తెగని బంధం
- Buddhavarapu Kameswara Rao

- 2 days ago
- 5 min read

Tegani Bandham - Telugu Story on Social Problems | Buddhavarapu Kameswara Rao
తెగని బంధం - తెలుగు సామాజిక కథ | బుద్ధవరపు కామేశ్వరరావు
Published In manatelugukathalu.com on 30/04/2026
కొన్ని బంధాలు కనిపించవు…
కానీ విడిపోవు కూడా.
జీవితం ఎంత దూరం తీసుకెళ్లినా… ప్రేమ మళ్లీ కలుపుతుంది.
"ఏంటే స్వప్నా! ఏదో స్వప్నలోకంలో విహరిస్తున్నట్లు ఉన్నావ్? కొంపదీసి ఏదైనా కొత్త కథకు సబ్జెక్టు గురించి ఆలోచిస్తున్నావా?" షాపులోని అరలలో సామాన్లు తప్పుగా పెడుతున్న తన స్నేహితురాలిని అడిగింది, అదే సూపర్ బజార్లో పనిచేస్తున్న సుధ.
"అబ్బే, ఎంత ఆలోచించినా కథలకు మంచి సబ్జెక్టు దొరకడం లేదే. అయినా నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. అయితే, ఇప్పుడు మాత్రం, కొత్తగా వచ్చిన ఈ టూత్ పేస్టులు ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నా, అంతే!" అందంగా అబద్ధం చెప్పింది స్వప్న.
"సరే సరే, జాగ్రత్త మరి" స్నేహితురాలికి చెప్పి అక్కడ నుండి వెళ్లింది సుధ.
అదే సమయంలో, షేవింగ్ సామానులు కొనడానికి షాపుకు వచ్చి, వీరి మాటలు విన్న తారక్, స్వప్న వద్దకు వచ్చి,
"ఏమండీ! స్వప్న పేరుతో మహిళలను ధైర్యవంతులుగా పేర్కొంటూ అద్భుతమైన కుటుంబ కథలు రాస్తున్నది మీరేనా?" అడిగాడు ఆశ్చర్యపోతూ!
"ఔనండీ నేనే, ఏదో అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను" సామానులు సర్దుతూనే సమాధానం ఇచ్చింది స్వప్న.
"అసలు కుటుంబ వ్యవస్థ మీద అంత అద్భుతంగా కథలను ఎలా రాయగలుగుతున్నారు?" సామాన్లు సర్దుతున్న ఆమెకు సహాయం చేస్తూ అడిగాడు.
"నేను కుటుంబం లేని అనాథను కాబట్టి! అందుకే వాటి విలువ నాకు తెలుసు కాబట్టి"
తారక్ కళ్లలోకి చూస్తూ చెప్పింది స్వప్న.
"ఒహో, అదన్నమాట అసలు సంగతి. అయితే మీరూ నాలాగే అనాథ అన్నమాట" ఆమెకు ఇంకా దగ్గరగా వచ్చి చెప్పాడు తారక్.
"అంటే మీరు కూడా....?" అంటూ ఆశ్చర్య పోతున్న స్వప్నతో
"ఔనండీ! చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాను. నాకు తోబుట్టువులు, బంధువులు ఎవరూ లేరు. అమ్మ కూడా ఓ ఐదు సంవత్సరాల క్రితం నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. ఏవో చిన్న చిన్న పనులు చేసుకుని జీవించి, ఇదిగో, ఈ మధ్యనే ఈ ఊర్లో ఉన్న ఓ కంపెనీలో రిప్రజెంటేటివ్ గా చేరాను" తన గురించి వివరించాడు తారక్.
***** ***** ***** *****
అలా మొదలైన వారి పరిచయం ఓ నాలుగు నెలలు తిరక్కుండానే ప్రేమ దిశగా పరుగులు తీసింది.
ప్రతీరోజూ తారక్ తన సూపర్ బజార్ కు ఏదో వంకతో వచ్చి, సేల్స్ గర్ల్ స్వప్నతో మాట్లాడడం గమనించిన ఆ షాపు యజమాని శంకర్ గుప్తా, ఓ రోజు
"చూడు బాబూ! మీ ఇద్దరికీ ఇష్టమైతే వివాహం చేసుకోండి. అంతే తప్ప ఇలాంటి పద్ధతి మంచిది కాదు" అని వార్నింగ్ ఇచ్చాడు.
"సార్, స్వప్న ని నేను మనసారా ప్రేమించాను. అంతేకాదు, త్వరలో వివాహం కూడా చేసుకుంటాను" అని స్వప్న వంక ఆరాధనగా చూస్తూ చెప్పాడు. దానికి సమాధానంగా ఆమె చిరునవ్వు నవ్వడంతో, "శుభస్య శీఘ్రం" అంటూ శంకర్ గుప్తా వారిని ఆశీర్వదించాడు.
***** ***** ***** *****
వివాహం జరిగిన ఓ సంవత్సరం తరువాత,
ఓ రోజు రాత్రి,
"స్వప్నా! ఏమిటి? ఏదో కొత్త కథ రాస్తున్నట్టున్నావు?" కుతూహలంగా అడిగాడు తారక్.
"ఔను, కావ్య అనే నాలాంటి ఓ అనాథ అమ్మాయికి తోడు కావాల్సి వస్తే ఏం చేస్తుంది? అనే అంశంతో కథ రాస్తున్నా" ఏదో ఆలోచిస్తూ చెప్పింది.
"ఏముంది, నీలాగే వివాహం చేసుకుని స్థిరపడింది అని రాసేయ్. సరేకానీ, నేను రేపు మధ్యాహ్నం ఆఫీసు పనిమీద ముంబై వెళుతున్నాను. ఓ రెండు వారాల వరకూ రాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఒట్టిమనిషివి కూడా కావు. అవసరం అయితే ఎవరినైనా తోడు తెచ్చుకో!" సూట్ కేసు సర్దుకుంటూ చెప్పాడు తారక్.
"సరే తారక్, అలాగే ఆలోచిస్తాలే! నువ్వు జాగ్రత్త" రాస్తున్న కథను పక్కన పెట్టి, భర్తకు సహాయం చేస్తూ చెప్పింది స్వప్న.
***** ***** ***** *****
పదిహేను రోజులు తర్వాత ఆరోజు ముంబై నుంచి తిరిగి వచ్చాడు తారక్. తలుపు తీసి, అతని క్షేమ సమాచారం అడిగి తరువాత తిరిగి కథారచనలో నిమగ్నమయ్యింది స్వప్న.
లోపలికి వచ్చి, దుస్తులు మార్చుకుంటున్న తారక్,
"కొంచెం అడ్డు తప్పుకో బాబూ! అమ్మాయికి టాబ్లెట్ వెయ్యాలి" అంటూ తన వెనుక నుంచి ఓ ట్రేలో కాఫీకప్పు, మంచినీళ్ల గ్లాసుతో ఓ పెద్దావిడ వెళ్లడం చూసి,
"స్వప్నా! ఎవరీవిడ?" అడిగాడు ఆదుర్దాగా.
"అన్నట్టు నీకు చెప్పలేదు కదూ? ఆవిడ మా అమ్మ" చెప్పింది రచనను కొనసాగిస్తూ.
"ఆవిడ మీ అమ్మా? మరి అనాథను అన్నావు?" అడిగాడు ఏదో అనుమానం వచ్చి.
"మహానుభావా! అమ్మ అంటే కన్నతల్లి కాదు, కొన్నతల్లి. అసలు విషయం చెబుతా విను. నేను రాస్తున్న కావ్య కథలో, ఆమెకు తోడు కోసం, నువ్వు చెప్పిన విధంగా పెళ్లి చేసుకున్నట్లు కాకుండా, కోల్పోయిన తల్లిప్రేమ కోసం వృద్ధాశ్రమం నుంచి విధ్యాధరి అనే ఓ పెద్దావిడను తోడు తెచ్చుకున్నట్లు రాద్దామనుకుంటున్నా. కథలోనే కాదు, నిజ జీవితంలో కూడా అలా చేయాలనిపించి, నాకు సహాయం కోసం నాగమ్మ అనే ఈ ఆయాను తెచ్చుకున్నాను. నాకు ఎందుకో ఈవిడ ఉంటే మా అమ్మ ఉన్నట్టే అనిపించింది" అసలు విషయం చెప్పింది.
"మంచి పని చేసావు. అయితే ఆ కావ్య కథను నేను చెప్పినట్టు పూర్తి చేయడం లేదా?" అడిగాడు తారక్.
"అదే ఆలోచిస్తున్నా తారక్! కథ నువ్వు చెప్పిన విధంగా ముగిస్తే బాగానే ఉంటుందంటావా?" సందేహంగా అడిగింది స్వప్న.
అప్పుడు అక్కడే ఉన్న నాగమ్మ
"ఏంటీ? నిన్న నువ్వు చెప్పిన కథేనా? అదే అయితే ముగింపు నువ్వు చెప్పిందే బాగుందమ్మా. అంతేకాదు, వీలైతే... 'కొన్నాళ్లకు కావ్యకు తెలిసింది, ఆ విధ్యాధరి ఎవరో కాదు తన కన్నతల్లి అని, పరిస్థితుల ప్రాబల్యం వలన బిడ్డను వదులుకోవాల్సి వచ్చిందని' రాయమ్మా'" అంటూ చక్కటి సలహా ఇచ్చింది నాగమ్మ.
"అలా రాస్తే బాగుంటుందా అమ్మా? అసలు నిజజీవితంలో ఎక్కడైనా అలా జరుగుతుందా?" నాగమ్మ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది స్వప్న.
ఆ మాటలు విన్న నాగమ్మ
"వెర్రిపిల్లా! ఎందుకు జరగదూ? నువ్వు ఎవరో కాదు. నా కన్న కూతురువే. నేను వయసులో ఉండగా ఓ కామాంధుడు చేసిన మోసానికి ప్రతిరూపం నువ్వు. ఈ విషయం తెలిసిన నా తల్లిదండ్రులు నువ్వు పుట్టగానే నిన్ను ఓ అనాథ శరణాలయంలో చేర్పించి, ఈ విషయం రహస్యంగా ఉంచి, నన్ను ఇంకొకరికి ఇచ్చి వివాహం చేసారు. ఐదు సంవత్సరాలు నుంచి నీ కోసం తెలిసినవారి ద్వారా శరణాలయాలలో ఆరా తీస్తున్నా" ఇలా ఏదో ఆలోచనలో మునిగిపోయిన ఆమెకు వంటింట్లో ఏదో శబ్దం రావడంతో ఇహలోకంలోకి వచ్చింది.
"ఏంటమ్మా? ఆ శబ్దం?" అని ఆడిగిన స్వప్నకు "పిల్లి పిల్ల అమ్మా! పారిపోయింది" అని సమాధానం చెప్పి తిరిగి గతంలోకి జారుకుంది.
"కొన్నాళ్లకు నువ్వు ఈ ఊర్లో ఉన్నావని తెలిసింది. రోగి కోరుకున్నదే వైద్యుడు ఇచ్చాడు అన్నట్లుగా నేను పనిచేస్తున్న మెయిడ్ సర్వీస్ సెంటర్ కి నువ్వు రావడం జరిగింది. నిన్ను చూడగానే నాకు నా కన్న కూతురిని చూసిన భావన కలిగింది. అంతేకాదు, నీ రెండు పాదాలకూ ఆరో వేలు ఉండడం చూడగానే పూర్తిగా అర్థమైంది, నువ్వే నా కూతురువని...." ఇలా జరిగిన సంఘటన నెమరువేసుకుంటున్న నాగమ్మ
"ఏంటమ్మా! ఏమిటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? సరేకానీ, ముందు ఆ టాబ్లెట్ ఇయ్యి" అన్న స్వప్న పిలుపుతో వాస్తవం లోకి వచ్చి,
"అలా రాస్తేనే చక్కగా ఉంటుంది, ముందు నువ్వు రాయమ్మా! అలాగే ఈ టాబ్లెట్ కూడా వేసుకో" టాబ్లెట్ స్వప్న చేతికిస్తూ చెప్పింది నాగమ్మ, తారక్ వైపు నవ్వుతూ చూస్తూ!
ఆమె మొహం మొదటిసారి చూసి, ఆశ్చర్యపోయిన తారక్,
"ఇదేమిటి? మా అమ్మ నాగలక్ష్మి ఇక్కడ ఉంది? అమ్మాయిలను పాడుచేయడం, వ్యసనాలకు బానిస అవ్వడం లాంటి తన ప్రవర్తనతో విసుగు చెంది ఐదు సంవత్సరాలు క్రితం, నన్ను వదిలి బయటకు వెళ్లిపోయిన అమ్మ తిరిగి ఇన్నాళ్లకు ఇక్కడ ప్రత్యక్షమయ్యింది ? ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఈ స్వప్నని కూడా గతంలో వాళ్లలాగే వాడుకుని వదిలేద్దామనుకుంటే ఆ శంకర్ గుప్తా గాడి వలన ఇంతవరకూ వచ్చింది. ఇప్పుడు తిరిగి వచ్చిన అమ్మనూ, కడుపులో బిడ్డతో ఉన్న స్వప్ననూ వదిలేసి వెళ్లిపోవడమా? లేక......." అలోచిస్తున్న తారక్,
"స్నానం చేసి రా బాబూ, కాఫీ ఇస్తాను!" అన్న నాగమ్మ పిలుపుతో వాస్తవంలోకి వచ్చాడు.
తారక్ వైపు చూస్తూ వంటగదిలోకి వెళ్తున్న నాగలక్ష్మి,
"ఒరే తారక్, నువ్వు మా కన్న కొడుకువు కాదురా! అందుకే నీకు మా బుద్ధులు రాలేదు. ఈ స్వప్న పుట్టిన ఓ ఆరు నెలలు తిరగకుండానే నాకు సంజీవరావు అనే ఓ మంచి వ్యక్తితో వివాహం అయ్యింది. అయితే కొన్ని రోజులకే తెలిసింది, నాకు పిల్లలు పుట్టే అవకాశం లేదని. ఈలోగా మా వారి చెల్లెలు, బావగారు ఓ ప్రమాదంలో చనిపోయారు. పిల్లలంటే ఇష్టపడే మా వారు తన చెల్లెలు ఏకైక సంతానమైన నిన్ను మా ఇంటికి తీసుకుని వచ్చారు. అప్పటినుంచి మా స్వంత కొడుకులా నిన్ను పెంచుకున్నాము. ఆ తరువాత ఐదు సంవత్సరాలకే ఆయన మరణించారు. నువ్వు నా కన్న కొడుకువు కాదన్న విషయం ఎవరికీ తెలియదు, నీకు కూడా ఎప్పటికీ తెలియనీయను......" పరిపరి విధాల ఆలోచిస్తూ వంటింట్లో సామాన్లు సర్దుతున్న నాగలక్ష్మి,
"తారక్, అమ్మ చెప్పినట్టే కథకు ముగింపు ఇస్తున్నా. మరి ఈ కథకు శీర్షిక ఏం పెడదాం?" పెన్నుతో బుగ్గ మీద సుతారంగా కొట్టుకుంటూ, స్వప్న అడగడంతో
" 'తెగని బంధం' అని పెట్టమ్మా, బాగుంటుంది" వంటింట్లోంచి బయటకు వచ్చి, తారక్ వైపు ఆదిశక్తిలా చూస్తూ చెప్పింది నాగలక్ష్మి.
***** **శుభం** *****
బుద్ధవరపు కామేశ్వరరావు గారి కొన్ని ఇతర రచనలు:
బుద్ధవరపు కామేశ్వరరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు :: బుద్ధవరపు కామేశ్వరరావు
జననం : తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం దగ్గర లో ఉన్న జగన్నాధగిరి అనే గ్రామంలో డాక్టర్ సూర్యనారాయణ రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన 11 మంది సంతానంలో 7 వ వానిగా 1958లో.
వృత్తి : ఒక మల్టీ నేషనల్ కంపెనీలో అకౌంట్స్ మేనేజర్ గా 2016 లో పదవీ విరమణ చేసి ప్రస్తుతం హైదరాబాద్ లోని స్వగృహంలో విశ్రాంత జీవనం.
కుటుంబ నేపథ్యం: భార్య శేషుకుమారి, ఓ అమ్మాయి (సూర్యకళ, అల్లుడు వాసూరావు, వాళ్లకి ఇద్దరు పిల్లలు. పేర్లు సంకీర్త్, ష్రఘ్వి) ఓ అబ్బాయి(పేరు శశికాంత్, కోడలు శిరీష, వీరికి ఓ అబ్బాయి. పేరు శక్య)
వ్రాయడం మొదలుపెట్టింది : 2017 నుంచి
ఇంతవరకూ రాసిన కథలు : 212
ప్రచురణకు నోచుకున్నవి:
సుమారు... 98
మిగిలినవాటిలో కొన్ని వివిధ మాధ్యమాలలో పరిశీలనలోనూ,
మరికొన్ని మెరుగులు దిద్ది పంపే ప్రక్రియలో నావద్దనూ పెండింగ్ లో ఉన్నవి.
పోటీలలో బహుమతులు పొందినవి (15)
ప్రోత్సాహం ఇస్తున్న వారు:
పత్రికాధిపతులు, సంపాదకులు, సమీక్షకులు, అలాగే పాఠకులు అందరూ !








Comments