top of page
Original.png

ఉపాధ్యాయ దినోత్సవం: గురు పూజ


సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువును గౌరవిస్తూ పూలతో సత్కరిస్తున్న భారతీయ విద్యార్థులు

Upadhyaya Dinotsavam: Guru Puja - New Telugu Article | Sudhavishwam Akondi

ఉపాధ్యాయ దినోత్సవం: గురు పూజ - తెలుగు వ్యాసం | సుధావిశ్వం ఆకొండి

Published in manatelugukathalu.com on 05/09/2026



తల్లిదండ్రులు జన్మనిస్తే… ఆ జీవితానికి దిశ, లక్ష్యం, భవిష్యత్తు చూపేది గురువు!సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన విజయాల వెనుక కనిపించని గురువుల త్యాగాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం.


 శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏


 జీవితంలోని ప్రతి అడుగులో ఎన్నో విధాలుగా మార్గ నిర్దేశనం చేస్తున్న గురువులు అందరికీ వందనం 🙏


 "గురుః బ్రహ్మ గురుః విష్ణు

 గురుదేవో మహేశ్వర

 గురు సాక్షాత్ పరబ్రహ్మ

 తస్మై శ్రీ గురవే నమః"

 

 మన భారత సంస్కృతి సంప్రదాయాలలో గురువుకు మహోన్నత స్థానం ఉంది. గురువులను అగౌరవిస్తే, వారికి అవిధేయులు అయితే దాని పర్యవసానం చాలా తీవ్రంగా ఉంటుంది. 


 మన జీవితంలో కొన్ని పరిచయాలు మనతో పాటు నడుస్తాయి. కొంతమంది వ్యక్తులు మనల్ని ప్రభావితం చేసి, మన జీవితాన్నే మార్చేస్తారు. అది ఎలాగైనా కావచ్చు! ఒక పుస్తకం చదివి ప్రభావితం అయి, ఆ ప్రభావం చేత ఉన్నత దశకు చేరుకోవచ్చు! ఒక వ్యక్తి మాటల ప్రభావం వల్ల కూడా కావొచ్చు! మంచి వైపుకు నడిపించే ప్రతి ఒక్కరూ గురువులుగానే భావించాలి. చిన్నప్పుడే చదువుతో పాటుగా జీవితపు విలువలు నేర్పి, ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దేది గురువులు. అలాంటి వారే నిజమైన గురువులు.


 తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే,

గురువులు మనకు ఒక దిశను, ఒక లక్ష్యాన్ని, ఒక మంచి భవిష్యత్తును ఇస్తారు.

జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే, ఆ జన్మకు ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చేది గురువులు మాత్రమే!

 అక్షరాలు నేర్పిన మొదటి గురువు నుంచి

జీవితంలో మంచి చెడులను అర్థం చేసుకునేలా చేసిన ప్రతి గురువు తన

బోధనల ద్వారా మన జీవితంలో ఎప్పటికీ చెరిగిపోని జ్ఞాపకాలుగా మిగిలిపోతారు.


 మన విజయాల వెనుక కనిపించని ఎందరో గురువుల శ్రమ ఉంటుంది.

మనలోని లోపాలను సరిదిద్ది,

మనలోని ప్రతిభను గుర్తించి, మనపై నమ్మకం ఉంచి, ప్రోత్సహించేవారు గురువులు.


 ప్రతి గెలుపు వెనుకా కనిపించని ఒక త్యాగం ఉంటుంది. ప్రతి గొప్ప ప్రయాణం వెనుకా మార్గం చూపిన ఒక గురువు అడుగుజాడ ఉంటుంది. విజయం వైపు సాగే పరుగులో లోకం శిష్యుడి గెలుపునే చూస్తుంది. కానీ ఆ గెలుపు కోసం తపించిన గురువు హృదయాన్ని చూడలేదు. ఒక మట్టి ముద్దను జాతి మెచ్చే శిల్పంగా మార్చడానికి తమ సమయాన్ని, శక్తిని ధారపోసిన నిస్వార్థమైన గురువు శిష్యుని పట్ల ఎప్పుడూ పుత్రవాత్సల్యం కలిగి ఉంటాడు. అధికారం, ఆస్తిపాస్తులు శాశ్వతం కావు. గురువు అందించిన అక్షర జ్ఞానమే ఈ ప్రపంచంలో అసలైన ఆయుధం. గురువుకు శిష్యుడు ఇచ్చే అత్యున్నతమైన గురుదక్షిణ, ఆయన పట్ల చూపించే గౌరవం మాత్రమే! ఆయన చూపించిన ధర్మ మార్గంలో నడవడం మాత్రమే!

 

 భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదున ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ప్రత్యేకత ఏమిటంటే ఈ రోజు భారతదేశ మాజీ రాష్ట్రపతి, గొప్ప తత్వవేత్త, ఆదర్శ ఉపాధ్యాయుడు అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం! భారతదేశ రెండవ రాష్ట్రపతిగా ఉన్నా కూడా ఉపాధ్యాయ వృత్తి పట్ల గౌరవం ఉండేది ఆయనకు. ఉపాధ్యాయ వృత్తి అనేది అత్యున్నతమైనదని ఆయన భావించారు.


ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం తన పుట్టినరోజును ప్రత్యేకంగా జరపడానికి బదులు, దేశంలోని ఉపాధ్యాయులందరినీ ఆరోజు గౌరవించాలని ఆయన కోరారు. అందుకే ఆయనను స్మరించుకుంటూ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం! వారి స్మరణార్థం ఈ రోజును గురువులకు అంకితం చేశారు. ఈరోజు ఉత్తమమైన గురువులను సత్కరించి గౌరవించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ రోజున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులను జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలలో ఘనంగా సత్కరిస్తాయి.


 గురువు ప్రాముఖ్యతను తెలుపుతూ పాఠశాలల్లో విద్యార్థులు తమ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపి, వారిని సత్కరించుకుంటారు.


గురువు అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు జీవితానికి వెలుగునిచ్చే మార్గదర్శి!


 మనకు విద్యను అందించి, మనల్ని తీర్చిదిద్దిన ప్రతి గురువుకూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి.


 గురువులను గౌరవించడం అంటే జ్ఞానాన్ని గౌరవించడం. మన జీవితంలో మనం ఎక్కడికి చేరుకున్నా, జీవితం అనే

ఆ ప్రయాణంలో ఎప్పుడో ఒకచోట

ఒక గురువు చెప్పిన మాట, వారు ఇచ్చిన

ఒక చిన్న సలహా, ఒక మందలింపు,

ఒక ప్రోత్సాహం మనకు దారి చూపుతూనే ఉంటుంది.


 అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు! 💐💐💐

సుధావిశ్వం 



సుధావిశ్వం ఆకొండి

-సుధావిశ్వం






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page