top of page
Original.png

సుప్రభాత సౌరభం

1 day ago
6 min read


తిరుమలలో సుప్రభాత దర్శనం సమయంలో చైత్రను ఆదరిస్తున్న తెలుగు తల్లి – సుప్రభాత సౌరభం కథ

Suprabhata Sourabam - Telugu Emotional Story | Kalasridhar

సుప్రభాత సౌరభం - తెలుగు భావోద్వేగ కథ | కళాశ్రీధర్

Published in manatelugukathalu.com on 30/09/2026



‘సుప్రభాత సౌరభం’ ఒక ఆధ్యాత్మిక, మానవతా భావోద్వేగ తెలుగు కథ.తిరుమల శ్రీవారి సుప్రభాత దర్శనం నేపథ్యంలో ఇద్దరు అపరిచిత కుటుంబాల మధ్య ఏర్పడిన ఆత్మీయ అనుబంధాన్ని ఈ కథ ఆవిష్కరిస్తుంది.ఒక చిన్నారి కోసం అందించిన సహాయం, దాని వెనుక దాగిన దైవ సంకల్పం కథకు హృదయాన్ని అందిస్తాయి.సాటివారికి సాయం చేయడం ద్వారా మనలోని మానవత్వాన్ని మేల్కొలపడమే నిజమైన ‘సుప్రభాతం’ అనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది. 


"ఏవండీ! మళ్ళీ తిరుమల టికెట్లు బుక్ చేస్తున్నారా!" అంటూ కాఫీ కప్పుతో ప్రత్యక్షమైన అర్ధాంగి పిలుపుతో తల పైకి ఎత్తి చూసి, తల ఊపి నా పనిలో నేను మునిగిపోయాను.


"ప్రతిసారి బుక్ చేయడం, వెళ్లలేకపోవడం, వెళ్ళలేకపోయామని బాధపడటం మీకు అలవాటైపోయింది. బుక్ చేయడం ఎందుకు? బాధపడటం ఎందుకు?" అనుకుంటూ తను వెళ్ళిపోయింది.


నా మటుకు నేను పిల్లల పేర్ల మీద, మా పేర్ల మీద ఆర్జిత సేవల ఈ-డిప్ పూర్తి చేశాను.

రెండు రోజుల తర్వాత, టిక్ టిక్ మంటూ మెసేజ్ శబ్దం... టీటీడీ నుంచి మెసేజ్! సంభ్రమాశ్చర్యాలతో ఆతృతగా ఓపెన్ చేస్తే... తిరుమల శ్రీవారి సుప్రభాతానికి పిల్లలు సెలెక్ట్ అయ్యారని, టికెట్ తీసుకోమని వచ్చింది.


స్వామివారి కరుణాకృప పిల్లలపై ఉందన్న ఆనందం నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. వెంటనే మా ఆవిడకి ఈ మెసేజ్ ఫార్వర్డ్ చేసి, ఫోన్ చేసి విషయం చెప్పాను. తను చాలా ఎక్సైట్ అయింది. వెంటనే ఏమీ ఆలోచించకుండా టికెట్ తీసేసుకున్నాను. మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూపులో ఈ టికెట్ పెడితే పిల్లల ఆనందానికి అవధులు లేవు.


సాయంత్రం అంతా ఎలా వెళ్లాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? అని ఒకటే డిస్కషన్.

"మరి పెద్దవాళ్ళ (మా అమ్మనాన్నల) సంగతి?" అన్నది మా ఆవిడ.


"చూద్దాం! మూడు నెలల తర్వాత కదా అప్పటి పరిస్థితి!" అన్నాను నేను.


ఈ వయసులో వాళ్ళని తీసుకెళ్ళడం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడమే, వారితో పాటు మనమూ ఇబ్బంది పడటమే!


ఏమిటో ఈ టీటీడీ వారి ఆలోచన... ఎప్పుడో మూడు నెలల తర్వాత దర్శనానికి ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకోవడం... మూడు నెలల ముందే లీవులు, ట్రాన్స్‌పోర్టేషన్, అకామిడేషన్ ప్లాన్డ్‌గా బుక్ చేసుకోవచ్చు అని కాబోలు! కానీ రియాలిటీకి వస్తే మాత్రం ఇంట్లో ఆడవాళ్ళ డేట్స్, పిల్లల ఎగ్జామ్స్, ఇంట్లో పరిస్థితులు మూడు నెలల ముందే ఎలా బేరీజు వేయగలం? మాకు అందులో ఇద్దరూ ఆడపిల్లలే.


మా వరకు మాత్రం ముందు బుక్ చేసుకుని తర్వాత క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలే ఎక్కువ.

ఏంటో! కావాలనుకున్నప్పుడు వెళ్ళలేము, వెళ్ళాలనుకున్నప్పుడు టికెట్లు దొరకవు.


దేవుడి దర్శనానికి కూడా ఈ రేషన్లు, కండిషన్లు... మనసు పరిపరి విధాలా పోతున్నది.


ఎందుకైనా మంచిదని ముందుగానే రూము, ట్రైన్ టికెట్లు మా నలుగురికి రిజర్వేషన్ చేయించాను. మా ప్రయాణానికి ఒక్కొక్క అడ్డంకి తొలిగే కొద్దీ, భగవంతుని దర్శనానికి ఒక్కొక్క కొండ ఎక్కుతున్నట్టుగా అనిపించింది.


మా అమ్మనాన్నలైతే, "అమ్మాయి! దర్శనానికి పిల్లలిద్దరే వెళ్ళాలి. కొండమీద బాగా రష్ ఉందట... జాగ్రత్త తల్లి!" అంటూ జాగ్రత్తల అష్టోత్తరం, సూచనల సహస్రంతో మా భార్యాభర్తలిద్దరికీ తోమాల సేవ పూర్తి చేశారు.


ఎట్టకేలకు ప్రయాణించే రోజు రానే వచ్చింది. ఆఖరి నిమిషం వరకు హడావుడి మరి! రెండు రోజుల ప్రయాణానికి నాలుగు రోజులకు సరిపడా బట్టలు, నలుగురికి నాలుగు బ్యాగులు... ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగులు, వాటర్ బాటిల్స్, వగైరాలు.


"చేతుల నిండా క్యారేజీ, భుజాల నిండా బ్యాగేజీ లేకుండా సాగదు ప్రయాణం ఈ ఆడవాళ్ళకి" అనుకుంటూ, అమ్మనాన్నల ఆశీర్వాదం తీసుకుని, వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి, వారు చెప్పిన జాగ్రత్తలు విని ఆటో ఎక్కి స్టేషన్‌కి బయలుదేరాము.


ఎలాగైతేనేమి మొత్తానికి పెద్దవాళ్ళ సమ్మతితో, అనుమతితో తిరుపతిలో దిగి అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని స్వామివారి దర్శనానికి తిరుమల బయలుదేరాము.


కింద అలిపిరి గేటు దగ్గర రద్దీ మోస్తరుగా ఉంది. పైన కొండమీద రద్దీ ఎలా ఉందో తెలియజేసే తొలి సూచిక ఈ అలిపిరి టోల్‌గేట్. మా అదృష్టం బాగుండి రద్దీ తక్కువగానే ఉంది. ఎట్టకేలకు కొండమీదకి వెళ్లి రూము తీసుకుని తదుపరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము.


ముందుగా రూముకు చేరుకుని తలనీలాలు సమర్పించి వరాహస్వామి దర్శనం చేసుకుందామని బయలుదేరాము.


నిండుగా ఉన్న క్యూలైన్లు చూస్తే స్వామివారి దర్శనానికి ఒక ముందస్తు రిహార్సల్ లా అనిపించింది. క్యూలైన్లలో అందరికీ తిలకధారణ చేయడం, వరాహస్వామి దర్శనం ప్రశాంతతనిచ్చాయి.


హమ్మయ్య! వరాహస్వామి వారి దర్శనం పూర్తయింది. ఇక స్వామి దర్శనానికి ఏ ఆటంకం లేదు అనుకుంటూ రూముకు చేరుకున్నాము.


తిరిగి 12 గంటల తర్వాత లేచి రెడీ అయ్యి ఒంటిగంటకల్లా సుప్రభాత దర్శనానికి బయలుదేరాం. పిల్లల ఆధార్ కార్డులు, టికెట్, హుండీలో వేయాల్సినవి ఒకటికి రెండుసార్లు గుర్తుచేసుకుంటూ సుపథం దాటి ముందుకు సాగాము.


అప్పటికే చాలామంది అక్కడ కూర్చుని ఉన్నారు. అందరిలో స్వామివారి దర్శనం గురించిన ఆనందం, సంతోషం ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. మాకక్కడ ఎవ్వరూ తెలియదు.


పిల్లలిద్దరినీ ఒంటరిగా పంపాలంటే ఎందుకో భయమేస్తుంది. వీళ్ళకి అసలే జనంలో తిరిగే అలవాటు లేదు. పైగా పెద్ద అమ్మాయికి చలి పడదు.


వారికి జాగ్రత్తలు చెప్తున్నాము. మా ఆవిడైతే మరీనూ! పిల్లలకు ధైర్యం చెప్పే క్రమంలో తన భయాన్ని, బెంగను పంచుకుంటున్నది.


ఇంతలో ఒక ఫ్యామిలీతో టీటీడీ మేనేజర్ గారు "కుదరదు... రూల్స్ ఒప్పుకోవు!" అంటూ కొంచెం గట్టిగా మాట్లాడటం వినిపించింది. వారెంత రిక్వెస్ట్ చేసినా తను పట్టించుకోవడం లేదు.


"మీరు కాస్త పక్కనుండండి! మిగతా వారికి అడ్డం" అన్నాడు కఠినంగా!

వారు మా పక్కకు వచ్చి బాధపడటం చూసి, ఏమిటో విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. నేనే చొరవ తీసుకుని, "ఏమిటి సార్ విషయం? ఎందుకు బాధపడుతున్నారు?" అని అడిగాను.


తన పేరు నాగరాజు అని, తాను బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌నని చెబుతూ, తన పెద్దపాప పేరు “చైత్ర” అని, పోయిన నెలలోనే తన 12వ బర్త్‌డే జరిగిందని, పాపకు 12 ఏళ్ళు పూర్తయ్యాయి కాబట్టి వాళ్ళతో దర్శనానికి పంపడం కుదరదు అంటున్నాడని చెప్పాడు.


తల్లి, పిల్లల కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.


ఎంత విడ్డూరం! ఒక్క నెల పెద్దది అయిందని పిల్లని తల్లితో పంపమంటారా! ఆ పాప ఒక్కతే ఎక్కడ ఉండాలి? వాళ్ళ మదిలోని ప్రశ్నలన్నీ మా ఆవిడ నోటినుంచి బయటికి వచ్చాయి.


"టికెట్స్ బుక్ చేసే నాటికి అమ్మాయి వయసు 12 ఏళ్ళు నిండలేదుగా!" లాజిక్‌గా అన్నాను నేను. "హడావుడి తగ్గిన తర్వాత ఈ పాయింట్‌తో రిక్వెస్ట్ చేద్దాం, కంగారుపడకండి" అన్నాను నేను.


ఈలోపల నాగరాజు గారు ఉండబట్టలేక మళ్ళీ ఒకసారి మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేశారు ఈ లాజిక్‌తో. ఆయన మాత్రం "ఆ లాజిక్ ఏదీ నడవదు, ఇక్కడ రూల్స్ అనుసరించి డ్యూటీ చేస్తాం కానీ ఎమోషన్స్ గమనించి కాదు" అంటూ, పాపని పంపడం కుదరదని తేల్చేశారు.


పాప కోసం ఎవరో ఒకరు ఆగిపోవాల్సి వచ్చేటట్టుగా ఉంది. ఏం చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. నాగరాజు గారు ఏటూ తేల్చుకోలేక, తను ఉండిపోయి తన భార్యను, చిన్నపాపను దర్శనానికి పంపిద్దామనే ఆలోచనలోకి వచ్చారు.


నాకెందుకో చాలా ఇబ్బందిగా అనిపించింది. నేను ధైర్యం చేసి వాళ్ళతో, "పెద్దపాప మా దగ్గర ఉంటుందిలేండి... ఎలాగూ మేము గుడిముందే ఉంటాము. మా అమ్మాయిలు కూడా దర్శనానికి వచ్చారు కదా! మేము చూసుకుంటాము... మీరు ధైర్యంగా దర్శనానికి వెళ్లిరండి" అన్నాను.


అంతలో మా ఆవిడ కూడా, "పాప మా దగ్గర ఉంటుందిలేండి. మీరు ధైర్యంగా వెళ్లి రండి!" అని భరోసా ఇచ్చింది.


చైత్రకు ధైర్యం చెప్పాము. కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా చైత్రను వాళ్ళమ్మ మా ఆవిడకు అప్పగించి భారంగా లోపలికి నడిచింది. వాళ్ళకు బై చెప్తూ మేము ముగ్గురం గుడిముందుకు బయలుదేరాము.


చైత్రను పొదువుకుని మా ఆవిడ, "ఈసారి నీ పేరు మీదనే డిప్ వేద్దాం. స్వామి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు" అని అనునయిస్తూ గుడిముందుకు నడుస్తున్నాము.


"మేనేజర్ మరీ మూర్ఖంగా ఉన్నారు కదండీ! ఏమిటో ఈ రూల్స్... ఒక నెల వయసు పెరిగినంత మాత్రాన అవకాశాన్ని పోగొడతాడా? పోనీ దానివల్ల ఇంకెవరికైనా ఉపయోగమా? తానేదో పెద్ద సిన్సియర్‌గా డ్యూటీ చేస్తున్నాను అనుకుంటున్నాడు... కానీ, అవకాశాలు కల్పించడం డ్యూటీ గానీ, వచ్చిన అవకాశాన్ని చిన్న చిన్న కారణాలు చూపి అడ్డుకోవడం డ్యూటీ ఎలా అవుతుంది? ఆ తల్లి, బిడ్డ పడిన బాధ అతనికి ఎలా మేలు చేస్తుంది?"

"నిజానికి అతను మేనేజర్ కాదు... డ్యామేజర్!"


ఇలా ఎన్నో భావనలు మా మధ్యన రాజ్యమేలాయి. చివరికి నాకే అనిపించింది, ఏది జరిగినా భగవంతుని అనుగ్రహమే! ఈ పని ఆయన ఎందుకు చేశాడు? మనకు మాత్రం ఏం తెలుసు?


స్వామివారి దర్శనం ఆయన రమ్మంటే కలిగేది కానీ, మనం కోరుకుంటే వచ్చేది కాదు కదా!

చైత్ర ఇంకా బెరుకుబెరుకుగా మా ఆవిడ దగ్గర కూర్చుంది.


తనలో బెరుకుతనం పోతుందని, "మనం చక్కగా ఫోటోలు తీసుకుందాం" అని గుడిముందు చైత్రకు కొన్ని ఫోటోలు తీశాను. చలికి కొంత ఇబ్బంది పడుతున్నది. మా ఆవిడ తన చున్నీతో చైత్రను కప్పేసుకుంది.


ఇంతలో సుప్రభాత దర్శనానికి వెళ్ళే క్యూ మొదలైంది. ఒక్కొక్కరే 'గోవిందా... గోవిందా...' అనుకుంటూ ఒకరివెనుక ఒకరు క్యూలైన్‌లో వెళ్తున్నారు.


"అమ్మవాళ్ళను చూపిస్తాను" అంటూ చైత్రను తీసుకుని దక్షిణ మాడవీధిలోని నంబి గుడి దగ్గరికి వచ్చాము. అక్కడనుంచి అయితే మెట్ల మీద వచ్చేవాళ్ళు స్పష్టంగా కనిపిస్తారు.


కొంచెంసేపటికి మా పిల్లలు, వారితో పాటుగా దర్శనానికి వచ్చిన చైత్ర అమ్మనాన్న అందరూ కనిపించారు. వారికైతే చాలా ఆనందం వేసింది. పిల్లలు ఆనందంగా ఒకరికొకరు హాయ్ చెప్పుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్ళారు.


మేము చైత్రను తీసుకుని ఇంక గుడిముందుకు వెళ్లి కూర్చునే ప్రయత్నంలో ఉన్నాము. చలిగాలి చాలా ఎక్కువగా ఉంది. కోనేరు ముందు స్థలంలో కూర్చున్నాము.


మా ఆవిడ నన్ను దగ్గరే ఉన్న మా రూమ్‌కి వెళ్లి షాల్ గానీ, దుప్పటి గానీ తీసుకురమ్మని చెప్పి, తను చైత్రను చుట్టేసుకుని కూర్చుంది. మా ఆవిడకు ప్రస్తుతం తన పిల్లల ధ్యాస లేదు. పూర్తిగా చైత్రతో కలిసిపోయింది. తనతో కథలు, కబుర్లతో మునిగిపోయింది.


నేను షాల్ తేవడం కోసం రూమ్‌కి వచ్చాను. ఇంతలో “కౌసల్యా సుప్రజా రామా!” అంటూ సుప్రభాతం మొదలైంది. "ఇంకెంత... అరగంటలో పిల్లలు వచ్చేస్తారు" అనుకుంటూ, గబగబా షాలు తీసుకుని తిరిగి గుడిముందుకు వచ్చేసాను.


ఎందుకో నాకు చైత్రను మా ఆవిడతో చూస్తే మా అమ్మాయిని చూసినట్టనిపించింది. మా ఆవిడ చైత్రను తన ఒడిలో పడుకోబెట్టుకుని, షాలును పూర్తిగా కప్పి, చలి తెలియకుండా కప్పుకుని కూర్చుంది.


ఈ క్షణంలో మా ఆవిడకు తన పిల్లల మీద బెంగ లేదు... ఆలోచన లేదు... చైత్రయే సర్వస్వం అనిపించింది. తన టెన్షన్, అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసమే స్వామి ఇలా చేశారేమో! స్వామి చర్యలకు అర్థం... పరమార్థం ఇదేనేమో! రకరకాల ఆలోచనలు స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి.


ముందుగా అంగప్రదక్షిణ చేసుకున్న భక్తులు, తరువాత సుప్రభాత దర్శనం పూర్తిచేసుకున్న భక్తులు ఒక్కొక్కరే వస్తున్నారు. మా పిల్లలు, చైత్ర వాళ్ళ తల్లిదండ్రులు, ఇంకా మిగిలిన భక్తులు వసుధైక కుటుంబసభ్యుల్లా కలిసి వస్తున్నారు.


మా ఆవిడ ఒడిలో నిద్రపోతున్న చైత్రను చూసి వాళ్ళ అమ్మ ఎంతో సంతోషించింది. చైత్ర వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో కనిపించిన ఆనందం మాకు స్వామిని సుప్రభాత దర్శనం చేసుకున్నంత ఆనందం కలిగించింది. వాళ్ళ అమ్మ వచ్చినా కూడా చైత్ర మా ఆవిడ ఒడిలోనే ఒత్తిగిల్లి పడుకుంది.


ఇంతకుముందు ఎవరికీ ఒకరితో ఒకరికి పరిచయమైనా లేదే! కానీ ఈ సమయంలో ఒకరికి ఒకరు ఆప్తులు, స్నేహితులు, బంధువులు... అందరూ కలిసి ఫోటోలు తీసుకున్నారు.


సరదాగా కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు... స్వామి గురించి, సుప్రభాత దర్శనం గురించి, ఒకరి గురించి ఒకరు. మళ్ళీ కలుద్దామని చెప్పుకుంటూ, మళ్ళీ కలవాలని కోరుకుంటూ ఒకరి నుంచి ఒకరు వీడ్కోలు తీసుకున్నాం.


పిల్లల ఆలోచన రాకుండా మా ఆవిడకు చైత్రను, చైత్రకు అమ్మ బెంగ లేకుండా మా ఆవిడను ఒకరికోసం ఒకరిని కలపడమే బహుశా స్వామి ఉద్దేశం కాబోలు!


నేను ఎప్పుడో... ఎక్కడో... చదివిన విషయం పదేపదే నా మనసుకు గుర్తుకొచ్చింది. బహుశా భగవద్గీత వ్యాఖ్యానంలో అనుకుంటా...


"గతజన్మలో మనకి, మన కర్మలకి సంబంధం ఉన్నవాళ్ళే మనకి మళ్ళీ ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్లమంది ఉన్న ఈ భూమిమీద కేవలం కొద్దిమంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు... పని అయిపోగానే వెళ్ళిపోతారు... ప్రతి పరిచయం వెనుక మన మనసుకి, మేధస్సుకి అంతుచిక్కని ఓ అర్థం, అంతరార్థం, పరమార్థం ఉంటాయి..."


నావరకు మాత్రం నాకు అప్పుడే అనిపించింది... సుప్రభాతం అంటే స్వామివారిని నిద్రలేపడం కాదు, మనలోని భగవంతుని మేల్కొల్పటమే! సాటివారికి సాయపడేలా మనలోని మానవత్వాన్ని తట్టి లేపటమే! ఈ భావన కలిగిన మరుక్షణం నుంచి మనసులో సుప్రభాత సందర్శన సౌరభాన్ని ఆస్వాదిస్తున్నాను.


సర్వేజనా సుఖినోభవంతు!

— కళాశ్రీధర్


***



కళాశ్రీధర్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 





మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.




వెంకట శ్రీధర్ . N

పరిచయం:

రచయిత పేరు :  వెంకట శ్రీధర్ . N


కలం పేరు :  కళాశ్రీధర్

గతానుభవం : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ 

విశ్వవిద్యాలయ ప్రార్థన గీతం రచించడం

 2001లో జరిగింది





Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page