'Thanivi thiralede' - New Telugu Story Written By D V D Prasad
'తనివి తీరలేదే' తెలుగు కథ
రచన: డి వి డి ప్రసాద్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
ఆఫీసు నుండి వచ్చి రాగానే హాల్లో సోఫాలో కూర్చుంటూ, "శిరీషా!" అని హుషారుగా పిలిచాడు భార్గవ్.
ఆనందంతో అతని మొహం వెలిగిపోతూ ఉండటం గమనించింది శిరీష. వేడి వేడి కాఫీ తీసుకొచ్చి భార్గవ్కి అందించి అతని పక్కనే సోఫాలో కూర్చొని ఏమిటన్నట్లు చూసింది.
"మొత్తానికి ఎలాగో మా బాస్ని ఒప్పించి సెలవు సంపాదించా! మన హానీమూన్ చాలా సరదాగా సెలెబ్రేట్ చేసుకుందాం. సిమ్లా, కులూ, మనాలీ ఈ వేసవిలో చూడ చక్కని ప్రదేశాలు. చాలా చల్లగా ఉంటుంది అక్కడ. కొన్ని చోట్ల మంచు కూడా కురుస్తుంది! మంచులో తడుస్తూ కబుర్లు చెప్పుకోవచ్చు. సరదాగా ఓ వారం రోజులు అక్కడ గడపవచ్చు. ఢిల్లీ వరకూ ఫ్లైట్ టికెట్లూ, అక్కణ్ణుంచి టాక్సీ, రూములూ మొత్తం అన్నీ బుక్ చేసేసాను. ఈ ఆదివారమే బయలుదేరుతున్నాం. బట్టలు అన్నీ సర్దు! అక్కడ మన హనీమూన్ చాలా రోమాంటిక్గా గడుపుదాం కలకాలం గుర్తుండిపోయేలా! తనివి తీరని తీయని అనుభూతులు మన సొంతం చేసుకోవచ్చు. అవి మన జీవితాంతం నెమరు వేసుకోవడానికి ఉపయోగపడతాయి." అన్నాడు భార్గవ్ చిలిపిగా ఆమె చెక్కిలి మీటుతూ.
అతని చేయి స్పర్శ తగలగానే ఆమె చెక్కిలి గులాబి వర్ణం దాల్చింది. సిగ్గుపడుతూ, "ఇప్పుడా! మన పెళ్ళై చాలా రోజులైంది కదండి, ఇప్పుడు హానీమూనా! ఎవరైనా నవ్వరూ?" అంది.
"సెలవు దొరకడానికి సమయం పట్టింది మరి! 'బెటెర్ లేట్ దెన్ నెవెర్’ అన్నారు కదా. మరేం ఆలోచనలు పెట్టుకోక. ఈ క్షణం నుంచి అన్నీ మర్చిపోయి కేవలం మన హానీమూన్ పైనే దృష్టి పెట్టాలి సుమా! ఆ తియ్యని అనుభూతులు మనసులో పదిలపరచుకోవాలి!" కొంటెగా ఆమె వైపు చూస్తూ చెప్పాడు భార్గవ్.
ప్రయాణానికి ఒక రోజు ముందు నుండే సెలవు పెట్టాడు భార్గవ్. ఆ రోజంతా తిరిగి జర్నీలో కావలసిన వస్తువులు అన్నీ కొనుక్కున్నారు. ఢిల్లీ వరకూ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ నుండి ముందే ఏర్పాటు చేసుకున్న టాక్సీ ఎక్కారు ఇద్దరూ. దారిలో మంచి హోటల్ కనిపిస్తే లంచ్ చేసి తిరిగి ప్రయాణ మయ్యారు. సిమ్లా చేరేసరికి అర్ధరాత్రైంది. టాక్సీ దిగేసరికి చలికి ఇద్దరూ గడగడ వణికిపోయారు స్వెట్టర్లు వేసుకున్నప్పటికీ.
"అమ్మో! మే నెలలో కూడా ఇంత చల్లగా ఉంటుందా!" ఆశ్చర్యపోయింది శిరీష.
"అందుకే కదా మనం ఇక్కడికి వచ్చింది! ఎండాకాలంలో కూడా శీతాకాలం అనుభూతులు పొందవచ్చు. శీతాకాలం అయితే అంతా మంచుతో కప్పబడి ఉంటుంది, మనం అడుగు పెట్టలేం." అన్నాడు భార్గవ్.
ఇద్దరూ చలికి వణుకుతూ లాడ్జిలోకి ప్రవేశించారు. రిసెప్షన్ కౌంటర్లో భార్గవ్ రూము రిజర్వు అయిన సంగతి చెప్పి తమ గది తాళాలు తీసుకున్నాడు. బాయ్ కారులోంచి వారి సామాన్లు తీసుకొని వాళ్ళ గదిలో పెట్టాడు.
“చాలా చల్లగా ఉందండి!" అంది శిరీష తమకు కేటాయించిన గదిలోకి ప్రవేశించగానే.
"చల్లగా ఉంటుందనేగా ఇక్కడికి వచ్చింది! మనమిద్దరమూ ఏకాంతంగా ఇక్కడుండగా చలిగిలీ అంతా ఎగిరిపోక ఏమి చేస్తుంది!" అన్నాడు భార్గవ్ ఆమె వైపు చూసి నవ్వుతూ.
సిగ్గుపడిన శిరీష చెక్కిళ్ళు అరుణ వర్ణం దాల్చాయి. ఆమెని అలా ఎంత సేపు చూసినా తనివి తీరలేదు భార్గవ్కి. భార్గవ ఇంక ఆగలేకపోయాడు. ఆ మధురమైన రాత్రి వాళ్ళకి ఎన్నో అనుభవాల్ని పంచింది. నిద్రపోయేసరికి ఎంత రాత్రైందో తెలియలేదు. కాలింగ్ బెల్ మోగడంతో మెలుకువ వచ్చి వాచీ చూసుకున్నాడు భార్గవ్. ఏడు గంటలు దాటింది. గబగబ లేచి వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా నవ్వుతూ విష్ చేసి టీ అందించాడు రూం బాయ్. టీ అందుకొని టీపాయ్పై పెట్టి శీరిషని నిద్ర లేపాడు.
బద్ధకంగా వళ్లు విరుచుకొని అరమోడ్పు కళ్ళతో భార్గవ్ వైపు చూసి, "అప్పుడే తెల్లారిందా?" అని మత్తుగా అడిగిందామె. ఆ ఫోజులో ఆమె చాలా అద్భుతంగా కనిపించింది భార్గవ్కి. చేతులతో ఆమెని చుట్టేసి, "ఎప్పుడో తెల్లారింది. లేచి త్వరగా ఫ్రెష్ అయితే ముందు టీ తాగుదాం, ఆనక బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్దాం." అన్నాడు.
"ముందు తమరు నన్ను విడిచిపెడితే!" అందామె బుంగమూతి పెడుతూ.
"ఓహ్...అలాగా!" అని ఆమె పెదవులు చుంబించి లేచాడతను.
ఆమె శరీరం ఒక్కసారి పులకించింది. వేడివేడి టీ కడుపులో పడేసరికి హాయిగా అనిపించింది. లేచి ఇద్దరూ తయారై గది బయటకు వచ్చారు. రెస్టారెంట్లో కూర్చున్నారు. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ పూర్తైయ్యేసరికి టాక్సీవాడు ఫోన్ చేసాడు. ఆ రోజు సాయంకాలం వరకు సిమ్లాలో చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. మండు వేసవిలో కూడా చాలా చల్లగా ఉందా ఆ ప్రదేశం. బజార్లో స్వెట్టర్లు, బ్లాంకెట్లు అమ్ముతున్నారు. కొత్త డిజైన్లలో ఉన్న ఆ స్వెట్టర్లు ఒకటి తన కోసం, ఒకటి భార్గవ కోసం కొంది శిరీష.
చూడవలసిన ప్రదేశాలన్నీ చూసి తిరిగి సాయంకాలం ఏడు గంటలైయ్యేసరికి హోటల్ చేరారు. కేండిల్ లైట్లో డిన్నర్ ముగించి కొద్దిసేపు హోటల్ లాన్లో తిరిగి రూం చేరుకున్నారు. మరునాడు కులూ, మనాలి ప్రయాణం కోసం అంతా సర్దుకొన్నారు.
"ఎలా ఉంది మన హానీమూన్ ట్రిప్!" నవ్వుతూ అడిగాడు భార్గవ్ పక్క మీద వాలుతూ.
"హనీమూన్ ట్రిప్పా!" అని నవ్వుతూ, "చాలా అద్భుతంగా ఉంది. ఈ జ్ఞాపకాలు మన మదిలో చిరకాలం పదిలంగా నిలిచిపోతాయి." అంది అరమోడ్పు కనులతో. మత్తెక్కించే ఆమె మోము చూసి ఇక ఆగలేకపోయాడు భార్గవ్.
వాళ్ళిద్దరిమధ్యా చాలా సేపు మౌనం రాజ్యమేలింది.
* * * * * * *
ఆ మరుసటి రోజు ఉదయాన్నే కులు, మనాలికి ప్రయాణమయ్యారు భార్గవ్, శిరీష. ఎత్తైన కొండల నడుమ ఘాటీలో ప్రయాణం చేస్తూంటే చాలా థ్రిల్లింగ్గా ఉంది. చుట్టూ ఎత్తైన పర్వతాలు. ఆ పక్కనే లోయలు, పైనుంచి దుమికే జలపాతాలు, పెద్దపెద్ద చెట్లు, ప్రకృతి చాలా రమణీయంగా, నిజం చెప్పాలంటే రోమాంటిక్గా ఉంది. సాయంకాలంకల్లా మనాలి చేరి రూములో బస చేసారు. వాళ్ళు బస చేసిన హోటల్ ఎదురుగా ఉన్న ఎత్తైన పర్వతం పైన కురుస్తున్న తెల్లటి మంచు లేలేత ఎండలో మెరుస్తోంది. వెండి కొండ అంటే ఇదేనేమో అనిపించేలా ఉంది.
ఆ రోజంతా మరెక్కడికీ తిరిగే కార్యక్రమం పెట్టుకోకుండా తొందరగా భోజనం ముగించి విశ్రాంతి తీసుకున్నారు. ఉదయమే వాళ్ళ టాక్సీ డ్రైవర్ వచ్చాడు. ఈ రెండు మూడు రోజుల్లో అతనితో బాగా పరిచయం ఏర్పడింది. ఆ రోజు కార్యక్రమం అంతా వివరించాడు. అక్కడున్న మూడు రోజుల్లో రొహ్తాంగ్, సొలాంగ్ వేలీ చూసారు. అక్కడ మంచు దిబ్బలపై కిందామీదా పడుతూ స్కేటింగ్ చెయ్యడం చాలా అద్భుతంగా ఉంది. ఇద్దరి మనసుల్లో ఓ కొత్త ఉత్తేజం నింపింది. సొలాంగ్ వేలీ వద్ద గుర్రంస్వారీ చెయ్యాలని భార్గవ్ ముచ్చట పడితే, శిరీష భయపడింది. మొదట భయపడినా, భార్గవ్ ధైర్యం చెప్పేసరికి ఆమె కూడా గుర్రం స్వారీ చేసింది.
కాకపోతే గుర్రంపైకి ఎక్కడం, మళ్ళీ కిందకి దిగడం చాలా కష్టంగా తోచింది. భార్గవ్ ఆమె నడుం పట్టుకొని గుర్రంపై కూర్చేబెట్టేసరికి కలిగిన చక్కిలిగింతకి కిలకిలా నవ్వింది. వెంట గుర్రం నడిపే వాడు ఉండబట్టి భయం తగ్గింది. ఆ గుర్రం స్వారీ చాలా సరదాగా అనిపించింది ఆమెకి. సాయంకాలం అయ్యేసరికి అలసి సొలిసి రూముకి తిరిగి వచ్చారు.
చివరి రోజు జోగినీ జలపాతం, వశిష్ఠ వేడి నీటి బుగ్గ లాంటి ఇంకా చాలా దర్శనీయ స్థలాలు చూసారు. బియస్ నదిలో రాఫ్టింగ్ చేస్తున్న వాళ్ళని దూరం నుండి భయంభయంగా చూసారు. అక్కడ ఇంతకు ముందు ప్రమాదం జరిగిన సంఘటన గుర్తుకు వచ్చి ఒళ్లు జలదరించింది. అక్కడికి దగ్గరలోనే భీముడి భార్య హిడింబా దేవి కోసం కట్టిన గుడి ఉంది. అక్కడే ఉన్న ఘటోత్కచుడి నిలువెత్తు విగ్రహం చూస్తూనే మాయాబజార్ సినిమా గుర్తుకు వచ్చింది భార్గవ్కి. ఆ విషయమే శిరీషకి చెప్పాడు.
"ఏమిటీ! హిడింబాదేవికి కూడా మందిరం ఉందా?" అని ఆశ్చర్యపోయింది ఆమె.
"అవును." అని, “ఈ కాలంలో అయితే సినిమా హీరోయిన్ల కోసం గుళ్ళు కట్టినవాళ్ళున్నారు కదా!" అని నవ్వాడు.
అక్కడున్న ప్రతీ క్షణం బాగా ఎంజాయ్ చేసారు భార్గవ్, శిరీష. స్వచ్ఛమైన వాతావరణం, చాలా చల్లగా ఉండే ఆ ప్రదేశం శిరీషకి బాగా నచ్చేసింది.
"ఎంత అద్భుతంగా ఉందీ చోటు. ఎంత సేపు ఇక్కడ గడిపినా తనివి తీరడం లేదు. ఎల్లప్పుడూ ఇక్కడే ఉండిపోతే ఎంత బాగుండును!" తన మనసులో మాట చెప్పింది.
"వేసవి కాలం, హానీమూన్ పేరు పెట్టుకొని వచ్చాం కానీ, అదే శీతాకాలమైతేనా, ఆ చలికి తట్టుకోలేక ఎంత వేగం ఇక్కణ్ణుంచి పారిపోదామా అని అనిపిస్తుంది.” నవ్వుతూ అన్నాడు భార్గవ్.
నిజమేననిపించింది శిరీషకి. అక్కడున్న వారం రోజులు క్షణల్లా గడిచిపోయాయి. ఇంటికి తిరిగి బయలుదేరే సమయం ఆసన్నమైంది. బ్యాగ్ సర్దుకుంటుండగా ఫోన్ వస్తే ఫోన్ ఎత్తింది శిరీష.
"రెండు రోజులనుండి ల్యాండ్ లైన్కి ఫోన్ చేస్తున్నా ఎత్తలేదు. సరేనని, సెల్కి చేసినా ఎత్తడం లేదు. ఒంట్లో ఎలా ఉందోనని, కంగారు పడి పక్కింటి శారద ఆంటీకి ఫోన్ చేస్తే మీరు సిమ్లా వెళ్ళారని చెప్పారావిడ. మాకు మాట మాత్రమైనా చెప్పకుండా అలా ఎక్కడికైనా వెళ్ళిపోతే ఎలా అమ్మా! మేము కంగారు పడిపోమా! అన్నయ్య అయితే సరే సరి! మీ ఫోన్ తగలకపోయేసరికి, వెంటనే ఫ్లైట్లో బయలుదేరడానికి రెడీ అయిపోయాడు. ఇలా చేస్తే ఎలా చెప్పమ్మా!..." అంటూ కూతురు దివ్య వాక్ప్రవాహం సాగుతూనే ఉంది శిరీషకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా.
భార్య మొహం చూసి విషయం గ్రహించిన భార్గవ్ ఆమె చేతిలోంచి ఫోన్ తీసుకొని, "అమ్మా దివ్యా! మేం హఠాత్తుగా ఈ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మరో రెండు నెలల్లో నా రిటైర్మెంట్ ఉంది కదా! సర్వీసులో చివరి ఎల్టిసి వాడుకొని ఇక్కడికి రావాలనిపించింది. మీకు మెసేజ్ పెడదామనే అనుకున్నాను, హడావుడిలో మర్చిపోయాను." అని కవర్ చేసాడు.
“అన్నయ్యకి కూడా ఫోన్ చేసి చెప్పు, కంగారు పడవద్దని. మేము రేపు ఉదయం ఇక్కణ్ణుంచి బయలుదేరి ఆదివారం కల్లా ఇంటికి చేరతాము." అన్నాడు భార్గవ్ ఫోన్ కట్టేస్తూ.
అతని వంక చిరుకోపంతో చూసింది శిరీష. "పిల్లలికి ఫోన్ చేసి ఇక్కడికి వస్తున్నట్లు చెప్పానన్నారు. చూడండి, ఇప్పుడు వాళ్ళు ఎలా కంగారు పడుతున్నారో! పెళ్ళైన కొత్తలో ఎవరైనా హనీమూన్ వెళ్తారు. హవ్వ, హవ్వ, హానీమూన్ పేరు చెప్పి ఇక్కడికి లాక్కొచ్చి పిల్లల చేత చీవాట్లు తినిపిస్తారా!" అంటు భర్త మీద అలిగింది ఆమె.
ఆమెని అలా అలకలో చూసేసరికి భార్గవ్కి భలే ముచ్చటేసింది. "అలకలో నువ్వు చాలా అందంగా ఉన్నావు సుమా!" అనేసరికి, "ఛీ...పొండి! మాట మార్చడం మాత్రం మా బాగా వచ్చు మీకు." అందామె సిగ్గుతో మెలికలు తిరుగుతూ.
"పెళ్ళైన కొత్తలో హానీమూన్ అందరూ వెళ్తారు. మనలా ఇలా లేటు వయసులో వెళ్ళి ఎంతమంది ఎంజాయ్ చేసి ఉంటారు? ఇది కూడా ఓ వెరైటీయే కదా! లేటు వయసులో ఘాటు ప్రేమ మనది. అప్పుడైతే కుటుంబ పరిస్థితులవల్ల, ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేకపోవటం వల్ల వెళ్ళలేక పోయినందుకు చాలా బాధపడ్డావు కదా! ఎలాగైనా, ఎప్పటికైనా నీ హానీమూన్ కోరిక నెరవేర్చాలని అనిపించి ఈ విధంగా ప్లాన్ చేసాను. తప్పంటావా!" అని అడిగాడు భార్గవ్.
"లేదు మహాశయా! రిటైరైన తర్వాత ఎలాగూ తీర్థ యాత్రలకు తీసుకెళ్తారు. ఇలా హానీమూన్కి రావడం నిజంగా వెరైటీయే!" అంది శిరీష తను కూడా ఒప్పుకుంటూ.
"ఇంతకీ ఎలా ఉంది మన మలి వయసు హానీమూన్ ట్రిప్?" అడిగాడు భార్గవ్ నవ్వుతూ.
"చాలా అద్భుతంగా ఉంది." అందామె మనస్పూర్తిగా.
మధురమైన అనుభూతులు మనసునిండా నింపుకొని ఆ మరుసటిరోజు తిరుగు ప్రయాణం అయ్యారు ఆ దంపతులిద్దరూ.
……………………
దివాకర్ల వెంకట దుర్గా ప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
Podcast Link:
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పూర్తిపేరు దివాకర్ల వెంకట దుర్గాప్రసాద్. పుట్టింది, పెరిగింది కోరాపుట్ (ఒడిశా) లో, ప్రస్తుతం నివాసం బరంపురం, ఒడిశాలో. 'డి వి డి ప్రసాద్ ' అన్నపేరుతో వందకుపైగా కథలు ప్రచురితమైనాయి. ఆంధ్రభూమి, హాస్యానందం, గోతెలుగు, కౌముది, సహరి అంతర్జాల పత్రికల్లోనా కథలు ప్రచురితమయ్యాయి. బాలల కథలు, కామెడీ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
Comments