top of page

స్నేహమా నీకు సాటి లేదు'Snehama Niku Sati Ledu' - New Telugu Story Written By A. Annapurna

Published in manatelugukathalu.com on 03/02/2024 

'స్నేహమా నీకు సాటి లేదు' తెలుగు కథ

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)ఆ అపార్ట్మెంట్ కొత్తగా కట్టేరు. అప్పటినుంచీ అందులోవుండే గాయత్రి, సావిత్రి, మధుమతి, నీలిమ బాగా దగ్గిర అయ్యారు. అలా అని వాళ్ళు ఓకే ఏజ్ కాదు కానీ ఆలోచనలు ఆశయాలు ఇష్టాలు ఒక్కటే అవడం వలన స్నేహం ఏర్పడింది. 


గాయత్రి, మధుమతి టీచర్లుగా పనిచేసి రిటైర్ అయ్యారు. సావిత్రి హోంమేకర్ ఐతే, నీలిమ బ్యాంకు ఆఫీసర్గా పనిచేస్తోంది. సావిత్రి ఎంబ్రాయిడరి, పనికిరాని వస్తువులతో అందమైన బొమ్మలు చేయడంలో సిద్దహస్తురాలు. 


 నలుగురికి బుక్స్ చదవడం హాబీ. విశ్వనాధ మొదలు ఇప్పటి రచయితల వరకూ ఎవరి పంధా ఏమిటో అడిగితె అనర్గళంగా చెప్పగలరు. అన్నిరకాల బుక్స్ చదువుతారు ముగ్గురూ. నీలిమ మాత్రం సెలక్టివ్ రైటర్స్ విప్లవ సాహిత్యం ఎక్కువ ఇష్టపడుతుంది. అందరూ ఆధునికత పట్ల మక్కువ గలవారే. మార్పును అంగీకరిస్తారు. ఇండిపెండెంట్గా ఉండటానికి ఇష్టపడతారు. 


 వాళ్లకి ఒక ఆలోచన వచ్చింది. ‘మనం అపార్ట్మెంట్ ఆఫీస్ రూంలో లైబ్రరీ పెట్టుకుందాం’ అని ప్రెసిడెంట్ గారిని పర్మిషన్ అడిగారు. ఆయన అంగీకరించి కొన్ని బుక్స్, గోద్రెజ్ బీరువా డొనేషను కూడా ఇచ్చారు. 


 ఆయనతోనే ప్రారంభించి, వారానికి ఒకరోజు ఫ్రైడే అందరూ కలుసుకునేలా ఏర్పాటు చేసుకున్నారు. మొత్తం నలభై ఫ్లాట్స్లో చదివే వారు సగం మంది ఉండటం వాళ్ళకి సంతోషం కలిగించింది. 


ఇష్టం వున్నఉన్నవాళ్ళు మెంబర్షిప్కి బదులుగా నవల, ఒకటి రెండు పత్రికలూ ఇవ్వాలని కండిషన్ పెట్టేరు. 


అందరూ కలిసివచ్చారు.. వాళ్ళ ఆలోచన ఫలించింది. సావిత్రి సెక్రటరీ గా అన్నీ చూసేది. 


 పదిహేను ఏళ్ళు అలా గడిచాయి. సావిత్రి, గాయత్రి దాదాపు ఒకే ఏజ్. అనారోగ్యం వచ్చి కొన్ని రోజులు ఇంటికే పరిమితమై పోయారు కానీ చదవడం, పత్రికలూ, నవలా కొనడం ఆపలేదు. మరో నాలుగేళ్లకు వాళ్ళు ఏడాది తేడాలో, ప్రాణప్రదమైన గ్రంథాలయాన్ని, స్నేహాన్ని వదిలి పెట్టి వెళ్లిపోయారు. 


జీవనయానంలో మజిలీలు తప్పవు. అలాగే ఏదో వొకరోజున అన్నిటినీ వదలిపోకనూ తప్పదు. సరిగ్గా అదే టైం లో అప్పటిదాకా వున్న అపార్టుమెంట్లో కొందరు వేరే చోటుకు మారిపోయారు. ఊరినే వదిలిపెట్టి వెళ్లిపోయారు ఇంకొందరు. 


అయినా మధుమతి కొంతకాలం గ్రంథాలయాన్ని నడిపింది. నీలిమ పిల్లలు అమెరికాలో ఉండటంవలన, జాబ్ నుంచి రిటైర్ అయ్యాక, ఆమెకూడా వాళ్ళ దగ్గిరకు పోయింది. 


ఆన్లైన్ వెబ్ మాగజిన్స్ రావడం వలన, వార, మాస పత్రికలు మూతపడ్డాయి. న్యూస్ పేపర్స్ తో బాటు తోరణాల్లా వేలాడుతూ కళకళ లాడే చిన్న చిన్న పాన్ షాపులు కూడా కనుమరుగు అయ్యాయి. ఆన్ లైన్ అమ్మకాలు, పుస్తకాల ధరలూ పెరిగాయి. మధుమతి లైబ్రరీకి వచ్చినా ఒక్కతీ అయిపోయి బోరుకొట్టి ఇక రావడం మానుకుంది. 


బుక్స్ ఏమిచేయాలి ? దగ్గిరలో వున్న లైబ్రరీకి కొన్ని తీసుకున్నారు. వారపత్రికలు కిరాణా షాపుకి అమ్మి వాచిమెన్కి ఇచ్చేసింది. బుక్స్ బైట పెట్టి కావలసినవారు తీసుకోమంటే ఒక్కరూ తీసుకోలేదు. చివరికి అవీ వాచ్మెన్ తూకానికి అమ్మేసేడు. అలా గ్రంధాలయం కూడా వైభవం కోలుపోయి సెలవు తీసుకుంది. 


 ఈ విషయాలు నీలిమతో ఫోనులో మాటాడినపుడు మధుమతి చెప్పేది. అయిదేళ్ళ తర్వాత కొంతకాలం ఇండియాలో ఉందామని వచ్చింది నీలిమ. రాగానే ఇల్లు సర్దుకుని జెట్లాగ్ తీరి ఖాళీ అయ్యాక మధుమతి ని చూడటానికి వెళ్ళింది. 


 కాలం, వయసు, మనిషిలో మార్పు తెస్తుంది. అన్నిదశలు గడిచి ఒంటరిగా మిగిలిన మధుమతి కి పుస్తకాలే తోడుగా ఆమెచుట్టూ పరుచుకుని వున్నాయి. 


 ''హలొ మధుమతీ ఎలావున్నారు.. ?” అంటూ బెడ్ మీద గోడకి జారబడి కూర్చుని వున్న మధుమతిని పలకరించింది నీలిమ. 


 ''ఓ నీలూ.. ఎప్పుడు వచ్చావు?” అంది సంతోషంగా. బలహీనంగా వున్నా ఆమె తన చేతిని చాచింది. 


 కొద్దిగా జ్ఞాపక శక్తి తగ్గినా వచ్చినవారిని గుర్తుపడుతోంది. మాటలో ఎలాంటి మార్పూలేదు. 


ఆచేతిని ఆప్యాయంగా అందుకుని ''వచ్చి వారం ఐనది. ఎలా వున్నారు?” అంది ఆదరంగా నీలిమ. 


''ఇదిగో ఇలా వున్నాను” అంటూ చుట్టూ చూపించి “ఏమి తీసుకుంటావ్? కాఫీ టీ జ్యూస్..”

 

''అవన్నీ ఏమి వద్దు కానీ చెప్పండి, ఒక్కరే ఉన్నారా?” అంది నీలిమ. 


''అవును. పెద్దవయసువచ్చింది.. అనుకో. అయినా నాపని నేను చేసుకుంటున్నాను. ఇంటిపనికి నాకు తోడుగా

రోజ్ మేరీ వుంది..” అంటూ ‘రోజా’, అని పిలిచింది. ఎవరూ పలకనూ లేదు, రాలేదు. 


''రోజూ చర్చికి వెడుతుంది ఈ టైముకి. ఏమిటి కబుర్లు.. నిన్ను చూసి పదేళ్లు అవలేదూ ? అప్పుడు ఎలావున్నావో ఈ ఇంటికి వచ్చినపుడు అలాగే ఉన్నావ్. అమెరికాలో అమృతం తాగుతున్నావా ఏమిటి?” అంది నవ్వుతూ. 


''అవును. మీకు కూడా తెచ్చాను. ఇకనుంచి కలిసే తాగుదాం.. '' అంది సరదాగా నీలిమ. 


''నువ్వు అస్సలు మారలేదు. నేనే ముసలి ఐపోయాను. చూడు. చేతులు పుల్లలుగా అయ్యాయి. త్వరగా నడవలేను. ఏపనీ చేయలేను. రోజా సాయం చేయాలి. అదే దేవత ఇప్పుడు. ఇంకా రాలేదు.. చూడు., నీకు ఏమీ ఇవ్వలేదు. ''


''అలా అనుకోవద్దు మధుమతి గారు. మీరు లేచి నడవండి. అమెరికాలో నాతోబాటు పార్కులో వాకింగ్ చేసేవారంతా తొంభై ఏళ్ళు వున్నవారే! వయసును మర్చిపోండి. ఇలా నాలుగు గోడలే ప్రపంచం కాదు. 


మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. రోజాను తీసుకుని కింద గార్డెన్లోకి వచ్చి కూర్చోండి. వచ్చేపోయే జనం కనబడతారు. కబుర్లు చెబుతారు. మొక్కలు, పూలు, పక్షులు, ఆడుకునే చిన్న పిల్లలూ వుంటారు. నేను వచ్చి కూర్చుంటాను. '' చెప్పింది నీలిమ. 


 ''అవునా, నాకు తెలియదు. ఇల్లు కదిలి రాలేను అనుకుంటున్నాను. నాలాటి వారిని రానివ్వరు అనుకున్నా!

ఇది హాస్పటల్కదూ, డాక్టర్ కోపగిస్తారు! లేస్తే పడిపోతాను '' కొంచెం ధోరణి మారింది. 


అంతకుముందు నా పని నేను చేసుకుంటాను అన్న మనిషిలో మరుపు వచ్చింది. 


''ఏం కాదు మధుమతిగారూ. మీరు అలా అనొద్దు. అందరిలా మాటాడగలరు. నడవగలరు. మనం నలుగురం-

గాయత్రిగారు, సావిత్రిగారు, మీరు, నేనూ కలిసి బుక్ ఎగ్జిబిషన్ కి వెళ్లినరోజులు, చూసిన సినిమాల కబుర్లు,

నటీనటుల నటన, నచ్చిన పాటలు, మనచుట్టూ వుండే మనుషులు, చదివిన బుక్స్, రాసిన మన అభిమాన రచయితలు, రచయిత్రులు..” అంటూ బోలెడు కబుర్లు చెబుతుంటే ఒకొక్కటే గుర్తుకి తెచ్చుకుంది మధుమతి. 


 అప్పుడు వచ్చింది రోజ్ మేరీ. 

''ఇదిగో వచ్చింది. ఇదే నా కెర్టేకర్. కాఫీ ఇవ్వు. నాకు నీరసంగా వుంది'' అని కళ్ళు మూసుకుంది మధుమతి. 


 ''నువ్వేనా రోజావి. ఇలా అమ్మని వదిలి ఇంతసేపు వెళ్ళిపోతావా?” అని అడిగింది కోపంగా నీలిమ. 


''రోజూ వెళ్లనమ్మా.. ఈరోజు ప్రార్ధన ఉందని భోజనం అక్కడే అంటే వెళ్లాను. ఇంటిఖర్చు కలిసివస్తుంది. రాత్రికి కూడా అవసరంలేదు. చూడండి.. '' అంటూ ఏవో తినుబండారాలు చూపించింది. 


కొత్తమనిషిని మరీ తిడితే ఆకోపం మధుమతి మీద చూపిస్తుంది.. అని ఊరుకుంది. మధుమతి కాఫీతాగి తేరుకుంది. 


“నువ్వుకూడా తాగు” అని నీలిమను బలవంతం చేస్తే.. ''. లేదు ఇంత లేటుగా తాగితే నాకు పడదు. మా ఇంట్లో తాగే వచ్చాను. '' అంది నీలిమ. 


వచ్చేటప్పుడు రోజా తో అంది. 

''చూడు రోజా, మేడం ని కిందకు తీసుకురా గార్డెన్లోకి. నలుగురు మనుషులు కనబడతారు. నేనుకూడా వస్తాను రోజూ. అలా నువ్వేమి చేయలేవు.. లేస్తే పడిపోతావు అని చెప్పకూడదు. సాధ్యమైనంతవరకూ అటూ ఇటూ నడిపించాలి. 

బలమైన పదార్ధాలు ఇవ్వాలి. రోడ్డుమీద అమ్మే గడ్డి కొని పెట్టద్దు. ఇంట్లోనే చేయి. నేనుచెబుతాను ఏమి చేయాలో !” అని హెచ్చరించి “నేను మేడంకి క్లోజ్ ఫ్రెండ్ని. రోజూవస్తాను. '' అంది.

 

 ''అలాగే మేడం! మీరు చెప్పినట్టు చేస్తాను” అంది రోజా. 


తర్వాత అన్నివిషయాలూ గ్రహించింది నీలిమ. 


మధుమతి ఒకసారి చెప్పింది.. 

‘కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చి పెళ్లి మానుకుంది. ముగ్గురు చెల్లెళ్ళు, తమ్ముడూ ఆవిడ అవసరం తీరాక వదిలిపెట్టేసారు. కాస్త అందరిలోనూ ఒకచెల్లి నయం. ఆవిడే అక్క మంచి చెడూ చూసేది. ఆవిడ కేన్సరువచ్చి చనిపోతూ 'పెద్దమ్మ మాకోసం అన్ని వదులుకుంది. నువ్వు బాగా చూడాలి. ఆదుకోవాలి ' అని కూతురికి అప్పగించింది. నా పెన్షన్, ఉంటున్న ఫ్లాట్ ఎలాగా వనజకె ఇస్తుందని, ఈవిడ ఎలాగా ఎంతోకాలం జీవించదు అనే నిర్లక్ష్యంతో ఇంటిపనికి రోజ్ మేరీని కుదిర్చి వారానికోసారి వచ్చి చూసి వెడుతుంది..’ అని వాళ్ళగురించి చెప్పింది. 


 'నా చెల్లి కూతురు వనజ పక్కవీధిలోనే ఉంటుంది. ఫోనులో మాటాడుతుంది. అందరూ వదిలేస్తే నాకేనా పట్టిందని అనుకున్నా. ఆస్తి రాసేసాను కనుక ఆమాత్రం పలకరిస్తుంది..’ అని కూడా చెప్పింది. 


 ‘మనుషుల రక్తం కూడా కలుషితం ఐపోఇంది. తినే పదార్ధాలతోబాటుగా! వయసు మళ్ళినవారితో మాటాడే తీరిక, అభిమానం, ప్రేమలు మసకబారిపోయాయి. ఆ కృంగుబాటే వృద్దులకు శాపం ఐనది’ అనుకుంది నీలిమ. 


 ఏడాదిపాటు స్వంత పనులమీద ఇండియాలో వుండిపోయిన నీలిమ, స్నేహంతో మధుమతి ని మామూలు మనిషిని చేసింది చాలావరకూ. 


డబ్బు కోసమే పనిచేసే రోజాని కంట్రోల్ చేసి ''నువ్వు మేడంని కనిపెట్టివుండాలి. ప్రార్ధన కోసంబయటకు వెడితే ఎవరికైనా చెప్పి వెళ్ళాలి. అదికూడా వారానికి ఒక్కరోజే. నీ మీద నమ్మకంతో ఇంటిని అప్పగించినపుడు బాధ్యతగా నువ్వు నడుచుకోవాలి. లేకపోతె ఇంకొకరు వస్తారు. '' అని వార్ణింగ్ ఇచ్చింది. 


 అలాగే వనజతో కూడా మంచి గా మాటాడి చెప్పింది. 

''వనజా ! మీ పెద్దమ్మగారికి కొంత ఓపిక తగ్గింది నిజమే. కానీ చిన్నపాటి ఆసరా ఇస్తే తనకు తానుగా పని చేసుకోగలరు. మనోధైర్యం కలిగించే మాటలు చెప్పడం, డబ్బు దగ్గిర పొదుపు పాటించకుండా ఆవిడ పెంక్షన్ డబ్బు ఆవిడకోసమే ఖర్చు చేయడం, ఆవిడ జీవించినంతకాలం సంతోషపెట్టడం మీ బాధ్యత. నీకుటుంబానికి మంచిది. మధుమతిగారు చాలా మంచిమనిషి. ఆవిడ కుటుంబంకోసం కష్టపడిన దాంట్లో మీరు పడిన కష్టం

చాలా తక్కువ. గుర్తుపెట్టుకోండి. మీ జనరేషన్కి ఇది మార్గదర్శకం కావాలి. మిమ్ములనుచూసి మీ పిల్లలు మంచిని నేర్చుకుంటారు. ఆలోచించు వనజా. మేము స్నేహితులుగా ఉండేది తక్కువ కాలమే. ఎక్కువ బంధం ఆవిడకు మీతోనే!” అంటూ మనసుకు హత్తుకునేలా చెప్పింది. 


అప్పటినుంచీ వనజ రోజూ వచ్చి మధుమతితో ఎక్కువ టైం గడపడం మొదలుపెట్టింది. చేసినతప్పు దిద్దుకుంది. అప్పటినుంచీ ఆశ్చర్యంగా మధుమతి కోలుకుంది. ఆరోగ్యం మెరుగైంది. ఇప్పుడు ధైర్యంగా బయటకువస్తోంది. 


‘ఇక పర్వాలేదు. మరో కొంతకాలం మధుమతి దిగులును, వయసును మరిచి సంతోషంగా గడుపుతుంది.. పనివాళ్ళు తోడు వుంటారు.. అనే పధ్ధతి వేరు. అయినవాళ్లు ఇచ్చే ఆసరా వేరు. రెండిటిని పోల్చలేము’ అనుకుంది నీలిమ పూర్తిగా పిల్లలదగ్గిర అమెరికాలో స్థిరపడటానికి వెడుతూ!

సమాప్తం. 

***************************************************************************


ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)


51 views0 comments

Comments


bottom of page