top of page

శివకాశీ

#Sivakasi, #శివకాశీ, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguHeartTouchingStories

ree

Sivakasi - New Telugu Story Written By - Ch. C. S. Sarma 

Published In manatelugukathalu.com On 22/07/2025

శివకాశీతెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


రాజన్న ఆంధ్రుడు. పదిహేను సంవత్సరాలుగా భారత్ బార్డర్‍లో సైనికుడుగా పనిచేస్తున్నాడు. ఎం.ఎ వరకు చదువుకొన్నాడు. అతని భార్య పార్వతి. కుమారుడు శివ. 

ఆ దంపతులు ఆ బిడ్డకు పేరు పెట్టడంలో ఒక విశిష్టమైన కథనం ఉంది. పార్వతి బి.ఎ. పాసయ్యింది. సభ్యసమాజం పట్ల, మన భారతదేశం పట్ల ఎంతో గౌరవం, అభిమానం కలవారు. వారి వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల వరకూ వారికి సంతానం లేదు. పదకొండేళ్ళ క్రింద సెలవల్లో వూరికి వచ్చిన రాజన్న పార్వతులు, మన భారతీయులందరికీ ఎంతో పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కాశీకి వెళ్ళారు.


గంగలో స్నానం చేశారు. కాశీ కాలభైరవులను, తండ్రి విశ్వేశ్వరులను, మాతా అన్నపూర్ణమ్మలకు దర్శించారు. తమ మనో కామితాన్ని ఆ మాతాపితలకు కన్నీటితో విన్నవించారు.


ఆ జగన్మాతాపితల దర్శనం వారి మనస్సుకు అభయపూర్వక ఆనందాన్ని కలిగించింది. సంతోషంతో వూరికి తిరిగి వచ్చారు. మరో పదిరోజులు వుండి రాజన్న తన డ్యూటీకి వెళ్ళిపోయాడు. పార్వతమ్మ నెలతప్పింది. విషయాన్ని రాజన్నకు ఫోన్‍లో తెలియజేసింది.


రాజన్న ఆనందానికి అవధులు లేవు. ’తండ్రీ!... ఏ బిడ్డ పుట్టినా పేరు నీ పవిత్రమైన నామమైన ’శివ’ అనే పెడతానని మంచుకొండల్లో సరిహద్దుల్లో సంచరిస్తూ ఆ జగత్ రక్షకుల మొక్కుకున్నాడు.


పార్వతమ్మకు నవమాసాలు నిండాయి. వారం పదిరోజుల్లో కాన్పు అవుతుందని డాక్టర్ చెప్పారు. విషయాన్ని పార్వతి రాజన్నకు తెలియజేసింది. సెలవుపై రాజన్న తన ఇంటికి చేరాడు. తన నవమాసాలు గర్భవతి అయిన భార్యను చూచి ఎంతగానో సంతోషించాడు.


వారంరోజుల తర్వాత ఒక శుభదిన ఉదయాన పార్వతికి నెప్పులు ప్రారంభం అయినాయి. రాజన్న ఆమెను ప్రసూతి కేంద్రంలో చేర్చాడు. ప్రసవ వేదనతో పార్వతమ్మ అరుపులను విని రాజన్న బయట వేప చెట్టు క్రింద కాలుకాలిన పిల్లిలా పచారు చేస్తూ, తాను నమ్మిన ఆ కాశీ శివయ్యను ’త్వరలో పార్వతికి సుఖ ప్రసవాన్ని అనుగ్రహించు తండ్రి’ అని కన్నీటితో వేడుకొన్నాడు.


అరగంట గడిచింది. పార్వతి అరుపులు ఆగిపోయాయి. రాజన్న ఆశ్చర్యంతో ఆ గదివైపుకు చూచాడు.

నర్స్.... వేగంగా బయటికి వచ్చి.....

"రాజయ్యా!.... రాజయ్యా!..." పిలిచింది.


ఆత్రంగా రాజన్న ఏం చెబుతుండో అన్న ఆందోణలతో పరుగున ఆమెను సమీపించాడు.

"మీరేనా శివయ్య!" నర్స్ ప్రశ్న.


"అవునమ్మా!..." దీనమైన శివన్న జవాబు.


"సార్!... మీకు కొడుకు పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమం. ఓ గంటలో వార్డుకు మారుస్తా. అప్పుడు మీరు వారిని చూడవచ్చు" చిరునవ్వుతో చెప్పి ఆ చెల్లెమ్మ వెళ్ళిపోయింది.


రాజన్న ముఖంలో పున్నమి చంద్రకాంతి. వదనంలో మందహాసం....


కాశీ సర్వేశ్వరా!.... నీకు శతకోటి వందనాలు.. పరవశంతో చేతులు జోడించాడు.


పరమానందంతో భార్య సుతులను చూడ వార్డువైపుకు పరుగుతీశాడు.

మూడవరోజున హాస్పిటల్ వారు తల్లిని బిడ్డను ఇంటికి పంపారు.

ఆ భార్య భర్తలు ఆనందానికి అవధులు లేవు. ఆ దంపతులు బిడ్డకు ’శివ’ అని నామకరణం చేశారు. నెలరోజుల తర్వాత రాజన్న, భార్యకు జాగ్రత్తలు చెప్పి తన డ్యూటీకి వెళ్ళిపోయాడు.

*

కాల చక్ర బ్రమణం నాలుగు చుట్లు శరవేగంతో తిరిగింది. సెలవతో రాజన్న ఊరికి వచ్చాడు. కొడుకును అర్థాంగిని చూచి ఎంతగానో సంతోషించాడు.

పురోహితుల సలహా ప్రకారం, శివాకు అక్షరాభ్యాసాన్ని చేసి స్కూలుకు పంపారు ఆ దంపతులు. 


శివ... మారాం చేయకుండా స్కూలుకు వెళ్ళేవాడు. ఉపాధ్యాయులు చెప్పే విషయాలను శ్రద్దగా వినేవాడు. సాయంత్రం ఇంటికి వచ్చాక, తల్లి అతనికి స్నానం చేయించి బట్టలను మార్చేది. అతని చేత హోంవర్క్ చేయించేది.


యధావిధిగా నెలరోజులు సెలవులో వుండి రాజన్న తన ఉద్యోగానికి వెళ్ళిపోయేవాడు.

స్కూల్లో ఉపాధ్యాయులు చెప్పిన విషయాలను, శివ తన తల్లితో చర్చించేవాడు. ఒకనాడు...

"అమ్మా!... బలి చక్రవర్తి చాలా గొప్పరాజా!..." అడిగాడు.


"అవును శివా!... వారు ఆడిన మాటను తప్పని రాజు. అతని సత్యవాక్కును పరీక్షించాలని శ్రీ మహా విష్ణుమూర్తి వామనుడిగా మారి చిన్న బ్రాహ్మణ బాలుని రూపంలో వచ్చి బలి చక్రవర్తిని ’మూడు అడూగులు, దానాన్ని అడిగాడు బలిచక్రవర్తి’ సరే స్వామి అన్నాడు. వారు మహాజ్ఞాని. తనను మూడు అడుగుల దానం అడిగినవారు, శ్రీ మహా విష్ణుమూర్తి అని గ్రహించారు. ఆనందంగా ’స్వీకరించండి స్వామి’ అన్నాడు. శ్రీ మహావిష్ణువు తన ఒక పాదమును ఆకాశమునందు, రెండవ పాదమును భూమిమీద, నిలిపి.... ’బలీ మూడవపాదమును ఎక్కడ మోపవలె!...’ అడిగారు.


అప్పుడు బలి చక్రవర్తి పరమానందంగా తన శిరస్సును వంచి... ’ఇక్కడ మోపండి స్వామి’ అన్నాడు.


అతని దాన నిరతికి, ఆడిన మాటను వారు నిలబెట్టుకొనుటకు సంతోషంగా తన తలను చూపినందుకు, శ్రీ మహావిష్ణుమూర్తి ఎంతగానో సంతోషించారు. బలిదాన గుణాన్ని మెచ్చుకొన్నారు.


’పాతాళలోక వాసివై నీ కుటుంబంతో చిరంజీవిగా వర్ధిల్లు’ అని ఆశీర్వదించారు శ్రీ మహావిష్ణువు. అంతర్థానం (మాయం) అయిపోయారు.


"ఆరీతిగా బలిచక్రవర్తి చరిత్ర యుగయుగాలుగా, తరతరాలుగా చరిత్ర పుటల్లో నిలిచిపోయింది శివా!" అంది ఆ తల్లి పార్వతి. 


మరో రోజు శివ "అమ్మా!... శిబి చక్రవర్తి చాలా దయామయుడా!.." అడిగాడు.


"అవును కాశీ!.... వారూ బలిచక్రవర్తి వలే ఘనచరిత కల మహనీయులు. వారు, వారి రాజ్యంలోని పరివారాన్ని, ప్రజలను ఎంతో అభిమానంతో చూచుకొనేవారు. అదే రీతిగా మూగజీవులను పశు పక్ష్యాదులను అంతే ఆదరాభిమానాలతో చూచుకొనేవారు.

ఒకనాడు దేవేంద్రుడు, యముడు... మధ్య శిబి చక్రవర్తి దయాగుణాన్ని గురించి చర్చ జరిగింది. ఇరువురూ వారిని పరీక్షించదలిచారు. 


దేవేంద్రుడు పావురముగా రూపమును, యముడు డేగగా రూపములను ధరించి శిబి చక్రవర్తి కొలువు కూటం అంటే సభలో ప్రవేశించారు.


పావుర రూపంలో వున్న దేవేంద్రుడు శిబి చక్రవర్తిపై వాలి "రాజా!... నన్ను ఆ డేగ తిన ప్రయత్నం చేస్తూ ఉంది. నాకు ప్రాణ భిక్ష పెట్టండి కాపాడండి’ అని కోరింది.


డేగ రూపంలో వున్న యమధర్మరాజు, శిబి సింహాసనంపై వాలాడు.


"ఓ బలి చక్రవర్తి!.... ఆ పావురము నా ఆహారము. దానిని నా వైపుకు వదలుము. నాకు చాలా ఆకలిగా ఉంది!...." అన్నాడు డేగ రూపంలో వున్న యమధర్మరాజు.


బలి చక్రవర్తి నిశితంగా పావురమును, డేగను పరిశీలించాడు. తాను పావురమును వదలితే, డేగ దాన్ని తన కాలిగోళ్ళతో పట్టుకొని ఎగిరి పోయి ఏదో చెట్టుపై వాలి, పావురమును తన ముక్కుతో పొడిచి తినేస్తుంది. పావురం చచ్చిపోతుంది. 


’ఈ పావురం నన్ను శరణు కోరింది. ఆపదలో వుంది. రక్షించడం నా ధర్మం. అలాగే ఆ డేగ ఆకలితో వుంది, దాని ఆకలి తీర్చడం నా కర్తవ్యం’ అనుకొన్నాడు శిబిచక్రవర్తి.


"ఓ డేగ మహాశయా!.... ఈ పావురము కాపాడమని నన్ను శరణు కోరినది. దాన్ని నేను రక్షించాలి."


"మరి నా ఆకలి తీరేదెలా!" డేగ ప్రశ్న.


"వేరే ఏ ఇతర మీరు కోరిన జీవుల మాంసమును తెప్పించి మీకు ఇచ్చెదను ఆరగించండి" అన్నాడు శిబి.


"నాకు అన్య మృగమున మాంసము వద్దు. తినను. నాకు ఈనాటి ఎర ఆ పావురమే!... మీరు దాన్ని వదలండి" అన్నది డేగ.


"పావురమును నేను వదలను. బదులుగా... నా మాంసమును ఇచ్చెదను. మీరు కడుపు నిండా తినండి. పావురమును ఆశించకండి" దీనంగా కోరాడు శిబి చక్రవర్తి.


అందుకు డేగ సమ్మతించింది.

శిబి చక్రవర్తి పదునైన కత్తులను తెప్పించి తన తొడ మాంసమును కోసి డేగకు అందించాడు.


సభాసదులందరూ ఆశ్చర్యంతో ఆవేదనతో శిబి చక్రవర్తిని డేగా, పావురాలను చూస్తున్నారు.


ఎంతమాంసం శరీరం నుంచి కోసి ఇచ్చినా, డేగ ఆకలి తీరలేదు తింటూనే వుంది. శిబి శరీర కండలన్నీ కోసేయబడ్డాయి. అస్థిపంజర ఆకారంలో నిలిచాడు శిబి చక్రవర్తి. వారు బాధపడలేదు. డేగను దూషించలేదు.


వారి నిశ్చిల చిత్తానికి డేగ రూపంలో వున్న యమధర్మరాజు పావురం రూపంలో వున్న దేవేంద్రుడు ఆశ్చర్యపోయారు. ఇరువురూ నిజరూపాలను ధరించి, బలి ముందు నిలిచారు. బలి చక్రవర్తికి పూర్వరూపాన్ని ప్రసాదించారు.


"బలి మహారాజా!... మాలో జరిగిన వాదన కారణంగా మేము డేగా, పావురముల రూపాలను ధరించి, మీ ధర్మ నిరతిని పరీక్షించాము. మా పరీక్షలో మీరు విజయాన్ని సాధించారు. మీ ఈ మహోన్నత త్యాగ చరిత యుగాంతం వరకూ చరిత్ర పుటల్లో వెల్లివిరియును గాక. మీరు మీ రాజ్య ప్రజలు సర్వ సౌభాగ్యాలతో ఆనందంగా వర్ధిల్లుదురు గాక!..."


ఆ రీతిగా దేవేంద్రుడు, అగ్నిదేవుడు శిబి చక్రవర్తిని దీవించి అదృశ్యమైనారు. అంతటి మహోన్నత చరిత్ర కలవారు శిబి చక్రవర్తి శివా!..." పార్వతమ్మ చెప్పడం ఆపింది. 


శివ కళ్ళల్లో ఏదో మెరుపు.

"అమ్మా!... నేనూ!... అంతటి గొప్పవాడిని కావాలమ్మా!" ఆనందంగ పలికాడు.


శ్రద్ధగా చదువుకొని పెద్దవాడివై మంచి ఆశయాలతో అందరినీ అభిమానిస్తూ ముందుకు సాగితే నీవూ గొప్పవాడివనిపించుకొంటావు నాన్నా!...." నవ్వుతూ చెప్పింది పార్వతి.

తన తల్లి మాటలను శ్రద్ధగా విన్న శివ మనస్సున తానూ గొప్ప వాడిని కావాలని నిర్ణయించుకొన్నాడు.

*

అప్పటికి శివ వయస్సు పన్నెండు సంవత్సరాలు. ప్రాధమిక విద్యాభ్యాసం ముగిసి, హైస్కూల్లో చేరాడు. ఎన్నడు ఏ విషయంలోనూ అబద్ధం చెప్పేవాడు కాదు. సాటి పిల్లలందరితో ఎంతో స్నేహంతో, అభిమానంతో వుండేవాడు. ఏడవ తరగతి చదువుతున్నాడు. బాగా చదివేవాడు. మంచి మార్కులు సాధించేవాడు. అందరు అధ్యాపకుల అభిమానపాత్రుడు. దినపత్రికలు చదివేవాడు. వార్తలు వినేవాడు. వాటివలన అతనికి అర్థం అయింది మనదేశ ఉత్తరపు వైపున వున్న చీనా, మన భారతదేశం నుండి విడిపొయి మనకు పడమటి ఏర్పడిన పాకిస్తాన్, రెండూ మనకు శత్రువులన్న విషయాన్ని గ్రహించాడు.


ఒకరోజు రాత్రి భోజన సమయంలో తనలోని సందేహాలను తండ్రిని అడిగాడు శివ.

"నాన్నా!.... చీనా, పాకిస్తాన్ దేశాల వారు మనకు శత్రువులా!..."


"అవును శివా!... మన దేశం సదా విశ్వశాంతి కోరుతుంది. మన దేశంలో మన హైందవులు, బౌద్దులు, ముస్లింలు, క్రైస్తవులు ఇంకా కొన్ని మతాలవారు అందరం కలిసి వున్నాము. భిన్నత్వంలో ఏకత్వం మన సిద్ధాంతం. మన దేశ మొత్తం జనాభా 145 కోట్లు మన హిందూ పాపులేషన్ 80 కోట్లు (80%), ముస్లింలు 20 కోట్లు, (14.28%) బౌద్ధులు 10 - మిలియన్స్ (0.7%), క్రిస్టియన్స్ 28 మిలియన్స్ (2.50%) సిక్కులు (1.7%), జైన్స్ (0.4%) ఇతర మతస్థులు 0.35%.


ఇన్ని మతాలు, ఎన్నో కులాలు (మన పెద్దలు కల్పించినవి) వున్నప్పటికీ మనమంతా భారతీయులం, భిన్నత్వంలో ఏకత్వం అన్నది మన భారతజాతి యావన్మందీ నినాదం, దేశ సరిహద్దు రక్షణలో అన్ని కులాల వారు, మతాల వారు, కొందరు వీరవనితలూ కూడా వున్నారు. నీవు పెద్దవాడివైన తర్వాత నాలాగే నీవు సిపాయివి కావాలి. మన భరతమాత రక్షణా కార్యక్రమంలో పాలు పంచుకోవాలి శివా!... నీ విషయంలో నాకున్న ఆశ అది ఒక్కటే!... జననీ జన్మ భూమిశ్చ, స్వర్గాదపీ గరియసీ!... జై జై భారత్!..." భావావేశంతో సెల్యూట్ చేస్తాడు రాజన్న. 


అతని కళ్ళల్లో నీళ్ళను చూచిన శివ పార్వతుల నమయానాల్లో కన్నీరు.

సెలవురోజుల్లో భార్యా బిడ్డతో గడిపి శివన్న దేశ సరిహద్దులకు వెళ్ళిపోయాడు.

*

"రేయ్ కాశీ!...”


 అతనిపేరు కాశిం. ముస్లిం. శివ ప్రాణస్నేహితుడు. అతన్ని కాశీ అనే పిలుస్తాడు శివ.


"ఏం శివా!...


"నీ పేరూ నా పేరూ కలిసి ఒక గొప్ప వూరిది కదూ!..."


"ఏరా ఈనాడు కొత్తగా అడుగుతున్నావ్?"


ఇరువురూ ఒకే తరగతి, సెక్షన్ వారు బెంచి మేట్స్ మంచిమిత్రులు. దేశ సరిహద్దుల్లో భారత్, పాక్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం జరుగుతున్న విషయాన్ని ఎరిగిన వారు. ప్రతి ఇంటా తిరిగి చందాలను వసూలు చేసి, తమ హెడ్ మాస్టర్‍గారితో కలిసి కలెక్టర్ ఆఫీసుకు వెళ్ళి వాళ్ళు సంపాదించిన పాతిక వేలు కలెక్టర్ గారికి సమర్పించాడు.


ఆ చిన్నారుల దేశ భక్తికి వారిని మెచ్చుకొని కలెక్టర్ గారు వారిని అభినందించారు.

*

అందం అన్నది ఒకరీతిగా ఆడవారి పాలిట శత్రువు. పార్వతమ్మ చాలా అందమైనది. ఎదురింటి కామరాజు వివాహితుడే. అయినా అతని దృష్టి ఎప్పుడూ పార్వతమ్మ మీదే. రాజన్న బార్డర్‍లో వున్నప్పుడు, శివ స్కూలుకు వెళ్ళినప్పుడూ, కామరాజు పార్వతిని కలిసి చతుర సంభాషణలతో, ఆమె అందచందాల వర్ణనలతో వేధించేవాడు. పార్వతి అతన్ని అసహ్యించుకొనేది. ’నా భర్తకు కొడుక్కు నేను నీ ధోరణిని గురించి చెబితే, వారు నిన్ను చంపేస్తారు జాగ్రత్త’ అని హెచ్చరించేది. రావణ అంశజుడు కామరాజు, తన నడత, సంకల్పాలను మార్చుకోలేదు.


కొత్తగా రిలీజ్ అయిన పుష్పా2 సినిమా చూచేదానికి శివా, కాశీలు తొలి ఆటకు వెళ్ళారు. కామరాజు అర్థాంగి శంకరి వారి తల్లిగారింటికి, తల్లి అనారోగ్య కారణంగా వెళ్ళింది.

పిల్లలు ఇరువురూ పార్వతికి చెప్పి సినిమాకు వెళ్ళేటప్పుడు కామరాజు చూచాడు.

"పదిగంటలకు కాని పిల్లలు రారు. ఇది చాలా మంచి సమయం. పార్వతిని వశం చేసుకొవాలి. నా ఆశయాన్ని నెరవేర్చుకోవాలి" అని దుష్టనిర్ణయంతో మందు త్రాగడం ప్రారంభించాడు కామరాజు. 


పార్వతిని గురించి ఊహించుకొంటూ అతని మనస్సున ఏవేవో ఊహలు. తప్పతాగాడు కామరాజు.


సమయం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతం. మెల్లగా లేచి పార్వతి ఇంటివైపుకు వెళ్ళి తలుపు తట్టాడు. పార్వతి ’అప్పుడే పిల్లలు వచ్చారా!’ అనుకొంటూ తలుపు తెరిచింది. వికారంగా నవ్వుతూ కామరాజు ఇంట్లో ప్రవేశింది తలుపును బిగించాడు.


అదే సమయానికి అక్కడ భారత్- పాకిస్థాన్ సరిహద్దుల్లో తుపాకి ప్రేలుళ్ళు. ఇరువర్గాల వారు కాల్పులు ప్రారంభించారు. రాజన్న పదిమంది పాకిస్థానీ సైనికులను, ఉగ్రవాదులను కాల్చి చంపాడు.


ఒక పాకిస్థానీ ఉగ్రవాది చావబోతూ తుపాకిని పేల్చాడు. అది రాజన్నకు తగిలింది. రాజన్న ’అమ్మా’ అంటూ నేలకు ఒరిగాడు.

*

సినిమా ముగిసింది. ఇరువురు మిత్రులు శివ, కాశీలు (కాశిం) ఇంటికి వచ్చారు. తలుపు తట్టారు. ఐదారు సార్లు తలుపు తట్టి ‘అమ్మా.... అమ్మా’ అని పిలిచినా తలుపు తెరువబడలేదు.


ఆవేదనతో దొడ్డివైపు వెళ్ళారు ఇద్దరు మిత్రులు. ఇంటి ముఖద్వారానికి ఎదురుగా వెనుక దొడ్డివైపున వున్న ద్వారాన్ని త్రోశారు. అది తెరుచుకొంది.


ఆత్రంగా ఇరువురూ ఇంట్లోకి ప్రవేశించారు.

’అమ్మా!’ అని పిలిచాడు శివ.


"నాయనా!" బిగ్గరగా అరిచింది పార్వతి.


ఇరువురూ వేగంగా ఆ అరుపు వినిపించిన బెడ్‍రూములో ప్రవేశించారు. అక్కడ దృశ్యాన్ని చూచి ఆశ్చర్యపోయారు. కామరాజు పార్వతిని మంచంపై త్రోసి ఆమె కట్టుకొన్న చీరను వూడదీసే ప్రయత్నంలో వున్నాడు.


ఆ చిన్నారులకు విషయం అర్థం అయ్యింది. శివ ఎగిరి కామరాజు జుట్టు పట్టుకొని బలవంతంగా లాగాడు. కామరాజు శివను తనవైపుకు తిప్పుకొని తన సుత్తిలాంటి ఎడమ బలమైన హస్తంతో శివ ముఖంపై కొట్టాడు. శివ నేలకూలాడు. అతని ముక్కునుండి రక్తం కారసాగింది. శివ వేగంగా లేచి వంటగది వైపుకు పరుగెత్తాడు. కూరలను నరికే కత్తిని తీసుకొని పడక గదిలోనికి వచ్చాడు.


ఈలోగా కాశీ (కాశిం) పార్వతమ్మను మంచంపై నుంచి లేప ప్రయత్నించాడు. కామరాజు అతడిని వేగంగా తోశాడు. తలగోడకు తగిలి అతని నొసటి చర్మం చిట్లింది. రక్తం చిమ్మింది. తలంతా దిమ్మెక్కిపోనట్లనిపించింది. నేల తలను పట్టుకొని కూలబడ్డాడు కాశిం.


చేత కత్తితో శివ ఆ గదిలో ప్రవేశించాడు. తన తల్లిపై వాలి ఆమెను వివస్త్రను చేయ తీవ్రంగా ప్రయత్నిస్తున్న కామరాజు వీపున కత్తితో గట్టిగా పొడిచాడు. పైకి ఎక్కాడు మరోసారి ఇంకా ఆవేశంగా పొడిచాడు శివ. రెండవ కత్తిపోటుకు కామరాజు తన ప్రయత్నాన్ని మానాడు. బాధతో నేలకు ఒరిగాడు.


కామరాజు చేతలకు భయపడిపోయి, నలిగిపోయిన పార్వతమ్మ స్పృహ కోల్పోయింది. నేలను కూలబడి వున్న కాశీ ఆ సన్నివేశాన్ని చూచాడు. వేగంగా లేచి శివ చేతిలోని కత్తిని తన చేతిలోనికి లాక్కొన్నాడు.


"శివా!... కామరాజు నేలకూలాడు. వాడు చస్తాడో చచ్చాడో నాకు తెలియదు. నీవు అమ్మను జాగ్రత్తగా చూచుకో" 


"కాశీ ఏందిరా నువ్వనేది"


"వాడిని పొడిచింది నీవు కాదు నేను. సాయం పట్టు వీణ్ణి తీసుకెళ్ళి వాడి వాకిట్లో పారేద్దాం" అన్నాడు కాశీ (కాశిం).


ఇరువురూ కామరాజు కాళ్ళను పట్టుకొని చచ్చిన కుక్కను లాక్కెళ్ళినట్లు లాక్కెళ్ళి, కామరాజు ఇంటి గుమ్మం ముందు పడేశారు.

"రేయ్!... శివా!... నీవు వెళ్ళు. అమ్మను జాగ్రత్తగా చూచుకో."


"నీవు ఎక్కడికి వెళతావురా!...."


"పోలీస్ స్టేషనుకు వెళ్ళి కత్తిని వాళ్ళకు చూపించి జరిగిన సంఘటనను గురించి ఇన్స్ స్పెక్టర్ గారికి తెలియజేసి నేను కామరాజును పొడిచానని చెబుతాను."


"రేయ్ కాశీ! వాణ్ణి పొడిచింది నేను కదరా!..."


"చూడు శివా!... నా తల్లి నీ తల్లి. నీ తల్లి నా తల్లి. నా తల్లిని చూచుకోను మా అన్న వున్నాడు కానీ ఈ నా తల్లిని చూచుకొనవలసింది నీవే కదరా!.. ఇంట్లోకి వెళ్ళు. అమ్మను జాగ్రత్తగా చూచుకోరా!..." కత్తిని చేత పట్టుకొని కాశీ వేగంగా పోలీస్ స్టేషన్ వైపుకు పరుగెత్తాడు.


శివ ఏడుస్తూ తన ఇంటివైపుకు నడిచాడు. స్పృహలేని తల్లి ముఖాన నీళ్ళు చల్లాడు. కొన్ని క్షణాల తరువాత పార్వతి కళ్ళు తెరిచింది.

*

కాశిం చెప్పిన కథనంతా విన్న ఇన్స్ స్పెక్టర్ అతన్ని జైల్లో వుంచి పోలీసులతో కామరాజు ఇంటికి వచ్చాడు. వాకిటి ముందు పడివున్న కామరాజును చూచాడు. కామరాజు గతించాడు. 


ఆ వార్త విని తన తల్లిగారి వూరినుండి, కామరాజు భార్య శంకరి వచ్చింది. పార్వతి శివలు జరిగిన విషయాన్నంతా ఆమెకు చెప్పారు. తన సోదరుడు రఘు కేసు పెడుతాను అన్నా, అతని తత్వం ఎరిగిన శంకరి... చిన్నపిల్లవాడూ కాశీం భవిష్యత్తు పాడవకుండా గిట్టని వారు చేసిన పని ఇది. ఆ అబ్బాయి కాదని స్టేట్ మెంటు వ్రాసి ఇచ్చింది.


శివ పార్వతి కాశిం తల్లి రజియా, అన్న జాఫర్‍లు వచ్చి కాశిం స్టేషనులో చూచారు. ఏడ్చారు. 


అప్పుడే కామరాజు భార్య శంకరి... వ్రాసి ఇచ్చిన వాంగ్మూలంతో స్టేషనుకు వచ్చిన ఇన్స్ స్పెక్టర్ మనోహర్ కాశింను జైలునుండి విడిపించారు.


మిత్రులిరువురూ కౌగలించుకొన్నారు. కన్నీళ్ళు కార్చుకొన్నారు. ఒకరి కన్నీరు ఒకరు శివ, కాశీలు తుడుచుకొన్నారు. ఆనందంగా ఇండ్లకు చేరారు.


మూడు వారాలు సైనిక హాస్పిటల్లో చికిత్స పొంది, ఆరోగ్యంతో కోలుకొన్న రాజన్న సెలవులో వూరికి విశ్రాంతి కోసం వచ్చాడు. కొడుకు, భార్యను చూచి ఆనందించాడు. కాశిం శివ ఇంటికి వచ్చాడు. 


"నీవు మా గురువు భాషా కొడుకువి కదూ!... నన్ను మిలటరీలో చేర్పించినది మీ నాన్నే. శివ నీవు మంచి స్నేహితులుగా, పెద్దయ్యాక ఏం కావాలనుకొంటున్నారు?" అడిగాడు శివన్న.


"మీలాగే వీర జవాన్!... వందేమాతరం. జైజై జయహో... వీర జవాన్" ఆ ఇరువురూ శివన్నకు సెల్యూట్ చేశారు.


సమాప్తి


సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ree

రచయిత పరిచయం:

 పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

 కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

 బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


Comments


bottom of page