top of page

శ్రీరామ నవమి

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.





Youtube Video link

https://youtu.be/Cn44bU-FuRE

'Srirama Navami' New Telugu Story


Written By Bhagavathula Bharathi


రచన: భాగవతుల భారతి



"సురుచితా నీకోసం ఎవరో వచ్చారు. "

జైల్ సెంట్రీ చెప్పగానే.. ధిగ్గున లేచి, మళ్ళీ ముఖం వివర్ణమై, నిర్వికారం కమ్మేసి,

'ఈ పాపిష్టి దానికోసం వచ్చేవాళ్ళుకూడా ఉన్నారా? ఐనా నేనింకా బతికేఉన్నానా?

చచ్చిపోయాగా! మరి ఈ జీవచ్ఛవం కోసం....'


'అంటే నా మనసులో ఇంకా ఆలోచనలు పుడుతూనే ఉన్నాయా? ఐతే నేను బతికేఉన్నా'....


కలలో నడుస్తున్నట్లుగా జైల్లోని విజిటింగ్ హాల్ మెస్ డోర్ వరకూ వచ్చి, గాజుకళ్ళతో శూన్యంలోకి చూస్తున్నట్లు చూసింది.


ఎదురుగా వెలుతురులో ఓ ఆకారం...

గుబురుగడ్డమూ, చింపిరిజుట్టూ, మాసినబట్టలూ... గుర్తుపట్టటానికి నిమిషం పట్టింది. ఆశ్చర్యపోయింది.


ఓ ఉప్పెనే దు:ఖసంద్రమై పొంగుకొచ్చింది.

మెస్ డోర్ చువ్వలు పట్టుకుని ఏడుస్తోంది.

ఆ ఏడుపుకు ఆ హాలు ప్రతిధ్వనించింది.


ఇలాంటి ఏడుపులు శోకాలు అక్కడ సహజమే ఐనా, సెంట్రీ పెద్దగా అదిలించింది. సురుచిత కళ్ళు తుడుచుకోవాలని ప్రయత్నించినా అది సాధ్యం కావట్లేదు.. ఎంతసేపు ఏడ్చిందో తెలీలేదు. ఎన్నేళ్ళనుండో గూడుకట్టుకున్న దు:ఖం, కన్నీరై జైలు గోడల్ని కుదిపేస్తోంది.


"టైం ఐపోయిందమ్మా! "ఇంకో సెంట్రీ చెప్పాడు.

"మాటకూడా మాట్లాడకుండానే టైం..." అన్నట్లు బేలగా చూసిందామె.


"నువ్వు పుట్టెడు దు:ఖం లో మునిగిపోయావ్. నేను మళ్ళీ వస్తాను "

వెనుదిరిగాడతను.


"మరి పిల్లలూ?" ఏడుస్తూనే అడిగింది.

"వాళ్ళు నా పిల్లలు. నాదగ్గరే ఉంటారు " వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.


అప్పుడు కళ్ళుతుడుచుకుని స్థిమితంగా..

వెనుదిరిగి చూస్తే... సెంట్రీ... ఆశ్చర్యం గా...


"ఇన్నిరోజులుగా నీ గొంతే వినని ఈజైలు గోడలూ... ఈరోజు నీ ఏడుపు తో ప్రతిధ్వనింప జేసిన అతనెవరూ?" అడిగింది

"నాభర్త" అంది.


" ఎన్నో భర్త... నువ్వతనికి ఎన్నో భార్య... భర్తను హత్యచేసిన కేసులో కాదూ నువ్వు జైలుకి వచ్చిందీ?".....


మాటల్లోని వెటకారం... గుండెల్ని గుచ్చేస్తున్నా.... "వాళ్ళు నా పిల్లలు నా దగ్గరే ఉన్నారు ".... అనే మాట చెవుల్లో ప్రతిధ్వనించి... మనసులో ఆవరించిన నిశ్చింతతో... తనసెల్ గదిలోకి వెళ్ళిబోతూ ఆలోచిస్తోంది.


బంగారమంటి జీవితాలు.. క్షణంలో ఎంతనాశనమైపోతాయ్? వ్యసనాలకి ఆడామగా తేడాలేదు. వ్యసనం రూపుమారుతుందేమో గానీ అర్ధం ఒకటే.

రెండు తప్పులూ చిన్నవేం కాదు. దిద్దుకోటమూ సాధ్యం కాదు.

సెల్ కి వచ్చి కింద కంబళీమీద కూర్చుని గతం లోకి జారిపోయింది.

$$$$$$$

"రాత్రీ తాగేవచ్చావా? మారవానువ్వూ?!

నలుగురు ఆడపిల్లల తండ్రివి!...

పిల్లలు పెరుగుతున్నారు. చదువులూ పెళ్ళిళ్ళు, ఖర్చులూ, చేతిలో పైసాలేదు. "

సురుచిత బాధగా భర్తను నిలదీసింది.


"అవునే తాగాను... నా సంపాదనా నాయిష్టం... నీకూ... పిల్లలకీ ఇంత తిండి పారేస్తూనే ఉన్నాగా... పెళ్ళిళ్ళూ గిళ్ళిళ్ళూ తర్వాత చూద్దాం " విసురుగా వెళ్ళిపోయాడు సదాశివ.


ఏమిటిదీ?! తిండి పారేయటమేమిటీ? ముష్టివాళ్ళకి వేసినట్టూ! ఎన్నాళ్ళిలా?

ఆలోచిస్తుండగానే...

ఫోన్ మోగింది...

చూస్తే అగర్వాల్..

"మీఆయన షాప్ కి బయలుదేరాడా?! " అడిగాడు.


"అటే వచ్చినట్లున్నాడు " అన్యమనస్కంగా అంది.

"ఏంటీ అలా ఉన్నావ్?మళ్ళీ తాగి వచ్చాడా?"


"ఏం చెప్పమంటావ్! ఎప్పటికథే, మా ఆయన మీ బంగారం షాపులోనే పనిచేస్తున్నాడుగా! మీరిచ్చిన జీతమంతా తాగుడుకే పోతోంది. చూసీ చూడక మీరు కొంత నాకు ఇస్తున్నారు

కాబట్టి, ఎలాగో లాక్కువస్తున్నాను"


"అందుకే ఏడాది క్రితం చెప్పాను. పెళ్ళయి ఇన్ని సంవత్సరాలయినా, నలుగురు పిల్లల తల్లివయినా, నీ అందం ఎంతమాత్రం తరగలేదు. నీకు నేనున్నాను. పెళ్ళి చేసుకుందాం.. నామాటనమ్ము. వాళ్ళు నీ పిల్లలు కాదు నా పిల్లలు...అలాచూసుకుంటా!"

"నలుగురూ ఆడపిల్లలే గా.... "

"ఐనాసరే.. ఇకనుండీ వాళ్ళ తండ్రిని నేనే. వచ్చేయ్. " అన్నాడు అగర్వాల్.


ఆరోజూ పూర్తిగా తాగి వచ్చిన భర్త సదాశివ తో, చాలా గొడవైంది..

" తాగిందంతా దిగిపోయిందికదే! నీ.... " చావబాదాడు సదాశివ.


విరక్తితో... పిల్లలను తీసుకొని వెళ్ళిపోయింది. ఆ వెళ్ళటం.. అగర్వాల్ ఇంట్లో అడుగుపెట్టింది. అగర్వాల్ అప్పటికే పెళ్ళయి, ఇద్దరు పిల్లలనూ, భార్యనూ వదిలేసాడు. విడాకులూ ఐనాయ్. అలా ఎందుకు జరిగిందీ. విశ్లేషించే ఙ్ఞానం ఆ క్షణం లో నశించింది. అగర్వాల్ డబ్బే కళ్ళు మెరిపించింది, గంతలు కట్టించేసింది.


నలుగుర్నీ పిలిచి, వైభోగంగా పెళ్ళి చేసుకున్నారు. ఆ వార్త పేపర్లో ఫొటోతో సహా విచిత్రమైన వార్తగానూ వచ్చింది.


అగర్వాల్ అసిస్టెంట్ రాజేష్, 'అక్కా' అనిపిలుస్తూ, సురుచిత తో స్నేహంగా ఉంటూ, సహాయంగా ఉంటున్నాడు.

కొత్త పరిచయాలూ, సరికొత్త బంధాలతో... సురుచిత, అగర్వాల్ ల కొత్త కాపురం అందమైన కలలా మెుదలైంది.


అగర్వాల్ ప్రేమలో తేలిగ్గా ఊపిరిపీల్చుకుంది.

పెద్దపిల్లలు అతడిని 'నాన్నా' అని పిలవటానికి, నిరాకరించినా, ఆఖరి పిల్లలిద్దరూ, కొద్ది కొద్ది గా అలవాటు చేసుకుంటున్నారు.


కలకాస్తా పీడకలగా మారటానికి రెండేళ్ళు కూడా పట్టలేదు.

"నువ్వు రంగువెలిసిపోయావ్... నీ పెద్ద కూతురు ఈడు కొచ్చింది.. వయసులో పిటపిటలాడుతోంది... కాస్త ఎంజాయ్ చేయనా" అన్నాడో రోజు.


సురుచిత గుండె బద్దలయింది. ఆడపిల్లల పట్ల కన్నతండ్రికీ, పెంచినతండ్రికీ ఉన్న వ్యత్యాసం అర్దమైంది.

పెంచినది కూతురూ కాదు. ఉంచుకున్నవాడు మెుగుడూ కాడు.


ఈ నిజం సురుచిత గుండెల్ని పిండేస్తోంది.

అగర్వాల్ నిజస్వరూపంతో..


తప్పతాగి అర్ధరాత్రి రావటం, నలుగురి లో ఏదోకూతుర్ని, లైంగికంగా వేధించటం...

అలా చేయకుండా ఉండేందుకు, సురుచితను, ఏదో కావాలని బ్లాక్ మెయిల్ చేయటం...

పిల్లలను అగర్వాల్ నుండి కాపాడుకోటానికి కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తూ అలసిపోతోంది. తన రెక్కలక్రింద పసిగుడ్లను దాచుకోటానికి ఓ పిట్ట పడే తపన, కన్నీరుమున్నీరుగా ఉంది. ప్రతీక్షణం నరకమే.


తన పిల్లల జోలికి రావద్దని "'నాన్నా' అని పిలుస్తున్నారు కనికరం కూడా లేదా"!? అంటూ, కాళ్ళావేళ్ళాపడటం, ఏడవటం దండాలు పెట్టడం, ప్రతీరాత్రీ కాళరాత్రిగా మారిపోతోంది.


మనిషి చిక్కిపోయింది. కళ్ళక్రింద చారలు వచ్చేసాయ్. అందం తరిగిపోయింది.

తన బాధలు పడలేక ఎటూ పారిపోకుండా అగర్వాల్ బయటికి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళేవాడు.


ఆరోజు అగర్వాల్ లోని మానవమృగం నిద్రలేచింది. పట్టపగలే తాగి ఇంటికి వచ్చాడు. తలుపుతీయగానే, సురుచిత నాలుగో కూతురు, ఐదేళ్ళది నట్లింట్లో ఆడుతూ కనిపించింది. అగర్వాల్ కి కామంతో కళ్ళు మూతలు పడ్డాయ్.

గభాలున ఆ పిల్లని పట్టుకున్నాడు.


అక్కణ్ణించి గదిలోకి తీసుకుపోయాడు. పిల్ల'నాన్నా'అంటూ ఏడుపు మెుదలెట్టింది. సురుచితకు జరిగింది మైండ్ రిసీవ్ చేసుకోటానికి క్షణకాలం పట్టింది.


"వదులూ! వదులూ" అని పరుగెత్తుకుని వచ్చింది.

సురుచితను విదిలించుకుని, గదితలుపు మూసేసాడు. తల్లిగుండె బద్దలయింది.

ఏడుస్తూ, బ్రతిమాలుతూ, తలుపుమీదబాదుతోంది.


లోపల ఏం జరగబోతోందో ఊహిస్తేనే ప్రాణం పోయేటట్లు, స్ప్రహ పోయేటట్లు ఉంది.

చెమటలు కారిపోతున్నాయ్. నీరసం ఆవరిస్తోంది. "భగవంతుడా!" అని గట్టిగా అరిచింది. మిగతాపిల్లలు తల్లిని చుట్టేసుకుని పెద్దగా ఏడుస్తున్నారు.


అప్పుడే అక్కడికి అడుగుపెట్టిన రాజేష్ కి విషయం అర్థమై, తలుపు బద్దలు కొట్టాడు.

లోపలికి వెళ్ళిన రాజేష్, మగవాడైన తనే సిగ్గుపడేంత జుగుప్సాకరమైన దృశ్యంచూసి

"అక్కా!" అని గుండెలదిరేటట్లు అరిచాడు.


సురుచిత పిల్లలతో పాటు లోపలికి పరుగెత్తింది. పసిపిల్లఅనికూడా చూడకుండా..... పాప ఏడవటానికి కూడా ఓపికలేక, ఉక్కిరిబిక్కిరై పోతోంది.


సురుచిత కళ్ళు నిప్పులు చెరిగినాయ్.

భద్రకాళి అవతారం ఎత్తింది.


పక్కనే ఉన్న చెక్కకుర్చీ తిరగేసి, ఎన్నిసార్లు కొట్టిందో తెలీదు. అగర్వాల్ చచ్చాడు.

ఐనా పగచల్లారక కొడుతూనే ఉంది.


ఆయాసంతో పిల్లని దగ్గరకు తీసుకుని, పిల్ల ఏడుస్తూ ఉండటం చూసి.... 'ఏదన్నా జరగరానిది జరిగితే ?!' భయంతో కాళ్ళు ఒణికినాయ్.

"అక్కా! అగర్వాల్ శవం!... " అన్నాడు ముందుగా తేరుకున్న రాజేష్.

"ఇటువంటి వాడిని నడిరోడ్డు మీద పెట్రోల్ పోసి తగలేద్దాం.. " అంటూ ఆగింది.


"మరి నిన్ను ఏంచేయాలి?" అంతరాత్మ ప్రశ్నించింది.

"శవాన్ని మాయం చేద్దాంఅక్కా!"


"పిల్లలని జాగ్రత్తగా చూస్తూఉండు. ఇప్పడే పోలీస్ స్టేషన్ లో లొంగిపోతా"

"వద్దక్కా! పిల్లలు అనాధలైపోతారు" అన్నాడు.


"వాళ్ళు ఎప్పుడో అనాధలయ్యారు....

నేను వాళ్ళ తండ్రిని ఎప్పుడైతే మార్చానో అప్పుడు!"...... అక్కడా 'సారా' నే ఇక్కడా 'సారా' విషసర్పం కాటేసింది నా జీవితాన్ని... అని నిట్టూర్చి...


"ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పదు " బయటికి నడిచింది.

క్షణాల్లో వార్త ఊరంతా వ్యాపించింది.

మర్నాడుఅన్ని పేపర్లలోనూ ప్రింటయింది.


పెళ్ళినాటి అగర్వాల్, సురుచిత ఫొటో,

పక్కనే హంతకురాలు సురుచిత ఫొటో,


రకాలరకాల వ్యాఖ్యానాలతో... సంచలనం ఐంది.

కోర్ట్ మెట్ల మీద మీడియా మైక్ లతో చుట్టుముట్టింది. "జరిగింది మీ మహిళాలోకం తలదించుకునే సంఘటన కాదా? "


"ఇవన్నీ విశ్లేషించే ఙ్ఞానం నాకులేవు. కానీ ప్రతీ శ్రీరామ నవమి కి సీతారాముల కల్యాణం జగత్కల్యాణంగా ఎందుకు చేస్తారూ?! "

"వాళ్ళు దేవుళ్ళుగా" జర్నలిస్ట్ జవాబు.

"కాదు. వాళ్ళూ మానవులై పుట్టి దేవుళ్ళయ్యారు. కారణం?!....

వైవాహిక జీవితానికి వారిచ్చిన విలువ.

భార్యాభర్తల వైవాహిక జీవితం ఎన్నో ఒడుదుకులకు లోనైనా, విచ్చిన్నమైనా,

నైతికంగా పతనమయ్యే అవకాశాలు.. ఉండికూడా పతనం కాని, జంటవారిదే.


రాముడు చక్రవర్తేగా! కో... అంటే కోటిమంది...

మరి సీతను వాంఛించిందీ లంకాధిపతేగా.. రాణీ కావచ్చుగా!

మనం ఊహించలేనంత పవిత్రత వారిది.

ఆదికావ్యం గొప్పతనం తెలుసుకున్నారుకాబట్టే.... ఆ వివాహం ప్రపంచానికి ఆదర్శమయింది.


సీత పవిత్రత... వన్నెకెక్కింది.

తెలుసుకోలేకపోయింది కాబట్టే.... సురుచిత కోర్ట్ మెట్లమీద, ప్రపంచంచేత దుమ్మెత్తిపోయించుకుంటూ, ఈ స్థితిలో నిలబడింది. నా లాంటి సురుచిత లెంతమందో?!"

క్షణం ఆగి... సురుచిత నమస్కారం చేస్తూ...

"భారతీయమా!వైవాహిక జీవితం పట్ల సంయమనం పాటించు.... అర్హత లేక పోయినా చెప్పాను... చేతులెత్తి ప్రార్ధిస్తున్నాను.. నా పిల్లలను రక్షించండి. కాపాడండీ... " అంటూ రాజేష్ తో....

"తమ్ముడూ! రాజేషూ.. నా పిల్లలు జాగ్రత్తా"... అని ఆమె చెప్పిన ఈ మేటర్ అన్ని పేపర్లలోనూ బహుముఖంగా ప్రచురణ అయింది. ఎలా అనుకునే వారు అలా అనుకున్నారు.


రెండు నేరాలు... మెుదటిది విడాకులు తీసుకుకోకుండా రెండో వివాహం చేసుకున్న

సురుచిత... హత్యానేరం మోపబడిన సురుచిత...


యావజ్జీవ కారాగారశిక్షపడింది.

పిల్లలేమయ్యారో తెలీక ఏళ్ళ తరబడి తల్లడిల్లిన హృదయం ఇప్పుడు చల్లబడింది.

$$$$$$$$$$$

"సురుచితా! నిన్ను విడుదలచేసి, రెండుగంటలైంది.

ఇంకోరైతే బయటికి పరుగెత్తుతారు..

నువ్వు మాత్రం ఈ గోడకానుకుని ఇక్కడే కూర్చున్నావ్?!"

ఆడసెంట్రీ అడిగిన ప్రశ్నకు నిర్వికారంగా చూసి, తలతిప్పుకుంది.


వయసై పోయింది. జుట్టునెరిసింది. పిల్లలుకూడా తనని గుర్తుపట్టలేేరేమో!

విడుదలైన తను బయటికి వెళ్ళిఏంచేయాలి? ఎక్కడికెళ్ళాలి? ఎవరు చేరదీస్తారు. పాచిపని చేసుకుని బ్రతికే ఓపిక కూడా లేదే?!


"సురుచితా! నీకోసం చాలామంది వచ్చారు. బయటికి వెళ్ళి చూడూ... "


తడబడుతూ బయటికి వచ్చింది. భర్తా, పెరిగి పెద్దవాళ్ళయి గుర్తించలేనట్లుగా ఉన్న పిల్లలను, చూసి ఆశ్చర్యపోయింది.


భార్యాభర్తల చూపులు కలిసాయ్. వాటిల్లో ఎన్నో ప్రశ్నలూ.. జవాబులూ...

ఇంత మంచితనం ముందే ఉంటే నేను ఇలా?... అన్నట్లు బేలగా చూసిందామె.


నీలో ఓర్పు సంయమనం ఉంటే మేమంతా ఇలా?... అన్నట్లు అతని చూపు.


పిల్లలు మాత్రం... తమను కాపాడటానికే జైలుపాలైన తల్లిని చుట్టుముట్టి, తల్లిరెక్కల క్రింద గువ్వల్లా ఒదిగిపోయారు.

$$$$$$$$$$$$$$$$

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


ఇక్కడ క్లిక్ చేయండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.

https://www.manatelugukathalu.com/profile/bharathi/profile


167 views0 comments
bottom of page