సూక్తి సుధ
- Gadwala Somanna 
- 5 days ago
- 1 min read
#TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #SukthiSudha, #సూక్తిసుధ, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు

సోమన్న గారి కవితలు పార్ట్ 136
Sukthi Sudha - Somanna Gari Kavithalu Part 136 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 26/10/2025
సూక్తి సుధ - సోమన్న గారి కవితలు పార్ట్ 136 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
సూక్తి సుధ
-------------------------------------------
వివక్షత మానితే
విభేదాలు సమసితే
బ్రతుకంతా వేడుక
కుటుంబాన దీపిక
కలహాలు తరిమితే
వివాదాలు అణచితే
అక్షరాల వస్తుంది
వసుదైక కుటుంబమే
చాడీలు ఆపితే
ద్వేషాలు ఆర్పితే
సుఖమయం జీవితాలు
ఆనంద నిలయాలు
పగ ప్రతీకారాలు
పంతాలు పట్టింపులు
తరిమి తరిమి కొడితే
బాగుపడు కుటుంబాలు

ఉపయోగమవ్వాలి!
------------------------------
పూలలోని తావులై
పాలలోని గుణములై
ఉపయోగమవ్వాలి
మాలలోని సొగసులై
దండలోని దారమై
మువ్వలోని నాదమై
ఉపయోగమవ్వాలి
కోకిలమ్మ గానమై
చేనులోని పైరులై
ప్రవహించే యేరులై
ఉపయోగమవ్వాలి
నింగిలోని తారలై
అలరించే పిల్లలై
తెల్లని సిరిమల్లెలై
ఉపయోగమవ్వాలి
అందాల దృశ్యాలై
మేలు చేయు ధ్యానమై
పవిత్రమైన బంధమై
ఉపయోగమవ్వాలి
గొప్పదైన స్నేహమై

గేయాభిలాష
------------------------------------
గుండెల్లో ప్రేమలు
పండాలి పంటలై
బ్రతుకుల్లో కాంతులు
వెలగాలి దివ్వెలై
కీడు చేయు కలతలు
కాలాలి కట్టెలై
పనికిరాని తలపులు
మానాలి యోధులై
వదనంలో నవ్వులు
పూయాలి పువ్వులై
శ్రేష్టమైన గుణములు
ప్రాకాలి తీగలై
ఇంటిలోన పిల్లలు
ఎదగాలి మొక్కలై
వారి లేత మనసులు
ఉండాలి వెన్నెలై

ఉజ్జీవపు మాటలు
-----------------------------------------
పదిమంది జీవితాల్లో
వేగుచుక్కలా వెలగాలి
బడుగు జీవుల కుటుంబాల్లో
ఆనందాలే నింపాలి
విద్యార్థుల భవిష్యత్తులో
కీలక పాత్ర పోషించాలి
ఉన్నతమైన జ్ఞానంలో
ముందుండి నడిపించాలి
ముద్దులొలుకు చిన్నారుల్లో
ప్రేమానురాగాలు నింపాలి
సున్నితమైన హృదయాల్లో
దేశభక్తి నూరిపోయాలి
ఎన్ని అడ్డంకులు వచ్చినా
వాగ్దానమే నెరవేర్చాలి
కష్టానష్టాలే తెచ్చినా
కొండలా ఉండిపోవాలి

ఉండాలోయ్! తప్పక
-------------------------------------------------
చదువులో శ్రద్దగా
బ్రతుకులో బుద్ధిగా
ఉండాలోయ్! తప్పక
గుణంలోన గొప్పగా
ప్రేమగా అందరితో
శ్రేష్టమైన చెలిమితో
ఉండాలోయ్! తప్పక
సుగుణాల సంపదతో
తరువులిచ్చే నీడగా
గురువు చెప్పే నీతిగా
ఉండాలోయ్! తప్పక
జీవితాల్లో జ్యోతిగా
పూలలోని తావిగా
జలమునిచ్చు బావిగా
ఉండాలోయ్! తప్పక
మాటలోన మేటిగా
పదిమందికి స్ఫూర్తిగా
బ్రతుకంతా ఓర్పుగా
ఉండాలోయ్! తప్పక
అన్నింటా పొదుపుగా
-గద్వాల సోమన్న



Comments