స్వప్న శోధన!
- A . Annapurna
- May 18
- 2 min read
#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #స్వప్నశోధన, #SwapnaSodhana, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems

Swapna Sodhana - New Telugu Poem Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 18/05/2025
స్వప్న శోధన! - తెలుగు కవిత
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
కలలు కంటాము అందరం
నిజాలు అవుతాయి కొన్ని మాత్రమే
స్వప్నం తెల్లవారగానే కరిగిపోతుంది అంటారు కానీ
నాకు అలా అనిపించదు మళ్ళీ మళ్ళీ గుర్తువస్తూనే ఉంటుంది
కొండరాళ్ళమధ్య ప్రవహించే నదీపాయలు నన్ను ఆకట్టుకుంటాయి
అక్కడే ఆగిపోతాను నన్ను నేను మరచిపోయి తిలకిస్తూ
కొండరాళ్లను పిండిచేసేయాలని కసితో సాగర కెరటాలు ఢీకొడుతూఉంటాయి
తుళ్ళిపడే జల్లు నామీద పడుతుంటే ఆ పరవశం మాటలో చెప్పలేను
తీరం వెంబడి నడిచిపోతూ ఉంటే వొడ్డుకుచేరి జారిపోయే అలలు నాతొ ఆడుకుంటాయి
ఇసుక తిన్నెలమీద మజిలీలు పడవలపై ప్రయాణాలు మలయ పవనాల గుసగుసలు
ఇసుకతో కట్టిన బొమ్మరిల్లు అల్లరి అలలు తుడిచిపెడుతుంటే మళ్ళీ కట్టడాలు
అలుపెరుగని ఆటలు పాటలు పరుగుల పందాలు ఎన్నో అనుభూతులు
అవే కలలుగా కళ్ళముందు కదలాడుతుంటాయి అనుభవాలకు ఆత్రపడతాయి
అగాధమైన జలధిలో ఆణిముత్యాలు ఉంటాయి గాని
అవి తేలికగా దక్కవు శోధించి సాధించాలి
ఆయాచితంగా లభించే వస్తువులు విలువ తెలిసుకోలేము
కష్టపడి సాధించినప్పుడే తెలుసుకోగలం
మనిషికి ఎదో ఒక వ్యాపకం ఉండాలి
లేకుంటే అందరి విషయాల్లో తల దూర్చి చీవాట్లు తింటాడు
కొందరికి అతిగా మాటాడటం అలవాటు
వాళ్ళు ఇతరులకు అక్కరలేని సలహాలు ఇస్తారు
కొందరు పక్కనే భూకంపం వచ్చినా చలించరు
ఎదుటివారిని ఇబ్బంది పెట్టేకంటే ఇదే నయం
బంధువులు ఊసుపోక చెప్పకూడని విషయాన్ని మరొకరికి చేరవేస్తారు
తర్వాత చిక్కుల్లో పడతారు
అతిచనువు తీసుకోవద్దు అతిగా మాటాడద్దు
హద్దులోవుంటూ గౌరవం పొందాలి
తొందరపడి ఎదుటివారిని నొప్పించవద్దు
తర్వాత తప్పును సరిచేసుకోలేము
అలాని సహనం అన్ని టైములో పనికిరాదు
ఎదుటివారికి చులకన అవుతాము
ఉన్నతవిద్య మంచిదారిలో నడిపించే సాధనం
సరిగా ఉపయోగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు
మంచి -చెడూ తెలుసుకోవడమే విజ్ఞత
తెలుసుకోనివారు ఆపదలో చిక్కుకుంటారు
ఏ పని చేసినా ముందు ఒక్కక్షణం ఆలోచించాలి
తర్వాత జరిగే పరిణామాలను గురించి
అనుకున్నవి అన్ని జరగవు
అనుకోనివి మంచి -చెడు ఏదైనా జరగవచ్చు
ఎదుర్కోడమే
ప్రతివారికి గమ్యం ఉంటుంది
కష్టమో సంతోషమో చేరుకోవాలి తప్పదు
ప్రేమ కావచ్చు ఆకర్షణ కావచ్చు
కొంతకాలమే తర్వాత అదొక దైనందిన జీవితం
కథలు కావ్యాలుగా చెప్పుకోడానికి పాటలుగా పాడుకోడానికి బాగుంటాయి
నిజం కలగానే మిగిలిపోతుంది
తీరని వ్యధగా బాధగా మిగిలిపోతుంది
అందుకే నిజజీవితానికి రాజీపడటం మంచిపని
ఆశలపల్లకిలో వూరేగడం భ్రమ
ఆకాశాన్ని అందుకోడం సాధ్యంకాదు
ఎందుకంటే వెళ్ళినకొద్దీ దూరం పెరుగుతూనే వుంటుంది
మనం ఉన్నచోటే మనకు పవిత్రం
ఎంత తిరిగినా మనస్సాన్తి దొరకదు మనం కల్పించుకోవాలి
ఆకాశానికి హద్దు వుండదు
మనిషి కోరిక ఎన్నటికీ తరగదు
ఇది తెలుసుకున్నవాడు ఏది కోరడు
సో కలలను అలాగే వదిలేసి
నిజాన్ని ఆచరణలో పెట్టడం మనిషి కర్తవ్యమ్.
*******************

-ఏ. అన్నపూర్ణ
Comentarios