తానొకటి తలిస్తే
- Bhaskara Rao B. R. K. V.

- 1 hour ago
- 5 min read

Taanokati Talisthe- Telugu Social Story | Bhaskara Rao B. R. K. V.
తానొకటి తలిస్తే… - తెలుగు సామాజిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు
Published in manatelugukathalu.com on 23/08/2026
‘తానొకటి తలిస్తే…’ బి.ఆర్.కె.వి. భాస్కర రావు రచించిన హృదయాన్ని కదిలించే సామాజిక సందేశాత్మక కథ. మద్యపానం ఒక వ్యక్తి జీవితాన్నే కాదు, అతని కుటుంబాన్ని కూడా ఎలా విషాదంలోకి నెడుతుందో ఈ కథ బలంగా చూపిస్తుంది. ఎన్నికల సమయంలో ఉచితంగా లభించే మద్యం వల్ల పేద కుటుంబాలు ఎదుర్కొనే విషాదాన్ని రవి తన పెయింటింగ్ ద్వారా సమాజం ముందుకు తీసుకురావాలనుకుంటాడు. తండ్రిని మద్యపానం కారణంగా కోల్పోయిన రవి, తల్లి ఆదెమ్మ ఆశయంతో పెరిగి గొప్ప చిత్రకారుడిగా ఎదుగుతాడు. అయితే తన కళ ద్వారా ప్రజల్లో చైతన్యం కలిగించాలన్న అతని ప్రయత్నానికి అనుకోని మలుపు ఎదురవుతుంది. మద్యం, ఎన్నికలు, కుటుంబ బాధ్యత, కళ, సామాజిక చైతన్యం వంటి అంశాలను మిళితం చేసిన ఈ కథ పాఠకులను ఆలోచింపజేస్తుంది.
కారు వేగంగా ముందుకు సాగిపోతోంది. వెనుక సీట్లో కూర్చున్న రవి ముఖం మీద ముంగురులు గాలికి వెనక్కి వెళ్తున్నాయి. రాత్రి తొమ్మిది దాటడం వల్ల చల్లటి గాలి వీస్తూ ముఖాన్ని చల్లపరచినా, ముప్పిరి గొలుపుతున్న ఆలోచనలతో వేడెక్కిపోతున్న మస్తిష్కానికి హాయినివ్వలేకపోతోంది.
కారు పురోగమిస్తుంటే అతని ఆలోచనలు తిరోగమించి గతాన్ని కళ్ల ముందు ఆవిష్కరిస్తున్నాయి.
ఆదెమ్మ, సింహాచలం దంపతులకు రవి ఒక్కడే కొడుకు. ఊరికి ఓవైపున్న ఫ్యాక్టరీలో దినసరి వేతనంతో పనిచేసే సింహాచలం, రెండో వైపున్న చిన్న అద్దె ఇంట్లో మిగిలిన కార్మికులతోపాటు నివాసం ఉండేవాడు.
ఫ్యాక్టరీలో పని అయిపోయిన వెంటనే ఊళ్ళోంచి ఇంటికి వచ్చేవాడు. సింహాచలానికి అప్పుడప్పుడు మందు తాగే అలవాటు ఉంది. అది కూడా డ్యూటీ దిగిన వెంటనే అక్కడికి దగ్గర్లోనే ఉన్న షాపులో తాగి, తూలుతూ సైకిల్ మీద ఇంటికి వచ్చేవాడు.
ఆదెమ్మ తన తండ్రికి ఐదో సంతానంగా చిట్టచివరిగా పుట్టింది. సహజంగా ఉండే గారం ఆదెమ్మకూ ఉంది. నిరుపేద ఇంట పుట్టినా, ఆదెమ్మ చిన్నప్పట్నుంచీ సమాజం పట్ల, తన కుటుంబం పట్ల అవగాహన కలిగి ఉంది. హుందాగా మిగిలిన పిల్లల మధ్య తన ప్రవర్తనతో ప్రత్యేకంగా ఉండేది. తోటి పిల్లలకు సలహాలు ఇచ్చేది.
పెద్దగా చదువు లేకపోయినా, తన బీదరికం వల్ల సింహాచలాన్ని పెళ్లి చేసుకున్నందుకు ఏనాడు బాధపడిన సందర్భం లేదు. అతన్ని మార్చుకోగలనన్న ధైర్యం ఉన్న ధీశాలి. కానీ భర్త తాగుడు మానిపించడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది. తన పెళ్ళినాటికే భర్తకున్న చెడ్డ అలవాటు తెలిసి, కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి చేసినా రవి తర్వాత రెండో బిడ్డ కనడానికి మొగ్గు చూపలేదు.
అన్నిటికంటే ఆదెమ్మకు ఎన్నికలు అంటే చచ్చేంత భయం; అది కూడా పెళ్ళయ్యాకే! ఎలక్షన్ల ముందురోజంటే మరీ భయం. ఎందుకంటే ఆరోజు మందు ఏరులై పారుతుంది. ఎంత తాగినా ఉచితమే. ఆపై కావలసినన్ని మందు శీసాలు కూడా ఇంటికి తీసుకువెళ్ళమని ఇస్తారు. మందుబాబులు ఒళ్ళు తేలకుండా తాగేస్తారని ఆదెమ్మ హడలిపోతుంది.
రవి పురుడు రోజు, ఎలక్షన్ ముందు రోజు ఒకటే అయ్యాయి. సింహాచలం కడుపునిండా తాగేసి ఇంటికి ఎలా వస్తాడోనని పురిటి మంచం మీద ఉన్న ఆదెమ్మ గుండెల్లో గుబులు పుట్టింది. అదృష్టకొద్దీ పీకల వరకు తాగినా ఇంటికి క్షేమంగా వచ్చాడని తెలిసి కుదుటపడింది. అందరూ "బిడ్డ వచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ" అని, నీ కొడుకు అదృష్టవంతుడు కాబట్టి నీ భర్త క్షేమంగా ఇంటికి వచ్చాడని అన్నారు. దాంతో రవి మీద ప్రేమ మరింత పెరిగింది.
సరిగ్గా ఐదు సంవత్సరాలు కావడంతో ఎన్నికల తేదీ ప్రకటించిన రోజునే ఆదెమ్మ గుండెలు జారిపోయాయి. సరిగ్గా రేపు ఎలక్షను అనగా ఆదెమ్మలో భయం మొదలైంది.
ఆ రోజు ఉదయమే, “ఏమయ్యా!! ఈరోజు వెళ్ళొద్దయ్యా. వెళ్ళితే తాగేస్తావు” అని దీనంగా కొడుకును చంకనెత్తుకుని అడిగింది.
“ఒసేయ్ ఆదెమ్మా!! నేను ఇయ్యాల ఆళ్లు ఎంత బతిమాలినా తాగను గాక తాగాను” అన్నాడు సింహాచలం స్థిరంగా.
“వీడి మీద ఒట్టేసి చెప్పు” అంటూ రవి తలపై సింహాచలం కుడిచేతిని తీసుకుని పెట్టు అంది.
“ఈడిమీద ఒట్టేసి చెప్తున్నాను. ఇయ్యాలే కాదు ఈ జనమలో మందు జోలికే పోను” అని సింహాచలం అనేసరికి ఆదెమ్మ క్యారియర్ ఇచ్చింది.
అప్పటికే వచ్చి ఉన్న తోటి కార్మికులతోపాటు రివ్వున సైకిల్ మీద వెళ్ళిపోయాడు సింహాచలం.
భర్త బిడ్డ మీద ఒట్టు పెట్టి వెళ్ళినా ఆదెమ్మ మనసు కీడు శంకిస్తూనే ఉంది. మధ్యాహ్నం పూట భోజనం చెయ్యలేదు. పదే పదే ఉలిక్కి పడుతోంది. ఏ క్షణాన్నైనా కట్టెలు తెంచుకోవడానికి సిద్ధంగా ఉన్న నిండు గోదారిలా ఉన్నాయి కళ్ళు.
తల్లి ఎందుకంత తల్లడిల్లిపోతోందో తెలియని వయస్సు రవిది.
సాయంత్రం ఐదు అయ్యేసరికి ఆదెమ్మలో కంగారు మరింత ఎక్కువైంది. ఫ్యాక్టరీ వదిలి గంట గడిచింది. అప్పటికే లోపలకు బయటకు కాలుకాలిన పిల్లిలా చాలాసార్లు తిరుగుతోంది. కార్మికులు ఒక్కొక్కరుగా ఇళ్లకు చేరుతున్నారు సైకిళ్ల మీద.
ఇహ లోపలకు వెళ్లకుండా బయట అరుగుమీదే చతికిలబడింది అదురుతున్న గుండెతో ఏ చెడు వార్త వినాలో అని. మొత్తం కార్మికులందరూ వచ్చేశారు, ఒక్క సింహాచలం తప్ప.
ఆదెమ్మకు అర్థమైపోయింది తన బ్రతుకు బిడ్డతో సహా వీధిన పడిపోయినట్టు. గుర్తుొచ్చిన దేవుళ్లందరినీ శతవిధాలా వేడుకుంది తన పసుపుకుంకుమ కాపాడమని.
కొద్దిసేపటికి అంబులెన్స్ మీద సింహాచలం యొక్క నిర్జీవ దేహాన్ని తీసుకువచ్చి దింపారు ఆదెమ్మ ఎదుట. “ఎక్కువగా మద్యాన్ని తీసుకోవడం వల్ల అదుపుతప్పి సైకిలుతో ఎదురుగా వస్తున్న లారీని గుద్ది చనిపోయాడు” అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.
వెంటనే స్పృహ తప్పి పడిపోయింది ఆదెమ్మ.
తోటి కార్మికుల భార్యలు వచ్చి ఉపశమనాలు చేసేసరికి మామూలయింది. గుండెలవిసేలా రోదించింది. ఆమె బాధ అరణ్య రోదనే అయింది.
పది రోజులు పూర్తికాకుండానే అక్కణ్ణుంచి రవిని తీసుకుని చాలా దూరం వెళ్ళిపోయింది. ఇళ్లల్లో పనిచేసింది, రోడ్లు వేస్తుంటే అక్కడకూడా పని చేసింది. తన లక్ష్యం ఒక్కటే. తన భర్తలా వేరే ఎవరూ కాకూడదు. తన నుదిటి రాత ఏ ఆడదానికీ రాకూడదు. అందుకు అనుగుణంగా కొడుకుని పెంచి తన బ్రతుకును గీతలా బోధించింది.
రవికూడా తల్లి ఆశయాలకు అనుగుణంగా పెరిగి పెద్దయ్యాడు. గొప్ప పెయింటర్ అయ్యాడు. ఎన్నెన్నో బహుమతులు పొందాడు.
ఇక తన లక్ష్యానికి చివరి మెట్టు అయిన రాష్ట్ర స్థాయి పెయింటింగ్ పోటీలో తన పెయింటింగ్‌ను ఉంచాడు కోటి ఆశలతో.
రవి కోరుకున్నట్టే తన పెయింటింగ్ మొట్టమొదటి స్థానంలో నిలిచింది. బహుమతి ప్రదానం చేయడానికి ప్రముఖ వ్యక్తిని ఆహ్వానించారు నిర్వాహకులు.
సభ ప్రారంభమైంది. పెద్దలంతా వేదికను అలంకరించారు. రవి వేదిక ముందున్న వరుసలో కూర్చున్నాడు. ముందుగా రవిని పిలిచి తన పెయింటింగ్‌లోని సారాంశం వివరించమన్నారు.
“ఒక మధ్య దిగువ తరగతికి చెందిన కార్మికుడు రేపు ఎన్నికలు అనగా ఆ రోజు రాత్రి కంఠం వరకు సేవించి, మిగిలిన బాటిల్స్ ఇంటికి తెచ్చుకుని, మరునాటి ఉదయం తన చేతి దగ్గర ఒకటి, నడుమ దగ్గర ఇంకోటి, నిక్కరు జేబులో రెండు సారా సీసాలను ఉంచుకుని అపస్మారక స్థితిలోకి వెళ్ళి ఇంటిముందే పడిపోయి ఉంటే ఏమిచేయాలో తోచని నిండు గర్భిణి అయిన భార్య చెలమలా పారుతున్న తన ఇంటి బయట మురికి కాలువ పక్కనున్న పొయ్యి దగ్గర కూర్చుని రాని పాలు కోసం రెండేళ్ల బిడ్డ వక్షోజాలు గీరుతుంటే, ఇంకో పిల్లాడు తండ్రి గురించి ఏమీ తెలియక గుడిసె వీధి అరుగు మీదున్న గుంజకు జారిపడి అమాయకంగా చూస్తున్నాడు. అందరికంటే పెద్దవాడు అదే మురికి కాలువలో కాగితపు పడవలు వదులుతున్నాడు...
ఇది ఎన్నికల రోజు చాలామంది ఇంటి ముందు ప్రత్యక్షమయ్యే దృశ్యం” అని రవి తన పెయింటింగ్ గురించి వివరించేసరికి సభలో కరతాళ ధ్వనులు వినిపించాయి. తిరిగి కిందకు వచ్చి కూర్చున్నాడు.
ముందుగా ప్రముఖ వ్యక్తి రవి యొక్క పెయింటింగ్ గొప్పదనాన్ని ప్రశంసించాడు. అంత గొప్ప పెయింటింగ్ ఈన కాసి నక్కల పాలు కానినట్లు తాను లివింగ్ రూమ్‌లో ఉంచుతానన్నాడు. పదిమంది వచ్చిపోయేవారు గొప్పగా ఆ పెయింటింగ్ గురించి చెప్పుకునేలా రవి యొక్క పేరు ప్రఖ్యాతలు ఇనుమడించేలా కృషి చేస్తానని వాగ్దానం చేశాడు కూడా.
అప్పటికే రవి పొంగి పొర్లుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ సభాస్థలిని విడిచిపెట్టేశాడు.
తన ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అయిందని కన్నీరుమున్నీరయ్యాడు. బహుమతిని తీసుకోవడం ఇష్టం లేక ‘తానొకటి తలిస్తే... జరిగింది ఇంకొకటి అయింది’ అని మదనపడి తన కారు ఎక్కేసాడు.
సిగ్నల్ దగ్గర కారు బ్రేక్ వేసేసరికి వర్తమానంలోకి వచ్చిన రవి తాను కన్న కల నెరవేరలేదని నిరాశ చెందకుండా, తిరిగి ప్రజలు ఏ పెయింటింగ్ వేస్తే తన హృదయంలోని భావాన్ని అర్థం చేసుకుంటారోనని ఆలోచిస్తూ వెనక్కి వాలిపోయాడు. కారు రవి ఇంటివైపు దూసుకుపోయింది.
***
బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు
ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.
భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.
రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.
పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు
నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు
ఊరు పాలి






Comments