త్యాగానికి చిహ్నం మేడే
- Gadwala Somanna
- May 1
- 2 min read
#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #Maravaradu, #మరవరాదు, #సోమన్నగారికవితలు, #బాలగేయాలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 70
Thyaganiki Chihnam May Day - Somanna Gari Kavithalu Part 70 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 01/05/2025
త్యాగానికి చిహ్నం మే డే - సోమన్న గారి కవితలు పార్ట్ 70 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
త్యాగానికి చిహ్నం మేడే
----------------------------------------
కరిగి కరిగి కాంతినిచ్చు
క్రొవ్వొత్తులు కార్మికులు
శ్రమైక సౌందర్యానికి
వారు సజీవ సాక్షులు
శ్రమ శక్తిని నమ్ముకున్న
నిస్వార్ధ పరులు వారు
కొండంత ధైర్యమున్న
వారికెవరు సాటిలేరు
రక్తాన్ని చిందించే
త్యాగపురుషులు భువిలో
నిజంగా సేవ చేసే
వారిని తలవాలి మదిలో
రుధిరంతో తమ హక్కులు
సాధించిన ఈ రోజు
పోరాటంతో బ్రతుకులు
బాగుపడిన మేడే రోజు

క్షేమాన్ని కోరువారు కన్నవారు
----------------------------------------
కన్నవారి గద్దింపు
కోరుతుంది క్షేమము
కాదు కక్ష సాధింపు
కాసింత యోచించుము
భవిత బాగు కోసము
తల్లిదండ్రుల ఆత్రము
చేసుకోకు అపార్థము
చేయకు నిర్లక్ష్యము
కన్నోళ్లపై కోపము
అదే మనకు శాపము
ప్రేమామయులు వారు
శత్రువులు కారు కారు
ఇకనైనా మేలుకో
కనుపాపలా చూసుకో
గుండెల్లో పెట్టుకుని
వారి ఋణం తీర్చుకో

అందాల ఊయల
----------------------------------------
అమ్మ ఒడియే ఊయల
పూలలాంటి బాలలకు
వారు ఇంట కళకళ
తారల్లా మిలమిల
చిన్నారులకిష్టము
ఊగే తూగే ఊయల
ఊగితే సంతసము
ఉప్పొంగును మానసము
ప్రేమగా మోస్తుంది
హాయినే ఇస్తుంది
లేదు దానికి భేదము
సమానమే సర్వము
అమ్మ ఊపే ఊయల
వ్రేలాడే ఊయల
గాలిలో పయనించే
అందమైన ఊయల
మేఘాలను తాకుతుంది
హృదయాలను మీటుతుంది
ఆనందము మెండుగా
మనసుల్లో నింపుతుంది
ఉయ్యాలో ఊగితే
అంతులేని పరవశము
గాలిలో తేలితే
అగును మరో లోకము

చెట్టు ప్రబోధం
----------------------------------------
వచ్చింది నీ కోసం
వదలొద్దు అవకాశం
జారివిడిచికున్నావా!
వెళ్లిపోవు కడు దూరం
నీ ఊపిరి సాహసం
అయితేనే ఘన విజయం
నీ తలుపు తట్టుతుంది
పాదాక్రాంతమవుతుంది
నీ హద్దే ఆకాశం
గొప్ప పనులు చేయరా!
చూపొద్దు పిరికితనం
మెరుపులాగ ఉండరా!
ఏదో ఒకటి చేయాలి
చరిత్ర తిరిగి రాయాలి
ఎవరెస్టు శిఖరంలా
మంచి చేసి మిగులాలి

అమ్మ అభిలాష
----------------------------------------
లక్ష్యాన్ని సాధించి
మంచిని ప్రబోధించి
నిలవాలి స్ఫూర్తిగా
పదిమందికి శ్వాసగా
కష్టాలను ఎదిరించి
నష్టాలను పూరించి
ఉండాలి మాదిరిగా
మారాలి యోధునిగా
జ్ఞానాన్ని శోధించి
దేశాన్ని ప్రేమించి
ప్రగతి బాట వేయాలి
జగతి మేలు కోరాలి
పెద్దలను గౌరవించి
దీవెనలు స్వీకరించి
సంస్కారం చాటాలి
జీవితాన ఎదగాలి
పిరికితనం ఓడించి
ప్రపంచాన్ని శాసించి
రవి కిరణం కావాలి
కవి హృదయం రావాలి
-గద్వాల సోమన్న
תגובות