top of page
Writer's pictureAyyala Somayajula Subramanyam

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 8


'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 8' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 8' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు.

వెన్నెలను కలిసి తన భావాలు వ్యక్తపరుస్తాడతడు. మౌనంతో తన అంగీకారం తెలుపుతుందామె. తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుంది. వెన్నెల వివాహం చంద్రంతో జరుగుతుంది.


చంద్రం మాజీ ప్రియురాలు మనోరమ కనబడలేదనే వార్త గురించి మాట్లాడుకుంటారు వెన్నెల, ఆమె స్నేహితురాలు యమున. గతంలో మద్యం తాగి వచ్చిన చంద్రంతో మాట్లాడదు వెన్నెల. చంద్రం గురించి మాట్లాడుకుంటారు యమునా, ఆమె భర్త వంశీ.

ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 8 చదవండి.

అదే పనిగా కాలింగ్‌బెల్‌ మ్రోగుతూ ఉంటే ఉలిక్కిపడి నిద్ర లేచింది యమున.


ముందు కలేమో అనుకుంది. కానీ కాదు. తన ఫ్లాట్‌ కాలింగ్‌ బెల్‌ మోగుతోంది. గబగబా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా వెన్నెల నిలుచుంది. ఒక్కసారి నిర్ఘాంత

పోయింది.


"నువ్వు ! ఏమిటే ఈ వేళప్పుడు!” లోపలికి రమ్మని పక్కకు తప్పుకుంటూ అడిగింది యమున.


వెన్నెల ఏమీ మాట్లాడలేదు. వెన్నెల ముఖం చూస్తే ఏదో జరగినట్లు జరింగిదని చెప్పకనే చెబుతున్నట్లుంది.


వెన్నెల లోపలికొచ్చి కూలబడింది. యమున వెళ్ళి ఫ్రిజ్‌ లో నుంచి చల్లని నీళ్ళు తెచ్చి ఇచ్చింది. వెన్నెల గడగడా తాగేసింది. అప్పుడు సమయం పన్నెండు గంటలు

కావస్తోంది.


"వెన్నూ, ఏమయిందే, ఏం జరిగిందే ? ..” ఆమె ప్రక్కన కూర్చుంటూ అనునయంగా అడిగింది యమున.


వెన్నలకి దుఃఖం ముంచుకొచ్చింది. కళ్ళు తుడుచుకుంది.


“ఆ మెంటల్‌ తో గొడవయ్యింది." అన్నది మళ్ళీ కళ్ళు తుడుచుకుంటూ.


మెంటల్‌ అని సంభోదించింది తన మొగుణ్ణే నని యమున ఊహించుకుంది. యమున కి కొంచెం అర్థమయ్యింది. లేకపోతే ఈ సమయంలో ఆమె అలా రాదని యమునకి అర్థ

మయ్యింది.


“సరే! చాలా రాత్రి అయ్యింది. ప్రొద్దున మాట్లాడుకుందాం. ఇంతకీ అన్నం తిన్నావా లేదా అసలు.. ?” అడిగింది యమున.


"లేదు".


“ముందు కాస్త తిను. ప్రొద్దున అన్నీ మాట్లాడుకుందాం..” అంటూ తన డైనింగ్‌ టేబుల్‌ మీదున్న గిన్నెలు తీసి చూస్తుంటే వెన్నెల అంది "ఇప్పుడేం వద్దు లేవే, తినాలని లేదు" అని.


"నీ మొహం .. అన్నం మానేసి కడుపు కాల్చుకుని మనం సాధించేదేమీ లేదు. ముందు కాస్త తిను. అన్నం కొంచమే ఉంది. ఆకలేస్తే బిస్కట్లు ఉన్నాయి. తిందువు గానీ---” అంటూ కంచం లో అన్నం, ఆవకాయ పెట్టి ఆమెను పిలిచింది.


నిజానికి వెన్నెలకి తినాలని లేదు. కానీ చాలా నీరసంగా ఉంది. భర్తతో గొడవపడి అలసిపోయింది. మళ్ళీ యమున పిలవడంతో వచ్చింది వెన్నెల. ఆమె తిన్నాక రెండు అరటిపళ్ళు ఇచ్చింది యమున. ఒక పండు తీసుకుని తిన్నది వెన్నెల.


“అంత తీవ్రంగా పోట్లాడుకున్నారా ?..” అడగకూడదనుకుంటూనే అడిగింది యమున.

“ఆ .. కొట్టే దాకా వచ్చాడు.. చంద్రం కొట్టడానికి చెయ్యెత్తాడు.. ఆ ఊపులో నాకూ కోపం వచ్చి అతనిని తోసేసీ నేను ఇటు పరుగెత్తుకొచ్చాను..” ఏడుస్తూ చెప్పింది వెన్నెల.


“సరే పడుకో.. పొద్దుటే అన్ని విషయాలు చెబుదువు గానీ. అప్పుడు ఏం చెయ్యాలో ఆలోచిద్దాం..” అంటూ లేచి వెళ్ళి వేరే గదిలో వెన్నెలకు పక్క ఏర్పాటు చేసింది.


వెన్నెలను ఓదారుస్తూ యమున కూడా ఆమె ప్రక్కన పడుకుంది. వెన్నెలకు చాలాసేపు నిద్ర పట్టలేదు. మధ్యమధ్య ఏడుస్తూ వెక్కుతూనే ఉంది. యమున ఆమె

వీపు మీద చెయ్యి వేసి మెల్లగా నిమురుతూ "ఊరుకో వెన్నూ, ఊరుకో” అంటూనే ఉంది. ఎప్పటికో తెల్లవారుఝామున వెన్నెలకు నిద్ర పట్టింది.


మామూలుగా ఏడు గంటలకి నిద్ర లేచిన వంశీకృష్ణ ఆ గది లోకి వెళ్ళాడు. ఒక్క ఉదుటున ఆగిపోయాడు.


అక్కడ ఉన్న వెన్నెలను చూసి, గబగబా భార్య దగ్గరకు వెళ్ళి "అక్కడ పడుకున్నది వెన్నెల కదూ?” అని


“అవును, వెన్నెలే రాత్రి మొగుడు పెళ్ళాలు గొడవ పడ్డారట. అందుకని ఇక్కడకు వచ్చింది." అంది యమున.

“ గొడవపడా?”

"వాళ్ళకి గొడవపడడం సర్వసాధారణం. కానీ రాత్రి గొడవ బాగా ఎక్కువయ్యి ఉంటుంది” భర్త కి కాఫీ ఇస్తూ అంది యమున.


“చంద్రం ఒట్టి రోగ్‌!” కాఫీ అందుకుని హాల్లోకి వెళుతూ అన్నాడు వంశీకృష్ణ.


ఇంకో అరగంట కి లేచింది వెన్నెల. హాల్లో అటు తిరిగి కూర్చున్నాడు వంశీ కాఫీ తాగుతూ, టీవి చూస్తూ. మౌనంగా కిచెన్‌ లోకి వచ్చింది. యమున ప్రక్కన కూర్చుంది.


"పేస్టుతో నోరు పుక్కిలించు.. కాఫీ ఇస్తాను..” అన్నది యమున.


“ఇంటికి వెళ్ళనా?..” అడిగింది వెన్నెల బేలగా.


“వెళుదువు గానీ, అసలేం జరిగింది? అంత తీవ్రంగా ఎందుకి పోట్లాడుకున్నారు. వెళుదువు గానీ..” అడిగింది యమున. "ముందు నోరు పుక్కిలించుకురా.. అవన్నీ తరువాత మాట్లాడుకుందాం” మళ్ళీ యమునే అంది.


వెన్నెల బాత్‌రూమ్ కెళ్ళి నోరు పుక్కిలించుకుని వచ్చింది. ఇద్దరూ చెరో గ్లాస్‌ కాఫీ తెచ్చుకుని గదిలోకి వెళ్ళారు.


"నువ్వు స్నానం చేస్తే చేసేయ్‌. ఇంటి కెళ్ళి బట్టలు మార్చుకుందువు గానీ..” చెప్పింది యమున.

"ఇంటి కెళ్ళనా ?" అడిగింది వెన్నెల.

"వెళుదువు గానీ.. ఇప్పుడు కాదు. ఆఫీసు కెళ్ళేటప్పుడు. ఇద్దరమూ వెళదాము..” యమున సలహా, హామీ కూడా

ఇచ్చింది.


"అలాగే..”

"ఈ లోగా నేను వంట చేసేస్తాను. ప్రియ లేచిందేమో..” అంటూ లేచి వెళ్ళింది యమున. వెన్నెల అలానే ఒంటరిగా కూర్చుండిపోయింది. ఆ గదిలో. ఓ గంట అయ్యాక వంశీకృష్ణ స్నానం చేశాడు.


“ఈ వేళ మీరు వెళ్ళిపొండి. ప్రియని కేర్‌ సెంటర్‌

లో దిగబెట్టి నేనూ, వెన్నెల ఆఫీసుకు వెళతాం” అతడికి టిఫిన్‌ పెడుతూ చెప్పింది యమున.


ఆమె చెప్పినట్లే ఎనిమిదన్నరకీ తయారయ్యి ఆఫీసుకు వెళ్ళి

పోయాడు. అతను వెళ్ళిన పదినిమిషాలకు ప్రియని తీసుకుని వెన్నెల, యమున బయలుదేరారు.


“చంద్రం ఇంట్లో ఉన్నాడేమో ..” వెన్నెల అన్నది. ప్రియని ఎత్తుకునేందుకు యమున దగ్గర నుంచి తీసుకుంటూ.


“ఉంటే ఉండనీ .. అందుకే నేను వస్తానన్నది. నీకూ, నాకూ లంచ్‌ క్యారేజీ తెచ్చాను. నువ్వు బట్టలు మార్చుకుని వచ్చేయ్‌. ఆఫీసుకు వెళదాం..” చెప్పింది యమున.

తన అపార్ట్‌మెంట్‌ కు వెళ్ళగానే వాచ్‌మెన్‌ ను అడిగింది.

తన ఫ్లాట్‌ లో కొచ్చి తాళం తీసి లోపలికెళ్ళింది వెన్నెల. ఇల్లంతా చిందరవందర గా ఉంది. రాత్రి తాను ఇల్లు వదిలి వచ్చేశానని కోపంతో 'ఇల్లంతా ఒక రుప్ప లాగా

తయారు చేశాడన్న మాట' ..


వెన్నెలకి అర్థమయ్యింది. రాత్రి నేను వెళ్ళాక, ఏం చెయ్యాలో తెలీక ఇలా చేశాడన్నమాట.. ‘ఇడియట్‌..’ వెన్నెల అన్నది.


“నేనేం సర్దను.. అలానే ఉంచేస్తాను..” అని మళ్ళీ తనే అంటూ బట్టలు మార్చుకోసాగింది.


యనున ఏం మాట్లాడలేదు. ఆ కోపంలో ఏ టీవినో బద్దలు కొట్టనందుకు ఎంతో సంతోషించింది. ఆమాట పైకి అనలేదు, వెన్నెల ఎక్కడ బాధ పడుతుందోనని.


“రాత్రి మామూలుగానే తాగొచ్చాడు చంద్రం” బట్టలు మార్చుకుని వచ్చి సోఫాలో యమున ప్రక్కన కూర్చుంటు అన్నది వెన్నెల.


రాత్రి జరిగిన విషయం ఆమె చెప్పబోతోందని యమునకి అర్థమయ్యింది. టైము చూసుకుంది.


"పరవాలేదు. ఇంకా పావుగంట టాముంది. బస్టాప్‌ కు వెళ్ళటానికి..”

“మామూలుగా నేను ఏం మాట్లాడలేదు. తలుపు తీసి మౌనంగా పడుకున్నాను. తను నన్ను పిలిచాడు. నేను పలకలేదు. వెళ్ళలేదు కూడా. డైనింగ్‌ టేబుల్‌ మీద గిన్నెలన్నీ పెద్ద శబ్ధం చేస్తూ భోజనం చేశాడు. నేనేం పట్టించుకోలేదు. ఎలాగోలా చేసుకోనీ అన్నట్లు పడుకున్నాను. ప్రతిరోజూ జరిగే తంతు ఇదే. అన్నం తిన్నాక నన్ను మళ్ళీ పిలిచాడు. బెడ్‌ రూమ్‌లోకి రమ్మనమని.


‘రమ తో కులికింది చాల్లేదా దొరగారికి?’ అన్నాను కోపంగా!


‘రమనా.. ? నీ కెవరు చెప్పారు?’ అన్నాడు.


‘ఒకరు చెప్పేదేమిటీ? పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతే ఎవరూ చూడలేదనుకుందిట! మీ మూసీ మురికి సంగతులు నాకు తెలుసు. అన్నాను.


‘ఆ.. రమతో కులికొచ్చా, ఏం చేస్తావ్‌? నువ్వు నన్ను ఏం చెయ్యలేవు!’ అన్నాడు.


‘నీ లాంటి తాగుబోతు, పచ్చితిరుగుబోతు కిచ్చి నాకు పెళ్ళి చేసిన మా నాన్నననాలి’ అన్నాను.

‘మీ నాన్న పెద్ద ముష్టి వెదవ.. పంట డబ్బు లివ్వకుండా కథలు చెబుతున్నాడు’ అన్నాడు..


ఆ మాటకి నాకు సర్రున కోపం వచ్చి, ‘ఏం.. ఇస్తే ఏం చేసేవాడివి’ అన్నాను కోపంగా.

అలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. పెద్ద గొడవయ్యింది. నా మీద కొచ్చాడు. కొట్టడానికి. నేను కూడా ఆ దశలో అనుకోకుండా అతన్ని దూరంగా తోసేశాను. తాగిన మత్తు దిగలేదను కుంటా, కింద పడబోయి గోడను ఆసరా చేసుకుని నించున్నాడు. నోటికొచ్చిన బూతులన్నీ తిట్టాడు.


మా వాళ్ళు దొంగలని, సంస్కారము కానీ మంచీచెడు ఏవీ తెలియని పరమ బేవార్సు గాళ్ళని నోటి కొచ్చినట్టు తిట్టాడు.

పనికిమాలిన దాన్ని నన్ను తనకు అంటగట్టారట.


తాగితందనాలు, అమ్మాయిలతో కులకడం సభ్యతా సంస్కారమా అని నేను నిలదీశాను.


‘నా ఇష్టం వచ్చినట్టు తాగుతా.. అమ్మాయిలతో కూడా తిరుగుతా.. అది నా ఇష్టం. నేను మగాడిని..’ అన్నాడు.


‘సరే. నేను కూడా తాగుతాను. అబ్బాయిలతో తిరుగుతా.. అన్నాను’


అప్పుడు మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తాడు. నేను కూడా చెయ్యెత్తాను. అహం బాగా దెబ్బతిందను కుంటాను. నన్ను దవడ మీద కొట్టాడు. నేను కూడా చెంప చెళ్ళుమనేట్లు కొట్టాను. దాంతో వెర్రికోపమొచ్చి చుట్టుప్రక్కల కర్ర గురించి వెతికాడు. అవేమీ దొరక్కపోయే సరికి నా పీక పట్టుకోబోయాడు.


నేను పరుగెత్తుతూ అతన్ని ఒక్క తోపు తోసేశాను. ఆ విసురుకి వెళ్ళి సోఫాలో పడ్డాడు. మత్తు బాగా ఉందేమో లేవలేకపోయాడు.

ఆ సమయంలో నేను మెయిన్‌ డోర్‌ దగ్గర ఉన్నాను. డోర్‌ దగ్గరగా వేసేసి గబగబా బయటకు వచ్చేశాను. తనూ కూడా తలుపు తీసుకుని వెన్నూ, వెన్నూ అని అరుస్తూ బయటకి వచ్చాడు.


లక్కీగా ఆటో దొరికింది. ఎక్కి మీ ఇంటి కొచ్చేశాను. ఇదీ రాత్రి జరిగిన వ్యవహారము. మా ఆయన గారి నిర్వాకము” చెమర్చిన కళ్ళు తుడుచుకున్నది.


ఆమె భుజం మీద చెయ్యి వేసి ఓదార్చింది యమున. దెబ్బకి దెబ్బ కొట్టినందుకు వెన్నెలని తప్పు బట్టాలా! తాగొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడిన చంద్రంని తప్పు బట్టాలా! ఏం మాట్లాడాలో తెలియడంలేదు.


వెన్నెల గురించి ఆమెకు బాగా తెలుసు. తొందర పడే మనిషి కాదు. ఓదార్పున్న మనిషి. అయితే ఓర్పుకు ఒక హద్దు ఉంటుంది. ఏది ఏమైనా చంద్రం అలా రోజూ తాగి రావడం యమునకు ఎంతమాత్రం నచ్చలేదు. ఆ మాట కొస్తే తన భర్త వంశీకూడా తాగుతాడు. కానీ చాలా పరిమితంగా. తన సలహాను అతడు అంగీకరించాడు.


భార్యాభర్తలు అలాంటి సర్దుబాట్లు ఉన్నప్పుడే సాఫీగా జీవితం సాగుతుంది. అదే వెన్నెల, చంద్రం మధ్య లేదన్నది యమునకి బాగా తెలుసు. అందుకే వాళ్ళ

జీవితంలో ఈ కలతలు.


‘ఇప్పుడేం చేస్తావ్‌?’ అని వెన్నెలని అడుగుదామని అనుకున్నది యమున.


కానీ అలా అడగలేదు. అడగడానికి సందేహించింది.


‘ఇంక ఈ మనిషి తో వేగలేనే’ వెన్నెల అన్నది కాస్సేపయ్యాక.


‘ఏం చేద్దామని, నీ ఉద్దేశం ?’ అడిగింది యమున. అడిగాక అయ్యో ఇలా ఎందుకడిగానా అనుకున్నది.


‘విడాకులు తీసుకుంటాను..’ చెప్పింది వెన్నెల గడ్గతికస్వరంతో.


‘ఉహూ .. తొందరపడకు.. బాగా ఆలోచిద్దాం.. అయినా ఇలాంటి చిన్న సమస్యలు ప్రతికుటుంబంలోనూ మామూలేనూ..’ యమున అనునయంగా చెప్పింది.


‘నాకు చిన్న సమస్యగా అనిపించడం లేదే. ఒక్క తాగుడంటే పోనీ ఏదో తంటాలు పడి మానిపించవచ్చు. లేదా కాస్త తగ్గించవచ్చు. కానీ అమ్మాయిల పొందుకోసం ఏడ్చే వాళ్ళని మళ్ళించడము ఎవరి తరం కాదే, అందుకే ఈ నిర్ణయం . ఈ రోగ్ కి గుడ్‌బై చెప్పటమే మంచిది. నాకైతే తొందరపాటు కావచ్చు .. కానీ ఈ మనిషితో ఇలా ఎంతకాలం భరించను?

ఇంటి కొస్తే కాస్త ప్రశాంతంగా ఉండాలి కదా! ఏ వారానికో కొంచెం తాగొచ్చాడంటే సర్దుకుంటాను. పోనీ లే అని.. కానీ ప్రతి రోజూ ఈ తద్దినం ఎక్కడ భరించనే.. ఓ ముద్దూ.. మురిపెం.. ముచ్చటా. లేకపోతే నా వల్లకాదే’.

‘సరే ఆలోచిద్దాం అన్నాగా.. తొందరపడకు.. పద ఆఫీసు కు టైం అవుతోంది.. బస్సు దొరక్కపోతే ఆటోలో వెళ్ళిపోదాం..’ అంటూ లేచింది యమున.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.









65 views0 comments

Commenti


bottom of page