top of page
Original.png

రక్తాక్షి


అమావాస్య రాత్రి అడవిలో మర్రిచెట్టు కింద రహస్యమైన శిల పక్కన ఉన్న పాత మంచం

Rakthakshi - Telugu Horror Story | AyyalaSomayajula Subrahmanyam 

రక్తాక్షి - తెలుగు భయానక కథ | అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము | ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత   

Published In manatelugukathalu.com On 17/08/2026


తెలుగు భయానక కథల్లో గ్రామీణ విశ్వాసాలు, దుష్టశక్తుల రహస్యాలు, అడవి వాతావరణం కలిసినప్పుడు పాఠకుడిలో ఉత్కంఠ మరింత పెరుగుతుంది. ‘రక్తాక్షి’ కథ కూడా అలాంటి భయానక అనుభూతిని అందిస్తుంది. మెదక్‌ జిల్లా అటవీ ప్రాంతంలోని ఒక చిన్న గ్రామంలోకి వచ్చిన పాత టేకు మంచం అర్ధరాత్రిళ్లు మాట్లాడటం, మూలగడం, ఏడవడం మొదలుపెడుతుంది. దాని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నించిన యాదయ్య, బిజోయ్‌, పోషయ్యలు చివరకు అమావాస్య రాత్రి అడవిలోని ఒక పురాతన శిల దగ్గరకు చేరుకుంటారు. అక్కడ ఎదురయ్యే భయానక పరిణామాలు కథను ఊహించని ముగింపువైపు తీసుకెళ్తాయి.


అది తెలంగాణ రాష్ట్రం మెదక్‌ జిల్లా, నరసాపూర్‌కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం. అది అటవీ ప్రాంతంలో 'కుకునూర్‌' అనే కుగ్రామం. చుట్టూ దట్టమైన అటవీప్రాంతం కావడం వలన అక్కడి ప్రజలు దాదాపుగా అన్ని వస్తువులు, వారపు సంత అయిన శుక్రవారం నాడు నరసాపూర్‌లో జరిగే సంతలోనే సమస్తం కొనుక్కుంటారు.


సంత అంతా తిరిగి కావలసిన సామాను కొనుక్కున్నాడు యాదయ్య.

తిరిగి వస్తూ దూరంగా ఉన్న గంజాయి పుంత వైపుకి వెళ్లాడు. అది ఒక ఇసుక ప్రదేశం. పూర్వం అక్కడ గంజాయి పండించేవారు. కానీ ఇప్పుడు లేదు. కానీ సాధారణంగా అక్కడ దొంగలు దొంగతనం చేసి తెచ్చిన సామానుని రహస్యంగా అమ్ముతూ ఉంటారు. అవి చౌకగా లభిస్తుంటాయి. కావున ఎవరో మంచివాళ్లు తప్ప చాలామంది అవి కొంటూ ఉంటారు.


అక్కడ ఒక పాడుబడ్డ భవంతి ఉంది. అది ఒకప్పుడు దోమకొండ సంస్థానాధీశుల విడిది గృహం. అప్పుడప్పుడూ వేటకు వచ్చి ఇక్కడ సేద తీరేవారు. ప్రస్తుతం వారెవ్వరూ ఇటు రావడం మానేశారు. అలా పాడుబడిపోయింది. నక్సలైట్స్‌ అప్పుడప్పుడు ఇక్కడ బస చేస్తుంటారు. అందుకని ఊరివాళ్లను ఎక్కువగా ఏమీ అనరు.


ప్రస్తుతం అక్కడ ఎవరూ లేరు. కాసేపు చూశాడు యాదయ్య. ఇక వెళ్లిపోదాం అనుకుంటూ ఉండగా ఒక నడివయసు వ్యక్తి వచ్చి ఒక మంచాన్ని విడదీసి, ఒక మూటగా భుజం మీద పెట్టుకుని వస్తున్నాడు. అతను యాదయ్యను చూశాడు.

"అన్నా! ఇది చాలా పాతది… టేకు మంచం. మీరు ఎక్కడ కొన్నా ముప్పై వేల కన్నా ఎక్కువే ఉంటుంది. ఇది కామారెడ్డి దగ్గర ఒక ఊరి నుంచి ఎత్తుకొని వచ్చిన. ఎంత ఇస్తావో చెప్పన్నా?" అన్నాడు.


మంచం చూడగానే యాదయ్యకు సానా ఖుషీ అయ్యిండు. తాను ఎప్పటి నుంచో మంచాన్ని కొనాలి అనుకుంటుండు. కాబట్టి కొంత పైకం ముట్టజెప్పి తీసుకున్నాడు.

వెళ్లిపోయేటప్పుడు అడిగాడు:


"నీ పేరు ఏమిటి?"


"నా పేరు ఏదైనా నీకెందుకు? అందరూ భూక్యా అని పిలుస్తారు. మీరు కూడా గట్లనే పిలవొచ్చు" అని నవ్వుతూ అన్నాడు.


అక్కడి నుండి బయలుదేరాడు యాదయ్య.

ఆ చుట్టుపక్కల అన్నీ తండాలు. చిన్న చిన్న పల్లెలాంటివి. అంతా లంబాడా వాళ్లు ఎక్కువ ఉంటారు. ఆ కుకునూరు ఊరిలో ఒక మంత్రగాడు ఉండేవాడు. అతని పేరు బిజోయ్‌. ఆ ఊరి వాళ్లు ఏ సమస్య వచ్చినా ముందు బిజోయ్‌ దగ్గరకే వస్తారు. ఆ తర్వాతే డాక్టర్‌ దగ్గరికి.


తలుపు కొట్టాడు యాదయ్య.


"ఏం కావాలి దొరా? పొద్దుగాలనే వచ్చినవ్‌?" తలుపు తీసి అడిగాడు బిజోయ్‌.


"చెబుతాను విను. మా ఇంట్లో ఒక మంచం ఉంది. అది మాట్లాడుతోంది" కళ్లు పెద్దవి చేసి గట్టిగా చెప్పాడు యాదయ్య.


గంభీరంగా చూశాడు బిజోయ్‌.

"ఏందీ? మంచం మాట్లాడుతోందా? పొద్దుగాలనే నేనే దొరికిననా దొరా?" నవ్వుతూ అన్నాడు బిజోయ్‌.


"అవును స్వామీ! నువ్వు విన్నది నిజమే… మాట్లాడుతోంది, మూలుగుతోంది, ఏడుస్తున్నది కూడా!" ఇంకా గట్టిగా అరిచి చెప్పిండు యాదయ్య.


"గట్లనా! గా మంచం కొని ఎన్ని దినాలైంది? ఏడ కొన్నవ్‌?" ఆలోచిస్తూ అడిగిండు బిజోయ్‌.


అంతా చెప్పిండు యాదయ్య.


"నేను కొన్న కొన్ని దినాల దాకా మంచిగానే ఉంది. రెండు దినాల నుంచి రాత్రి పండుకున్నప్పుడు అర్ధరాత్రి మూలుగుతూ ఏడుస్తోంది. 'ప్లీజ్! నన్ను విడిచేయండి, నన్ను వదిలిపెట్టండి. నేను రాలేకపోతున్నాను. దయచేసి నన్ను వదిలిపెట్టండి' అని మస్తు ఏడుస్తూ చెబుతోంది" అన్నాడు యాదయ్య.


"నువ్వేం ఫికర్‌ కాకు. ఈ రోజు అర్ధరాత్రి మీ ఇంటికాడకు వస్తా. ఆ మంచం మీద నేను పండుకుంటా… ఏం చెబుతుందో వింటా. తరువాత ఏం చేయాలో అది చేద్దాం" అని యాదయ్యకు హామీ ఇచ్చిండు బిజోయ్‌.


'హమ్మయ్య' అనుకుని ప్రశాంతంగా ఇంటికి వెళ్లాడు యాదయ్య.


మాట ఇచ్చినట్టే రాత్రి యాదయ్య ఇంటికి వెళ్లాడు బిజోయ్‌. దోమతెర కట్టుకుని అక్కడే పడుకున్నాడు బిజోయ్‌. చుట్టూ ప్రహారీ గోడ ఉండడం వల్ల అడవి జంతువుల నుంచి భయం లేదు అనుకున్నాడు. హాయిగా నిద్రపోదాం అనుకున్నాడు కానీ ఏదో తెలియని భయం. నిద్ర పట్టడం లేదు. అయినా అలాగే పడుకున్నాడు.


అర్ధరాత్రి అయ్యింది… ముందు రోజు కురిసిన వర్షం వల్ల చుట్టూ కప్పల బెకబెకలు. నిమిషాలు దొర్లుతున్నాయి… హఠాత్తుగా తన చెవులను తాకుతున్న చిన్న మూలుగు. చిన్నగా ఎవరో ఏడుస్తున్నట్లు తెలుస్తోంది. అది క్రమక్రమంగా పెద్దగా అవుతోంది…

ఆ మూలుగు తన తలగడ నుంచా లేక దుప్పటి నుంచా అన్న సందేహంతో అన్నీ తీసేశాడు. అయినా వస్తోంది సన్నని ఏడుపు. తన శరీరం వణకడం మొదలైంది… చుట్టూ నిశ్శబ్దం… క్రమక్రమంగా చిన్నగా మాటలు వినవస్తున్నాయి.


"దయచేసి నన్ను వదిలిపెట్టు. నేను మోయలేకపోతున్నాను" అంటూ అరుపులు…


"ఎవరు నువ్వు?"


"నువ్వు ఎవరు?"


"నాకు చెప్పు" ధైర్యం చేసి అడిగాడు బిజోయ్‌.


"నేనెవర్ని?" అదే మాట మళ్లీ మళ్లీ వినవస్తోంది.


మరింత భయం పెరిగింది బిజోయ్‌కి.


"నిన్ను విడిచిపెడతా. నాకు ఏమిస్తావు?" మళ్లీ అడిగాడు బిజోయ్‌.


ఈసారి కాసేపు ఏడుపు ఆపి, విరామం… చిన్నగా నవ్వు… ఆ నవ్వు కూడా భయపెట్టేలా ఉంది. నవ్వుతూ చెప్పింది:

"నీకు ఇస్తాను. ఇప్పటివరకూ నీకు లేని గొప్ప శక్తులు నీకు ఇస్తాను."


కాస్త ధైర్యంతో, సంతోషం కలిగింది బిజోయ్‌కి.


"సరే! నేను ఏం చేయాలో చెప్పు" ఉత్సాహాన్ని ఆపుకుంటూ అడిగాడు.


"బలి ఇవ్వాలి!"


ఒక్కసారిగా బిజోయ్‌ ముఖంలో భయం నాట్యం చేసింది.


"అవును… బలి ఇవ్వాలి. ఇస్తే నీకు నా శక్తులు ఇస్తాను" కొంచెం గంభీరంగా ఉంది ఆ గొంతు…


కాస్త కీడు శంకించింది బిజోయ్‌ మనసులో… అది గమనించిన ఆ మంచం:

"నువ్వేమీ చేయక్కర్లేదు. నేను చెప్పింది చెయ్యి… రెండు రోజుల్లో అమావాస్య వస్తోంది. రాత్రి అయితే నా బలం రెట్టింపవుతుంది. ఆ రాత్రి అయితే నా బలం పదిరెట్లవుతుంది. ఆ సమయంలో ఈ మంచాన్ని తీసుకువెళ్లి అడవిలో ఉత్తరాన ఉన్న మర్రిచెట్టు మొదట్లో ఉన్న పెద్ద శిల దగ్గర వదిలిపెట్టమని చెప్పు… ఆ శిలే నా రూపం, నా నివాసం. మంచాన్ని అక్కడ వదిలివేయండి చాలు…" అంది ఆ మంచం.


"మరి బలి?" ఆశ్చర్యంగా అడిగాడు బిజోయ్‌.


"మూర్ఖుడా! అది చెబుతాను. ఈ మంచం శిల దగ్గరకు వెళ్లగానే నాలోని శక్తి బయటికి వస్తుంది… ఆ వ్యక్తిని బలి తీసుకుంటుంది… ఆ సమయంలో నువ్వు అక్కడ ఉండి, అతని బూడిద నుదుటిన పెట్టుకో. నీకు కావలసిన శక్తి లభిస్తుంది" వికటంగా చెప్పింది మంచం…


"బాగుంది. నాకో సందేహం… అతని శరీరాన్ని ఎవరైనా చూస్తే?"


"నాకు తెలుసు నీ భయం… నేనొక భయంకరమైన దుష్టశక్తిని. నన్ను 'రక్తాక్షి' అంటారు. మనిషి రక్తమే నాకు దాహం, అతని మాంసమే నాకు ఆహారం, అతని అస్థికలు నాకు రూపం, అతని శరీరమే నాకు ప్రాణం. కాబట్టి అతని శరీరంలో ఏ భాగమూ అక్కడ మిగలదు…" బిగ్గరగా ఏడుస్తూ, నవ్వుతూ వికటంగా చెప్పింది.


వినడానికే భయంగా అనిపించింది బిజోయ్‌కి. తన జీవితంలో ఎన్నడూ లేని భయంకర అనుభవం ఇది…


"కానీ…" ఇంకా ఏదో అనబోయాడు.


"నాకు తెలుసు. నీ గుండె శబ్దం నేను వినగలను. నువ్వు కూడా అక్కడే ఉంటావు. నీకు మాత్రం ఎందుకు హాని జరగదు అనే కదా నీ సందేహం? నువ్వు ఒక పని చెయ్యి. ఈ మంచం పట్టెడ చివర ఉన్న ముక్క కత్తిరించి దగ్గర ఉంచుకో… నీకు అదే రక్ష!"


ఈసారి కాస్త ధైర్యం వచ్చింది.

"సరే!" అన్నాడు.


"చెప్పాగా యాదయ్యా! అదొక దుష్టశక్తి. నువ్వు ఎల్లుండి అమావాస్య రాత్రి పన్నెండు గంటలకు ఆ మంచాన్ని తీసుకుని అడవిలో ఊరికి ఉత్తరాన ఉన్న పెద్ద మర్రిచెట్టు కింద ఉన్న శిల దగ్గరకు దింపేస్తే చాలు… సమస్య పరిష్కారం అయినట్టే. పోతే నువ్వు మాత్రం ఆ మంచం మీద ఇక పడుకోకు… దానితో అసలు మాట్లాడకు" అని చెప్పి వెళ్లిపోయాడు బిజోయ్‌.


అయితే ఎల్లుండి ఈ మంచాన్ని వదిలించుకోవడం అన్నమాట అనుకున్నాడు యాదయ్య. సరే! అనవసరంగా కొన్నాను అని ముందు బాధపడినా, అది తననేమీ చేయనందుకు సంతోషంగానే ఉంది.


సరే! రాత్రి మళ్లీ ఈ మంచం మీద పడుకోకూడదు అనుకున్నాడు యాదయ్య. బిజోయ్‌ చెప్పినట్లు తాను అసలు మాట్లాడకూడదు అని కూడా అనుకున్నాడు.


రాత్రయింది. ప్రశాంతంగా పడుకోవడానికి ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు. దృష్టి మంచం మీదనే ఉంది… ఇప్పటివరకూ అది తనని ఏమీ చేయలేదు. అంటే ఇకపై కూడా ఏమీ చేయకపోవచ్చు… ఒక్కసారి ప్రయత్నిస్తే పోలా అనుకున్నాడు.

కొంతసేపు నిశ్శబ్దంగానే గడిచింది. అర్ధరాత్రి హఠాత్తుగా మరలా మూలుగు, చిన్నగా మరలా ఏడుపు……

"ఎవరు నువ్వు?"


అంతే! ఒక్కసారి ఏడుపు ఆగిపోయింది…

"చూడు! నువ్వు ఈ మంచం కొని తప్పు చేశానని బాధపడుతున్నావని నాకు తెలుసు… నీ బాధ పోయే మార్గం చెబుతాను."


ఎనలేని ఆశ్చర్యం యాదయ్యలో…

"సరే చెప్పు" ఆతృతగా అడిగాడు.


"నువ్వు నన్ను వదిలిపెడితే నీకు అపారమైన నిధి ఉన్న స్థలాన్ని చూపిస్తాను."


కొంచెం సంతోషం యాదయ్య మనసులో.

"మరి నేనేం చేయాలి?" అడిగాడు యాదయ్య.


"బలి ఇవ్వాలి!" ప్రశాంతంగా చెప్పింది మంచం.

ఉలిక్కిపడ్డాడు యాదయ్య. నోట మాట రాలేదు.


"కంగారు పడకు! నువ్వేమీ చేయనవసరం లేదు. నువ్వు రేపు ఈ మంచాన్ని తీసుకువచ్చే పనిని ఎవరికైనా అప్పగించు… మంచాన్ని శిల దగ్గరే వదిలి దాన్నే చూడమను. నేను అతని కళ్ల ద్వారా అతనిలోకి ప్రవేశించి వాడిని బలి తీసుకుంటాను… ఆ తర్వాత నీకు నేను చూపిన స్థలంలో తవ్వితే అపారమైన నిధి నీకు దొరుకుతుంది…"


"కానీ……"


"నాకు తెలుసు నువ్వు ఏమంటున్నావో! నువ్వు ఈ మంచం పట్టెడ చివరలో చిన్న ముక్క కత్తిరించి నీ దగ్గర ఉంచుకో. అది నిన్ను కాపాడుతుంది. లేకపోతే నీవు కూడా చనిపోతావు…"


"సరే! తప్పకుండా అలా చేస్తాను."


అలా మాట్లాడిన తరువాత ఇక పడుకోకుండా, నిద్రపట్టక బయటికి వచ్చేశాడు యాదయ్య.


అంటే బిజోయ్ తనని బలి ఇచ్చి నిధిని పొందుదాం అనుకున్నాడు అన్నమాట…… మనసంతా ఒకటే ఆందోళన.


ఏమైనా ఈ రాత్రి మంచం మీద పడుకోబట్టి తనకు నిజం తెలిసింది. లేకపోతే అంతే సంగతులు. తలుచుకుంటేనే వణుకు వచ్చింది యాదయ్యకు.


"యాదయ్య ఇల్లు ఎక్కడ? జర చూపించన్న" అడిగాడు పోషయ్య.


"గా గల్లీలో ఆఖరి ఇల్లు… పెంకుటిల్లు" అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ మనిషి.


పోషయ్య ఆ ఇంటి వైపు వెళ్లాడు. చూడగానే దోస్తును పట్టుకుని మంచిచెడ్డ అడిగాడు యాదయ్య.


"ముందు నేను వచ్చిన పని తెలుసుగా! ఆ సంగతి చెప్పు" అడిగాడు పోషయ్య.


"సరే సరే! నేను చెబుతా రా" అన్నాడు యాదయ్య.


"తొందరగా చెప్పు యాదన్న! నిజంగానే మంచం మాట్లాడుతోందా?" ఆతృతగా అడిగాడు పోషయ్య.


"కంగారెందుకు? నువ్వే చూద్దువు గానీ" అంటూ ఇంట్లో వేసిన మంచాన్ని చూపించాడు యాదయ్య.


"గిదే…… నేను నెల దినాల క్రితం కొన్నా. కొన్ని దినాలు మంచిగానే ఉంది. మంచిగా పండుకున్నా కూడా. కానీ ఏమైందో తెల్వదు… అనామత్తుగా మాట్లాడడం షురూ చేసింది. గిట్ల కాదని బిజోయ్‌ కాడికి పోయినా. అతను రేపు అమాస అర్ధరాత్రి ఈ మంచాన్ని ఒక్కళ్లే తీసుకెళ్లి అడవిలో ఉన్న మర్రిచెట్టు కాడ పెద్ద బండ దగ్గర పెట్టి వెనక్కి వచ్చేయమని చెప్పిండు… అందుకే రేపు ఈ మంచం వెళ్పోతది. ఎప్పటి నుంచో దయ్యాలను, ప్రేతాత్మలను తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటావు కదా! గందుకే నిన్ను పిలిచినా. నా సోపతివి కదా! రేపు రాత్రి మంచాన్ని తీసుకుపోయేది కూడా నువ్వే" అన్నాడు యాదయ్య.


"అవునా! అయితే ఈ రాత్రి ఖచ్చితంగా నేను దీనిమీద పండుకుంటా. రేపు దీన్ని దాని జాగకు పంపుతా" అన్నాడు పోషయ్య కొంచెం ఆవేశంగా.


"కానీ ఇందాక బిజోయ్‌ చెప్పిండు… ఎవరినీ పండుకోనియ్యద్దని. కాబట్టి వద్దు."


"లేదు లేదు… నేను పండుకొని తీరుతా" మొండిగా అన్నాడు పోషయ్య.


"కానీ పోషన్నా! ఒక్కటి మాత్రం దిమాగ్‌లో పెట్టుకో. నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపకు… విను అంతే! సరేనా?" అని మరీ మరీ చెప్పిండు యాదయ్య.


అర్ధరాత్రి అవుతోంది. నిద్ర పట్టడం లేదు పోషయ్యకి. ఎలాగైనా మంచం మాటలు వినాలి. అది కథ చెబితే ఊకొట్టాలి. 'నేనూ ఏదో ఒకటి చెప్పాలి' అని నవ్వుకున్నాడు పోషయ్య.


దూరంగా గుడ్లగూబల అరుపులు… అప్పుడప్పుడు నక్కల ఊళలు తప్ప ఇక శబ్దాలు ఏమీ లేవు.


హఠాత్తుగా మూలుగు అతనిని ఆశ్చర్యపరిచింది. కాస్త చెవులు రిక్కించాడు.

ఆ తరువాత సన్నని ఏడుపు. కానీ అది అనుకున్నంత మంచిగా, వినసొంపుగా లేదు. అతని మెదడుని, గుండెని ఎవరో నులిమేస్తున్నట్లుగా ఉంది… తన స్నేహితుడు ఎట్టి పరిస్థితులలోనూ మాట్లాడవద్దని హెచ్చరించాడు.


కానీ…………

పదే పదే ఏడుస్తూ అది మాట్లాడుతున్న మాటలు వింటూ ఉండలేకపోయాడు. అందుకే అడిగాడు భయంభయంగా:

"ఎందుకు అలా ఏడుస్తున్నావు?"


ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది. ఒక ముసలి గొంతు మాట్లాడడం మొదలుపెట్టింది:

"నువ్వు చాలా మంచివాడవు. ఇప్పటివరకూ నన్ను ఎవరూ ఇలా అడగలేదు. కానీ, నువ్వు నా బాధను తీర్చగలవా?" ఆప్యాయత నిండిన ఆ గొంతులో…


"చెప్పు! తీరుస్తాను…"


"సరే! రేపు నన్ను అడవుల్లో ఉన్న మర్రిచెట్టు కింద శిల దగ్గర వదిలిపెట్టి వచ్చేస్తారు వాళ్లు. కానీ, అది నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల వాళ్లకి లాభం కలుగుతుంది. కానీ అదే పని నువ్వు చెయ్యి. అలా చేస్తే నీకు నేను శక్తులు ఇస్తాను. ఆ దుర్మార్గులకి ఆ శక్తులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు" నిరాశగా అంది మంచం.


"సరే! ఏం చేయాలో చెప్పు…"


"నిజానికి నన్ను అక్కడ వదిలిపెట్టిన వాళ్లు అక్కడే చనిపోతారు. అది వాళ్లకి తెలుసు. అందుకే ఆ పని నీకు అప్పగించాడు యాదయ్య…"


వింటేనే మనసు ఉడికిపోయింది పోషయ్యకు… నమ్మకద్రోహం చేసిన స్నేహితుడి మీద విపరీతమైన కోపం……


"నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ స్నేహితుడు నిన్ను మోసం చేశాడు… కానీ నీకు నేను సాయం చేస్తాను…"


"సరే చెప్పు" అతని కంఠంలో కోపధ్వని కనిపిస్తోంది.


"సరే విను! రేపు మంచం తీసుకుని మర్రిచెట్టు దగ్గర శిల వద్దకు రా. నిన్ను చూడటానికి, నీ చావు చూడటానికి వాళ్లిద్దరూ నీ వెనకాల నక్కి నక్కి వస్తారు… వారికి తెలియని విషయం ఏమిటంటే అక్కడ ఉన్న వాళ్లు అందరూ చస్తారు. కానీ ఒక పని చేయి. ఈ మంచం పట్టెడ అంచును కత్తిరించి నీ దగ్గర ఉంచుకో… అప్పుడు నా శక్తి నిన్ను ఏమీ చేయదు. వాళ్లిద్దరినీ చంపి, నీవు క్షేమంగా రావచ్చు. పైగా నీకు కొంత శక్తి కూడా వస్తుంది" అంది.


"ఆ శక్తి ఏమిటి?" అడిగాడు పోషయ్య.


"నీకు బాగా ఇష్టమైనది… ఆత్మలతో మాట్లాడగలిగే శక్తిని నీకు ఇస్తాను…"

సరే అన్నాడు పోషయ్య సంతోషంగా.


తెల్లవారింది.

"ఈ రోజు మంచాన్ని తీసుకెళ్లడానికి నీకు అభ్యంతరం లేదు కదా?" అడిగాడు యాదయ్య.


"తప్పకుండా తీసుకువెళ్తాను" కోపాన్ని దాచుకుంటూ అన్నాడు పోషయ్య.


అర్ధరాత్రి పన్నెండు గంటలు అయ్యింది. అమావాస్య. కారు చీకట్లు. చుట్టూ దారి కనబడనివ్వడం లేదు… అంత చీకటిలో చిన్న టార్చ్‌లైట్‌ వేసుకుని మంచం నెత్తిమీద పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు పోషయ్య.


ఊరు దాటాక స్మశానం దగ్గర ఉన్న బిజోయ్‌ వెళ్తున్న పోషయ్యను చూశాడు.

'ఎందుకు యాదయ్య వెళ్లడం లేదు?' అర్థం కాలేదు…


ఈలోగా పోషయ్య వెనుక వెళ్తున్న యాదయ్య కూడా కనిపించాడు. వాళ్లిద్దరూ వెళ్లిన కాసేపటికి వెనుకగా వెళ్లాడు బిజోయ్‌…


చుట్టూ చీకటి, కీచురాళ్ల అరుపులు. అప్పుడప్పుడు గాలికి చెట్ల ఆకుల శబ్దాలు చెవులకు చేరుతున్నాయి. అప్పుడప్పుడు పొదల్లో ఆడుకుంటున్న నిశాచరాల చప్పుళ్లు. వాటి మధ్య తీవ్రమైన ఆదుర్దాతో చెమట పడుతున్నా లెక్కచేయకుండా, ఆయాసపడుతూ వెళ్తున్నాడు పోషయ్య. అతని వెనుక నిశ్శబ్దంగా యాదయ్య… అతని వెనుక… బిజోయ్‌. ముగ్గురూ దూరం దూరంగా వెళ్తున్నారు.


దట్టమైన మేఘాలు ఎప్పుడైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. గాలి వేగం పెరిగింది. ఎండిపోయిన చెట్ల కొమ్మలు అప్పుడప్పుడు విరిగి కింద పడుతున్నాయి. ఆ శబ్దానికి చిన్న చిన్న జీవులు పరుగులు పెడుతున్నాయి. రానురానూ శబ్దాలు పెరిగాయి. కీచురాళ్ల రొదలతో పాటు గుడ్లగూబల అరుపులు, పాముల బుసబుసలు, నక్కల ఊళలు, తోడేళ్ల అరుపులతో ఆ ప్రదేశం భయానకంగా మారింది…


కానీ ఆయాసపడుతూ వెళ్తున్నాడు పోషయ్య. అతను అనుకున్న మర్రిచెట్టు రానే వచ్చింది. దానికింద ఐదు అడుగుల పెద్ద శిల…


యాదయ్య చెప్పాడు నిన్న… పూర్వం ఆ శిల దగ్గర చాలాకాలం బలులు ఇచ్చేవారట. క్రమక్రమంగా ఆ దుష్టశక్తి బాధ తట్టుకోలేక ఊరి జనం అక్కడి నుంచి వెళ్లిపోయారట. అప్పుడు ఆ ఊరు కాస్తా అడవిగా మారిపోయిందట…


మంచాన్ని శిల దగ్గర దింపాడు పోషయ్య. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటూ రెండు అడుగులు వెనక్కి వేశాడు పోషయ్య…

అతనికి మరో మూడు అడుగుల వెనుక యాదయ్య…

అతనికి మరో మూడు అడుగుల వెనుక బిజోయ్‌.

అందరి దృష్టి ఆ మంచం మీదే ఉంది!


హఠాత్తుగా ఒక వెలుగు… మిణుకు మిణుకుమంటూ… ఆ వెలుగు క్రమంగా పెద్దదై చుట్టూ ఉన్న మొక్కలను, చెట్లను ఆక్రమించింది. ఆ వెలుగు మరింత ఎక్కువైంది.

అవి వెలుగు రేఖలు కావు! కాళరాత్రి యముని పాశాల్లా ఉన్నాయి ఆ వెలుగులు…

వారి కళ్లను మూసివేసింది… వారిలోని నవనాడులూ కుచించుకుపోతున్నాయి! ఏమి జరుగుతోందో తెలుసుకునే పరిస్థితి లేదు వారికి.


వారిలో ఉన్న రక్తాన్ని పీల్చేసింది, శరీరాన్ని కాల్చేసింది, ఎముకలను బూడిదగా మార్చేసింది. చూస్తుండగానే ఆ కబంధ హస్తాలు ఆ ముగ్గురినీ తనలోనికి లాగేసుకున్నాయి.


అతి భయంకరమైన ఆ దుష్టశక్తి ధాటికి అక్కడ బూడిద కూడా మిగలలేదు. అంతా కొన్ని నిమిషాలలోనే జరిగిపోయింది. ఆహారం దొరికిన సంతృప్తితో అది శాంతించింది. చూడటానికి వచ్చిన గుడ్లగూబలు తమ పని అయిపోయినట్లు అక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్లిపోయాయి.


కాసేపటికి అంతా ప్రశాంతంగా అయిపోయింది. చుట్టూ నిశ్శబ్దం…

ఈలోగా దూరం నుంచి మెల్లగా అడుగుల చప్పుడు… నెమ్మదిగా నడుస్తూ ఓ నడివయసు వ్యక్తి……

"భూక్యా…… భూక్యా……"


వికటంగా నవ్వింది శిల. దండం పెట్టాడు భూక్యా. ఆ మంచం నెత్తిమీద పెట్టుకున్నాడు. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు.


"రేపు ఉదయం నరసాపూర్‌ సంతలో అమ్మాలి" అనుకున్నాడు మనసులో.

క్రమంగా అతను దూరమయ్యాడు……


అసలు ఏమీ తెలియని దానిలా అలాగే నిశ్చలంగా ఉంది ఆ శిల……


— సమాప్తం —


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

 రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.


అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.


ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,


ఆంధ్రభూమి, దేశభక్తిసాహిత్య ఈ పత్రిక, సహరి, మిసిమి,తపస్విమనోహరం,మాధురి


మాసపత్రిక,ఉషాపక్షపత్రిక, సుమతి మాస పత్రిక, షార్‌ వాణి, మన తెలుగు కథలు.కామ్‌.


బిరుదులు- సాహిత్యవిక్రమార్క- దేశభక్తిసాహిత్య ఈ పత్రిక


ఉత్తమ రచయిత- మనతెలుగుకథలు.కామ్‌.


కలహంస—- నెలవంక- నెమలీక మాస పత్రిక.


ప్రథమబహుమతులు- నవలల విభాగము- మనతెలుగుకథలు.కామ్‌ మరియు


త‌పస్విమనోహరము.


ప్రథమద్వితీయబహుమతులు— కథల విభాగము- సహరి, మనతెలుగుకథలు.కామ్‌


చారిత్రక నవలలో ప్రథమ, ద్వితీయబహుమతులు.


సాంఘికనవలలో ద్వితీయ, కన్సోలేషన్‌ బహుమతులు.


ఇవేకాక ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, ,రాజకీయ సంబంధించి పెక్కు వ్యాసాలు పత్రికల్లో వస్తూంటాయి.


కవితలు కూడా అన్ని విషయాల మీద కూడా వస్తూంటాయి.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము


అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page