సుబ్బారావు అమాయకుడు
- Vemparala Durga Prasad

- Oct 24
- 7 min read
#VemparalaDurgaprasad, #వెంపరాలదుర్గాప్రసాద్, #SubbaraoAmayakudu, #సుబ్బారావుఅమాయకుడు, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Subbarao Amayakudu - New Telugu Story Written By Vemparala Durga Prasad
Published In manatelugukathalu.com On 24/10/2025
సుబ్బారావు అమాయకుడు - తెలుగు కథ
రచన: వెంపరాల దుర్గాప్రసాద్
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సుబ్బారావు కి ఆ వూరు బదిలీ అయి ఒక నెల అయింది. సుబ్బారావు విద్యుత్ శాఖ లో పనిచేస్తాడు. భార్య వనజ తో పెళ్లి అయ్యి ఏడాది కూడా పూర్తవలేదు. ఒంగోలు లాయర్ పేట లో అపార్ట్మెంట్ తీసుకుని ఇంటి సామాన్లు అన్నీ విజయవాడ నుండి, గత వారం తెచ్చేసుకున్నారు.
వనజ కి ఎప్పుడూ ఇల్లు నీట్ గా ఉండాలి. హాలు లో టీవీ స్టాండ్ మీద డెకొరేటివ్ ఐటమ్స్ పక్కన, వాళ్ళ పెళ్లి ఫోటో కూడా ఎదురుగా కనపడేలా పెట్టుకుంది.
"ఏమోయ్! రేపు విజయవాడ కాంప్ కి వెళ్ళాలి అన్నాడు సుబ్బారావు, అప్పుడే ఆఫీసు నుండి ఇంటికి వచ్చాడు.
“సరే గానీ, చాలా బోర్ కొడుతోంది. ఎదురింట్లో ఎవరూ లేరా? ఎప్పుడూ తాళం ఉంటోంది" అంది.
"ఆ పోర్షన్ ఖాళీ గా ఉందిట. అయితే, రేపు ఆ పోర్షన్ లో ఎవరో బ్యాంకు ఉద్యోగి వసున్నట్లు వాచ్మన్ చెప్పేడు. వాళ్ళు ముగ్గురు ఉంటారుట. భార్య, భర్త ఒక చిన్న పిల్లాడు ఉంటారుట" అన్నాడు.
“అమ్మయ్య, పోనీలెండి ఎవరో ఒకరు మనకి సాయం గా వుంటారు” అంది వనజ. అనుకున్నట్లే మరునాడు పొద్దున్నే విజయవాడ క్యాంపు కి వెళ్ళేడు, సుబ్బారావు.
10 గంటలకి బయట అలికిడికి తలుపు తీసింది వనజ. ఎదురు ఇంట్లో సామాన్లు దింపుతున్నారు. ఒక స్త్రీ, ఏవి ఎక్కడ పెట్టాలో పని వాళ్లకి చెప్పి పెట్టిస్తోంది. ఆమె వనజ ని చూసి పలకరింపుగా నవ్వింది.
"హాయ్ అండీ.. నా పేరు స్నేహ. మా వారు బ్యాంకు లో పని చేస్తారు. ఇందాకే వచ్చేము. ఆయన బ్యాంకు కి వెళ్లిపోయారు. పాలు పొంగించు కున్నాము లెండి. మా అబ్బాయి చిన్న వాడు. వూళ్ళో మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంచేను. ఇక్కడ సామాన్లు సర్దుకున్నాక, సాయంత్రం మా అమ్మకి ఫోన్ చేస్తాను. ఆవిడ పిల్లాడిని తీసుకుని వస్తుంది. అని గలగలా గుక్క తిప్పుకో కుండా చెప్పేసింది.
ఆవిడ వాగ్ధాటికి వనజ కి కళ్ళు తిరిగేయి. వనజ ముక్తసరిగా తప్ప ఎక్కువ మాట్లాడే రకం కాదు.
“ఈవిడ ఎవరో.. అయితే మంచి కాలక్షేపము “ అనుకుంది మనసులో. వాళ్ళ గుమ్మం లోకి వెళ్ళింది.
“మీరు ఎక్కడ నుండి వచ్చారు? “అంది వనజ.
“మేము ఈ ఊళ్ళోనే రంగారావు పేట లో వుండే వాళ్ళం. ఇక్కడ అయితే, మా అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర గా ఉంటుందని, ఇల్లు మారాము. పైగా మా వాడికి మా అమ్మ దగ్గర బాగా అలవాటు ” అంది స్నేహ.
"అన్నట్లు, వీడే మా చింటూ అని, టీవీ దగ్గర పెట్టిన వాళ్ళ ఫామిలీ ఫోటో చూపించింది. పిల్ల వాడు చాలా ముద్దుగా వున్నాడు.
ఇంతలో స్నేహ మళ్ళీ ఇలా అంది. “ వీళ్ళు మధ్యాహ్నం అయ్యేసరికి సామాన్లు సర్దేసి వెళ్లి పోతారు. ఈలోపల లంచ్ టైం అవుతుంది కదా.. మా వారు లంచ్ కి వచ్చేటప్పుడు పార్సెల్ తెచ్చెయ్యమన్నాను." అంది.
“అయ్యో.. ఈ పూటకి పార్సెల్ ఎందుకు, మా ఇంటికి భోజనానికి వచ్చెయ్యండి. మన ముగ్గ్గురికి నేను వండేస్తాను. ఆయన ఎలాగూ క్యాంపు కి వెళ్ళేరు. నేను ఒక్కత్తినే వున్నాను” అంది మొహమాటం గా వనజ.
వెంటనే, “సరే అయితే.. మా వారి కి కాసేపు ఆగి ఫోన్ చేసి చెప్పేస్తాను లెండి” అంది స్నేహ.
స్నేహ కి మొహమాటం లాంటివి ఏమీ ఉండవని వనజకి అప్పుడు తెలిసింది.
వంట ఏర్పాట్లు చెయ్యాలి అని ఇంట్లోకి వచ్చేసింది. వంటలో మునిగి పోయింది. వీధి తలుపు వేయడం మర్చిపోయింది వనజ.
12. 30 అయింది. ఎప్పుడు తలుపు తీసుకుని వచ్చేసిందో, స్నేహ హాలు లో సోఫా లో కూర్చుని ఇల్లంతా పరిశీలిస్తోంది. వనజ పెళ్లి ఫోటో చేతుల్లోకి తీసుకుని చూస్తోంది. ఏదో పని మీద హాల్ లోకి వచ్చిన వనజ గతుక్కు మంది. ఆమె అంత చనువు ఊహించలేదు.
యేడవ లేక నవ్వినట్లు, ఒక సారి చూసి, “సామాన్లు సర్దటం అయిపోయిందా?” అంది.
“పై పైన సర్దించేసాను. రేపు, ఎల్లుండి కాస్త తీరిక గా సర్దుకుంటాను “అంది స్నేహ.
“మీ పెళ్లి ఫోటో చూసేను. మీ పెళ్లి ఎప్పుడు అయింది? ఇంకా విశేషం ఏమీ లేదా? “ప్రశ్నల వర్షం కురిపించింది స్నేహ.
“లాస్ట్ ఇయర్ అయింది “అంది వనజ ఒకింత సిగ్గు పడుతూ.
“మీవారిది విజయవాడ, పేరు సుబ్బారావు కదా!” అంది స్నేహ. ఆశ్చర్యపోతూ తలూపింది వనజ.
“మీ వారిని నేను 3 సంవత్సరాల క్రితం పెళ్లి చూపుల్లో చూసేను. మా సంబంధం చెడగొట్టింది మీ కోసం అని నాకు తెలిసింది లెండి. ఇందాక అడగడం మర్చి పోయాను. మీ పేరు రాణి కదా!” అంది.
"కాదు నా పేరు వనజ అండీ “ అంది వనజ ఆశ్చర్య పోతూ.
"అదే లెండి, వనజారాణి అయి ఉంటుంది".
"లేదండీ. నా పేరు వట్టి వనజ మాత్రమే" అంది వనజ. ఆమె మొహం కందగడ్డ లా అయిపోయింది.
“మీరు విద్యుత్ శాఖ లో పని చేసేవారు కదా?” అంది స్నేహ.
వనజ కి పిచ్చెత్తి నట్లు అయింది. “లేదండి.. మీరు ఎవరనుకుని నాతో అలా అంటున్నారో” అనేసింది.
"మీ వారి సంబంధం మా వాళ్ళకి బాగా నచ్చింది. మాకు నచ్చింది అని చెప్పేక, వాళ్లు మాకు వద్దని చెప్పేరు. తర్వాత మాకు తెలిసింది.. మీ వారి కి రాణి అనే టైపిస్ట్ తో ప్రేమ నడుస్తోంది అని, అందుకే సంబంధం వదులుకున్నారని” అంది స్నేహ.
వనజ మనసు బద్దలయ్యింది. “ఈ కాండిడేట్ ఇంత గ్రంధం నడిపేడా?” అని మనసులో మొగుడ్ని తిట్టుకుంది.
ఏమనాలో తెలీక, “మావారికి అలంటి ప్రేమ వ్యవహారాలు ఏమీ లేవండి. నన్ను పెళ్లి చూపుల్లో ఇష్టపడి, చేసుకున్నారు. మాది ఆరంజ్డ్ మ్యారేజ్" అంది.
“సర్లెండి. నేనే తప్పుగా విన్నానేమో. మా వారికి బ్యాంకు నుండి వచ్చెయ్యమని ఫోన్ చేస్తాను. వంట అయిపోయిందా?” అని మాట మార్చింది స్నేహ.
“తనని వద్దని అంటాడా?” ఆ ఉక్రోషం ఆమెలో కనిపిస్తోంది.
“ఆ అయిపోయింది. వచ్చెయ్యమనండి” అని చెప్పి, భోజనాలకి ఏర్పాట్లు చేసింది.
మరో 15 నిముషాలలో ఎదురింటి మోహన్ గారు వచ్చేరు. వాళ్లకి వడ్డించి తాను విడిగా తింటాను అని చెప్పి, వాళ్ళు వెళ్ళేక వడ్డించుకుంది.
తినాలని కూర్చున్నా, ఆ ఎదురింటి స్నేహ మాటలు గింగిరాలు తిరుగుతున్నాయి మనసులో. సరిగా భోజనం చేయలేక, చెయ్యి కడిగేసుకుంది.
సాయంత్రం భర్త సుబ్బారావు నుండి వచ్చిన కాల్ కూడా తీయలేదు. 2, 3 సార్లు ఫోన్ చేసి, ఊరుకున్నాడు సుబ్బారావు. అతనికి కంగారు వేసింది. కాంపు పని ముగించుకుని, రాత్రి 8 గంటలకి ఇంటికి చేరి పోయాడు.
ఇంటికి వచ్చేసరికి ఇంట్లో నిశ్శబ్దం తాండవిస్తోంది.
ఎప్పుడూ టీవీ చూస్తూ వుండే వనజ బెడ్ రూమ్ లో మునగ తీసుకుని పడుకుంది. సుబ్బారావు కి విషయం అర్ధం కాలేదు.
“ఏమిటి వనజా.. వంట్లో బావు లేదా?” అన్నాడు.
“లేదు.. “అంది ముక్తసరిగా.
“వంట చేసేవా? “అన్నాడు.
“లేదు” అంది.
ఏదో ప్రపంచ యుద్ధానికి సంకేతం అనిపించింది. మారు మాట్లాడకుండా స్విగ్గి లో ఇద్దరికీ భోజనం ఆర్డర్ పెట్టేడు. భోజనం వచ్చింది కానీ, వనజ తర్వాత తింటానని చెప్పి, సుబ్బారావు ని తినేయమంది.
భార్య ఎందుకో అలిగింది అని అర్ధం అయింది సుబ్బారావు కి. తినేసి వచ్చి, ఇంక సందేహాలు తీర్చుకోవాలని, కూర్చుని, అనునయంగా “అన్నం తినిపించనా.. బంగారం! “ అన్నాడు.
అంతే.. ఇంతెత్తున లేచింది. “ఆ వనజారాణి ఎవరో దానికి తినిపించుకోండి..నాకు అక్కర్లేదు” అంది.
“వనజా రాణి ఎవరో.. ఈ కొత్త కథ ఏమిటో “ సుబ్బారావు కి అర్థం కాలేదు. బిక్క చచ్చి పోయాడు.
ఏమిటోయ్!, “నాకు వనజ మాత్రమే తెలుసు, ఈ వనజారాణి ఎవరో? “అన్నాడు
“మీ ఆఫీస్ లో టైపిస్ట్”. అంది.
“మా ఆఫీస్ లో టైపిస్ట్ పేరు సంధ్య.. వనజా రాణి కాదు”.
“ఇక్కడ ఆఫీస్ కాదు లెండి. అందుకే గా పెళ్లి అయిన ఏడాది తిరగ కుండా, విజయవాడ నుండి ఒంగోలు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. అక్కడ ఏమి చెడిందో, దాన్ని వదిలేసి, పిచ్చి దాన్ని నేను దొరికేను కదా. నా మెళ్ళో తాళి కట్టేసేరు.. ” అని ముక్కు చీదింది.
సుబ్బారావు కి అర్ధం కాని జపనీస్ సినిమా చూస్తున్నట్లు వుంది. బుర్ర గోక్కుంటూ, “విజయవాడ లో టైపిస్ట్ పేరు కూడా వనజా రాణి కాదు. అసలు విషయం ఏమిటో చెప్పవోయ్. నేను అసలే అలిసిపోయి క్యాంపు నుండి వచ్చేను” అన్నాడు.
అప్పుడు మొదటి సారిగా వనజ మొగుడి మొహం లోకి సూటిగా చూసింది. లేచి కూర్చుని, “మీరు నా పెళ్లి చూపులకి ముందు ఎన్ని సంబంధాలు చూసేరు ? “ అంది.
“మా నాన్న చాదస్తం వల్ల, పెట్టే అర్ధం పర్ధం లేని వంకల వల్ల చాల సంబంధాలు చూడాల్సి వచ్చింది. " అన్నాడు సుబ్బారావు మరింత అసహనం గా.
మొగుడి అమాయకపు మొహం చూస్తుంటే.. తాను అనవసరంగా అతన్ని అనుమానిస్తోందా అని పించింది.
పైగా ఈ సుబ్బారావు కి అంత ప్రేమించే సీన్ ఉంటుందా? అని అనుమానం వచ్చింది.
“మరి ఆ స్నేహ అంత క్లియర్ గా ఎలా చెప్పింది?” అని మళ్ళీ అనుమానం నిద్ర లేచింది.
సుబ్బారావు కి భార్య ముఖ కవళికలు అర్థం కావడం లేదు. ఒక పక్క నిద్ర వస్తోంది.
నెమ్మదిగా బుజ్జగిస్తూ.. “సరే గానీ. ఇవాళ ఎవరైనా మన ఇంటి ముందు పోర్షన్ లో దిగేరా? " అన్నాడు మాట మారుద్దామని.
వనజ కి చిర్రెత్తుకొచ్చింది. “వచ్చారు కాబట్టే.. తమరి విన్యాసాలు తెలిసేయి అండీ “ అంది వెటకారంగా.
సుబ్బారావు కి ఇప్పుడు మలయాళం సినిమా చూస్తున్నట్లు, అర్థం అయ్యీ అవనట్లూ వుంది.
“ఇంతకీ ఆ వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళు వచ్చేక నాగురించి ఎవరు ఏమి చెప్పేరు? చెపితే కదా, నేను క్లారిఫికేషన్ ఇవ్వగలిగేది!” అన్నాడు.
“మీరు స్నేహ అనే అమ్మాయిని పెళ్లి సంబంధం చూసేరా?”
“చూసేను. ఆ అమ్మాయి బాగానే వుంది, కానీ మా నాన్న యేవో కారణాలు చెప్పి ఆ సంబంధం వద్దన్నాడు.. ”
అన్నాడు అమాయకంగా సుబ్బారావ్.
వనజకి మొదటిసారిగా మావగారి మీద అనుమానం వచ్చింది. ఏం జరిగిందో అర్థం కావడం లేదు.
ఆఖరి సారిగా, “ మీకు నిజంగా పెళ్ళికి ముందు మీ ఆఫీస్ లో ఎవరితో ప్రేమ వ్యవహారం లేదు కదా!” అంది.
“లేదు అని చెప్తున్నాను కదా! నా మీద ఒట్టు. నాకు అలాంటివి ఏమీ లేవు, ఇంతకీ నీకు ఆ అనుమానం ఎవరు ఎక్కించారు? చెప్పు” అన్నాడు.
ఈ రోజు మన ఎదురు పోర్షన్ లో దిగిన వాళ్ళు స్నేహ వాళ్ళు. ఆవిడని మీరు పెళ్లి చూపులు చూసి కూడా, మళ్ళీ వద్దని కబురు పంపించారట నిజమేనా? అంది.
నిద్ర మత్తు, మొత్తం దిగిపోయింది సుబ్బారావు కి. వెంటనే తండ్రి కి ఫోన్ చేసేడు. స్నేహ వాళ్ళ సంబంధం 3 సంవత్సరాల క్రితం ఎందుకు వద్దని ఆయన తిప్పి వేసేడో అడిగేడు.
"ఆ పెళ్లిళ్ల పేరయ్య గణేశ్వర రావు చెప్పేడు రా.. ఆ అమ్మాయికి నువ్వు నచ్చలేదు అని చెప్పిందిట. ఇంకా వెంట పడడం ఎందుకు అని వదిలేశాము " అన్నాడు సుబ్బారావు తండ్రి.
“ఇప్పుడు వచ్చిన వనజ వాళ్ళ సంబంధం ఎవరు తెచ్చేరు?” అన్నాడు.
“గణేశ్వర రావు కాదు. వాడు సంబంధం కుదిరినా కుదరక పోయినా, సంబంధానికి Rs. 500 అడుగు తున్నాడు అని, నేను వేరే పెళ్లిళ్ల బ్రోకర్ కి మారిపోయాను" అన్నాడు ఆయన.
సుబ్బారావు కి మళ్ళీ జుట్టు పీక్కోవాల్సి వచ్చింది.
విషయం వనజ కి చెప్పేడు. “ఇందులో ఏదో తిరకాసు వుంది.. నువ్వు అనవసరం గా నన్ను అనుమానించకు. ముందు భోజనం చెయ్యి. రేపు నిజ నిజాలు తెలుసుకుందాం. ఆ సస్పెన్స్ నేనే ఛేదిస్తాను” అన్నాడు.
***
మర్నాడు ఆఫీసు కి సెలవు పెట్టి మరీ, గణేశ్వర రావు కోసం విజయవాడ వెళ్ళేడు.
తెలిసిన వాళ్ళని పట్టుకుని గణేశ్వర రావు ఇల్లు వెతికి పట్టుకున్నాడు. గణేశ్వర రావు ని కొట్టినంత పని చేసేక, అసలు విషయాలు తెలిసేయి.
" మా అమ్మయి కి నిన్ను చేసుకుందామని అనుకున్నాను నాయనా. అందుకే, ఆ సంబంధం చెడగొడదామని, వాళ్లకి మీ సంబంధం ఇష్టం లేదని చెప్పేను. నెమ్మదిగా నేను నా మనసులో మాట మీ నాన్నగారికి చెప్పేను.
మీ నాన్న మొహం అదోలా పెట్టేరు. అప్పుడే అర్థం అయింది ఆయనకు మా అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదు అని.
ఇంతలో స్నేహ వాళ్ళ నాన్న, కుదిరేలా వుండే సంబంధం ఎందుకు చెడింది అని నన్ను పదే పదే అడిగేసరికి, తోచిన అబద్ధం ఆడేసేను.
"మరి నాకు మా ఆఫీసు లో టైపిస్ట్ తో ప్రేమ ఉన్నట్లు చెప్పేరుట?” అని ఉగ్రుడయిపోయేడు సుబ్బారావు.
“పెద్ద ముండా వాడిని బాబూ ! మీ నాన్న నాకు ౩౦౦౦ రూపాయలు ఎగ్గొట్టేరు. నేను చాలా సంబంధాలు చెప్పేను. డబ్బులు ఇవ్వలేదు. అందుకు, కోపం లో “టైపిస్ట్ రాణి “ అని నోటికొచ్చిన పేరు వాళ్లకి చెప్పేసేను” అన్నాడు తప్పు వప్పు కొంటూ.
దిమ్మ తిరిగి పోయింది సుబ్బారావు కి. జరిగిన తప్పుకి క్షమాపణ కోరేడు గణేశ్వర రావు.
సుబ్బారావు, శబ్దం వచ్చేలా పళ్ళు పట పట కొరికేడు. పక్క నున్న వాళ్ళు వారించక పొతే, గణేశ్వర రావు కి బుర్ర రామ కీర్తన పాడే వాడే.
మిత్రులు పరిష్కారం ఆలోచించారు.
గణేశ్వర రావు చేత వీడియో కాల్ చేయించాడు భార్య కి. పనిలో పనిగా, తండ్రి ని కూడా కాన్ఫరెన్స్ కాల్ లో కలిపేడు. వనజ లో అనుమానం తొలగిపోయింది ఇప్పుడు.
ఊపిరి పీల్చుకుని తిరుగు ప్రయాణం అయ్యేడు. ఒంగోలు బస్సు స్టాండ్ లో బస్సు దిగేక ఎదురుగా పూల దుకాణం లో 3 మూరలు మల్లెపూలు కొనుక్కుని ఇంటికి బయలు దేరాడు అమాయకపు సుబ్బారావు.
సమాప్తం
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.




Comments