top of page
Original.png

పెళ్లిచూపుల చీర


తరతరాల జ్ఞాపకంగా మారిన 116 రూపాయల పాత చీరతో కుట్టిన బొంతపై నిద్రిస్తున్న పాపను చూస్తున్న అమ్మమ్మ, తల్లి

Pellichoopula Cheera- Telugu Emotional Family story | Kanakadurga Lakshmirathna

పెళ్లిచూపుల చీరతెలుగు భావోద్వేగ కుటుంబ కథ  | కనకదుర్గా లక్ష్మీరత్న

Published in manatelugukathalu.com on 18/08/2026


కొన్ని వస్తువులు వాటి విలువ వల్ల కాదు… వాటితో ముడిపడిన జ్ఞాపకాల వల్ల జీవితాంతం మనసులో నిలిచిపోతాయి. అలాంటి ఓ చీర కథే ‘పెళ్లిచూపుల చీర’. 116 రూపాయలకు కొనుగోలు చేసిన ఎర్ర మిరపపండు రంగు చీర, ఒక కుటుంబంలో అక్కల పెళ్లిచూపులకు ఆనవాయితీగా మారుతుంది. కాలం మారుతుంది, కొత్త ఫ్యాషన్లు వస్తాయి, చివరకు ఆ చీర బొంతగా మారుతుంది. కానీ దానితో ముడిపడిన అమ్మ ప్రేమ, అక్కల జ్ఞాపకాలు, చిన్ననాటి ఆశలు మాత్రం తరాలు మారినా చెరిగిపోవు. కనకదుర్గా లక్ష్మీరత్న రాసిన ఈ హృద్యమైన కథ కుటుంబ అనుబంధాల విలువను, వస్తువుల వెనుక దాగి ఉండే జ్ఞాపకాల అందాన్ని మనసుకు హత్తుకునేలా ఆవిష్కరిస్తుంది.


ఇది చాలా ఏళ్ళ నాటి మాట. బహుశా నాకు అప్పుడు పదేళ్ళు ఉంటాయేమో! మా నాన్నగారికి ఆ నెల జీతంతో పాటు బోనస్ వస్తే మా అమ్మని చీర కొనుక్కోమన్నారు. అమ్మ, అప్పుడు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వాణిశ్రీ చీర, ఎర్ర మిరపపండు రంగులో కొనుక్కుంది. ఫారెన్ నైలెక్స్ చీర మీద బంగారం రంగు తీగ దారంతో పెద్ద సున్నా మీద చిన్న సున్నా కుట్టిన డిజైన్ బోర్డర్ల మీద, పమిటంచు మీద ఉండి, చూడటానికి చీర గ్రాండ్‌గా ఉండేది. దాని ఖరీదు 116 రూపాయలు. ఆ రోజుల్లో అది ఖరీదైన చీర.


అందుకే మేము ‘116 రూపాయల చీర’ అని దానికి సార్థక నామం చేశాము. అమ్మ ఆ చీర పేరంటాలకి, చిన్న చిన్న ఫంక్షన్లకి కట్టుకునేది. అమ్మకి ఆ చీర బాగా నప్పేది. ఆ చీర కట్టుకున్నప్పుడు అమ్మ అక్కలతో కలిసిపోయేది. చిన్నతనంలోనే పెళ్ళి, ఆనక వెంటవెంటనే పిల్లలు పుట్టడం వల్ల, అక్కలు చీరలు కట్టుకున్నప్పుడు, అమ్మకి, అక్కలకి పెద్ద తేడా కనిపించేది కాదు.


పెద్దక్క పెళ్లిచూపుల పేరంటానికి ఆ చీరే ఆదుకునేది. దబ్బపండు ఛాయలో ఉండేదేమో ఆ ఎర్రని చీరలో మెరిసిపోయేది. చిన్నక్క నుంచి కూడా ఆ చీర పోటీని ఎదుర్కొనేది. కాలేజీ ఫంక్షన్లకి, స్నేహితుల పెళ్ళిళ్ళకి "అమ్మా! 116 రూపాయల చీర కట్టుకుంటాను" అని అడిగేది. స్కూల్ వార్షికోత్సవాలలో జరిగే నృత్య ప్రదర్శనలకి మూడవ అక్క కట్టుకుని నృత్యం చేస్తుంటే, లైట్లల్లో చీర మీద డిజైన్ మెరుస్తూ, ఎవరో దేవత దిగి వచ్చి నృత్యం చేస్తోందా అనిపించేది.


కొన్నాళ్ళకి పెద్దక్క పెళ్లి కుదిరింది. చిన్నక్క అమ్మతో “నేను అక్క పెళ్ళిలో 116 రూపాయల చీర కట్టుకుంటాను” అంది.


“పెళ్ళికి నాన్నగారు అందరికీ కొత్త బట్టలు కొంటానన్నారు. ఇది నీ పెళ్లిచూపులకి దాచి ఉంచుతాను. అక్కకి అచ్చొచ్చింది కదా” అంది అమ్మ.

నాకు అమ్మ మాటల్లో నాన్నగారు అందరికీ కొత్త బట్టలు కొంటారని తెలిసి సంబరపడిపోయాను.


పెద్దక్క పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయింది. తరువాత చిన్నక్కకి పెళ్లిచూపుల తతంగం మొదలయ్యింది. ఒక రోజు చిన్నక్కని చూడటానికి పెళ్లివారొచ్చారు. అప్పుడే కాలేజీ నుండి వచ్చిన చిన్నక్కతో అమ్మ, ”రాజీ! నిన్ను చూడటానికి పెళ్లివారొచ్చారు. త్వరగా వెళ్లి 116 రూపాయల చీర కట్టుకో” అంది.


పెళ్ళివారికని జిలేబీలు ప్లేట్లల్లో సర్దుతున్న అమ్మతో ”అది పెద్దక్క పెళ్లిచూపుల చీర కదా! చిన్నక్కని కూడా పెళ్లిచూపులకి అదే ఎందుకు కట్టుకోమంటున్నావు?” ఆశ్చర్యంగా అడిగాను.


“అబ్బా! తరువాత చెబుతాలేవే! పెళ్లివారికి కాఫీలు కలపాలి. వాళ్ళు వచ్చేసారు” అంది.


రాజీ అక్క వెళ్లి చీర కట్టుకు వచ్చింది. తను వాణిశ్రీ లాగా జడ వదులుగా చెవుల మీదకి వేసుకుంది. నేను దగ్గరకు వెళ్లి ”అక్కా! అచ్చం వాణిశ్రీ లాగా ఉన్నావు” అన్నాను.

చిన్నక్క సిగ్గుపడుతూ నవ్వి నెమ్మదిగా “చంటీ! పెళ్ళికొడుకు ఎలా ఉన్నాడో కిటికీలోంచి చూసి చెప్పు” అంది. నాకిది అలవాటైన పనే. పెద్దక్క పెళ్లిచూపుల్లో కూడా పెళ్ళికొడుకుని ముందుగా నేనే చూసి చెప్పేదాన్ని. పెళ్ళికొడుకుని చూద్దామని హాల్లోకి పరుగెడుతుంటే అమ్మ, ”ఒసేయ్ చంటీ! ఇంద! ఈ జిలేబీ తీసుకుని డాబా మీదకి వెళ్లి ఆడుకో” అంది.


పెద్దక్క పెళ్ళిచూపులప్పుడు, చిన్నక్కని, మూడవ అక్కని లోపల గదిలోనే ఉండమనేవారు. నేను ఇంట్లో అందరికన్నా చిన్నదానిని అవడం చేత నాకూ, మా అక్కలకి వయసులో బాగానే అంతరం ఉండేది. అందుచేత స్వేచ్ఛగా హాలులోకి వెళ్లి పెళ్ళికొడుకుని చూసి వచ్చే వీలు ఉండేది. ఒకసారి పెద్దక్క పెళ్లిచూపుల్లో పెళ్ళికొడుకుని చూడటానికని వెళ్లి “ఛీ! పెళ్ళికొడుకుకి గడ్డం ఉంది” అని వారి ముందే అనేశాను. అప్పటినుండి అమ్మ పెళ్లివారు వచ్చినప్పుడు, వారి ముందు అవకతవకగా మాట్లాడేస్తానేమోనని, చేతిలో తినుబండారాలు పెట్టి ‘డాబా మీదకి వెళ్లి ఆడుకో’ అని పంపించేసేది. కానీ నేను మాత్రం కిటికీలోంచి పెళ్ళికొడుకుని చూసి అక్కలకి చేరవేయనిదే కదిలేదాన్ని కాదు.


పెళ్ళికొడుకు బాగానే ఉన్నాడని అక్కకి చెప్పి జిలేబీ తీసుకుని డాబా మీదకి పరిగెత్తాను. అక్కడ చిన్న అన్నయ్య చాలా శ్రద్ధగా పాత గుడ్డలు గుండ్రంగా చుట్టి దబ్బనంతో కుడుతూ క్రికెట్ బంతి తయారు చేసుకుంటున్నాడు. నేను దగ్గరగా వెళ్లి భుజం కుదుపుతూ “చిన్నన్నా! చిన్నన్నా! అమ్మెందుకు రాజీ అక్కని కూడా పెళ్లిచూపుల్లో పెద్దక్కలాగానే 116 రూపాయల చీర కట్టుకోమంది?” ఉత్సుకతతో అడిగాను.


భుజం కుదిపేసరికి దబ్బనం చిన్నన్న వేలులో గుచ్చుకుంది.

“అబ్బా!” అని వేలు నోట్లో పెట్టుకుని “పోవే! అది పెళ్లిచూపుల చీర” విసుగ్గా అన్నాడు.

“పెళ్లిచూపుల చీరా? ఐతే రాజీ అక్క తరువాత రాధక్క కూడా పెళ్ళిచూపుల్లో కట్టుకుంటుందా?” విస్మయంగా అడిగాను.


“అవును తల్లీ! నీ పెళ్ళిచూపుల్లో కూడా అదే కట్టుకుంటావు. సరేనా!” చిరాకు పడ్డాడు.

“ఓ! అందుకేనా! అమ్మ అచ్చొచ్చిన చీర అంది! అంటే ఏమిటి?” అర్థం కాక అడిగాను.

“అంటే అది కట్టుకుంటే మంచి జరుగుతుంది అన్నమాట” అని పంటితో దారం తెంపి బంతి, కొబ్బరి మట్టతో చేసిన బ్యాట్ తీసుకుని ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు.


“హమ్మయ్యా! నేను కూడా నా పెళ్ళిచూపుల్లో 116 రూపాయల చీర కట్టుకుంటానన్న మాట” అని తేలికపడి ఆనందంగా జిలేబీ తినేశాను. కొంచెం సేపయ్యాక పెళ్ళివారు వెళ్లిపోవడం డాబా మీద నుండి కనపడింది. వెంటనే పరిగెత్తుకుంటూ మెట్లు దిగి ఇంటిలోకి వెళ్ళాను. అమ్మ ఆనందంగా పెళ్ళివారికి రాజీ అక్క నచ్చిందని చెబుతోంది.

అచ్చొచ్చిన చీర కట్టుకుంది కదా! చిన్నక్క పెళ్లి కూడా అయిపోయింది. చాలాకాలం వరకు ఆ చీర పటం లాగా మన్నింది. కొన్నాళ్ళకి రాధక్క పెళ్లి కూడా జరిగిపోయింది ఆనవాయితీగా వచ్చిన పెళ్లిచూపుల చీర కట్టుకోవడంతో.


రోజులు దొర్లుతుంటే కొత్త ఫ్యాషన్లు పుట్టుకొస్తుంటాయి. చీరలు కూడా కొత్త రంగులు, అందమైన డిజైన్లతో అద్దాల దుకాణంలో దర్శనమిచ్చే రోజులు మరి. చీర మీదున్న డిజైన్లలోంచి బంగారపు నక్కీ దారాలు బయటికి వచ్చేసరికి అమ్మ 116 రూపాయల చీర కట్టుకోవడం మానేసింది. ఆ చీరని అందరూ కట్టుకున్నారు, నేను తప్పా అనే భావం నాలో ఉండేది. అప్పుడు నాది చీర కట్టుకునే వయస్సు కాదాయే! అయినప్పటికీ ఒంటి మీద వేసుకుని పమిటంచుని పట్టుకుని పాట పాడుతూ నిలువుటద్దం ముందు నిల్చుని మురిసిపోయేదాన్ని. అమ్మతో ఒక రోజు “నువ్వు ఎలాగూ ఈ చీర కట్టుకోవడం లేదు కదా! నాకు పరికిణీ కుట్టించవచ్చుగా!” ఆశగా అడిగాను.


“డిజైన్లలోంచి దారపు పోగులు వేళ్ళాడి పోతున్నాయి. పరికిణీ కుట్టించినా బాగుండదు. అయినా ఇప్పుడు నీ వయసు పిల్లలంతా సల్వార్ కమీజులు వేసుకుంటున్నారు. అదే ఫ్యాషన్” అంది.


ఒకరోజు నేను కాలేజీ నుండి వచ్చేసరికి అమ్మ, మా హైదరాబాద్ పెద్దమ్మ సోఫా మీద కూర్చుని చీరకున్న నక్కీ దారాలని పీకేసి పోగులు పెడుతున్నారు. నన్ను చూడగానే పెద్దమ్మ “బావున్నావే చంటీ! ఎంత పెద్దదానివైపోయావే!” అని ఆప్యాయంగా పట్టుకుంది.


“ఎందుకు దారాలు పీకేస్తున్నారు? నా పెళ్లిచూపులకు కట్టుకోవాలిగా?” దిగులుగా అన్నాను.

“నీ పెళ్లిచూపులకి ఇంకా కొత్త కొత్త ఫ్యాషన్ చీరలు వస్తాయిలే! అవి కట్టుకుందువు గానీ” అంది అమ్మ నవ్వుతూ.


“హైదరాబాద్‌లో చీరలకి మంచి మంచి ప్రింట్లు వేస్తారు. చీర గట్టిగా ఉంది. ఇది తీసుకుని వెళ్లి మంచి ప్రింట్ వేయించి పంపిస్తాను” అంది పెద్దమ్మ.

నాకు చెప్పలేనంత బాధ వచ్చింది. కొన్నాళ్ళకి పెద్దమ్మ చీరకి ప్రింట్ వేయించి పంపించింది. నాకెందుకో నచ్చలేదు. చీర మీదంతా ప్రింట్ వేయించడంతో మిరపపండు రంగు కనిపించడం లేదు.


తరువాత మార్కెట్లోకి శ్రీదేవి చీరలని, జయప్రద చీరలని, మరెన్నో కొత్త కొత్త చీరలు వచ్చాయి. కానీ ఏ చీరా 116 రూపాయలకి సాటి రాదనిపించింది.

కొన్నాళ్ళకి అక్కలకి ఒకళ్ళ తరువాత ఒకళ్ళకి పిల్లలు పుట్టడంతో అమ్మ 116 చీరని, మరికొన్ని చీరలని చేర్చి బొంత కింద కుట్టించేసింది. నాకు ప్రాణం ఉస్సూరుమంది. అందరినీ సింగారించిన ఆ చీర కట్టుకునే భాగ్యం నాకు లేదనే బాధ మిగిలిపోయింది. పెళ్లిచూపుల ఆనవాయితీ చీర కాస్తా, పసిపిల్లలని పడుకోబెట్టే ఆనవాయితీ బొంతగా పరిణామం చెందింది.


నాకూ పెళ్లీడు వచ్చింది. కానీ పెళ్లిచూపుల్లో ఆనవాయితీగా వచ్చిన చీర కట్టుకోలేదు.

నా పెళ్ళయ్యి ఏడాది తిరిగేసరికి పండంటి బిడ్డకి తల్లినయ్యాను. హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక పాపని తీసుకుని అమ్మ 116 రూపాయల చీరతో కుట్టించిన బొంత మీద పడుకోబెట్టి ”పెళ్ళిచూపుల్లో ఆనవాయితీగా వచ్చిన చీరని కట్టుకోలేకపోయావని బాధ పడ్డావు కదా! అందుకే ఈ బొంతని నీ బిడ్డ కోసం జాగ్రత్తగా దాచి ఉంచాను” నవ్వుతూ చెప్పింది. ఆనవాయితీ బొంత అయిన పెళ్లిచూపుల చీరని ఆప్యాయంగా తడుముతూ, దాని మీద ఆదమరచి నిద్రపోతున్న పాప కేసి గర్వంగా చూస్తుండిపోయాను.


ఇప్పుడు నా పాప హేమ ఒక బిడ్డకి తల్లి. అది పడుకున్న ఆనవాయితీ బొంత ఇప్పుడు లేకున్నా, దాని బిడ్డకి నా పాత చీరలతో ఒక మెత్తటి బొంతని చేసి ఇచ్చాను.


***

కనకదుర్గా లక్ష్మీరత్న గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


కనకదుర్గా లక్ష్మీరత్న

రచయిత పరిచయం: కనకదుర్గా లక్ష్మీరత్న

నా పేరు కనకదుర్గా లక్ష్మీరత్న. నేను గృహిణిని. సాహిత్యం పట్ల ఆసక్తితో రచనలు చేస్తున్నాను. నా రచనలు ఈనాడు ఆదివారం అనుబంధంలోను, వివిధ అంతర్జాల పత్రికలలోను ప్రచురితమయ్యేయి. ప్రతిలిపికి రాస్తుంటాను.

2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

"పెళ్ళిచూపుల చీర" అనే శీర్షిక చూస్తేనే, కథలు పూర్తిగా చదవని బద్ధకిస్టులకి కూడా, "ఈ కథని పూర్తిగా చదవాల్సిందే" అనిపిస్తుంది.


కొన్ని సినిమాల పేర్లు చూస్తేనే, వాల్ పోస్టుల మీద వున్న నటీనటుల బొమ్మలు చూడగానే, ఆ సినిమా తప్పకుండా చూడాలనిపించినట్టు, కథలకి పెట్టే శీర్షికలకి ప్రాధాన్యత వుంటుంది, చదివింపజేస్తుంది !


ఇంక కృత్రిమ మేథస్సు ధర్మమా అని, అందమైన బొమ్మలు తోడైతే, వేరే చెప్పాలా ?


ఇంతకీ, చెప్పొచ్చేదేమిటంటే, శ్రీమతి. కనకదుర్గా లక్ష్మీరత్న గారి

ఈ కథ, అపురూపం, అసామాన్యం, అద్భుతం !


చదివిన ప్రతివాళ్ళూ...తన్మయత్వం పొంది, ఈ కథతో మమేకమై, ఆ తరం ఆడవాళ్ళయితే, వాళ్ళ పెళ్ళిచూపుల రోజుల్లోకి, మగాళ్ళైతే, వాళ్ళింట్లో జరిగిన, తమ, తమ అప్పచెల్లెళ్ళ పెళ్ళిచూపుల రోజుల్లోకి వెళ్ళిపోవడం, ఖాయంగా ఖాయం !


తమ తమ సకుటుంబ, బంధుమిత్రులతో పంచుకోవడమే కాదు, కొందరు గ్రంథచోరులు, తమ పేరుమీద చెలామణి చేసుకుంటారు కూడా...


ఇంక, ఇలాంటి సూపర్ హిట్ కథలు, వాట్సాప్ లో, తెగ చక్కర్లు కొట్టడం కొత్త కాదుగా ?


అనేక అభినందనలమ్మా, రచయిత్రీ !


మీ కథ, మీ పేరు, మీ కథ…


Like
kanakadurga sistla
kanakadurga sistla
5 minutes ago
Replying to

మీ సమగ్రమైన, ప్రోత్సాహకరమైన సమీక్షకు ధన్యవాదాలండీ!


Like
bottom of page