top of page
Original.png

బాల గేయాల సంకలనం


బాల గేయాల సంకలనం – అమ్మ, అక్షరాలు, ఉయ్యాల, లాలీ పాటల తెలుగు బాల సాహిత్య చిత్రం

Bala Geyala Sankalanam - Telugu Inspirational Poems | Rallabandi Sangam Naidu

బాల గేయాల సంకలనం తెలుగు ప్రేరణాత్మక కవితలు | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 21/08/2026


బాల్యం అంటే పాటలు, పద్యాలు, అమ్మ ఒడిలోని వెచ్చదనం, ఉయ్యాల ఊగిసలాట, లాలీ పాటల మాధుర్యం. ఈ భావ ప్రపంచాన్ని అందంగా ప్రతిబింబించే నాలుగు ప్రధాన గేయాలతో కూడిన ఈ “బాల గేయాల సంకలనం” పిల్లల సాహిత్యానికే కాకుండా ప్రతి తరం పాఠకుడి బాల్య జ్ఞాపకాలను మేల్కొలిపేలా ఉంటుంది.

రాళ్లబండి సంగం నాయుడు రచించిన ఈ గేయాల్లో “అమ్మ” ద్వారా మాతృప్రేమ, “అక్షరాలు” ద్వారా విద్య–జ్ఞానం–మానవ అభివృద్ధి, “ఉయ్యాల” ద్వారా కుటుంబం–బాల్యం–భవిష్యత్తుపై ఆశలు, “లాలీ పాట” ద్వారా తల్లి స్వరంలోని అపారమైన మాధుర్యం ప్రతిఫలిస్తాయి.


అమ్మ

---------

అమ్మంటే ఆదిదైవం 

అమ్మంటే అనురాగం 

అమ్మంటే మమకారం 

అమ్మంటే అవని 

అమ్మంటే ఆప్యాయత 

అమ్మంటే అభిమానం 

అమ్మంటే లాలీపాట 

అమ్మంటే జోలపాట 

అమ్మంటే గోరుముద్ద

అమ్మంటే ఆలంబన 

అమ్మంటే ఆకాశం 

అమ్మంటే అవకాశం 

అమ్మంటే అనుకూలం 

అమ్మంటే ఆదరణ 

అమ్మంటే ప్రాణం 

అమ్మంటే ఊపిరి 

అమ్మంటే ఊయల 

అమ్మంటే అలుక 

అమ్మంటే ఉగ్గుపాలు 

అమ్మంటే తేనెమిఠాయి 

అమ్మంటే అందం 

అమ్మంటే బంధం 

అమ్మంటే ఔదార్యం 

అమ్మంటే త్యాగం 

అమ్మంటే మధురమైన జ్ఞాపకం 

అమ్మంటే చెరిగిపోని బాల్యం 

అమ్మంటే నెమరేసుకునే యవ్వనం 

అమ్మంటే నిత్యవసంతం 

అమ్మంటే నిండుదనం 

అమ్మంటే కమ్మదనం 

=======================

అక్షరాలు 

----------

ఆకాశంలో అందమైన తారలు 

జాబిలమ్మ వెన్నెల జాతరలు

చీకటిని తరుముతూ

 తన వెలుగు రేఖలతో 

కర్తవ్యబోధ చేస్తున్న ప్రత్యక్ష భగవానుడు

సూర్యుని నులివెచ్చని కిరణాలు 

 ఆలోచనల విత్తులు 

ఆనందాల చురకత్తులు 

అమ్మ స్తన్యపు చినుకులు

ఊహల తల్లితండ్రులు 

మానవ శక్తి అపరిమితాలు 

కలల అనంతాలు 

రసజ్ఞ చెరుకు గడలు 

అనశ్వర మందారాలు 

సమస్త మానవ జాతిని ఐక్య పరిచే 

స్వేద బిందువులు 

వివక్షను రూపుమాపే అస్త్రాలు 

కులమతలింగజాతి శత్రుసంహారాలు 

జ్ఞాన అవధులు అజ్ఞానసమాధులు 

భావ వినిమయ లిపికి పునాదులు 

భాషామతల్లికి అల్లికలు 

నాగరికత గొడుగులు 

అనిర్వచనీయ అనుభూతులు 

ఎల్లలెరుగని  ప్రేమలు 

అభివృద్ధి రహదారులు 

సమాచార గంగా ప్రవాహాలు 

మానవ జీవిత విరుపులు మెరుపులు 

పుస్తకపూదోటలోని విరులు 

అందమైన ఆడపిల్ల కురులు 

కాలానికి వంతెనలు 

స్వర్గానికి నిచ్చెనలు 

అన్యాయ అక్రమాలపై ఉక్కుపాదాలు 

విశ్వవిహారానికి దారులు 

సామాన్యుని భవిషత్తులు 

బతుకు పోరులోని సుఖసంపదలు 

కేవలం మానవునికే సొంతాలు 

చరిత్రలోని పంతాలు అంతాలు 

భావితరపు ఆశాజ్యోతులు 

ప్రపంచ ప్రసిద్ధ ప్రఖ్యాతులు 

========================

అమ్మ

----------

అమ్మ 

అవనిపై బ్రహ్మ 

అనుబంధాల 

ముద్దు గుమ్మ 

అనుభూతుల 

జాజి కొమ్మ 

ముద్దు మురిపెమ 

త్యాగం చిరునామా 

మమకార

మాధుర్యపు 

పైడి బొమ్మ 

ఆటబొమ్మలను 

ఆడించే అరుదైన 

నీటి చెమ్మ

కరుణలో మాత 

సహనానికి 

భూమాత 

పేగు బంధానికి తల్లి 

నమస్కరించు 

ప్రణమిల్లి 

అమ్మకు సరిసాటి 

దైవాలు లేరు ఇల 

అమ్మలేని జన్మ కల(ల్ల)

బొమ్మలకు ఊపిరి 

పోయు అమ్మ 

అమ్మ ఋణం 

తీర్చటానికి ఎత్తాలి 

మరో జన్మ 

ఆనందానికి 

ఆయువు పట్టు 

అమ్మ అమ్మ 

====================

ఉయ్యాల 

----------

ఉయ్యాల ఉయ్యాల 

మా అమ్మ స్పర్శ ఉయ్యాల

మా అమ్మ జోలా ఉయ్యాల 

మా నాన్న ప్రేమ ఉయ్యాల

మా వంశ చరిత్ర ఉయ్యాల 

మా తాత పేరు ఉయ్యాల

మా అమ్మమ్మ తీరు ఉయ్యాల

మా నాన్నమ్మ ఉగ్గు ఉయ్యాల 

మా పేద రాశి పెద్దమ్మ ఉయ్యాల

బుగ్గపై మా అమ్మ ముద్దు ఉయ్యాల

బుగ్గపై మా అమ్మ దిష్టి ఉయ్యాల

నా బాల్యం తీపు గుర్తు ఉయ్యాల

నా చిననాటి నేస్తం ఉయ్యాల 

మా అమ్మ పాలు ఉయ్యాల

మా నాన్న కష్టం ఉయ్యాల

మా ఊరి పౌరుషం ఉయ్యాల

మా కుటుంబ గౌరవం ఉయ్యాల

మా పెద్దల సాక్షి ఉయ్యాల

నా బాల్య మధురపు రాశి ఉయ్యాల

నా ఊహల రూపు ఉయ్యాల

నా ఆశల రేపు ఉయ్యాల

నా భవిష్యత్తు కాపు ఉయ్యాల

ఊగాం ఊగాం ఉయ్యాల

ఉత్తములుగా వెలిగేము ఉయ్యాల

జగతిని బంగారు మయం చేద్దాం ఉయ్యాల

నేలపై బంగారు పూలు పూయిద్దాం ఉయ్యాల

నింగిలో శాంతి పావురం ఉయ్యాలా

ఉయ్యాల ఉయ్యాల మా అమ్మ కౌగిలి ఉయ్యాల

మా నాన్న భుజం ఉయ్యాల

నా తోబుట్టువుల పరిమళం ఉయ్యాల 

=====================

లాలీ పాట 

----------


జోలాలీ 

అమ్మ నోట 

కమ్మని పాట 

సరస్వతి వీణకు 

శివుని నాదానికి 

ఋషి శంఖానికి

నారద గానానికి 

అందని అమృత ధార 

శిశువు చెవికి 

ఆపాత సంగీత ఝరి 

జోల పాట 

అమ్మ స్థన్యం 

నాన్న రక్తం 

ఊరి సోయగం 

వంశ ప్రతిష్ట 

శబ్ద గౌరవం 

ఆశ, శ్వాస, ధ్యాస, భాష 

తెలుగు రవం 

శివుని ఢమరకం 

అమ్మ ఆశీర్వాదం 

లాలీ పాట 

నా తల్లి నోట 

తేనెల ఊట 

జగమేలు పూబాట

రామా లాలీ 

మేఘ శ్యామలాలి అంటూ 

అమ్మ నను కప్పు పైట 


*** 


రాళ్లబండి సంగం నాయుడు

-రాళ్లబండి సంగం నాయుడు


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page