షికారు
- Sathyanarayana Murthy M R V

- 2 hours ago
- 4 min read
#షికారు, #Shikaru, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు

Shikaru - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy
Published In manatelugukathalu.com on 09/12/2025
షికారు - తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
“రమణమ్మా, ఈ సంగతి తెలిసిందా?” అడిగింది కమలమ్మ.
“ఏ సంగతి వదినా?” ఆత్రుతగా అడిగింది రమణమ్మ.
గొంతు తగ్గించి, “గౌరమ్మ కూతురు మణి, కాలేజీ కుర్రాడితో కలిసి తణుకు వెంకటేశ్వర టాకీసు దగ్గర కనిపించిందట నిన్న. రాత్రి మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు” అంది కమలమ్మ.
ఆమె మాటలు విని ఆశ్చర్యంతో నోరు తెరిచి ఉండిపోయింది రమణమ్మ.
“హూ.. పిదపకాలం, పిదపబుద్ధులు. కాలేజీలో చదువుతున్నామని చెప్పడం, మగ పిల్లలతో సినిమాలకు, షికార్లకు వెళ్ళడం. రోజులు మారిపోయాయి వదినా. అందుకే నా కూతురికి ఎనిమిదో తరగతి అవగానే పెళ్లి చేసాను. పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే మగ పిల్లడు పుట్టాడు దానికి. వాళ్ళ అత్తా, మావా ఎంతో ఆనందపడ్డారు” సంతోషంగా చెప్పింది రమణమ్మ.
“నువ్వు తెలివైనదానివి రమణమ్మా, ముందుచూపు ఎక్కువ నీకు. అవునూ, మీ అమ్మాయి మళ్ళీ నీల్లోసుకుందిటగా” అడిగింది కమలమ్మ.
“అవును వదినా. ఈసారి ఆడపిల్ల పుట్టాలని ఆల్లందరూ కోరుకుంటున్నారు. తను నీరసంగా ఉందని మా వియ్యపురాలు కబురు చేస్తే, పాలకొల్లు వెళ్లి వారంరోజులు ఉండి వచ్చాను. వాళ్ళు ఇంకో రెండేళ్ళు ఆగితే బాగుండును, మా పిల్ల కొంచెం కోలుకునేది. ఏం చేస్తాం?” అని మంచినీళ్ళ బిందె, భుజానికెత్తుకుని వెళ్లి పోయింది రమణమ్మ.
కొద్దిసేపటికే ఖాళీ బిందె పట్టుకుని గౌరమ్మ కుళాయి దగ్గరకు వచ్చింది.
తన బిందె పక్కకు పెట్టి
“నువ్వు నీళ్ళు పట్టుకో అక్కా “ అని ఆమె చేతిలోని బిందె కుళాయికింద పెట్టింది కమలమ్మ.
“ఏమిటి రమణమ్మ హడావిడిగా వెళ్ళిపోయింది, పైగా మొహం నీరసంగా కనిపిస్తోంది” అడిగింది గౌరమ్మ, కమలమ్మని.
“ఏముంది అక్కా, కూతురు గురించే రమణమ్మ బాధ. చిన్నతనంలోనే కూతురికి పెళ్లి చేసానని బాధపడుతోంది. దానికి పద్దెనిమిది వచ్చాయి. అప్పుడే రెండోసారి కడుపుట. మొన్న అత్తింట్లో కళ్ళు తిరిగి పడిపోతే వాళ్ళ పక్కింటి వాళ్ళు రమణమ్మకి ఫోన్ చేసి చెప్పారట. పాపం రమణమ్మ, కంగారుగా వియ్యపురాలి ఇంటికి వెళ్లి వారం రోజులు వాళ్లకు వండి పెట్టి, కూతుర్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళి చూపించి, మందులు కొనిచ్చి వచ్చిందట” విచారంగా అంది కమలమ్మ.
“నేను రమణమ్మకి అప్పుడే చెప్పాను. పద్దెనిమిది రాకుండా పిల్లకు పెళ్లి చేయవద్దని. తెలిసున్న సంబంధం అని, కూతురు చదువు మానిపించి పెళ్లి చేసింది. మొగుడుతో పాటు అది కూడా కూలిపనికి వెళ్లి డబ్బులు తెస్తోంది. చిన్నపిల్ల. అప్పుడే దానికి రెండోసారి గర్భం అంటే ఎంత ఇబ్బంది?” బాధగా అంది గౌరమ్మ.
“అవును రమణమ్మ కూడా బాధపడింది. గౌరమ్మ వదినలా నా కూతుర్ని కూడా చదివిస్తే ఎంత బాగుండును? అని. ఏమాట కామాటే చెప్పుకోవాలి, మీ మణి బాగా చదువుతుంది. ఎంత బుద్దిమంతురాలు నీ కూతురు” మెచ్చుకోలుగా అంది కమలమ్మ.
“నా కూతురుకి చదువు విలువ తెలుసు. అందుకే శ్రద్ధగా చదువుకుంటోంది” అని బిందెలో నీళ్ళు నిండటంతో కుళాయి కట్టేసి, బిందె భుజాన పెట్టుకుని “వస్తాను కమలమ్మా” అని వెళ్ళిపోయింది గౌరమ్మ.
వీధి కుళాయికి దగ్గరలోనే ఉండి, బిందెను తోముకుంటున్న సింహాచలం, కమలమ్మ మాటలు విని ఆశ్చర్యంగా ఆమెకేసి చూసింది. ‘ఏమిటి, ఈ కమలమ్మ ప్రవర్తన. మనిషి ముందు ఓ మాట, వెనక ఓ మాట మాట్లాడుతుంది. లేనిపోని పుకార్లు పుట్టించడం తప్పని, ఎప్పుడు తెలుసుకుంటుంది. గత నెలలో వెంకటలక్ష్మి కూతురు వనజ, వాళ్ళ పిన్నికి వంట్లో బాగుండలేదని తెలిసి, టౌన్ కి వెళ్లి పదిరోజులు ఆసుపత్రిలో ఆమెకి తోడుగా ఉండి వచ్చింది. దానిని మసిపూసి మారేడుకాయ చేసినట్టు, వనజ ఎవరితోనో తిరిగి, గర్భం రావడంతో ‘అబార్షన్’ చేయించుకుని వచ్చిందని ప్రచారం చేసింది. ఆ విషయం తెలిసి, వెంకటలక్ష్మి, కమలమ్మ ఇంటికి వచ్చి ‘బూతుల్’ తిట్టి మరీ వెళ్ళింది. అయినా కమలమ్మ తన ధోరణి మార్చుకోవడం లేదు”అని నిట్టూర్చి, కుళాయి దగ్గరకు వచ్చింది సింహాచలం.
అప్పటికి కమలమ్మ బిందెలో నీళ్ళు పట్టుకోవడం పూర్తి అయ్యింది. సింహాచలం కేసి తిరిగి, చిన్నగా నవ్వి “సింహాచలం వంట చేసుకోవాలి, వస్తా” అని బిందె భుజం మీద పెట్టుకుని వెళ్ళిపోయింది.
సింహాచలం తాను తోమిన బిందెను శుభ్రంగా కడిగి, మంచినీళ్ళు పట్టుకుని తన ఇంటికి వెళ్ళిపోయింది.
**************
నెలరోజులు గడిచాక ఒకరోజున కుళాయి దగ్గర కమలమ్మని, గౌరమ్మ కలిసింది.
“కమలమ్మా, నువ్వు ఏమనుకోకు. మీ రోజా గురించి ఏవోవో వింటున్నాము. మొన్న స్కూటర్ మీద ఒక అబ్బాయితో కలిసి వెళ్తూ కనిపించిందట. మా మరిది చెప్పాడు. పిల్లని దూరంగా పెట్టి చదివిస్తున్నావు. జాగ్రత్తగా ఉండు” అంది గౌరమ్మ.
కొద్దిసేపటికి రమణమ్మ వచ్చి, “అవును వదినా. మీ రోజా గవర్నమెంట్ హాస్పిటల్ కి ఒక కుర్రాడితో కలిసి వెళ్లిందట. మా అక్క కొడుకు చెప్పాడు. ముందే మేలుకో” అంది.
వాళ్ళ మాటలు వినగానే కాళ్ళకింద భూమి కంపించినంత భయం కలిగింది కమలమ్మకి. నీళ్ళు పట్టుకోకుండానే ఇంటికి తిరిగి వచ్చింది.
‘తను వాళ్ళ పిల్లల గురించి వేరే రకంగా మాట్లాడినందుకు, తన కూతురి మీద పగ తీర్చుకుంటున్నారా?’ అన్న అనుమానం కలిగింది కమలమ్మకి. అయినా నిజం తెలుసుకోవాలి. అప్పుడు వీళ్ళ పని పడతాను’ అని ఇంటికి తాళం వేసి బస్సెక్కి, రాజమండ్రి వెళ్ళింది కమలమ్మ. రోజా ఉమెన్స్ కాలేజీ లో డిగ్రీ ఆఖరి సంవతరం చదువుతోంది. కాలేజీ కి దగ్గరలోనే రూమ్ తీస్కుని స్నేహితురాలితో కలిసి ఉంటోంది. బస్సు స్టాండ్ నుడి ఆటో మీద కూతురు ఉన్న రూమ్ కి వచ్చింది కమలమ్మ.
తల్లిని చూసి ఆశ్చర్యపోయింది రోజా.
“ఏమిటే, నా పరువు తీసుతున్నావు. ఎవరితోనో స్కూటర్ల మీద తిరుగుతున్నావట. ఒకసారి లాలా చెరువు దగ్గర, ఇంకోసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కనిపించావని, మన ఊర్లో రక రకాలుగా చెప్పుకుంటున్నారు. నిజం చెప్పు. ఆ కుర్రాళ్ళు ఎవరు? నీకు వాళ్లకు సంబంధం ఏమిటి?”గట్టిగా అడిగింది కమలమ్మ.
తల్లి మాటలకు ముందు నిర్ఘాంతపోయింది రోజా. ఆ తర్వాత సర్దుకుంది.
“అమ్మా, నేను కాని పని ఏమీ చేయడంలేదు. వారం క్రితం లాలా చెరువు దగ్గర ఆర్ట్ ఎగ్జిబిషన్ జరిగింది. మా లెక్కలమేడం వేసిన చిత్రాలు అక్కడ పెట్టారు. మేడం అబ్బాయి చెన్నై లో చదువుతున్నారు. వాళ్ళ అమ్మగారికి సాయంగా వచ్చారు. ఆయన నన్ను స్కూటర్ మీద తీసుకువెళ్ళారు అక్కడికి. సాయంత్రం మళ్ళీ తీసుకువచ్చి రూమ్ దగ్గర దిగబెట్టారు. మా కాలేజీ లో చాలా మంది అమ్మాయిలు వెళ్ళారు ఎగ్జి బిషన్ కి. మా మేడం మాట కాదనలేక వెళ్లాను అక్కడికి.
రెండో విషయం. నేను గవర్నమెంట్ హాస్పిటల్ కి రోటరీ క్లబ్ కార్యదర్శి రమేశ్ గారితో కలిసి వెళ్లాను, ఒక పేషెంట్ కి రక్త దానం చేయడానికి. నాది రేర్ బ్లడ్ గ్రూప్. మా అనుమతితో మా మేడం మా బ్లడ్ గ్రూప్ వివరాలు రోటరీ క్లబ్ వారికి ఇచ్చారు. మేము చాలా మందికి రక్త దానం చేసాము. ఇది కాలేజీ లో అందరికీ తెలుసు. ఎవరికైనా రక్తం అవసరం అయినప్పుడు రోటరీ క్లబ్ తరుపున ఒకరు వచ్చి మమ్మల్ని, హాస్పిటల్ కి తీసుకువెళ్ళి, రక్తదానం అయ్యాకా తిరిగి జాగ్రత్తగా మమ్మల్ని తీసుకువచ్చి రూమ్ కి దిగబెట్టి వెళ్తారు.
నేను ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. చదువు, ఉద్యోగం, సమాజసేవ నా లక్ష్యాలు. ఎవరో పుకారు సృష్టిస్తే నువ్వు గాభరాపడి ఇక్కడికి వచ్చావు. మంచి వార్తలు సమాజంలో ‘షికారు’ చేస్తే ఫరవాలేదు.
కానీ అభాండాలు, ‘షికారు’ చేస్తే కొన్ని కుటుంబాలు నాశనమవుతాయి. సమాజం అల్లకల్లోలం అవుతుంది. నా గురించి బెంగ పెట్టుకోకు, భయపడకు. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు” అంది రోజా.
తను ఇంతవరకూ ఎంత ‘తప్పు’ చేసిందో కూతురి మాటలతో గ్రహించింది కమలమ్మ. పరివర్తన చెందిన మనసుతో ఇంటికి తిరిగి వచ్చింది. ఇప్పుడు కమలమ్మ అందరిలాగా స్వచ్చంగా మాట్లాడుతోంది.
సమాప్తం.
*******
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






Comments