top of page
Original.png

శబరి


శబరి, తెలుగు కుటుంబ కథ, అమ్మమ్మ కథ, భావోద్వేగ తెలుగు కథ, కుటుంబ విలువలు, అమ్మమ్మ ప్రేమ, అవయవదానం, మానవసేవ, సంప్రదాయం, తెలుగు కథలు, inspirational Telugu story, Mana Telugu Kathalu

మనవళ్లతో కలిసి గ్రామీణ ఇంటి ఆవరణలో పక్షులకు ఆహారం పెడుతున్న ప్రేమమయమైన తెలుగు అమ్మమ్మ.
మనవళ్లతో కలిసి గ్రామీణ ఇంటి ఆవరణలో పక్షులకు ఆహారం పెడుతున్న ప్రేమమయమైన తెలుగు అమ్మమ్మ.

Sabari - Telugu Emotional Family story | Godavarthy Janaki Syamasundar

శబరి తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | గొడవర్తి జానకి శ్యామసుందర్

Published in manatelugukathalu.com on 07/07/2026


అమ్మమ్మ అంటే కేవలం ఒక కుటుంబ పెద్ద కాదు... ప్రేమ, ఆప్యాయత, సంప్రదాయం, సేవ, త్యాగం, మానవత్వానికి సజీవ రూపం. అలాంటి విలువలతో నిండిన ఓ మహోన్నత మహిళ జీవితాన్ని మనసును హత్తుకునేలా ఆవిష్కరించే హృద్యమైన తెలుగు కథే "శబరి". కుటుంబ బంధాలు, ప్రకృతి ప్రేమ, ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయ భావన, చివరికి అవయవదానం ద్వారా మానవసేవను చాటిన ఈ కథ ప్రతి పాఠకుడి హృదయాన్ని తాకుతుంది.


“ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపలనుండు లీనమై” శ్రావ్యంగా, మృదు మధురంగా గజేంద్రమోక్షంలోని పద్యాలు అమ్మమ్మ చదువుతోంది. పక్షులు ఆవిడ గళ మాధుర్యానికి వంతుగా తమ కిలకిలారావాలను సందడిగా చేస్తున్నాయి. ప్రకృతి అంతా పులకిస్తోంది. 


చీకటి తెరలు తొలగించుకుంటూ భానుని లేలేత కిరణాలు తూర్పున కనిపించే సమయానికి “కౌసల్యా సుప్రజ రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే” అమ్మమ్మ మేలుకొలుపు. పూజ పూర్తయిందన్నట్లుగా ఘంటారావం, ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. రైలు వేగంగా వెళుతోంది.


“నిద్ర పట్టిందిలే అని డిస్టర్బ్ చేయలేదు అప్పుడే లేచావేం?” నవ్వుతూ అంటున్న భర్త మురారి వైపు చూసింది వేద.


“అమ్మది నిద్ర కాదు నాన్నగారు! ఒక విధమైన ట్రాన్స్. ఈ ప్రయాణం అనుకున్నప్పటి నుంచి తన ధ్యాసంతా తాతమ్మవాళ్ళ ఇంట్లోనే వుంది” నవ్వుతూ అంది శ్రావ్య.


“అవును నేనూ గమనించాను. వేదా! నిన్ను అంతగా ఆకట్టుకున్న అమ్మమ్మ గారింటి విశేషాలు సరదాగా చెప్పరాదా? చిన్నప్పుడు నువ్వు వాళ్లింట్లోనే పెరిగానన్నావు కదా. అప్పటి సంగతులు, ఆవిడ గురించి తెలుసుకోవాలని వుంది” కాఫీ అందిస్తూ అన్నాడు మురారి.


“ఎస్! ఈ ఐడియా బావుంది. చెప్పమ్మా, నాకూ తెలుసుకోవాలని చాలా ఇంటరెస్టింగ్‌గా వుంది” హుషారుగా అన్నాడు చందు.


“ఈ బిజీ రొటీన్ లైఫ్‌లో పెద్దవాళ్ళ గురించి పట్టించుకోవటం, వాళ్ళ బాగోగులు విచారించటం బొత్తిగా తగ్గిపోయింది. వృద్ధాశ్రమాల కల్చర్ ఎక్కువైన ఈ రోజుల్లో అమ్మమ్మ ఇంకా మనమధ్యే వుండటం ఒక వింతగానే కనిపిస్తోంది. ఇప్పటికైనా మనం బయలు దేరడం ఒక మంచిని చేశామని అనిపిస్తోంది” అన్నాడు మురారి.


“అవునండీ, చాలా ఏళ్ళవుతోంది అమ్మమ్మను చూసి. శ్రావ్య చిన్న పిల్ల, చందు అయితే ఆవిడని అసలు చూడనే లేదు. ఆ మధ్యన చిన్నపెద్దమ్మ ఫోన్ చేసి అమ్మమ్మ అందరినీ చూడాలనుకుంటోంది, ఒకసారి పిల్లల్ని తీసుకుని రాకూడదు అనటంతో, అడగ్గానే మీరు ఒప్పుకోవటం, ఇలా బయలుదేరగలిగాం. దూరంగా ఉండటంతో చిటుకూ చిటుకూ వెళ్లలేకపోవటంతో మరీ ధ్యాస ఎక్కువైంది” సాలోచనగా వివరించింది వేదవతి.


చాలా రోజుల తరువాత పెరిగి పెద్దదైన పరిసరాలు చూడబోతున్నాననే భావన ఎంతో ఉద్వేగాన్ని పెంచుతోంది. వేగంగా వెళుతున్న రైలు కిటికీలో నుంచి బయటకు చూస్తుంటే వెనక్కి పరిగెడుతున్న చెట్టు చేమా గుట్టలతో పాటు మనస్సు కూడా వెనక్కెళ్ళింది.


అమ్మమ్మకి మడీ ఆచారం చాలా ఎక్కువ. ప్రొద్దున్నే పూజ పూర్తయినట్లుగా హారతి గంట మోగే సరికి అందరం అక్కడకు చేరేవాళ్ళం ప్రసాదం కోసం. నేను కనిపించక “వేద ఇంకా లేవలేదా?” అంటూ ఆవిడ కలయ జూస్తుంటే చటుక్కున ముందుకొచ్చి “నేను అప్పుడే లేచాగా అమ్మమ్మా!” అంటూ పరుగున వెళ్లి ఆవిడని చుట్టేశాను.


“ఓసి భడవా! ముట్టుకొన్నావటే. నా స్తోత్రం జపం ఇంకా పూర్తికానేలేదు” అమ్మమ్మ గదమాయింపు. 

బిత్తరపోవడం నా వంతు.


ఆవిడ మడిలో ఉన్నప్పుడు ఎవరైనా తాకితే విపరీతమైన కోపం ప్రకటించేది. ఉత్తప్పుడు ఎంత ఆపేక్షగా, ప్రేమగా, ఆప్యాయంగా సన్నిహితంగా మెలిగేదో మడి – పూజ - ఆచారం విషయంలో మాత్రం రాజీపడేది కాదు.


ఆ రోజంతా నాతో మాట్లాడదేమో అనుకున్నాను. కానీ అందుకు భిన్నంగా నవ్వుతూ నా తల మీద చెయ్యివేసి ప్రసాదం చేతిలో వుంచేది. ఇంతలో బయట నుండి యాదమ్మ “అమ్మగారూ!” అంటూ వేసిన కేకతో గుమ్మంలోనే నిల్చొని “ఏమే యాదమ్మా! రంగీ, పిల్లాడూ బాగున్నారా?” అడిగింది అమ్మమ్మ.


“మీ దయవల్ల సల్లంగున్నారమ్మా. యియ్యాల డాక్టరోరు పత్యం ఎట్టమన్నారమ్మా, కాసింత చింత తొక్కెడతారేమోనని అడుగుదామని వచ్చినానమ్మా.” గుక్కతిప్పుకోకుండా సమాధానమిచ్చింది యాదమ్మ. 


“అలానా, వుండు ఇప్పుడే వస్తా” అంటూ లోపలికెళ్ళిన అమ్మమ్మ మరుక్షణంలో పెద్ద బాదాం ఆకులో యింత చింతకాయ పచ్చడి పెట్టి, రెండు చీరెలు కూడా ఇస్తూ “ఇదిగో యాదమ్మా, ఈ చీరెలు పిల్లాడికి మెత్తగా పక్కకెయ్యి” అంటూ చేతిలో పెట్టింది.


“దయగల తల్లి సల్లంగుండాల. మరి వత్తనమ్మా. నెలలోపు మీకాడికి తీసుకొచ్చి చూపిత్తానమ్మా తల్లిపిల్లాడ్ని” అంది వినయంగా యాదమ్మ.


“పిచ్చి మొఖమా! నా దగ్గరికెందుకు, గుడికి తీసుకెళ్ళు” అమ్మమ్మ సమాధానమిచ్చింది.


“మీకె తెల్వదమ్మా! మీరే దేవుడు మాకు” అంటూ వెళ్ళింది యాదమ్మ.


ఇది మాములే ఆ ఇంట్లో. ఎవరో ఒకళ్ళొచ్చి ఏదో ఒకటి అడిగి తీసుకెళుతూ వుంటారు. ఆ ప్రాంతంలో ఆవిడ మాటే వేదవాక్కు. అందరికీ కుటుంబ విషయాలు, ఆరోగ్య సమస్యలు, నిత్య జీవితంలో మంచి, చెడూ అన్నింటా సంప్రదింపులు చేస్తూనే వుంటారు. 


ఆవిడ కూడా తార్కికంగా ఆలోచించి తనకు తోచిన ఉచిత సలహాలు ఇస్తుండేది. చిన్నా చితకా అనారోగ్యాలకు ఆవిడ ఇచ్చే హోమియోపతి మాత్రల్లా సలహాలు కూడా తియ్యగా అనుభవైకవేద్యంగా ఉండేవి.


తొంభైయ్యేళ్ళ ఎదురింటి వెంకాయ్యమ్మకు ఆగకుండా విరోచనాలౌతుంటే గబాగబా సీసాలో హోమియోపతి మాత్రలు ఇచ్చి వచ్చేది. 


మర్నాడు ఆవిడ “నీ చేతి చలవ చాలా మంచిదే కావుడూ! అంతేసి విరోచనాలు ఠక్కున కట్టాయంటే నమ్ము” కృతజ్ఞతగా చెప్పేది.


ఇలా చాలా వైద్యాలు ఎంతో యుక్తిగా చేసేది.

“తాతమ్మ డాక్టర్ కూడానామ్మా?” నా ధోరణికడ్డు వస్తూ అడిగింది శ్రావ్య.


“ఆవిడ మా తాతగారి దగ్గర నుంచి నేర్చుకొన్న హోమియోపతి వైద్యం కాక, మన ప్రాచీనమైన ఆయుర్వేదం కూడా ఎంతో నమ్మకంగా ఆచరించేది. తన మీద కూడా నిరంతర ప్రయోగాలు చేస్తుండేది. ఏ నలతకైనా ఏదో ఒక కాషాయం సేవించేది కానీ ఇంగ్లీష్ మందుల జోలికి వెళ్ళలేదు. 

ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎంతో నిబ్బరంగా వుండేది. ఏ విషయంలోనూ అధైర్యపడకూడదని మాకెప్పుడూ చెప్తుండేది.


పెరట్లో ఒక ప్రక్కంతా తులసివనంలా వుండేది. కార్తీక మాసమంతా ప్రొద్దున సాయంత్రం నిష్ఠగా దీపాలంకరణ చేసేది. అటు పూజకు ఇటు వైద్యానికి రెంటికి సమంగా వాడేది ఆ తులసిని.


ఇంకో ప్రక్కంతా వివిధ రకాల పూలమొక్కలుండేవి. ప్రొద్దున్నే చూసిన వారికి మల్టీకలర్ ఫొటోలా వుండేది ఆ దృశ్యం. రంగు రంగుల పూలు తమ వయ్యారాలు ఒలకబోస్తూ అందంగా విచ్చుకొని పరిమళాలు వెదజల్లుతుండేవి సున్నితంగా. పూలన్నీ నేలరాల్చిన పారిజాతం చెట్టు హుందాగా నిలబడి వుండేది మరో మూల.


మా పెద్దమ్మ కూతురు వనజ, చిన్న పెద్దమ్మ కూతురు రేణుక, చిన్న మామయ్య కూతురు మీనా పోటీలు పడి పారిజాతాల్ని ఏరి పూజకు అనువుగా దండకూర్చడం ఒక వింత అనుభూతి.


యాదమ్మ కూతురు మంగ దండకూర్చడంలో అందెవేసిన చెయ్యి. పాపం చిన్నప్పుడే పోలియోతో కాళ్ళు లేకపోయినా, ఎంతో హుషారుగా వుండేది. అమ్మమ్మ అందరిని సమానంగా చూసేది.


ఒకరోజు పార్వతీశం మాస్టారు వచ్చి “మామ్మగారూ! ఈ వైశాఖంలో మా అమ్మాయి పెళ్ళి నిశ్చయమైంది. మీరు వచ్చి ఆశీర్వదించాలి” అన్నారు అభ్యర్ధనగా అమ్మమ్మతో.


“పెద్దదాన్ని నేనేం వస్తాను లెండి. చిన్నవాళ్లొస్తారు లెండి” మృదువుగా బదులిచ్చింది అమ్మమ్మ.


“అహహ! అలా అనకండి. ఓపిక చేసుకుని ఎలాగైనా రావాలి మీరు. మీ బోటి పెద్దల ఆశీర్వచనాలు మంచి మనస్సుతో నిండారా మీరు చేసే దీవెనలే మాకు శ్రీరామరక్ష. జాగ్రత్తగా దగ్గరుండి తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి దింపే బాధ్యత నాది. కాదనకండి” మాష్టారి వేడుకోలు.


“మీదంతా చాదస్తం. ఈ పెద్దవాళ్ళ దీవెనలెవరిక్కావాలి ఇప్పుడు. అసలు వాటికి విలువ ఇచ్చేది ఎవ్వరు ఈరోజుల్లో” బోసి నోటితో నిండుగా నవ్వుతూ అన్నది అమ్మమ్మ.


“అమ్మమ్మా! అలా అనకండి ఇంకా మాతరం మిగిలే వుంది. మీరనేది కరెక్టే. ఇప్పటి వాళ్లకి నమస్కారాలు పెట్టించుకోవడమే గాని మనస్ఫూర్తిగా ఆశీర్వదించటం తెలియదు. అసలు ఎవరినెలా దీవించాలో తెలియదు. నమస్కరించే వారి ఉద్దేశ్యాన్ని గ్రహించి ఆశీస్సులుండాలి. 


అటువంటి సంకల్పాన్ని గ్రహించే పరిజ్ఞానం, ఓపిక, సహనం క్షీణిస్తున్నాయి. అది మీలాంటి ఏ కొద్దిమందికే వుంటుంది. అందుకే మీ ఆశీఃఫలితాలు మాకు మంచి చేస్తాయి. కాదనకండి మరి” అలవాటుగా క్లాసులో పాఠం చెప్పినంత వివరంగా చెప్పారు మాష్టారు. 


అటు అమ్మమ్మతో పాటు చెవులప్పగించి వింటున్న పిల్లలం మాక్కూడా కొంత అవగాహనా ఏర్పడింది ఆ విషయం మీద.


పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు, ఉపనయనాలు అంటూ ఎప్పుడూ ఎవరో ఒకరు సాదరంగా తీసుకువెళ్ళేవారు. తనవంతు ఆశీస్సులుగా చిన్ని చిన్ని కవితలు రాసి చదివి వినిపించి వాళ్ళకిచ్చివచ్చేది. వాటి విలువ తెలిసినవారు అపురూపంగా దాచుకునేవారు.


“ఏంటి ఆవిడ పోయెట్రీ కూడా రాసేదా?” కళ్లింత చేసుకుని ఆశ్చర్యంగా ప్రశ్నించాడు చందు. 


తెల్లవారుఝామున గజేంద్రమోక్షంతో మొదలుపెట్టి మూడు పూటలా రామాయణ భారత భాగవతాల్లోని శ్లోకాలు రాగయుక్తంగా చదివేది. ఖచ్చితంగా రోజూ ఒకే టైముకి రామకోటి రాసి పూర్తిచేసి గుళ్ళో యిచ్చింది. చిన్నా చితకా పనులు సరే సరి.


ఇంకా చెట్ల విషయానికొస్తే పెరట్లో జామ, దానిమ్మ, సపోటా చెట్లు ప్రతీ రకానికి రెండు చొప్పున ఉండేవి. మాకొకటి, పిట్టలకు మరొకటి వేరువేరుగా వుండేవి.


“అదేంటమ్మా! వాటికి వేరే చెట్లేంటి? ఎక్కడా వినలేదే?” ఆశ్చర్యంగా ప్రశ్నించాడు చందు.


“అవునురా! అమ్మమ్మ అలా ఏర్పాటు చేసింది. రామచిలుకలు, గోరింకలు, పిచ్చుకలు, ఉడతలు ఇంకా రకరకాల పక్షులు వచ్చి చెట్టుమీద వాలి పళ్లన్నీ కొట్టి తిన్నంతా తిని మిగిలినవి చెల్లాచెదురుగా పడేసి అల్లరి పిల్లల్లాగా నానా ఆగం చేసేవి. 


అయినా ఎవ్వరం వాటి జోలికి వెళ్ళటానికి గాని పళ్ళు కోయడానికి గాని వీలులేదు. అమ్మమ్మ ఊరుకొనేది కాదు. అమ్మమ్మ పడుకున్నప్పుడు రామచిలుకలు మధ్యాహ్నం నిద్రపోకుండా చెట్లమీద చేరి అరుస్తుండేవి. 


‘రామా, అల్లరి చెయ్యకండి. నన్ను ఓ కునుకు తియ్యనియ్యండ్రా’ అంటూ ఆపేక్షగా విసుక్కొనేది.”


“వెరీ ఇంటరెస్టింగ్. ఇంకా..” మురారి గూడా పిల్లలతో సమానంగా శ్రద్ధగా వినడంతో నేను మరింత ఉత్సాహంగా జ్ఞాపకాల పుస్తకాల్లోని పుటలను ఒక్కొక్కటి తిరగేశాను.

అమ్మమ్మ గురించి అన్ని జ్ఞాపకాలు అపురూపమే. ప్రతి వేసవి సెలవుల్లో తప్పకుండా అందరం వెళ్ళేవాళ్ళం. పెరట్లో ఆరు బయట ప్రక్కలేసుకుని అమ్మమ్మ చెప్పే కథలూ కబుర్లు వింటూ ఆకాశంలో చుక్కలు లెక్కపెట్టే వాళ్ళం. మధ్యలో ఆకతాయితనంగా ఎవరూ ఒకరు కావాలని మాట్లాడించటం మళ్లీ లెక్క మొదట్లోకి రావడం. అవన్నీ ఒక అపురూపమైన అందమైన అనుభూతి. మాటలకందనిది.


తన్మయత్వంతో నేనిలా చెబుతుండగానే, స్టేషన్ రావటం, ఈలోకంలోకొచ్చి సామాన్లు సర్దుకొని హడావిడిగా రైలు దిగి టాక్సీ మాట్లాడుకుని అమ్మమ్మ గారింటికి చేరటం చకచకా జరిగిపోయాయి.


మమ్మల్ని చూసిన అమ్మమ్మ చిన్న పిల్లలా సంబరపడింది. బక్కపల్చగా, పచ్చటి పసిమి ఛాయతో బోసి నోటితో నడుం పూర్తిగా వింటిబద్ధలా వంగి, ముడుతలు పడ్డ శరీరంతో వున్న అమ్మమ్మని పిల్లలు వింతగా చూశారు.


“చందూ! తాతమ్మని చూశావా ఎలావుందో. ఆ మధ్యన బాపుగారి బొమ్మల ఎగ్జిబిషన్‌కి వెళ్ళాం గుర్తుందా! అందులో రామాయణంలోని శబరి లాగా వున్నది కదా!” శ్రావ్య నెమ్మదిగా తమ్ముడితో అంటున్న మాటలు నా చెవిన పడ్డాయి.


అవును నిజమే! రామాయణంలో రామునికి ఆప్యాయంగా పళ్ళు తినిపిస్తున్న శబరి జ్ఞాపకం వచ్చింది. అమ్మమ్మలో వయస్సు తెచ్చిన మార్పులు జీవితానుభవాలు ప్రస్ఫూటంగా కనిపిస్తున్నాయి. 


మిగలపండిన తమలపాకులా వుంది. ఇల్లు పరిసరాల్లో పెద్దగా మార్పులేదు. చెట్టు చేమా కూడా అమ్మమ్మతో పాటు పెరిగి పెద్దవయ్యాయి కానీ యధాప్రకారం ఋతుధర్మాన్ని అనుసరించి పండూ, పూవూ కాయ ఇవ్వటంలో తమవంతు కర్తవ్యం ఇంకా పాటిస్తూనే వున్నాయి. 


పాలేరు వీరయ్య బాగా పెద్దవాడయ్యి పనిలోకి రావటం లేదని, అతని అల్లుడు రాజయ్య బాధ్యత తీసుకున్నాడని, వాళ్ళ అమ్మాయి గంగకు కనుచూపు లేదని ఎవరైనా చెప్తే కాని తెలియదని గబగబా చెప్పింది అమ్మమ్మ. 


కుందనపు బొమ్మలా అలవాటు కొద్దీ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది గంగ ఆ ఇంట్లో. ఆ అమ్మాయి ఆలనా పాలనా అమ్మమ్మే చూసేది.


కాంక్రీట్ జంగిల్‌లో హైటెక్ హంగులతో బందీలైన మా కుటుంబానికి అక్కడ ఉన్న నాలుగు రోజులు నాలుగు క్షణాల్లా గడిచిపోయినయి. రామచిలకలు, పావురాలు, పిచ్చుకలతో సమానంగా పిల్లలు కువకువలాడారు. కేరింతలు తుళ్ళింతలు. పిల్లలతో సమానంగా అమ్మమ్మ మమేకమవటం ఎంతో ఆశ్చర్యాన్నీ ఆనందాన్ని కలిగించాయి.


మురారి తాను తీసుకొచ్చిన డిజిటల్ కెమెరాలో అమ్మమ్మతో సహా అందరిని బంధించాడు. శుచీ శుభ్రత ఆచారం సంప్రదాయం విడువకుండా, ఇంకొకరికి ఇబ్బంది కలిగించకుండా, పాటించే అమ్మమ్మని చూసి ఇప్పటికి ఇంకా ఏమీ మారలేదు అనిపించింది.


“ఆచారం మడి అంటే వేరే ఏమీ కాదు. శుచి శుభ్రతలే ఆరోగ్య చిహ్నాలు కదా. వాటికి మారు పేర్లే ఇవి” వివరించింది అమ్మమ్మ.


తీపిజ్ఞాపకాల్ని, మధురానుభూతుల్ని, అమ్మమ్మ ఆశీసుల్ని దండిగా తీసుకుని తప్పనిసరిగా వెళ్ళాలి కనుక తిరుగు ప్రయాణమయ్యాము. తన క్లాస్ మేట్స్ అందరికి ఇక్కడి విశేషాలు ఎలా వివరించాలో ప్లాన్ చేసుకుంటున్నారు పిల్లలు. ఇంటికి చేరి రొటీన్ లైఫ్ లో మునిగిన మాకు మధురస్మృతులు మరపురాకముందే పిడుగులాంటి వార్త మోసుకొచ్చింది ఫోన్.


“మళ్ళీ నిన్ను చూస్తానో లేదో?” అన్న అమ్మమ్మ మాటలు గుర్తొచ్చాయి హఠాత్తుగా. మనసంతా కకావికలమైంది. 


నిశ్చేష్టగా కూర్చున్న నాతో “వేదా! ప్రతి మనిషికీ అది తప్పదు. పండుటాకులా రాలిపోయారు ఆవిడ. గుండె దిటవు చేసుకోవాలి ఇలాంటప్పుడే.” ఓదార్చాడు మురారి.


తర్వాత అమ్మమ్మ గురించి తెలిసిన విషయాలు సంభ్రమాశ్చర్యాలకు లోను చేశాయి.


బహుకొద్ది రోజులు మంచం మీద గడిపినప్పుడు కుటుంబ సభ్యులందరినీ ఒప్పించి తీసుకున్న నిర్ణయాలే అబ్బురపరచాయి. అవి తప్పకుండా అమలు చేయాలని హామీ తీసుకుందని తెలిసింది. మమ్మల్ని విచలితుల్ని చేసింది.


ఆచారం మడి అంటూ చాదస్తంగా వుండే అమ్మమ్మలో ఇంతటి విశాల ఉన్నత భావాలు, ఔన్నత్యం,

ఆధునికత వున్నాయంటే ఆవిడని మేమెవ్వరం సరిగ్గా అర్థం చేసుకోలేదని, మా ఆలోచనా విధానం ఆవిడ

స్థాయికి అందుకోలేక పోయిందని, ఇప్పుడు బాధపడటం మినహా ఏమీ చేయలేకపోయాము.


అమ్మమ్మ తన కళ్ళు వీరయ్య మనమరాలు గంగకూ, కిడ్నీ రంగి మొగుడు సీతయ్యకూ గుప్త దానం చేసిందని, అయితే ఈ సంగతి ముందరగా ఎవ్వరికీ చెప్పవద్దని ఆంక్ష పెట్టిందని తెలిసి నిశ్చేష్టులైనారము.


నిండైన జీవితాన్ని, పరిపూర్ణమైన వార్ధక్యాన్ని అనుభవించిన అమ్మమ్మ ధన్యజీవి. మరణానంతరం జ్ఞాపకముండే ఏ కొద్దిమందికో దక్కే అవకాశం సద్వినియోగం చేసుకున్న యోగిని. మాధవసేవ, మానవసేవ రెండూ సమానంగా ఆచరించిన పుణ్యచరిత.


రోజూ గజేంద్రమోక్షం చదివే బ్రాహ్మీముహూర్తంలో మోక్షం పొందిందని తెలిసి అచేతనంగా వుండిపోయాము.


     *****     

గొడవర్తి జానకి శ్యామసుందర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం: గొడవర్తి జానకి శ్యామసుందర్


నా పేరు జానకి రాణి గొడవర్తి, మా వారు గొడవర్తి శ్యామసుందర్. మేము హైదరాబాద్ వాస్తవ్యులము. నేను గుంటూరులో B.A. English చేశాను.

నేను రాసిన కథలు 2003 నుంచి 2006 మధ్య కాలంలో All India రేడియో లో “కథాకేళి” శీర్షికన ప్రసారమయ్యాయి, ప్రముఖ పత్రికలు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వారి నవ్య, హాసం వారపత్రికలలో ప్రచురితమైనాయి.

నేను చూసిన, నా చుట్టూ జరిగిన చిన్న చిన్న సంఘటనల ఆధారంగా కథలు రాయటం నాకు అలవాటు.

bottom of page