సలలిత రాగసుధ
- Varanasi Venkata Vijayalakshmi
- 2 days ago
- 7 min read
#Vijayasundar, #విజయాసుందర్, #SalalithaRagasudha, #సలలితరాగసుధ, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Salalitha Ragasudha - New Telugu Story Written By Vijayasundar
Published In manatelugukathalu.com On 08/10/2025
సలలిత రాగసుధ - తెలుగు కథ
రచన: విజయా సుందర్
"ఎప్పటినుండి మీ పరిచయం? అసలు ఎలా పరిచయమయింది?" కొడుకు విరించి తన ప్రేమ గురించి చెప్పింది విన్నాక, తన అనంగీకారం మనసులోనే నొక్కిపెట్టి, ఎంతో సంయమనాన్ని సమీకరించుకుని ప్రశ్నించింది వనజ.
"నా ఫ్రెండ్ గౌతమ్ పిన్ని కూతురు లాస్య. వీళ్ళ ఇంటిదగ్గరే ఉంటారు. తరుచుగా అక్కడికి వస్తున్నప్పుడు స్నేహం ఏర్పడి, ఇద్దరికీ పరస్పరం అభిరుచులు కలిసి ఒక ఏడాది స్నేహం తరవాత ఇప్పుడు నిర్ణయించుకున్నాము" అన్నాడు.
'ఓహో నిర్ణయం అయిపోయి, ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే అన్నమాట'
మనసంతా కలచి వేసినట్లయింది.
ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఒక అయిదునిమిషాలు గడిచాక, వనజ, "సరేలే, ఆ అమ్మాయి కూడా వాళ్ళ ఇంట్లో చెప్పాలి. ఇంకా ఆ అమ్మాయి పరీక్షలవ్వాలి కదా.. చూద్దాం"
అప్పటికి ఆ విషయానికి తెరపడ్డది.
***
విరించి దగ్గర ఏమీ మాట్లాడలేదు, తన మనసులో చెలరేగే తుఫాను ఆపలేకపోతున్నది వనజ. 'ముప్పైయ్యేళ్ళ వయసులో భర్త అర్ధాంతరంగా చనిపోతే, చదువులేని తను పిల్లవాణ్ణి అష్టకష్టాలు పడి ఇంజనీర్ని చేయగలిగింది. ఇప్పుడు 'అమెజాన్' లో మంచి పొజిషన్ లో ఉన్నాడని, ఇప్పుడిప్పుడే బంధువులు కాస్త తమని కలుపుకుంటున్నారు. ఇప్పుడు వీడు ఇలా వేరే కులంలో పెళ్లి చేసుకుంటే మళ్ళీ వెలివేయబడతాము. ఎవరూ లేకుండా ఉండటం అంత తేలికేమీ కాదని అనుభవించిన తనకి తెలుస్తుంది'..
'పోనీ పిల్లవాడి సుఖంకన్నా ఇంక ఏదీ ఎక్కువ కాదనుకున్నా, తనకి తెలిసి, గౌతమ్ వాళ్ళు మాంసాహారులు. వీడు హోటల్ లో పక్కవాళ్ళు తింటేనే వాంతి చేసుకునేవాడు.
అప్పటినుండే కదా శాకాహారం మాత్రమే ఉండే హోటళ్ళు వెతుక్కుని వెళ్తున్నాము. మేమా రాధాస్వామీ సత్సంగం వాళ్లము, విగ్రహారాధన నిషిద్ధం. తను సత్సంగీ కాదు. వీడేమో ఇనీషేయషన్ తీసుకున్నాడు. ఇంత ప్రధానమైన వాటిల్లో ఇంత వ్యత్యాసముంటే ఎలా జరుగుతుంది జీవితం? అన్నీ ఒక్కటే రకంగా ఉంటేనే బోలెడు సర్దుబాట్లు, దిద్దుబాట్లు. భగవంతుడా ఎందుకు ఇలా సమస్యలు కొని తెచ్చుకుంటారు?'
వనజకి అసలు ఏమీ పాలుపోవడం లేదు.
'వీడు ఏమీ చెప్పలేదంటే ఆ అమ్మాయి తినదేమో' అంతలోనే ఓ చిరుఆశ.
'ఏమో గురువుగారే దారి చూపించాలి. ప్చ్. హాయిగా సత్సంగి పిల్లలు ఎంత మంది ఉన్నారు. వాళ్లల్లో ఎవరినన్నా ప్రేమించవచ్చే. ' ఆలోచలేవీ ఓ కొలిక్కి రాక, ఆఖరికి 'గురువుగారి పాదాల దగ్గర పెట్టేస్తున్నాను. ఆయనే చూసుకోవాలి ' అనుకుంటూ గురువుగారి శబ్దం పాడుకుని ఒంటిగంటకి పడుకున్నది.
***
లాస్య, ఆ రోజు తన కజీన్స్ కి విరించిని పరిచయం చెయ్యాలని తామందరూ వెళ్తున్న హోటల్ కి రమ్మని ఫోన్ చేసింది.. " ఈ రోజు సత్సంగం ఉన్నది కదా, నేను రాలేను లాస్యా. వాళ్ళు ఇంకా ఉంటారంటే రేపు మనం హోటల్ లో హోస్ట్ చేద్దాము"అన్నాడు.
"వాళ్ళు రేపు పొద్దునే వెళ్ళిపోతారు. ఈ వారం వెళ్ళకపోతే ఏమవుతుంది సత్సంగానికి? "
లాస్య మాటలకి విరించికి సర్రున కోపం వచ్చింది. ఎవరన్నా సత్సంగానికి వెళ్లకపోతే ఏమవుతుంది అంటే భరించలేడు. అయినా తమాయించుకుని, "ఒక పర్టిక్యులర్ నెంబర్ లేనిది ఆ రోజు సత్సంగం జరగలేదు. ఆ కౌంట్ లో ఒక్క నంబర్ తగ్గింది. సో నేను తప్పనిసరిగా వెళ్ళాలి. లేకపోతే అంతమందిని నిరాశపర్చాలి"
"అది నువ్వే ఎందుకు అవ్వాలి విరీ? "
తీవ్రతరమౌతున్న సంభాషణను జాగ్రత్తగా హ్యాండిల్ చెయ్యాలని విరించి చాలా ఓర్పు వహించి, "అందరూ సెలవలకి వెళ్లారు లాస్యా. అర్థం చేసుకోకుండా సాగదీస్తావేమిటీ?"
"ఎప్పుడూ ఇంతే నువ్వు, ఎన్నిసార్లు ఈ సత్సంగం కోసం ఎన్ని ప్రోగ్రామ్స్ మిస్ చేయించావో. అసలు నీకు నా కన్నా వాళ్లందరి తోటి కలవడం ఎక్కువా? రాక రాక వచ్చారు, సరదాగా వెల్దామంటే రానంటున్నావు"
విరించి కోపం పట్టలేకపోయాడు, "ఏమ్మాట్లాడుతున్నావు నువ్వు.. అందరితో కలవడం ఏమిటి? ఇది సరదా కాలక్షేపం కాదు, దేవుడు వ్యవహారం. కొంచెం ఆలోచించి మాట్లాడు. " చాలా కోపంగా అన్నాడు.
లాస్య, "అయితే రావా? నా మాట నేను పోగొట్టుకోవాలి ఇక్కడ అందరి ముందు. అందరూ ఏడిపిస్తారు పెళ్లి కాకుండానే నీకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదంటే అంటూ"
"టు హెల్ విత్ యువర్ కజిన్స్ అండ్ యు. నీ ఇష్టమొచ్చినట్లనుకో. నేను పెట్టేస్తున్నాను. అయినా నీకు ఒక్క ఛాయస్ ఇస్తున్నాను. రేపు పొద్దున ఎయిర్పోర్ట్ కి తొందరగా రమ్మను, అక్కడ కలిసి
బ్రేక్ఫాస్ట్ చేద్దాము " విరించి విసురుగా ఫోన్ పెట్టేసాడు.
విరించి మనసంతా చేదు తిన్నట్లుగా అయింది. సత్సంగంలో రెండు శబ్దాలు పాడాక కుదుటబడ్డది.
'ఎలా హ్యాండిల్ చెయ్యాలి ఇటువంటి పరిస్థితిని ముందు ముందు?' పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్నగా నిలబడ్డది.
వారం రోజులు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఆరోజు ఇద్దరికీ మనసులోని కోపాలు చల్లారి ఇద్దరూ ఒకేసారి నంబర్లు తిప్పారు, తిట్టుకున్నారు ఎవరితో గంటలు గంటలు మాట్లాడున్నది అని, మాట్లాడుతాడు అని. మెస్సెజ్ చేసుకున్నారు ఇద్దరూ ఒకేసారి సారీలతో.
ఒక మామూలు స్నేహితుడి లాగ మిగిలిన స్నేహితులతో కలిపి తన పుట్టినరోజున విరించిని ఇంటికి ఆహ్వానించింది లాస్య.
భోజనాలు చేస్తున్నారు. అంతటి గ్రాండ్ పార్టీలో మందు, మాంసాహారం లేని అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ల పార్టీ ఉండదు కదా. బలవంతాన భరిస్తున్నాడు విరించి ఆ వాతావరణాన్ని. ఇంతలో ప్లేట్ పట్టుకుని తను జ్యూస్ తాగుతున్న టేబుల్ దగ్గరకు గొప్ప ఇండస్ట్రియలిస్ట్ పరుశురాం గారబ్బాయి శేఖర్ వచ్చి కూర్చున్నాడు.
తనతో పాటు కూర్చున్న లాస్య అతనికి లేచి షేక్ హాండ్ ఇచ్చి, విరించిని పరిచయ చేసింది. ఎడంచేత్తో మందు గ్లాస్ పట్టుకుని కుడి చేత్తో షేక్ హాండ్ ఇచ్చాడు శేఖర్. టేబుల్ మీద పెట్టిన మాంసాహారం, చేతిలోని ద్రవం వాసన కలిపిన విచిత్ర వాసనకి, విరించికి కడుపులోకి దిగుతున్న జ్యూస్ నోట్లోకి వచ్చేస్తున్నట్లు అయింది.
అతి కష్టం మీద ఆపుకున్నాడు. వెంటనే ఎక్స్క్యూజ్ చెయ్యమంటూ బాత్రూమ్ లోకి వెళ్ళిపోయాడు. హాల్లోకి రాగానే అందరూ సీసాలు పైకెత్తి చీర్స్ చెప్పుకుంటుంటే మళ్ళీ ఆ వాసనకి విరించికి తల తిరుగుతున్నట్లయింది. ఇంక ఇంటికి వెళ్లిపోవాలని బైటకు వచ్చాడు. లాస్యకి ఫోన్ చేసి విషయం చెప్పాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా తను ఫోన్ ఎత్తలేదు. ఇంక మెసేజ్ పెట్టేసాడు తన ఇబ్బంది చెప్తూ.
ఎన్ని సార్లు బెల్ కొట్టినా తలుపు తెరవలేదు తల్లి. విరించి ఒకింత ఆదుర్దాతో, తన దగ్గర ఎమర్జన్సీకి పెట్టుకున్న తాళంచెవితో తలుపు తీసుకుని లోపలకు వెళ్ళాడు. తల్లి రూంలోకి తొంగిచూసిన అతను కొయ్యబారిపోయాడు. వెంటనే సర్దుకుని తల్లి దగ్గరకు వెళ్లి, "అమ్మా అమ్మా, " అని తట్టి లేపాడు. ఆవిడ ఎక్కడో నూతిలోనుండి ఏమో అన్నట్లు 'ఊ' అని మళ్ళీ మగతగా కళ్ళు మూసుకున్నది. నుదురు చూస్తే చల్లగానే ఉన్నది. ఇంక ఏమీ ఆలోచించకుండ అంబులెన్సు కి ఫోన్ చేసాడు. అయిదునిమిషాల్లో దగ్గర్లోనేనున్న ఆంధ్రమహిళాసభ ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు.
‘బిపి చాలా ఎక్కువ అయి ఆవిడ సెమీ అనకాన్షనస్ అయ్యారు. షుగర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నది’ అని I C U లో చేర్చుకున్నారు.
ట్రీట్మెంట్ జరుగుతున్నది. విరించి నర్సు కి జాగ్రత్తలు చెప్పి, వాళ్ళు రాసిచ్చిన మందులు కొనుక్కుని ఇంటినుండి తనకి పక్కబట్టలు తీసుకొచ్చుకుంటానని వెళ్ళాడు.
గబగబా ఫ్రెష్ అయి వచ్చి అన్నం తిన్నాననిపించాడు. అసలు ఇంత వైనంగా వంటచేసి తనకోసం చూస్తూ ఉన్న తల్లికి ఇంతలోకి అంత ముంచుకు రావడానికి కారణమేమై ఉంటుందా అని ఆశ్చర్యపోతూ, తల్లి గదిలోకి వెళ్ళాడు ఆవిడ బట్టలు తీసుకువెళ్దామని. అక్కడ తెరిచి ఉంచిన డైరీ ఎన్నో చెప్పింది.
చదవటం తప్పే అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరమే అనిపినించి చదివాడు. 'ఎలా చెప్పేది వాడికి ఇన్ని తేడాలున్న పిల్ల భాగస్వామి అయితే వచ్చే ఇబ్బందులు, నా స్వార్ధమనిపిస్తుందేమో. చెప్పకపోతే వాడు పడే ఇబ్బందులు కళ్లముందు కదలాడి కంటి మీద కునుకు రానివ్వట్లేదు. పిల్లల్ని మాంసాహారం పెట్టి పెంచుతారా? ఆ అమ్మాయి అలా పెట్టకపోతే ఊరుకుంటుందా? పిల్లలు ఏది ఫాలో అవుతారు?
పిల్లలు అమ్మమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా? కావాల్సింది హోటల్లో తింటారు అనుకోవడానికి ఇది అలా ఎప్పుడన్నా కలిసే బంధం కాదే. వీడు సత్సంగానికి వెళ్ళాల్సినప్పుడే వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే అప్పుడు ఘర్షణ తప్పదుగా. నేనివన్నీ చెప్పినా ఉడుకు రక్తంతో ఇవి సమస్యలే కావని కొట్టిపారేస్తారు.
నా బంగారు తండ్రి జీవితం సమస్యలమయం కాబోతున్నదా? ఏ దేవుడు అడ్డం పడతాడు? వీళ్ళు ఘర్షణ తీవ్రస్థాయికి వెళ్తే జరిగేదేమిటి? ఎవరికీ చెప్పుకోలేను. పట్టించు కోలేని, వదిలిపెట్టలేని సమస్యలు ఎప్పుడూ నాకే ఎందుకు వస్తాయో? తలకాయ పగిలిపోతున్నది' పెన్తో గేకేసినట్లుగా ఉండి, పెన్ కిందపడిపోయి ఉన్నది..
విరించి తలపట్టుకుని కూర్చుడిపోయాడు ఆలోచనలన్నీ ఆవిరైపోగా.
'అమ్మ ఆలోచనల్లో కొట్టి పారేసేదేమీ లేకపోయినా, ఆఫ్టరాల్ తిండికోసం ప్రేమని వదులుకోవాలా? లాస్య తనకోసం మానేయదా? మరి వాళ్ళ ఇంటికి వెళ్తే? తానూ ఒక్కటే సంతానం. వాళ్ళవాళ్లకీ కోరికలుంటాయిగా. అంటే లాస్యని వదులుకోవాలా?'
ఆ ఊహకే వణికిపోయాడు విరించి. హాస్పిటల్కి వెళ్లాలని లేస్తూ, 'నేను నా సమస్య గురువుగారి పాదాలదగ్గర ఉంచుతున్నాను. ఆయనే పరిష్కరించాలి'. కావాల్సినవి తీసుకుని తల్లి దగ్గరకు వెళ్ళాడు.
లాస్య ఫోన్ పుట్టినరోజునాడు హడావిడిలో పోయింది. విరించి వాసన్లు భరించలేక వెళ్లిపోయాడన్న కోపం మాట్లాడనియ్యక పోయినా, ప్రేమ నిలవనియ్యక ఫ్రెండ్ ఫోన్ నుండి ఫోన్ చేసింది. హాస్పిటల్ చుట్టూ తిరిగే విరించి చూడలేదు. ఆఫీసుకి వెళ్లి కనుక్కుంటే ఏ కబురు లేదు వారం నుండి రావట్లేదు అన్నారు. సరిగ్గా లాస్య వచ్చి వెళ్ళగానే విరించి ఆఫీసుకు వచ్చి లీవ్ లెటర్ ఇచ్చాడు తల్లికి బాగాలేదంటూ. కలీగ్ చెప్పాడు ఎవరో ఒక అమ్మాయి వచ్చిందని. లాస్య అయ్యుంటుందని తన కాలేజ్ కి వెళ్ళాడు.
ఈ మధ్య కూతురు ఏదో బాధపడుతున్నట్లుగా గమనించిన పల్లవి ప్రేమ వ్యవహారం కాదుగదా అని, లాస్య రూమ్ అంతా చెక్ చేసింది. అనుమానించదగ్గవేవీ లేవని వెనుతిరుగుతుంటే కాలు తగిలి టేబిల్ మీద ఉన్న లాస్యఫోటో కిందపడింది కంగారుగా తీసింది..
పగల్లేదు కానీ ఫ్రెమ్ కదిలిపోయింది. సరిచేద్దామని చేతిలోకి తీసుకుంటే విరించి, లాస్య ఫ్రెండ్స్తో పిక్నిక్కి వెళ్ళినప్పటి ఫోటో బైటపడ్డది. అంతే ఆవిడ అగ్గిమీద గుగ్గిలం అయిపోయింది. మొత్తం క్షుణ్ణంగా వెతికింది. చిన్న చిన్న గిఫ్ట్స్, ముఖ్యంగా డైరీ చిక్కింది. మొత్తం అర్ధమైంది. అన్నీ ఎక్కడువక్కడ పెట్టేసి భర్తకి ఫోన్ చేసి అన్నీ చెప్పేసి, బొంబాయి తన అన్న దగ్గరకి టిక్కెట్లు తెప్పించింది కుటుంబం అందరికీ.
లాస్య కాలేజికి రాలేదని తెలుసుకున్న విరించి, తమను కలిపిన ఆమె అన్న గౌతమ్ దగ్గరకు వెళ్ళాడు. ఆమె తల్లికి తమ విషయం తెలిసి లాస్యకి పెళ్లి చేసెయ్యాలని బొంబాయి తీసుకు వెళ్లినట్లు తెలుసుకుని హతాశుడయ్యాడు.
వనజని ఇంటికి తెచ్చాడు. విరించి తన బాధ పక్కన పెట్టేసి తల్లిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. పనిమనిషి సాయంతో వండి పెడుతున్నాడు. వనజ చాలా బాధపడుతున్నది కొడుకు కష్టపడుతుంటే.
విరించి ఇడ్లీ తుంపి తల్లికి పెట్టి, "ఎందుకమ్మా నువ్వు నాతో పంచుకోకుండా ఒక్కదానివే ఇలా బాధపడి ఇంతదాకా తెచ్చుకున్నావు? నువ్వు చెప్తే నేను కనీసం విని ఆలోచించనా అమ్మా?" బలహీనంగా ఉన్న తల్లి చేతి గాజులు సవరిస్తూ అన్నాడు.
"ప్రేమ విననివ్వదని భయం నాన్నా. " తల్లి మాటలకి విరించి, "నిజమే అమ్మా.. లాస్య మీద నాకు చాలా ప్రేమ. కానీ నాకూ పరిస్థితులు కొద్ది కొద్దిగా అర్థమవుతున్నాయి. అంత కష్టమా ఆహారం, భగవంతుడి విషయాల్లో వ్యత్యాసాలను సర్దుకోవడం??"
"చాలా కష్టమే నాన్నా. చాలా సున్నితమైన అంశాలు.. గాజు కంటే సుతారం. చిన్నప్పట్నుంచి అలవడ్డవి కదా. అందర్నీ కాదనుకుని మీ ఇద్దరే జీవితం గడిపితే కొంతమటుకు సర్దుకోవచ్చునేమో చాలా కష్టం మీద" చెప్పలేక చెప్పలేక చెప్పింది.
"అలా మేమిద్దరమూ అనుకొనేలేదమ్మా.. కానీ చాలా బాధగా ఉన్నది లాస్యని మరచిపోవాలి అనుకుంటే. "
విరించిని పొదువుకుని, "నీ బాధ నాకు అర్థమవుతున్నది కన్నా. కానీ ఈ బాధ కన్నా ఇంకా ఎంతో మనస్థాపం పొందవలసి వస్తుంది జీవితం విసిరే సవాళ్లు ఎదుర్కొనేటప్పుడు. అసలు ఏ సహాజీవనానికైనా మొట్టమొదటి ప్రాతిపదిక ప్రేమపూరితమైన స్వార్ధరహిత ప్రేమ.. అది మీ ఇద్దరు పెళ్లి చేసుకోకుండా పొందవచ్చు. పెళ్ళిలో డిమాండ్స్ ఉంటాయి. స్నేహంలో త్యాగమే ఉంటుంది"
తల్లి మాటలు తల్లడిల్లిపోతున్న తన హృదయానికి గంధపుపూతగా అనిపించింది, నిజంగా నిభాయించడానికి చాలా ఛాలెంజ్లు ఎదుర్కోవాలని తెలిసినా.
"నీ మనసు ఇంకా లాస్యని పెళ్లి చేసుకోవాలనే చెప్తుంటే తప్పకుండా అలాగే చెయ్యి. "
ఇద్దరూ మనసులు విప్పి మాట్లాడుకున్నాక ఆ గొంతుకడ్డం పడ్డదేదో బైటకు వెళ్ళిపోయినట్లు హాయిగా ఉన్నది. తల్లికి జరిగినవన్నీ చెప్పాడు విరించి.
"కన్నా! లాస్య దగ్గరికి వెళ్ళు. తనతో కూడా మాట్లాడు. వాళ్ళ అమ్మ ఏమన్నా, రియాక్ట్ అవద్దు. చిన్నప్పట్నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లల మీద ఆ మాత్రం హక్కు ఉండడం సహజమే. ఒకొక్కరిది ఒక్కో రకం ప్రేమ. అర్థం చేసుకోవాలంతే"
తల్లి సంస్కారానికి అబ్బురుపడ్డాడు విరించి.
లాస్య తల్లికి చెప్పి చెప్పి అలిసిపోయింది. ఇప్పటికే ఒకసారి తన తండ్రి గురించి ఆత్మహత్యాప్రయత్నం చేసి కొద్దిలో తప్పడంతో ఆవిడ హెల్త్ బాగా దెబ్బతిన్నది. తన చెలికాడితో ఆఖరుసారి చూసి, మాట్లాడదామంటే కూడా వీలు కల్గనియ్యట్లేదు. గౌతమ్ అన్నయ్యకి ఫోన్ చేసి కనుక్కోవాలన్నా తల్లి ఫోన్ అందనివ్వడం లేదు.
ఆ రోజు గౌతమ్ తో బాటు వచ్చిన విరించిని చూసి షాక్ అయింది లాస్య. తల్లి చూస్తే, ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందోనని అతన్ని పక్కనే ఉన్న మామయ్య ఇంటికి తీసుకువెళ్ళమని గౌతమ్ కి చెప్పింది. గౌతమ్ ఫోన్ తనకి ఇచ్చి వెళ్ళమన్నది.
చూపులు కలిసీ కలవకముందే విడిపోవాల్సి వస్తుంటే విరించి విలవిల్లాడిపోయినా, లాస్య పరిస్థితి అర్థం చేసుకున్నాడు. పక్క ఇంటికి గౌతమ్ స్నేహితునిగా వెళ్లి టెర్రస్ మీద కూర్చుని వీడియో కాల్ చేసాడు.
ప్రేమికులిద్దరూ కరువుతీరా కబుర్లు చెప్పుకున్నారు. అన్ని విషయాలు చర్చించుకున్నారు. ఇరువైపులా పెద్దల్ని బాధపెట్టి కట్టుకునే తమ ప్రేమసౌధం ప్రారంభంలోనే బీటలువారటం సహించలేమని అవగాహనకొచ్చారు. ఆ ప్రేమకే మరోరూపం 'స్నేహం' అనే చట్రంలో తమని నిలుపుకున్నారు.
కాలం కదిలిపోతూనే ఉన్నది. మొదట్లో తామిద్దరికీ పెళ్లి కాదు అన్న సత్యం గుండెల్ని కోసేస్తుంటే, పెళ్లి చేసుకుని ఉంటే ఎదుర్కొనే పరుస్థితులని సమీక్షించుకుని, అంతటి స్వార్ధపరులు తాము కానందుకు తమను తామే అభినందించుకున్నారు. తాము ప్రేమించుకోవడం ఆపలేదు, .. జస్ట్ షిఫ్ట్. తమ ఇద్దరి ప్రేమను ఇందరి ప్రేమగా రూపాంతరం చేసారు.
కాలానికున్న మహిమ అపారం, ఎంతటి బాధకైనా మలాం పట్టీ వేసేస్తుంది..
లాస్య ఆరోజు భర్త తో కలిసి విరించి పెళ్ళికి వచ్చింది. వనజకి ఆడపిల్లలు లేని లోటు తీర్చింది అంతా తానే అయ్యి తిరుగుతూ. పెళ్ళి హడావిడి తగ్గి అందరూ సరదాగా కూర్చున్నప్పుడు, లాస్య భర్త శశికాంత్, లాస్య మీద బోలెడు ఫిర్యాదులు విరించికి చెప్తుంటే, లాస్య ఉడుక్కోకుండా విరించి భార్య వాగ్దేవితో, "ఈసారి నేను వచ్చేటప్పటికి విరించి మీద బోలెడు లిస్టు చెప్పాలి. ఇదే నా రిటర్న్ గిఫ్ట్” అన్నది.
యాదృచ్ఛికం ఏమంటే ఇద్దరి భాగస్వాములు వీళ్ళతో కాలేజీలో చదువుకున్న స్నేహితులు.
ఆ నలుగురూ స్నేహ మధురిమలో..
********************************
సమాప్తం.
విజయా సుందర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar
నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.
'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!
Comments