top of page

ఉచిత బస్సు సౌకర్యం



'Uchitha Bassu Soukaryam' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

Published In manatelugukathalu.com On 15/06/2024

'ఉచిత బస్సు సౌకర్యం' తెలుగు కథ

రచన, కథా పఠనం: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



“అత్తా నేనూరికి పోతున్నా. ఒక వారందినాల్లో తిరిగొస్తా, నీ కొడుకుకు 

మనవలకు అన్నంపెట్టు. పొల్లను కూడా నా యెంబటే తీసుకపోతన్నా, ” సంచిలో రెండుచీరలు రవికలు పిల్లకు, రెండుజతల అంగీలు పెట్టుకుంటూ చెప్పింది రంగి. 


“గదేంది గంత తొందరేమొచ్చింది.. ఏడికి వెళుతున్నావు, నీ పెనిమిటికి చెప్పినవా? ఆడు ఎట్లపొమ్మన్నడు,” కోపంగా కోడలివైపు చూస్తూ అడిగింది లచ్చవ్వ. 


“ఆ మొన్ననే సెప్పినాను. పొమ్మనినాడు. మా యక్కతానికి మా అన్నలతాన ఉండి వస్తా, మా అమ్మ నాయినా కూడా ఒకటే యాది చేస్తున్నారని మా అన్నలు సెప్పినారు, ” అంది సంతోషంగా. 


“గా మొన్ననే గదా పోయినావు మీ అమ్మతానికి. గప్పుడే సూడబుద్దవుతుందటనా, గది సరేగానీ మరి ఆ పోరగాండ్లను నీతో తీసుకపో నాకు సుదరాయించదు, నా పానమే సక్కగుండదు ఏదో నా కొడుకుకు నాకంటే ఇంత వండుకుని తింటము, ” అంది లచ్చవ్వ. 


“ అయ్యో అత్త .. గట్లకాదు నేనేమన్న ఊరికే పోతున్నననుకున్నవా? గా కొత్త గవర్నమెంటు వచ్చిందని ఆడోల్లకు బస్ ఫ్రీ పెట్టిండట, మొగోల్లకు పైసలుపెట్టి బస్సు ఎక్కాలట. గందుకని ఆడోల్లందరు ఇష్టమున్నట్టు తిరుగుతున్నరు, నాకు పొల్లకంటే బస్సు ఫ్రీ. అందుకోసమని పోరగాండ్లను తీసుకపోతులేను, గట్లంటవేంది నా పోరలకేమన్న అవతలకు పోతే కడుగుతవ లేక మూతులు తుడుస్తవ.. ఏదో నువ్వొండుకున్నది పొద్దుగాలింత, పొద్దిమీకింత ఆళ్ళకింత పడేస్తే అయిపోతది, ” అంది అత్తను కోపంగాచూస్తూ. 


“ గట్లనా మరి నాకు సెప్పకపోతివి.. నేను మా యక్కతానికి పోతా, శానా దినాలైంది మా యక్కను సూసి. పాపం పొద్దుగూకులు ఒక్కతే ఉంటదాయే, గామొన్న మన నర్సిగాడికి సంతలో కనిపించి ఒకటే యాదిచేస్తుందని సెప్పాడు, గప్పట్నుండి నాకు దానిమీద నా పానమంతా దానికోసం కొట్టకుంటున్నాది, ” చెప్పింది సంబరంగా. 


“గదేందత్త.. గిప్పుడేగదా పానం మంచిగుంటలేదన్నవు, మీ యక్కతానికి అనగానే ఉషారొచ్చిందా ? గట్లకాదుగని ముందాలా నేను పోయి వస్తా, గప్పుడు నిన్ను మీ యక్కతానికి తోలుతా. నికిష్టమున్నన్ని దినాలు ఉండిరా అత్త, ఇద్దరము పోయినామంటే నీ కొడుక్కి పోరగాళ్ళకు కష్టమైతది. గిప్పడు బస్సులకు పైసలు పెట్టుకుని పోవుడులేదు. ఎప్పుడైనా పోవచ్చు, ” అంటూ సముదాయించింది. 


“గట్లకాదుగానీ నాకు ఇప్పుడెల్లి మా యక్కను సూడాలని మదిలో లబలబలాడుతుంది, నేనే ముందుగాలా పోయి వచ్చినంకా నువ్వు పోరాదు, ” అడిగింది కోడలిని. 


“ఇదిగో నువ్వు గిట్ల సతాయిస్తవనే నీకు చెప్పొదనుకున్నాను, నేను వస్తున్ననని మా యక్కకు సెప్పంపినాను నాకోసరమని ఎదిరిచూస్తావుంటది, గందుకని నేనే ముందగాలపోతా, ” అంది కోపంగా. 


“అబ్బో నీగ్గనక ఉంది అక్క.. నీసవంటిదే మాయక్క తెలుసా, ఆ నువ్వు సెప్పకపోతే నాకు తెల్వనే తెల్వదనుకున్నవు, నీకంటే ముందాలనే మాకు తెలుసు. మణెవ్వ నేను పించనుకు పోయినప్పుడు ఆడా అందరు ఇవే ముచ్చటలు, మాలాంటోల్లందరిని కొమరెల్లి మల్లన్న జాతరకు వెములాడ రాజన్న కొండగట్టు అంజన్న ను సూపించి ఆడినుంచి సమ్మక్క సారక్కల జాతరకు తీసుకపోతమన్నరు. ఎట్టాగు బస్సు పున్యానికి వస్తుంది

అందరం బోతున్నం, మాయక్క కూడా మాతోంగానే వస్తుంది, నీతో ముందుగాల అంటే ఇంటాంటిదే అంటవని సెప్పలే, మూడుదినాల్లో మేమందరం పోతన్నం నువ్వు నీ పోరగాల్లను నీ పెనిమిటిని ఏమన్న చేసుకో, ” అంది బోసి నోరుతో నవ్వుతూ. 


అమ్మనీయత్త.. ముసలోల్లనుకున్నగానీ ఇంత తెలివి యాడికెల్లి వచ్చిందో మనసులో అనుకుంటూ. “ గట్లయితే నువ్వు ముందగాల పొయిరా. అయినా గివన్ని తిరగడానికి పైసలు ఏడినుంచి వస్తయనుకున్నవు, ” అడిగింది. 


“ఓసి పిచ్చి రంగి నీకింకా తెలవదా మా పించను కొత్త గవర్నమెంటోల్లు నాలుగువేలు ఇస్తుంది, బస్సుకైతే పైసలు పెట్టిదేలే. తిండైతే గుడికాడ మాలాంటోల్లకు పైసలు తీసుకోకుండా తిండి పెడతరట. ఇంకెంది కావాలె మాకు, ” అంది భరోసాగా. 


“సరే మల్ల, నేను మాఅక్కతానకు పోతా. నువ్వు జాతరకు పొయ్యిరా అత్త, ఆయన్నే సుసుకుంటడులే పోరగాల్లను, ” అంది. 


“ గది గట్లన్నవు శానా మంచిగుంది. నువ్వు పోంగపోంగ తోవకే ఉంటది మాయక్క ఊరు, నన్ను ఆడి దిగబెట్టు, మాయక్కను తీసుకుని జాతరపోతా, ” అంది కోడలివైపు సంతోషంగా చూస్తూ. 


అనుకున్నట్టుగా అత్తా కోడలు పిల్లతో పాటుగా బయలుదేరి బస్టాండుకు వచ్చారు. 

అబ్బా.. కుప్పలుకుప్పలు ఆడవాళ్ళు పిల్లలు ఏదో జాతర జరుగుతున్నట్టున్నది బస్టాండు. 


బస్సులు వస్తునే ఉన్నాయి. ఆడవాళ్ళందరూ ఎక్కుతూనే ఉన్నా మళ్ళి చూసేవరకు నిండిపోతున్నారు, మగవాళ్ళకు అసలు బస్సును దొరకినిచ్చుడేలేదు. పొరబాటున ఎవ్వరన్నా ఎక్కితే వాళ్ళకు సీటు దొరకదు ఎంతదూరమైనా నిలుచోవలసిందే. 


“ఆ ఎక్కండి ఎక్కండి తొందరగా .ఇంకో బస్సు వస్తుంది అందులో కొంతమంది రావచ్చు, 


ఏమ్మా నన్నెక్కనిస్తావా లేదా కొంచెం పక్కకు జరుగు, ” అంది కండక్టర్ లచ్చవ్వను. 


“ఏంది నేను ముసలిదాన్ని నన్నెక్కనియ్యకుండా నువ్వెక్కతానంటవేంది, జర ఇను కండక్టరమ్మ. ఈ బస్సు ఆడోల్లందరికని పైసలెట్టకుండ తిరుగుండని పెట్టిండు, మరి నువ్వెందుకొత్తున్నవు పొ పొల్లా పొ పొ, ” కండక్టర్‌నే కసురుకుంది లచ్చవ్వ. 


 నిండుగర్భిణిలా మెల్లెగా కదిలివెళ్ళింది బస్సు. చూస్తూ నిలుచుంది కండక్టర్ ఏం చెయ్యాలో తోచనట్టు. ఇంతలో ఇంకో బస్సు రయ్యిమని వచ్చి నిలుచుంది. మగవాళ్ళు ఎంతసేపటినుండో బస్సు ఎక్కడానికి అవస్థపడుతున్నారు కానీ ఒక్క బస్సు కూడా ఎక్కడానికి వీలు లేకుండా ఆడవాళ్ళు నిండిపోవడంతో చూస్తూ నిలుచుంటున్నారు. 


“ ఏయ్ ఈ సీటు నాది. నేను ముందుగానే నా దస్తి వేసాను. జరుగవమ్మా జరుగు,”

గబగబా బస్సెక్కిన రామయ్య కసురుకున్నాడు. 


“ఏయ్ ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు? ఈ బస్సులన్ని మా ఆడోళ్ళకు ఉచితంగా పెట్టిండని తెల్వదా నీకు, మేము ముందు కూర్చున్న తరువాత జాగా ఉంటే నిలుచోవాలి లేదంటే ఇంకో బస్సు చూసుకో, ” అంటూ అతని దస్తి అతని ముఖాన విసిరికొట్టింది. 


“ఇదేందిరా దేవుడా వారం రోజులనుండి రోజు బస్టాండుకు వస్తున్నా ఒక్క బస్సు ఎక్కనిస్తలేరు, మా నాయనకు బాగా లేదని ఉత్తరం వచ్చింది పోదామంటే ఈ ఆడోళ్ళు ఉచిత బస్సని ఇష్టమొచ్చినట్టు తిరుగుతున్నరు, ఇప్పుడే ఎక్కడలేని భక్తి పుట్టుకొచ్చి ఎవ్వరు పడితే వాళ్ళు గుంపులకు గుంపులు పుణ్యక్షేత్రాలకు పోతున్నారు, ఇంకా చుట్టాలు పక్కాలు అంటూ వెళుతున్నారు, అబ్బో అసలు ఏ షాపు కూడా వదులతలేరు. బస్సు ఫ్రీగా వచ్చుడేమో కానీ పర్సులు ఖాళీ అవుతున్నయన్న బాధలేదు, ” పక్కనే ఉన్న ఇంకొకతనితో తన బాధనంతా వెళ్ళగక్కాడు రామయ్య. 


“ఏం చేస్తామండి .. ఓట్లు గెలవడానికి వాళ్ళు ఇలాంటివి పెడితే, వీళ్ళేమో మన ఇల్లు గుల్ల చేస్తున్నారు, మా ఆమె అయితే రోజుకో షాపుకు పోతుంది చార్ మినారని, బేగం బజారు లకిడికాపూలంటా ఎక్కడ ఏవి చౌక దొరుకుతున్నాయంటే అక్కడికి వెళ్ళి కొంటున్నారు, ఇల్లంతా సామాన్లతో నింపుతున్నారంటే నమ్ము, ” లబలబ మొత్తుకున్నాడు నరేశ్. 


“మీరింకా నయమండి ! మా ఆవిడ అయితే ఉదయం టిఫిన్ చేసి వెళ్ళిందంటే ఎప్పుడు వస్తుందో తనకే తెలియదు, పైగా తను వచ్చేముందు నాకు ఫోన్ చేస్తుంది బస్టాండుకు కారు తీసుకరమ్మని, పోనీ తనొక్కతే అయితే ఏమో అనుకోవచ్చు తన స్నేహితులందరిని ఎక్కిస్తుంది. డిక్కినిండా సామాను నింపుతుందా, మళ్ళి వాళ్ళందరిని ఇంటిదగ్గర దిగబెట్టి వచ్చేసరికి పెట్రోలు తడిసి మోపడయిపోతుంది, ” నవ్వుతూ అన్నాడు రవి. 


“అబ్బా మీ బాధలన్ని మీరు చెప్పుకుంటున్నారు మరి నా బాధ ఎవరికి చెప్పుకోను, ” కండక్టర్ వచ్చి వాళ్లతో అంటుంటే ఒకరిముఖాలు ఒకరు చూసుకున్నారు ఏంటన్నట్టు. 


“ఈ ఉచిత బస్సు ప్రయాణం అని ఏమని పెట్టారోగానీ! నేను మా ఇంటికి పోవాలంటే ఒక్కొక్కసారి వారం రోజులైనా కుదరడంలేదు, ” 


“ఏం ఎందుకని.. ఎక్సట్రా డ్యూటీ చేస్తున్నావేమో డబ్బులొస్తాయని, ” అన్నాడు నరేశ్. 


“బాబు నాకు అంత ఆశ లేదయ్యా .. ఇప్పటికే పొద్దుటనుండి రాత్రి వరకు బస్సులో తిరుగుతుంటే ఒళ్ళు హూనం అయిపోతుందంటే ఎక్సట్రా డ్యూటీనా పాడా, ఈ ఆడోళ్ళందరు బస్సెక్కారంటే నువ్వెందుకు మగాడివి మధ్యలో టికెట్ తీసుకునే పనిలేదు అంటూ నన్ను బస్సెక్కనివ్వడంలేదు, ఇక్కడే హోటల్ పడి ఉంటున్నాను. డబ్బులు మంచినీళ్లలా అయిపోతున్నాయంటే నమ్మండి,” తన గోడు చెప్పుకుని బాధపడ్డాడు. 


“ఇది ఇలా కాదుగానీ ఈ సమస్యకు పరిష్కారం వెదకాలి ఏదైనా, ఇలాగైతే మనం బిచ్చమెత్తుకునే పరిస్థితి వస్తుందేమోనని భయంగా ఉంది, ఏదో బస్సు ఫ్రీ ఏమో గానీ మగాళ్ళందరికి కష్టాలొచ్చాయి. అందరు బాధపడుతూ ఆలోచించసాగారు. 


******* ********** ********** **********


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 



 




 









34 views4 comments

4件のコメント


@ramyasree4789

• 1 day ago

Chala bagundi amma

いいね!


sunanda vurimalla

39 minutes ago

చాలా బాగుంది అమ్మడూ కథ 🎉.నీ కలంతో పాటు గళం కూడా బాగుంది

いいね!


Lakshmii Trigulla

3 hours ago

Thank you swapna

いいね!


swapna j

12 hours ago

Katha bagundi adi mee swaramlo inka bagundi, super attayya

いいね!
bottom of page