top of page

సమాజం కోసం ఒక అడుగు

#SamajamKosamOkaAdugu, #సమాజంకోసంఒకఅడుగు, #Mayukha, #మయూఖ, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Samajam Kosam Oka Adugu - New Telugu Story Written By Mayukha

Published In manatelugukathalu.com On 21/08/2025

సమాజం కోసం ఒక అడుగు - తెలుగు కథ

రచన: మయూఖ


"అమ్మా! ఈరోజు నుంచి కాలేజీకి వెళ్లట్లేదు". 


"ఎందుకే? ఉద్యోగం వదిలేసి ఏం చేద్దామని?” తల్లి పార్వతి అడిగింది ఆదుర్దాగా. 


"నువ్వు కంగారు పడకు. ఒక రెండు సంవత్సరాలు పల్లెటూర్లో ఉండి, నేను చదువుకున్న సబ్జెక్టుకి న్యాయం చేస్తాను" అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా తన గదిలోకి వెళ్లిపోయింది సమీర. 


సమీర పట్టుదల తెలుసు కాబట్టి పార్వతి ఏం మాట్లాడలేక పోయింది. పార్వతి, రామచంద్రంల ఏకైక కూతురు సమీర. ఎమ్మే సోషియాలజీ చదివింది. ఏం ఫీల్ కూడా చేసి, పట్నం కాలేజీలో లెక్చరర్ గా చేరింది. 

 ******

కాలేజీ స్టాఫ్ రూమ్ లో, లంచ్ టైం లో వాడీ వేడి చర్చలు జరుగుతూ ఉంటాయి. ఒకళ్ళు అవునంటే, ఇంకొకళ్ళు కాదంటారు. ఈ వాదోపవాదాలు ఒక కొలిక్కి రాక మళ్లీ మర్నాడు కూడా జరుగుతుంటాయి. అలా వాదోపవాదాల ఫలితమే సమీర కాలేజీ మానేయడం. 


ఒకరోజు జరిగిన చర్చల్లో కెమిస్ట్రీ లెక్చరర్ కిరణ్ అన్నాడు "సమీర గారు! మీరు చదువుకున్న చదువుకి, చేస్తున్న ఉద్యోగానికి సంబంధం ఉందా! మీరు పల్లెటూర్లలో ఉండి, అక్కడ ప్రజల్లో ఎవేర్నెస్ తీసుకురావాల్సింది పోయి ఇక్కడ ఈ టౌన్ లో స్థిరపడిపోయారు. అవునులెండి.. పల్లెటూర్లకు వెళ్లడానికి ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుంది" అంటూ మాటలతో రెచ్చగొట్టాడు. 


దాంతో సమీర కి చాలా కోపం వచ్చింది. "నేను అక్కడ ఉండలేనని అనుకుంటున్నారా! నేను అక్కడ ప్రజల్లో ఎవేర్నెస్ తీసుకుని వస్తాను. మీరే ఒక పల్లెటూరిని సెలెక్ట్ చేయండి. అక్కడికి వెళ్లి అక్కడ ప్రజల్ని చైతన్య వంతులని చేస్తాను. నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఇక్కడే ఉండిపోయాను". అంటూ ఎర్రబడ్డ మొహంతో కోపంగా అంది సమీర. 


వాతావరణం వేడెక్కుతోందని తోటి లెక్చరర్లు వారించినా ఇద్దరూ తగ్గలేదు. అప్పటికప్పుడు సమీర కాలేజీకి లాంగ్ లీవ్ కి అప్లై చేసింది. 


తనకు సహాయంగా తల్లిని తీసుకుని శ్రీకాకుళం జిల్లాలో వెనకబడ్డ మారుమూల గ్రామమైన రామాపురాన్ని ఎంపిక చేసుకొని, అక్కడికి బయలుదేరింది. తనకు కావలసిన సామాన్లన్నీ ప్యాక్ చేయించుకుంది. 

 *******

ఆ ఊరి ప్రెసిడెంట్ తో ముందే మాట్లాడడంతో ఆయన ఇంటిలోనే బస ఏర్పాటు చేశాడు. సమీర ముందు స్కూల్ కి వెళ్ళింది. అక్కడ పిల్లల సంఖ్య తక్కువ ఉండడంతో, స్కూల్ కి రాని పిల్లల తల్లితండ్రులతో ప్రత్యేక సమావేశం పెట్టింది. 


చదువు యొక్క ఆవశ్యకత, విద్యఎంత అవసరమో వాళ్ళకి ఉదాహరణగా చెప్పింది. ముందు ఎవరూ వినలేదు కానీ, సమీర పట్టుదల చూసిన తర్వాత, ‘ఒక ఆడ కూతురు మనకోసం ఇంత కష్టపడుతుంటే మన పిల్లల్ని స్కూల్ కి పంపించలేమా’ అనుకుని అందరూ స్కూల్ కి పంపడం మొదలుపెట్టారు. అలా ఒక సమస్య తీరింది. 


ఒకరోజు ప్రెసిడెంట్ "ఇన్ని రోజుల నుంచి మేము చేయలేని పనిని నువ్వు చేసి చూపించావు. నీవు ఏ విధమైన సహాయం కావాలన్నా, నేను నీ వెంటే ఉంటాను. మా ఊరిని బాగా అభివృద్ధి చేయమ్మా"! అన్నాడు. 


"అలాగే బాబాయ్ గారు! నాకు కావాల్సింది అదే. ఏ ఒక్కరో మారితే కాదు. గ్రామం మొత్తానికి మారితేనే అభివృద్ధి సాధ్యం అవుతుంది. రేపు గ్రామ మహిళలతో మాట్లాడతాను" అంది సమీర. 


మర్నాడు మహిళలందరినీ కలుసుకొని, వయోజన విద్య, వ్యక్తిగత పరిశుభ్రత, సానిటరీ నాప్కిన్స్ పై అవగాహన కల్పించింది. స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. 


కిరణ్ ఎప్పటికప్పుడు సమీర చేస్తున్న అభివృద్ధి గురించి తెలుసుకుంటూనే ఉన్నాడు. సమీర తల్లి పార్వతితో చుట్టుపక్కల వాళ్ళు ఆడవాళ్లు అందరూ వచ్చి 

సమీరని పొగుడుతుంటే ఎంతో సంతోషంగా ఉంది. 


"అమ్మా! ఈ అమ్మాయి వల్లే మా పిల్లలు నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకుంటున్నారు. మేము కూడా వయోజన విద్య ద్వారా చదువు యొక్క విలువ తెలుసుకున్నాం. దీనికి అంతటికి కారణం మీ అమ్మాయి గారే" అంటూ సంతోషంగా చెప్పారు. 


జిల్లా కలెక్టర్ తో చెప్పి ఊళ్లో వయోజన పాఠశాలకి ఒక టీచర్ని కూడా అపాయింట్ చేయించింది. చదువు యొక్క ఆవశ్యకత గురించి చెప్పి, మగవారిని కూడా పాఠశాలకు వచ్చేటట్లు చేసింది. 


అందరూ వ్యవసాయం మీదే ఆధారపడకుండా పదిమందిని కలిపి గ్రూప్ గా ఏర్పాటు చేసి వారి చేత కుటీర పరిశ్రమలు పెట్టడానికి బ్యాంకు నుంచి రుణాలు మంజూరు చేయించింది. 


వాటర్ కనెక్షన్, పారిశుధ్యం, రోడ్లు అన్ని ఆయా విభాగాల వారికి చెప్పి సాంక్షన్ చేయించింది. ఇప్పుడు గ్రామం అంతా కళకళలాడుతోంది. 

చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి కానీ, సమీరకి కాలం తెలియలేదు. 


ఒక రోజు కిరణ్ రామాపురం కి వచ్చాడు. "ఏవండోయ్ సమీరగారు.. నేను అనుకున్న దాని కంటే మీరు చాలా అభివృద్ధి చేశారు గ్రామాన్ని. కంగ్రాట్యులేషన్స్" అన్నాడు మనస్ఫూర్తిగా. 


కిరణ్ ని చూసి ఆశ్చర్యపోయింది. "మీరు ఎందుకు వచ్చారు? నా పని ఎంతవరకు వచ్చిందో చూడ్డానికి వచ్చారా!" అంది విసురుగా.

"అంత అవసరం లేదు. మీరు చేస్తున్న కృషి నాకు ఎప్పటికప్పుడు తెలుస్తోంది. మీరు ఎంత కష్టపడుతున్నారు అన్నది నాకు తెలిసింది. సారీ మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను" అన్నాడు కిరణ్. 


"పరవాలేదు. నేను ముందు ఇబ్బంది పడ్డాను కానీ, రాను రాను ప్రజలందరూ నాకు సహకరించారు. అందరి సహకారంతోటే ఈ ఊరు ఇంత అభివృద్ధి చెందింది" అంది మనస్ఫూర్తిగా. 


"రేపో మాపో ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు, దానికి కారణమైన మీకు కూడా వస్తుంది. గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందిందో నేను ఫొటోస్ తో కలెక్టర్ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. ఆయన తన కింద అధికారులను పంపి పర్యవేక్షిస్తారు" అన్నాడు కిరణ్. 


"అవునా! మీకు ఇవన్నీ ఎలా తెలుసు?" అంది ఆశ్చర్యంగా. 


"ఎలా అంటే ఈ ప్రెసిడెంట్ మా మామయ్య. ఈ ఊరిని అభివృద్ధి చేయాలనుకున్నాడు. కానీ ఎలా ముందుకు వెళ్లాలో తెలియలేదు. నాతో చెప్పితే నేనే కలగజేసుకుని వెనక నుండి నేను నడిపించాను. నాకు మీ పట్టుదల, మీ సిన్సియర్ టి తెలుసు కాబట్టి ఆ రోజు మిమ్మల్ని అలా రెచ్చగొట్టాను. వెరీ సారీ!” అన్నాడు. 


"అమ్మో! వెనకాల ఇంత నడిపారా. పోనీలెండి. నాకు కూడా చాలా తృప్తినిచ్చింది. నేను చదువుకున్న చదువుకి సార్ధకత ఏర్పడింది. నా వలన ఒక గ్రామం మొత్తం అభివృద్ధి చెందిందంటే చాలా సంతోషంగానూ, ఆశ్చర్యంగాను కూడా ఉంది. నేను ఏ అవార్డులు వస్తాయని చేయలేదు. నా వంతుగా చేశాను. అలాగే ప్రతి యువత కూడా నడుంబిగిస్తే ‘పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు’ అని గాంధీ గారు అన్నట్టుగా దేశ అభివృద్ధి చెందుతుంది" అంది సమీర, కిరణ్ హర్షద్వానాల మధ్య. 


******శుభం *******


మయూఖ  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :

63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం:

  పరిచయ వాక్యాలు:

నా పేరు శారద

విద్యార్హతలు: ఎమ్.ఎ

నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.

నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.

తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.

నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.

ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి

మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.

Comments


bottom of page