తాతయ్య కల - పుస్తకావిష్కరణ
- Patrayudu Kasi Viswanadham

- Jul 23, 2025
- 7 min read
#PatrayuduKasiViswanadham, #పట్రాయుడుకాశీవిశ్వనాథం, #తాతయ్యకల, #పుస్తకావిష్కరణ

Thathaiah Kala - Book Unveiling ceremony By Patrayudu Kasi Viswanadham Published In manatelugukathalu.com On 23/07/2025
తాతయ్య కల - పుస్తకావిష్కరణ
రచన : పట్రాయుడు కాశీవిశ్వనాథం
ముందుమాట
*************
డా. గంగిశెట్టి శివకుమార్
చందమామ ఉప సంపాదకులు.
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత.
***********
కాశీవిశ్వనాధం పట్రాయుడు గారు వృత్తి బోధన, ప్రవృత్తి రచనగా జీవితాన్ని సార్ధకం చేసుకుంటున్న మంచి బాలసాహితీవేత్త. ఆయన విరివిగా బాలసాహిత్యాన్ని సృజించడమే కాక, వ్యయ ప్రయాసలకోర్చి ఆ సాహిత్యాన్ని పుస్తకాలుగా ప్రచురించి బాలసాహితీ పాఠకలోకానికి అందిస్తున్నారు. ఇది ఎంతయినా అభినందించతగ్గ విషయం.
పిల్లలకోసం రచనలు చెయ్యడం అంత సులువైన విషయం కాదు. అయితే నిరంతరం పిల్లలతో గడిపే ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం వల్ల పట్రాయుడు వారికి పిల్లల మనస్తత్వాలు, ఆలోచనలు, ఊహలను అంచనా వేయగలిగే శక్తి లభించింది. ఆ అనుభవంతో ఆయన బాల సాహితీ సృజనను దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు.
పట్రాయుడు గారు ప్రతీ కథలో ఏదో ఒక కొత్త విషయాన్ని చెప్పటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. రచయితగా ఆయనకున్న సహజగుణం అది. "తాతయ్య కల" కథా సంపుటిలో ప్రతీ కథా పత్రికలో ప్రచురితమైందే. సూటిగా, స్పష్టంగా, అలతి అలతి పదాలతో రచన సాగించడం పట్రాయుడు గారి ప్రత్యేకత. సంక్షిప్తత, సరళత్వం బాల సాహిత్యానికి రెండుకళ్ళు అన్న విషయం పట్రాయుడు గారు బాల సాహితీ సృజనకు నడుంకట్టిన నాడే గమనించారు.
స్థాలీ పులాక న్యాయంగా ఈ సంపుటి లోని కొన్ని కథలను పరిశీలిద్దాం. 'ఎవరు గొప్ప' అన్న కథలో పావురం, చీమ, ఏనుగు స్నేహితులు అవి కలసి మెలసి జీవించేవి. పావురం - వంటపని, చీమ - ఆహార సేకరణ, ఏనుగు - కట్టెలు, నీళ్లు తేవడం చేసేవి. నక్క వారి మధ్య చిచ్చు పెట్టింది. మనస్పర్థలలో అవి చేసే పనులను మార్చుకున్నాయి. ఇబ్బంది పడ్డాయి. ఎవరికి ఎందులో ప్రావీణ్యం ఉందో ఆ పని చేస్తేనే బాగుంటుంది. ఒకరు చేయాల్సిన పని మరొకరు చేయడం వల్ల ఆ పనులు పాడవుతాయి. సరయిన ఫలితాలు అందుబాటులోకి రావని తెలుసుకుని మునపటి లాగే ఎవరెవరి పనులు వారు చేసుకుంటూ, స్నేహాన్ని కాపాడుకున్నారు. చెప్పుడు మాటలు వినకుండా జాగ్రత్తపడ్డారు.
'తియ్యనైన తెలుగు' కథ కొత్తగా ఉంది. ఇందులో మననడు తాతయ్యకు కథ చెప్పడం ప్రత్యేకత. "అనగనగా ఒక పిల్లి పిల్ల వుండేది. అది సరిగ్గా చదవ లేదని వాళ్ల అమ్మ కోడి దగ్గర ట్యూషన్ పెట్టించింది. కోడి భాష పిల్లి పిల్లకు అర్థం కాలేదు, మరొకరు, మరొకరు అలా ట్యూషన్ మాష్టర్లు మారారు. కానీ పిల్లిపిల్లకు ఎవరు చెప్పిందీ అర్థంకాలేదు. చివరకు ముసలి పిల్లి దగ్గర ట్యూషన్ పెట్టించింది. పిల్లి పిల్లకు బాగా అర్థమై బాగా చదువుకుంది. ఈ కథ విని తాతయ్య "అదేరా! మాతృభాష గొప్పదనం అంటే" అన్నాడు. చిట్టి కథ ద్వారా గొప్ప సందేశం అందించారు పట్రాయుడు గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతీ కథా ఆణిముత్యమే! ప్రతీ కథ సరళమైన భాషలో, అమూల్యమైన సందేశంతో అలరారినవే. జీవితాన్ని రంగరించిన పెద్దల అనుభవాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో అందుతూ వుండేవి. అందువల్ల పిల్లల్లో చాకచక్యం, సమయస్ఫూర్తి, యుక్తి, ధైర్యం, త్యాగం, పరోపకారం వంటి మౌలిక గుణాలు అలవడి తమ జీవితాలను సుఖవంతం, ఆదర్శప్రాయం చేసుకుంటు ఉండేవారు. ఇప్పుడా పరిస్థితి మారింది. కానీ నేటి కాలానికి నీతికథాపఠనం బాలలకు తప్పనిసరి. ఆ లోటును పూరిస్తూ "తాతయ్య కల" పుస్తకంగా బాలలకందిస్తున్న పట్రాయుడు గారికి అభినందనలు. ముందు ముందు ఆయన కలం నుండి ఇలాంటి కథలు మరిన్నో జాలువారి బాలల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరుకుంటూ..
ఆశీస్సులతో
డా. గంగిశెట్టి శివకుమార్,
నెల్లూరు.
*****************************************
2. తాతయ్య చెప్పిన కమ్మని కథలు
కళారత్న పొట్లూరి హరికృష్ణ
ఛైర్మెన్
ఆంధ్రప్రదేశ్ జానపద కళలు & సృజనాత్మక అకాడమీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
పిల్లల ప్రపంచం వేరు. వచ్చీ రాని మాటలు, ముద్దు ముద్దు పలుకులు. లోకం పోకడ ఎరగని అమాయకత్వం. అందుకే వాళ్లను దేవుళ్లతో సమానం అంటాం. వాళ్ల ఊహలు, ప్రశ్నలు, ఆలోచనలు, ఆంతరంగిక కదలికలు, మానసిక లోతులు, నమ్మకాలు, పనులు, కలలు, కళలు. అన్నీ భిన్నంగా, అందంగా, గొప్పగా ఉంటాయి. అనుభూతులతో నిండి ఉంటాయి. స్వచ్ఛంగా, స్వేచ్ఛగా ఉంటాయి. సముద్రపు నురగలా, జాబిలి వెన్నెల్లా ఏ ఆచ్ఛాదనా లేని అందమైన లోకం వాళ్లది. ప్రతి ఒక్కరూ అలాంటి అందమైన, అద్భుతమైన బాల్యపు చిరునామా దాటి రావాల్సిందే. బాల్యం తిరిగి రావాలని, కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు..
బాలల ఊహలకు రెక్కలుంటాయి. అవి సీతాకోక చిలుకలంత సున్నితమైనవి. వాళ్ల ఆలోచనలకు అంతు ఉండదు. ఆకాశమంత విశాలం. వాళ్ల ప్రపంచంలో ప్రతిదీ అద్భుతమే, సుందరమే. వాళ్లకు ప్రతి ఒక్కటీ కొత్తగా, వింతగా అనిపిస్తుంది. అందుకే తెలుసుకుంటారు, నేర్చుకుంటారు, అలవాటుపడతారు. నచ్చకపోతే పేచీపెడతారు, అలుగుతారు, కోప్పడతారు, ఏడుస్తారు. నచ్చజెప్పినా, వాళ్లకు కావాల్సింది ఇచ్చినా వెంటనే బుంగమూతి వదిలి అమ్మానాన్నల ఒడిలోకి చేరి హాయిగా ఆదమరచి కబుర్లు చెప్తారు. మౌనిలా నిద్రపోతారు. అలాంటి అమాయకపు పిల్లలకు కథలంటే ఇష్టం. చెవి కోసుకుంటారు. ఊహాలోకాల్లో తేలిపోతూ ఆ పాత్రల్లో తమను తాము ఊహించుకుంటూ, అర్థంకానీ, చేసుకోలేని, చెప్పలేని ప్రశ్నలు వేస్తూ “ఊ” కొడుతూ ఉలిక్కిపడుతుంటారు. కంచికి పోని కథలు చెప్పమని వాళ్ల భావనా ప్రపంచంలోకి పెద్దలను రమ్మని పిలుస్తారు..
పిల్లలకు గ్రహణశక్తి ఎక్కువ. రాసి నేర్చుకునే కంటే విని ఎక్కువ నేర్చుకుంటారు. అందుకే బట్టీపట్టే కంటే, ఆలోచనలు పెంచే కథా మార్గమే మిన్న. కథల ద్వారా చిన్నారులను అద్భుతమైన భావిభారత పౌరులుగా తీర్చిదిద్దొచ్చు. ఎంత గొప్ప రచయితైనా పిల్లలకోసం రచనలు చేయడం అంటే అంత తేలికైన విషయమేం కాదు. వాళ్ల స్థాయిలో రాయాలి. వాళ్ల ప్రపంచంలోకి అడుగుపెట్టి ఊహలు చేయాలి. మత్తు, గమ్మత్తు చేయాలి. కేవలం ఆలోచనలకు ఊపిరిపోస్తే సరిపోదు. వింతలు, వినోదాలు, అద్భుత ప్రపంచాల్లోకి వాళ్లను హఠాత్తుగా లాక్కొని వెళ్లే శక్తి ఉండాలి. వాస్తవానికి, నిజాలకు, సూక్తులకు, మనోవికాసానికి, జ్ఞానప్రకాశానికి, సరికొత్త రంగులు అద్ది పిల్లల మనసు కేన్వాసుపై ఒక గమ్మత్తైన బొమ్మ గీయాలి. అది వాళ్ల జీవితాంతం చేయి పట్టుకు నడిపించే ఊతం కావాలి. అప్పుడే బాలల రచయితగా విజయం సాధించినట్లు. కాశీవిశ్వనాథం గారు ఆ పనిని వందకు వందశాతం చేశారు. ప్రతీ ఒక్క కథలో ఏదో ఒక విషయాన్ని బాలలకు చెప్పే ప్రయత్నం చేశారు. పిల్లల మనసును ఆకర్షించే కథా టెక్నిక్ పట్టుకున్నారు. వీరి ప్రతి కథా ఏదో ఒక పత్రికలో ముద్రితమైందే.
కొన్ని కథలకు చివరిలో నీతిని, సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. కథ చదివితే బాలబాలికల మనసుకు ఇట్టే ఏం నేర్చుకోవచ్చో, జీవితాన్ని ఆ కథ ద్వారా ఎలా తీర్చిదిద్దుకోవచ్చో అర్థమైపోతుంది. ఎందుకంటే సూటిగా, స్పష్టంగా, అలతి వాక్యాలతో కథ నడిపారు పట్రాయుడు వారు. పిల్లలకు అర్థమయ్యే విధంగా తేలికపదాల శైలిని, కథ నేపథ్యానికి, వర్ణనలకు, సంభాషణలకు అనుగుణంగా ప్రయోగించడం రచయితలోని నేర్పుకు గొప్ప ఉదాహరణ.
‘అనగనగా ఒక రాజు.. ’ అనకుండానే 'తాతయ్య కల' అంటూ ఈ బాలకథా ప్రపంచంలోకి పిల్లలను తీసుకెళ్తే.. వారి మనసుకు మెచ్చే కథలను కానుకగా ఇచ్చినట్లే. పిల్లల మానసిక ఎదుగుదలకు, వారి ఆలోచనలు కార్యరూపం దాల్చడానికి, కొత్త సంగతులు తెలుసుకోవడానికి, తప్పుపొప్పులు దిద్దుకుంటూ నేర్చకోవడానికి, అభివృద్ధి చెందడానికి, చిట్టి బుర్రల్లో ఆలోచనా శక్తి పెరగడానికి, ప్రకృతితో కలిసి ఆనందంగా జీవించడానికి ఈ కథలు చక్కగా ఉపయోగపడతాయి. తల్లిలా, తండ్రిలా, ఆప్తమిత్రుడిలా అన్నీ అందిస్తాయి. సమయస్ఫూర్తి, పరోపకారం, ఐకమత్యం, ఆలోచనాశక్తి, నీతి, విలువలు, మానవత్వం, మంచి గుణాలను ఆచరించాలని బోధిస్తాయి.
సెల్ ఫోను, టీవీలే పిల్లల లోకంగా మారిన ఈ వర్తమానపు టెక్నాలజీ రోజుల్లో ఇలాంటి కథలు రావాల్సిన అవసరాన్ని చక్కగా గుర్తించారు రచయిత కాశీవిశ్వనాధం. కథా నేపథ్యం ఏది తీసుకున్న చిన్నారుల మనసును హత్తుకునేలా, వారిని మంచివైపు నడిపేలా కథలను తీర్చిదిద్దారు. బాలసాహిత్యపు విలువలకు ఇదో మచ్చుతునక. పూల మాలలో దారంలా ప్రతి కథలో ఏదో ఒక నీతి రహస్యాన్ని చొప్పించారు తన ప్రతిభాశక్తితో..
రేపటి తరాన్ని భౌతిక, మానసిక ఉత్సాహవంతులుగా, సంపూర్ణ యువతీయువకులుగా తీర్చిదిద్దాలంటే 'తాతయ్య కల' లాంటి కథల పుస్తకాలు ఎంతో అవసరం. ఇలాంటి బాల సాహిత్యాన్ని సృష్టిస్తున్న కాశీవిశ్వనాధం పట్రాయుడు గారిని అభినందిస్తూ.. వారి కలం నుంచి ఇంకా ఇంకా ‘అద్భుత’మైన కథలు జాలువారాలని ఆకాంక్షిస్తున్నాను..
కళారత్న పొట్లూరి హరికృష్ణ
ఛైర్మెన్
ఆంధ్రప్రదేశ్ జానపద కళలు & సృజనాత్మక అకాడమీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
****************************************
3. బాలల మనసెరిగిన మాస్టారు
దాసరి వెంకట రమణ
ప్రధాన కార్యదర్శి.
బాలసాహిత్య పరిషత్తు.
హైదరాబాదు.
******************************
పిల్లలు పాఠ్య పుస్తకాలతో పాటు తప్పకుండా ప్రతిరోజూ బాల సాహిత్యం చదవాలి. అందువల్ల పిల్లలకు చాలా ఉపయోగం. చదవడం అనేది అలవాటు అయితే భాషపై మంచి పట్టు దొరుకుతుంది.
చదివిన ప్రతి కథలోనూ కొత్త కొత్త పదాలు పరిచయం అవుతూ పదసంపద (Vocabulary) పెరుగుతుంది. తరగతి పుస్తకాలు పిల్లల్లో ప్రతిభను వెలికి తీసి మార్కులు సాధించడానికి కొలమానాలయితే.. చదివిన బాలసాహిత్యం సమాజం లోని రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తులను పరిచయం చేస్తూ, సమాజంలో జరుగుతున్న వైవిధ్యమున్న సంఘటనలను కళ్ళముందు నిలుపుతూ, అసలు జీవించడం ఎలానో పిల్లలకు నేర్పుతుంది.
ఈ మధ్య కాలంలో పిల్లల కోసం బాలసాహిత్యం విరివిగా వస్తోంది. పిల్లలు కూడా ఇష్టపడి చదువుతున్నారు. రాసే వాళ్ళ సంఖ్య కూడా బాగా పెరిగింది. బాలసాహిత్యం రాస్తున్న వాళ్ళు ఎక్కువగా ఉపాధ్యాయులు కావడం గమనార్హం. పిల్లలతో మమేకం అవుతూ, దగ్గరనుండి వాళ్ళను గమనిస్తూ, వారి భవిష్యత్తును నిర్దేశించే సాహిత్యాన్ని సృష్టించడం ఉపాధ్యాయులకు కాస్త సులువుగా ఉంటుంది. ఆ కోవలో బాల సాహిత్య సృష్టి చేస్తున్న వారిలో శ్రీ పట్రాయుడు కాశీ విశ్వనాథం గారొకరు.
బాలసాహిత్యాన్ని విరివిగా చదువుతూ, రాస్తూ, సమయం దొరికినపుడల్లా పిల్లలతో గడుపుతూ, వారిని కూడా బాల సాహిత్య రచనల వైపు ప్రోత్సహించే శ్రీ విశ్వనాథం గారు "తాతయ్య కల" అనే బాలల కథా సంపుటి తీసుకురావడం ఆనందకరం.
ఈ సంపుటిలోకెల్లా గొప్ప కథగా పేర్కొనదగిన అర్హత వున్న కథ "పేగు బంధం". ఇక ఈ సంపుటిలో కథలు పిల్లల్లో పఠనాసక్తి, ఉత్కంఠ పెరిగేలా ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాగే మరిన్ని మంచి కథలతో బాలసాహితీ రంగాన్ని పరిపుష్టి చేసే దిశగా శ్రీ విశ్వనాథం గారి ప్రయత్నం సాగుతుందని ఆశిస్తున్నాను.
-దాసరి వెంకట రమణ
ప్రధాన కార్యదర్శి
బాలసాహిత్య పరిషత్తు
***************************************
4. అభినందన
శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత
పిల్లల సక్రమ ఎదుగుదలకు ముఖ్య పాత్రను ఇంట్లో తల్లిదండ్రులు పోషిస్తే, అదే పాత్రను బడిలో ఉపాధ్యాయులు పోషిస్తారు. బాధ్యతాయుతమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ అదనపు బాధ్యతగా రచనా వ్యాసంగాన్ని ఎంచుకున్న శ్రీ పట్రాయుడు కాశీవిశ్వనాధం గారు ఆ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు.
గతంలో జిలిబిలి పలుకులు బాలగేయాల సంపుటిని, దేవునికో ఉత్తరం, అద్భుతం కథా సంపుటాలను ప్రచురించిన కాశీవిశ్వనాధం మాష్టారు ఇప్పుడు మరో ఉత్తమ బాలల కథా సంపుటి 'తాతయ్య కల' తో మన ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ కాశీ విశ్వనాధం గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని మంచి రచనలతో ఆబాల గోపాలాన్ని అలరించగలరని ఆశిస్తున్నాను.
నారంశెట్టి ఉమామహేశ్వరరావు
కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత,
అధ్యక్షుడు, ఉత్తరాంధ్ర రచయితల వేదిక, నారంశెట్టి బాలసాహిత్య పీఠం,
పార్వతీపురం
***
పట్రాయుడు కాశీవిశ్వనాథం గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
పేరు: పట్రాయుడు కాశీవిశ్వనాధం
Patrayudu kasi viswanadham
విద్యార్హత: ఎం.కాం., బి.ఇడి., బి.ఎ.,
ఎం.ఎ(ఆంగ్లం)., ఎం.ఎ.(తెలుగు).
స్వగ్రామం : చామలాపల్లి అగ్రహారం
విజయనగరం జిల్లా.
నివాసం : శృంగవరపుకోట (ఎస్.కోట)
వృత్తి : పాఠశాల సహాయకులు(ఆంగ్లం)
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కవరపుకోట.
ప్రవృత్తి: కవితలు, బాలల కధలు, బాలాగేయాలు రాయడం
ఆలిండియా రేడియోలో స్వీయ కవితా పఠనం చేయడం.
సేకరణలు:
**********
1.వివిధ దేశాలకు చెందిన స్టాంపులు, నాణెములు, 2.నోట్లు, 3.వార్తా పత్రికలు(వివిధ భాషల వి), 4.స్పూర్తి కధనాలు, 5.మహనీయుల జీవితాల్లో మధురఘట్టాలు, 6.సాహసబాలల కధనాలు, 7.వివిధ నెట్ వర్క్ ల సింకార్డులు ఓ చర్లు, 8.వివిధ పతాకాలు, ప్రతీదీ వందకు పైగా సేకరణ. 9. వైకల్యాలని అధిగమించి విజయాలను సాధించిన వారి స్ఫూర్తి కధనాలు వివిద పత్రికలనుంచి 150 కి పైగా సేకరణ.
విద్యార్థులతో సేవాకార్యక్రమాలు:
*******************************
1.విధ్యార్ధులల్లో సేవాభావాన్ని పెంపొందించడం కోసం విద్యార్ధులను బృందాలుగా చేసి వారి నుంచి కొంత మొత్తం సేకరించి, దానికి నేను కొంత మొత్తం కలిపి అనాదాశ్రమాలకు వికలాంగ పాఠశాలకు సంవత్సరానికొకసారి 4000 రూ. ఆర్ధిక సాయం. ప్రతీ సంవత్సరం శివరాత్రినాడు విధ్యార్ధులే స్వయంగా తయారు చేసుకుని భక్తులకు పులిహోర పంపిణీ. కనీసం 30 కిలోలు. విధ్యార్ధుల సహకారం తో చలివేంద్రాలు ఏర్పాటు.
2.మండలస్థాయిలో విద్యార్థులకు *భగవద్గీత శ్లోక పఠన పోటీలు.
3.రామాయణం క్విజ్ పోటీలు* నిర్వహించడం.
బాల రచయితలుగా తీర్చిదిద్దడం
*******************************
బాలలను రచనల వైపు ప్రోత్సహించడం.వారి రచనలు వివిధ పత్రికలకు పంపడం జరిగింది.
నా ప్రోత్సాహం తో మా పాఠశాల విద్యార్థుల కథలు, బాలగేయాలు బాలబాట పత్రికలో 10 కి పైగా ప్రచురించబడ్డాయి.
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
సంకలనాలు :
1.గురజాడ శతవర్ధంతి
కవితా సంకలనం లో
2.ఆంధ్ర సంఘం పూణె వారి 'ఆమని' సంకలనం లో
3.రచనా సమాఖ్య బొబ్బిలి వారి 'జల సంరక్షణ',
4.'రక్త బంధం',
5.'ఆకుపచ్చనినేస్తం' కవితా సంకలనాలలో.
6. గుదిబండి వెంకటరెడ్డి గారి 'ఏడడుగుల బంధం' సంకలనం లో
7.రమ్య భారతి వారి కృష్ణా పుష్క్కర సంకలనం లో 8.సాహితీ ప్రసూన దాశరధి ప్రత్యేక సంకలనం లో
9.తెలుగు ప్రతిలిపి వారి మాతృ స్పర్శ కవితా సంకలనంలో
10.గుదిబండి వెంకటరెడ్డి గారి నేస్తం కవితా సంకలనం (2019)లో
11. బైస దేవదాసుగారి నీటి గోస కవితా సంకలనం లో
12. ఉరిమళ్ల సునంద చిన్నారి లతీఫా కవితా సంకలనం లో
13.మద్యం మహమ్మారి కవితాసంకలనం లో నా కవితలకు చోటు.
🌷🌷🌷🌷🌷🌷🌷
బహుమతులు
1.డా. పట్టాభి కళా పీఠం విజయవాడ వారి జాతీయ స్థాయి కవితల పోటీలో ప్రధమ బహుమతి 1000/-(నేను నేను కాదు)2016
2.తెలుగు తేజం చిట్టి కధల పోటీలో పేగు బంధం కథకి తృతీయ బహుమతి.
3.జిల్లా రచయితల సంఘం వారు నిర్వహించిన కధల పోటీలో తృతీయ బహుమతి.
4.సాహితీ కిరణం వారి మినీ కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
5.ఆంధ్ర సంఘం పూణే వారి కవితల పోటీలో ద్వితీయ బహుమతి.
6.కెనడా డే సందర్భంగా తెలుగు తల్లి సంస్థ వారి కధల పోటీలో అద్భుతం కధ కి ప్రథమ బహుమతి.1000/- 2018
7.నవ్య దీపావళి కధల పోటీలో నాకు చనిపోవాలనుంది కధ సాధారణ ప్రచురణకు ఎంపిక.
8.ప్రియమైన కథకులు సమూహం వారు నిర్వహించిన కథలపోటీ (2019) లో అల్లరి పిడుగు కథకు ప్రత్యేక బహుమతి
9.తెలుగుతల్లి కెనడా డే వారు నిర్వహించిన కథల పోటీ 2019 లో ఒక్క క్షణం ఆలోచిద్దాం కథకి ప్రధమ బహుమతి 1000 రు.
ఇంకా మరెన్నో బహుమతులు, సన్మానాలు, సత్కారాలు.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
బిరుదులు :
1.తెలుగు కవితా వైభవం హైదరాబాదు వారి సహస్ర కవిమిత్ర,
2.సహస్ర లేఖా సాహిత్య మిత్ర,
3.సహస్ర వాణి శత స్వీయ కవితా కోకిల,
4.శతశ్లోక కంఠీరవ,
5.సూక్తిశ్రీ,
6.తెలుగు ప్రతిలిపివారి "కవి విశారద"
7.గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారి రాష్ట్రస్థాయి పురస్కారం 2016
8.జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2017.
9.బండారు బాలనంద సంఘం వారి జాతీయ ఉత్తమ బాల సేవక్ పురస్కారం 2017,
10.సర్వేపల్లి జాతీయ విశిష్ట సేవాపురస్కారం 2018, 2019 లలో
11.ప్రతిలిపి వారి బాలమిత్ర 2019 పురస్కారం పొందడం జరిగింది.
12.కాశీ మావయ్య కథలు బాలల కథా సంకలనానికి పెందోట బాల సాహిత్య పురస్కారం 2023
🌹🌹🌹🌹🌹🌹🌹
ముద్రించిన పుస్తకాలు :
1."జన జీవన రాగాలు" (స్వీయ కవితా సంపుటి),
2."జిలిబిలి పలుకులు"( బాల గేయాల సంపుటి).
3.*దేవునికో ఉత్తరం* బాలల కధా సంపుటి
4.*అద్భుతం* బాలల కథా సంపుటి
5.కాశీ మామయ్య కథలు బాలల కథా సంపుటి.
6.తాతయ్య కల బాలల కథా సంపుటి.
అముద్రితాలు
1*మౌనమేలనోయి* కథల సంపుటి
2 ఉభయ కుశలోపరి లేఖల సంపుటి
3*నీకోసం* భావ కవితా సంపుటి.
4చెట్టు కథలు
5 పేదరాశి పెద్దమ్మ కథలు
6 మృగరాజు సందేశం కథల సంపుటి
ఇష్టాలు
పిల్లలతో గడపడం
బాలసాహిత్య పఠనం
బాలసాహిత్య రచన
ప్రచురణలు
ఇప్పటి వరకు..వివిధ దిన,వార, మాస, ద్వైమాస, జాతీయ, అంతర్జాతీయ,అంతర్జాల పత్రికలలో బాలల కధలు 250,బాల గేయాలు 180 సాంఘిక కథలు50, కవితలు 120, ప్రచురణ అయ్యాయి.
🌿🌿🌿🌿🌿🌿🌿🌷🌷🌷🌷🌷🌷




Comments