top of page
Original.png

థాంక్ యు శ్రీ


సముద్రపు రాయితో చేసిన చిన్న గొలుసును రాధకు అందిస్తున్న టీనేజ్ విద్యార్థి శ్రీ

Thank You Shree - Telugu Love Story | Srikanth

థాంక్ యు శ్రీ తెలుగు ప్రేమ కథ | శ్రీకాంత్

Published in manatelugukathalu.com on 18/08/2026


“థాంక్ యు శ్రీ” కథ ఒక టీనేజ్ బాలుడి జీవితంలో స్నేహం, తొలి ప్రేమ, ఆత్మవిశ్వాసం, చెప్పలేని భావాలు ఎలా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయో హృద్యంగా ఆవిష్కరిస్తుంది. సాధారణమైన పాఠశాల రోజులు, స్నేహితులతో సైకిల్ ప్రయాణాలు, వీధి కుక్కతో అనుబంధం, ఊరి మనుషుల మాటలు, కుటుంబపు చిన్న చిన్న సంఘటనల మధ్య కథానాయకుడు తనలో జరుగుతున్న మార్పును గమనిస్తాడు.

సముద్రపు ఒడ్డున ఒంటరిగా కూర్చున్న సమయంలో తన చుట్టూ ఉన్న మనుషుల మాటలు, చూపులు, ప్రవర్తనల వెనుక దాగి ఉన్న భావాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. మనసులో ఉన్న మాటను బయటకు చెప్పాలనే తపన మనిషి సహజ స్వభావం అని తెలుసుకున్న ఆ క్షణమే అతనిలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం పుడుతుంది. ఆ ధైర్యంతో రాధను కలిసిన శ్రీ, తన మనసులోని భావాన్ని మాటల్లో కాకుండా ఒక చిన్న నీలిరంగు సముద్రపు రాయి ద్వారా వ్యక్తం చేస్తాడు. ఆమె చిరునవ్వుకు ప్రతిగా తనలో మొదటిసారి కనిపించిన ఆనందం, చివర్లో వినిపించే “థాంక్ యు శ్రీ” అనే మూడు మాటలను మరపురాని అనుభూతిగా నిలబెడుతుంది.


"ఈసారి పంక్చర్ అయితే టైర్ మార్చాలి” అన్న మాటలు తటాలున నన్ను మాలోకం నుండి బయటపడేసాయ్. సరేనని బదులిచ్చాను, నాలుగు రోజుల ముందు అదే షాపులో రిపేరు చేయించుకుని తిరిగొస్తుండగా మనసు పడిన వేదన గుర్తొచ్చింది. 


అదొక చిన్నపాటి యుద్ధం. రెండు పక్షాలు నావే, గెలుపు ఎవరిదో తేల్చాల్సిన బాధ్యత కూడా నాదే. ఉన్నట్టుండి రాధ కళ్లు నన్ను చూస్తున్నట్టనిపించింది. 


“ఇపోయింది.. సైకిల్ పట్టుకెళ్లు! డబ్బులెందుకే, మొన్న రిపేరుకిచ్చావ్ గా” అని మెకానిక్ అంకుల్ అన్నాడు.


మాటలో పెళుసు, ముఖంలో భావం రెండూ లేవు. ఏవో ఇంట్లో వాళ్ళ మాటలు లాగా అనిపించాయి. సూరి వాళ్ళ నాన్న షాప్ అది. వాడు కూడా ఖాళీ సమయంలో అక్కడే పనిచేస్తుంటాడు. స్కూల్ లో చేరినప్పటినుండి నా పక్కనే కూర్చుంటాడు. 


పట్నం నుండి 6 ఏళ్ల క్రితం ఊరొచ్చారు, వాళ్ళ పెద్దబ్బాయి రైల్వే స్టేషన్ తొక్కిసలాటలో చనిపోయాక ఎందుకో అక్కడ ఉండాలనిపించలేదట. టౌన్ 10 km ఏ అయినప్పటికి, వీళ్ళది సైకిల్ రిపేరు షాపు అయినప్పటికీ ఊర్లో ప్రతి బైక్, ప్రతి కార్ రిపేరుకి ముందు వీళ్ళ దగ్గరికొస్తుంది.


“సైకిల్ ఓనర్ గారూ కాఫీ బైట్ తీస్కొండి” మాట ముందొచ్చి వికాస్ గాడు వెనకాలే వచ్చాడు పక్కనున్న కొట్టునుండి. చాక్లెట్ చేతికిస్తూ అన్నాడు, “కేవలం ఇంటి నుండి స్కూల్ కి మాత్రమే తిరుగుతున్నా, పదే పదే పంక్చర్ అవ్వడానికి కారణం ఏమయిఉంటుంది” అని కొంటెగా. 


ఇద్దరికీ పరిచయం ఉన్న నవ్వు నాలుగు కళ్ళకి తారసపడింది. సైకిల్ తీస్కుని ఇద్దరం ఇళ్ళకి బయల్దేరాం.


ఆరోజు ఇండియా మ్యాచ్! సెహ్వాగ్ సెంచురీ కొట్టాడో లేదో అని వికాస్ గాడు అన్న వెంటనే ఇద్దరం వేగం పెంచి తొక్కడం మొదలెట్టాం. గుడి వీధి దాటగానే తెలిసిన గొంతు ఒకటి వినపడింది. పరిగెత్తుకుంటూ ఇద్దరి సైకిళ్ళ మధ్యలోకి వచ్చింది వీధికుక్క స్నూపీ. మీకోసమే ఉదయం నుండి వెయిట్ చేస్తున్నాను అన్నట్టు తోక ఊపుతూ.. 


ఇద్దరం పక్కగా ఆపాం. లంచ్ బాక్స్ లో మిగిలిన అన్నాన్ని స్నూపీ కి పెడుతూ వికాస్ గాడు ఆరోజు సోషల్ క్లాస్ లో సూరి గాడి ప్రశ్న కి కిశోర్ సర్ ఇచ్చిన సమాధానం గురించి మాట్లాడుతున్నాడు. “సూరిగాడు అడిగిన ప్రశ్న నాకు అర్ధం కాకపోయినా కిశోర్ సర్ ఇచ్చిన సమాధానం నాకు నచ్చలేదు. అనవసరంగా వాడి మీద కసురుకున్నాడు” 


తర్వాత పాఠం నుండి divert అయి, తన బి. ఏ చదువు అయిపోయాక పడ్డ కష్టాలు, ఎలా తను ఈ టీచర్ ఉద్యోగం సంపాదించాడో 67 వ సారి విపులంగా చెప్పాడు మన కిశోర్ మాష్టారు”. 


బౌ బౌ అన్నాడు స్నూపీ గాడు చెప్పేది అర్ధమైనట్టు.


మా నవ్వులు ఒక్కసారిగా మాయమయ్యాయి.. అటువైపుగా వస్తున్న సుబ్రమణ్యం అంకుల్ ని చూసి. 


వెంటనే స్నూపీ ని సాగనంపి చక చకా అంకారావు కొట్టు వీధి వైపు రూట్ మార్చాం. ఆయన కంట పడ్డామంటే నేరుగా ఇంటికి పోయి చాడీలు మొదలెడతాడు. మీ అబ్బాయి రోడ్డు మీద అడ్డమైన కుక్కలతో సావాసం చేస్తున్నాడని, మన పిల్లలు ఇలాగ అవ్వట మేమిటని. 


అదేంటో తెలియదు, ఆయన అవే మాటలు ఎప్పుడూ అంటూంటాడు గుడి దగ్గర కూర్చుని, అవతల వ్యక్తితో సంబంధం లేకుండా.... సందర్భం తో పనిలేకుండా. 


“వాళ్ళంతే నండీ” “అప్పట్లో లెక్క వేరే” “అదే నేనైతే నా!” ఆయన మాటలు వినే వాళ్ళు కూడా ఏదో గొప్ప మాట విన్నట్టు తల ఊపుతూ ఉంటారు. 

గుడి దగ్గర వినపడేవన్నీ మంచి మాటలే అని కాబోలు! ఎందుకో తెలియదు, ఆయనంటే నాకు వొళ్లు మంట.

అదృష్టవ శాత్తు ఈసారి ఆయన కంట పడలేదు. మసీదు మట్టి రోడ్డు దాటి మళ్ళా ఇంటి వైపుకు మరలాం.


“రేపు శనివారం రా”... స్కూల్ కి కొత్త చొక్కా (స్పైడర్ మ్యాన్ ది) వేసుకొద్దామనుకుంటున్నా కానీ మా నాన్న దసరా ముందు దాకా చొక్కా మీద చేయి వేస్తే వాత పెడతా అన్నాడు. ఏదోకటి చేసి వేసుకోవాలి.

ఇంతకీ రాధ తో మాట్లాడావా...?”


 ఇంతలో వాడు వెళ్లాల్సిన వీధి వచ్చింది....సరే అని 6:30 కి శ్రీను వాళ్ళ ఇంటి వెనకకు రమ్మని, శ్రీను కొత్త వాలీబాల్ కొన్నాడని చెప్పి వెళ్ళిపోయాడు.


రాధ గత శనివారం నన్ను అడిగిందని, ఎందుకు ఆరోజు క్లాస్ కి రాలేదని వాకబు చేసిందని వికాస్ నాకు ఇంతకుముందే చెప్పాడు. 


ఆ శనివారం నేను మా అమ్మ మేనమామ మనవడి బారసాల ఫంక్షన్ కి వెళ్లాల్సి వచ్చింది. ఎదుగుతున్న పిల్లలు బంధువులతో కలుస్తుండాలని మా అమ్మ లాయరు పాయింటు. 


ఆరోజంతా పెద్ద ఘట్టం. ఉదయం 8 కి తయారయ్యి బస్సు కోసం వెయిట్ చేయడానికి వెళ్ళాం. సూరి వాళ్ళ షాప్ దగ్గరే బస్ స్టాప్. వాళ్ళ నాన్న బండి బయటకు తీసి సీట్ తుడుస్తున్నాడు. 


ఇంతలో సూరి బయటకు వచ్చాడు స్కూల్ సరంజామాతో. వాళ్ళమ్మ కూడా బయటకి వచ్చారు అనవసరం అనుకోకుండా.. మమ్మల్ని చూసి పెద్ద నవ్వు నవ్వి లోపలనుండి ఒక చిన్న బాక్స్ తో మా వైపుకి వచ్చింది.. మా అమ్మ నాన్న సొగం నవ్వుతో పలకరించారు. 


ముందురోజు పండగ అవడంతో చేసిన లడ్డూల్ని నాకోసం తెచ్చారు ఆంటీ. నేను ఆ బాక్స్ తీస్కుని సూరి వైపు చూశాను.. ఎప్పుడూ ఆప్త మిత్రుల్లా మాట్లాడుకునే మేము నోరు మెదపకుండా మాట్లాడుకున్నాం. ఆలోగా వాళ్ళ నాన్న బండి తేవడంతో సూరి చెయ్యి ఆడిస్తూ వెళ్ళిపోయాడు.


ఇల్లు చెంత చేరడంతో నా ఆలోచనలకు బ్రేక్ పడింది.. టైమ్ 5:45 అవుతుంది. సైకిల్ బయటపెట్టి ఇంటి మెట్లు ఎక్కుతుండగా ఎందుకో తెలియని చిన్న ఆనందం... 


ముందు వారం ఫంక్షన్ లో చాలా సార్లు కళ్ళు ఎగరేసానని (eye rolling) ఏమో, మా అమ్మ నాకు ఆఫీషియల్ గా టీనేజ్ స్టేటస్ ఆపాదించి ఆరోజు నుండి కాఫీ, టీ తాగొచ్చని చెప్పింది. 


ఉదయం కాఫీ ఉల్లాసం, ఇప్పుడెమో టీ ఆర్భాటం. అమ్మ వెంటనే కుశల ప్రశ్నలతో సమయం వృధా చేయకుండా మొహం కడుక్కురమ్మని సెలవిచ్చారు. టీ తో పాటు పచ్చిపప్పు వడలు చూసిన నా మనసు ఎగిరి గంతేసి టమాటా పచ్చడి కోసం వెతికింది. 


నాలుగు వడలు నాలుగు పావుల నిండైన ఆనందం అందించాయి. టైమ్ 6:30.. వెంటనే శ్రీను ఇంటి వైపు వెళ్తున్న అని ఇంట్లో చెప్పి కదిలాను.


శ్రీను వేరే స్కూల్ నుండి ఈ సంవత్సరం మా స్కూల్ లో జాయిన్ అయ్యాడు. వాళ్ళ నాన్న MRO, మా ఇంటికి రెండిళ్ళ అవతలే వాళ్ళుండేది. అందరితో కలిసిపోయే స్వభావం శ్రీనుది. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటి వెనుక ఖాళీ స్థలంలో కలుస్తుంటాం. 


నేను చేరుకునేటప్పటికే వికాస్, శ్రీను తో పాటూ మరొక ఇద్దరు వాలీబాల్ తో ఆడుతూ కనపడ్డారు.. నేను నేరుగా ఆట లో చేరకుండా పక్కనే కూర్చుని చూస్తున్నాను. 


కొంత సేపటికి అటుగా తన గోలి సోడా బండి తోసుకుంటూ జానీ బాబాయి కనపడ్డాడు. శ్రీను సోడా కోసం ఆయనని పిలిచి నిమ్మ సోడా ఇమ్మని డబ్బులు తేవడానికి ఇంటి లోపలికి వెళ్ళాడు. వికాస్ వాలీబాల్ తో ఒక్కడే ఆడుతూ ఉండగా షాట్ మిస్ అయ్యి సోడా బండి పక్కగా వెళ్ళి ఆగిన బాల్ ని జానీ బాబాయి తీస్కుని సర్వ్ చేశాడు.. 


బాల్ ఉన్నట్టుండి పైకి లెగిచి రామబాణాన్ని వాయు దేవుడు కిందకి అదిమినట్టు కిందకి దిగి గమ్మత్తుగా వికాస్ దగ్గరికి చేరింది.. దానిని ఫ్లోట్ సర్వ్ అంటారని, దానిని రిటర్న్ చేయటం చాలా కష్టం అని సోడా బండి జానీ చెప్ప సాగాడు. 


ఏవిధంగా తన స్కూల్ టైమ్ లో డిస్ట్రిక్ట్ లెవెల్ వాలీబాల్ గేమ్స్ లో గెలిచాడో, అందరూ తనని ఎలా మెచ్చుకునేవారో చెప్పాడు. ఇంతలో మా ఇంటి పక్కన ముసలావిడ వాళ్ళ మనమడితో సోడా కోసం కబురు పంపడంతో జానీ నిమ్మ సోడా డబ్బులు తీస్కుని వెనుదిరిగాడు. 


వికాస్ గాడు నార్మల్ వాలీబాల్ బోర్ అని.. కొత్త తరహా గేమ్ ఒకటి కనిపెట్టాన ని చెప్పి దాని రూల్స్, పాయింట్స్ చెప్ప సాగాడు. నేను కూడా ఆడటం మొదలుపెట్టాను.


8:20 కి ఇంటికి చేరాను.

రాత్రి భోజనం చేస్తుండగా పొద్దుటి తోటకూర పులుసుకూర కలుపుకుంటూ నాన్న మర్నాడు పొద్దున్న నేను చేయాల్సిన పనిని మళ్ళా గుర్తుచేశాడు. వినాయక చవితి అయి 7 రోజులు ఇందని ఇంటిలో పూజించిన  గణపతి ని నిమర్జనం చేయాలని ముందు రోజే నాకు చెప్పారు. 

మా ఊరుకి 2.5 km దూరం లో బీచ్. అందులో నిమర్జనం చేయమని చెప్పారు. నేను సరే అన్నట్టు తలూపాను.. వికాస్ గాడు కూడా నాతో వస్తున్నాడన్న సంగతి ఎందుకో చెప్పాలనిపించలేదు.


ఆరోజు ఉదయం 6:00 లేచి అమ్మ ముందే సర్ది ఉంచిన గణపతి ఉన్న సంచి ని జాగ్రత్తగా సైకిల్ వెనక పెట్టి బీచ్ వైపు స్టార్ట్ అయ్యాను. బీచ్ లోకి వెళ్ళాక ఎందుకో గణపతి బొమ్మ ని మాత్రం సముద్రం లో విడిచి మిగతా పూజ సామగ్రి అంతా చెత్తబుట్ట లో వేశాను .... 


వికాస్ ఇంకా రాలేదు.... బీచ్ లో కూర్చున్నాను సూర్యోదయం అవుతుందని తెలుస్తుంది. ఇసుకలో గమ్మత్తుగా కూరిన నా పాదాల నుండి నాలోకి సముద్రం ప్రవహిస్తున్నట్టుంది. అలల హోరు గట్టిగా ఉన్నా తెలియని నిశబ్దం ఆవరించింది 


మనసులో. గత శనివారం బస్సు లో వెళుతుండగా బస్సు కిటికీ నుండి కనపడిన సముద్రమే ఇప్పుడెంత వేరుగా కనడుతుంది!! బస్సు ఎక్కిన వెంటనే జనాలు మాటలతో కాక కళ్ళతో చాలా ప్రశంసించటం మూలాన కాబోలు ఎప్పుడు బస్సు ఎక్కినా తెలియని ఆందోళన. 


జనాలు ఒంటరిగా ఉన్నప్పుడు గుంపుకోశం, అందరూ కలిసున్నప్పుడు ఒంటరిగా ఆలోచిస్తుంటాడు అని బస్సు లో వాళ్ళని గమనిస్తే అర్ధమవుతుంది.

వికాస్ గాడి అరుపు వినపడింది.... సైగ చేశాను.. పక్కనే సేద తీరాడు.


నిన్న రాత్రి స్పైడర్ మ్యాన్ చొక్కా బీరువా నుండి తీయటం లో ఎలా ఫెయిల్ అయ్యాడో చెప్పి బాధపపడ్డాడు. ఇవాళ స్కూల్ అయ్యాక కొత్త సినిమా “ఎవడవురా నీవు” కి వెళ్దాం అని ఇంట్లో ముందే చెప్పమని, ఫ్రెండ్స్ అందరు వస్తున్న సంగతి కూడా చెప్పాడు. 


ఎప్పుడూ నాతోనే ఉండే వికాస్ కి ఇంత చాకచక్యంగా బ్యాచ్ మానేజ్ చేసే స్కిల్ ఎలా వచ్చిందో అని గర్వంతో కూడిన నవ్వు ఒకటి నవ్వాను.


ఇంకొంచెం సేపు నేను అక్కడే బీచ్ లో ఉంటానని చెప్పి వికాస్ ని ఇంటికెళ్ళమన్నాను.


గత కొన్ని రోజులుగా ఇబ్బంది పెడుతున్న ప్రశ్నలకి సమాధానం ఒంటరిగా సముద్రపు ఒడ్డున దొరుకుతుందన్న ఆశ తో అలాగే వేచి చూశాను...మనసు లోకి.


పొరలు పొరలుగా నా చుట్టూ జరిగే లైఫ్ లోని మాటలు, భావాలు, చర్యల వెనక అంతరార్ధం ఒకటొకటిగా బయటబడటం మొదలయ్యాయి. మనిషి తను అనుకుంటున్న దాన్ని వ్యక్త పరిచి అలానే ఇంకెవరైనా.... తనలాగే ఇలాంటి అనుభూతుల్ని పొందుతున్నాడో లేదో అని వెతుకుతుంటాడు. 


అది ఎంతటి గొప్పదైనా, చెడ్డదయినా.... కానీ వ్యక్త పరచడం మానడు. ఏదో విధంగా ప్రయత్నిస్తాడు.. తాను నమ్మింది, అనుకున్నది చెప్పలేనప్పుడు కలిగే శోకం వర్ణనాతీతం.


కల్మషం లేని స్నేహితుడైన, మాటలు రాని జంతువైన, అసూయ పడే అంకుల్ అయినా, అయినోళ్లయినా, ఎవరో తెలియని అపరిచితుడైనా.. అదే మానవ నైజం.


ఎప్పుడూ సొంత మాటలు మాట్లాడటం చేతకాని నాకు రాధ నన్ను ఇష్టం తో చూసే చూపులు ఇంతలా ప్రేరేపించాయా అన్నట్టు ఆశ్చర్యంతో లెగిచి ఇంటికి పయనమయ్యాను.


నాలో ఒక ఆత్మ విశ్వాసం ఆవరించుకుంది. స్కూల్ కి వెళ్ళగానే రాధ ఎదురయ్యింది.. ఎప్పుడూ చూసి చూడనట్టు వెళ్ళే నేను. నేరుగా రాధ దగ్గరికి వెళ్ళాను.. 

ఆశ్చర్యంతో కూడిన నవ్వుతో నన్ను పలకరించింది రాధ. 


లేత పశుపచ్చ డ్రస్ లో రాధ సూర్యుడి కోసం వేచి చూస్తున్న ప్రొద్దుతిరుగుడు పువ్వులాగుంది. ఆరోజు ఉదయం బీచ్ లో దొరికిన స్వచ్చమైన నీలంరంగు రాయిని ఒక తాడుకి కట్టి గొలుసు చేసి.. “ఇది నీకోసం తెచ్చాను” అని రాధ చేతిలో పెట్టాను.


రాధ నవ్విన నవ్వుకి స్పందనగా నాలో ఎన్నడూ లేని ఒక అనుభవం.. నా నవ్వు నాకు కనిపించినంత ఆనందం. అలానే రాధ కళ్ళలో నన్ను నేను చూసుకుంటూ ఉండిపోయా...... 


చివరికి తన నుండి మూడు మాటలు..................... 


“థాంక్ యు శ్రీ” 



*** 

శ్రీకాంత్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


Srikanth

రచయిత పరిచయం: శ్రీకాంత్

I’m 28 years old and hail from a village called Phirangipuram, near Guntur. I moved to Spain last year to pursue a master’s degree in Supply Chain and Logistics. I have always been an admirer of Telugu and enjoy staying connected with the language through books, movies, and songs. I also write little poems from time to time. This is my first attempt at writing a story.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page