సాక్ష్యం
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- 4 days ago
- 4 min read
#Sakshyam, #సాక్ష్యం, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguHeartTouchingStories

Sakshyam - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 14/08/2025
సాక్ష్యం - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
‘మన న్యాయ దేవత!!??..
సుప్రీంకోర్టులో కొత్త న్యాయదేవత విగ్రహ ప్రతిష్ట 21వ తేది అక్టోబర్ నెల 2024 ప్రతిష్టించడం జరిగింది. శ్రీ సిజేఐ చంద్రచూడ్ గారి ఆదేశాల మేరకు పాత విగ్రహానికి కొన్ని మార్పులు చేస్తూ న్యాయమూర్తుల లైబ్రరీలో దీనిని ఆవిష్కరించారు.
న్యాయదేవత విగ్రహంలో అంతకుముందు కళ్ళకు గంతలు, రెండు చేతుల్లో భాగంగా కుడిచేతిలో త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం వుండేది.
అయితే.. నూతన విగ్రహంలో కళ్ళకు గంతలు తొలగించారు. అలాగే ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగ పుస్తకాన్ని వుంచారు. జిల్లా కోర్టు జడ్జి సత్యానందరావు ఆ గతాన్ని తలచుకొంటూ సోఫాలో కూర్చున్నారు. టీపాయ్‍పైన వున్న దినపత్రిక ’భారత అవని’ ని చేతికి తీసుకొన్నారు.
మనది హైందవ మతం. ఈ దేశం సనాత ఆర్య ఋషి పరంపరగా కృత యుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, గడచిపోయాయి. కృతయుగ కాలం 17, 28, 000 సంవత్సరాలు. త్రేతాయుగకాలం (శ్రీరామచంద్రమూర్తి కాలం) 12, 96, 000 సంవత్సరాలు. ద్వాపర యుగము (శ్రీకృష్ణ పరమత్మ కాలం) 8, 64, 000 సంవత్సరాలు. ప్రస్తుతం నడుస్తూన్నది కలియుగము. యుగకాలము 432000 సంవత్సరాలు.
ఇంతవరకూ జరిగిపోయిన కాలం 5122 సంవత్సరాలు. ఈ కలియుగం క్రీస్తు పూర్వం 3102 లో ప్రారంభమైనదని విజ్ఞులైన మన పెద్దల (హైందవుల) విశ్వాసం.
క్రిస్టియానిటీ మత జననం 2000 సంవత్సరాల క్రింద జరిగినది.
ఇస్లామ్ మత జననం 1400 సంవత్సరాల క్రింద జరిగినది.
పై నిదర్శనముల వలన అందరూ గ్రహించవలసిన విషయం హైందవ మతం కడు ప్రాచీనమైనది. ఎంతో గొప్ప చరిత్ర కలది. విమర్శలకు అతీతమైనది.
ఎవరైనా ఒక విషయంలో చర్చ, విమర్శ సాగించాలంటే అర్హత, ఆ విషయం యొక్క ఆది అంతములు కూలంకుషంగా ఎరిగి వుండవలయును. సౌభాతృతం సదా అందరికీ సంతోషదాయకం. అందరూ త్రాగేనీరు, శ్వాసించేగాలి, వాడే అగ్ని, నడిచే నేల (భూమి) వీక్షించే ఆకాశం.. వీటికి కులం లేదు.. మతం లేదు అవి అందరినీ సమదృష్టితో చూచి వర్తించునవి. పంచ భూతాలు (భూతం అంటే శక్తి) జగత్ కర్త నిర్దేశకం.
’ఏది గొప్ప!?.. చెవులా!.. కొమ్ములా?.. అనే ప్రశ్నకు
జవాబు ప్రశ్నలోనే, ఆలోచిస్తే వుంది కదా!.. ఆలోచించండి.
సంపాదకులు ఆచార్య శ్రీరామ్’
సంపాదకీయాన్ని జడ్జి సత్యానందరావు గారు చదవడం ముగించారు.
వారి అర్థాంగి కాత్యాయని చిరునవ్వుతో కాఫీ గ్లాసును అందించింది. జడ్జిగారి ముఖంలో ఏదో కలవరం. ఇరవై సంవత్సరాలు వారితో సహాజీవనం చేసిన కాత్యాయని సోఫాలో వారి ప్రక్కన కూర్చొని సత్యానందరావు గారి ముఖంలోకి పరీక్షగా చూచింది.
సాలోచనగా కాఫీని త్రాగి జడ్జిగారు కప్పును టీపాయ్‍పై వుంచి తదేకంగా తనను చూస్తున్న అర్థాంగి ముఖంలోకి చూచారు.
ఆమె వదనంలో చిరునవ్వు..
’కాత్యా!.. ఏమిటి అలా చూస్తున్నావ్?"
"మీరు ఏదో విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు కదూ!.. " చిరునవ్వుతో అడిగింది.
"అవును!.. "
"ఆ విషయం ఏమిటో నేను తెలిసికోవచ్చా!"
"రేపు నేను చెప్పవలసిన తీర్పు!.. "
"తీర్పు చెప్పడం ఈనాడు మీకు ఏమీ కొత్తకాదుగా!.. పది సంవత్సరాలుగా మీరు చేస్తున్న పనే కదా అది!.. " ప్రశ్నార్థకంగా భర్త ముఖంలోకి చూచింది కాత్యాయని.
"ఇంతకు ముందు చెప్పిన తీర్పులకు ఈరోజు నేను చెప్పబోయే తీర్పుకు వ్యత్యాసం వుంది కాత్యా!.. "
"అంటే!.. "
"సాక్షుల మూలంగా న్యాయానికి వ్యతిరేకంగా అధర్మాన్ని సమర్థించి చెప్పవలసిన తీర్పు. "
"కాస్త వివరంగా చెప్పగలరా!.. "
హంతకుడు అని సాక్షుల మూలంగా నిరూపించబడిన పాతికేళ్ళ యువకుడు విద్యావంతుడు చంద్రశేఖర్ అనే వ్యక్తిని నేను నేరస్థుడిగా భావించి తీర్పు చెప్పవలసిన పరిస్థితి!.. " నిట్టూర్చాడు విచారంగా జడ్జిగారు.
"అతడు నిర్ధోషి అని మీరు ఎలా నమ్ముతున్నారు?"
"నా అనుభవంతో, నేను ఒక వ్యక్తిని చూచి, అతని మాటలను విన్న తరువాత, అతను నిజం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా అని నేను గ్రహించగలను కాత్యా!"
"అంటే, అది ఫేస్ రీడింగ్ కదా!.. "
"అవును. పద.. టిఫిన్ పెట్టు. కోర్టుకు టైమ్ అవుతూ ఉంది" సోఫా నుంచి లేచాడు సత్యానందరావు. డైనింగ్ టేబుల్‍ను సమీపించాడు.
కాత్యాయని వంట ఇంటివైపుకు నడిచింది.
సత్యానందరావు గారు టిఫిన్ చేసి తన గదికి వెళ్ళి డ్రస్ మార్చుకొని మేడమీది నుండి క్రిందికి దిగారు.
"కాత్యా!.. "
కాత్యాయని వారికి ఎదురుగా నిలబడింది చిరునవ్వుతో.
ప్రతిరోజూ కోర్టు దినాల్లో సత్యానందరావుకు కోర్టుకు వెళ్ళే సమయంలో, వారికి ఎదురు రావడం కాత్యాయనికి అలవాటు.
"వెళ్ళొస్తాను కాత్యా!.. "
"మంచిదండీ!.. "
సత్యానందరావు పోర్టికోలో వున్న తన కార్లో కూర్చున్నాడు.
డ్రైవర్ ఫకీర్ డ్రైవర్ సీట్లో కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. కాత్యాయని కుడిచేతిని పైకెత్తి సత్యానందరావుకు బై చెప్పింది.
కారు భవంతి ఆవరణం దాటి వీధిలో ప్రవేశించింది. అరగంటలో కోర్టు ఆవరణంలో ప్రవేశించింది.
సమయం పదిగంటలు..
జడ్జి సత్యానందరావు గారు కారు దిగి కోర్టులో ప్రవేశించి క్రింద వున్న లాయర్స్ కు, పబ్లిక్‍క్కు నమస్కరించి తన స్థానంలో కూర్చున్నారు.
అమీనా.. కేసు పేపర్సును జడ్జిగారి ముందు వుంచారు.
కొన్ని క్షణాలు ఆ పేపర్స్ ను పరీక్షించి..
"లాయర్ జగన్నాథ్!.. ప్లీజ్ ప్రొసీడ్.. " అన్నారు జడ్జిగారు.
లాయర్ జగన్నాథ్ జడ్జిగారి ముందు నిలబడ్డాడు.
అమీనా.. ‘కేస్ / చంద్రశేఖర్ నెంబర్’ 320 /24 ముద్దాయి చంద్రశేఖర్.. ముద్దాయి చంద్రశేఖర్.. రెండుసార్లు పిలిచాడు. పోలీసులు ఇరువురు మధ్యన చంద్రశేఖర్ కోర్టులో ప్రవేశించి బోనులో నిలబడ్డాడు.
తైల సంస్కారం లేని తలజుట్టు, గడ్డం, మాసిన బట్టలు, విచారవదన.. బోన్‍లో వున్న చంద్రశేఖర్‍ను కొన్ని క్షణాలు పరీక్షగా చూచాడు జడ్జి సత్యానందరావు.
"మైలార్డ్!.. బోనులో వున్న ఈ ముద్దాయి చంద్రశేఖర్ పగ కక్ష కార్పణ్యాలతో ధనుంజయరావును అతను నిద్రపోతున్న సమయంలో అతని బెడ్ రూములో ప్రవేశించి అతన్ని అతి దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అతని ఆ చర్యకు అవసరమైన సాక్ష్యాధారాలను సాక్షులను నేను పోయినసారి కోర్టువారికి సమర్పించాను. కనుక తమరు, ధనుంజయరావును అర్థరాత్రి సమయంలో అమానుషంగా చంపిన చంద్రశేఖర్‍కు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 299-377 ప్రకారం కఠిన శిక్ష విధించవలసినదిగా కోర్టువారిని కోరుచున్నాను. దటీజ్ ఆల్ మై లాడ్!.. " లాయర్ జగన్నాథ్ తన ప్రసంగాన్ని ముగించి వెళ్ళి తన స్థానంలో కూర్చున్నాడు.
జడ్జీగారు చంద్రశేఖర్ వైపు చూచారు.
"మిస్టర్ చంద్రశేఖర్!.. మీరు కోర్టు వారికి ఏమైనా చెప్పుకోవాలని వుందా!"
చంద్రశేఖర్ వంచిన తాను పైకెత్తి.. ఏమీ లేదన్నట్లు తలను అటూ ఇటూ త్రిప్పాడు.
"ఏమీ లేదా!.. " జడ్జిగారి ప్రశ్న.
"లేదు సార్!.. " మెల్లగా చెప్పాడు చంద్రశేఖర్.
జడ్జిగారు ఆశ్చర్యంతో చంద్రశేఖర్ ముఖంలోకి చూచారు. గ్యాలరీలో వున్నవారంతా చంద్రశేఖర్‍ను ఆశ్చర్యంగా చూచారు.
అతని ఆత్మీయులు సీతాపతి, వారి కూతురు సావిత్రి, తండ్రి పద్మనాభయ్య, స్నేహితుడు ప్రతాప్ విచారంతో కన్నీరు కార్చారు.
పబ్లిక్ ప్రొసిక్యూటర్ ధర్మారావు బోనులో వున్న చంద్రశేఖర్ను సమీపించి మెల్లగా ఏదో చెప్పారు.
కానీ.. చంద్రశేఖర్ విరక్తిగా నవ్వుతూ తలను అడ్డంగా త్రిప్పాడు.
విచారవదనంతో ధర్మారావు గారు వెళ్ళి వారి స్థానంలో కూర్చున్నారు.
కోర్టులో జనాల కలకలం.. ఏవేవో మాట్లాడుకొంటూ అలజడి..
"ఆర్డర్.. ఆర్డర్.. " సుత్తితో తన టేబుల్ పై వున్న ప్యాండ్ పై మూడుసార్లు కొట్టారు జడ్జిగారు.
"ముద్దాయి చంద్రశేఖర్ తనపైన మోపబడిన హత్యానేరాన్ని అంగీకరించిన కారణంగా భారతీయ శిక్షాస్మృతి చట్టం సెక్షన్ 377 ప్రకారం, ముద్దాయికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించడమైనది" అది జడ్జిగారి తీర్పు.
వారు తన ముందు ఫైల్లో వ్రాసిన దాన్ని చదివి, ఆ పెన్ నిబ్ ను విరిచారు జడ్జిగారు.
"నౌ ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ !.. " తన స్థానం నుండి లేచి లోనికి వెళ్ళిపోయారు.
’న్యాయదేవత బొమ్మను మార్చినంత మాత్రాన నేరస్థులని పిలువబడేవారికి కోర్టులో న్యాయం జరుగదు. ఆ బొమ్మ ఎడం చేతిలో వుండవలసింది రాజ్యాంగ పుస్తకం కాదు, భగవద్గీత. కారణం భారత రాజ్యాంగ చట్టాలలో కొన్నింటికి సవరణం అవసరం. కానీ భగవద్గీతలో లేనిదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సాక్షాలకు భయపడి నిర్దోషి దోషిగా ఒప్పుకొన్నాడు. స్వాతంత్ర్యంలో బండ్లు ఓడలైనాయి. ఓడలు బండ్లయినాయి. చట్టానికి కావలసింది సాక్ష్యం అనే నేపధ్యంలో నేను తప్పుడు తీర్పును ఇచ్చాను. సింహం మెడలో గంటను కట్టాల్సింది ఎవరు??’ విచారంగా అనుకొంటూ జడ్జిగారు తన కారువైపుకు నడిచారు.
పోలీసులు చంద్రశేఖర్‍ను వ్యాన్‍లో ఎక్కించుకొని జైలుకు తీసుకొని వెళ్ళారు.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments