సిరిమల్లె
- Gadwala Somanna
- Jun 6
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Sirimalle, #సిరిమల్లె, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 83
Sirimalle - Somanna Gari Kavithalu Part 83 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 06/06/2025
సిరిమల్లె - సోమన్న గారి కవితలు పార్ట్ 83 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
సిరిమల్లె
----------------------------------------
సిరిమల్లె విరబూసింది
అంతటా గుప్పుమంది
పవిత్రమైన మనసుతో
తనలాగ ఉండమంది
ముద్దులొలుకు మోముతో
నయగారం పంచింది
మహిళామణుల సిగలోన
నెలవంకగా మారింది
సిరిమల్లె తోటలోన
సువాసనలు మెండుగా
పర్యాటకుల మనసులోన
పరవశమే నిండుగా
సిరిమల్లె ఆదర్శము
పంచుతుంది ఆనందము
తెల్లతెల్లని రంగులో
అత్యంత మనోహరము

ఉండు వారే!
----------------------------------------
ఆపదలో తోడుగా
శిఖరమంత అండగా
ఉండు వారే! ఆప్తులు
నిజమైన స్నేహితులు
బ్రతుకులో నీడగా
పదిలమైన మేడగా
ఉండు వారే! మన వారు
వారికెవరు సాటి రారు
చీకటిలో దివ్వెగా
పయనంలో త్రోవగా
ఉండు వారే!బంధువులు
నిజముగా ఆరాధ్యులు
ఎదుగుదలకు వారధిగా
నడిపించే సారథిగా
ఉండు వారే! గొప్ప వారు
జనహితం వారు కోరు

కొండవాగు
-----------------
కొండవాగు పరుగులు
చూడు దాని మెలికలు
పంచునోయి సొగసులు
దోచునోయి మనసులు
కోడెనాగు నాట్యమై
అపురూపదృశ్యమై
పారేటి కొండవాగు
కనువిందు కొండవాగు
వన్యప్రాణుల దాహం
తీరుస్తుంది కొండవాగు
త్రాగు నీరు ఇస్తుంది
అందాల కొండవాగు
కొండల్లో జనయించి
కోనల్లో ప్రవహించి
అందరికి చేస్తుంది
అపారమైన మంచి

అక్షర సత్యం
----------------------------------------
పొలంలో అంకురం
పొత్తంలో అక్షరం
గమనిస్తే మాత్రం
కల్గించును అబ్బురం
మనశ్శాంతి ఉంటే
బ్రతుకులోన సంబరం
అందరూ కలిసుంటే
తాకుతుంది అంబరం
చిరునవ్వు మనోహరం
అదెంతో అవసరం
లేదంటే ముఖంలో
జనయించును వికారం
కావాలోయ్!హృదయం
మేలిమి బంగారం
పవిత్రతకు నిలయం
అయితే నయగారం

నిజాలు
----------------------------------------
అపారమైన అహము
చేయును బ్రతుకు హతము
క్రియ లేని విశ్వాసము
ముమ్మాటికీ మృతము
అన్నింటిలో మితము
మేలు చేయును నిజము
బహు చెడ్డది అసూయ
కావద్దు దాని వశము
మంచి పెంచును యశము
చేయాలోయ్! సతతము
కష్టపడు ప్రతి క్షణము
గొప్పది దాని ఫలము
నమ్మకమే అభయము
అది రక్షణ కవచము
కల్గియుంటే అగును
జీవితాన దుర్గము
-గద్వాల సోమన్న
Comments