top of page

సీరియల్ చూడ వేళాయెరా! పార్ట్ 2


'Serial Chuda Velayera Part 2/2' - New Telugu Story Written By Allu Sairam

Published In manatelugukathalu.com On 11/11/2023

'సీరియల్ చూడ వేళాయెరా పార్ట్ 2/2' పెద్ద కథ

రచన: అల్లు సాయిరాం

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


పుట్టింటికి వెళ్లి వచ్చిన రాధా టివి సీరియల్స్ కి అడిక్ట్ కావడం గమనిస్తాడు గోపాలం.

ఇటీవల కూరల్లో ఉప్పూకారాలు ఎక్కువతక్కువలు కావడానికి ఇదే కారణమని గ్రహిస్తాడు.ఇక సీరియల్ చూడ వేళాయెరా! 2 చదవండి..


రాధకి యి సీరియల్ గ్రహణం ఏలా యింతలా పట్టిందని డిటెక్టివ్ అవతారమెత్తిన గోపాలం కసరత్తులు చేయడం మొదలుపెట్టాడు. సీన్ రీ-క్రియేషన్ ప్రొగ్రాం పేరు చెప్పి రాధ మానసిక పరిస్థితిని విశ్లేషిస్తున్నాడు. ఊరి నుంచి వచ్చిన మొదటి రోజు రాధ మామూలుగానే ఉంది. ఆ రోజు ఎందుకు సీరియల్స్ చూడలేదు. అసలు ఆరోజు ఏం వారం అని క్యాలెండర్ చూస్తే, ఆరోజు ఆదివారం. సీరియల్స్ రావు కాబట్టి, మాములుగానే మాట్లాడుతూ ఉంది అనే విషయం అర్ధమైన గోపాలం, చెట్టు నుంచి ఆపిల్ పండు కింద పడినప్పుడు చూసి గురుత్వాకర్షణ శక్తిని కనిపెట్టిన న్యూటన్ లా ఫీలయ్యాడు. అప్పటినుండి రాధని సీరియల్ చూడనివ్వకుండా భగీరథ ప్రయత్నాలు చేస్తున్నాడు.


ఒకరోజు రాత్రి రాధ సీరియల్లో లీనమై చూస్తుంటే, గోపాలం యింటి కరెంట్ మెయిన్ ఫ్యూజ్ తీసేసి, ఆనందంగా యింటి లోపలికి వెళ్ళి “ఏంటో! యి కరెంటు ఎప్పుడు వస్తుందో! ఎప్పుడు పోతుందో! తెలియట్లేదు. అసలు వస్తుందో, రాదో చెప్పలేమంటున్నారు!" అని రాధ ముందు తెలివి ప్రదర్శిస్తూ అన్నాడు.


కాసేపు నిట్టూర్చిన రాధ బుర్రలో మెరుపు లాంటి ఆలోచన వచ్చి, వెంటనే మొబైల్లో లైవ్ టివి ఓపెన్ చేసి సీరియల్స్ చూస్తుంది. ఇది ఊహించని గోపాలం చిరాకుగా "ఈరోజైనా వంట తొందరగా చేస్తే, తినేసి పడుకుందాం!" అని అన్నాడు.


కరెంట్ పోయినా సరే మొబైల్లో సీరియస్ గా సీరియల్ చూస్తున్న రాధ కనీసం తల కూడా గోపాలం వైపు తిప్పకుండా "ఇంత చీకటిలో ఏం వండుతానండీ! స్వీగ్గీలోనో, జోమాటోలోనో ఏదోకటి ఆర్డర్ పెట్టేయండి. తినేసి తొందరగా పడుకుందాం!" అని ధీమాగా అంది.


దాంతో నాలుక కరుచుకున్న గోపాలం "సరిపోయింది! కొంపదీసి, నేనే కరెంట్ కట్ చేశానని చూసేసిందా! అంత ధీమాగా ఉంది! యిప్పుడు వెళ్లి ఫ్యూజ్ పెట్టి, కరెంట్ వచ్చేస్తే, కావాలనే చేశానని అనుమానం వస్తే, మళ్లీ లేనిపోని తలనొప్పులు ఎందుకు!" అని మాంచి దమ్ బిర్యాని ఆర్డర్ పెట్టి, చాలా రోజులుగా రాధ సీరియల్స్ పిచ్చిలో పడి ఉప్పు, కారం లేని చప్పటి వంటలు తిని తిని విసిగిపోయిన నాలుకకి రుచి చూపించాడు.


ఏం చేద్దామని జుట్టు పీక్కుంటున్న గోపాలానికి మరొక మంచి అవకాశం వచ్చింది. "ప్లీజ్ రీచార్జ్! ప్లీజ్ రీచార్జ్ యువర్ మొబైల్ డేటా!!" అని రోజూ మొబైల్ కంపేనీ నుంచి మెసేజ్లు, నోటిఫికేషన్లు వస్తున్నా, రీచార్జ్ చెయ్యకుండా, మొబైల్ డేటా పూర్తిగా వాడేసి "రాధ యిప్పుడు సీరియల్స్ ఎలా చూస్తుందో నేను చూస్తాను!" అని యిసారి ఏకంగా యింటి కేబుల్ డిష్ వైర్లు కట్ చేసేశాడు. సీరియల్ చూడడానికి అవకాశం లేకపోయేసరికి రాధకి ఒక్కసారిగా ఊపిరాడనంత పని అయిపోయి, చంద్రముఖిగా మారిన జ్యోతికలా యిల్లంతా తిరగేసి, చివరికి ప్రక్కింటికి వెళ్లి అన్ని సీరియల్స్ అయిపోయినంత వరకు యింటికి రాలేదు.


రాధకి సీరియల్స్ పైనున్న యిష్టం ముందు గోపాలం చేసిన విశ్వప్రయత్నాలన్ని ఏదో రకంగా తుస్సుమంటున్నాయి. కట్ చేయాల్సింది యింటి కేబుల్ వైర్లు కాదు. రాధ బుర్రలో కేబుల్ వైర్లు! మార్చాల్సింది మొబైల్ కాదు. రాధ మనసు అని గోపాలం చిన్న మెదడుకి అర్ధమైంది. అయితే, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చెప్పాలి అని ఆలోచించాడు. తను సీరియల్స్ చూస్తున్నప్పుడు చెప్పినా ఉపయోగం ఉండదు. ఆదివారం రోజు సీరియల్స్ రావు కాబట్టి, ఆదివారం ముహూర్తం ఖరారు చేశాడు. ఎలా చేయాలి అనే విషయంపైన కసరత్తులు చేస్తున్నాడు.


ఆదివారం రానే వచ్చింది. దొరికిన అవకాశాన్ని వినియోగించుకుని రాధకి సీరియల్ గ్రహణం వదలగొట్టడానికి కౌన్సిలింగ్ యివ్వడానికి సీరియల్స్ - వాటి చరిత్ర అని పెద్ద స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్న గోపాలం, ఆ రోజంతా ఏకధాటిగా రాధని కదలనివ్వకుండా, తన ఒడిలో కూర్చోపెట్టుకొని మరీ క్లాస్ పీకిన పీకుడుకి రాధ బుర్ర గిర్రున తిరిగి, రాత్రి భోజనం చేయకుండా పడుకుండిపోయింది.

మరుసటిరోజు ఉదయం ఆఫీసుకి గోపాలం బయలుదేరి వెళ్తుండగా ఎదురుగా యింటికి వస్తున్న ఒక తాపీమేస్త్రి “గోపాలం! ఇంట్లో ఏదో సిమెంట్ పని ఉందని రాధ చెప్పింది!" అని అన్నాడు.


గోపాలం ఆశ్చర్యపోతూ “నాకు తెలియకుండా యింట్లో ఏం పని ఉంటుంది చెప్మా!" అనుకుంటూ యింటి వైపు చూస్తూ “రాధా! ఏదో సిమెంట్ పని ఉందని మేస్త్రిని పిలిచావా? ఆయన వచ్చాడు. చూడు! నేను ఆఫీసుకి వెళ్తున్నాను!" అని గట్టిగా పిలిస్తే, వంటింట్లో నుండి గరిటె పట్టుకుని బయటికి వచ్చిన రాధ మేస్త్రి వైపు చూస్తూ “ఆఁ! చిన్నపని ఉంటే, పిలిచాను!" అని అంది.


గోపాలం ఆఫీసుకి బయలుదేరిందే లేటు. ఇంకా అప్పుడు ఏం పని అని తెలుసుకునేటంత టైం లేకపోవడంతో "సరే! అయితే చూడు. నేను బయలుదేరుతున్నాను. ఎదైనా అవసరమైతే ఫోన్ చెయ్యి!" అని బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు గోపాలం.


రాధకి సీరియల్స్ చూడకుండా ఉండేందుకు ఉపదేశించిన మంత్రాలు ఏమైనా రాధ బుర్రలోకి దూరి ప్రభావం చూపిస్తున్నాయా లేదా, లేకపోతే యి ప్రయత్నం కూడా వృధాయేనే అని తెగ ఆలోచిస్తున్నాడు. గోపాలం ఆత్రుతగా ఆఫీస్ నుండి వచ్చి, బయట నుండి నక్కినక్కి యింట్లోకి చూస్తున్నాడు. సీరియల్ సౌండ్ వినిపిస్తోంది.


"చఁ! చెప్పినదానికి, ఆలోచించినదానికి ప్రయోజనం లేకుండా పోయింది!" అని నిరాశగా లోపలికి వస్తూ “తలనొప్పిగా ఉంది. టీ పెట్టు రాధ!" అని చెప్పడం తడువుగా వంటింట్లో నుంచి రాధ టీ తీసుకుని గోపాలం ముందు వాలింది.


గోపాలం ఆశ్చర్యపోతూ కొంపదీసి, ఈరోజు ఆదివారం కాదు కదా, లేకపోతే సీరియల్స్ కి సెలవు కాదు కదా అని ఎదురుగా చూస్తే టివిలో సీరియల్ వస్తూనే ఉంది. సీరియల్ వచ్చినప్పుడు కూడా, మన మాట విని, రాధ టీ యిస్తుందంటే, నిన్న పీకిన క్లాస్ బాగా పనిచేసిందన్న విజయగర్వంతో “శభాష్ గోపాలం! గ్రేట్ జాబ్!!" అని తనని తానే మెచ్చుకుని భుజాలు తట్టుకుంటున్నాడు.


ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. టీ తాగుతూ కిచెన్ లో వెనుదిరిగి వంటచేస్తున్న రాధని కళ్ళప్పగించి చూస్తున్న గోపాలం “యిదెంటీ! హాల్లో నుండే వంటగదిలో ఉన్న రాధ ఎదురుగా ఉన్నట్లు కనిపిస్తుంది?" అని ఆశ్చర్యపోతూ, కంగారుగా వంటగదిలో ఉన్న రాధ దగ్గరికి వెళ్లి “ హాల్ కి, వంటగదికి మధ్యలో గోడ ఉండేది కదా! ఏమైంది?" అని అడిగాడు.


"ఓహో అదా! నిన్న మీరు చెప్పింది రాత్రంతా ఆలోచిస్తే, నాకు మీ బాధ అర్థమయింది!" అని రాధ చెప్తుంటే గోపాలం గాభరాగా "సంతోషం! యి గోడ ఏమైంది?" అని అడిగాడు.


"అబ్బా! అదేనండీ చెప్తున్నాను! పూర్తిగా వినరు. మీరు మీ గాభరా! మీ కష్టం విన్న తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది. టీవీ తీసుకువచ్చి వంటింట్లో పెట్టుకుందామంటే, అటు యిటూ తిప్పడం కుదరదు. అందుకే, యిక్కడ అడ్డంగా ఉన్న గోడ తీసేస్తే, నేను యిక్కడినుంచే వంట చేస్తూ సీరియల్ చూడొచ్చు. వంట అయిపోతుంది. సీరియల్ చూడడం అయిపోతుంది. మీరు కూడా నన్ను యింతవరకు అక్కడినుంచి చూశారు. బాగుంది కదా!" అని చాలా తెలివిగా గోపాలం నడుము మీద గిల్లుతూ రాధ చెప్పిన సమాధానానికి, గోపాలం గుండె జారి చేతిలోకి వచ్చేసినంత పని అయ్యింది.

గోపాలం కోపంగా పళ్ళుకొరుకుతూ “యిన్ని ఆలోచించిన నీకు, సీరియల్ చూడకూడదనే ఆలోచన మాత్రం రాలేదు కదా!" అని అనుకుంటూ రాధ చేసిన పనికి నవ్వాలో, ఏడవాలో తెలియక పిచ్చెక్కిపోయి వచ్చి సోఫాలో తలపట్టుకుని కూర్చున్నాడు.


ఇక అక్కడినుండి సీరియల్ చూడొద్దంటూ చేప్పే ఉపదేశాలకి స్వస్తి పలికాడు. రాధ యింతగా సీరియల్స్ ప్రభావానికి లోనవ్వడానికి గల కారణాలు తెలుసుకోవడానికి మళ్ళీ ఆదివారం కోసం ఎదురు చూశాడు. ఆఫీసులో కుడా పనిమీద ధ్యాస పెట్టకుండా, యి ఆదివారం ఎలాగైనా సరిగ్గా వినియోగించుకోవాలని అనుకుంటూ తీక్షణంగా ఆలోచిస్తూ ప్రణాళికలు గీస్తున్నాడు.


సర్వసమస్య నివారిణి అయిన ఆదివారం రానే వచ్చింది. "ఈసారి రాధతో ఏం మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడాలి. క్రిందటిసారి నేను ఏదో చెప్తే, తాను ఏదో అర్థం చేసుకుని అనవసరంగా వంటగది గోడ కూల్చేసింది!" అని మనసులో అనుకుంటూ పెద్దపెద్ద కళ్ళు వేసుకుని రాధ ముందు అటుయిటూ తిరుగుతున్నాడు.


గోపాలం చేస్తున్న బిల్డప్ చూసి తట్టుకోలేక “నన్నేమైనా అడగాలనుకుంటున్నారా?" అని అడిగింది రాధ.


అటువంటి అవకాశం కోసం కాపుకాచుకుని కూర్చొన్న గోపాలం “రాధ! అందుకే నువ్వు నాకు నచ్చుతావు.‌ మనసులో ఏదైనా అనుకుంటే అలా పట్టేస్తావు!" అని రాధని అసందర్భంగా పొగుడుతుంటే, రాధ యిప్పుడు అవసరమా అని ముఖం పెట్టేసరికి, గోపాలం సర్దుకుని "అదే రాధ! యి సీరియల్స్ చూసే అలవాటు నీకు ముందు లేదు కదా. యి అలవాటు ఎలా వచ్చింది?" అని ఓపెన్ అయిపోయాడు.


“ఓహో అంతేనా! నేను పుట్టింటికి వెళ్లినప్పుడు బామ్మ, అక్క లు సీరియల్స్ యొక్క గొప్పతనం గురించి నాకు చెప్పారు. అయితే ఏడడుగులు, ప్రణయానికి పన్నెండు మెట్లు లాగా అన్ని సీరియల్లోను మన జీవితాల్ని కథలుగా తీసుకొన్నట్లు చాలా ఇంట్రెస్ట్ గా ఉండడంతో, నేను అప్పటినుంచి సీరియల్ చూడడం మొదలుపెట్టా!" అని అదెదో నోబెల్ బహుమతి సాధించినంత ఆనందంగా వివరించింది రాధ.


“అప్పుడు నిన్ను కాదు, బంగారం లాంటి నీ ద్వారా మన కాపురానికి యి సీరియల్ గ్రహణం పట్టించిన రాహుకేతువులలాంటి మీ బామ్మ, అక్క ల గ్రహణాన్ని ముందు వదిలించాలి!" అని పళ్ళు కొరుకుతూ మనసులో అనుకున్నాడు గోపాలం.


కాలం ప్రతి ఒక్కరికీ అవకాశం యిస్తుంది అన్నట్టు, మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న గాలివానలకి స్తంభాలు పడిపోయి, కరెంట్ లేకుండా పోయింది. పలుచోట్ల యిళ్లల్లోకి నీరు చేరి, ప్రజాజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. ఆఫీసు లేదు. బయటికి వెళ్లే పరిస్థితి లేదు. రాధకి మూడు రోజుల నుండి సీరియల్లో ఏమవుతుందో తెలియక వుసురుమంటూ కూర్చుంది. గోపాలం తాను చేసిన భగీరథ ప్రయత్నాలకి ఫలితంగా దేవుడు కరుణించి ఆకాశగంగని భువికి దించినంత ఆనందానికి అవధుల్లేవు.


రాధ మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేసి సీరియల్ చూడడానికి ట్రై చేస్తే, వీడియో గిర్రున తిరుగుతూనే ఉంది. "ఏంటి యి చెత్త మొబైల్. ఎప్పుడూ బాగా పనిచేయదు!" అని చిరాకుగా మొబైల్ స్క్రీన్ మీద కొడుతూ అంది రాధ.


గోపాలం నవ్వు ఆపుకుంటూ “ఎంతసేపు నీ సీరియల్ గొడవే కానీ, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో పట్టించుకోవా? మూడు రోజుల నుండి కరెంటు లేకుండా జనాలు నానా అవస్థలు పడుతుంటే, నీకు మాత్రం మొబైల్ సిగ్నల్ ఎలా వస్తుంది? కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు. యిప్పటికే దానికి చార్జింగ్ అయిపోయింది!" అని అన్నాడు.


రాధ అదేం పట్టించుకోకుండా మేడపైకి వెళ్లి సిగ్నల్ వచ్చే దగ్గర నిలబడి కమలకి ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తిన కంగారు కమల “ఏమే రాధా! మూడు రోజుల నుండి అక్కడ వర్షాలు పడుతున్నాయంటగా! న్యూస్ లో చూశాం. మీరు ఎలా ఉన్నారు?" అని అడిగింది.


“మేం బాగున్నాంలే కానీ! మూడు రోజులుగా కరెంట్ లేక బొత్తిగా సీరియల్ చూడడమే కుదరలేదు. సీరియల్ ఏమయ్యాయి? ఏమవుతున్నాయి?" అని అంటూ ఆరున్నర నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటిగా అన్ని సీరియల్లో, యి మూడు రోజుల్లో ఏమి జరిగింది అని కనుక్కుంటుంది.

అది చూసిన గోపాలం “వెనకటికి నీలాంటోడే, ఊరు కాలిపోయి అందరూ ఏడుస్తుంటే, బీడీచుట్టకి నిప్పులేదని ఏడ్చాడంట! అసలు యింత సీరియల్ పిచ్చేంట్రా బాబు!!" అని అంటూ నెత్తికొట్టుకుంటున్నాడు.


ఆరోజు రాత్రికి కరెంటు రావడంతో రాధకి ప్రాణం లేచి వచ్చినట్టుగా, ఆనందంతో గోపాలం చుట్టూ ఎగిరెగిరి గెంతుంతుంది.


ఆ రాత్రంతా నిద్ర లేకుండా బాగా ఆలోచిస్తే గోపాలంకి రెండు మార్గాలు కనిపించాయి. మొదటిది, రాధని ఎలాగైనా మార్చుకుని తన దారిలోకి తెచ్చుకోవడం! జరిగిన పరిణామాలతో అది జరుగుతుందన్న నమ్మకం పోయింది. ఇక రెండోది, తను మారిపోయి, బుద్ధిగా రాధ దారిలోకి వెళ్లి, సీరియల్ చూడడం అలవాటు చేసుకోవడం! ఏం చేద్దామని ఆలోచిస్తూ ఆఫీసుకి బయలుదేరాడు.


ఆఫీసు నుంచి వచ్చేసరికి రాధ యధావిధిగా సీరియల్ చూస్తుంది. మరేం చేసేది లేక, యింకెందుకులే అనుకుంటూ రాధ పక్కన కూర్చొని సీరియల్ చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు రాధ అంతులేని ఆనందంతో గోపాలంని చుట్టూ మల్లెతీగలా అల్లుకుంటూ “ఈ సీరియల్ పేరు ఏడడుగులు. నీకు గుర్తుందా?" అని మురిసిపోతూ అడిగింది.


“ఏం గుర్తులేదు. ఏడు సంవత్సరాల ముందు మనం బి.టెక్ చదివేటప్పుడు, యి సీరియల్ మొదలైంది కదా! ఆ టైం లో మనిద్దరి ప్రేమ యింటి దగ్గర తెలిసిపోయి, గొడవలు జరిగాయి, చివరికి పెద్దలు ఒప్పుకుని, మనకు పెళ్లి చేశారు. అంతా ఈజీగా మరిచిపోతానా డియర్?" అని తమ ప్రేమ జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ అన్నాడు గోపాలం.


చాలా రోజులు తర్వాత తీరిగ్గా సీరియల్ చూస్తున్న గోపాలం “ఏంటి? ఈ ఏడడుగులు సీరియల్లో హీరోయిన్ కి యింకా పెళ్లవ్వలేదా? నిజంగా యిది ఘోరమే! కొంచెం అయినా మనస్సాక్షి ఉండాలి కదా! అప్పుడెప్పుడో ఏడు సంవత్సరాల ముందు పెళ్లి చేసుకోవడానికి, అమెరికా నుంచి హీరోయిన్ ఇండియాలో ఉన్న తాతగారింటికి వచ్చింది. ఎంతకీ సీరియల్ అయితే మాత్రం, పెళ్లిచూపులుకే ఏడు సంవత్సరాలా? ఇంకా పెళ్లికి పది సంవత్సరాలు కచ్చితంగా పడుతుంది.


అంతవరకు హీరోయిన్ ఏడుపు చూసి మీరు ఏడుస్తూ, మమ్ముల్ని ఏడిపిస్తారు. ఇంకా ఈ సీరియల్స్ చాలా బాగుంటుందని నువ్వు వత్తాసు పలకడం! ఈ సీరియల్స్ చూసే బదులు నోరుమూసుకుని, నువ్వు వండిన ఆ మాడిపోయిన వంటలు తినడమే మేలు!" అని బెడ్ రూంలోకి వెళ్లి టప్ మని తలుపు వేసుకున్నాడు.


లోపలికి వెళ్ళి చాలాసేపయ్యింది. కిక్కుమని శబ్దం లేకపోవడంతో, గోపాలం మొదటికే కంగారు మనిషి. కోపంతో ఏదైనా చేసుకుంటున్నాడేమోని భయపడి, బెడ్ రూం తలుపు తీసి లోపలికి వెళ్లిన రాధకి గోపాలం చేస్తున్న పనిచూసి నవ్వాగలేదు. గోపాలం సీరియస్ గా విప్లవ నినాదాలతో ప్లకార్డులు తయారుచేస్తున్నాడు.


“ఏంటి మాష్టారు! అవి?" అని అంటూ పగలబడి నవ్వింది రాధ.


గోపాలం చిన్నబోయి "యివి సీరియల్ చూస్తూ, ప్రక్కన ఉన్నవారిని యిబ్బంది పెట్టేవారి బారి నుండి మాలాంటి బాధిత అమాయకుల్ని కాపాడటానికి అఖిల భారత సీరియల్ వ్యతిరేక సంఘం అధ్యక్షునిగా నేను తయారుచేస్తున్న నినాదాలు!" అని అమాయకంగా చెప్పడంతో పగలబడి నవ్వుతూ “ఏంటి, అఖిల భారత సీరియల్ వ్యతిరేక సంఘమా! దానికి నువ్వు ప్రెసిడెంటా? ఎవరిచ్చారు?" అని రాధ అడిగింది.


“నాకు ఒకరు యిచ్చేదెంటీ? నాకు నేనే యిచ్చుకున్నా! ఎవరొచ్చినా ఈ ఉద్యమాన్ని ఆపలేరు! అవసరమైతే, ఆమరణ నిరాహారదీక్షలైనా చేపడతాం!!" అని అంటూ నినాదిస్తు ప్లకార్డులు ప్రదర్శిస్తూ గోపాలం బయటికి వెళ్లిపోతుంటే, రాధ గట్టిగా గోపాలం చేతిని పట్టుకుని, దిష్టి తీస్తున్నట్లు “నా బంగారమే!" అని గట్టిగా నవ్వుతూ మెటికలు విరిచింది.


గోపాలం విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ “ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం! విప్లవం వర్ధిల్లాలి!!" అని అంటూ నినాదిస్తున్న గోపాలం నోటికి రాధ నవ్వుతూ, తన నోటితో తాళం వేసి, గట్టిగా తన కౌగిలిలో బంధించి మరీ, గోపాలంకి సీరియల్ చూపిస్తుంది.

========================================================================

సమాప్తం

========================================================================

అల్లు సాయిరాం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

రచయిత పరిచయం: పేరు అల్లు సాయిరాం


హాబీలు: కథా రచన, లఘు చిత్ర రూపకల్పన

ఇప్పటివరకు పది కథల దాకా ప్రచురితమయ్యాయి.

ఐదు బహుమతులు గెలుచుకున్నాను.


32 views2 comments

2 Comments


@seera4501 • 2 days ago

Story is very realistic . Nice.

Like

@abrcreations8187 • 2 days ago

సాయిరాం గారి రచనలు చాలా బాగుంటాయి....

Like
bottom of page