'Thalli Ainaa' New Telugu Story
Written By BVD Prasada Rao
రచన: బివిడి ప్రసాదరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
"తీర్ధ యాత్రలకు తీసుకెళ్లు రా. చచ్చేలోగా కొన్ని దైవ దర్శనాలైనా కానిచ్చుకోనీయరా." అనసూయమ్మ మళ్లీ కదిపింది.
కొడుకు రాంలింగం మళ్లీ అవస్థయ్యాడు.
"తీసుకు వెళ్తాలే." మామూలుగా అనేసాడు ఎప్పటిలాగే.
"నువ్వు అచ్ఛం మీ నాన్న మచ్చే. ఆయన ఉన్న రోజుల్లో తెగ అడిగే దాన్ని ఒక మారైనా తీసుకు వెళ్లమని. అదిగో ఇదిగో అనే వారే తప్పా.. నా మాట కానిచ్చేవారు కాదు. నువ్వు అంతే లేరా. చచ్చేంత వరకు నేను ఇలానే మగ్గి పోవాలా." నొచ్చుకుంటుంది అనసూయమ్మ.
రాంలింగం ఏమీ మాట్లాడ లేదు. చుట్టూ చూస్తూ ఉండి పోయాడు. ఇక్కడికి ఉదయమే వచ్చాడు.
"ఈ మధ్య ఊరిలో చాలా మంది యాత్రలకు చక్కగా పోతున్నారు. తిరిగి ఎంచక్కా వచ్చేస్తున్నారు. నాకే తెగింపు రాకుంటుంది." అనసూయమ్మ మాట్లాడుతూనే ఉంది.
రాంలింగం ఆ సీరియస్ ను పల్చపర్చాలని మాట మార్చాడు.. "నువ్వా అక్కడికి రావు. నీ కోడలా ఇక్కడికి రాదు. నేనే అటు ఇటు తిరగాలి.. నలగాలి. ఛఛ." అనేసాడు తెగ దిగులుగా.
కొడుకు బేజారుకు.. అనసూయమ్మ ఉసూరుమంది.
"సర్లే. ఎప్పటికి ప్రాప్తమో. ఏదైనా రాసి పెట్టుకు పుట్టాలి." అనేసింది.
అనసూయమ్మకు ప్రస్తుతం ఆరవై యేళ్లు.
పదహారో యేటనే తనకు పెళ్లయ్యింది. అప్పటికి భర్త శివరాం వ్యవసాయ కూలి.
కష్టించి.. శ్రమకు తగ్గ ఫలితం చివరికి సాధించాడు శివరాం. ఉంటున్న ఊరి చివరన ఎకరం భూమిని కూడ తీసుకున్నాడు. ఊరిలో రెండు గదుల సొంత ఇంటిని కట్టు కున్నాడు.
శివరాం పొలంకి, ఇంటికి యజమాని అయ్యే సరికి.. ఇరవై యేళ్ల కొడుకు రాంలింగం అందుకు వచ్చేడు.
రాంలింగం డిగ్రీ చదివాడు. బ్యాంక్ పరీక్షల్లో పాసై.. పట్నంలోని ఓ బ్యాంక్ ఉద్యోగి అయ్యాడు.
ఉద్యోగంలో చేరిన యేడాది కాక మునుపే.. తల్లిదండ్రులతో.. "మీరు నాతో వచ్చేయండి. ఇంకేం కష్టపడ వద్దు." అన్నాడు.
"లేదురా. మా చిన్ననాటి నుండి ఇక్కడే ఉంటున్నాం. ఈ ఊరును వదులుకోలేం రా." అనేసారు ఇద్దరూ ఏక గొంతులా.
"సరే. మీ ఇష్టం కానీయండి." అనేసాడు రాంలింగం.
తర్వాత.. మరో యేడాది గడిచే లోపలే.. తమ బంధువు మూలంగా.. ఓ సంబంధం కలిసి రావడంతో.. రాంలింగంకు పెళ్లి చేసేసారు శివరాం దంపతులు.
కొత్త కాపురంతో రాంలింగం పట్నంలో హుషారయ్యి ఉన్నాడు.
ఆ కాల గమనంలో..
పాము కాటుతో శివరాం చనిపోయాడు.
రాంలింగం ఒంటరి తల్లిని తన చెంతకు వచ్చేయమని మాట వరసకు కూడా కోర లేదు. పైగా తన భార్య కోరికల మేరకు.. ఆమెను ఒక మారు.. తిరుపతి తీసుకు పోయాడు. మరో మారు.. యాదాద్రి తీసుకు పోయాడు. ఇంకో మారు.. శ్రీశైలం తీసుకు పోయాడు. అలాగే తన ఇష్టం ప్రకారం.. తన భార్యతో ఊటీ వెళ్లాడు. గోవా కూడా వెళ్లాడు. ఇవేవీ అనసూయమ్మకు ఎఱిక కాకుండా జాగ్రత్త కూడా పడ్డాడు.
"కోడలు ఎలా ఉంది. ఏమైనా విశేషం ఉందా." అడిగింది అనసూయమ్మ.
"తను బాగుంది. ఇంకా పెళ్లై.. రెండేళ్లేగా. మేమే పిల్లలకై కొన్నాళ్లు ఆగాలనుకున్నాం." చెప్పాడు రాంలింగం.
"ఆ ముచ్చటా నాకు లేదా. నేను బతికుండగా ఆ ముచ్చటైనా తీర్చు రా." మళ్లీ దిగులయ్యింది అనసూయమ్మ.
"నీకేం కాదు. అన్నీ బాగుంటాయి. నువ్వు మరీ హైరానా కాకు." తేలిగ్గా అనేసాడు రాంలింగం.
ఆ వెంబడే.. "చోద్యంలా తోస్తుందే. ఊరు లోకి రాగానే నాతో చాలా మంది చెప్పారు. నువ్వు ఎంతో చలాకీగా తిరుగాడుతూ.. పొలం పనులు పురమాయించుకుంటూ.. చకచకా తిరుగుతుంటావటగా. మరి నన్ను చూస్తేనే నీలో నిరాశలు బుసలు కొడతాయా. నీర్సం పూనుతుందా." అడిగేసాడు రాంలింగం.
అనసూయమ్మ నొచ్చుకుంది. "తప్పదురా. ఒంటరి ఆడదాన్ని. అంత రండిగా.. మెండిగా లేకపోతే.. నడి నెత్తిన ఎక్కేవారు బోలెడు మంది ఇక్కడ. మీ నాన్న పోయేక.. నీకు కొలువు వచ్చి.. నువ్వు వెళ్లే వరకు నీ తోడు ఉండేది. అప్పుడు అలా ఇలా తిరిగేసే దాన్ని. మరి ఇప్పుడు నాకు ఈ జబర్ధస్తీ నటన తప్పదు. డీలా ఐతే.. చెప్పాగా నాక్కు తినేసే వారు ఇక్కడ జాస్తీ అని." చెప్పింది అనసూయమ్మ.
"సర్లే. భోజనం పెట్టు. నేను బయలు దేర్తా. తను ఒక్కత్తె." లేచాడు రాంలింగం.
కొడుకును ఎగాదిగా చూసింది అనసూయమ్మ.
"అన్నం, చారు చేసుకున్నాను. ముందు నువ్వు తిను. నేను వండుకుంటానులే. ఆగు అప్పడాలు వేపుతాను." లేచింది అనసూయమ్మ.
రాంలింగం పెరటి లోకి వెళ్లాడు. బావి లోని నీళ్లు చేదతో తోడు కున్నాడు. మొహం, కాళ్లూ చేతులు కడుక్కున్నాడు.
భోజనం తర్వాత.. బయలు దేరుతూ.. "పక్కింటి రాముడు మామకు ఫోన్ చేస్తుంటాను. మాట్లాడు తుండు." చెప్పాడు.
అనసూయమ్మ ఏమీ అనలేదు.
"అన్నట్టు. పంట అమ్మకం అయ్యిందని లాస్ట్ టైం ఫోన్ లో చెప్పావుగా. ఆ డబ్బులు చేతికి అందాయా." గుర్తొచ్చినట్టు అడిగాడు రాంలింగం. నిజానికి ఇప్పుడు తను ఇలా వచ్చింది.. ఆ డబ్బు కోసమే.
"ఇంకా లేదు." ముభావంగా కదిలింది అనసూయమ్మ.
"అవునా. చెప్పి చాన్నాళ్లైంది గా. సర్లే. అందితే. జాగ్రత్త పెట్టు. ఖర్చులు తీసేగా.. మిగతాది తీసుకు పోయి బ్యాంక్ లో వేస్తాను. ఈ మారు ఫోన్ చేసినప్పుడు ఆ సంగతి చెప్పు." రాంలింగం వెళ్లి పోయాడు.
అనసూయమ్మ ముళ్లు గుచ్చిన బూరలా అయ్యి పోయింది. కొడుకు వెళ్లిన వైపు చూస్తూ చాలాసేపు ఉండి పోయింది.
మరో యేడాది పిమ్మట..
ఇంటికి వచ్చిన రాంలింగం.. "ఎందుకీ వ్యవసాయం. ఖర్చులు పోగా ఏం మిగులుతుంది." అన్నాడు.
అనసూయమ్మ ఏమీ అనలేదు.
"ఊరిలో భోగాటా చేసా. పొలం రేటు బాగుంది. అమ్మేస్తే.. ఆ వచ్చిన డబ్బుకు వచ్చే వడ్డీ మొత్తం.. పంట మీద వచ్చే మొత్తం కంటె బాగుంటుంది." సడన్ గా చెప్పాడు రాంలింగం.
ఉలిక్కిపడింది అనసూయమ్మ.
తెమిలి.. "ఆ ఆధారం పోతే.. నేను ఇక్కడ బతికేది ఎలారా." అంది. నీరు కారిపోతుంది.
"నిన్ను తీసుకు వెళ్లినా.. ఈ ఇల్లు వదిలి రావాయే.." చెప్పుతున్నాడు రాంలింగం.
అడ్డై.. "ఈ ఇల్లే కాదురా.. ఈ ఊరు వదిలి రాలేను." చెప్పింది అనసూయమ్మ.
"సర్లే. ఏదో ఒకటి. ఇక్కడే ఉండు. నువ్వు అక్కడ మెసల్లేవు కూడా. ఇక్కడ ఇల్లు ఉందిగా.. నేను అప్పుడప్పుడు.. ఇక్కడికి వచ్చిన ప్రతి మారు.. అంతో.. ఇంతో ముట్ట చెప్తుతుంటానులే." ఈజీగా మాట్లాడేసాడు రాంలింగం.
అనసూయమ్మ చికాకయ్యిపోతుంది.
"ఎందుకలా చూస్తావు. నేనేమీ కానిది అనలేదు. నా మాట వినుకో." అనేసాడు రాంలింగం.
"లేదులేరా. ఈ ఇల్లు.. ఆ పొలం ఉన్నీ. మీ నాన్న చెప్పనే చెప్పాడు. సంపాదించక పోయినా పర్వాలేదు కానీ.. ఇల్లు.. పొలం నేను చచ్చే వరకు నాకై నిలుపుకోమని. మహానుభావాడు.. నేను ఎన్ననుకున్నా.. ఆ మనిషికి ముందు చూపు జాస్తీ. ఇప్పుడు అర్ధమవుతుంది." నిష్టూరమైనా అనేసింది అనసూయమ్మ.
రాంలింగం లోలోపల గింజుకుంటున్నాడు.
"అంటే.. నువ్వు పోయే వరకు.. ఏదీ అమ్మవు.. అమ్మనీయవా." అడిగేసాడు.
అనసూయమ్మ ఏమీ అనలేదు.
"నీ కోడలు పట్నంలో ఒక ప్లాట్ చూసింది. తన ఫ్రెండ్స్ కూడా అక్కడ తీసు కుంటున్నారు. వాళ్లతో పాటు తీసుకుందామంటుంది. పొలం అమ్మి డబ్బు లిస్తానన్నాను. నా మాట పోనీయకు." అసలు సంగతి చెప్పేసాడు రాంలింగం.
అనసూయమ్మ ఉలిక్కి పడింది. కానీ ఏమీ అనలేదు.
"నువ్వు చచ్చే వరకు కాదంటే.. మరి మా భవిషత్తు ఏమిటి. ముందు ముందు పట్నంలో ఇల్లులు కొనలేం. నాకంటూ మీరు ఏమీ కట్టల కొద్ది కూడ పెట్టింది లేదు. ఇప్పుడిది అప్పటికి చాలదు." చకచకా అనేసాడు రాంలింగం.
"ఆవేశ పడకు. ఇన్నాళ్లూ పంటల డబ్బులు బాగానే పట్టుకు పోయావుగా. బ్యాంక్ లో దాస్తున్నావుగా. కావాలంటే అవి వాడుకో." చెప్పింది అనసూయమ్మ.
"అబ్బో. పంట డబ్బులు.. అవి వేలల్లోనే కానీ లక్షల్లో ఏమీ కూడలేదు." విసురుగా మాట్లాడేస్తున్నాడు రాంలింగం.
ఆ ఇంటి గందికకు.. పక్కింటి రాముడు మామ అక్కడికి చొరవగా చేరాడు.
"ఏంట్రా." అన్నాడు.. రాంలింగంను చూస్తూ.
"పట్నం సొదలు నీకు తెలియనివా మామ." చెప్పుతున్నాడు రాంలింగం.
అడ్డై.. "అదే అన్న. పొలం అమ్మి డబ్బులిమ్మంటున్నాడు. అక్కడ ఇల్లు కొనుక్కుంటాడట." చెప్పేసింది అనసూయమ్మ.
"అదేంట్రా. చదువుకున్నవాడివి. ఆలోచన లేని మాటలు ఆడొచ్చా." విస్మయమయ్యాడు రాముడు మామ.
"నీతులు వద్దు కానీ. తను చచ్చే వరకు ఆగితే.. నాకు ఆ తర్వాత అందేది ఏమీ ఉండదు. అందినా అదేమీ అప్పటికి చాలేది కాదు." రోషంగా మాట్లాడేస్తున్నాడు రాంలింగం.
రాముడు మామ తల తిప్పి అనసూయమ్మను చూసాడు.
ఆవిడ కలగ చేసుకుంటూ.. "గొడవ వద్దు. నీ నాన్న.. నేను కష్టపడి కూడ తీసింది ఈ ఇల్లు.. ఆ పొలం. మేము ఉన్నంత వరకు ఇవి మావి. అంతే." నికరంలా చెప్పేసింది.
రాంలింగం టక్కున.. "విన్నావా మామా. హక్కులు చెప్పుతుంది. అలా ఐతే.. కొడుకుగా నాకూ హక్కూ ఉంది." అనేసాడు.
"ఒరే. ఎందుకురా రభసా. వినుకో." నచ్చచెప్పబోయాడు రాముడు మామ.
రాంలింగం రెచ్చిపోయాడు.
అనసూయమ్మ కలగ చేసుకుంది. "నేను బ్రతికి ఉన్నంత వరకు దేనిని చెల్లా చెదురు చేయను. నీకు అంతగా కావాలంటే.. నన్ను చంపేసి.. పట్టుకు పో." అనేసింది చాలా గట్టిగానే.
రాముడు మామ బెంబేలయ్యాడు.
"అంతేనా." గబుక్కున అనేసాడు రాంలింగం.
"ముమ్మాటికి. నువ్వు కేసు పెట్టినా.. కోర్టు కెళ్లినా.. ఎక్కడైనా.. ఎప్పుడైనా.. నాది ఇదే మాట." కఠినంగా చెప్పేసింది అనసూయమ్మ.
రాంలింగం నిస్సత్తువుగా కదిలాడు.
రాముడు మామ కలగ చేసుకోబోయాడు.
రాంలింగం ఆగలేదు. వెళ్లి పోయాడు.
రాముడు మామ తల తిప్పి చూసాడు.
అనసూయమ్మ స్థిరంగా అగుపించింది.
'తల్లి ఐనా.. తనకు మాలిన ధర్మం చేపట్టరాదు.' అనుకున్నాడు రాముడు మామ.
***
బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.
రైటర్, బ్లాగర్, వ్లాగర్.
వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్
వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
Comentarios