'Thrupthi Part 2/2' - New Telugu Story Written By Sripathi Lalitha
Published In manatelugukathalu.com On 10/01/2024
'తృప్తి - పార్ట్ 2/2' పెద్ద కథ
రచన: శ్రీపతి లలిత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తున్న ఆదిత్య డిప్రెషన్ కి లోనై, ఇండియా వచ్చేస్తాడు. అమ్మానాన్నలతో కలిసి విజయవాడలోని బంధువుల ఇళ్లకు వెళ్తాడు. అక్కడ రాహుల్ అనే యువకుడికి అమెరికాలో చదువుకోవడానికి ఏర్పాటు చేస్తాడు.
ఇక తృప్తి పెద్దకథ చివరి భాగం చదవండి.
"దేవుడు పంపినట్టు వచ్చావురా ఆదీ! దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు.బంగారం లాంటి కొడుకుని కన్నావురా రాజా నువ్వు. మీ పెంపకానికి మెచ్చుకోవాలి."
అటు జయ, నారాయణ అంటుంటే నిజమైన పుత్రోత్సాహం కలిగింది రాజారామ్, సుభద్రలకి.
మళ్ళీ రావాలని మాట తీసుకుని వదిలారు జయ, నారాయణ. రాహుల్, ఆదిత్య తో ఫోన్ లో కాంటాక్ట్ లో ఉండి తన ప్రయాణం గురించిన వివరాలు తెలియచేస్తాను అని చెప్పాడు.
చాలా రోజుల తరవాత ఆదిత్య కి మనసు హాయిగా అనిపించింది.
తను వెళ్లిన సైకియాట్రిస్ట్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అవసరంలో ఉన్న మనిషికి సాయం చేస్తే, వాళ్ళు చూపే కృతజ్ఞత కి విలువ కట్టలేము.
ఆ ఆనందమే వేరు. అదిఅనుభవిస్తే నీకు తృప్తి అంటే ఏమిటో తెలుస్తుంది. ఏ డబ్బు సంపాదన ఇవ్వలేనిది ఆ తృప్తి. ఆ తృప్తి తెలిసాక, నీ సంపాదన కూడా సద్వినియోగం అవుతుంది.
ఈ రోజు, అలాంటి తృప్తి అనుభవించాను అనుకున్నాడు ఆదిత్య.
మర్నాడు గుంటూరు బయలుదేరారు. ఈసారి కొడుకు చెప్పే ముందే, అన్నకి, వదినకి బట్టలు తీసుకుంది సుభద్ర.
సుభద్ర తల్లీ, తండ్రీ ఇద్దరూ లేరు. ఉన్నది ఒక్కడే అన్న.
సుభద్ర అన్న రామ్మోహన్, గుంటూరు జనరల్ హాస్పిటల్ లో డాక్టర్. వదిన సుగుణ గృహిణి.
వాళ్ళ అబ్బాయి వివేక్. అతను తండ్రి ఎంత చెప్పినా వినకుండా, వ్యవసాయం లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసాడు.
సుగుణ తల్లీ, తండ్రీ పల్లెటూళ్ళో ఉంటారు. స్కూల్ టీచర్ గా రిటైర్ అయినా, ఆయన తన సొంత ఊరులోనే, పొలాలని చూసుకుంటూ ఉంటారు. టైం దొరికినప్పుడల్లా రామ్మోహన్, సుగుణ వెళ్లి వాళ్ళని చూసి వస్తారు.
రామ్మోహన్ కి, ప్రభుత్వ ఆసుపత్రి లో ఉద్యోగం కావడంతో ఒక్క క్షణం సమయం ఉండదు. అతను గుండె ఆపరేషన్ చేసే సర్జన్.
ఎప్పుడో తప్ప, ఫోన్లో మాట్లాడడం కూడా కుదరదు రామ్మోహన్ కి సుభద్ర తో. కానీ సుగుణ మాత్రం, ఆడపడుచు తో ఫోన్ లో మాట్లాడుతునే ఉంటుంది.
గుంటూరు లో అన్న వాళ్ళ ఇల్లు పెద్దదే కనుక డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్లారు. అన్నా, వదినకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వెళ్లారు.
సరిగ్గా వీళ్ళు వెళ్లేసరికి రామ్మోహన్ ఆసుపత్రికి బయలు దేరుతున్నాడు.
చెల్లెలి కుటుంబాన్ని చాలా రోజుల తరవాత చూసేసరికి సంతోషంతో పలకరించాడు.
" భద్రా ! ఏమైంది ఇవాళ సూర్యుడు ఎటు పొడుస్తున్నాడు? నువ్వు, బావగారు, ఆదిత్య ఒకేసారి! వావ్" అంటూ రాజారామ్ వంక తిరిగి " బావగారూ! నేను సర్జరీ అవగానే వస్తాను."
చెప్పి ఆసుపత్రికి వెళ్ళాడు.
సుగుణ వీళ్ళని కూర్చోపెట్టి కబుర్లు మొదలుపెట్టింది.
" అత్తయ్యా! వివేక్ లేడా?" అడిగాడు ఆదిత్య.
సుగుణ ముఖం కొంచెం వాడినట్టయ్యి "ఉన్నాడు ఆదీ !"
అంటూ
"విక్కీ" అని పిలిచింది, సమాధానం రాకపోయేసరికి "ఆదిత్యా, అత్తయ్యా, మామయ్యా వచ్చారు"
గట్టిగా అంది. గబుక్కున పక్కన రూంలోనించి వచ్చాడు వివేక్.
"హాయ్ ఆదీ! ఎలా ఉన్నారు అత్తయ్యా, మామయ్యా!"
అంటూ పలకరించి ఆదిత్య పక్కనే కూర్చున్నాడు.
పెద్దవాళ్ళు వాళ్ళ కబుర్లలో మునిగిపోతే ఆదిత్య, విక్కీ అతని రూంలోకి వెళ్లారు.
సాయంత్రం రామ్మోహన్ వచ్చాక అందరూ కూర్చుని మళ్ళీ కబుర్లు మొదలు పెట్టారు.
విక్కీ ఫ్రెండ్ వస్తే బయటికి వెళ్ళాడు.
అదే అదనుగా ఆదిత్య " మామయ్యా ! మీరు ఏమీ అనుకోనంటే ఒకటి అడుగుతాను. విక్కీ చేస్తాను అన్నదానికి మీరెందుకు ఒప్పుకోరు?"
రామ్మోహన్ ఉలిక్కిపడ్డాడు " నీతో
చెప్పాడా విక్కీ?" ఆశ్చర్యంగా అన్నాడు.
"విక్కీ చెప్పలేదు, నేనే కష్టం మీద వాడి దగ్గర్నుంచి లాగాను. తను చాలా డిప్రెస్డ్ గా ఉన్నాడు. నేను అదే స్థితి నుంచి ఇంకా పూర్తిగా బయటికి రాలేదు
అందుకే తన పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైంది." అన్న ఆదిత్యని చూసి
"డిప్రెషనా! నీకా! " అన్నారు రామ్మోహన్, సుగుణ ఒకేసారి.
"అదేంటి మామా ! మీరు డాక్టర్ అయిఉండి కూడా అలా మాట్లాడతారు? డిప్రెషన్ ఎవరికైనా రావచ్చుకదా?" అన్నాడు ఆదిత్య.
"అంతే అనుకో కానీ, అన్నీ అమరిన నీకు అంటే ఆశ్చర్యంగా ఉంది " అన్నాడు రామ్మోహన్.
"మా ఇద్దరికీ విక్కీని డాక్టర్ని చెయ్యాలని కోరిక ఉండేది, వాడేమో మంచి రాంక్ తెచ్చుకోకుండా అగ్రికల్చర్ బీఎస్సీ లో చేరి, ఎమ్మెస్సీ కూడా చేసాడు.
చదువు అయ్యాక పోనీ ఏ బ్యాంకు లోనో, ప్రభుత్వం లోనో ఆఫీసర్ గా చేరమని, లేదా అమెరికా వెళ్లి పీజీ చెయ్యమంటే, వ్యవసాయం చేస్తా అంటాడు" అంటున్న రామ్మోహన్ కి అడ్డు పడి
"మా నాన్నా వాళ్ళకి, ప్రస్తుతం ఆ పొలం మీద ఆదాయమే ఆధారం, అక్కడ ఏవో సాగు చేస్తాను అంటే, వద్దు అన్నామని ఇలా నిరాశ తో ఉన్నాడు. వేరే పొలం కొనివ్వమంటాడు, ఇప్పుడు పొలాలు మనం కొనేటట్టు ఉన్నాయా?"అంది సుగుణ.
"నాన్నా! మనము హైదరాబాద్ శివార్లలో ఫార్మ్ హౌస్ కోసం కొన్న పొలం ఎంత ఏరియా" తండ్రిని అడిగాడు ఆదిత్య.
"రెండు ఎకరాలు, అందులో వెయ్యి గజాలు ఇంటికి వదిలాము. రెండు బెడ్ రూంల ఇల్లు కట్టాము, పని వాళ్ళకి ఒక రూమ్, వంటిల్లు, బాత్రూం ఉంది." చెప్పాడు రాజారామ్.
"నేను ఆ పొలంలో ఆర్గానిక్ ఫార్మింగ్ చెయ్యాలని మనుషుల కోసం వెతుకుతున్నాను.
విక్కీ కి చెప్పి, తనకి ఇష్టమైతే డబ్బు నాది, కష్టం తనది, వచ్చిన లాభంలో చెరిసగం" ఆదిత్య అంటుండగానే విక్కీ లోపలి అడుగు పెట్టాడు.
"ఆదిత్యా ! నిజమా! నిజంగా నువ్వు నాకు సాగు చెయ్యడానికి పొలం ఇస్తావా! చూడు వండర్స్ చేస్తాను." కళ్ళలో మెరుపుతో అంటున్న కొడుకుని ఆశ్చర్యంగా చూసారు సుగుణ, రామ్మోహన్, నిజంగా అంత పట్టుదలగా ఉన్నాడా పంటలు వేసే విషయంలో, అనుకున్నారు ఇద్దరూ.
"అవును విక్కీ! నాకు కూడా కొన్ని ఐడియాస్ ఉన్నాయి, నిజానికి, రెండు ఆవులు కూడా పెంచి, ఆ పేడతో ఎరువు తయారు చేసి, పంటలు ప్రయోగాత్మకంగా పండిద్దామని ఉంది.
నువ్వు కూడా, అలా చేద్దామంటే నెమ్మది మీద, ఇంకా కొన్ని ఏర్పాట్లు చేద్దాం, నీకు సాయంగా ఇంకో ఇద్దరు, ముగ్గురు మనుషులని పెడదాము.
నువ్వు ఒకే అంటే మాతో వచ్చేయి. నీకు ఉండడానికి భోజనానికి ఏమి ఇబ్బంది లేదు"
అన్నాడు ఆదిత్య.
సుభద్ర, రాజారామ్ కూడా అవును అన్నట్టే తలఊపారు.
ఏమాత్రం ఇది ఊహించని సుగుణా, రామ్మోహన్ ఆశ్చర్యంలో ఉన్నారు.
"నాలుగేళ్లలో ఇంత సంపాదించావా?" ఆశ్చర్యంగా అడిగాడు రామ్మోహన్, ఆదిత్య పంపిన డబ్బుతో ఎక్కడ ఏమేమి కొన్నారో రాజారామ్ చెప్తే విని.
"జీతం వచ్చింది, కానీ..జీవితం పోయింది మామయ్యా! నా తాపత్రయం అదే ఇప్పుడు. నేను జీవితాన్ని అనుభవించాలి. ప్రస్తుతము నేను ఉద్యోగం చేయక పోయినా, త్వరలో ఏదో ఒకటి చేస్తాను. కానీ, అది నాకు జీవితంలో సంతోషాన్ని ఇవ్వాలి, నా వాళ్లతో కాలం ఎక్కువ గడపగలగాలి.
అందుకే, డబ్బు అవసరం ఉన్నవాళ్ళకి చదువు కోసం, వైద్యం కోసం సాయం చేస్తాను. అది కూడా నా స్వార్థమే. నా సాయం అందుకున్న వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి 'తృప్తి' పడాలని ఉంది.
ఆ తృప్తే నా మానసిక బాధని దూరం చేస్తుందని నా ఆశ. నాలాగా చదువు, డబ్బు సంపాదనే, ధ్యేయంగా బతికే వాళ్ళకి నా జీవితం గురించి చెప్పి, మానసికంగా దుర్బలత్వం రాకుండా చేస్తాను.
మంచి చదువు ఉద్యోగానికి మాత్రమే కాదు, ఆ జ్ఞానంతో, సంపాదనతో ఇతరులకు సహాయపడడమే ఆ చదువుకి సార్ధకత.
నేనే, ఒక స్వంత వ్యాపారం మొదలుపెట్టి, కొంతమందికి ఉపాధి కల్పిస్తాను, నాకంటూ, నా చుట్టూ, కొంతమంది స్నేహితులని, శ్రేయోభిలాషులని ఏర్పరుచుకుంటాను. సంపాదించుకుంటాను. మీరేమంటారు?" ఒక్క నిమిషం ఆగి తల్లి తండ్రుల వేపు చూసాడు ఆదిత్య.
"నువ్వు సంతోషంగా ఉంటేనే మాకూ తృప్తి, నలుగురికీ ఉపయోగపడతానంటే, వద్దని అనం నాన్నా! మాకు రాని ఆలోచన నీకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది." అంది సుభద్ర కొడుకుని దగ్గరికి తీసుకుంటూ. అవునన్నట్టు భుజం మీద తట్టాడు రాజారామ్.
"చాలా మంచి ఆలోచన ఆదిత్యా! తప్పకుండ వివేక్ ని నీతోపాటు తీసుకెళ్ళు.
మేమూ ఒకసారి వచ్చి మీ పొలాలు చూస్తాము, మాకూ కొంత ఆటవిడుపుగా ఉంటుంది. ప్రకృతిలో గడిపితే" అన్నాడు రామ్మోహన్.
"గుండెలు కోసే డాక్టర్ గారు, గుండెనిండా గాలి పీల్చుకోవచ్చు" అంది సుభద్ర.
అందరూ తృప్తిగా హాయిగా నవ్వుకున్నారు.
========================================================================
సమాప్తం
========================================================================
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.
Kommentare