top of page

అరుగు


'Arugu' - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy

'అరుగు' తెలుగు కథ

రచన: M R V సత్యనారాయణ మూర్తి

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

శివపురం లోని కన్యకాపరమేశ్వరి గుడి వీధి నుండి పెద్ద కాలవ కి వెళ్లి మంచి నీళ్ళు తెచ్చుకునేవారిని యిట్టె ఆకర్షిస్తుంది జోస్యుల వెంకన్న గారి అరుగు. వెంకన్న గారు పౌరోహిత్యం చేస్తారు. తండ్రి గంగాధరం గారు ఇచ్చిన ఐదు ఎకరాల పొలం జాగ్రత్తగా వ్యవసాయం చేస్తూనే పౌరోహిత్యం కూడా చేసుకుంటున్నారు. ఆయన ఇల్లు నాండ్ర వారి సందు లో ఉంటుంది. కానీ రోడ్డు మీద ఉన్న చిన్న పెంకుటిల్లు లో నాలుగు ఆవుల్ని మేపుతూ ఉంటారు. ఈ ఇల్లూ ఆయనదే. ఆవుల కోసం కొన్నారు.


ఈ పెంకుటింటికి వీధి వైపు గుమ్మం ఉండదు. సందులోనే గుమ్మం ఉంటుంది. కానీ వీదివైపు పదిహేను అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో పెద్ద అరుగు ఉంది. ఈ అరుగు చివర ఆనుకుని కూర్చోడానికి వీలుగా ఒక ఆర్చీ కూడా ఉంది. ఉదయం పూజ ముగించుకుని సైకిల్ ఎక్కి కాకిలేరు, కంతేరు గ్రామాలకు పౌరోహిత్యం పని మీద వెళ్తారు వెంకన్న గారు.

ఆయన్ని దూరాన్నుంచి చూడగానే ‘ఒరేయ, మన గణపతి గారు వచ్చేస్తున్నారు రా’ అని వేళాకోళం ఆడుకునేవారు రైతులు. వెంకన్న గారిది కొంచెం భారీ కాయం. పెద్ద పొట్ట, విశాలమైన మొహం, గంభీరమైన కంఠం. వాళ్ళలో వాళ్ళు ఏమనుకున్నా, ఆయన్ని చూడగానే నమస్కారంచేసి సాదరంగా ఆహ్వానిస్తారు పల్లె వాసులు. ఆయన్ని ‘వెంకన్న బాబు గారూ’ అనే పిలుస్తారు ఎదురుగా ఉన్నప్పుడు.


పూజలు, వ్రతాలు చేయించినా ‘నాకు ఇంత దక్షిణ ఇవ్వాలి మీరు’ అని ఏనాడూ ఆయన చెప్పలేదు. పని పూర్తీ అయ్యాకా, తాంబూలంలో దక్షిణ ఇవ్వకుండా, రెండు అరటి పళ్ళు పెట్టి ఇచ్చినా పట్టించుకోకుండా హృదయ పూర్వకంగా వారిని ఆశీర్వదించి ఇంటికి వచ్చేసేవారు. ‘పోనీలీ, వాళ్ళు ఏదో ఇబ్బంది లో ఉన్నారేమో, వాళ్లకు డబ్బు సర్దుబాటు అయినప్పుడే ఇస్తారు’ అని అనుకునే వారు.


మిగతా పురోహితులు ఈ విషయంలో ఆయన్ని విసుక్కునే వారు’నువ్వు ఎక్కడో అమాయకుడివిలా ఉన్నావ్, దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలి, పని అవగానే నాలుగు డబ్బులు తీసుకోవాలి. అంతేకానీ వాళ్ళే ఇస్తారు అనుకుంటే రోజులు గడవద్దూ’ అని హితవు పలికేవారు.


“భగవంతుడి దయ వలన నాకు ఐదు ఎకరాల పొలం ఉంది. పాడి ఆవులు ఉన్నాయి. అవి సరిపోతాయి. నా కుటుంబానికి. ఎదుటివాడు బాధపడుతూ ఇచ్చిన డబ్బు మనకి శ్రేయస్కరం కాదు” అని బదులు చెప్పేవారు, అల్ప సంతోషి వెంకన్న గారు. చిన్న పిల్లల మనస్తత్వం. సాయకాలం వేళలలో అరుగు మీద కూర్చుని దారి వెంట వెళ్ళే చిన్న పిల్లల్ని పిలిచి, తన పక్కనే పెట్టుకున్న సంచీ లోంచి, నిమ్మ తొనల బిళ్ళలు తీసి ఇచ్చేవారు. అవి తింటూ ఆనందంగా వెళ్ళే పిల్లల్ని చూసి చాలా సంతోష పడేవారు.


వెంకన్న గారికి చాలా కాలానికి గాని పిల్లలు కలగలేదు. అప్పుడు చెల్లెలు పిల్లాడిని తెచ్చి పెంచుకున్నారు. ఆ తర్వాత కొంత కాలానికి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి కలిగారు. మేనల్లుడిని తన దగ్గరే పెట్టుకుని చదువు చెప్పించి పెద్దవాడిని చేసారు.


సాయంత్రానికి సబ్బెల్ల పుల్లారెడ్డి, చాట్రాది వీరన్న నాయుడు, కాకిలేరు రామా రావు వెంకన్న గారి అరుగు మీదకు చేరేవారు.. ఊళ్ళో విషయాలు అన్నీ అక్కడ చర్చకు వచ్చేవి. అదే సమయంలో ఎవరైనా ముహూర్తాల కోసం వస్తే లోపలకు వెళ్లి వారి పని చూసి, మళ్ళీ వచ్చి అరుగు మీద కూర్చునే వారు వెంకన్న గారు.


అరుగు చివర కుర్చీలా ఉన్న చోటు ఆయనదే. అక్కడ ఎవరూ కూర్చునే వారు కాదు. రాత్రి ఏడుగంటలు కాగానే అరుగు దిగి లోపలకు వెళ్ళిపోయేవారు వెంకన్న గారు. తిరిగి వచ్చేవారు కాదు. అప్పుడు అరుగు మీద చర్చలు వేరే రకంగా ఉండేవి.


ఊళ్ళో పేకాటలు ఎక్కడ జరుగుతున్నాయి, ఎవడు ఎంత పోగొట్టుకున్నాడు అన్నీ చర్చకు వచ్చేవి.


“ఏమయ్యా వీరన్న నాయుడూ, మొన్న కోడి పందేల దిబ్బ మీద పెకాడుతున్న వాళ్ళ కోసం పోలీసులు వచ్చారంటగా? ఎం జరిగింది?” సిగరెట్ వెలిగించి అడిగాడు సబ్బెల్ల పుల్ల రెడ్డి.

“భలేవారే రెడ్డి గారూ, ఆల్లు పోలీసులు కాదు”అన్నాడు వీరన్న నాయుడు.


సిగరెట్ గట్టిగా దమ్ము లాగి ‘మరి ఎవరు?’ ఆసక్తిగా అడిగాడు పుల్లారెడ్డి.


“మన జమీందారు గారి స్కూల్ లో పడవ తరగతి చదువుతున్న పిల్లలు, స్కౌట్ డ్రెస్ వేసుకుని, లాఠీలు పుచ్చుకుని వెళ్ళారంట. దూరాన్నుంచి వాళ్ళని చూడగానే పోలీసులు అనుకుని డబ్బులు, పేక ముక్కలు అక్కడే వదిలేసి పారిపోయారంట. పిల్ల కాయలు ఆ డబ్బులు తీసుకుని సాయంకాలం పాలకొల్లు వెళ్లి ‘లీలా మహల్’ లో ఎన్టీ వోడు సినిమా, చూసి వచ్చారంట” నెమ్మదిగా చెప్పాడు వీరన్న నాయుడు.


“అమ్మో, పిల్ల గాళ్ళు చదువు కోకుండా ఈ పనులేమిటి? దురంతం కాకపొతే?”అన్నాడు పుల్లా రెడ్డి.

ఎనిమిది అవగానే నాయుడు, పుల్లా రెడ్డి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్లి పోయారు.


అప్పుడు రెండో బాచ్ అరుగు మీద చేరుతుంది. ఇది పూర్తిగా కుర్ర బాచ్. వెంకన్న గారి గోశాల పక్కనే ఉన్న డాబాలో ఉంటున్న సుబ్రహమణ్యం మాస్టారి అబ్బాయి రామమూర్తి, వెంకన్న గారి మేనల్లుడు పేర్రాజు, రైస్ మిల్ గుమస్తా రామచంద్ర రావు గారి అబ్బాయి సుధాకర్, పూజారి వెంకటరావు గారి అబ్బాయి సుబ్రహ్మణ్యం, భూమి తనఖా బ్యాంకు మేమేజర్ గారి అబ్బాయి చంద్రశేఖర్, దీక్షితులు గారి మనవడు రామకృష్ణ. వీళ్ళంతా రెండో ఆట సినిమా చూసే ప్రబుద్ధులు. ఎప్పుడూ మొదటి ఆట సినిమాకి వెళ్లరు.


భోజనాలు చేసి వెంకన్న గారి అరుగు మీద చేరి సినిమాల గురించి, ఊళ్ళో రిహార్సల్సు వేస్తున్న నాటకాల గురించి, లక్ష్మి సిస్టర్స్ రికార్డింగ్ డాన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు.

పదకొండు దాటాకా గాంధీ బొమ్మల సెంటర్ దగ్గర ఎస్వి. రెడ్డి కిళ్ళీ కొట్టుకి వెళ్లి నారింజ క్రష్ తాగి వస్తారు. వర్షా కాలం అయినా సరే ‘నారింజ క్రష్’’ తాగి రావాల్సిందే. నారింజ కాయ రసంలో గోలీ సోడా వేసి అందులో పంచదార కావాల్సిన వాళ్లకు పంచదార, ఉప్పు కావాల్సిన వాళ్లకు ఉప్పు కలిపి ఇస్తాడు రెడ్డి గారి బావమరిది నాగిరెడ్డి. ఈ జట్టుని చూస్తె నాగిరెడ్డి కి భలే ముచ్చట వేస్తుంది.


ఎప్పుడూ ఆరుగురూ కలిసి వస్తారని, . సరదాగా జోకులు వేస్తారని. రెండవ ఆట సినిమాకి వేల్లవలిసి వస్తే, తొమ్మిదిన్నరకే కిళ్ళీ కొట్టు దగ్గరకు వచ్చి ‘నారింజ క్రష్’ తాగి వెళ్తారు. సినిమా ఇంటర్వెల్ లో, టీ తాగుతారు అందరూ, రామమూర్తి తప్ప. అతను టీ తాగడు. సినిమా అయ్యాకా ఇళ్ళకు వెళ్ళిన వారిలో ఎవరికైనా, ఇంట్లో వాళ్ళు తలుపు తియ్యకపోతే, వెంకన్న గారి ‘అరుగే’ శరణ్యం. అక్కడే నిద్రపోయి ఉదయం లేచి ఇళ్ళకు వెళ్తారు.


ఆదివారాలప్పుడు వెంకన్న గారి అరుగు పిల్లలతో సందడిగా ఉంటుంది. ఆ వీధిలోని పిల్లలు అరుగు మీదే ‘వైకుంఠ పాళీ’ ‘అష్టా చెమ్మా’ ఆడుకుంటారు. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు సుద్దముక్కతో గీసి ‘దాడి’ ఆట ఆడుకుంటారు. అరుగు కి ముందు పదిహేను అడుగుల ఎత్తులో ఒక ‘బాదంచెట్టు’ ఉంది. దాని నీడ అరుగు మీదకు వచ్చి చల్లగా ఉంటుంది. వెంకన్న గారు అరుగు దగ్గరకు వచ్చి పిల్లలు అందరకీ ‘నిమ్మ తొనలు’ బిళ్ళలు ఇచ్చి కాసేపు వాళ్ళతో మాట్లాడి లోపలకు వెళ్ళిపోతారు.


కాలవకు వెళ్లి మంచి నీళ్ళు తెచ్చుకునే ఆడాళ్ళు, అరుగు మీద పిల్లల్ని చూసి చాలా సంతోషించి వెళ్తారు. వీరన్న నాయుడు బాదం చెట్టు దగ్గర నిలబడి తనకి వచ్చిన పద్యాలు పాడేవాడు. అందులో కొన్ని తప్పులు ఉండేవి. అవి విని పిల్లలు నవ్వుకునే వారు. నిజానికి నాయుడికి పద్యాలు బాగా వచ్చు. కానీ పిల్లల్ని నవ్వించడానికే ‘తప్పు’ పాడు తున్నాడని వాళ్లకి తెలియదు.


*****


ధనుర్మాసం వచ్చిందంటే ఆడపిల్లలు అరుగు మీద చేరిపోయేవారు, గొబ్బిళ్ళు పెట్టుకోవడానికి, ఆవుపేడ కోసం. వెంకన్న గారి భార్య సత్యవతమ్మ గారు, పిల్లలు అందర్నీ లైను లో నిలబడమని చెప్పి, పాలేరు చేత అందరికీ ఆవుపేడ ఇచ్చేవారు. అలాగే భోగి పండుగ ముందు రోజు కూడా కొంతమంది మగ పిల్లలు వచ్చేవారు భోగి పిడకల దండల కోసం. సత్యవతమ్మ గారు పాలేరు చేత, భోగి పిడకలు తయారు చేయించే వారు.


ఆవిడే స్వయంగా ఆ పిడకల్ని చిన్న చిన్న దండలు కట్టి, వచ్చిన వాళ్లకు ఇచ్చేవారు. కన్యకా పరమేశ్వరి గుడి వీధి, కొవ్వూరి వారి వీధి, లింగాల వీధి లో ఎవరికీ ఆవులు లేవు. అందుకే అందరూ వెంకన్న గారి గోశాల దగ్గరకి వస్తారు ఆవు పేడ కోసం, భోగి పిడకల దండల కోసం.

ఫిబ్రవరి నెల వచ్చింది. ఓ సోమవారం నాడు. సుబ్రహ్మణ్యం గారి భార్య యశోదమ్మ గారు పూజ ముగించుకుని హాలు లోకి వచ్చారు. రామమూర్తి స్కూల్ లో ఉద్యోగానికి వెళ్ళాడు. పిల్లలు బడికి వెళ్ళారు. సుబ్రహ్మణ్యం గారు పేపర్ చదవడానికి లైబ్రరీ కి వెళ్ళారు. పాల గ్లాసు తెచ్చి బల్ల మీద పెట్టి, కుర్చీ లో కూర్చున్నారు. ఇంతలో ‘దభీ’ మని చప్పుడు వినపడింది వీధిలో. గబ గబా బయటకు వచ్చారు.


రోడ్డు మీద ఒక యువతి పడిపోయిఉంది. దగ్గర లోనే ఒక బకెట్ నెల మీద పడిపోయి ఉంది, అందులోని తడి బట్టలు కింద పడిపోయాయి. యశోదమ్మ గారు ఆ యువతి దగ్గరకు వెళ్ళారు. కాలవ నుంచి వస్తున్న సింహాచలం ‘అయ్యో అయ్యో.. మంగా’ అంటూ ఆమె దగ్గరకు వచ్చింది.

యశోదమ్మ గారు, సింహాచలం కలిసి ఆ అమ్మాయిని లేవదీసి వెంకన్న గారి అరుగు మీద పడుకో బెట్టారు. యశోదమ్మ గారు ఇంట్లోకి వెళ్లి గ్లాసు తో నీళ్ళు తెచ్చి, మంగ మొహం మీద కొద్దిగా చల్లారు. ఒక నిముషానికి మంగ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. కానీ లేవలేక పోయింది. ఆమెని అలా చూసి సింహాచలం బోట బోటా, కన్నీళ్లు కార్చింది.


“ఏమయ్యింది?” అడిగారు యశోదమ్మ గారు సింహాచలాన్ని. చీర చెంగుతో కళ్ళు వత్తుకుంది సింహాచలం.


“ఏం చెప్పమంటారు అమ్మగారు. దీని అత్త, దీనికి సరిగా తిండి పెట్టడంలేదు. దీని మొగుడేమో, డబ్బు సంపాదించడానికి ‘దుబాయ్’ వెళ్ళాడు. మావగారు పెళ్ళాం మాటకు ఎదురు చెప్పలేడు. ఇవాళ ఉదయం టీ కూడా ఇవ్వలేదట, దీని అత్త. పాలు పిల్లి తాగేసిందని చెప్పిందంట. మాయదారి పీనుగ. పైగా బకెట్ బట్టలు ఇచ్చి కాలవకి వెళ్లి ఉతికి తెమ్మని చెప్పిందంట. కడుపులో టీ చుక్క కూడా పడకుండా, ఇన్ని బట్టలు ఉతికింది. ఇప్పుడు పది గంటలు అయ్యింది. నీరసం వచ్చి పడింది” అంది బాధగా సింహాచలం.


యశోదమ్మ గారు వెంటనే ఇంట్లోకి వెళ్లి, తను తాగడానికి పెట్టుకున్న పాల గ్లాసు తీసుకు వచ్చింది. , సింహాచలం మంగని నెమ్మదిగా లేపి కూర్చుండ బెట్టింది. యశోదమ్మ గారు పాల గ్లాసు మంగ మూతి దగ్గర పెట్టి ‘తాగమ్మా’ అంది. మంగ నెమ్మదిగా కళ్ళు తెరిచి పాలు తాగసాగింది. అపుడు చూసింది సింహాచలం, యశోదమ్మ గారిని.


ఆవిడ ఇంకా ‘మడి ‘ బట్టతోనే ఉన్నారని, “అమ్మగారూ, మీరు ఇలా?.. ”కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా అంది సింహాచలం. ఆవిడ ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా మంగకి పాలు తాగించసాగింది. రెండు నిముషాలకు మంగ పాలు తాగడం పూర్తీ అయ్యింది. మంగ కొంచెం కదుట పడింది యశోదమ్మ గారిని చూసి కంగారు పడింది. కొంచెం పక్కకు జరగా బోయింది. యశోదమ్మ గారు వారించారు


‘కాసేపు విశ్రాంతి తీసుకో. నీరసం తగ్గుతుంది’అన్నారు ఆప్యాయంగా. మంగని గోడకు చేరబెట్టి, కింద పడిపోయిన తడి బట్టల్ని బకెట్ లో సర్ది బాదం చెట్టు దగ్గర పెట్టింది, సింహాచలం. మంగ మొహానికి పట్టిన చెమటని, తన చీర చెంగు తో తుడిచారు యశోదమ్మ గారు. మంగ కళ్ళల్లో సన్నటి కన్నీటి పోర కదిలింది.


“బాధ పడకమ్మా. పరిస్థితులు అవే చక్కబడతాయి. ధైర్యంగా ఉండు”అని యశోదమ్మ గారు అనునయంగా.


“అమ్మగారూ, మీరు ‘మడి ‘ లో ఉండి కూడా. వచ్చి నాకు సాయం చేసారు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నన్ను మన్నించండి “అని రెండు చేతులూ జోడించింది మంగ.

“మనిషి కన్నా, ‘మడి’ ఎక్కువ కాదమ్మా. ఆచారం కొంత వరకే. కానీ అది మూర్ఖంగా, అసహాయ స్థితి గా ఉండకూడదు. అన్నింటి కన్నా ముఖ్యం, మానవత్వం. అది లేనప్పుడు మనిషి తనానికి అర్ధం ఉండదు ‘ అన్నారు గంభీరంగా.


ఐదు నిముషాలు విశ్రాంతి తీసుకున్నాకా, ఇద్దరూ యశోదమ్మ గారికి దణ్ణం పెట్టి, బట్టలు ఉన్న బకెట్లు తీసుకుని ముందుకు కదిలారు. యశోదమ్మ గారు ఒక మంచి పని చేసానన్న సంతృప్తి తో ఇంట్లోకి వెళ్ళారు.


******

కాలగర్భంలో ముప్ఫై ఏళ్ళు గడిచాయి. వెంకన్న గారు, సత్యవతమ్మ గారు చనిపోయారు. వెంకన్న గారి అబ్బాయి ‘సుబ్రహ్మణ్యం’, ఆవులు ఉండే గోశాల తీసేసి, రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. అతనూ పౌరోహిత్యం చేస్తున్నాడు. అతని కోసం వచ్చే వాళ్ళతో బిల్డింగ్ సందడిగా ఉంటోంది.


అయితే, కాలవు వెళ్ళే వారు, ‘అరుగు’ తో ఉన్న తీపి గురుతులూ, మధురమైన జ్ఞాపకాలు తలుచుకుంటూ ముందుకు సాగుతున్నారు ఇప్పటికీ.

******

M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V


ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసార‌మయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








66 views1 comment

1 Comment


@mrvsmurthy311 • 7 hours ago

రచయిత భావాలను మీ గొంతులో చక్కగా పలికించారు.. ధన్యవాదాలు సార్

Like
bottom of page