సన్ స్ట్రోక్
- Dr. Brinda M. N.
- 2 hours ago
- 6 min read
సన్ స్ట్రోక్ కథ, తెలుగు కుటుంబ కథ, తల్లిదండ్రుల ప్రేమ, పిల్లల కృతజ్ఞత, పదవీ విరమణ కథ, భావోద్వేగ తెలుగు కథ, కుటుంబ బంధాలు, సంస్కారం విలువ, తెలుగు షార్ట్ స్టోరీ, ప్రేరణాత్మక కథ, హృదయస్పర్శి కథ, Telugu family story, retirement story Telugu, parents love story, emotional Telugu story

Son Stroke - Telugu Emotional Family Story | Dr. Brinda M N
సన్ స్ట్రోక్ - తెలుగు భావోద్వేగ కుటుంబ కథ | డాక్టర్ బృంద ఎం. ఎన్.
Published In manatelugukathalu.com On 22/06/2026
తల్లిదండ్రులు పిల్లల కోసం చేసే త్యాగాలకు విలువ కట్టలేం. కానీ మంచి సంస్కారంతో పెరిగిన పిల్లలు ఆ ప్రేమను, ఆ బాధ్యతను జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తిరిగి చెల్లిస్తారు. "సన్ స్ట్రోక్" కథ అలాంటి అరుదైన కుటుంబ బంధాన్ని, తల్లిదండ్రుల త్యాగాలను, పిల్లల కృతజ్ఞతను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరిస్తుంది. పదవీ విరమణ అనంతరం జీవితాన్ని ఆనందంగా గడపాలని భావించిన దంపతులకు వారి పిల్లలు ఇచ్చిన అద్భుతమైన సర్ప్రైజ్ ఈ కథకు ప్రత్యేక ఆకర్షణ.
ఇల్లంతా ఒకటే హడావుడి, సందడి సందడి, పిల్లల కేరింతలు, పెద్దల బాధ్యతలు, మంగళ వాయిద్యాల మాధుర్యం, వయోవృద్ధుల బోసి నవ్వుల కలబోత, ఘుమఘుమలాడే వంటకాల సువాసనలు, అబ్బో వర్ణనాతీతం. వధూవరులను వెతుక్కోక తప్పలేదు. ఏదైతేనేం అంగరంగ వైభోగంగా సకల లాంఛనాలతో కళ్యాణం కమనీయం.
"హమ్మయ్య! అంతా సవ్యంగా జరిగింది కాంతం"
"అవునండి, ఇక మనం తీరిగ్గా ఊపిరి పీల్చుకోవచ్చు."
అప్పగింతల సమయం రానే వచ్చింది.
"అల్లుడుగారు! మా అమ్మాయి ఒట్టి అమాయకురాలు, కాస్త జాగ్రత్త"
"అలాగే అత్తగారు, పుట్టినింటా అమాయకురాలే కానీ మెట్టినింట అసాధ్యురాలు అవుతుందేమో! బాగా బెంగగా ఉందండి" చిలిపిగా అన్నాడు సర్వేశ్వర్.
అందరూ ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు.
"ఏమండీ! ఘల్లు ఘల్లుమంటూ గజ్జల సవ్వడి మూగబోయుంటే వెలితిగా లేదు?"
"అవును కాంతం! తప్పదు మరి అలవాటు చేసుకోవాలి"
"హ్మ్మ్! ఏంటో! మా ఆడవారి అగచాట్లు" నిట్టూర్పుతో
"అదే ధ్యాసలో ఉండక రోజూవారి క్రొత్తదనంతో జీవించవోయ్! ఇవాల్టి నుండి క్రొత్త ప్రేమపక్షులం మనం, ఎవరి మాట ఇక వినం."
"ఆ, ఆ,ఆ, చాల్లే సంబరం, మరీ అంతొద్దు శ్రీవారు" సహజ నవ్వుతో లోపలికి వెళ్ళింది కాంతం.
శోభనాద్రి ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ గా పని చేస్తున్నారు. ఇంకా మూడేళ్లు సర్వీస్. అబ్బాయి పెళ్లి అనంతరం ఎనిమిదేళ్ళకు కూతురి కళ్యాణం జరిపించారు. ఆస్తిపాస్తులు లేవు, పొలం గట్రా లేదు. ఉన్నదంతా తన జీతభత్యమే. అవసరానికి మించి ఏ వృథా ఖర్చు చేయకుండా సవ్యంగా నడుపుతున్నారు సంసార బండిని భార్యాభర్తలు. అప్పుడప్పుడు ఫోన్లో మాటలే గాని తరచూ పిల్లలు వచ్చేవారు కారు.
"ఏమ్మా! కాంతమ్మ! ఈనెల ఇంటి అద్దె ఇంకా ముట్టలేదు!" ఇంటి యజమాని
"అన్నయ్య! మొన్ననే పిల్ల పెళ్లి అయ్యింది. కాస్త పెద్ద మనసు చేసుకొని పదిహేను రోజులు గడివిప్పించండి."
"అబ్బబ్బ! ప్రతినెల ఏదో సాకు. ఇల్లు ఖాళీ చేయొచ్చుగా? వెటకారంతో
"మేము మా వంతు ప్రయత్నిస్తున్నాం కానీ, ఏదో ఇంకా చెప్పబోతూ ఉండగా యజమాని వెళ్లిపోయాడు.
మూడేళ్ల కాలచక్రం అలా తిరిగిపోయింది. శోభనాద్రి పదవి విరమణ దినోత్సవం, పాఠశాలలో తోటివారు, పిల్లలు అందరూ కలిసి ఘనంగా నిర్వహించారు.
"ఏమండోయ్! శ్రీమతి గారు, బెడ్ కాఫీ
టట్టడాయ్" ఆనందంతో.
"ఏంటండీ! ఇవాళ క్రొత్తగా, అలసటగా ఉంటే ఆలస్యమైంది"
"నో, నో, నో,ఇకనుండి నవీన డ్యూటీ చేయబోతున్నాను. సదా మాకాంతం కాంతి సేవలో" గుసగుసలాడు చెవిలో
"వద్దు! మహాప్రభో! ఇలా పూలపాన్పు ఎక్కించకండి."
"కాంతం, నిజం చెప్పు ఈ ముప్పై ఏళ్లలో ఏనాడైనా నీకు పిల్లలకు నేను పూర్తిగా న్యాయం చేశానా? ఎంతసేపు బడి బడి అంటూ పని ఒత్తిడిలో, ప్రయాణాల్లో పుణ్యకాలం కాస్త అయిపోయింది. పిల్లల చదువు, బాగోగులు ఆఖరికి పెళ్లి సంబంధాలు కూడా నువ్వే చూసుకున్నావు. ఈరోజు నుండి ఈ దేవతారాధన, అర్చన, అభిషేకం, అలంకారం అంతా క్వాంటం డ్యూటీ అన్నమాట."
"పొగడ్తలేమిటీ, బాధ్యతగా చేశాను అంతే"
"కాంతం, నీ సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఆనందం ఇవే నాకు ముఖ్యం."
"శోభనాద్రి, పదవీ విరమణ శుభాకాంక్షలు, రాత్రి వద్దామనుకున్నాను. నీవు ఆలస్యంగా వస్తావేమో అని రాలేదు" పలకరించాడు హనుమంతరావు
"ధన్యవాదాలు, ఇంటికి వచ్చి తెలిపారు.
అవును పిల్లలందరూ ఒకటే పొగడ్తలతో ముంచి ఎత్తివేశారు. వారి అభిమానం, ఆప్యాయత అలాంటిది మరి"
"ఆ, శోభనాద్రి! నీకు పదవీ విరమణ లాంఛనాలన్నీ ముట్టినట్టేనా?"
"ఆ, అన్నీ చెక్కు రూపంలో ఇచ్చేశారు"
"మరి మీ పిల్లలు వచ్చినట్టు లేదు"
"అవును, రెండు రోజుల తర్వాత అబ్బాయి వస్తానన్నాడు."
"ఏం, నీకు వచ్చినవన్నీ మోసుకుపోవడానికా?"
"ఛ,ఛ, కాదు, ఏదో పని మీద వస్తున్నాడట"
"ఏంట్రా పని! తెలియట్లేదు! డబ్బును తన్నుకు పోవడమే కదా, మా అబ్బాయి ఇదే పని చేశాడు"
"వదిలేయరా! ఇదిగో ఈ మిఠాయిలు తీసుకో"
"నేను నీలాగే సంతోషపడి, వాడు అడిగినట్లు ఇస్తూ వచ్చాను. చివరికి నీ దగ్గర ఉంటే ఒకటి, నా దగ్గర ఉంటే ఒకటినా నాన్న! డబ్బును నా దగ్గర దాస్తాను. నీకేమీ ఖర్చులు ఉంటాయి చెప్పు! అంటూ ప్రతినెలా ఏదో ఒక టెండర్ వేస్తూనే ఉన్నాడు. ఇటు పెన్షన్ రావడం, వాడు ఖజానా ఖాళీ చేయడం పరిపాటు అయిపోయింది." శోభనాద్రి అన్నాడు చెమర్చిన కళ్ళతో
మరుసటి రోజు హనుమంతరావు మరలా పలకరించాడు
"ఏంటోయీ! కొడుకు రాక ఖాయమా"
"అన్నా, చెల్లెలు ఇద్దరు వస్తున్నారట అన్నయ్య, ఇదిగో ఇప్పుడే పాప ఫోన్ చేసింది."
"అనుకున్నదే నిజమమ్మ! గ్రాట్యుటీ చెరిసగంగా వాటా పంచుకోవడానికి వస్తున్నారన్నమాట"
"ఏమో! తెలీదు అన్నయ్య, వివరాలు అడిగితే చెప్పలేదు"
"శోభనాద్రి! స్వీయ అనుభవంతో చెప్తున్నా, భార్య పోయిన మగవాడి ముసలి బ్రతుకు ఎంత హీనంగా ఉంటుందో, కొడుకు చేతిలో పెట్టిన డబ్బు, పప్పులో వేసిన ఉప్పు తిరిగి వస్తాయనుకున్నావా? ఎనిమిదేళ్ల నుండి నేను పడే నరకయాతనకు అంతులేదు. మనం ఇంకొకరిపై ఆధారపడితే ఆహారం కూడా సమయానికి దొరకదు.
కోడలు క్రొత్త టైం టేబుల్ వేసింది. ప్రొద్దున్నే పాల ప్యాకెట్ అటు నుండి ఆకుకూరలు, కాయగూరలు మధ్యలో చిన్నాచితక సరుకులు, మనవళ్ళని బడిలో దింపడం, తీసుకురావడం వచ్చిన తర్వాత లెక్కంతా చెప్పి చిల్లర ముట్టించడం, ఏదో పెద్దవాడిని కదా! మధ్యలో ఓ రెండు అరటి పళ్ళు, టెంకాయ నీళ్ళు ఎప్పుడైనా త్రాగితే ఎన్ని చివాట్లు, ఎంత రాద్దాంతమో, ఆరోగ్యం బాలేక పోతే నేను సంపాదించిన డబ్బుతో చూపించవచ్చు కదా!
'ఎందుకు అనవసర ఖర్చు కాటికి కాలు సాచే వయసొచ్చినా, ఆడంబరాళ్ళకి ఏమీ తక్కువ లేదు. అయ్యో పాపం అని దయతలిస్తే నెత్తినెక్కి కూర్చుంటారు', అని కోడలు వాపోతుంటే కిక్కురు మనకుండా మా వాడు గంగిరెద్దులా తలూపుతుంటే ఆ మానసిక క్షోభ ఎంత భయంకరంగా, వికటంగా ఉంటుందో, నేను ఇచ్చే సలహా, చెల్లెమ్మ, నువ్వు కలిసి తీర్థయాత్రలు చేస్తూ ఆనందంగా గడపండి. నచ్చినది తింటూ, మానసిక ఉల్లాసాన్ని ఆస్వాదించండి, చీకుచింతాలేక చిలకా గోరింకల్లా హాయిగా ఎంజాయ్ చేయండి.
అందరికీ వేసవికాలంలోనే వడదెబ్బ తగులుతుంది. కానీ నాకు మాత్రం జీవితకాలమంతా సన్ స్ట్రోక్ తప్పదు మరి, ఆ,! జాగ్రత్త, నీవు కూడా నాకు మల్లె కాకూడదని ఇంతలా చెప్తున్నాను. జాగ్రత్తరా! సన్స్ట్రోక్, సన్స్ట్రోక్, సన్స్ స్ట్రోక్", అంటూ కళ్ళల్లో నీరు కణిక నిప్పుల రాలుతుంటే, చేయి ఊపుతూ వెళ్లిపోయాడు హనుమంతరావు.
ఆరోజు రాత్రి భోజనానంతరం అడిగింది కాంతం. "ఏంటండీ! అన్నయ్య సన్స్ట్రోక్ సన్స్ట్రోక్ అంటూ పదేపదే చెప్తూ బాధపడుతున్నారు."
"ఓ, అదా!,కాంతం! వారి సుపుత్రుని సాధింపులీలల చిన్న సినిమా"
"అర్థం, కాలేదండీ"
"హ్మ్మ్,నువ్వు ఓ ట్యూబ్ లైట్"
"అందుకే కదా! ఈ కాంతం ఇంత కాంతివంతంగా ఉంటుంది"
"ఏంటోయ్! నీలోనూ కవిత సుమాలు విరబూస్తున్నాయి" బుగ్గన చిటికేస్తూ. సిగ్గుల మొగ్గయింది కాంతం.
"కాంతం, వాడికి తగిలినది కుమారుని దెబ్బ కావున సన్ స్ట్రోక్ ఎస్, ఓ, ఎన్, ఎస్, టి, ఆర్, ఓ, కే, ఈ,"
"ఓ! ఇంత బాధలోనూ ఎంత చమత్కారంగా మాట్లాడండి అన్నయ్య"
"అదే కదా, వాడి గొప్పతనం, సరే సరే రేపు పిల్లలు ప్రొద్దున్నే దిగుతారు కాబోలు ఇక నిద్రకు ఉపక్రమిస్తాం"
"అమ్మ ఎలా ఉన్నావు? ఏంటి నాన్నగారు రిటైర్డ్ అయితే నువ్వు సన్నబడ్డావు? కూతురు కోమల తల్లిని అల్లుకుంది. కుశల ప్రశ్నలు ముగిసిన అనంతరం ముగ్గురు అల్పాహారం చేస్తుంటే వచ్చాడు కొడుకు.
"ఏంటి, నాకు కూడా కాస్త చోటు ఇవ్వండి"
"ఆ, బాబు, రారా వెళ్లి ఫ్రెష్ అప్ అవ్వు నీకు కూడా సిద్ధం చేశాను"
"అమ్మ నీ చేతి వంట తింటే అమృతం అనుకో"
"ఎందుకులేరా పొగడ్తలు"
"ఏంటి కోమల, ఓ రెండు రోజులు ఉంటున్నావా"
"లేదు అన్నయ్య! ఇవాళ రాత్రికి తిరుగు ప్రయాణం. అన్నట్టు నువ్వే వచ్చి బస్సు ఎక్కించాలి మరి నీ సంగతేంటి?"
"నాకు కూడా తెల్లవారు మూడింటికే ట్రైన్"
"అదేంటిరా, పిల్లలు వచ్చారు అని ఆనందం తీరకుండానే అలా బస్సు, ట్రైను ఎక్కేస్తున్నారు?" కాంతం కళ్ళు చెమర్చాయి.
"కాంతం రెక్కలు వచ్చిన వారిని ఆపాలనుకోవడం మూర్ఖత్వం అయినా ఎవరి స్వార్థలాభాలు వారివి" గంభీరంగా అన్నాడు శోభనాద్రి.
"ఏంటోయ్! కమ్మని వాసనల వంటకాలు" అంటూ అడుగు పెట్టాడు హనుమంతరావు.
"ఆ, ఏమీ లేదు, పిల్లలకి ఇష్టమైన సగ్గుబియ్యం వడియాలు, కారప్పూస, దద్దోజనం, పులిహోర, చిగురు పప్పు చేశాను అన్నయ్య! రండి భోంచేయండి!"
భోజనాల తర్వాత అందరూ మాటామంతి కార్యక్రమంలో కూర్చున్నారు
"ఏంటో పిల్లలు ఉన్నపళంగా ఈ దర్శనాలు?"
"నాన్నగారికి పదవీ విరమణ శుభాకాంక్షలు చెప్పాలని వచ్చామండి" ఇద్దరూ అన్నారు ముక్తకంఠంతో.
"శుభాకాంక్షలేనా లేక గ్రాట్యూటీ చెక్కులు కూడానా" వెక్కిరిస్తూ హనుమంతరావు.
"నాన్న! అమ్మ! ఇన్నేళ్లుగా ఈ అద్దె ఇంట్లోనే ఉంటూ, మా కోసం ఎన్నో ప్రయాసలు పడ్డారు. ఇకనుండి మీరు స్వేచ్ఛా జీవులు. ఇదిగో తాళాలు. మీకోసం హైదరాబాదులో కొత్త ఇల్లు కొన్నాను. నాన్న.. మీ పేరు మీదే రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. సొంతిల్లు హాయిగా గడపండి. కాదనకు నాన్న" అంటూ ఇంటి తాళాలు అమ్మ చేతికి అప్పగించాడు.
ఇంకా ఆ మెరుపు తీగ అల్లుకోకముందే,
"నాన్న! మీకు గుర్తుందా! చిన్నప్పుడు నేను ఆడుకోవడానికి కారు బొమ్మ అడిగాను. అప్పుడు మీరు అంత డబ్బులు లేవమ్మా, నీకు పుస్తకాలు కొనాలిగా అన్నారు. ఆ రోజే అనిపించింది పెద్దయిన తర్వాత నేను మీకు కారు కొనివ్వాలని. ఇదిగోండి తాళాలు మీకే. మీరైనా డ్రైవ్ చేసుకోవచ్చు లేదా ఒక డ్రైవర్ని పెట్టుకోవచ్చు మీ ఇష్టం" కోమల కారు తాళాలు తండ్రి చేతిలో పెట్టింది.
శోభనాద్రి, కాంతం నిశ్చేష్టులైనారు. విగ్రహాల్లా నిల్చున్నారు.
"ఏంటమ్మా! ఇది కలా, నిజమా!"
"నిజమే నాన్న, మీరు చిన్నప్పుడు ఎంతో కష్టపడి, మమ్మల్ని పెంచి, పోషించి, చదువు, సంస్కారం నేర్పించి ప్రయోజకుల్ని చేశారు. నేను, చెల్లాయి ఉద్యోగంలో చేరిన మొదటి మాసం నుండే ఇంటికి, కారుకి కొంత రొక్కం తీసి పక్కన పెట్టేవాళ్ళం. ఎంత అవసరం ఉన్నా దాన్ని వినియోగించకూడదని నియమం పెట్టుకున్నాము. ఇదిగో మీ పదవీ విరమణ సమయానికి సరిగ్గా సెట్ అయ్యింది. గత వారమే ఈ పనులన్నీ ముగించుకున్నాము. మీకు శుభాకాంక్షలు తెలిపి ఇవి అప్పగించడానికి వచ్చాము. మీ ఆనందమే మాకు శ్రేయస్కరం. దీవించండి." ఇద్దరు తల్లిదండ్రులకు పాదాభివందనం చేశారు.
హనుమంతరావు, "శోభనాద్రి! మీ జన్మ ధన్యం. ఇంత మంచి వారసత్వాన్ని మొదటిసారి చూస్తున్న. నాకు మల్లే సన్ స్ట్రోక్ గురికాక తప్పదని బల్లగుద్ది చెప్పాను. కానీ నీకు కూడా సర్ప్రైజ్ సన్స్ట్రోక్ తగిలింది. సూపర్, సూపర్, పిల్లలు మీరు కలకాలం ఆరోగ్యంతో, ఆనందంగా ఉండండి. నన్ను క్షమించండి చెల్లెమ్మ, నా గోడు తెలిపి మిమ్మల్ని అనవసర క్షోభకు గురి చేశాను."
పిల్లలు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయారని శోభనాద్రి దంపతులు మనసులోనే ఆనందపడ్డారు.
నీతి : తల్లిదండ్రుల పెంపకమే అన్నింటికీ మూలం. ఏ విత్తనం నాటితే అదే చెట్టు మొలుస్తుందో, మనం నేర్పిన సంస్కార పద్ధతులే తిరిగి మనల్ని చేరుకుంటాయి.
"జై తెలుగుతల్లి! జై భరతమాత"
సమాప్తం
డాక్టర్ బృంద ఎం. ఎన్. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: డాక్టర్ బృంద ఎం. ఎన్.
కవయిత్రి, రచయిత్రి, గాయని,
స్కిట్ డైరెక్టర్, చిత్రకారిణి
15 సంవత్సరాలుగా నిరంతర తెలుగు భాషా పరిరక్షణ కొరకు పాటుపడుట
భారతీ సాహితీ సమితిలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఆధునిక ప్రాచీన సాహిత్యంపై పని చేయడం అలాగే విద్యార్థులకు సుమతీ, వేమన, భాస్కర శతక పద్య పోటీలు నిర్వహించుట, తెలుగు సాహితీ మూర్తుల జయంతి వేడుకలు జరిపి వారి సేవలను గురించి సమాజానికి తెలియపరచుట, సందేశాత్మక కథలు, నీతి కథలు వ్రాసి విజేతలగుట, ప్రపంచ తెలుగు మహాసభల్లో చురుకుగా పాల్గొని (delegate) పెద్దవారి ప్రశంసలు పొందుట, యువతను ఉద్దేశించి రచనలు చేయుట, భారతదేశ ఔన్నత్యాన్ని దశ దిశల చాటుట, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ కవి సమ్మేళనంలో పాల్గొనుట తదితరమైనవి.




Comments