కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.
Video link
'Sapagrasthulu' New Telugu Story By Ramakuru Lakshmi Mani
రచన: రామకూరు లక్ష్మి మణి
సాగరయ్యా.. సాగరయ్యా.. ఏమిటయ్యా.. ఎందుకిట్టా జరిగింది.. రోజూ నీకు దణ్ణం పెట్టుకుంటాను.. ఇయాల నీకు ఎక్కువ మొక్కానే.. అయినా ఇట్టా తీసుకుపోయావు.. నా వారసుడిని నాకు గాకుండా సేసినావు.. నా కొడుకుని తీసుకుపోయావు.. నా కోడల్ని, నా మనవడ్ని కూడా నాకు గాకుండా సేసినావేందయ్యా.. ఇన్నేళ్లు నిన్నే నమ్మినాను గందా.. గిదేనా నాకు నువ్విచ్చే బగుమానం.. ఎవ్వరూ లేకుండా నేనేట్టా బతకాలి…
ఏడుస్తున్న భూమయ్యని చూసి అక్కడి వారికీ గుండె పిండేసినట్లుయింది..
భూమయ్యని ఆపడం ఎవరి తరం కావట్లేదు…
భూమయ్య సముద్రంలో చేపలు పట్టడానికి వెడతాడు.. సముద్రాన్ని సాగరయ్య అని పిలుస్తూ బోలెడు పదాలు పాడుతూ ఉంటాడు..
సాగరయ్యా సాగరయ్యా
ఎన్నెలమ్మ జత కట్టయ్యా
ఎన్నెలమ్మ జత కట్టయ్యా
సల్లంగా సూడయ్యా
అంటూ పాడుకుంటూ చేపలు పట్టుకొని తీసుకెళ్లి సంతలో అమ్ముకుంటాడు.. అదే అతని జీవనాధారం.
చేపలు వలలో పడితేనే ఆ రోజు అతని కుటుంబానికి కడుపు నిండేది..
భూమయ్యకి, అతని కొడుకుకి ఆ పని తప్ప ఇంకేమీ రాదు.. ఎప్పటి నుంచో ఉన్న చిన్న పడవ, వల పట్టుకుని ఇద్దరూ సముద్రం మీదకి వెడతారు.ఆ పడవనే బాగు చేసుకుంటూ, వల కన్నాలు పడితే కుట్టుకుంటూ దాంతోనే దొరికన కాడికి చేపలు పట్టుకుని అమ్ముకుంటాడు. చిన్న పడవ కాబట్టి ఎక్కువ దూరం వెళ్ళలేరు..
ఏదో ఉన్నంతలో కొడుక్కి పెళ్లి చేశాడు.. కోడలు వచ్చింది.. హాయిగా గడిచిపోతోంది అనుకుంటే ఇంతలో పెను దుమారం అతని జీవితంలో..
దురదృష్టం అతనికి అలల రూపంలో వచ్చింది..కొడుకు సముద్రపు అలలకి కొట్టుకపోయాడు.. ఒకరోజు చేపలు పట్టి ఇద్దరూ ఇంటికి బయలుదేరారు .. పడవని ఒడ్డుకు చేర్చి వలని చుట్టచుడుతూ ఉంటే పెద్ద అల వచ్చి లాక్కుని పోయింది.
ఆరోజు అమావాస్య.. చిమ్మ చీకటి.. అసలు ఏరోజు చీకటి పడే వరకు ఉండరు.. ఆరోజు చేపలు చిక్కలేదు.. అందుకే ఆలస్యం అయిపొయింది. బాగా చీకటిగా ఉంది.
అలల ఉధృతి ఎక్కువగా ఉండటం తో ఒక్కసారిగా ఈడ్చుకుని పోయింది.. తన కళ్ళముందే కొడుకు అలా కొట్టుకు పోతూంటే ఏమీ చెయ్యలేక పోయాడు.
నిండు గర్భిణీ కోడలు.. ఆ రోజు పట్టుకున్న చేపల్ని అమ్మి కొడుకు కి తల కొరివి పెట్టాడు..
ఇక ఆ రోజు నుంచీ అమావాస్య రోజు అంటే భూమయ్యకి మహా కోపం..
ఒక్కడే సముద్రం మీదకు పడవ తీసుకుని వెడతాడు.. చేపలు అమ్మగా వచ్చిన డబ్బుల్తో కోడలు తను ఏదో ఇంత తింటున్నారు.. మనవడు పుట్టాడు.చూసుకుని మురిసిపోయాడు.
అయితే ఆ ఆనందం ఎక్కువ కాలం దక్కలేదు.. సునామీ రూపంలో మొత్తం అక్కడున్న గుడిసెల్లో ఉన్న వారిని ముంచేసింది..
చేపలు అమ్మడానికి పక్కనున్న పట్నానికి వెళ్లిన అతను మాత్రం బతికి పోయాడు..
తనలాంటి వాళ్ళు ఉండే ఆ ప్రదేశం అంతా మృత్యు శిబిరం లాగా ఉంది.. గుడిసెలు నామరూపాలు లేవు..
కోడల్ని, మనవడిని వెతుక్కుంటూ వెళ్ళాడు.. అర కిలోమీటరు దూరంలో ఇసుకలో కూరుకు పోయి కనిపించారు..
కోడలి ఒళ్ళో పడుకున్న చంటివాడు అలాగే తల్లి ఒంటికి అతుక్కుపోయి కనబడ్డాడు..
గుండెలవిసి పోయేలా ఏడ్చాడు.. కారుతున్న కన్నీళ్లు జోరున పడుతున్న వాన నీటిలో కలిసిపోయాయి..
అందరి హాహా కారాలతో, ఏడ్పులతో ఆ ప్రదేశం నిండిపోయింది..
భూమయ్య కి ఎటుపోవాలో ఏం చెయ్యాలో తోచడం లేదు. సముద్రం వేపు పరిగెడుతూ ఉంటే చుట్టూ ఉండే కొందరు పట్టుకుని లాగారు.. అలలు ఎగిసి పడుతూ ఉంటే భయంగా ఉంది అందరికి..
అక్కడ బ్రతికి బైట పడ్డవాళ్లు కట్టెలుగా మారిన తమ వారిని వెతుక్కుంటూ ఉన్నారు..
అతి దైన్య పరిస్థితి వారిది.. ప్రకృతికి కోపం వస్తే ముందుగా అలాంటి వారి మీదే విరుచుకు పడుతుంది.. వాళ్లకి మేడలు, మిద్దెలు ఉండవు.. సునామీలు, వరదల నుంచి వాళ్ళని వారు రక్షించుకోలేని దుర్బర పరిస్థితి లో ఉంటారు..
చేపలు అమ్మగా వచ్చిన డబ్బుతో కోడల్ని, మనవడిని మరుభూమికి తీసుకు వెళ్ళాడు భూమయ్య..
పడవ లేదు, చేపలు పట్టే వల లేదు.. తాగడానికి గుక్కెడు నీళ్లు లేవు..
భీభత్సం సృష్టించిన సముద్రం మాత్రం ప్రశాంతంగా అయి ..ఏమీ తెలియనట్లు వెన్నెల వెలుగులో మెరుస్తూ కనబడుతోంది..
అన్నీ కోల్పోయిన భూమయ్య నిర్జీవంగా కాంతిహీనంగా ఉన్న కళ్ళతో దిగాలుగా సముద్రం వేపు చూస్తూ కూర్చున్నాడు.
***సమాప్తం***
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలు చదవాలంటే కథ పేరు పైన క్లిక్ చేయండి.
రచయిత్రి పరిచయం : నా పేరు రామకూరు లక్ష్మి మణి ( pen name ) అసలు పేరు--( official ) R.L.Manikyamba నేను ప్రభుత్వ హై స్కూల్ టీచర్ గా పనిచేసి పదమూడేళ్ళక్రితం రిటైర్ అయ్యాను. నా విద్యార్హతలు M A, MEd, M.phil నాకు చిన్నతనం నుండి తెలుగు సాహిత్యం అంటే మక్కువ. సంగీతం లో ప్రవేశం ఉన్నా దానిని కొనసాగించలేదు. హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రంలో డ్రామా ఆర్టిస్ట్ గా సెలెక్ట్ అయ్యి కొన్ని నాటికలలో పాల్గొనడం జరిగింది. చిన్నప్పట్నుంచీ పుస్తకాలు చదవడం నా హాబీ..అడపాదడపా రాస్తూ వారపత్రికలకి పంపేదాన్ని. ముద్రితమయ్యాయి. గత రెండేళ్లుగా ప్రతిలిపి లో కధలు, ధారావాహికలు, వ్యాసాలు,కవితలు రాస్తున్నాను. నగదు బహుమతి, ప్రశంసా పత్రాలు గెలుచుకోవడం జరిగింది.
కథ చాలా బాగుంది.
జాలరి జీవితాన్ని, కష్టాలను బాగా చూపించారు.