top of page
Original.png

స్త్రీ హృదయం

#GadirajuMadhusudanaRaju, #గాదిరాజుమధుసూదనరాజు, #స్త్రీహృదయం, #SthreeHrudayam, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Sthree Hrudayam - New Telugu Story Written By Dr. Gadiraju Madhusudana Raju Published in manatelugukathalu.com on 03/02/2026

స్త్రీ హృదయం - తెలుగు కథ

రచన: డా. గాదిరాజు మధుసూదనరాజు


"కలుసుకుందాం రా"


అంటూ వనజకుమారి నుండి పిలుపు.


ఫోన్ పెట్టేయగానే


క్షణాల తేడాతో ... దాదాపు యాభై పిలుపులు!!


ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు దాసు.


ఆ కలయిక దాదాపు ఇరవై రోజుల తర్వాత అని నిశ్చయమయ్యాక .........


గడియారాలు చెడిపోయినట్లు..


అదనపు జీతభత్యాలకు ఆశపడి ఆ


సూర్యుడు తన డ్యూటీ టైంలో ఓవర్ డ్యూటీ చేస్తున్నట్లు..


చీకటి రాత్రి.. వేకువ జాములు.. టీవీ సీరియళ్లలా సాగి సాగి గుండెల్ని తొలుస్తున్నట్లు అనిపిస్తోంది దాసు మనస్సుకు.


***         ***    ***   ***


కలుసుకోవలసిన వారిని తలుచుకుంటూ తీపి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటూ..


ఇరవై రోజుల్లో దాదాపు పది దాకా నిదుర లేని రాత్రుల్ని భరించాడు దాసు.


నత్తలా నడుస్తున్న కాలపు నిర్లక్ష్యపు వైఖరిపై..


మనస్సులోనే దుమ్మెత్తిపోసుకుంటూ..


బీపీ పెంచుకుంటూ ... మాత్రలతో కంట్రోల్ చేసుకుంటూ తల్లడిల్లిపోయాడు ఉత్కంఠతో.


                                  **


ఎలాగైతేనేం.....


అర్ధరాత్రికి అర్ధరాత్రే ఇంగ్లీష్ డేట్ మారటంతోపాటే....


సెల్ ఫోన్ లో అతను సెట్ చేసుకున్న అలారం మ్రోగటంతో..


ఆ రోజు రానే వచ్చింది దాసు గుండెల్లోకి!


ఏమాత్రం... అతని ప్రమేయం లేకుండా అనియంత్రితంగా అతని మనసుతో పనిలేకుండా...


ఊపిరితిత్తుల్లో ఉచ్ఛ్వాసనిశ్వాసలు నడుస్తున్నాయి..


గుండెలో హృదయ స్పందనలు కలుగుతున్నాయి


ఐతే..


అతని మనస్సు మాత్రం..


ఉదయం జరుగబోయే కలయికల కార్యక్రమం గురించి ఆలోచించటంలో తన శరీరాన్నే తాను మరచిపోయింది.


కానీ .......


కాలకృత్యాలను మాత్రం అతని శరీరం... యాదృచ్ఛికంగా అనియంత్రితంగా తీర్చుకుంటోంది.


సమయం


ఉదయం ఏడు గంటలైంది.


టిఫిన్ అయిందనిపించుకొని.. కాఫీ తాగేసి గడప దాటి బయటికి అడుగులేశాడు.


షెడ్డులో ఉన్న కారుని బయటకు తీసి,


మెదడులోంచి ప్రవహిస్తున్న జ్ఞాపకాల ప్రవాహాల వేగంతో దీటుగా కారు వేగాన్ని సరిచేస్తూ


సంగయ్యపేట నుండి సాయిబాబా కాలనీ మీదుగా..


తన కాలేజీ.. గాంధీ మెమోరియల్ గవర్నమెంట్ కళాశాల వైపుగా నడిపించాడు హుషారుగా.


***                       **


అప్పటికే చాలా మంది పూర్వ విద్యార్థులు, విద్యార్థినులు అక్కడికి చేరుకొని ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు.


అది ..


పంతొమ్మిది వందల డెబ్బది ఏడు, డెబ్బది ఎనిమిది సంవత్సరాలకు చెందిన ఇంటర్మీడియట్ పూర్వ విద్యార్థుల అపూర్వ సంగమ సంరంభం.


నలభయ్యేళ్ల తర్వాత కలుసుకుంటున్న మనసున్న మనుషుల స్నేహానుబంధాల ఔన్నత్య మహోత్సవం.


వైద్యులు, న్యాయవాదులు, విద్యాబోధకులు, పోలీసులు, అన్నదాతలు, ప్రజానేతలు, ఆదర్శ గృహిణులు, సంపన్నులు, అపూర్వ వ్యక్తులు, వ్యాపారవేత్తలు, ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులు. ప్రతిభల్లో అన్నింటిలోనూ మిన్నగా నిలిచిన వాళ్ళు అక్కడ ఒక్కటయ్యారు.


తమ పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.


తమ తమ జీవితానుభవాలను పరస్పరం పంచుకున్నారు.


అట్లే భవిష్యత్తులో కూడా స్నేహానుబంధాలను


నిలుపుకోవాలని నిర్ణయించుకున్నారు.


మనస్ఫూర్తిగా ఒకరికి ఒకరు అన్నట్లుగా మాటల్లో మునిగిపోయారు


అలా.. అలా..


"పక్క పక్క ఇళ్లల్లో ఉంటూ చదువుకున్నా.. అన్నా చెల్లెళ్ళలా ఏడేళ్లు కలిసి మెలిసి కాలం గడిపాం కదూ దాసూ"


"అవును పార్వతీ"


"మరీ.. కనీసం.. నా పెళ్ళికైనా రాలేకపోయావ్"


"అప్పుడు నేను ముంబై లో ట్రైనింగ్‌లో ఉన్నాను. అందుకే రాలేకపోయాను. సారీ."


"ఛీఛీ సారీ ఎందుకు? లీవ్ ఇట్."


"అప్పటికి ఇప్పటికీ నీవు ఎప్పుడూ కరుణామయివే.. సులభంగా క్షమించేస్తావ్"


"మరి నా కూతురు పెళ్ళికైనా వచ్చావా?


అప్పుడు నాకు యాక్సిడెంట్ అయ్యింది నాకు. అందుకే రాలేకపోయాను. సారీ."


"కాళ్లు రెండూ ఫ్రాక్చరట కదా.. మీ డాడీ మా డాడీకి చెప్పాడట. పాపం!"


"జాలి చూపడంలో నా చెల్లి పార్వతి దేవతే మరి"


"రేపు నెలలో నా మనవరాలి నామకరణం ఉంది. వస్తావుగా దాసన్నా?"


"తప్పకుండా బంగారూ."


                  **


"గెట్ టుగెదర్ లో మనం కలుసుకొని రెండేళ్లయింది కదూ దాసన్నయ్యా?"


"అవును బంగారు చెల్లీ."


"మొన్న నా మనవడి బర్త్‌డేకి రాలేదు."


అంటూ బుంగమూతి పెట్టింది పార్వతి.


"నేను ఆ రోజు చెన్నై కాన్ఫరెన్స్‌లో ఇరుక్కుపోయా. సారీ."


"పర్లేదులే దానూ.. మా నాన్న గుండె ఆపరేషన్ జరిగినప్పుడు.. హాస్పిటల్‌లో రోజుల తరబడి కాపలాగా ఉన్నావ్. ఎన్నో విధాల ఆదుకున్నావ్.. కదా మరి?"


"నా చెల్లి బంగారు కదూ. అన్న ప్రేమను అర్థం చేసుకుంటుంది."


"నా కోడలు డెలివరీ అయినప్పుడు.. నీవు రాలేదు కదూ దానూ?"


"వస్తూంటే.. కారు రిపేరు కొచ్చింది.. బెంగళూరులోనే ఆగిపోయాను. సారీ."


"చెట్టుకు గుద్దేశావని అన్నారే? అబద్ధాలు కూడా చెప్పడం నేర్చుకున్నావ్ నీ చెల్లి పార్వతితోనే."


"నీవు బాధపడతావని అబద్ధం చెప్పాను బంగారూ."


"కారు మాత్రమే పాడైందట కదా! నీకేం కాలేదని చెప్పారు మా నాన్నగారితో మీ నాన్నగారు. లీవ్ ఇట్. దేవుడు మా అన్నయ్యను చల్లగా కాపాడాడు."


"నా బంగారు చెల్లివి నీవు. నీవెప్పుడూ నా మేలే కోరతావు.


అందుకే బంగారూ! ఈ రోజు మా అబ్బాయి ఈ టైంలో ఇటలీకి వెళ్ళేందుకు ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎక్కబోతున్నాడు.


అయినా నీ మనవరాలి బర్త్‌డే అంటే వచ్చాను."


"దాసన్నా! నీవు తెచ్చిన బంగారు గొలుసు కన్నా.. బంగారంలాంటి నీ మనసే మిన్న! మా ఆయన రిటైర్మెంట్‌ అప్పుడు నీవు ఇచ్చిన బంగారు ఉంగరం కూడా చాలా బావుంది!"


*****                  ***     ****   ***** ......


"హల్లో హెరాల్డ్ గారూ"


"చేయి విరిగినా ఏ మాత్రం హుషారు తగ్గలేదు దాసూ."


"ఏడుస్తూ కూర్చోవడానికి నేనేమైనా చిన్న పిల్లాడినా?


అరవయ్యేళ్ల యోధుణ్ణి మరి!"


అంటూ విరక్కుండా పదిలంగా ఉన్న కుడి చేతి పిడికిలి బిగించి పైకి లేపి చూపాడు దాసు.


"అబ్బో! గెట్ టుగెదర్ లో కలిసిన మిత్రులంతా వచ్చి వెళ్లినట్లున్నారు."


అన్నాడు బాలాజీ బెడ్ పక్కన పెరిగిన బొకేల గుట్టల్ని, నిండిన పండ్ల బుట్టల్ని చూస్తూ.


"అంతా ఆనాటి అన్నలూ తమ్ముళ్ళే వచ్చారన్నయ్యా..


అలనాటి అక్కలూ చెల్లెళ్ళెవరూ రాలేదు."


అంటూ నవ్వుతూ ఫ్లాస్కులోంచి కాఫీలు వంచి అందించింది దాసుగారి సతీమణి, వచ్చిన మిత్రులు ఇద్దరికీ.


"పాపం! పార్వతికి షుగర్ ఎక్కువై ఇబ్బందిగా ఉందట! ఆమె కూతురు ఫోన్ చేసింది."


అంటున్న దాసు మాటలు పూర్తి కాక ముందే...


"బంగారు చెల్లి పార్వతికి షుగరు, ముద్దుల చెల్లి కనకదుర్గకి విరేచనాలు, చిట్టి చెల్లి వసుంధరకి వాంతులు.. పది మంది సోదరీమణులకి పది రకాల ఇబ్బందులట."


చిరునవ్వులోనే నిరసనలు తొణికిసలాడిస్తూ వివరించింది దాసు గారి శ్రీమతి, హాజరైన అన్నయ్యలు ఇద్దరికీ.


"అయ్యో పాపం! వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవే!"


అంటున్న శ్రీవారి వైపు జాలి చూపులు చూసి..


"చాల్లేండి మీ మమతానురాగాలు, ఆ చేయి కాస్త విరక్కుండా ఉంటే.. పాపం నా చెల్లెళ్లకు షుగరు, విరేచనాలు అంట అంటూ ఈ పాటికి వాళ్లున్న హాస్పిటల్‌లకి పరుగెత్తేవారే మీరు."


అంటూ తల క్రింది దిండు సవరించింది నెమ్మదిగా.


"మీకూ ఆ మహా చెల్లెమ్మలు క్లాస్ మేట్లే కదా? మీరూ


గెట్ టుగెదర్ లో కలుసుకున్నారు కదా! మీరూ మా ఆయనలా ఆపద్బాంధవుల అవతారాలు ఎత్తుతున్నారా


పిచ్చోళ్లలా?"


అంటూ హెరాల్డ్, బాలాజీ ల వైపు దృష్టి సారించింది ఆమె.


"ఏమీ తీసిపోడు వదినా మా ఆయన గారు! .. ఆపదలు అట్లుంచి.. గెట్ టుగెదర్ చెల్లెళ్ళ ఇంట్లో కుక్కపిల్లల బర్త్‌డేలు జరిగినా పరిగెత్తి హాజరైపోతారు... ఇంట్లో పండగ ఉన్నా పట్టించుకోకుండా!!"


అంటూ హాస్పిటల్ గదిలో అడుగుపెట్టింది హెరాల్డ్ గారి సతీమణి ఆకస్మికంగా.


"మా ఆయన మరీనూ.. ఇంట్లో ఫంక్షన్లు ఉన్నా పాత స్నేహితురాళ్ల ఫంక్షన్లకే పరుగులు."


రాగాలు తీసింది అక్కడే నిలుచున్న బాలాజీ గారి శ్రీమతి. శ్రీమతి హెరాల్డ్ గారి మాటలకి శృతి కలుపుతూ.


పతులకు పిచ్చాపాటీ మాట్లాడుకునేందుకు స్వేచ్ఛనిస్తూ.. వారిని గదిలో వదిలేసి


అలా నడుస్తూ వసారాలోకి వచ్చారు ముగ్గురు శ్రీమతులూ సరదాగా మాట్లాడుకుంటూ.


"మన మగ మహారాజులు.. మా క్లాస్‌మేట్స్‌ అంటూ పిలిచినా పిలవకపోయినా ఆపదలకు, శుభకార్యాలకు వెళుతున్నారు కానీ.. వాళ్ళు మన ఫంక్షన్లకు రావటం చూసిందే లేదు."


"అవును వదినా! వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారని మన పురుషోత్తములకు అర్థం కావట్లేదు."


"అవును వదినా! అందరం చదువుకున్నవాళ్లం! ఈ యాభయ్యేళ్ల ప్రాయంలో పాత స్నేహాలు కలుపుకోవటం తప్పనలేము.


ఏమిటో ఈ మగ బుద్ధులు? పరోపకారంలో హీరోయిజం ఫీలవుతూ వెంపర్లాటలు!"


"పరోపకారం చేసే మంచి స్నేహితులు ఉండటం ఆనందదాయకమే కానీ.. ఆ మంచి వారు మన వారైతే మాత్రం ఇబ్బందికరమే!"


"అన్నట్లు నేనూ గెట్ టుగెదర్‌కి వెళ్ళా. మా టెన్త్ క్లాస్ వాళ్ళు మా ఊర్లో పెట్టారు."


"మా డిగ్రీ కాలేజీ బ్యాచ్ వాళ్ళూ పెట్టారు. వెళ్ళాను నేను కూడా.. వెళ్ళకుంటే బావుండదని."


"మా హైస్కూల్ మేట్స్ పిలిస్తే నేనూ వెళ్ళాను వదినా."


"నా టెన్త్ క్లాస్ అన్నయ్యలందరూ మనసున్న మనుషులు వదినా. మా ఆయనకి చేయి విరిగిందని తెలియగానే అందరూ వచ్చారు.


అక్కలూ చెల్లెళ్ళే రాలేదు. ఎంత అహంభావమో వాళ్లకి!"


"మా నాన్నకి గుండె నొప్పి వచ్చినప్పుడు నా డిగ్రీ బ్యాచ్ బ్రదర్స్‌ కూడా అంతే! అందరూ వచ్చి సాయం అందించారు. స్నేహం విలువలు తెలిసిన ధర్మమూర్తులు వాళ్ళు. సిస్టర్ కొలీగ్స్‌ ఒక్కరూ రాలేదు.. ఛీ.. ఛీ."


"మా హైస్కూల్ సోదరులు కూడా బంగారు కొండలే వదినా.. మంచికీ చెడుకీ దేవదూతల్లా ప్రత్యక్షమవుతారు. సొంత అన్నదమ్ముళ్ల కన్నా ముందుగానే వచ్చి, నాకూ మా ఆయనకూ అండగా నిలబడతారు."


*****           ******     ****


"ఊరి నుంచి అమ్మాయి వచ్చే టైం అయ్యింది. షెడ్డులోంచి కారు తీసి రైల్వే స్టేషన్ కి బయలుదేరండి."


ఆజ్ఞాపించింది ఓ సగటు ఇల్లాలు, కారు తాళాలు శ్రీవారికి అందిస్తూ....


ఇంతలోనే ఫోన్ రావటంతో..


"హల్లో..


అయ్యో! కాళ్లు విరిగాయా? ఆపరేషన్ చేశారా?


అపోలో హాస్పిటల్‌లోనా?"


అంటూ కంగారు పడుతున్న ఇల్లాలి చేతిలోని ఫోన్ అందుకుని స్విచ్ ఆఫ్ చేశాడు సగటు భర్త గోవర్దన్.


"అయ్యో! పాపం రవి అన్నయ్యకి యాక్సిడెంట్ అయిందటండీ! మాట్లాడనీయండీ!"


ఏడుస్తూ చేయి చాచింది.


"ఎవడో నీ క్లాస్ మేట్ గెట్ టుగెదర్ లో కలిసి తగలడ్డాడు. అంతే కదా?"


"మీ నాన్నకు గుండె ఆపరేషన్ జరిగినప్పుడు మీకూ కూడా అన్ని విధాలా సాయపడ్డాడు కదండీ."


"అవును.. మన ఇంట్లో ప్రతి ఫంక్షనుకీ వచ్చి అన్నిట్లో తలదూర్చాడు కూడా... లేదు.. కాదు అనటం లేదు.


అంత మాత్రాన ఉన్న ఫళంగా పరుగెత్తుకు వెళ్లడానికి నీవేమైనా విష్ణుమూర్తివా?


కొంచెం ఆలోచించు..


కాసేపట్లో నీ కూతురు, అల్లుడు, మనవళ్లు వస్తున్నారు. ఇది ముఖ్యమా?.. ఆ దౌర్భాగ్యున్ని పరామర్శించటం ముఖ్యమా? ఏది ముఖ్యం నీకు?"


అంటూ కారును రివర్స్ చేసి రైల్వే స్టేషన్ వైపు దూసుకెళ్లాడు గోవర్దన్ నిర్దాక్షిణ్యంగా.


సానుభూతికి, ఆత్మీయతకు వశమైన ఆడ మనసు... అన్నయ్య ఆరోగ్యం గురించి ఆరాటపడుతుంటే.....


కడుపు తీపి మమకారానికి అధీనమై అల్లకల్లోలమైన


అమ్మ మనసు మాత్రం..... సందిగ్ధంలో పడి.. ఆవేదనతో అల్లాడిపోయి.. చివరకు అక్కడే నిస్సహాయంగా నిలిచిపోయింది అలవాటైన మౌన రోదనతో గుండెను పిండుకుంటూ.


      *   ***   ***


"చూడటానికి రాలేదని మా చెల్లెమ్మలను అపార్థం చేసుకోవద్దు శ్రీమతి గారూ.


వాళ్లూ నీలాంటి బాధ్యతలున్న ఇల్లాళ్లే కదా! ఎటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారో?....


స్త్రీ హృదయం పరిధులు లేని జలధి లాంటిది.


ఆ తత్వం అంచనాలకు అందనిది.


అర్థం చేసుకోవాలంటే వేలాది సార్లు మళ్ళీ మళ్ళీ ఆమె కడుపున పుడుతూ పుడుతూ జన్మకో అధ్యయనం చేసుకోవాల్సిందే!"


అంటూ ఆసుపత్రి గదిలో రుసరుసలాడుతున్న సగటు ఇల్లాలిని శాంతపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఆపద్బాంధవుడైన సగటు అన్నయ్య అలవాటైన మాటలతో...


డా. గాదిరాజు మధుసూదనరాజు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: గాదిరాజు మధుసూదన రాజు

 కృతజ్ఞతలు నమస్సులు

నేను  సూర్య వంశ క్షత్రియ వంశస్థుడను. ప్రభుత్వ నేత్ర వైద్య అధికారిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పనిచేసి రిటైర్ అయ్యాను.

నా కథలు దశాబ్దాల క్రితమే " కధా నిలయం" లో కూడా చోటు చేసుకున్నాయి. సాహిత్యం నా ఊపిరి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page