top of page

తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 7


'Tholagina Nili Nidalu episode 7' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam

'తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 7' తెలుగు ధారావాహిక

రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


వెంకటరామయ్య అనే రైతు కూతురు వెన్నెల. గుడి దగ్గర ఆమెను చూసిన రవిప్రకాశ్‌ అనే యువకుడు ఇష్టపడతాడు. ఆమె వివరాలు స్నేహితుడు సుధాకర్ ని అడిగి తెలుసుకుంటాడు. ఆ వూరు వదిలి వెళ్లాలనిపించదు అతడికి.


వెన్నెలను కలిసి తన భావాలు వ్యక్తపరుస్తాడతడు. మౌనంతో తన అంగీకారం తెలుపుతుందామె. తలిదండ్రులు వేరే సంబంధం చూస్తూ వుంటే తన మనసులో మాట బయటకు చెప్పలేక పోతుందామె. వెన్నెల వివాహం చంద్రంతో జరుగుతుంది.


చంద్రం మాజీ ప్రియురాలు మనోరమ కనబడలేదనే వార్త గురించి మాట్లాడుకుంటారు వెన్నెల, ఆమె స్నేహితురాలు యమున. గతంలో మద్యం తాగి వచ్చిన చంద్రంతో మాట్లాడదు వెన్నెల.

ఇక తొలగిన నీలి నీడలు ఎపిసోడ్ 7 చదవండి.


“ఏమిటీ శనివారం సడెన్‌గా సెలవ్‌ పెట్టేశావ్‌? ఏమయ్యింది?” ఆఫీసు నుంచి బయటపడ్డాక యమున ని అడిగింది వెన్నెల.


“మా అత్తారింటిరి వెళ్ళానే.. ప్రియని తీసుకొచ్చేదామని.. మొన్న ప్రొద్దున వెళ్ళాం.. నిన్న సాయంత్రం బయలుదేరి వచ్చేశాం..” చెప్పింది యమున.

"ప్రియని తీసుకొచ్చేశావా? అలవాటయిన పిల్లలని వదిలి ఉండటము కష్టం కదూ”.


“అవును.. వాళ్ళని సాకడం ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో.. వాళ్ళని వదిలి ఉండటము కూడా అంతకంటే బాధగా అనిపిస్తుంది. శనివారం విశేషాలు లేవా?”


"విశేషాలు.. అంటే ఏం లేదు.. మా అత్తామామలు వచ్చారు. అదే నా ముఖ్యమైన విషయము, విశేషము."


"ఊరికేనా..".


“ఇక్కడేదో పెళ్ళి ఉందని వచ్చారు. కానీ అసలు విషయం అది కాదు. మా ఆడపడుచు పెళ్ళి. మా ఆయన్ని ఓ రెండు లక్షలు సర్దమని అడగడానికి వచ్చారు అత్తమామలిద్దరూ”.

"మీ ఆయన ఇస్తానన్నాడా?"


"ఘనంగా వాగ్ధానం అయితే చేశేసాడు. మా ‘మగమహారాజు’. సేవింగ్స్‌ అయితే ఏమీ లేవు.. ఎక్కడ నుంచి తెస్తాడో మరి.. నన్నేమి ఇబ్బంది పెట్టొద్దని మాత్రం చెప్పాను”.

"మీ ఆయనకా?”

"ఊ ఆయనకే.. ఎక్కడైనా తీసుకురా అంటూ సతాయిస్తున్నాడు. ఆ మధ్య నీ దగ్గర ఓ యాభైవేలు ఇలాగే సతాయిస్తే తీసుకున్నాను. ఇచ్చేటప్పుడ మాత్రం ఇప్పుడో

అప్పుడో అన్నట్లు, తీసుకునేటప్పుడు తేనే కబుర్లు”.


"మీ పుట్టింటినుంచి తెమ్మంటాడా?"


“నా పేరు మీదే పొలం ఉంది. అది అమ్మి తెమ్మంటాడేమోనని ముందుగానే చేప్పేశాను. ఆ పని మాత్రం నేను చెయ్యనని. ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేదు. కానీ ఏ రాత్రో తాగొచ్చి ఏం గొడవ చేస్తాడేమోనని" అన్నది వెన్నెల.


యమున ఏమీ మాట్లాడలేదు. విని ఊరుకుంది. చంద్రం గురించి ఆమె అప్పుడప్పుడూ చెబుతూనే ఉంటుంది. ఖర్చు మనిషి యని అన్న సంగతి ఆమెకు తెలియంది కాదు.


"కాఫీ తాదుదాం.. అంటూ 'కాఫీ డే' లోకి దారితీశారు. అప్పుడఫుడు వెళుతుంటారు. కార్నర్‌ టేబుల్‌ దగ్గర కూర్చున్నారు.

"మరీ అలా తయారయ్యాడా? ఎందుకని?” యమున అడిగింది.


“ఎందుకంటే ఏం చెబుతాము.. తిన్నది అరక్క, ఒళ్ళు కొవ్వెక్కి. తాగుడే కాదు. ఆడస్నేహాలు కూడా ఉన్నట్లున్నాయి. వాళ్ళతో మందు పార్టీలు, జల్సాలు. ఈ మధ్య ఆయన సెల్‌లో వాట్స్‌అప్‌ మెసేజ్‌ లు చూశాను.. ఎవరో మనూ ట. క్యాంపు నుంచి నాకేమి తెచ్చావు.. అంటూ మళ్ళీ సారీ.. సాయంత్రం మన మీటింగ్‌ప్లేస్‌ లో కలుద్దామని,

అని మరో మెసేజ్‌ ఉంది. చంద్రాన్ని నేనేమి అడగలేదు. మగాళ్ళైతే కాదనిపిస్తోంది.." వెన్నెల చెప్పింది.


అది చెబుతున్నప్పుడు ఆమె స్వరంలో బాధ స్పష్టంగా ధ్వనించింది యమునకు.


"ఈ మగాళ్ళ కిదేం పోయే కాలం.. ఇంట్లో చక్కటి చుక్కలాంటి పెళ్ళాం ఉండగా ఇలా అడ్డమైన తిరుగుళ్ళు తిరగడమెందుకు? ఎందుకు చెడు అలవాట్లు చేసుకుంటారు" యమున అంది.


"అది నా తలరాతనుకుంటాను.." వెన్నెల బాధగా అంది.


ఓదార్పుగా వెన్నెల భుజం మీద చెయ్యి వేసింది యమున. "అది మాములు పరిచయమే నేమో. ఊరికే ఏవేవో ఊహించుకోవద్దు. గాబరా పడకు.." ఓదార్చింది.


"హోప్‌ సో.. " అంటూ బలవంతంగా నవ్వడానికి ప్రయత్నించింది వెన్నెల. కానీ

నవ్వలేకపోయింది.


తన భర్త అలాంటివాడా!.. ఇలా అవును కాదు అన్న సందిగ్ధావస్థ పడుతూనే వుంది. నాలుగురోజుల నుంచి ఆమె అవస్థ పడుతూనే ఉన్నది. కానీ తన భర్తని తానే మరీ చులకన చేసి చూపిస్తున్నానా అని కూడా అనుకున్నది. అతడి ధోరణి చూస్తూంటే దారి తప్పినట్లే అనిపిస్తోంది. మళ్ళీ ఈ ఆలోచనతో రోజు రోజుకి మరీ అస్థిమితంగా

తయారవుచున్నది.


ఆమె ఒక్క యమున దగ్గర మాత్రమే మనసు విప్పి మాట్లాడుతుంది. యమున కూడా అంతే. వాళ్ళిద్దరి దగ్గరా అరమరికలు లేవు. మంచి స్నేహితులు. ఆఫీసులో

చేరిన కొద్ది రోజులకే వాళ్ళు మంచి స్నేహితులు అయ్యారు. ఒకళ్ళకొకళ్ళు కష్టసుఖాలు చెప్పుకుంటారు. యమున నిండు కుండలా ఉంటుంది. వెన్నెల కాస్తంత భోళా మనిషి.

కాని నిక్కచ్చిగా ఉంటుంది. మాట్లాడుతుంది. ఇద్దరికీ అసూయాద్వేషాలు లేవు.

---------------------------------------------

ఇంతలో భానుప్రియ, మనోరమ వచ్చారు కాఫీ డే లోకి. కార్నర్‌ టేబుల్‌ దగ్గర కూర్చుని ఉన్న యమునని, వెన్నెలని చూసి వాళ్ళ దగ్గరకి వచ్చింది మనోరమ. ఇంతలో మనోరమ సెల్‌ మ్రోగితే తీసి చూసింది.


"హలో" అంది.

"అవును. నేను మనోని..” ఫోన్‌ లో చెప్పింది మనోరమ. ఆ మాటకి వెన్నెల చురుక్కున చూసింది, ఆమె కేసి.


మనోరమ- "మనో-" అంటే ? తన భర్త సెల్‌లో మెసేజ్‌ ఇచ్చిన మనో యేనా! అనుకున్నది. అర్థవంతంగా యమున కేసి చూసింది. వెన్నెల భావాలు యమునకి వెంటనే అర్థమయ్యాయి.


"అవును బాబూ! మనో నే ! కొంచెం జలుబు చేసిందిలే. చందూ! అందుకే టోన్‌ వేరేలా అనిపించింది నీకు. ఏమిటీ విశేషాలు? ఏమై పోయావ్‌ బాబూ. అసలు దర్శనాలు లేవు” ఫోన్‌లో మనోరమ మాట్లాడుతోంది.


చందు అన్న మాట వినపడగానే మళ్ళీ వెన్నెల ముఖంలో రంగులు మారాయి. కంగారు పడకు అన్నట్లు యమున కళ్ళ తోనే సంజ్ఞ చేసింది.


"కాంపు కెళ్ళావుట కదా! చెప్పాడు లే ధీరజ్‌. ఓ కే. ఏడింటికి కలుస్తాను.. అలో.. అలాగే” మనోరమ మాట్లాతూనే ఉంది.

ధీరజ్‌ అన్న మాట వినగానే మళ్ళీ మళ్ళీ పడ్డట్టయ్యింది వెన్నెల కి. తన భర్త కి, ధీరజ్‌ అనే ఫ్రెండ్‌ ఉన్నాడు. ఒకటి రెండు సార్లు ఇంటికి వచ్చాడు. ఆ ధీరజే నా లేక ఈ ధీరజ్‌ వేరా! అనుకున్నది వెన్నెల. మొత్తం మీద ఆమె మనసు గందరగోళంలో పడింది.


“ధీరజ్‌ ఆయన ఫ్రెండు లే.. ఆ మనో ఇదేనేమో..” కాఫీడే నుంచి బయటకి వస్తూ అన్నది వెన్నెల.


యమున కి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అవునంటే వెన్నెల మనసు బాగా గాయం చేసినట్టవుతాను.


వెన్నెల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. యమున సమాధానం కోసం ఆమె ఎదురు చూడలేదు. ఇంతలో బస్సు రావడం తో ఇద్దరూ బస్సెక్కారు. ఐదు స్టాపుల తరువాత ఇద్దరూ దిగి చెరో తోవ వైపు వెళ్ళారు. అక్కడ నుంచి రెండు ఫర్లాంగు ల దూరము వాళ్ళ అపార్ట్‌మెంట్స్‌. ఇంటికి వచ్చిందన్న మాటే గానీ వెన్నెలకి చాలా చాలా చిరాగ్గా ఉంది. మనస్సు.


‘మనో’.. ఆ పేరే ఆమె మనస్సు లో మెదలుతోంది. బస్సు లో కూర్చున్నంత సేపూ యమున ఏదో మాట్లాడుతున్నా ఆమె అన్యమనస్కంగానే తలూపింది. ఒకటి రెండు మాట్లాడింది.


అరగంట సిటీబస్సు ప్రయాణము లోనూ ఆమె అలానే గడిపింది. బస్సు దిగాక ఓ ఐదు నిమిషాలు ఆగి ఏవో మాట్లాడుకుంటారు మామూలుగా. కానీ ఆ రోజు వెన్నెల వస్తానే అంటూ వెళ్ళిపోయింది ఒక్క క్షణమైనా ఆగకుండా.


ఇంటికి రాగానే రోజూ స్టౌవ్‌ వెలిగించి అల్లం టీ పెట్టుకుని తాగుతుంది వెన్నెల. అలా టీ తాగకపోతే ఆమెకు ఏదోలా ఉంటుంది. కానీ ఆ రోజు ఆమె టీ పెట్టుకోలేదు. బ్యాగ్ కుర్చీలో పడవేసి, మరో కుర్చీలో కూలబడింది.

ఆమె మనసు పరిపరివిధాల ఏమిటోలా ఉంది. " మనో" అన్న రెండక్షరాలు ఆమె మనస్సుని దొలిచేస్తున్నాయి. మళ్ళీ అంతలోనే తనకి తాను సమాధానపడుతోంది. ఊరికే తాను ఆలోచిస్తోందా?ఇంతకీ మనో అసలు వేరేయేనా? లేక మనోహర్‌ అన్న ఫ్రెండు పేరు చిన్నగా మనో అని సెల్‌ లో చంద్రం పెట్టుకున్నాడేమో?..


తను ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తే బాగుండేది. అప్పుడు తెలిసుండేది. ఇంతవరకూ తాగుడు ఒక్కటే అనుకున్నాను.. ఈ అలవాటు కూడా ఉన్నాయా చంద్రంకి! ' మ' కారము అన్న దొరవారికి

బాగా మక్కువనుకుంటాను. ఏమో ఎందుకూడదూ? ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. ఇలాంటి అలవాట్లు లేకపోతే ఎంత తాగితే మాత్రం అంత డబ్బు ఎలా ఖర్చు పెడతాడు. ఒక్క రూపాయి కూడా ఆదా చేయకుండా ?


భానుప్రియ ని నెమ్మదిగా అడగాలి.. మనో కి చంద్రం అనే అతడితో పరిచయం ఉందా? లేదా? అని.. అప్పుడు అసలు రంగు బయటపడుతుంది. ఇలాంటి వాళ్ళు మా కొలీగ్స్‌ కావడ మేమిటీ? ఖర్మ కాకపోతే.


వెన్నెల ఆలోచనలు సాగరకెరటాల్లా సాగుతూనే ఉన్నాయి. అన్యమనస్కంగానే లేచింది. కుర్చీలోంచి లేచి ఇంటి పనులలో పడడానికి.

------------------------------

“చంద్రానికి అమ్మాయిలతో తిరిగే అలవాటుందా?” లాప్‌టాప్‌ లో పని చేసుకుంటున్న వంశీకృష్ణ ప్రక్కన కూర్చుంటూ అడిగింది యమున.

“ఏ చంద్రం” లాప్‌టాప్‌ నుంచి మొహం తిప్పకుండానే అడిగాడు వంశీ.


"అదే.. వెన్నెల మొగుడు".

"ఏమో ఏం.. ?”


“మీకు అతడితో బాగా పరిచయం ఉందిగా”.


“పరిచయం ఉన్న మాట వాస్తవమే. కానీ పెద్దగా కలుసుకోం.. ఎప్పుడైనా కలుస్తాం. ఇంతకీ ఏమయ్యింది? అలా అడిగావు..”

“ఈ మధ్య ఎవరో అమ్మాయి సెల్‌లో మెసేజ్‌ చేస్తే అది చూసింది. వెన్నెల అప్పటి నుంచి బాధ పడుతోంది. రోజూ బాగా తాగొస్తాడట”.


“అవును. అతడికి మందు అలవాటు బాగా అలవాటయ్యింది. ఒకసారి నన్ను పిలిచాడు. ఆ రోజున నువ్వు బాగా గొడవ చేశావుగా, తాగొచ్చానని” అంటూ భార్య మొహం

లోకి చూశాడు నవ్వుతో వంశీ.


“మరి తాగొస్తే ఏ భార్య ఊరుకుంటుందేం? మాట తడబడుతుంది.. కాళ్ళు తడబడతాయి..” నిష్టూ

రంగా అన్నది యమున.


"ఒక్కోసారి మాటల్లో.. ఓ పెగ్గు లాగించేస్తా..”


“వెన్నెల మొగుడు రోజూ బాగా తాగొస్తాట్ట.. ఈ మధ్య రోజూ గొడవ పడుతున్నారట. దీనికి తోడు అమ్మాయిలతో పరిచయాలున్నాయని వెన్నెల చెప్పుకుని బాధపడింది.

అతడి స్నేహితులు అలాంటివారనుకుంటాను.. వాళ్ళ మాటలు వింటే అనిపించింది. నీకు అలాంటి అలవాట్లు న్నాయా” యని భర్త ముఖంలోకి చూస్తూ అడిగింది నవ్వు

ముఖం దాచుకుంటూ.


“ఏం.. దానికి అనుమతి మంజూరు చేస్తావా?” కొంటెగా అడిగాడు వంశీ.


"చంపుతాను" ఉరిమిందామె.


"ఏమో, అంత ఉత్సాహంగా అడుగుతుంటేనూ..’

"నేను ఉత్సాహంగా అడిగానా.. అంత మోజుగా ఉంటే పెట్టుకో.. నేనూ చూసుకుంటాను ఇంకొకరిని" చాలా కోపంగా ఉడికిపోతూ అంది.


"అంత కోపం దేనికీ.. నా కటువంటి అలవాట్లు లేవు. అసలలాంటి ఆలోచన కూడా లేదు. ఎక్కడ లేనీ టైమూ ఈ ఉద్యోగానికే సరిపోవడము లేదు. వేరే ఉద్యోగమేదైనా

వెతుక్కుందామంటే ఇంత మంచి జీతం ఇచ్చేవాడు దొరకాలి. అక్కడ కూడా ఇలా ఉంటుందని నమ్మకం లేదు..”

"సంపాదన ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఎక్కువగా శ్రమపడాలి. ఎక్కువగా శ్రమపడాలసి వస్తే జీవితంలో చాలా అనుభవాలకి, బంధుత్వాలకి దూరం కావాలి".

"నా మాట నాకే అప్పజెప్పుతున్నావా !”


“నువ్వు ఎప్పుడూ చెప్పే మాట ఇదే కదా!.. దానికి నేను అంగీకరిస్తాను, వంశీ.. కానీ కొందరు మగాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారో తెలీదు. వెన్నెల మనిషి చాలా బాగుంటుంది.. సరదాగా ఉంటుంది. ఛలాకీగా ఉంటుంది. -- అలాంటి భార్య దొరికినందుకు చాలా సంతోషించాలి గానీ లేనిపోని ఈ వెదవ అలవాట్లేంటి చెప్పు.. " బాధగా అంది.


"ఏమిటీ అంటే ఏమని చెబుతాము.. యమూ! ఎక్కడో తప్పుదోవ తొక్కుతారు. దాన్నుంచి వెనక్కు రాలేరు. సొసైటీలో ఉన్న ఆకర్షణ అలాంటిది మరి.


“ఎవరో మనో అట. చంద్రం ఆ పిల్ల వెంట పడుతున్నాడని వెన్నెల అనుమానం. ఈ వేళ.. కాఫీడే లో మా కొలీగ్‌ భాను తన రూమ్మేట్స్‌ అంటూ ‘మనో.. మనోరమ’ అన్న

అమ్మాయిని పరిచయం చేసింది. అప్పుడే ఆమె సెల్‌ కు కాల్‌ వచ్చింది.


నేను మనోను మాట్లాడుతున్నాను’ అంటూ మాట్లాడింది.

దాంతో వెన్నెల కంగారుపడింది. ఈ మనోనే తన భర్త కి మెసేజ్‌ ఇచ్చిన మనో నే అని.

" అవునా?"


“అవును.. నువ్వేమైనా కనుక్కుంటావా? అసలు ఆ మనో ఎవరో.. పాపం దాని బాధ చూస్తే నాకు బాధేసేంది, వంశీ'. భర్త ఒడిలో గువ్వలా ఒదిగిపోతూ అన్నది యమున.


“అలాగే, ప్రయత్నిస్తాను.. యమూ.." అంటూ ఆమెను మరింత గుండెకు హత్తుకున్నాడు వంశీ.


“ఆఫీసు కోసం పన్నెండు గంటలు కష్టపడతావ్‌,.. అమ్మ మాటకు ఎదురు చెప్పలేని అమ్మకూచివి, అమ్మ చాటు బిడ్డవి. ఈ రెండూ తీసివేస్తే నువ్వు మంచివాడివి వంశీ” అంది యమున భర్తని మృదువుగా ముద్దు పెట్టుకుంటూ.


“ఆఫీసు పని తప్పదు యమూ.. ఎందుకంటే..”

“నాకు తెలుసు.. సంపాదన ఎక్కువ కావాలనుకుంటున్నప్పుడు ఎక్కువగా శ్రమ పడాలి..” అంటూ ఆమె నవ్వేసింది, ఎప్పుడూ అతడు చెప్పే మాటని మననం చేస్తూ. అతడు ఆమె నవ్వుతో శృతి కలిపాడు.


కాస్సేపు అలా కబుర్లు చెప్పుకున్నారు. కబుర్లు చెబుతూనే యమున నిద్ర లోకి జారుకున్నది. ఆమెను సున్నితంగా పడుకోబెట్టి ఆమె ను ఆనుకుని తనూ నిద్రకు ఉపక్రమించాడు వంశీ.

========================================================================

ఇంకా వుంది..


========================================================================

అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం

రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.

అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.

ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,

ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.



30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.








88 views0 comments
bottom of page