్చిన పుట్టినరోజుకి సెలవుపై వచ్చిన విక్రమ్, ఓ నెల రోజులు కూతురితో గడిపి తిరిగి డ్యూటీలో చేరిన కొద్ది రోజులకే, కాశ్మీర్ లోయలో చొరబాటుదారులుగా మన భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో అమరుడైపోయాడు. భర్త చనిపోవడంతో మనోవ్యాధితో మంచం పట్టిన రోషిణి తల్లి కూడా కూతుర్ని ఒంటరిదానిని చేసి భర్త దగ్గరకే వెళ్ళిపోయింది. అప్పటి నుండి రంజిత్‌సింగ్‌కి రోషిణి కంటిపాపయ్యింది.


ఈ వయస్సులో తనపై భగవంతుడు రోషిణిని పెంచి పెద్ద చేసే బాధ్యతను మోపటంతో, తన భుక్తి గడవటానికే కాక, రోషిణి చదువు, ఇతర అవసరాల కొరకు కూడా తాను ఏదో ఒక పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన స్నేహితులిచ్చిన సలహాతో తన దగ్గర ఉన్న సొమ్ము వెచ్చించి, మరికొంత అప్పు చేసి, హైవే ప్రక్కనే కొద్ది స్థలం కొని ధాబా పెట్టుకుని, ప్రయాణీకులకు భోజనం పెడుతూ వచ్చిన డబ్బులలో దినసరి ఖర్చులు, రోషిణి చదువు, తీసుకున్న అప్పు తీర్చటానికి కొంత ఖర్చు పెడుతున్నాడు.


ఈ రోజు విక్రమ్ పుట్టిన రోజు. ఉదయం నుండి పెద్దలు, పిల్లలు వచ్చి తింటున్నారే కానీ, విక్రమ్ వయస్సు వారెవరూ వచ్చి తినలేదు. విక్రమ్ ఫోటో వైపు చూసిన రంజిత్‌సింగ్‌ని "నాన్నా! ఈ రోజు నాకింకా భోజనం పెట్టలేదేమిటి?" అని ప్రశ్నిస్తున్నట్లుగా కనిపించాయి ఫోటోలోని విక్రమ్ కళ్ళు.


ఇంతలో ధాబా ముందు కలకలం. "ఆ! ఈ ధాబా తెరిచే ఉంది. పదండి! పదండి! మనకు భోజనం ఇక్కడ దొరకవచ్చు" అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఆ సందడికి హోంవర్క్ చేసుకుంటున్న రోషిణి, "తాతా! ఎవరో వస్తున్నారు" అంటూ సంతోషంగా అరుస్తూ పరిగెత్తుకొచ్చింది. తాత మనవరాళ్ళిద్దరూ బయటకొచ్చారు.


ధాబా ముందు మిలిటరీ ట్రక్ ఆగి ఉంది. దాన్లో నుండి బిలబిలమంటూ  కొంతమంది సైనికులు దిగి ధాబా దగ్గరకొస్తున్నారు.  భారత సైనికులను చూసిన రంజిత్‌సింగ్ కళ్ళు ఆనందంతో పత్తికాయలైనాయి. వాళ్ళకెదురెళ్ళి “రండి! సాబ్ రండి!”  అంటూ అప్యాయంగా ఆహ్వానించాడు.


అతని ఆహ్వానం ఆ సైనికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. సైనికులంతా ధాబాలోని బెంచీలపై వచ్చి కూర్చున్నారు. 


"రోషిణీ, అందరికీ మంచినీళ్లు అందించమ్మా. ఒక్క గంటలో వీళ్ళందరికీ భోజనం తయారు చేసి వడ్డించేద్దాం" అన్నాడు రంజిత్‌సింగ్ కూరగాయల గంపనందుకుంటూ. రోషిణి సాయంతో వచ్చిన వాళ్ళందరికీ విందు భోజనమే తయారు చేశాడు. రోషిణి తన చిన్ని చేతులతో అందరికీ వడ్డన చేసింది. భోజనాలు పూర్తయ్యాక మేజర్ చంద్రకాంత్ తనని తాను రంజిత్‌సింగ్‌కి పరిచయం చేసుకుని, "మేము ఇంత రాత్రివేళ వచ్చి మీకు చాలా ఇబ్బంది కలిగించాం. ఏమీ అనుకోవద్దు. ఇదిగో ఈ డబ్బు తీసుకోండి" అంటూ కొంత డబ్బు ఇవ్వబోయాడు.


"సార్! ఈరోజు నాకు దొరికిన విశిష్ట అతిధులు మీరు. చనిపోయిన నా కొడుకు విక్రమ్‌సింగ్‌ని మీ అందరిలో చూసుకుంటూ మీకు నేను భోజనం పెట్టాను. నాకు భారతీయ సైనికులంటే చాలా గౌరవం. మీరే ఈ దేశ ప్రజలకు అమూల్యమైన సంపద. మీరు చేసే సేవే మాకు, ఈ దేశానికి శ్రీరామరక్ష. నా కొడుకు కూడా భారత సైన్యంలో పనిచేస్తూ అమరుడైనాడు. ఇదిగో, ఈ జిలేబీ అంటే నా విక్రమ్‌కి ఎంతో ఇష్టం" అంటూ మేజర్ నోటికి అందిస్తూ, "మా అబ్బాయి పుట్టినరోజున ఇలా సైనికులకు ఆతిథ్యం ఇవ్వటం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. దానికి విలువ కట్టలేను. మీ దగ్గర డబ్బు తీసుకోలేను" అంటూ మేజర్ ఇస్తున్న డబ్బుని సున్నితంగా తిరస్కరించి, చంద్రకాంత్‌కి నమస్కారం చేశాడు రంజిత్‌సింగ్.


రంజిత్‌సింగ్ మాటలకు మేజర్ చంద్రకాంత్ చాలా ఆశ్చర్యపోయాడు. ఆ పక్కగా గోడకున్న విక్రమ్‌సింగ్ ఫోటోని చూస్తూ, "ఇంతటి దేశభక్తి ఉన్న తండ్రికి పుట్టినందుకు మీ విక్రమ్ ధన్యజీవి. అమరుడైన సైనికుని తండ్రి ఆతిథ్యాన్ని పొందిన మేము ఎంతో అదృష్టవంతులం. ఇంత చిన్న ధాబాలో, వేళ కాని వేళ వచ్చిన మమ్మల్ని మీ కొడుకులుగా భావించి ఇంత రుచికరమైన భోజనం పెట్టారు. డబ్బులిస్తే వద్దంటున్నారు. మా కోసం ఈ చిన్ని గుర్తును తీసుకోండి" అంటూ ‘సైనిక చిహ్నం’ రంజిత్‌సింగ్‌కి ఇస్తున్న మేజర్ చంద్రకాంత్ కళ్ళు చెమ్మగిల్లాయి. దానిని తీసుకున్న రంజిత్‌సింగ్, రోషిణి చాలా ఆనందపడ్డారు.


“కాకా! మేమెప్పుడు ఈ దారిగుండా వచ్చినా మీ దగ్గర ఆతిథ్యాన్ని తీసుకునే వెడతాం. అప్పుడు మాత్రం మా దగ్గర తప్పనిసరిగా డబ్బులు తీసుకోవాలి సుమా! శెలవ్!” అంటూ సైనికులు వెళ్ళిపోయారు.


“తాతా!  అంతమంది సైనికులు వచ్చి భోజనం చేసి వెళ్ళారు కదా, ఇప్పుడు నీకు సంతృప్తిగా ఉందా? ఇక నీకు నేను ముద్దలు చేసి తినిపిస్తాను” అంటూ తాతకి భోజనం తినిపించింది రోషిణి. 


“అవునమ్మా! మీ నాన్నే వీళ్ళ రూపంలో వచ్చి కడుపారా భోజనం చేసి వెళ్ళాడు. ఆ తృప్తి నాకు ఇంకో ఏడాది ఆయుష్షునిస్తుంది. పద, హాయిగా పడుకుందాం” అంటూ రోషిణిని మంచం దగ్గరికి నడిపించాడు రంజిత్‌సింగ్.


ఋతువులు మారి వర్షాకాలం వచ్చింది. రంజిత్‌సింగ్ ధాబా పాతది కావటంతో వెదురు బొంగులు, చెక్కలు వానలకి చీకిపోయి ఇల్లంతా నీటితో తడిసి, నానిపోసాగింది. ఒకరిద్దరు తప్ప, వానలకు జనాలు ఈ ధాబావైపు తొంగి చూడటమే లేదు. రోజువారీ ఖర్చులకే ఆదాయం చాలటంలేదు. ఊళ్ళో షావుకారు వద్ద తీసుకున్న అప్పుకు వడ్డీ కట్టాలన్నా సాధ్యపడటంలేదు.


ఓ రోజు ధాబా దగ్గరకొచ్చిన షావుకారు, "ఏం రంజిత్‌భాయ్! నా దగ్గర తీసుకున్న డబ్బులకి అసలు మాట దేవుడెరుగు, వడ్డీ కట్టి కూడా మూడు నెలలపైనే అయ్యింది. ఇక నీవు ఆ అప్పుని కట్టే స్థితిలో లేవుగానీ, ఈ స్థలం నీ అప్పు క్రింద నాకు రాసివ్వు" అంటూ తన మనుషులతో వచ్చి దౌర్జన్యం చేయబోయాడు.


చుట్టుపక్కల జనమంతా గుమిగూడి, "సేటూ! పాపం పెద్దాయనను ఇబ్బంది పెట్టకు. కొడుకు, కోడలు పోయాక ఈ చిన్న వ్యాపారంతో ఏదో నలుగురికి భోజనం పెడుతూ, పాపను పెంచుతూ, చదివిస్తూ కాలం గడుపుతున్నాడు. ఈ వానలతో అసలు తిండికే ఆదాయం రాకుంటే, నీ అప్పు ఎలా తీరుస్తాడు? కాస్త ఓపిక పట్టు. ముసలాయనకి కొంచెం సమయం ఇవ్వు. ఎండా కాలం రాగానే నీ డబ్బు నీ కిచ్చేస్తాడులే! అయినా నీకేం డబ్బులకు తక్కువా ఏమిటి?" అంటూ సర్ది చెప్పారు.


దానికి షావుకారు, "దారిన వచ్చిపోయే వాళ్ళకి భోజనాలు పెట్టటానికి నీ దగ్గర డబ్బులుంటాయి గానీ, నా అప్పు తీర్చటానికి మాత్రం ఉండవు. అయినా వీళ్ళంతా నీ పక్షాన మాట్లాడుతున్నారు. అందుకే ఓ నెల రోజులు గడువు ఇస్తున్నాను. ఈలోపుగా నీ అప్పు తీర్చలేకపోతే ఈ స్థలం నా సొంతమవుతుంది జాగ్రత్త. అందుకు ఇప్పుడు నీ పక్షాన మాట్లాడిన జనాలే సాక్షులు" అంటూ అప్పటికి వెళ్ళిపోయాడు.


ఆ రాత్రి రంజిత్‌సింగ్ రోషిణి చెయ్యి పట్టుకుని, "తల్లీ! నీ అమ్మానాన్నలకు నిన్ను డాక్టర్ కోర్స్‌లో చేర్పించాలని చాలా కోరిక ఉండేది. మిలిటరీ డాక్టర్‌గా నువ్వు సైనికులకు సేవలు అందిస్తూ ఉంటే చూడాలని ఎంతగానో అనుకునేవారు. ఇప్పుడున్న పరిస్థితులలో నిన్ను పదవ తరగతి వరకైనా చదివించగలనా నేను?" అంటూ బాధపడ్డాడు.


"ఫర్వాలేదు తాతా! నాకు నువ్వు తప్ప ఈ లోకంలో మరెవ్వరూ లేరు. నా గురించి ఎక్కువగా బాధపడకు. మేమిద్దరం కలిసి ఏదో ఒక పని చేసుకుని బ్రతుకుదాం. ఆలోచనలతో నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఆ దేవుడి అనుగ్రహం ఉంటే అన్నీ చక్కగా జరుగుతాయి" అంటూ రోషిణి రంజిత్‌సింగ్‌కి ధైర్యాన్ని ఇచ్చింది. అంతలో ధాబా ముందు ఎవరివో మాటలు వినిపించాయి. గబగబా ఇరువురు తలుపులు తెరిచి బయటకొచ్చారు.


ధాబా ముందు వరుసగా మిలిటరీ ట్రక్కులు వచ్చి ఆగాయి. వాటిలో నుండి సైనికులు దిగుతున్నారు. ట్రక్కుల వెనుకనే వచ్చిన జీప్ నుండి మేజర్ చంద్రకాంత్, కల్నల్ కులదీప్‌లు దిగి వీరి ధాబా దిశగా వస్తున్నారు.  


“బాబూజీ! ఎలా ఉన్నారు? మేము ఓ వందమందిమి ఉంటాం. ఈ పూట మీ చేతి భోజనం చేయటానికే వచ్చాం. ఇంతమందికి వంటలెలా చేయాలా అని మీరు భయపడకండి. మా వాళ్ళంతా ఈసారి మీకు సాయం చేస్తారులెండి” అన్నాడు మేజర్ చంద్రకాంత్  నవ్వుతూ. 


కానీ రంజిత్‌సింగ్ తలవంచుకుని నిలబడిన తీరు, కొన్ని నెలల క్రితమే చూసినట్లు లేని రోషిణి రూపురేఖలను గమనించిన చంద్రకాంత్ రోషిణిని ప్రక్కకు పిలిచి, "ఏమయ్యిందమ్మా? మీకేమయినా ఇబ్బంది వచ్చిందా? తాతా ఆరోగ్యం బాగుందా? నీ చదువు ఎలా సాగుతోంది?" అంటూ ఆదుర్దాగా అడిగాడు మేజర్ చంద్రకాంత్.


దాంతో రోషిణి ఏడుస్తూ తన సొంత బంధువులకు చెప్పుకున్నట్లుగా, "ధాబా సరిగా నడవకపోవటంతో తమకిప్పుడు ఆదాయం ఏమాత్రమూ లేదని, ఈ స్థలాన్ని షావుకారికి అప్పు కింద ఇచ్చేసి వేరే పనులు చూసుకుని త్వరలో ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాం" అని బాధపడుతూ తమ కష్టాలను విడమరచి చెప్పింది.


అన్నీవిన్న చంద్రకాంత్,  “వీరిని ఆర్ధికంగా మనం ఆదుకుందాం సార్” అంటూ రంజిత్‌సింగ్ కుటుంబ పరిస్థితిని సవివరంగా కల్నల్‌గారికి చెప్పాడు. 

 

చంద్రకాంత్ మాటలను విన్న కల్నల్, "ఔను చంద్రకాంత్! తనకాదాయం లేకున్నా తన దగ్గర ఉన్న కొద్ది డబ్బుని వినియోగించి ఒకపూట సైనికుల కడుపు నింపిన ఈ రంజిత్‌సింగ్ త్యాగాన్ని మనం డబ్బుతో సరిపోల్చగలమా? కొడుకుని భారత సైన్యంలోకి పంపించిన ఇతని దేశభక్తికి మనం విలువ కట్టగలమా చెప్పండి?" అంటూ ఓ జవాన్‌ని పిలిచి జీప్‌లో ఉన్న బ్రీఫ్‌కేస్ తెప్పించుకుని రంజిత్‌సింగ్‌కి అప్పు ఇచ్చిన షావుకార్ని పిలిపించి, "నీవేనా ఈ పెద్దాయనను బెదిరించి ఈ ధాబాను సొంతం చేసుకుందామని చూసింది? రంజిత్‌సింగ్ బాకీ కింద ఇవ్వాల్సిన మొత్తమెంతో చెప్పు?" అని అడిగారు.


“అయ్యా! ఈ రంజిత్‌సింగ్ నాకు ఇవ్వాల్సిన మొత్తం వడ్డీతో కలిసి ఇరవై అయిదువేలు అయ్యింది” అన్నాడు షావుకారు.


"ఇదిగో ఆ మొత్తం. ఇక నీవిక్కడ కనిపించకు" అంటూ షావుకారు చేతిలో డబ్బును పెట్టారు కల్నల్. రంజిత్‌సింగ్ వైపు తిరిగి, "ఇక నీవిక్కడ హాయిగా ఉండొచ్చు. ఈ రాత్రికి మనం కలసి భోజనం చేద్దాం" అని తన సిబ్బందితో వంటకు కావలసిన సరుకులు తెప్పించి, రంజిత్‌సింగ్ సాయంతో వంటను పూర్తి చేసి భోజనం చేశారు.


ఆ రాత్రి సైనికులకు హుషారును కలిగిస్తూ తాత నేర్పించిన దేశభక్తి గీతాలను తన కోకిల కంఠ స్వరంతో పాడి వినిపించింది రోషిణి. ఆ చిన్న పిల్లకి కూడా తాత దేశభక్తిని నిత్యం నేర్పిస్తున్నందుకు కల్నల్‌గారు ఎంతో ఆనందించారు. 


మరో నెల రోజులకే పాత ధాబా స్థానంలో ఆధునిక వసతులతో అందమైన విద్యుత్‌దీపాల కాంతులతో పునర్నిర్మితమైన ‘విక్రమ్‌సింగ్ ధాబా’ ఆ జాతీయ రహదారి ప్రక్కన ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది. రోషిణి సైనిక స్కూలులో చదువుకోవటానికి డెహ్రాడూన్‌కి వెళ్ళింది. కల్నల్‌సార్ కల్పించిన ఆసరాతో కొడుకు చింతన తప్ప మరేవిధమైన ఆలోచనలు లేని రంజిత్‌సింగ్, "సైనిక వాహనాలు మరలా ఎప్పుడొస్తాయా?" అని ఎదురుచూస్తున్నాడు.


*****     

మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి


ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు.  గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు  నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page