top of page
Original.png

సందేశం

10 hours ago
4 min read

సందేశం తెలుగు నీతి కథలో మహిధర్‌తో కలిసి బొమ్మను రూపొందిస్తున్న పెన్సిల్ చిట్టి, రబ్బరు రబ్బూ, కాగితం కాగితమ్మ – ఐకమత్యం మరియు సహకారానికి ప్రతీక.

Sandhesham - Telugu Moral Story | Varalakshmi Yanamandra

సందేశం - తెలుగు నీతి కథ | వరలక్ష్మి యనమండ్ర  

Published in manatelugukathalu.com on 13/10/2026


సందేశం వరలక్ష్మి యనమండ్ర రచించిన చక్కని తెలుగు నీతి కథ. పెన్సిల్, రబ్బరు, కాగితం పాత్రల ద్వారా ఐకమత్యం, సహకారం, పరస్పర గౌరవం ఎంత ముఖ్యమో ఈ కథ తెలియజేస్తుంది. పిల్లల్లో మంచి ఆలోచనలు, స్నేహభావం, కలిసికట్టుగా పనిచేసే లక్షణాలను పెంపొందించే సందేశాత్మక కథ ఇది. ఐకమత్యమే మహాబలం అనే జీవిత సత్యాన్ని ఈ కథ మనకు గుర్తుచేస్తుంది.


మహిధర్ నాల్గవ తరగతి చదువుతున్నాడు. తన బల్ల మీద పెన్సిల్ చిట్టి, రబ్బరు రబ్బూ, కాగితం కాగితమ్మ ఉన్నాయి.


ఆ రాత్రి మహిధర్ బడిలో ఇచ్చిన ప్రాజెక్టు కోసం "మా ఊరి చెరువు" బొమ్మ గీస్తున్నాడు. గీతలు వంకరగా వచ్చాయి. రబ్బరు ఎక్కడో కనిపించలేదు.


చిరాకుతో పెన్సిల్ విసిరేసి, కాగితాన్ని నలిపి పక్కన పడేశాడు.


"ఈ వస్తువులన్నీ ఎందుకూ పనికిరావు!" అని గొణుక్కుంటూ బల్ల మీదే తల వాల్చాడు. కళ్ళు మూతలు పడ్డాయి, నిద్ర పట్టేసింది.


ఆ రాత్రి కలలో మహిధర్‌కు పెద్ద గొడవ వినిపించింది.


"నేనే గొప్ప!" అంది చిట్టి గర్వంగా. "నేను గీస్తేనే బొమ్మ పుడుతుంది. నేను లేకపోతే మహిధర్ ఏమీ చేయలేడు."


రబ్బు కోపంగా ఎగిరింది. "ఏంటి నీ గొప్పా? నువ్వు గీసిన తప్పులన్నీ నేనే చెరుపుతున్నాను. నేను లేకపోతే నీ బొమ్మలన్నీ గజిబిజే!"


"నువ్వు చెరపడమే తెలిసిన దానివి. నేను సృష్టిస్తాను, నువ్వు నాశనం చేస్తావు!" అంది చిట్టి ఎగతాళిగా.


"ఓహో! సరే, ఇక నుంచి నేను నీ తప్పులు చెరపను. చూద్దాం నీ బొమ్మలు ఎలా ఉంటాయో!"

"నాకు నీ అవసరమే లేదు. వెళ్ళు!"


ఇద్దరూ ముఖాలు తిప్పుకుని చెరో మూలకు వెళ్ళిపోయారు. పక్కనే ఉన్న కాగితమ్మ ఇదంతా చూసి నిట్టూర్చింది.


"అయ్యో! మీరిద్దరూ ఇలా పోట్లాడుకోకండి" అంది. కానీ ఎవరూ వినలేదు.


మహిధర్ కలలోనే కొత్త కాగితం తీసుకుని "మా ఊరి చెరువు" బొమ్మ గీయడం మొదలుపెట్టాడు. చిట్టి ఉత్సాహంగా గీసింది, కానీ గీతలు వంకరగా వచ్చాయి.


మహిధర్ రబ్బరు కోసం వెతికాడు. రబ్బూ కావాలనే దాక్కుంది.


"రబ్బరు ఎక్కడ పోయిందబ్బా?" అని చిరాకుపడి, తప్పులు చెరపలేక కాగితం మీదే గీతలు పెంచుకుంటూ పోయాడు. బొమ్మ మరింత గజిబిజి అయింది.


అదే సమయంలో కాగితమ్మ బాధగా అంది: "చూడండి, నా మీద ఎన్ని గీతలు పడ్డాయో! నాకు చాలా బాధగా ఉంది."


చిట్టి కొన విరిగిపోయింది. మహిధర్ కోపంతో కాగితాన్ని నలిపేశాడు. చిట్టి గుండె జారిపోయింది. "అయ్యో! నేను ఒక్కదాన్నే ఏమీ చేయలేకపోతున్నానే..." అని మెల్లగా ఒప్పుకుంది.


మహిధర్ అదంతా కళ్ళారా చూశాడు. తన చేతుల్లోనే ఇంత గజిబిజి కావడం చూసి అతడికి గుండె బరువెక్కింది. "వీళ్ళలో ఏ ఒక్కరు లేకపోయినా బొమ్మ పూర్తి కావడం లేదే!" అనిపించింది.


రబ్బూ ఇదంతా చూసి బాధపడింది. "నేను తప్పు చేశాను. నేను లేకపోవడం వల్లే ఇంత గజిబిజి అయింది."


రబ్బూ మెల్లగా వచ్చి చిట్టి దగ్గరకు వెళ్ళింది. "చిట్టీ, నన్ను క్షమించు. నేను అలిగి దాక్కోవడం తప్పు."


చిట్టి కళ్ళలో నీళ్ళు తిరిగాయి. "లేదు రబ్బూ, తప్పు నాది. నేను గర్వంతో నిన్ను తక్కువ చేశాను. నువ్వు లేకపోతే నా గీతలకు విలువే లేదు.


అలాగే కాగితం లేకపోతే నాకు రూపమే లేదు. ఇప్పుడు చూడండి, మనందరం కలిస్తేనే అందం. 'నేను లేకపోతే మీరు ఎక్కడ పని చేస్తారు?' అని ఒకరినొకరు అనుకోకూడదు! ముగ్గురం కలిస్తేనే బొమ్మ!"


ముగ్గురూ చేతులు కలిపారు. మహిధర్ కలలోనే కొత్త కాగితం తీసుకున్నాడు. చిట్టి గీసింది, రబ్బూ తప్పులుంటే సరిచేసింది, కాగితమ్మ ఆ గీతలను ప్రేమగా మోసింది.


కొద్దిసేపట్లో చెరువు, దాని ఒడ్డున కొంగలు, నీటిలో విరిసిన తామరలతో అద్భుతమైన బొమ్మ తయారైంది.


"ఇంకెప్పుడూ పోట్లాడుకోకూడదు మనం" అంది రబ్బూ.


"అవును, మనలో ఎవరూ గొప్ప కాదు, ఎవరూ తక్కువ కాదు. అందరం కలిస్తేనే అద్భుతం" అంది చిట్టి.


"ఒక్క పుల్ల విరగడం తేలిక, పుల్లల కట్ట విరగడం కష్టం" అంది పెన్సిల్ నవ్వుతూ.


ఆ మాటలు వింటుండగానే మహిధర్‌కు మెలకువ వచ్చింది.


తెల్లవారింది. కిటికీలోంచి ఎండ బల్ల మీద పడుతోంది. మహిధర్ కళ్ళు నులుముకుని చుట్టూ చూశాడు.


చిట్టి దూరంగా పడి ఉంది, రబ్బూ పుస్తకాల వెనక ఇరుక్కుని ఉంది, నలిగిన కాగితం కింద పడి ఉంది. వాటిని చూడగానే కలలోని మాటలు గుర్తొచ్చాయి. అతడికి కొంచెం సిగ్గుగా అనిపించింది.


"నిన్న రాత్రి వీటిమీద కోపం చూపించాను. ఇవి లేకపోతే నేను బొమ్మే గీయలేను కదా!" అనుకున్నాడు.


ఒక్కొక్కదాన్నీ జాగ్రత్తగా తీసి బల్ల మీద పెట్టాడు. నలిగిన కాగితాన్ని చేత్తో నిమిరి సరిచేశాడు. చిట్టి కొనను చెక్కి, "క్షమించు చిట్టీ" అన్నాడు.


రబ్బూను చూసి, "నువ్వు కూడా చాలా అవసరం రబ్బూ" అని నవ్వాడు.


అప్పుడు కొత్త కాగితం తీసుకుని "మా ఊరి చెరువు" బొమ్మ గీయడం మొదలుపెట్టాడు.


చిట్టి గీసింది, రబ్బూ తప్పులను సరిచేసింది, కాగితమ్మ ఆ గీతలను ప్రేమగా మోసింది.


కొద్దిసేపట్లో చెరువు, దాని ఒడ్డున కొంగలు, నీటిలో విరిసిన తామరలతో అద్భుతమైన బొమ్మ తయారైంది.


మరుసటి రోజు ఉపాధ్యాయురాలు ఆ బొమ్మను చూసి అందరికీ చూపించారు. "ఇది ఎంత అందంగా ఉందో చూడండి! మహిధర్, శభాష్!"


మహిధర్ చిరునవ్వుతో ఇంటికి వచ్చి బల్ల మీద ఉన్న చిట్టి, రబ్బూ, కాగితమ్మల వైపు చూశాడు.


"ఈ శభాష్ నాది ఒక్కడిదే కాదు, మనందరిదీ" అనుకున్నాడు. కలలో విన్న మాట మనసులో మెదిలింది: "ఎవరూ గొప్ప కాదు, ఎవరూ తక్కువ కాదు.


ఒక్క పుల్ల విరగడం తేలిక, పుల్లల కట్ట విరగడం కష్టం. ఐకమత్యమే మహాబలం."


వరలక్ష్మి యనమండ్ర ✒️



📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!

మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.

✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి

👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y


వరలక్ష్మి యనమండ్ర గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



వరలక్ష్మి యనమండ్ర

పరిచయం: వరలక్ష్మి యనమండ్ర

పేరు: శ్రీమతి వరలక్ష్మి యనమండ్ర 

కలం పేరు: లేదు

స్వస్థలం: అద్దంకి,‌ప్రకాశం జిల్లా

ప్రస్తుత నివాసం: హైదరాబాద్ 

వృత్తి: విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని 

విద్యార్హత: యం.ఏ., బి.ఎడ్.


ప్రచురిత రచనలు / పుస్తకాలు: 6 పుస్తకాలు


1. భారత వాణి (బాల సాహిత్యం, బాల పంచపదులు సంపుటి) 

2. వరాల వీరితోట (వంద కవితల సంపుటి) 

3. వరాల గోరుముద్దలు (బాలసాహిత్యం, బాలగేయాల సంపుటి) 

        తెలుగు యూనివర్సిటీ వారు ఈ పుస్తకానికి పదివేల రూపాయల నగదు పారితోషకం ఇచ్చారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారి పురస్కారం ఈ పుస్తకానికి దక్కింది. 

కొనిరెడ్డి ఫౌండేషన్ వారి జాతీయ పురస్కారం

4. శ్రీ కృష్ణపదులు(200 ఇష్టపదుల సంపుటి) 

5. మిఠాయి పొట్లం (బాల సాహిత్యం,బాలగేయాల సంపుటి)

6. యనమండ్ర మౌక్తికాలు (పాఠశాల విద్యార్థుల కొరకు నీతి పద్య మాలిక) 

          (400 ఆటవెలది పద్య సంపుటీ)

   7. అమ్మమ్మ కథలు (బాల సాహిత్యం, బాలల కథలు) 


అనేక సంకలనాలలో నా కవితలు ప్రచురితమయ్యాయి. 


పొందిన పురస్కారాలు / సత్కారాలు: వివిధ సమూహాల నుండి పలు పురస్కారాలు, సత్కారాలు, బిరుదులు 

కొన్ని సమూహాలను నిర్వహణ,‌ కొన్ని సమూహాలలో సమీక్షణం 

యనమండ్ర సాహితీ వేదిక .. వ్యవస్థాపక అధ్యక్షురాలను 



నేను వ్రాయుచున్న ప్రక్రియలు: వచన కవితలు, బాల గేయాలు,‌బాలల కథలు , పెద్దల కథలు, పద్యాలు, రుబాయిలు, అష్టాక్షరి గీతికలు, యశోదమ్మ పదాలు(రూపకర్తను), మధురిమలు, చిమ్నీలు, హరివిల్లులు, మణిపూసలు, పంచపదులు, సున్నితాలు, అష్టాక్షరీ గీతాలు, గజల్స్, గేయాలు,పాటలు, అనేక లఘు ప్రక్రిలు వ్రాస్తున్నాను.


ఇష్టాలు: సాహిత్య పఠనం, లేఖనం, పెన్సిల్ డ్రాయింగ్స్, తోటపని మొదలగునవి.


జీవితాశయం: చేతనైనంత సాయం చేయటం. 







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page