top of page

టీ కప్పులో పెను తుఫాను




'Tea Cup Lo Penu Thufan' - New Telugu Story

Written By Pandranki Subramani

'టీ కప్పులో పెను తుఫాను' తెలుగు కథ

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


బ్రతుకుబాటలో దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలను ఎదుర్కున్నప్పుడు— ఎదుర్కుంటున్నప్పుడు కొందరు- కొందరేమిటి చాలా మంది షాక్ తగిలిందంటారు. దిమ్మ తిరిగి పోయిందంటారు. ఇదొక మాటకందని మౌనం వంటిదే. ఇందులో నకారాత్మక భావ ప్రభంజనం ఉంటుందనేది తెలుస్తూనే ఉంది.


ఇంకొందరేమో— ఊహకందని రీతిన అతీతమైన ఆనందం పాలపొంగులా పొంగి పొర్లినప్పుడు — మాటల పొందికను సయయానికి సమకూర్చుకోకుండా“నమ్మలేకపోయాను— నిలువెత్తు విద్యుత్ షాక్ తగిలిందనుకో! ”అంటుంటారు. నిజానికి ఇందులో సకారాత్మక భావన ఉంది.


కాని పొసగని పదాల మాటున ఆ ఉదాత్త భావప్రక టన మరుగున పడిపోతుంది. ఈ రెండు భావస్రవంతుల్నీ శ్రావణి ఒకేదశన జలపాతపు ఉధృతి మల్లే ఎదుర్కుంది;చెరువు గట్టున పూలమొగ్గలు తెంచుకుంటూ మనో రాగాల ఆలాపనలతో మైమరచి ఏరుకుంటూ వెళ్తున్నదల్లా అదాటున గట్టునుండి కాలుజారి లోతైన నీళ్లలో పడ్డట్లు--


అనుకోనిది అనుకోని విధంగా ఎదురవడమేగా మానవ జీవన ప్రయాణంలో అణగి ఉన్న అండపిండ బ్రహ్మాండ జీవన గణితం— దూరదృష్టి గల మహాపురుషులే కాక— మహర్షులు సహితం ఇంతవరకూ ఛేదించలేని చిదంబర రహస్యం!


జుత్తుచిక్కు తీసుకుంటూ ఇంటి వాకిట వరకూ వచ్చిన శ్రావణి అల్లంత దూరాన వస్తూన్న రామలింగేశ్వరరావు ఎవరో వ్యక్తిని వెంటబెట్టుకుని చకచకా నడుస్తూ రావడం చూసి కళ్లింతలు చేసుకుని చూసింది. తన కోసమే వస్తున్నాడు— వివాహపత్రి క అచ్చు వేయడం గురించి, వాటి వివరాలు పొందుపర్చడం కోసం మాట్లాడటానికే వస్తున్నాడు— అతడికి కావలసిన మిత్రుడు ఎవరినో వెంటబెట్టుకుని-- ఆమె మనసు తుళ్ళింతకు లోనైంది. నిర్ణీత సమయానికి ముందే వర్కు టార్గెట్ ముగించిన ఐ. టీ. ఉద్యోగి మూడ్ లా ఉరకలు వేసింది. కాని— ఉత్సా హంతో ఊగిస లాడిన ఆమెకు తరవాత తెలిసింది వాళ్లిద్దరూ వచ్చిన వ్వవహారమే వేరని.


వచ్చీరావడంతోనే ఇద్దరూ తనను చూసి కూడా చూడనట్లు తిన్నగా లోపలకు దూసుకువెళ్ళారు ఒంటి పైన నిప్పులు పోసుకున్నట్టు. రామలింగేశ్వరరావయితే-- అరచినంత పని చేసాడు-


“ఎక్కడా పెద్ద మనిషి? ఎక్కడా పెద్ద మనిషి? పిలవండి. నేను వెంటనే చూడాలి! “


ఇంటికి కాబోయే అల్లుడు అలా ఆక్రాశంతో గొంతెత్తి పిలవడం చూసిన విమలమ్మ అదరిపోయింది. ”ఏమైంది నాయనా! ఏమైంది?’


”రామలింగేశ్వరరావు ముఖం చిట్లించాడు. “నేను మీతో మాట్లాడటానికి రాలేదండీ! ఆ పెద్దమనిషితో మాట్లా డి తేల్చుకోవడానికే వచ్చాను“.


అప్పుడు రామలింగేశ్వరరావు సహోద్యోగి సుందరం కలుగచేసుకున్నాడు- “మధ్యన మీరెందుకండీ హైరానా పడిపోతారు? మీ వారిని పిలిచి వ్యవహారాన్ని తేల్చుకోవచ్చు కదా!”


అప్పుడు గాభరాగా— గడ్డం గీసుకుంటున్న వాడు గీసుకుంటున్నట్టుగా పరుగు వంటి నడకతో అక్కడకి చేరాడు శివానందం- “ఏమైంది అల్లుడూ? ”అంటూ.


ఆ మాటతో రామలింగేశ్వరరావు కళ్లు మరింత పెద్దవయాయి- “ముందు ఇది గమనించండి శివానందంగారూ! నేనింకా మీ ఇంటి అల్లుణ్ణి కాలేదు. కాను కూడాను-- . లాంఛన ప్రాయంగా తాంబూలాలు మాత్రం పుచ్చుకున్నాం. అంతే-- . మీ అమ్మాయికి మూడు ముళ్ళూ వేసి పవిత్ర శ్లోకాలు పఠించి హోమగుండ ప్రదక్షిణం చేయలేదు. ఇక పోతే- దీనికి బదులివ్వండి— నేనెప్పుడైనా మీతో మాట తప్పానా— పరిధి దాటానా? ”


శివానందం తెల్లబోతూ ఎటూ తేల్చుకోలేక పోతూ- లేదన్నట్టు తల అడ్డంగా ఊపాడు.


”అలాంటప్పుడు— నా కొంపకూల్చడానికెందుకు పాల్పడ్డారు? నాకు వెనుకా ముందూ ఎవరూ లేరన్న అలుసుతోనే కదా అలా దాగుడు మూతలాడారు! ”


“నిజం చెప్తున్నాను— నాకేమీ అర్థంకావడం లేదు అల్లుడుగారూ! ఈ రోజు లేచిన వేళా విశేషం బాగులేదేమో-- ”


“ఓహో! తమకు నిజంగానే అర్థం కావడం లేదన్నమాట! సరే దీనికి బదులివ్వండి. నేను చేస్తున్నది ప్రభుత్యోద్యోగమన్నది మీకు తెలుసా తెలియదా? ”


తెలుసన్నట్టు తలాడించాడు శివానందం.


”అలాంటప్పుడు చట్టాన్ని ఉల్లంఘిస్తే నాగతేమి కానో మీకు తెలు సుండాలా వద్దా? “


అతడు బిత్తరపోతూ రామలింగం ముఖంలోకి చూస్తూ- “మీరు చట్టాన్ని ఉల్లంఘించారా! ” అన్నాడతను నోరెళ్ళబట్టి..


“నేనింకా ఉల్లంఘించలేదు. నన్ను చట్టాన్ని ఉల్లంఘించేలా చేయబోయారు మీరందరూ చేరి. సరే- యిక పాయింటుకే వస్తున్నాను. హైందవ వివాహ చట్టం చాలా కఠితరమైనదని తమకు తెలుసు కదూ!"


మరొక మారు తలాడించాడు ”ఇందులో సందేహ మేల ! ” అన్నట్టు గ్రుడ్లు మిటకరించి చూస్తూ.


”మైనారిటీ తీరని అమ్మాయిని పెళ్లి చేసుకుని సంసారం సాగిస్తే— దానిని చట్ట నిపుణులేమంటారో తెలుసాండీ! దగా చేసి కన్నె చెర చెరగని ఓ అమ్మాయిని రేప్ చేసానంటారు. ఔనాకాదా? ”


“ఛే ఛే! అవేం దుర్భాషలు అల్లుడుగారూ! మేము అమ్మాయి ఒప్పుదలతో- పెద్దల సమక్షాన కుదిరిన ఒప్పందం ప్రకారమే కదా వివాహా మహోత్స వానికి ఏర్పాట్లు చేయనారంభించిదీ-- ”


“వీలు పడదు. మీరందరూ కలసి ఒప్పుకున్నట్టు చెప్పినా— అదీ చాలదన్నట్టు బ్యాండ్ పేపర్ పైన వ్రాసిచ్చినా ఇప్పటి చట్టాలు ఒప్పుకోవు. కోర్టులు అసలే ఒప్పుకోవు. ఒప్పుదలతో చేరిక జరిగినా కొన్ని కోర్టులు దానిని అత్యాచారంగానే తీర్మానిస్తామని హెచ్చరించాయి. అప్పుడేమవుతుంది? నాకు ఉద్యోగం ఊడి తిరుక్షవరం జరుగుతుంది. ఏదో ఆశపడి ఓఇంటివాడినవడానికి నేనిదంతా భరించాలా! ”


“మేము బైటకు చెప్తే కదా— అందరికీ తెలిసేది? ”


“ మీరు నిజంగానే అమాయకులా— లేక అమాయకంగా ఏమీ తెలియనట్టు నటిస్తున్నారా? ”


అప్పుడు సుందరం కలుగచేసుకు న్నాడు. ”నువ్వుండరా రామలింగా! నేను పూణే కేసు గురించి విడమర్చి చెప్తేగాని— వ్యవహారంలోని సీరియస్ నెస్ ఈ పెద్ద మనిషికి బోధపడదు. మా తోటి స్టాఫ్ ఒక్కడు మహ రమ్జుగా జీవితం సాగిస్తూ భార్యకు తెలియకుండా మరొక సెటప్ చేసుకున్నాడు. సెటప్ చేసుకున్నవాడు సెటప్ చేసుకుని ఓ మూలనపడుండాలి కదా! కొత్త జతకత్తెతో ఏమి చేసాడంటే — గొప్ప గా గుడికి వెళ్లి పూలమాలలు మార్చుకుని— పూజారికి తన సెటప్ ని స్వంత భార్యగా చెప్పాడు.


వాడికి పడని ఎక్స్రాగాడెవడో సెల్ఫీ తీసి వాడి అసలు పెళ్లానికి— మా డిపార్టుమెంటుకీ పంపించేసాడు. ఆ తరవాత ఇంకేముంది— గోవిందా గోవిందా! డిపార్టు మెంటువారూ— కోర్టువారూ జరిపిన ఇంక్వయిరీలో అతడు రెండవ భార్యతో కాలం గడుపుతున్నాడని తేలిపోయింది. ఉద్యోగం ఊడిన మాట అటుంచి- ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో తెలుసా”


దానికి శివానందం బిత్తరపోతూ అడిగాడు- “పాపం— ఎక్కడున్నాడు?"

“దానికి ఠపీమని స్పందించాడు సుందరం-- ”పూణే సివిల్ జైలులో“


ఈసారి మిగిలిన కొసను రామలింగం అందుకోవడానికి ఉపక్రమించాడు- “కాబట్టి— “ అంటూ అసంకల్పింతంగా చూసాడు అటువేపు. ఏపుగా పచ్చటి తియ్య మాఁవిడి చెట్టులా నిల్చున్న శ్రావణి చేతిలో మంచి నీళ్ల గ్లాసుతో నిల్చుని తననే చూస్తూంది.


”నాకు వద్దు“ విదిలింపుగా అన్నాడు రామలింగేశ్వర రావు.


“ఏది వద్దూ?” అని అడిగిందామె వయ్యారాలు పోతూ-


“ ఇటువంటి అజ్జీ బుజ్జి మర్యాదలు“


“ సరే— అలాగే అనుకోండి. వేగిర పాటుతో చాలా దూరం నుంచి వచ్చినట్టున్నారు. చల్లనీళ్లు తీసుకోండి చల్లబడతారు“


అప్పటికీ రామలింగేశ్వరరావు పట్టువదలని విక్రమార్కుడిలా శ్రావణి చేతినుండి మంచినీళ్ళ గ్లాసుని తీసుకోడనే భావించాడు సుందరం. కాని— ఆ చిలుక పలుకులో ఏ మహత్యం ఇమిడి ఉందో మరి- నిశ్శబ్దంగా తీసుకుని గ్లాసు ఖాలీ చేసాడు రామలింగేశ్వరరావు.


అప్పుడు శ్రావణి రెండవ బాణం విడిచిపెట్టింది “ఇలా ఓ సారి వస్తారా లోపలకి? కొంచెం మాట్లాడాలి!“


ఈసారైనా మిత్రుడు కన్నెపిల్ల పిలుపుని ఖరాకండీగా తిరస్కరిస్తాడనుకున్నాడు సుందరం.


వావ్! అలాగే రానని తిరస్కరించాడు రామలింగేశ్వరరావు ముఖం తిప్పుకుంటూ-- అప్పుడామె అప్పటికప్పుడు మన్మధుడి పొదనుండి అరువు తెచ్చుకున్నపూల బాణం విడిచిపెట్టింది సూటిగా మరీ ఘాటుగా- “మీ మధ్య గొడవల్లోకి నన్నెందుకు లాగుతారూ! నాకు నచ్చిన వాణ్ణి చూసి నేను మెచ్చినవాడికి మనసిచ్చి ఔనన్నాను. మీరేమో- మీకు నచ్చిన నన్ను చూసి ఔనన్నారు. ఇందులో పెద్దగా రచ్చకెక్కడానికేముంది? ప్లీజ్! యిలా రారూ! ”


ఆ అభ్యర్థనలో ఏ మాయల మంత్రం దాగుందో మరి— రామలింగేశ్వరరావు ఈసారి చప్పుడు లేకుండా పిల్లి పంజాలపై నడుస్తూ వెంబడించాడు. సుందరానికి అరికాలి మంట నసాళానికి ఎక్కినట్లయింది. ’వీడికి తోకొక్కటే బాకీ! ’అని మనసున కసిగా అనుకున్నాడు. ఒక స్త్రీ యవ్వనం ముందు ఇలాగా బేలగా మోకరిల్లుతాడూ!


ఇకపోతే— లోపల ఇంకేమి జరిగిందో మరి— రామలింగేశ్వరరావు పళ్లికిలిస్తూ శ్రావణితో కలసి వచ్చాడు— “ఓకే ఓకే! నో ప్రాబ్లమ్!’


”సుందరం ఇక ఆగలేక పోయాడు. ఆక్రోశం ఆపుకోలేక పోయాడు. ఎదురెళ్లి మిత్రుణ్ణి అటకాయించాడు- “ఏంవిట్రా ఓకే ఓకే— వచ్చిన కార్యం మరిచావా! కవచం కోల్పోయిన సైనికుడిలా తరలిపోవాలని తీర్మానించావా! ”


“ఇప్పటికి ఆహ్వాన పత్రికలు అచ్చువేయడం మానివేసి- వివాహం వచ్చే సంవత్సరానికి వాయిదా వేసాం“


“సోవాట్? వాట్ డిఫెరెన్స్ డజ్ ఇట్ మేక్? “


“ఏ లాట్ ఆఫ్ డిఫెరెన్స్ డజ్ ఇట్ మేక్. నా ఉడ్ బి- చల్లగా తీర్చేసింది అగ్నిపర్వవంతటి నా సమస్యని”


ఎలా- అన్నట్టు గుర్రుగా చూసాడు సుందరం. తన ఉనికి లేకుండా సమస్య తీరిపోవడమా! అతడి ఉక్రోశం మరింత ఎక్కువైంది.


“వచ్చే సంవత్సరం శ్రావణికి ఎలాగూ మైనారిటీ తీరిపోతుందిగా! అంటే— మేటర్ ఆఫ్ ఒక సంవత్సరమేగా-- ఈ లోపల మా స్నేహం చెక్కు చెదరకుండా చూసుకుంటాంగా-- “ అంటూ శ్రావణి బర్త్ సర్టిఫికేట్ చేతిలో పెట్టాడు.


“హాఁ! ” నోరు తెరిచాడు సుందరం.


ఇక చెప్పాలా-- శివానందం దంపతుల ముఖాలు ఎల్. ఈ. డీ కొత్త బల్పుల్లా ఫెళ్లుమన్నాయి.


***

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.








1 komentarz


stuart jack
stuart jack
19 maj 2023

Thanks for covering most of your experience in blog. Sure, this will be very useful for those needed.


<a href="https://www.hyd7am.com/">Latest News Updates</a>


Polub
bottom of page