రాతిలోని చెమ్మ
- Madhupatra sailaja Uppaluri

- 3 hours ago
- 4 min read

Rathiloni Chemma - Telugu Inspirational Story | Madhupatra Sailaja Uppaluri
రాతిలోని చెమ్మ - తెలుగు ప్రేరణాత్మక కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి
Published in manatelugukathalu.com on 18/08/2026
కష్టాలు ఎంత పెద్దవైనా పట్టుదల, ప్రతిభ, ప్రోత్సాహం ఉంటే జీవితాన్ని మార్చుకోవచ్చని నిరూపించిన ఋషి విజయగాథ ఇది. పేద గిరిజన కుటుంబంలో పుట్టిన ఆయన, చిన్ననాటి నుంచే ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ చదువులో రాణించారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహం, ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ల సహకారంతో M.Sc. పూర్తి చేసి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారు. ఆ సమయంలో జరిగిన ఓ అభినందన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి అందించిన iPadతో పాటు చెప్పిన విలువైన మాటలు ఋషి జీవితాన్ని మలిచాయి. దశాబ్దం తర్వాత అదే ముఖ్యమంత్రి సమక్షంలో తన విజయానికి మూలమైన ఆ స్ఫూర్తిని గుర్తుచేసుకుని కృతజ్ఞతలు తెలిపిన ఋషి, “పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడం” ఎంత గొప్ప విలువో చాటిచెప్పారు.
అది రాష్ట్ర రాజధాని నగరంలోని ఓ పెద్ద కాన్ఫరెన్స్ హాల్. ఉదయం 10 గంటల సమయమౌతోంది. ఆ రోజు ఓ నాలెడ్జ్ హబ్ జరగబోతోందక్కడ.
తమ తమ నైపుణ్యాలతో ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచి, తమ రాష్ట్రానికి ఎనలేని పేరుప్రఖ్యాతులను తెచ్చిపెట్టిన వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, ప్రముఖ కంపెనీల ముఖ్య కార్యదర్శులు ఆనాటి సభలో పాల్గొంటున్నారు. తాము సాధించిన విజయాలను యువతతో పంచుకోవటం ద్వారా వారిలో స్ఫూర్తిని కలిగించటమే ఆ సభా నిర్వాహకుల ముఖ్య ఉద్దేశ్యం.
అందుకే రాష్ట్రంలోని వివిధ కాలేజీల, యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులను ఆహ్వానించగా పెద్ద సంఖ్యలో వచ్చారు. వచ్చిన వారికి కూడా ఎంతో ఆసక్తిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తమ రాష్ట్రానికి చెందిన ప్రముఖుల అనుభవాలను వారివారి మాటల ద్వారానే తెలుసుకోవటం తమ అదృష్టంగా భావిస్తున్నారు.
ఆ రాష్ట్రాధినేత సభకు ముఖ్యఅతిథిగా వచ్చారు. వారిని చూడగానే సభాప్రాంగణంలో కలకలం మొదలయ్యింది. ఎందుకంటే వారు ప్రజాప్రతినిధిగా తమ తమ శాఖలకు సంబంధించిన అధికారులతోనూ, జిల్లా కలెక్టర్లతోనూ, పోలీసు డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధికారులతోనూ జరిగే సమావేశాలకు తప్ప, ఇలాంటి పబ్లిక్ మీటింగ్‌లకు రావటమనేది చాలా తక్కువసార్లు జరుగుతుంది. అందుకే ఆ హడావిడి.
వేదిక నిరాడంబరంగా ఉంది. వేదికపై ముఖ్యఅతిథి కాక ఇద్దరు ముగ్గురు ఆత్మీయ అతిథులు ఆశీనులయ్యారు. అధ్యక్షులవారు తమ ప్రారంభోపన్యాసంలో ఆనాటి సభ ప్రాముఖ్యతను వివరిస్తూ, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పదిహేనుమంది శాస్త్రవేత్తలు తమ అనుభవాలను వివరిస్తారని, ఆ శాస్త్రవేత్తలను ఒక్కొక్కరుగా వచ్చి తాము ఏ రంగంలో పరిశోధనలు చేశారో చెప్పి, తద్వారా తమకు, రాష్ట్రానికి వచ్చిన పేరుప్రఖ్యాతులను సభాసదులతో పంచుకోవాలని కోరారు. ఆయా రంగాలలో వారు చేసిన కృషి రాష్ట్ర పురోభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడిందో పవర్ ప్రజెంటేషన్ ద్వారా విశదీకరించమన్నారు.
ఉపన్యాసకులు ఒక్కొక్కరు వచ్చి తమ ఉన్నత విద్య గురించి, తమ తల్లిదండ్రులు తమకు ఆర్థికంగానే కాక మోరల్‌గా ఎంత సపోర్ట్ అందించారో వివరిస్తూ, తమ పెద్దలకు ధన్యవాదాలు చెపుతున్నారు. అటువంటి తల్లిదండ్రులకు జన్మించటం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వారి మాటలకు వేదిక ముందు కూర్చున్న వారి తల్లిదండ్రుల కళ్ళు అప్రయత్నంగా ఆనందబాష్పాలను వర్షిస్తున్నాయి.
ఒక శాస్త్రవేత్త కంటికి సంబంధించిన పరికరాలను గురించి చెప్పారు. "'లేజర్ బీమ్ ఎక్స్‌పాండర్'గా పేరుగాంచిన ఆ పరికరం గురించి వివరిస్తూ, వివిధ అప్లికేషన్లలో దాని ద్వారా లేజర్ కిరణాలను మెరుగుపరిచే క్లిష్టమైన ఆప్టికల్ పరికరంగా అది ప్రఖ్యాతమైనది" అని చెప్పారు.
మరొక శాస్త్రవేత్త తాను సభ్యుడిగా ఉన్న "ది ఓషన్ ఫౌండేషన్" గురించి చెప్పటం మొదలుపెట్టారు. ప్రస్తుత సమాజంలోని సముద్ర పర్యావరణాన్ని నాశనం చేసే ధోరణిని, దానిని తిప్పికొట్టే రకరకాల పరిశోధనలను వివరిస్తూ, ఆ బృహత్కార్యంలో తన పాత్ర గురించి వివరించారు. విద్యార్థులందరూ ఉపన్యాసకులు చెప్పే వాటిలో తమకు ఉపయోగపడే పాయింట్స్ నోట్స్ రాసుకుంటున్నారు.
‘హౌసింగ్ ట్రస్ట్’ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ఓ మహిళా పారిశ్రామికవేత్త, తాము మురికివాడల నిర్మూలనకు, నగరాలలో నివాసయోగ్యమైన ఇళ్ళను అతి తక్కువ ఖర్చుతో ఎలా నిర్మించగలమో వివరించారు. చక్కని పరిశుభ్రమైన ఇళ్ళను నిర్మించే ప్రయత్నంలో భాగంగా తమ ట్రస్ట్ సేవలను వినియోగించుకోవాలని, తమ ఇంజనీర్ల సలహాలతో మంచి కాలనీలు రూపొందించవచ్చని చెప్పారు.
అలా సాగుతున్న ప్రసంగాలలో ఋషి వంతు వచ్చింది. “పెద్దలందరికీ నమస్కారం. దాదాపుగా పది సంవత్సరాల క్రితం నేను ఓ అభినందన సభలో పాల్గొన్నాను. అది నా జీవితాన్ని మార్చివేసిన ముఖ్యమైన ఘట్టం. ఆ సభ నన్ను ఓ ఉన్నతుడిగా మార్చి, ఇప్పుడు మీ ముందొక శాస్త్రవేత్తలా నిలబెట్టింది.
నేను మీ అందరిలా అమ్మానాన్నల ప్రేమవాత్సల్యాలతో, అక్కచెల్లెళ్ళ అనురాగబంధాల మధ్యన పెరగలేదు. మాది ఓ పేద గిరిజన కుటుంబం. నాకు ఊహ తెలిసేటప్పటికే అమ్మ చనిపోయింది. ఉదరపోషణ నిమిత్తం నాన్నతో పాటు కూలిపనులకెళుతూ చదువుకున్నాను.
మా తాండాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన నాకు అదృష్టవశాత్తు మంచి మార్కులు వచ్చి, ఏడవ తరగతిలో జిల్లాలో ప్రథముడిగా నిలిచాను. నా 18వ ఏట తండ్రిని కూడా పోగొట్టుకున్నాను. కానీ చదువులో టీచర్ల, లెక్చరర్ల ప్రోత్సాహంతో బాగా రాణిస్తూ అన్ని తరగతులలోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడనయ్యాను. అలా మా స్కూలు ఉపాధ్యాయులు ఇచ్చిన సహకారానికి, ప్రభుత్వ స్కాలర్‌షిప్ సొమ్ము తోడుకాగా నా చదువు M.Sc. దాకా జరిగింది.
నాకు M.Sc. పట్టా ప్రదానం జరిగిన రోజు, “యూనివర్సిటీలో టాపర్‌గా నిలిచిన గిరిజన యువకుని ప్రతిభ” అంటూ దినపత్రికలలో వార్తా కథనం వచ్చింది. ఆ వార్తను చదివిన యూనివర్సిటీ వైస్-ఛాన్సిలర్‌గారు నా ప్రవర్తన, కృషి ఇతర విద్యార్థులకు స్ఫూర్తిని కలిగించాలని ఆ అభినందన సభను యూనివర్సిటీలోనే ఏర్పాటు చేశారు.
ఆ సభకు ముఖ్యఅతిథిగా ఓ ప్రముఖ వ్యక్తిని ఆహ్వానించారు. వారు సభలకు, ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారని అంతా గుసగుసలాడుకున్నారు. నా విజయం వారిని కదిలించిందేమో మరి?
ఆయన నన్ను అభినందించటానికి వేదికపైకి పిలిచారు. సాధారణమైన దుస్తులను ధరించి, చేతికి వాచీ కూడా లేని నన్ను పరిశీలనగా చూసిన ఆయన, దగ్గరకు పిలిచి నా వివరాలను నా నుండే తెలుసుకున్నారు. నా చేతిలో ఓ iPad పెట్టి, “నీ కృషికి నా బహుమతి ఇది” అంటూ, “నీ ఉన్నతికి ఆకాశమే హద్దు కావాలి. ఆ భగవంతుడు నీ వెంట నిలబడి నిన్ను విజయతీరాలకు చేరుస్తాడు. ఆల్ ద బెస్ట్!” అంటూ ఆశీర్వదించారు.
ఆ మహానుభావుడు ఆ నాడు నన్ను దీవిస్తూ అన్న గొప్ప మాటలు నా చెవులలో ఇప్పటికీ రింగుమని మ్రోగుతూనే ఉన్నాయి. “పుట్టటం గొప్ప కాదు, బతకడం గొప్ప. మంచిగా బతకడమే గొప్ప కాదు, ఆ మంచిని ఇతరులకు పంచుతూ బతకడం ఇంకా గొప్ప. నీవు ఈ రాష్ట్రానికి గొప్ప పేరును తీసుకురావాలి” అన్నారు. ఆయన నన్ను తీర్చిదిద్దిన శిల్పి.
ఆ రోజు వారిచ్చిన ఆ మాటామృతంతోనే ఉత్తేజితుడనైన నేను, ఇక్కడ ఎన్నో ఉద్యోగాలు చేసి జర్మనీ వెళ్ళాను. ఆ తరువాత రోమ్ నగరంలోని 'జార్జ్ ఆగస్ట్ యూనివర్సిటీ'లో బయోకెమిస్ట్రీలో Ph.D. చేశాను. దాదాపుగా 12 యూరోపియన్ నగరాలలో పనిచేసి, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలోని మెలకువలను తెలుసుకున్నాను.
నా సంపాదనలో 25% ఖర్చు చేసి పేదల కొరకు Rs. 30.00 లక్షలతో గృహాలను నిర్మించి ఇచ్చాను. మన రాష్ట్రంలో ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీని ప్రారంభించి, ఆ మందుల కంపెనీ ద్వారా పేద ప్రజలకు తక్కువ ధరలకే మందులను అందించాలన్నది నా చిరకాల కోరిక. మన రాష్ట్రం వైద్యరంగంలో కూడా అభివృద్ధి సాధించాలన్న ఆశయంతో ముందడుగు వేస్తున్నాను.
నా ఆశయ సాధనకు నాకు నా గాడ్‌ఫాదర్ దీవెనలు మెండుగా ఉన్నాయి. 10 సంవత్సరాల క్రితం ఆ తండ్రి ఇచ్చిన నైతిక సపోర్ట్ నాకు ఎల్లవేళలా తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను. వారిని ఈ చిన్న గులాబిమాలతో సత్కరించుకుంటున్నాను” అంటూ ఆనాటి సభలో ముఖ్యఅతిథిగా ఆసీనులైన రాష్ట్ర ముఖ్యమంత్రిగారి మెడలో మాలవేసి, పాదాలకు నమస్కారం చేశాడు ఋషి. “ఈ iPadను గుర్తుపట్టారా సార్? తద్వారా నేను మీకు గుర్తుకొచ్చానా?” అన్నాడు.
“మన రాష్ట్ర ముఖ్యమంత్రిగారు బ్రహ్మచారి. ఎవరినీ దగ్గరకు చేరనీయరు. వారికి ఎంతసేపూ ప్రజలు, వారికి సేవ చేయడమే తెలుసు. కఠిన మనస్కుడు అన్న పేరుంది. ఈ బంధాలు, బంధుత్వాల వాసన అంటనంత దూరంలో మెలుగుతుంటారు” అనుకున్నారు సభికులు.
“ఎప్పుడో దశాబ్దం క్రితం అన్న తన మాటలను గుర్తుపెట్టుకుని, గుండెలనిండా తనపై ప్రేమను, గౌరవాన్ని నింపుకుని ఎంత గొప్పగా ఎదిగాడు ఈ ఋషి!” తాను ఆనాడన్న మాటలను ఆచరణలో పెట్టి కళ్ళముందు నిలిపాడు. ఎంతటి విపత్కర పరిస్థితులొచ్చినా చలించని ముఖ్యమంత్రిగారు ఋషి ప్రవర్తనకు చలించిపోయారు. ఋషి మాటలను వింటూనే అంత గొప్ప వ్యక్తి కళ్ళల్లో చెమ్మ బయటకు వచ్చింది.
ఋషి మాటలకు ఆ సభాప్రాంగణమంతా కరతాళధ్వనులతో నిండిపోయింది. ఋషి వ్యక్తిత్వాన్ని గమనిస్తున్న వారందరికీ “మనిషి గొప్పతనం సాయం చేయటంలో కంటే, ఆ పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవటంలో ఉంటుంది” అనిపించింది. “మరి మనం కూడా ఋషిలాగా ఎదిగి మన రాష్ట్రానికి, దేశానికి కీర్తి తేవాలి” అనుకున్నారు వారంతా.
***
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు:
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు. గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.









Comments