top of page
Original.png

సమాజం సిక్‌ అయింది

18 minutes ago
5 min read

సమాజం సిక్ అయింది తెలుగు సామాజిక కథ – గాయపడిన గ్రామస్థుడికి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్న యువకులు, నిజాయితీని సమర్థించే రైతు.

Samajam Sick Aindhi - Telugu Social Story | B. N. Satyanarayana

సమాజం సిక్‌ అయింది - తెలుగు సామాజిక కథ | B. N. సత్యనారాయణ 

Published in manatelugukathalu.com on 20/10/2026


“సమాజం సిక్ అయింది” ఒక హృదయాన్ని తాకే తెలుగు సామాజిక సందేశాత్మక కథ. ధనబలం ముందు న్యాయం తలవంచుతున్న నేటి సమాజంలో నిజాయితీ, మానవత్వం, ధర్మం ఎంత ముఖ్యమో ఈ కథ మనకు గుర్తుచేస్తుంది.


సంతోష్ రోడ్డుకు పక్కగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక అబ్బాయి స్కూటరుపై సంతోష్‌కు పక్కనుండి ముందుకు పోతున్నాడు. ఇంతలో పక్కనే ఉన్న చిన్న గల్లీలో నుండి ఒక వ్యక్తి రోడ్డు మీదికి వస్తూ ఆ స్కూటర్‌కు అడ్డంగా వచ్చేశాడు. 


దాంతో ఆ అబ్బాయి సడన్‌గా బ్రేక్ వేసి స్కూటర్ ఆపాడు. గల్లీ నుండి వచ్చిన వ్యక్తి స్కూటర్‌ని చిన్నగా గుద్దుకున్నాడు. దాంతో అతడు ఆ అబ్బాయిపై అరిచి, మొరటుగా అతడి చెంపపై కొట్టాడు. అవాక్కైపోయాడు ఆ అబ్బాయి.


"మీరే అడ్డంగా వచ్చి నాది తప్పంటూ నన్ను కొడతారేంటి?" అని అడిగాడు ముఖం చిన్నబుచ్చుకుని.


కొట్టిన వ్యక్తి అక్కడి వాడు, ధనికుడు కావడంతో చుట్టూ ఉన్న వారు అతడి పక్షాన్నే మాట్లాడుతూ అబ్బాయిదే తప్పనసాగారు.


అప్పుడే అక్కడికి చేరిన సంతోష్ జరిగినదంతా చూసి—


"అదేమిటండి! మీరే ఆ అబ్బాయి బండికి అడ్డంగా వచ్చి, తప్పు మీరే చేసి ఆ అబ్బాయిని కొట్టడం ఏంటి? మీరు చేసింది బాగుండలేదు" అని ఆ వ్యక్తిని మందలిస్తే, ఆ వ్యక్తి ఏమీ అనలేక తల వంచుకుని అర్జెంట్ పని ఉన్నవాడిలా హడావిడి పడుతూ అక్కడి నుండి జారుకున్నాడు.


సంతోష్‌కు చుట్టూ ఉన్న వారి మాటలు కొత్తగా, విచిత్రంగా ఏమీ అనిపించలేదు. అది డబ్బుకు ఉన్న బలం అని స్పష్టంగా తెలుస్తోంది. తాము, తమ వారు చేసిన తప్పులను కూడా ఎదుటివారిపై రుద్దడాన్ని న్యాయంగానే చలామణి చేసుకుంటున్న రోజులు ఇవి.


సంతోష్ ఆ అబ్బాయి వైపు తిరిగి, "బాబూ! ఇందులో నీ తప్పేమీ లేదు, నీవు వెళ్లు!" అని చెప్పి ఆ అబ్బాయిని అక్కడి నుండి పంపివేశాడు.


చిన్నబుచ్చుకున్న ముఖంతో ఆ అబ్బాయి స్కూటర్ స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. తప్పు చేయకుండా దెబ్బలు తిన్న ఆ అబ్బాయిని తలచుకుని సంతోష్ చాలా బాధపడ్డాడు.


ఇటువంటి తప్పుడు సంఘటనలు ఎదురుపడ్డప్పుడల్లా సంతోష్‌కు గతంలో అతడి యవ్వన కాలంలో జరిగిన ఒక సంఘటన ఎప్పుడూ గుర్తుకువస్తూనే ఉంటుంది.


సత్యానికి, న్యాయానికి, ధర్మానికి గౌరవం, బలం ఉన్న రోజులవి. సంతోష్ అప్పటి సమాజానికి ఎల్లప్పుడూ వందనాలు తెలియజేస్తూనే ఉంటాడు.


యవ్వనంలో సంతోష్ ఒక వ్యాపార సంస్థలో గుమస్తాగా పనిచేసేవాడు. ఆ సంస్థ అరువుపై అమ్మిన వస్తువులకు సంబంధించిన బిల్లుల తాలూకు డబ్బు వసూలు చేసేందుకు చుట్టూ ఉన్న ఊళ్లకు వెళ్తూ ఉండేవాడు.


ఒకరోజు ఆ పని మీదే విజయనగరం వెళ్లాడు. పని పూర్తి అయ్యేసరికి టైం రాత్రి 8 గంటలు కావచ్చింది. తిరుగు ప్రయాణానికై బస్సు కోసం బస్ కాంప్లెక్స్‌కు వెళుతుండగా, సహచరుడు నాగరాజు స్కూటర్‌పై వస్తూ అతడిని చూసి ఆగి, "ఎక్కడికి, బస్ కాంప్లెక్స్‌కా?" అని అడిగాడు.


సంతోష్ "అవును" అనగానే—

"పదా! నా పనులు కూడా పూర్తి అయిపోయాయి. ఇద్దరం కలిసే పోదాం" అంటూ సంతోష్‌ను స్కూటర్‌పై ఎక్కమన్నాడు.


సంతోష్ అలాగే ఎక్కి కూర్చున్నాడు. నాగరాజు సంతోష్ కంటే వయసులో పెద్దవాడు, అనుభవం ఉన్నవాడునూ. అతడు చాలా చాలా విషయాల గురించి చెబుతూ సంతోష్‌తో చర్చిస్తూ స్కూటర్‌ని పోనిస్తున్నాడు.


వారు అలమండ గ్రామం చేరుకున్నారు. వారికి ముందుగా ఒక ఎడ్లబండి వారు పోతున్న మార్గంలోనే పోతోంది. దానికి చిన్న లాంతరు కట్టబడి ఉంది. ఆ కొద్ది వెలుగులోనే ఆ రైతు బండిపై కూర్చోకుండా దాని ముందు నడుస్తున్నాడు. అతడి వెనుకే బండి పోతోంది. వారి స్కూటర్ ఆ బండిని దాటుకుని ముందుకు పోయింది.


కొద్ది దూరం పోయారో లేదో ఆ చీకట్లోనే ఒక వ్యక్తి రోడ్డు దాటుతూ స్కూటర్‌కు అడ్డంగా వచ్చేశాడు. సడన్‌గా ఆ వ్యక్తి అడ్డంగా వచ్చేయడంతో స్కూటర్ అతడిని గుద్దివేసింది. అతడు గట్టిగా మూలుగుతూ కింద పడిపోయాడు. 


నాగరాజు బండిని బ్యాలెన్స్ చేయలేకపోవడంతో బండితో సహా వారిద్దరూ కూడా కింద పడిపోయారు. లక్కీగా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికీ పెద్దగా దెబ్బలు తగలలేదు. సంతోష్‌కు మోకాలు మాత్రం కొద్దిగా నొప్పి పెట్టసాగింది.


ఇద్దరూ గబగబా సర్దుకుని పైకి లేచారు. నాగరాజు ముందుగా తేరుకున్నాడు. స్కూటర్‌ని పైకి లేపాడు. స్టార్ట్ చేసి చూశాడు. స్టార్ట్ అయింది, బండికి ఏం కాలేదు.


"సంతోష్! తొందరగా వచ్చి కూర్చో, వెళ్దాం!" అన్నాడు.


సంతోష్‌కైతే మనసు అంగీకరించడం లేదు. దెబ్బ తగిలిన వ్యక్తి బాధగా మూలుగుతున్నాడు. అతడి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. దగ్గరగా పోయి అతడికి సాయం చేయాలని ఉంది!


"నాగరాజూ! అతడికి గట్టిగా దెబ్బలు తగిలినట్లున్నాయి. బాగా మూలుగుతున్నాడు. అతడిని లేపి చూద్దాం" అంటున్న అతడి మాటలకి నాగరాజు అడ్డుపడ్డాడు.


"ఇటువంటి సమయంలో మనల్ని ఎవరైనా చూసి పట్టుకుంటే మన పని అయిపోతుంది. ముందు వచ్చి స్కూటర్‌పై కూర్చో, ఎక్కువగా ఆలోచించకు" అంటూ తొందర చేయడంతో సంతోష్ ఏమీ అనలేక, చేయలేక స్కూటర్‌పై ఎక్కి కూర్చున్నాడు.


నాగరాజు ఆలస్యం చేయలేదు. తొందరగా స్కూటర్‌ని ముందుకు పోనిచ్చాడు. కొద్ది దూరం మాత్రమే పోయారు. సంతోష్ చేతి రుమాలు తీసి ముఖం తుడుచుకుంటూ కళ్లజోడు లేకపోవడాన్ని గుర్తించాడు.


"నాగరాజూ! నా కళ్లజోడు లేదు, అక్కడే పడిపోయినట్లుంది. ప్లీజ్ నాగరాజూ! వెనక్కి పదా, వెతుకుదాం" అనేసరికి నాగరాజుకు ఏమీ తోచలేదు. 'వద్దు' అనవచ్చు, అంటే అతడి కళ్లజోడుకు డబ్బు సర్దుబాటు చేయాలి... ఎలా? అనుకుని, సరేనని స్కూటర్‌ను వెనక్కి తిప్పి, పడిపోయిన చోటును గుర్తించి, ఆగి కళ్లజోడు వెతకసాగారు.


అదృష్టం బాగుంది! అది దొరికింది. దాన్ని తీసుకుని స్కూటర్ ఎక్కుతున్న సమయానికి, వారు దాటుకుని వచ్చిన ఎడ్లబండిని తోలుకుంటూ వస్తున్న రైతు వారి దగ్గరకు చేరుకుని, వారి స్కూటర్ కదలకుండా గట్టిగా పట్టుకుని—


"ఆగండి! మీరే మా చిన్నాన్నని గుద్దేశారు! ఈ సమయంలో మీరు తప్ప వేరెవ్వరూ పోలేదు, మీరే మా చిన్నాన్నను గుద్దారు" అని అంటూ...


"రామయ్యా, పుల్లయ్యా, తొందరగా రోడ్డు మీదకి రండి. ఎవరో చిన్నాన్నని స్కూటర్‌తో గుద్దేశారు" అంటూ గట్టిగా కేకలు వేయసాగాడు.


ఆ రైతు ఆ గ్రామవాసేనని అర్థమయింది వారికి. దాంతో వారిద్దరికీ గుండెలు ఆగిపోయినంత పనైంది. సంతోష్ వెంటనే తేరుకున్నాడు.


ఆ రైతుతో— "అయ్యా! మేమేమీ తప్పు చేయలేదు. మేం హారన్ కొట్టాం, వినిపించుకోకుండా అతడే మా స్కూటర్‌కు అడ్డంగా వచ్చేశాడు. నిజంగా ఇందులో మా తప్పేమీ లేదు. 


మొదట అతడిని విడిచిపెట్టి వెళ్లిపోవాలని అనుకున్నాం, కానీ మా మనసులు ఒప్పుకోలేదు. దాంతో అతడిని ఏదైనా ఆసుపత్రికి తీసుకెళ్లాలని అనుకుని తిరిగి వచ్చాం. ఇది నిజం!" అని చెప్పాడు.


అతడి మాటల్లో ఆ రైతుకు నిజాయితీ కనిపించింది, నమ్మకం కుదిరింది. దాంతో వారిని కాపాడాలని అనుకుని ఒక ఆలోచన చేశాడు.


"సరే! మీ మాటల్ని నమ్ముతున్నాను. మా వాళ్లందరూ వచ్చేస్తున్నారు. వాళ్లతో మీరేమీ మాట్లాడకండి, నేనే వారికి విషయం చెబుతాను" అంటూ హామీ ఇవ్వడంతో ఇద్దరిలో కొంత ఆందోళన తగ్గింది, ఊపిరి పీల్చుకున్నారు.


ఇంతలో ఆ చీకట్లో కాగడాల వెలుగులు ముందుకు వస్తూ కనిపించాయి. అది చూసిన వారిలో 'ఏం జరుగుతుందో'ననే భయం పట్టుకుంది. ఎప్పటిదో ఒక సినిమా గుర్తుకురాసాగింది. భయంతో అలానే ఉండిపోయారు.


గుంపు కాగడాలతోనూ, కర్రలతోనూ దగ్గరకు వచ్చేసింది. ఎడ్లబండి రైతు వారిని అక్కడే ఉండమని చెప్పి, అతడే ఆ గుంపు ముందుకు పోయి, కుర్రాళ్ల తప్పేమీ లేదని వారికి విషయమంతా తెలియజెప్పి వారిని శాంతింపజేశాడు. 


దాంతో వారు గాయపడిన వ్యక్తి దగ్గరకు వచ్చి, అతడిని ఎత్తుకుని మోసుకుంటూ ఊరిలోకి తీసుకుపోతూ వీరిద్దరినీ కూడా వాళ్ల ఇంటికి తీసుకుపోయారు. సంతోష్ కొద్దిగా కుంతుతుండడాన్ని చూసి, అడిగి వారే అతడి మోకాలికి తగిలిన గాయానికి అమృతాంజనం రుద్దారు.


అక్కడ వారి మాటల్ని బట్టి ఆ గాయపడ్డ వ్యక్తి ఊరి పెద్దని, పెద్ద కుటుంబీకుడని, చాలా మంచివాడని తెలిసింది. కాకపోతే అతడికి బ్రహ్మ చెవుడని తెలియవచ్చింది. అందువల్లే హారన్‌ని వినలేకపోయాడని అర్థమయింది. స్కూటర్ గట్టిగా తగలడంతో అతడి కాలు విరిగిందని తెలిసింది. దాంతో ఇద్దరూ చాలానే బాధపడ్డారు.


ఆ రాత్రి వారిద్దరూ అక్కడే నిద్రపోయి, తెల్లారగానే లేచి ఎడ్లబండి యజమానికి కృతజ్ఞతలు తెలుపుకుని, అందరికీ నమస్కారాలు తెలియజేసి, ప్రత్యేకంగా ఆ గాయపడ్డ పెద్దాయనను క్షమించమని కోరి నమస్కరించి స్కూటర్ తీసి బయలుదేరారు. వారి వారి ఇండ్లకు సురక్షితంగా చేరుకున్నారు.


ఆనాడు వారిలోని నిజాయితీ, మానవత్వాలే వారి ప్రాణాలకు అప్పుడు రక్షణ కల్పించాయని సంతోష్ ఇప్పటికీ, ఎప్పటికీ విశ్వసిస్తూ ఉంటాడు. వాటినే అనుసరిస్తూ ఉంటాడు కూడా.


కానీ నేడు సమాజంలో అవి 'సిక్' అయి కానరాకుండా పోతూ, మరుగునపడిపోతూ ఉండడం అతడికి చాలా బాధ కలిగిస్తుంది.


~ సమాప్తం ~

***


📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y



B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



 B. N. సత్యనారాయణ.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.



( బొడ్డేడ నూక సత్యనారాయణ )

బి. ఎ.

వయసు: 75 సం॥లు

స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)

ప్రస్తుతం

హైదరాబాద్ లో

స్థిరపడ్డాను

వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో

అక్కౌంటెంట్‌గా చేసి

రిటైర్ అయ్యాను

ప్రస్తుతం వ్యాపార

రంగంలో ఉన్నాను

ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై

పత్రికలకు లేఖలు

రాయడం

రెండు సంపుటాలు కూడా

ప్రచురించడం జరిగింది

ఛిన్న కథలు వ్రాయడం

మొదలుపెట్టాను

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page