స్నేహం ఖరీదు
- Srinivasa Rao Pingali

- 1 hour ago
- 2 min read

Sneham Khareedu - Telugu Moral Story | Srinivasa Rao Pingali
స్నేహం ఖరీదు - తెలుగు నీతి కథ | శ్రీనివాస రావు పింగళి
Published in manatelugukathalu.com on 24/08/2026
నిజమైన స్నేహానికి అసలు విలువ ఎంత? డబ్బుతో ప్రతి బంధాన్నీ కొలవచ్చా? చిన్ననాటి స్నేహితులైన వాసు, ఆకాశరాజుల జీవితాల ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే హృదయస్పర్శి కథ “స్నేహం ఖరీదు”. ఆకాశరాజు బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నప్పటికీ, తన మిత్రుడి సహాయాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకోకుండా పేద పిల్లల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తాడు. ఒక అపార్థం నుంచి మొదలైన వాసు ఆలోచన చివరకు నిజమైన స్నేహం, మానవత్వం, దాతృత్వం ఎంత అమూల్యమైనవో తెలుసుకునేలా చేస్తుంది.
కనీసం ఒక్కసారి అయినా వాడ్ని నా కారులో ఏదైనా రెస్టారెంట్‌కు తీసుకెళ్లి భోజనం పెట్టిద్దామనుకున్నాను నేను. ఎన్నిసార్లు అడిగినా సున్నితంగా తిరస్కరించాడు ఆకాశరాజు. "నా బెలూన్లకు రెట్టింపు ధర ఇస్తున్నావు. అది చాలు మిత్రమా..." అన్నాడు నవ్వుతూ.
ప్రతిరోజూ సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే పిల్లలిద్దరికీ ఆకాశరాజు దగ్గర బెలూన్లు కొనిపెట్టడం అలవాటయింది నాకు. ఒక్కో బెలూన్ ధర పది రూపాయలు. నేను నా పిల్లల చేత ఇప్పించేది ఇరవై రూపాయల చొప్పున. మారుమాట్లాడకుండా తీసుకుని వెళ్తాడు ఆకాశరాజు. ఓ రోజు నా భార్య ఉండబట్టలేక "చూశారా... మీ స్నేహితుడికెంత దురాశో... చిన్ననాటి స్నేహాన్ని గుర్తుంచుకుని వెల తగ్గించి ఇవ్వాల్సింది పోయి ఊరకనే పగిలిపోయే బెలూన్లకు రెట్టింపు ధర వసూలు చేస్తున్నాడు..." అంది నాతో.
ఆకాశరాజు, నేను ఒకే స్కూల్‌లో పదవ తరగతి వరకు కలసి చదువుకున్నాం. తర్వాత నేను బిటెక్ సివిల్ ఇంజినీరింగ్ చదివాను. హైదరాబాద్‌లోని ప్రముఖ బిల్డర్ దగ్గర సివిల్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాను. వాడు మాత్రం చదువు ఆపేసి బెలూన్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఒక ఆదివారం రోజు ఉదయాన్నే మూడేళ్ల చిన్నోడి చేతికి ఉండాల్సిన ఉంగరం కనిపించలేదని కంగారుగా చెప్పింది నా భార్య. ముందురోజు సాయంత్రం బెలూన్లు ఇచ్చే సమయంలో ఆకాశరాజు కాజేసి ఉంటాడని అనుమానం కూడా వ్యక్తం చేసింది. ఆకాశరాజును ఉంగరం విషయం అడుగుతానంది. వద్దన్నాను నేను.
సాయంత్రం బెలూన్లు ఇచ్చేందుకు వాడు రావడంతోనే అడిగేసింది. చిరునవ్వుతో తనకు తెలియదని చెప్పి, యథావిధిగా బెలూన్లు ఇచ్చి నలభై రూపాయలు తీసుకొని వెళ్ళాడు ఆకాశరాజు. కాసేపటి తర్వాత ఎనిమిదేళ్ల పెద్దోడు బెడ్‌రూమ్‌లో నుంచి ఓ కేక పెట్టాడు "ఉంగరం ఇక్కడుందీ..." అంటూ. అప్పుడు నా భార్య ముఖంలో కనుపించిన వెలుగు నాకెంతమాత్రం నచ్చలేదు.
సోమవారం ఉదయం టిఫిన్ తినకుండానే కారులో ఆఫీసుకు బయలుదేరాను. దారిలో వెనుక టైర్ పంక్చర్ అయింది. కారును ఓ పక్కకు తీసి పార్కింగ్ చేసి, నడుచుకుంటూ ముందుకు సాగాను. ఆఫీస్ అక్కడికి దగ్గరలోనే ఉంది. నాకు కొంచెం ముందరగా బెలూన్లు చేతిలో పట్టుకొని అమ్ముకుంటూ వెళుతూ కనుపించాడు ఆకాశరాజు. నేను వెళ్లే దారే కావడంతో వాడ్ని ఫాలో చేస్తూ నడువసాగాను. సంపాదన పరవాలేదు అనిపించింది. అయితే ఓ విషయం నచ్చలేదు నాకు. కొంతమంది బీదపిల్లల దగ్గర నుంచి డబ్బు తీసుకోకుండానే బెలూన్లు ఇచ్చేస్తున్నాడు వాడు.
నా భార్య మీద మొదలైన కోపం మరింత పెరిగింది నాలో. వాడి దగ్గరకు వెళ్లి "నువ్వేమైనా ధర్మరాజువా... బెలూన్లు ఊరకనే పంచేస్తున్నావు. అసలే అంతమాత్రంగా ఉన్న నీ ఆర్థిక పరిస్థితి ఏమవుతుందో తెలుసా..." అంటూ నిలదీశాను.
అప్పుడు ఆకాశరాజు నెమ్మదిగా "వాసూ! నేను వీళ్లకు ఉచితంగా బెలూన్లు ఇస్తున్నది నిజమే... కానీ అవి నీవు నాకు అదనంగా ఇచ్చే సొమ్ముతో కొన్నవి. ఈ చిన్నారుల సంతోషాన్ని చూసి భగవంతుడు నిన్ను, నీ కుటుంబాన్ని మరింతగా ఆశీర్వదించాలని ఇలా చేస్తున్నాను.
డబ్బుతో ఖరీదు కట్టలేనివి ఈ లోకంలో చాలా ఉన్నాయి నేస్తం... వాటిలో ఈ పసినవ్వులతో పాటు మన అమూల్యమైన స్నేహం కూడా ఉంది" అన్నాడు.
ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మనసు కలిగి ఉన్నప్పటికీ, నాకోసమని నేలకు దిగివచ్చి, కన్నులకెదురుగా ఒదిగిపోయినట్లుగా నిల్చుని ఉన్న ఆకాశరాజును అమాంతం దగ్గరకు లాక్కుని గుండెలకు గట్టిగా హత్తుకున్నాను నేను.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.

రచయిత పరిచయం: శ్రీనివాస రావు పింగళి
పేరు : శ్రీనివాస రావు పింగళి
తల్లిదండ్రులు : అలివేలుమంగమ్మ, సుబ్బారావు
ఉద్యోగం : ఏ.పి.యస్ ఆర్టీసీ కండక్టర్
చదువు : డిప్లొమా ఇన్ ఆటోమొబైల్ ఇంజినీరింగ్
ఇతర రచనలు : ఆంధ్రభూమి వీక్లీలో అనేక కవితలు, తెలుగు వెలుగు మాసపత్రికలో "భలే పెళ్లిపెద్ద" హాస్య కథ, స్వాతి వీక్లీలో "వర్మ ఫ్రమ్ బర్మా" హాస్య కథ ప్రచురింపబడినవి.
ప్రస్తుత నివాసం : గుంటూరు






Comments