బాల గేయాలు:: అమ్మ చెప్పిన సూచనలు
- Gadwala Somanna

- 1 hour ago
- 4 min read

Bala Geyalu - Amma Cheppina Suchanalu| Gadwala Somanna
బాల గేయాలు:: అమ్మ చెప్పిన సూచనలు | గద్వాల సోమన్న
Published in manatelugukathalu.com on 20/08/2026
బాల గేయాలు:: అమ్మ చెప్పిన సూచనలు పిల్లల్లో మంచి ఆలోచనలు, నైతిక విలువలు, క్రమశిక్షణ, ధైర్యం, జ్ఞానం, స్నేహభావం పెంపొందించే అందమైన తెలుగు బాల గేయాల సంకలనం. గద్వాల సోమన్న రచించిన ఈ గేయాల్లో అమ్మ చెప్పే సూచనలు, పెద్దల సుభాషితాలు, జీవితంలో పాటించాల్సిన మంచి అలవాట్లు, సమానత్వం, ప్రేమ, త్యాగం, సేవాభావం వంటి విలువలను సరళమైన పద్యాల రూపంలో అందించారు. పిల్లలు ఆసక్తిగా చదివేలా, తల్లిదండ్రులు వారికి మంచి విషయాలను పరిచయం చేసేలా రూపొందిన ఈ తెలుగు బాల సాహిత్యం ప్రతి గేయం ద్వారా జీవితానికి ఉపయోగపడే ఓ చక్కని సందేశాన్ని అందిస్తుంది.
అమ్మ చెప్పిన సూచనలు
------------------------------
ఏకాగ్రత ఉంటేనే
లక్ష్యాన్ని చేరగలము
శ్రమైక్య జీవనమే
ఉన్నతికి సోపానము
మనిషికి ఏకాంతము
ఎంతైనా అవసరము
గొప్ప పనుల సాధనకు
అవుతుంది ఘన ఆయుధము
పెద్దదైతే ఆశయము
ఎక్కువగును పోరాటము
చేయాలి నిరంతరము
ఎడతెగని అభ్యాసము
శ్రమిస్తేనే విజయము
అక్షరాలది సత్యము
యోచిస్తేనే గొప్పగా
దొరుకుతుంది పరిస్కారము
బేధాలు వద్దు వద్దు
------------------------------
మేలు చేసే దైవానికి
చెల్లించాలి కృతజ్ఞతలు
సృష్టిలోని ప్రతి దానికి
ఇవ్వాలి సమ విలువలు
చూపరాదు తేడాలు
సృష్టించరాదు భేదాలు
ఈ సభ్య సమాజంలో
అందరూ సరి సమానులు
పీల్చే వాయువుకు లేదు
విరిసే పూవులకు లేదు
ఏ భేదాభిప్రాయము
కురిసే మేఘానికి లేదు
భగవంతుని సృష్టిలోన
జీవకోటి సమానమే
ఈ శ్రేష్ట భావన హృదయాన
ఉంటే సమత సాధ్యమే
ఆది సంభూతుడు
------------------------------
ఆది సంభూతుడు దేవుడు
అన్నిటికి ఆధారభూతుడు
సకల లోక పాలకుడు
ఆరాధనకు కారకుడు
భగవంతుని సన్నిధిలో
శుద్ధమైన హృదయంలో
సంతోషం కలదు కలదు
ఏ చింత వలదు వలదు
కాచును కనుపాపలా
చూచును పసిపాపలా
ప్రేమామయుడు దేవుడు
కడు కరుణాసంపన్నుడు
పాదాబ్జములు తాకాలి
సతతము పూజించాలి
భగవంతుడు లోకంలో
ఆద్యుడే నాకంలో
శ్రేష్టమైనది జ్ఞానము
------------------------------
ముత్యముల కన్న శ్రేష్టము
అమూల్యమైనది జ్ఞానము
సంపాదిస్తే మాత్రము
ఎక్కించును అందలము
మానుకొనుము దుష్టత్వము
వదులుకొనుము శత్రుత్వము
విలువైనది స్నేహబంధము
చేసుకొనకు బహు దూరము
ఉత్తమమే వివేకము
చెరుపు చేయు అవివేకము
చక్కని జీవితంలో
చిక్కనిది విజ్ఞానము
మదినిండా సంతోషము
కల్గియుంటే స్వర్గము
లేదంటే తలపించును
జీవితంలో నరకము
అక్షర సత్యాల సరాలు
------------------------------
సంతోషానికి మించిన
సంపద లేనే లేదు
ఆరోగ్యానికి మించిన
స్వర్గమే కానరాదు
సంతృప్తి నిండు బలము
జీవితాన స్వర్గ సుఖము
ఉంటేనే మేలు మేలు
ఈ భువిలో చాలు చాలు
అందరితో సమాధానము
అత్యంత ఆవశ్యకము
బాగుండదు సమాజాన
ప్రతి వారితో విరోధము
సజ్జనుల సహవాసము
నిరంతరం కోరుకొనుము
దుష్టుల మైత్రి బంధము
పరికింప హానికరము
అమ్మ అమూల్యమైన పలుకులు
------------------------------
మానసిక ప్రశాంతత
ఉంటేనే జీవితము
లేదంటే మాత్రము
కన్పించును నరకము
శ్రేష్టమైన భావనలు
ఆరోగ్యదాయకము
ప్రేమించే మనుషులు
ఉండాలోయ్! ఆప్తులు
బాగుంటే మనసులు
వృద్ధినొందు బ్రతుకులు
లేదంటే అవుతాయి
ఆకురాలిన తరువులు
స్వచ్ఛమైన ప్రేమలు
చెట్టుకున్న ఆకులు
చూడగా నిశితంగా
పాల కడలి తరగలు
తాతయ్య మేటి వాక్కులు
------------------------------
గెలుపు వశమవుతుంది
ఉంటేనే పట్టుదల
మనోధైర్యముంటేనే
భయం నుంచి విడుదల
నవజాత శిశువులా
నవ్వు ముఖం అందము
అమ్మ కొంగు ముడిలా
బలమున్నది బంధము
వెలుగులీను దివ్వెలా
వికసించిన పువ్వులా
బహు శ్రేష్టము స్నేహము
బ్రతుకులో అవసరము
కన్నవారి త్యాగము
కలుగజేయు క్షేమము
వారి గొప్ప ప్రేమలు
కుటుంబాన కాంతులు
ఉన్న వారు మిన్న
------------------------------
మనసు ప్రశాంతంగా
మేను ఆరోగ్యంగా
ఉన్న వారు ధనవంతులు
ఉర్విలోన మహనీయులు
బ్రతుకున క్రమశిక్షణతో
మోమున చిరునవ్వుతో
ఉన్న వారు అందగాళ్లు
పుడమిలోన మొనగాళ్లు
నమ్మదగిన మిత్రులను
బ్రతుకులో ఆత్మీయులను
కల్గియున్న వారు మిన్న
లేకపోతే గుండు సున్న
నమ్మకంలో గొప్పగా
పదిమందికి మెప్పుగా
ఉన్న వారే ధన్యులు
జీవితంలో మాన్యులు
పెద్దాయన సుభాషితాలు
------------------------------
నిండు కుండ మాదిరి
ఉండాలోయ్! చదువరి
ఇక ఉన్నంత వరకు
బొందిలోన ఊపిరి
మంచితనం ముత్యము
ఖరీదైన వజ్రము
జన్మ సార్ధకతకై
చూపాలోయ్! త్యాగము
హద్దులేని స్వార్థము
నిజముగా ప్రమాదము
నిస్వార్ధ సేవలో
సాగాలి జగతిలో
లేనిపోని వాటితో
స్థిరత లేని మనసుతో
అభివృద్ధి శూన్యమే
గ్రహిస్తే సత్యమే
ధైర్యమే ఉండాలి!
------------------------------
ధైర్యమే ఆయుధము
పెంచుకుంటే లాభము
విజయాల సాధనకు
అదే కదా మార్గము
చేయాలి సాహసము
జీవితమిక అద్భుతము
ఏది కూడా వట్టిగా
సాధించలేముగా
తెగువనే చూపాలి
శక్తిలా లేవాలి
నలుగురికి స్ఫూర్తిగా
బ్రతకాలి గొప్పగా
చరిత్ర సృష్టించాలి
మంచి పేరు రావాలి
చేతలే మంచిగా
ఉంటే ఘనతేగా
అందరికీ ఇష్టులు బాలలు
------------------------------
చిరునవ్వుల పిల్లలు
విరబూసిన మల్లెలు
నింగిని హరివిల్లులు
తొలకరి చిరు జల్లులు
భారతమ్మ బిడ్డలు
నిజమైన వారసులు
భారతీయ సైనికులు
కాబోయే నాయకులు
పవిత్రమైన మనసులు
ముఖమున చిరునవ్వులు
అందాలకు అందము
భువిలో చిన్నారులు
అందరికీ ఇష్టులు
బుద్ధిలోన శ్రేష్టులు
అల్లరిలో ప్రథములు
అవనిలోన బాలలు
ఇట్టివారు శ్రీమంతులు
------------------------------
జీవితంలో సమస్యలు
కావు కావు శాశ్వతము
అందుకే భీతిల్లకు
ఆనందం కోల్పోకు
ధైర్యమే ఆభరణము
బ్రతుకులోన శోభితము
ఘనమైన విజయాలకు
అతి ముఖ్యమైన ద్వారము
చిన్ని చిన్ని కలతలకు
చెందబోకు ఆందోళన
వయసులోన పెద్దలకు
చేయొద్దు అవహేళన
సాహసమే శ్వాసగా
దరహాసం ఆస్తిగా
ఉన్నోళ్లు ఘనులు ఘనులు
సమాజాన శ్రీమంతులు
సత్యాల సరిగమలు
------------------------------
సూర్యడే మరుగైతే
చంద్రుడే మాయమైతే
వెలుగు ఎక్కడుంటుంది
దేవుడే లేకపోతే
త్యాగానికి ఆనవాళ్లు
పుడమిలోన కన్నోళ్లు
తెప్పించకూడదోయి!
వారి కంట కన్నీళ్ళు
సదనంలో పెద్దలను
ప్రేమ పంచు వనితలను
గౌరవించడం మంచిది
బడి గుడిలో గురువులను
ముద్దులొలుకు పిల్లలను
వనంలోని మల్లెలను
జాగ్రత్తగా చూడాలి
కనుపాపలా కాయాలి
9.ఉండరాదు బ్రతుకులో
------------------------------
నీళ్లు లేని చెరువులా
పండ్లు లేని తరువులా
ఉండరాదు బ్రతుకులో
కొడిగట్టిన ప్రమిదలా
శ్వాస లేని తనువులా
గూడు లేని ఖగములా
ఉండరాదు బ్రతుకులో
పైరు లేని పొలంలా
తావి లేని పూవులా
నగవు లేని ముఖంలా
ఉండరాదు బ్రతుకులో
పనికిరాని వ్యక్తిలా
గురిలేని పాంథునిలా
మానసిక అంధునిలా
ఉండరాదు బ్రతుకులో
నిస్సారపు ఊటలా
అక్షర సుభాషితాలు
------------------------------
పెద్దవారి మాటలకు
అభ్యంతరం చెప్పొద్దు
వారి చేయు బోధలకు
విసుగుదల చెందవద్దు
పసి పిల్లల హృదయాలను
కలుషితం చేయొద్దు
వారి ఉజ్వల భవితను
బూడిదగా మార్చవద్దు
అవనిలోన వనితలను
చులకనగా చూడొద్దు
వారి మనోభావాలను
అగౌరవ పరచవద్దు
నమ్ముకున్న వ్యక్తులను
వెన్నుపోటు పొడవవద్దు
వారి సున్నిత మనసులను
ఏ గాయం చేయొద్దు
అమ్మ నోట నీతి ఊట
------------------------------
ఒళ్ళు వంచి పనిచేస్తే
కళ్ళు తెరచి నిజం చూస్తే
ఉంటుందోయ్! ఫాయిదా
ఏ పని వేయకు వాయిదా
నిర్లక్ష్యం నీడలో
అబద్దాల లోయలో
ఏ మాత్రం ఉండొద్దు
పగటి కలల మాయలో
పనికిరాని తలపులతో
మేకులాంటి పలుకులతో
విరచవద్దు మనసులను
వేదించవద్దు మనుషులను
నిరుయోగ వాదనలను
సంఘ విద్రోహ శక్తులను
కలనైనా బలపరచకు
దేశ ద్రోహిగా మారకు
తాతయ్య సందేశం
------------------------------
డబ్బు పెట్టి కొనలేనిది
అవనిలోన అనుబంధము
కల్మషం కానరానిది
అమ్మలోని అనురాగము
గడిస్తే తిరిగిరానిది
అమూల్యమైన కాలము
సృష్టిలోనే దొరుకనిది
విలువైన మైత్రి బంధము
మిగుల మోసకరమైనది
స్థిరత్వం లేని హృదయము
అందరిని కలుపుకునేది
శ్రేష్టమైన క్షమాగుణము
తెలుగుభాష తీపి గలది
నుడికారము చక్కనిది
దేశ భాషల్లో ఘనము
సంగీతానికి తగినది
పెద్దమ్మ ప్రేమ పలుకులు
------------------------------
ఎక్కడినా బ్రతుకొచ్చు
గొప్పగా ఎదగవచ్చు
సంపాదిస్తే జ్ఞానము
కల్గియుంటే లౌక్యము
ఎక్కిస్తుంది అందలము
తెస్తుందోయ్! గౌరవము
అంతులేని విజ్ఞానము
అమూల్యమైన వజ్రము
అపాయం శత్రుత్వము
తరమాలి కడు దూరము
స్నేహమే మహోన్నతము
ఉంది ఉంది ఔన్నత్యము
మంచిది మనోధైర్యము
ఎదిగేందుకు ఆధారము
కల్గియున్న మహనీయులు
చూడగా చరితార్థులు
పసి పిల్లలు వేల్పులు
------------------------------
పూలలాంటి పిల్లలు
పాలలాంటి పలుకులు
అందరికీ ఇష్టము
బుద్ధులేమో శ్రేష్టము
చక్కనైన బాలలు
నింగిలోని చుక్కలు
జాబిలమ్మ అందము
బలమైనది బంధము
భగవంతుని రూపులు
పవిత్రమైన చూపులు
మహిలో చిన్నారులు
మార్తాండుని దీప్తులు
పాల కడలి తరగలు
పలుకులేమో తేనెలు
వికసించిన పూవులు
పసి పిల్లల నగవులు
త్యాగానికి ప్రతీకలు పూవులు
------------------------------
కొమ్మలోని పూవులు
ఎన్నెన్నో సొగసులు
పరహితమే కోరుతూ
వెదజల్లును తావులు
మెత్తనైన సుమములు
అమ్మల్లాంటి మనసులు
ఉండదోయి! స్వార్ధము
నిలువెల్లా త్యాగము
త్యాగానికి ప్రతీకలు
అసమానం సేవలు
పరహితమే అమితము
సుగుణాలు అమోఘము
రకరకాల పూవులు
ముందడుగు సేవలో
అల్లితే మాలికలు
అలరించును కంఠంలో

-గద్వాల సోమన్న




Comments