top of page

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 9


'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 9' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 9' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు.


వెన్నెలను కలిసి తన భావాలు వ్యక్తపరుస్తాడతడు. మౌనంతో తన అంగీకారం తెలుపుతుందామె. తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుంది. వెన్నెల వివాహం చంద్రంతో జరుగుతుంది.


చంద్రం మాజీ ప్రియురాలు మనోరమ కనబడలేదనే వార్త గురించి మాట్లాడుకుంటారు వెన్నెల, ఆమె స్నేహితురాలు యమున. గతంలో మద్యం తాగి వచ్చిన చంద్రంతో మాట్లాడదు వెన్నెల. చంద్రం గురించి మాట్లాడుకుంటారు యమునా, ఆమె భర్త వంశీ. చంద్రంతో విడిపోవాలను కుంటున్నట్లు చెబుతుంది వెన్నెల.


ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 9 చదవండి.


గాలికి చెట్లకొమ్మలు కదులుతూంటే అనుభవజ్ఞుడయిన సంగీతవిద్వాంసుడు ఒకే సమయంలో అనేక వాయిద్యాలు వాయిస్తున్న అనుభూతి. దేవుడి కన్నా గొప్ప

విద్వాంసుడెవరూ?

కదిలే గాలి వెదురు సందుల్లో రవళిస్తే మురళి రాలి ఆకులమీద కదిలే వాయులీనం

ఊగే లతలమీద వర్షపుచుక్క వీణానాదం

ఏటవాలు కెరటం మీద నీటితుంపర జలతరంగిణి

పడి దూకే నీటి పాయల సన్నాయి

ఎద పగిలే ఉరుమే ఢమరుక్కు

సంగీతకారుడు సరిగమలు నోట్‌ మీద సంగతులు వ్రాసుకుంటాడు.

భగవంతుడు మనిషి నుదుటి మీద అతని సంగతులు వ్రాస్తాడు.

---------------------------------

అదండీ అన్నయ్యగారూ విషయం. మొగుడు తాగొచ్చాడని, సినిమాకు తీసుకెళ్ళలేదని, పట్టుచీర కొనలేదని, నలుగురు ముందు తాగేసి నానా రభస చేశాడని విడాకులు తీశేసుకుంటున్నారు. అసలు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటున్నారుట! విదేశాలలో ఇదే తంతు అట. ఇలా చెత్తచెదారము కారణాలు తెప్పి విడాకులు తీసేసుకుంటున్నారు.


మనం మాత్రం ఆ దేశంలో లేముగా! అయినా మేం ఎప్పుడన్నా మీతో తగాదాలు పెట్టుకున్నామా! ఆఖరికి పెళ్ళిలో లాంచనాలు దగ్గర కూడా మేం మాట్లాడలేదు.

మీరు చెప్పినట్లు నడుచుకున్నాము. కట్నం విషయంలోనూ మేం మీ మీద భారం వేయలేదు. మీరు కట్నంగా ఇచ్చిన భూమిమీద శిస్తుకూడా ఈ మధ్య ఇవ్వడం

లేదట!..


అదలా ఉంచండి.. మూడేళ్ళుగా లేనిది వాడు అమ్మాయిలతో తిరుగుతున్నాడని మీ అమ్మాయి విడాకులు తీసుకుంటానంటోంది. ఈ విషయం ఏం బాగోలేదు. అన్నయ్య గారూ!.. ఇవాళ ఈ పట్నంలో తాగని వాడెవడూ చెప్పండి నాకు.


మీ అమ్మాయి మూడు రోజుల నుంచి ఇంట్లో భోజనము చేయడము లేదు. కాఫీ టిఫిన్‌ లూ ఏవీ ముట్టడం లేదు.. ఏమిటీ నిరహారదీక్ష.. మాకు తెలీదా? మేం మాత్రం

సంసారాలు చేయలేదా? ఒక పిల్లో, పిల్లాడ్నో కంటారని ఆశపడ్డా! అందరూ ఇలాగే ఉంటున్నారా?.. ఏరా అంటే నేనేం చెయ్యను? విడాకులు ఇస్తారా, నెలరోజుల్లో మా

వాడికి పెళ్ళి జరిపించేస్తా.. మా బందువుల ఎరిక లో చాలా మంది బంగారు బొమ్మలాంటి ఆడపిల్లలున్నారుట.. ఏం చేస్తారో చెప్పండి.. నా కైతే మా బంధువుల ముందు తలకెట్టేసినట్లుంది. ఈ వ్యవహారం చూస్తుంటే నా తల పగిలిపోతోంది..” అత్తగారు పార్వతమ్మ పూనకము వచ్చినదానిలా వూగిపోతూ అనేసింది.


ఆ రోజు ఉదయాన్నే వెన్నెల తండ్రి వెంకటరామయ్య భార్యని తీసుకుని వచ్చాడు.


మీ కూతురి వ్యవహారం బాగాలేదని ఓ సారి రండని వెన్నెల మావగారు భూపతిరావు ఫోన్‌ చెయ్యడంతో వచ్చారు వెంకటరామయ్య దంపతులు.


వియ్యపురాలు అలా మాట్లాడేసరికి వెంకటరామయ్యకి మాటలు కరువయ్యాయి. అంటే సమాధానము చెప్పలేక కాదు. తను ఏ మాత్రం నేరు జారినా ముల్లు వచ్చి అరి

టాకులమీద పడ్డా.. అన్న సామెత గా తయారవుతుంది. తన కూతుతు కాపురం ఎక్కడ వీదిన పడుతుందో నని కాస్త తగ్గాడు. అల్లుడు ఏ మాత్రం తాగుతాడో, ఎలా ఇంటికి వస్తాడో తను ప్రత్యక్షంగా చూశాడు. రోజూ ఇంతేనా అమ్మా? అని అన్నప్పుడు కూతురు వెన్నెల ఏమీ మాట్లాడలేదు. విననట్లు ఊరుకున్నది. ఆ ప్రశ్న రెట్టించలేదు విషయం అర్థం చేసుకుని.


ఇప్పుడు వియ్యపురాలు తన కొడుకు 24 కేరట్‌ బంగారం అన్నట్లు మాట్లాడుతోంది. ఎప్పుడైనా ఆ మాత్రం తాగరా.. ఆ మాట కొస్తే మీ ఆయన తాగరా? మీరు తాగరా? అని కూడా అనేసింది.


తాగడం, తాగకపోవడం సమస్య కాదమ్మా! అమ్మాయి అంతగా బాధపడుతోందంటే మీరు కొంచెం ఆలోచించాలి. కాపురంలో కలతలు రాకూడదు.. వచ్చినా.. మూడో వ్యక్తి.. తల్లిదండ్రులు ఎవరైనా సరే కలగజేసుకోకుండా పరిష్కరించుకోవాలి.


ఇవాళ మనం ఇలా పంచాయితీ పెట్టడం నాకు బాగా లేదు. అల్లుడుగారు ఏ మాత్రం, ఎంత మేరకు తాగుతారో నేను ప్రత్యక్షంగా చూశాను. దాని మీద నేను మాట్లాడ

దలచుకోలేదు. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా కలిసి ఉండడమే మనకు ప్రధానం. విడాకులు ఇస్తే మీ అబ్బాయికి మీరు పెళ్ళి చేయగలరు. మగవాడికి పెళ్ళవుతుంది. అలాగని నాకుతురికి ఏమై పోతుందేమోనన్న బెంగ, భయము నేను పడిపోవడము

లేదు. ఆ పరిస్థితి వస్తే.. రాకూడదని నా కోరిక.. ఎలా రాస్తే అలా జరుగుతుంది. జరిగిందేదో జరిగిపోయింది. ఇకనుంచి అల్లుడుగారిని ఆ అలవాట్లు మార్చుకోమని మీరు

చెప్పండి.. భర్త సరిగా ఉండడం కన్నా భార్యకి కావలసిన దేముంది. ?” అన్నాడు వెంకటరామయ్య కర్రా విరగకుండా పామూ చావకుండా అన్నట్లు.


"అంటే ఏమిటీ మీ రనేది? నేనేదో చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నట్లు నీతులు చెబుతున్నారు. నా హద్దులు ఏమిటో నాకు బాగా తెలుసు. ఒకళ్ళ దగ్గర పాఠాలు చెప్పించు

కోవాలసిన ఖర్మ నాకు పట్టలేదు..” చంద్రం అన్నాడు విసురుగా.


“లేదు అల్లుడు గారూ, .. నేను మీకు పాఠాలు చెఫడం లేదు.. నాకు పెళ్ళి కాకముందు ఘంట చుట్ట తాగే అలవాటు ఉండేది. పెళ్ళయిన కొత్తలో మీ అత్తగారు చుట్ట మానేయ్య లేరా.. నాకు పడడం లేదు. అని చెప్పింది. అంతే మానేశాను. ఆ దృష్టి తేనే మీకు నేను అలా

చెప్పాను.." వెంకటరామయ్య అన్నాడు, అల్లుడు చంద్రం నొచ్చుకున్నాడని.


ఆ మాటకి ఎవరూ మాట్లాడలేదు. చంద్రం ముఖం గంటు పెట్టుకుని కూర్చున్నాడు. ఆ తరువాత చాలా సేపు మౌనం రాజ్యమేలింది. ఒకరి ముఖమ ఒకరు చూసుకుంటూ అలా ఉండిపోయారు.

పదండి అలా బజారుకు వెళదామనుకుంటున్నాను. బయలుదేరండి.! కాసేపయ్యాక పార్వతమ్మ భర్తని ఉద్దేశించి అన్నది నర్మగర్భంగా. అన్న ఆ మాటలలోని అర్థం

అవగాహన చేసుకుని భుజ మీద ఉన్న తువ్వాలును దులుపుకుని మరల భుజంమీద వేసుకుంటూ లేచాడు భూపతిరావు.


“ఆడదన్నాక కొంచెం అణగిమణిగి ఉండాలి బావగారు. అంత మిడిసిపాటు, అహంకారం పనికిరావు.. ఆలోచించండి..” అంటూ తలుపు తీసుకుని ఆ వెనుక పార్వతమ్మ, చంద్రం కూడా వెళ్ళారు.


వాళ్ళు బజారుకని వెళ్ళింది మాట్లాడుకోవడానికని చెప్పకనే చెప్పారు వెంకటరామయ్యకు. వాళ్ళు వెళ్ళాక ఓ ఐదు నిమిషాలు పోయాక అన్నది వెన్నెల తల్లి. "వాళ్ళు

మాట్లాడుకోవడానికి వెళ్ళినట్లుంది.. ఇంతకీ నీ ఉద్దేశ్యమేమిటే” అనడిగింది తల్లి వెన్నెలని.


"మీరెన్నయినా చెప్పండమ్మా.. ఆ మనిషితో నేను సర్దుకోలేను.. విడాకులు తీసుకుంటాను.. నాన్న చెప్పినట్లు నేను బ్రతకగలను.." నిష్కర్షగా చెప్పింది వెన్నెల.


"ఆ మొండి పట్టుదలే వద్దు. కాస్త ఆలోచించు.. విడాకులు తీసుకోవడం మొదట్లో బాగానే ఉంటుంది. తరువాత చాలా సమస్య లొస్తాయి.." అంది వెన్నెల తల్లి.


“వస్తే రానీ అమ్మా.. భరిస్తాను.. ఇంత జరిగాక మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ఆ మనిషితో కాపురం చేయమంటావా? అది సాధ్యమేనా? అసలు ఆ కాపురం అతుకుతుందా?” వెన్నెల చాలా కోపం గానే అన్నది.


"నువ్వు అలా కసురుకుంటే కాదు వెన్నూ.. కాస్త నా మాట విను.. వాళ్ళు మళ్ళీ వచ్చి రాగానే ఏదో మాట్లాడుతారు".


“మా అత్తగారు చూశావా ఏమన్నదో.. వాళ్ళబ్బాయికి నిమిషాల్లో పెళ్ళి చేస్తానన్నట్లు మాట్లాడుతోంది.. అంత నేనేనా తీసిపోయినదానిని?” వెన్నెల తీవ్ర ఆగ్రహంతో అంది.


"ఏదో అన్నదిలే.. మొదటి పెళ్ళివాడికే ఎక్కడా పిల్లలు దొరకడం లేదు. ఇంక రెండో పెళ్ళివాడికా!..” వెంకటరామయ్య అన్నాడు.


“అదే నాన్నా మరి! నేను మిడిసిపడుతున్నానంటున్నాడు మా మామ.. మిడిసిపడుతున్నది మా అత్తే”.


“సరేలే.. ఆ విషయానికేంగానీ.. ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు?" వెంకటరామయ్య కూతురిని అడిగాడు.


“ఆ మనిషితో నేను వేగలేను నాన్నా.. మళ్ళీ గొడవైతే ఆ మనిషి ఏం చేసినా చేస్తాడు.. ఆ తరువాత మీ ఇష్టం”

"నేనో మాట చెబుతాను వింటావా?" వెంకటరామయ్య అడిగాడు.


"ఏమిటీ?"


"తక్షణం విడాకుల కోసం పట్టుబట్టకు. కొన్నాళ్ళు మీరిద్దరూ విడిగా ఉండండి. అతడిలో ఏదైనా మార్పు వస్తే అప్పుడు కలసి ఉండొచ్చు. లేదంటే అప్పుడు విడాకులు

తీసుకుందురు గానీ."


కూతురు ఆవేశాన్ని కాస్త చల్లార్చడానికి అదో మార్గంగా తోచింది వెంకటరామయ్యకు. ఆమెకు ఉద్యోగం లేకపోయి ఉంటే ఆమెను పుట్టింటికి తీసుకుపోయి కొన్నాళ్ళు తన

దగ్గర ఉంచుకునేవాడు. మనిషి దగ్గర లేకపోతే ఎవరికైనా వాళ్ళ విలువ తెలుస్తుందన్నది జనవాక్యం.


తండ్రి చెప్పిన ఈ ఆలోచన బాగా ఉన్నట్లు తోచింది వెన్నెలకి. విడాకులు తీసుకున్నా తాను వేరే ఉండాల్సిందే. ఆ ఉండేదేదో ఇప్పుడే ఉంటే.. ఆ తరవాత చంద్రంని

పరిశీలించవచ్చు అనుకున్నది. అయిష్టంగానే తలూపింది.

"సరే. ఈ విషయం నేనేమీ వాళ్ళకు చెప్పను.. నువ్వు ఆలోచించుకో.. ఎలా చేస్తే బాగుంటుందో.. సాయంత్రం బస్సుకి అమ్మా, నేను వెళతాం మరి" అన్నాడు వెంకటరామయ్య.


"అలాగే.. అన్నది వెన్నెల. మరో రెండు రోజులందామనుకుంది. కానీ ఆమె అనాలను

కుంటుండగానే కాలింగ్‌బెల్‌ మ్రోగింది. వెన్నెల తల్లి వెళ్ళి తలుపు తీసింది. అత్తగారూ, మామగారూ లోపలికి వచ్చారు. చంద్రం రాలేదు. ఏదో పనుందని వెళ్ళాడట. వాళ్ళు

ఏమీ మాట్లాడకుండా సరాసరి గది లోకి వెళ్ళిపోయారు.


పార్వతమ్మ తలుపు దగ్గరకి కొంచెం వేసింది. ఆ తరవాత చాలాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఆరుగంటలు

కావస్తుండగా వెంకటరామయ్య భార్యతో బయలుదేరాడు.


వెళ్ళేముందు గది దగ్గరగా నిలుచుని ' బావగారూ' అని పిలిచాడు. పార్వతమ్మ తలుపుతీసింది.


“ఏం లేదమ్మా! మేం బయలుదేరుతున్నాం.. చెప్పిపోదామని పిలిచాను” అన్నాడు.


“ఇంతకీ ఏమి ఆలోచించారు?” అనడిగిందామె. భూపతిరావు వచ్చి భార్య వెనకే నిలుచున్నాడు.


“ఆలోచించడానికేముంది.. మీ రెలాగ అంటే అలానే చేద్దాం.. మీకు తెలియంది కాదు.." అన్నాడు.

"సరే. వాళ్ళకి చెప్పేదేదో చెప్పాం.. ఇక వాళ్ళిష్టం.. మేమూ ఒక గంటలో బయలుదేరుతున్నాం. అన్నయ్యగారూ.. ఏడున్నర, ఎనిమిది గంటలకు మా బస్సు.." అంది.

వెంకటరామయ్య తలూపి భార్యతో బయలుదేరాడు. అత్త మామలు కూడా బయలుదేరారు. మళ్ళీ తనకి క్లాస్‌ పీకుతారని అనుకున్నది వెన్నెల. కానీ అలా జరగలేదు.

వాళ్ళు వెళ్ళాక ఓ గంట మౌనంగా కుర్చీలో కూర్చుండిపోయింది.


కిషోర్‌ దా పాట ఎక్కడ నుంచో లీలగా వినబడుతోంది.

"తుమ్ ఆ గయీ - హో నూర్‌ ఆగయా హై.. ఆంధీ సినిమా లోని పాట వస్తోంది. తనకి ఎక్కువ ఇష్టమైన పాటల్లో ఇదొకటి. యధాలాపంగా హమ్ చేస్తోంటే కళ్ళ ముందు ముసలి వేషాలలో సంజీవ్‌కుమార్‌, సుచిత్రా సేన్‌ కనిపించారు.


కాపురం కంటే కెరీర్‌ ముఖ్యమని అనుకుని పంతాలు పట్టి విడిపోయాక ఆ జంట వృద్దాప్యంలో తిరిగి కలుసు కుంటారు. అప్పుడు పాడుకునే పాట అది. ఈ సంగతులన్నీ జ్ఞాపకం వస్తోంటే తన భవిష్యత్‌ కళ్ళముందు కనిపించింది.


ఛత్‌, అనుకుంటూ తన సంగతి వేరు అనుకుంది.

తరువాత ఓ నిర్ణయానికొచ్చినట్టు గబగబా తన బట్టలు, వస్తవులూ రెండు బ్యాగులలో సర్దుకున్నది.

------------------------------------------------------

"భారతీయుల ఆత్మతత్త్వం..!"


అంతర్జాతీయ ఖ్యాతి నార్జించి అమెరికాలో ఉంటున్న వైద్యుడు సొంతూరు వచ్చినప్పుడల్లా పాఠాలు చెప్పిన గురువులకు పాదాభివందనం చేస్తాడు.

అదీ.. సంస్కారం

కారు మేఘాలు కమ్ముతున్నాయి. ఏ క్షణంలో అయినా.. వర్షం విపరీతంగా కురుస్తుంది.. వేసే ముగ్గు.. వర్షంలో కలుస్తుంది! అయినా ఆమె ముగ్గు వేస్తుంది!

అదీ.. సంప్రదాయం..!


భార్యాభర్తలు సమానులనే భావంతో పనులేవైనా ఒకరికి ఒకరై అవగాహనతో ప్రేమను ఇచ్చిపుౘుకుంటూ బంధాన్ని కొనసాగించటం.

అదీ.. దాంపత్యం-అదీ అనుబంధం!


ఖగోళశాస్త్రాన్ని నమిలి మింగిన నిష్ణాతుడు. నిష్టగా ఉంటూ గ్రహణం విడిస్తే గాని ఆహారం గ్రహించడు.

అదీ.. నమ్మకం..!


అత్తింటికి వెళ్ళేముందు ఇంటి ఆడబడబచు పెద్దలందరికీ పాదాభివందనం చేసి పయనమవుతుంది.

అదీ.. పద్దతి..!


అంతరిక్షవిజ్ఞానాన్ని అరచేతబట్టిన అతిరథుడు అకుంఠిత దీక్షతో, నిష్టతో పితృదేవతలకు పిండప్రధానం చేస్తాడు..

అదీ.. సనాతనధర్మం..!


పరమాణు శాస్త్రాన్ని పిండి పిప్పి చేసిన పండితుడు మనవడి పుట్టువెంట్రుకలు పుణ్యక్షేత్రాలలో తీయాలి పరదేశం నుండి పయనమై వస్తాడు.

అదీ.. ఆచారం..!

పెద్దచదువులు చదివినా పెద్ర కొలువు చేస్తున్నా పేరుప్రఖ్యాతులున్నా పెళ్ళిపీటల మీద.. వధువు పొందికగా ఉంటుంది..!

అదీ.. సంస్కృతి..!


ఇవి భారతీయుల తరతరాల ఆచారాలు, సాంప్రదాయాలు, విలువలు, ఔన్నత్యం

ఇది భారతీయుల ఆత్మతత్త్వం..!

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
57 views0 comments

Comments


bottom of page