ట్రోలింగ్ గన్
#GadirajuMadhusudanaRaju, #గాదిరాజుమధుసూదనరాజు, #ట్రోలింగ్గన్, #TrollingGun, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Trolling Gun - New Telugu Story Written By Dr. Gadiraju Madhusudana Raju Published in manatelugukathalu.com on 01/03/2026
ట్రోలింగ్ గన్ - తెలుగు కథ
రచన: డా. గాదిరాజు మధుసూదనరాజు
"సమయానికి అంబులెన్స్‌కు సమాచారం అందటం, ప్రాణాలకు తెగించి సాయం చేసి క్షతగాత్రుల్ని బయటకు తీయటం, అధికారులను అప్రమత్తం చేయటం," అంటూ యాంకర్ నోట పదే పదే అవే మాటలు రిపీట్ అవుతున్నాయి. హాస్పిటల్ గదిలో బెడ్‌కి ఎదురుగా ఉన్న టీ.వీ.లో ఆయన ముఖం... పదేపదే కనబడుతోంది.
కనిపించగానే, కట్టలు తెంచుకొని వస్తోంది దుఃఖం ఇతనికి. ఆ దుఃఖం ఎందుకో ఇతనికి మాత్రమే తెలుసు.
"అయ్యో! ఏడవకండి బ్రదర్! ఇప్పటికి ఎలాగోలా మీ ఆవిడ, అబ్బాయి, అమ్మాయి బ్రతికి బయట పడ్డారుగా! అందరూ క్షేమం కదా! ఇంకెందుకు ఏడవటం? అలా మీరు బాధ పడితే, మీ ప్రాణాలకే ప్రమాదం!" హెచ్చరించింది స్టాఫ్ నర్స్ బాధ్యతగా.-----అంతర్జాలంలో ఇతనికి తిరుగులేదు. ఇతని పేరు జగన్. ఇతనికి మీడియాలో అమరిన పేరు - ట్రోలింగ్ గన్.
మంచైనా, చెడైనా, సభలో అయినా, రభసలో అయినా, రహదారిలో అయినా, వెండితెర తారలైనా, బుల్లితెర బృందాలైనా ఒకటే ఇతనికి. తరతమ భేదాల్లేవు. దయా దాక్షిణ్యాలు లేవు. ట్రోల్‌కి గురిపెడతాడంతే!
ఏదో ఒక తపనతో మంచిగానో, మరోలానో, పాపులర్ అవ్వాలనో, పాపం అనో, పదిమంది దృష్టిలో పడాలనో ఏదో చేస్తూ ఇతని కంట పడితే... ఆ వ్యక్తి ఆడైనా, మగైనా, మరో వ్యక్తి అయినా... ఈ జగన్ గన్ ట్రోలింగ్‌కు గురి అయితే కంట తడి పెట్టాల్సిందే, ఉడికి ఉడికి ప్రేలి పోవాల్సిందే, ఆత్మహత్యకు చివరంచును చూడాల్సిందే!
అలాగని ఆ పని చేయటం వల్ల వచ్చే ఆదాయాలేమీ లేవు ఇతనికి. అదో సరదా. అదో ఇది! రాక్షసానందం ఇతనిది!!
ఇతనొక్కడే కాదు. ఇటువంటి గన్నులు, కెమెరా కన్నులు, కొనవ్రేళ్ళ పెన్నులు, సెల్‌ఫోన్ పిన్నులు...
ఊరూరా ఉన్నాయ్... శ్రీకాకుళం శిరస్సు శిఖాగ్రం నుంచి రాయలసీమ అనంత చివరంచు వరకూ... ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పరిధిలో.-----టోర్నమెంట్‌లో ప్రథమ స్థానంలో నిలచిన ప్రతిభ ఆనందంగా తన ట్రోఫీని పైకెత్తి ప్రేక్షకులకు చూపించింది. ప్రశంసలు వెల్లువెత్తాయి. మరుసటి రోజు సెల్‌ఫోన్‌లో ఆ ప్రశంసలను ఆనందంగా చూసుకుంటోంది ఆ అమ్మాయి ప్రతిభ. ఆమె కళ్ళలోని ఆనందపు మెరుపుల్ని అడ్డుకుంటూ ఓ ట్రోలింగ్ వ్యాఖ్య కంట పడింది ఆమెకి. క్షణాల్లో కన్నీళ్ళ జలపాతాలయ్యాయి ఆమె కళ్ళు.
"ఎత్తి చూపిస్తోంది చూడమంటూ తన స్లీవ్‌లెస్ అందాల్ని," అంటూ ట్రోల్. "సంప్రదాయంగా అందాల్ని ఇంకొంచెం దాచుకోవచ్చుగా," అంటూ సంప్రదాయపు కవరింగ్. కానీ ఆ ఆటలో చీరలు, ఓణీలు ఎలా వేసుకుంటారు? ఆట ముగియగానే ట్రోఫీ అందుకున్న అద్భుత ఘట్టం అది. ఎక్కడో వెకిలిస్ట్ నవ్వు ఆడియో. వెకిలిచూపుతో ఓ హాస్యనటుని ముఖం. గాయపడ్డ ఆ బంగారు తల్లి హృదయాన్ని ఓదార్చటంలో తలమునకలయ్యింది ప్రతిభ తల్లి. తల్లిలేని ఓ క్రీడాకారిణిదీ ఇదే సమస్య. ఆ చిట్టితల్లి సిగ్గుతో ఏడుస్తూ తలదిండును కన్నీళ్ళతో ముంచింది రాత్రంతా.-----"అన్నా! ఈ ఫోటోలు చూడు! బద్రీ గారు ఫుల్‌గా మందు కొట్టి ఇంటి వెనక వున్న మురుక్కాలవలో పడిపోయాడు. ముక్కూ మొహం తోపడా పట్టినట్లు గీక్కుపోయాయి. ఓ ట్రోల్ పోస్ట్ చేసి మీడియాలో పోస్ట్ చేయన్నా!"
"రేయ్ ఆనంద్! నీ ఆనందం తగలెయ్యా! వాడు మన ఊరి రౌడీ గ్యాంగ్‌లో యాక్టివ్ కుర్రాడు. నీవు కొంచం గమ్మునుండురోయ్! వాడి జోలికి పోతే! పూటుగా మందుకొట్టి వచ్చి, అమరశిల్పి జక్కన్నలా ఉలితో, సుత్తితో కాకుండా... రేపు మన ముఖాలను... బీర్ బాటిల్ పెంకుతోనో, సైకిల్ చైన్ తుంటతోనో డిట్టో డిట్టో చెక్కేస్తాడు." వెతుక్కుంటూ వచ్చిన వాలంటీర్ మిత్రుని వీపు నిమిరాడు వెకిలిస్ట్, శాంతించమన్నట్టు సన్నగా.-----ప్రాథమిక పాఠశాలలో ముఖ్యమంత్రి ముచ్చట్లు. ఒకటో తరగతి విద్యార్థి నుదుటిని ముద్దాడిన ఫోటో. మనవళ్ళతో మమేకమైన మనసున్న తాతయ్యలా... హోదాను మరచి ప్రేమగా నిలిచిన ఆయన ఔదార్యం, ఔన్నత్యం గురించి వ్యాఖ్యానాలు మీడియాలో వచ్చేశాయ్.
"ముద్దులు పెట్టుకున్నా, ముక్కులు తుడిచినా, ముడ్డి కడిగినా వేస్ట్ పెద్దాయనా! ఎలెక్షన్ బూత్ క్యూల్లో ఓట్లు రాల్చలేరు. లెట్రిన్, బాత్రూమ్‌ల్లో కక్కస్సులు, సుస్సులే కార్చుతారు," అంటూ ట్రోలింగ్. ఓ వెకిలి నవ్వు ఆడియోతో, ఓ హాస్యనటుని వింత ఎక్స్‌ప్రెషన్‌తో ఫోటో. అక్కడే తోడుగా వందల్లో కామెంట్లు, వేలల్లో లైకులు, పదిరెట్లు వ్యూస్ సెకను సెకనుకీ పెరిగిపోతున్నాయ్ సంఖ్యలు.
"అన్నా! నీ ట్రోలింగ్ అదరహో!" వాలంటీర్ మిత్రుడు వచ్చి వెకిలిస్టును పొగడటం మొదలెట్టాడు కంప్యూటర్ ముందు స్టూల్ పై కూర్చుంటూ. "ఏకంగా పెద్దాయన సి.ఎం. గారి పైనే జోకులేస్తున్నావ్. భద్రం సార్," కాఫీలు అందిస్తూ అన్నాడు హోటల్ కుర్రాడు ఉండబట్టలేక. "రేయ్ పిచ్చోడా! ఆ స్థాయి వాళ్ళు మనలాంటి వాళ్ళని పట్టించుకోవటం జరగదు. ఆయన దృష్టికి ఇది పోయినా, పోకపోయినా, పొరపాటున ఆయన పేరుమీద మనలాంటి వాళ్ళకి నాలుగు దెబ్బలు తగిలినా మనమే రాష్ట్ర స్థాయిలో పాపులర్ అయిపోతాం. మన రేంజ్ హై లెవల్‌కి పెరిగిపోతుందంతే!" అంటూ కాఫీ అందుకున్నాడు వెకిలిస్ట్ గర్వంగా.-----పనులకు వెళుతున్న కూలీల ఆటో బోల్తా పడింది. ఆ దృశ్యం... ధర్మవరం వైపు కారులో వెళుతున్న ఆయన గారికి సైడ్ మిర్రర్‌లో కనబడింది అంతే! గభాలున దిగి వచ్చాడు. 108 వాహనానికి ఫోన్ చేశాడు. తన వెంట ఉన్న మనుషుల్ని బాధితుల్ని కాపాడేందుకు పురమాయించాడు. అక్కడ దూరంగా ఎగిరిపడిపోయి ఏడుస్తున్న ఒక ముసలవ్వను చేయిపెట్టి లేపబోయాడు ఆయన. "చంపావ్ రాయదవా! నీ పిండం పెట్టా," అంటూ బాధ తట్టుకోలేక వెర్రి కేక పెట్టింది, అప్పటికే విరిగి ఉండటంతో ఆ ముసలవ్వ. ఎవరో బాటసారి తీసిన వీడియో టీ.వీ.లో వచ్చింది. ఆయన ముఖం టీ.వీ.లో కనబడుతోంది. మానవతావాది ఎవరో చక్కగా స్పందించాడు. ప్రమాదంలో చాలావరకు చావుల్లేకుండా కాపాడగలిగాడు అంటూ ఆయన పై ప్రశంసలు పోటెత్తాయి.
అవ్వను ఆయన లేపుతున్న ఫోటో పై ట్రోలింగ్. "రేయ్ ఊరికే క్రెడిట్ కొట్టేయాలని ఫోజులు కొడితే... ఇలా పిండం పెట్టబడును," "పోరా యదవా పో! నీ పని ఏదో నువ్ చూసుకో పో!!" అంటూ వెకిలినవ్వుల ఆడియోతో పోస్ట్ చేశాడు వెకిలిస్ట్ సరదాగా.
ముఖం మాడిపోయింది. ఈ ట్రోలింగ్ చూసి ఆయనకి. వందల్లో కామెంట్లు, వేలల్లో లైకులు, పదిరెట్ల వ్యూస్. గర్వం పొంగింది ఇతనికి, వెకిలిస్టుకి.-----బిచ్చగాళ్ళకి దుప్పట్లు పంచాడు ఆయన.
చప్పట్ల కోసం అగచాట్లు అన్నాడు ఇతను.
అన్న దానం పెట్టాడు ఆయన. కూటి విస్తర్లతో కీర్తికోట కట్టాడబ్బా అన్నాడు ఇతను.
ఆపదలలో పడ్డ వాళ్ళు తనకే కనపడటం పట్ల ఆశ్చర్యం పోతూ సాయం చేస్తూ కనబడతాడు ఆయన.
ఫోజులు కొట్టేందుకే ఆపద సీన్ల మధ్య చొరబడతాడు అంటాడు ఇతను.
ముఖం ప్రముఖంగా టీ.వీ.లో కనబడి పొగడబడటం,
ఆ తదుపరి ఆ ముఖం ట్రోలింగ్‌లో కనబడి పొగచూరి మాడి పోవడం...
ఇలా జరగడం అనివార్యం! జరక్కపోతేనే ఆశ్చర్యం!!-----డ్రైవింగ్ చేస్తున్న నాన్న జగన్‌ని వెనుక నుండి వాటేసుకొని ముద్దులు కురిపిస్తోంది కూతురు క్యూటీ. "నాన్నా! ఎలాగైనా ఓవర్‌టేక్ చేసేయ్ ఆ కార్ని. ఊ... ఊ... వేగంగా, వేగంగా," అంటూ కేరింతలు కొడుతున్నాడు ప్రక్కనే కో డ్రైవర్ సీట్లో కూర్చున్న కొడుకు మృదువన్. "వీడియో గేమ్స్‌లో కార్ రేసింగ్‌లో ఎప్పుడూ నీ కొడుకుది టాప్ స్కోరే," అంటూ కొడుకు షార్ప్‌నెస్, టాలెంట్ గురించి మెచ్చుకుంటూ, ప్రోత్సహిస్తూ వెనుక సీట్లో... ఉత్సాహంగా ఊగుతోంది పిల్లాడి తల్లి చైతన్య.
దట్టమైన పొగమంచులో, కొండ మీద నుండి మెలికలు మెలికలుగా ఉన్న రోడ్ పై దిగుతున్న కార్లు సరదాగా పోటీ పడుతున్నాయ్.
కారు హెడ్‌లైట్ల వెలుగులకి బిత్తర పోయిందో? లేక హారన్‌లు, బ్రేకింగ్ శబ్దాలు, ఖీచింగ్ శబ్దాలకి బెదిరిపోయిందో? ఏమో? దున్నపోతులా ఉన్న అడవి దుప్పి ఒకటి... కారుకి అడ్డంగా పరుగు పెట్టింది. హఠాత్ పరిణామానికి కారు అదుపు తప్పి కుంటలోకి పల్టీ కొట్టింది.
డాడీ! మమ్మీ! ఏమండీ! అయ్యో! అమ్మో! హో! హో! హెల్ప్! హెల్ప్! కాపాడండి! కాపాడండి!! అరుపులతో అడవి దద్దరిల్లింది. దూరం నుండి దగ్గరవుతున్న కారు శబ్దం. కారు ఆగిన శబ్దం. సెల్‌ఫోన్ వెలుగుల్లో తమను సమీపిస్తున్న కొందరు మనుషులు. అందులో... ఆ మనుషుల్లో... ఒక ముఖం! ఆయన ముఖం!! తాను యదవ, యదవ అంటూ పలుమార్లు ట్రోలింగ్ పోస్టుల్లో పెట్టిన ముఖం! మాటలతో మాడగొట్టిన ముఖం! కనబడుతోంది స్పష్టంగా.
అంతలోనే... నొప్పి, నీరసంతో మైకం క్రమ్ముకొస్తుంటే కళ్ళు మూసుకుపోయాయ్ ఇతనికి.
అడవిలో జరిగింది అంత వరకే గుర్తుంది ఇతనికి.
స్టాఫ్ నర్స్‌కి ఏం తెలుసు? పశ్చాత్తాపంతో ఇతని గుండె నిండిపోయిందని!!
కృతజ్ఞతతో ఉబికిన బాధతో తొణికిపోయే ఇతని కన్నీళ్ళు ఆగవని... అవి... ఆ సునామీ అలలకన్నా బలమైనవని... ఇతనికి మాత్రమే తెలుసు!!
***
డా. గాదిరాజు మధుసూదనరాజు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: గాదిరాజు మధుసూదన రాజు
కృతజ్ఞతలు నమస్సులు
నేను సూర్య వంశ క్షత్రియ వంశస్థుడను. ప్రభుత్వ నేత్ర వైద్య అధికారిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పనిచేసి రిటైర్ అయ్యాను.
నా కథలు దశాబ్దాల క్రితమే " కధా నిలయం" లో కూడా చోటు చేసుకున్నాయి. సాహిత్యం నా ఊపిరి.





Comments